MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
మరో పునాది
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఎ హెడ్ ఆఫ్ ద స్టోరీ.
ప్రఖ్యాత వీరోజీ స్టూడియో, ఫిల్మ్ నగర్-
"లైట్స్, కెమెరా....యాక్షన్" యంగ్ డైరెక్టర్ విక్రమ్ వర్మ అనగానే ఎనభై ఏళ్ల జి పి ఆర్ తండ్రి పాత్రలో ఆవేశపడుతూ, ఉద్రేకంతో ఊగిపోతూ, కొడుకు మీదకొస్తూ, కొట్టడానికి చెయ్యెత్తి "నీకెన్ని సార్లు చెప్పాన్రా, ఆ అమ్మాయితో సంబంధాలు వద్దని. అయినా.." అంటూ గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
మొదట అందరూ యాక్షన్ అనుకున్నారు, కొన్ని క్షణాల వ్యవధిలో అది నిజమన్న విషయం అర్థమైంది. అందరికన్నా ముందు నిజ జీవితంలోను, సినిమాలోనూ కొడుకునైన నాకు.
నేను వెంటనే పరిగెత్తుకెళ్లి నాన్న తలను ఒళ్ళో పెట్టుకుని గద్గద స్వరంతో "ప్లీజ్, అంబులెన్స్ ను అరెంజ్ చేయండి." గట్టిగా అరిచాను. "అలాగే నవనీత్ గారూ.." అంటూ కొంతమంది బయటకు పరిగెత్తారు. బయట స్టూడియో గోడకి ఆనుకుని ఉన్న ఆంబులెన్స్ హుటాహుటిన లోపలికొచ్చింది. ఇద్దరు కాంపౌండర్స్ మా నాన్నని స్ట్రెచ్చర్ సాయంతో లోపలికి నెట్టారు. నేనూ ఎక్కి ఆయన ఎదురుగా ఉన్న సీట్లో కూచున్నాను.
ఆయన మా నాన్నే అయినా ఆయన్నిఅలా చూస్తుంటే మనసులో సుళ్లు తిరుగుతున్న బాధ కలగడం, కళ్ళు అవిశ్రాంతంగా నీళ్లు కార్చడం జరగలేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అంత అటాచ్ మెంట్ లేదు. దాదాపు అరవైఏళ్ల నట జీవితాన్ని సంపూర్ణం చేసుకున్నారాయన. ఆయన జీవితమంతా సినిమాలు, వేళపాళ లేని షూటింగ్ లు. మా అమ్మకూడా నటే. కొన్నాళ్లు కాపరం చేశాక, నాన్నతో సరిగా కుదరక నా చిన్నతనంలోనే ఆయనతో తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఆర్ధికంగా చూస్తే దేనికీ కొదవలేదుగాని మా మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం అంతగా లేవు. నన్ను బాగా చదివించాడు. నాన్న యావత్ ప్రపంచానికి గొప్ప నటుడే కావచ్చు కాని, నా వరకు నాకు గొప్ప తండ్రి మాత్రం కాదు. అయినా తండ్రేగా ? మనసులో ఓ మూల కొద్దిగా తడి.
నటులకి అభిమానులంటే ప్రాణం. అభిమానులకి నటులంటే చచ్చేంత ఇష్టం. కాని ఇంటిని పట్టించుకోనివ్వని నటన అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయిష్టమే! అదో మాయాప్రపంచం. దానికి తనను తాను అంకితం చేసుకున్న నాన్నంటే చిరాకు, కోపం.
నేను ఆలోచనల్లో ఉండగానే అంబులెన్స్ నగరంలోని హాస్పిటల్స్ లో తలమానికంగా, కార్పోరేట్ జిగేల్తో ధగధగలాడే హాస్పిటల్ ముందాగింది. అప్పటికే విషయం షార్ట్ మెసేజ్ రూపం దాల్చి ప్రపంచమంతా దావానలంలా వ్యాపించడంతో, హాస్పిటల్ దగ్గర చాలామంది జనం పోగయి ఉన్నారు. క్షణాల్లో అక్కడి స్టాఫ్ అంతా అలర్ట్ అయి నాన్నని ఐ.సీ.యూ లోకి చేర్చారు. నాన్న సుదీర్ఘ నట జీవితం కళ్లముందు కదులుతుండగా కన్నీరు పెట్టనివాళ్లు లేరు. ముఖ్యంగా ‘నా ఆఖరి శ్వాస వరకూ నేను నటిస్తూనే ఉంటాను’ అన్న ఆయన మాటలు గుర్తుచేసుకుని మరీ మనసులను బరువు చేసుకుంటున్నారు.
హాస్పిటల్ చైర్మన్ బాలగంగాధర్ స్వయంగా ప్రెస్ కోసం గంట గంటకి నాన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నాడు.
అలా ఒకరోజు భారంగా గడిచాక తెలుగు ప్రజల అభిమాన నటుడు జి పి ఆర్ తుదిశ్వాస విడిచారు, సినీప్రపంచం, ప్రేక్షకప్రపంచం కన్నీరుమున్నీరయ్యాయి.
అరవై ఏళ్ల నుంచి రకరకాల పాత్రలు వేసి, ప్రేక్షకుల్ని పరిపూర్ణంగా మెప్పించి, పైస పైస కూడబెట్టుకుని నగరంలో నాన్న కట్టుకున్న విలాసవంతమైన భవనంలో ఆయన పార్థివదేహాన్ని ప్రజల దర్శనార్థం ఉంచాము. ఎక్కడెక్కడి నుంచో జనం పోటెత్తారు. లైనులో నుంచుని కదులుతూ ప్రీజర్ బాక్స్ లో నాన్నను చూసి గుండెలు బాదుకుంటూ, కళ్ల నీళ్లతో ఆఖరి వీడ్కోలు పలుకుతున్నారు. ఆయన పక్కనే విషణ్ణ వదనంతో కూర్చున్న నన్ను చూసిన వాళ్ల మనసులు ఆర్ద్రమై కన్నీరుగా స్రవించాయి. ముఖ్యంగా కొడుకునైన నాతో నటిస్తున్న సినిమా ఆయన చిట్టచివరి సినిమా అవడం అందరి గుండెల్నీ పిండేస్తోంది. ఆ తర్వాత ఆయన శవాన్ని ఊరేగింపుగా, ఆయన ఎంతో ఇష్టపడి కొనుక్కుని, అభిమానంగా చూసుకునే ఇరవై ఎకరాల ఫార్మ్ హౌస్ కు తరలించి అక్కడ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ లాంఛనాల మధ్య, గంధపు చెక్కలతో దహనం చేశాము. ఛానల్ టీవీలు పోటీ పడుతూ మిగతా కార్యక్రమాలకి తాత్కాలిక విరామం ప్రకటించి ఆయన సినిమాల్లోని విషాద గీతాల నేపథ్యంలో, నాన్న వీరోజీ స్టూడియోలో కుప్పకూలడం, హాస్పిటల్ బెడ్ మీద వేళాడుతున్న గొట్టాలతో అచేతనంగా పడుకుని ఉండడం, ఆయన్ని దహనం చేయడం ఇలా ప్రతి సన్నివేశాన్నీ అత్యంత శ్రద్ధాభక్తులతో జనాల గుండెల్ని పిండేసేలా ప్రసారం చేశారు. మధ్య మధ్య సినీ ప్రముఖులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గద్గద స్వరాలతో పంచుకున్నారు. చలనచిత్రరంగ పుస్తకంలో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది.
వారంరోజులు విషాదసాగరంలో మునిగితేలాక-
"నాకు అక్షరాభ్యాసం, నటనాభ్యాసం చేసిన మా నాన్న మరణాన్ని తట్టుకోవడం నావల్ల కావడం లేదు" అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. నన్ను ఊరడించడం ఎవరివల్లా కాలేదు.
కొంతసేపటికి నన్ను నేను కంట్రోల్ చేసుకుని "నాన్నకు సినిమా అంటే పిచ్చి. ఆయన జీవితాన్ని సినిమాకి, ప్రేక్షకులకు అంకితం చేశాడు. నేను కొడుకుగా ఆయనకు ఏవైనా చెయ్యగలననుకుంటే, అది నాన్నగారి చివరి సినిమాని పూర్తిచేసి విడుదల చెయ్యడమే!" అని ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసి మరుసటిరోజు నుంచి షూటింగ్ మీద కాన్సంట్రేట్ చేశాను.
నెల రోజుల్లో ‘ఆయనకన్నా ఘనుడు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ క్లీన్ సర్టిఫికెట్ పొంది విడుదలకు సిద్ధమైంది.
సినిమా ఇండియాలోను, ఓవర్ సీస్ లోనూ మూడు వేల స్క్రీన్స్ పై విడుదలైంది. నాన్నది గెస్ట్ రోల్ అయినా పాత్రలో ఎప్పట్లా జీవించాడని, నా నటన విరగదీసిందని పాజిటివ్ టాక్ ఊపేస్తోంది. థియేటర్లలోంచి బయటకు వస్తున్న ప్రేక్షకుల ముందు రివ్యూ కోసం మైక్ పెడితే ఒక్కరు కూడా నెగటివ్ మాట్లాడలేదు. పాజిటివ్ వేవ్ ముంచేస్తోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
తండ్రి పోయిన బాధలో ఉన్న నాకు ఈ సినిమా విజయం ఒక ఉపశమనం అనుకున్నారు. అంతేగాక మహానటుడికి ఆయన కొడుకు సమర్పించిన గొప్ప ట్రిబ్యూట్ ఆ సినిమా అనుకుని వేనోళ్ల కొనియాడారు.
***
ఎ టైల్ ఆఫ్ ద స్టోరీ-
వీటన్నింటికీ ముందు కొన్నాళ్ల క్రితం-
"సార్!" నా ఆఫీసు రూం లోకి వచ్చాడు పి.ఏ రాజ్.
ఏవిటన్నట్టుగా చూశాను.
"మీ సినిమాలు వరసగా మూడు ఫ్లాప్ అయ్యాయి. లాస్ట్ మంత్ రిలీజ్ అయింది కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. చాలా క్రిటికల్ సిట్యుయేషన్ లో ఉన్నారు. మీరు కాస్త ఆలోచించాలి. ఇంకొక్క సినిమా ఫ్లాప్ పడిందంటే.." అతను మాట పూర్తి చేయకపోయినా నాకు విషయం అర్థం అయింది.
సినీ ప్రపంచం చాలా చిత్రమైంది. ఇక్కడ సినిమా విజయమే నటుడికి ఊపిరవుతుంది. పేరు ప్రఖ్యాతులని పాదాక్రాంతం చేస్తుంది. ఒక్కసారి ప్రేక్షకుల అభిమానానికి, చుట్టూ చేరే మందిమార్బలానికి, డబ్బుకి, విలాసవంతమైన జీవితానికి, ప్రశంసలకి, పొగడ్తలకి, ఛానళ్లలో, పేపర్లలో తమ గురించి వచ్చే విశేషాలను చూడ్డానికి, చదవడానికి అలవాటుపడితే క్షణం కూడా ఆ అనుభవాన్ని, అనుభూతిని వదులుకోబుద్ధి కాదు. దానికోసం ఏవైనా చేయాలనిపిస్తుంది. అందుకే చాలామంది ఫేడౌట్ అయిన యాక్టర్స్ ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక తాగుడికి బానిసలై తమ జీవితాలను అంతం చేసుకుంటారు.
దేదిప్యమానమైన సినీ వెలుగును పుస్తకల్లో చదివి, నటుల జీవితాల్లోని రాజసాన్ని చూసి ఎంతోమంది నటులవ్వాలని ఫిల్మ్ నగర్ కి వచ్చి శలభాల్లా మాడిపోతారు. నాలాంటి వాళ్లకి ఆ బాధలేం లేవు. నోట్లో సిల్వర్ స్పూన్ తో పుట్టాను. అయితే అది ఎంట్రీ వరకు ఓకే! తదుపరి జీవితం కేవలం నటన, అదృష్టం మీద ఆధారపడుతుంది. ఫ్లాపులు తగిలితే స్టార్ కొడుకులకైనా అడ్రస్ గల్లంతవుతుంది. ఎంతోమంది తుఫాన్ గాలికి అస్తవ్యస్తమైన ఆకుల్లా కొట్టుకుపోయారు. కేవలం కొంతమంది మాత్రం వారసత్వాన్ని నిలబెట్టుకోగలిగారు.
నాకు మొదటి నుంచి సినిమా వాతావరణం అంటే పడదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ప్రపంచానికి దూరంగా ఉండేవాణ్ణి, ఫారెన్లో ఎమ్ బి ఏ పూర్తి చేసి అక్కడే సెటిలై బిజినెస్ చేద్దామనుకున్నాను. ఒకసారి నేను ఇక్కడకి వచ్చినప్పుడు, నాన్నను కలవడానికొచ్చిన మెగా పొడ్యూసర్ ఆరడుగుల పొడవు, చిదిమితే పాలుగారేలా ఉన్న శరీరం, తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న ముఖవర్ఛస్సు చూసి తెగ సంతోష పడిపోతూ నా ముందు సినిమా ఆఫర్ పెట్టాడు. మొదట సున్నితంగా తిరస్కరించాను. కాని, ఆ నిర్మాత ‘తన దగ్గర ఉన్న కథ ఓ అద్భుతమని హీరో క్యారెక్టర్ కి సరిపడే కుర్రాడి కోసం చాన్నాళ్ల నుంచి చూస్తున్నానని, ఇప్పుడు యాదృచ్ఛికంగా నేను పాత్రకి అతికినట్టుగా కుదిరానని, ఏదో సరదాగా ఆడుతూ పాడుతూ తన ఒక్క సినిమా చేసి పెట్టమ’ని ఆభ్యర్థించాడు. నాన్నకి కూడా నన్ను హీరోగా, తన నట వారసుడిగా పరిచయం చెయ్యాలని ఎప్పట్నుంచో కోరిక, ఇప్పటిదాకా ఎన్నోసార్లు ఆ ప్రస్తావన నా ముందు పెట్టాడు. కాని, నేను ఆసక్తి కనబరచక తిరస్కరిస్తుండడంతో ఊరక ఉండిపోయాడు. ఇప్పుడు నిర్మాత అదే విషయం మళ్ళీ కదపడడంతో ఆయనలో, కొడుకులోని నటుణ్ని చూడాలన్న ఉత్సాహం ఉరకలేసింది. నాన్న కూడా నన్ను ఒప్పుకోమని కోరాడు. ఎందుకోగాని అన్యమనస్కంగా ఒప్పుకున్నట్టుగా తలూపాను.
షూటింగ్ స్టార్ట్ అయింది. పబ్లిసిటీ స్టంట్ మొదలైంది. మొదటి సినిమా అయినా, ‘జి పి ఆర్ నట వారసుడిగా నేను సినిమాలో ఎలా నటిస్తానో’ అన్న కుతూహలంతో నా మీద ప్రేక్షకులు భారీగా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సినిమా విడుదలై కనక వర్షం కురిపించింది. నేను ఎక్కడకి వెళ్లినా అందరూ నాకు బ్రహ్మరథం పట్టడం, పెద్ద పెద్ద వ్యాపారస్తులు సైతం నా పక్కన నుంచోవాలని ఉవ్విళ్లూరడం, టీనేజ్ అమ్మాయిల నుంచి ఆంటీల దాకా నా కనుసన్నల్లో పడాలని తాపత్రయపడడం, అభిమానులు తమ వెర్రి అభిమానాన్ని చాటుకోడానికి వివిధ ప్రయత్నాలు చేయడం, నా కోసం ప్రాణం సైతం ఇవ్వడానికి వెనకాడకపోవడం, ఏ పేపర్లో, న్యూస్ లో, ఛానల్లో చూసినా నా గురించే వార్తలు రావడం, సోషల్ మీడియా అంతా నా డైలాగులతో, సినీ విశేషాలతో హోరెత్తిపోవడం, రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాల్లో ఒక్కసారి పర్యటించమని రిక్వెస్ట్ చేయడం వీటన్నిటితో నా కళ్లకు మాయ పొరలు కమ్మేసాయి. ఎంత గొప్ప బిజినెస్ టైకూన్ అయినా ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప పేరు సాధించలేడు. ఇది నాకు మాత్రమే దక్కిన వరం. అనవసరంగా దీన్ని వదులుకోబోయాను. నా మనసును అందమైన సినీవల అల్లుకుంది. కళ్లకు మత్తు ఆవహించింది.
నేను నటించిన నాలుగు సినిమాలు వరస హిట్లు. నాకు ఇలలో స్వర్గవిహారం చేస్తున్నట్టుంది.
వయసు పైబడి, జవసత్వాలుడిగి, లివర్ కి సంబంధించిన వ్యాధితో నాన్న మంచం పట్టాడు. ఆయనకి ఇంకా నటించాలనుంది. నటనపై వ్యామోహం తీరలేదు. కాని ‘ఆయన శారీరక స్థితి నటించడానికి అనుకూలంగా లేదని, ఆ ఆలోచన రిస్క్ తో కూడుకున్నద’ని చెప్పాడు ఫ్యామిలీ డాక్టర్. అందుచేత నాన్న ఇంటికి, మంచానికి అంకితమయ్యాడు.
అలా కొన్నాళ్లు గడిచాయి.
పి.ఏ రాజు అన్న మాటలు నా మనసులో సుడిగుండాలు రేపాయి. ఇంకొక్క సినిమా పోయిందంటే నేను అగాధంలో పడిపోయినట్టే! ఏం చేయాలి? మళ్లీ నేను నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి? ఎంత గొప్ప దర్శకుడితో, ఎంత మంచి కథతో సినిమా తీసినా ఆడుతుందన్న గ్యారంటీ లేదు. ప్రేక్షకులు దేన్ని ఇష్ట పడతారో, దేన్ని ఛీ కొడతారో తెలియదు. ఈసారి విడుదల అవబోయే సినిమా మాత్రం కచ్చితంగా ఆడాలి, ఆడి తీరాలి. లేకపోతే నాకు భవిష్యత్ ఉండదు. యాక్టర్ గా భూస్థాపితం అయిపోతాను. మళ్లీ పైకి రావాలంటే ఏం చేయాలి?
నేను నాన్న గదిలోకెళ్లాను. కార్పోరేట్ హాస్పిటల్లో ఐ.సీ.యూలోని బెడ్ దగ్గర ఎలాంటి పరికరాలు ఉంటాయో అవన్నీ అక్కడ ఉన్నాయి. ఆయన అవసరాల కోసం నియమించబడ్డ ఒక యంగ్ డాక్టర్, సిస్టర్ నాన్న మంచానికి కొద్ది దూరంలో కూర్చోనున్నారు.. నన్ను చూసి ఆదరబాదరగా లేచి నుంచున్నారు. అప్పటికప్పుడు అవసరం వచ్చి పిలిస్తే పెద్ద డాక్టర్లు ఆఘమేఘాల మీద వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి అనువుగా అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంది అక్కడి వాతావరణం. చుట్టూ బౌన్సర్లు, వందలాదిమందితో తిరిగిన నా తండ్రి అలా మంచం మీద ఒంటరిగా మగత నిద్రలో ఉన్నాడు. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేకనే ఆరోగ్యం, శరీరం సహకరించకపోయినా మెలకువ వచ్చినప్పుడల్లా సినిమాలో నటిస్తానని మారాం చేస్తుంటాడు.
రెండు మూడు రోజుల తీవ్ర మానసిక మథనం అనంతరం నా మదిలో ఒక ఐడియా తళుక్కుమంది. ఈసారి తీయబోయే సినిమాలో నాన్నా, నేనూ నటించాలి. చాలాకాలంగా నాన్నని చూడని ప్రేక్షకులు ఆకలిగొన్న ప్రేక్షకుల్లా ఆవురావురుమంటూ థియేటర్ లకు పరుగులెత్తి వస్తారు. ఆ సినిమాకి కథాబలం కుదిరి నా నటన కూడా ప్లస్ అయితే మళ్లీ ఫాంలోకి వచ్చేయొచ్చు. ముందు నాకో హిట్ పడితే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ‘నా కరీర్ కోసం మంచం పట్టిన తండ్రిని ఉపయోగించుకోవడం ఎంతవరకు సబబబు’ అన్న ఆలోచన అప్పుడప్పుడు మనసును దొలిచేస్తోంది. నటుడిగా నిలదొక్కుకోవాలన్న ఆశ, ఆకాంక్ష దాన్ని బలంగా అణచివేస్తోంది. కొన్ని రోజుల తీవ్ర మానసిక సంఘర్షణ అనంతరం స్వార్థమే జయించింది.
నా నిర్ణయం విన్న ఫ్యామిలీ డాక్టర్ ఆందోళనగా "వద్దు నవనీత్, అది చాలా హై రిస్క్. ఆయన చనిపోయే ప్రమాదం నూటికి నూరు శాతం ఉంది" అని వారించాడు.
"ఆయన నటించాలి అంకుల్. ఆయన స్థాయి మీకు తెలియంది కాదు. ఇలా మంచాన పడి చనిపోవడం కరెక్ట్ కాదు. ఆఖరి శ్వాస వరకు నటించాలన్నది ఆయన కోరిక. అది నెరవేరేలా చూడడం కొడుగ్గా నా బాధ్యత! మీరు మందులే వేస్తారో, స్టెరాయిడ్ ఇంజక్షన్లే చేస్తారో మీ ఇష్టం" ఖరాఖండిగా అన్నాను.
ఇద్దరం కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించడానికి స్టార్ డైరెక్టర్ ఓ కే అన్నాడు. మరుసటి రోజు నుంచి సీనియర్ రైటర్స్ తో కథల కసరత్తు మొదలైంది. మళ్లీ నా హవా ఊపందుకుంది. మీడియాలో హడావుడి మొదలైంది.
‘ఆయనకన్నా ఘనుడు’ సినిమా షూటింగ్ లో నాన్న చాలా హింస పడ్డాడు. ఆయన బాధ వర్ణనాతీతం. అదేం బయటి ప్రపంచానికి తెలీదు. చివరికి స్టూడియోలోనే కూలిపోయాడు. జి పి ఆర్ గొప్ప నటుడని ఆయన కోరిక ప్రకారమే ఆఖరి శ్వాస వరకు నటించడం ఓ వరమని, అది కారణ జన్ములకే సాధ్యమని ఛానల్ టీ వీల్లో చర్చలు జరుగుతున్నాయి.
మరణాన్ని వారసత్వ మనుగడకి పునాదిగా వాడుకునే రెండు పవర్ ఫుల్ రంగాలు రాజకీయం, సినిమా! నాన్న జీవితం నా కరీర్ కి మరో పునాది అయింది. అది నాకు, డాక్టర్ కి, మరి కొందరు దగ్గరి వాళ్లకి మాత్రమే తెలిసిన నగ్నసత్యం. తెరవెనుక ఇలాంటి గాధలు ఎన్నో ఉంటాయి. తెర ముందుండే ప్రేక్షకుడు మాత్రం నటుల నటనకి ఫిదా అయిపోతాడు. నీరాజనాలు పడతాడు. తెర వెనక తారలు, తెర ముందు ప్రేక్షకులు ఇద్దరూ వాళ్లదైన మత్తు ప్రపంచంలో మునిగిపోతుంటారు.
*****