MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మా వాణి ...
చిత్రమే.
చైత్రం చివరివరకల్లా రావలిసిన పత్రిక సాంకేతికాంతరాయ కారణాల వల్ల వైశాఖానికి వస్తూందంటే, సంపాదకులుగా కాస్త చింతిస్తున్నాం. కానీ... దానివల్లే, అభిమానంగా చదువుతున్న సాహితీమితృల ఆదరణ, పత్రిక కోసం ఎదురుచూస్తున్న వారందరి ఆసక్తీ, అభిమానం టపాల రూపంలో ముంచెత్తి, అమితమైన ఆనందాన్ని కలుగచేసింది. అప్పుడప్పుడూ సమస్యా మంచిదేనేమో!
ప్రతీ సంచికకీ పెరుగుతున్న ఆదరణని గూగులమ్మ గణాంకాలు చెబుతూన్నప్పటికీ, ప్రత్యక్షంగా పలుకరించిన సాహితీమితృల వల్ల కలిగే ఆనందానికి సాటి మరోటి లేదు!
వేదిక, మైకు, ఎదురుగా కరతాళ ధ్వనులు...ఇలాంటి ఏ హంగులూ లేని సాహితీ పత్రికలకి, ఆదరించే సాహితీ మితృలే కొండంత ప్రోత్సాహం.
మీ ఆదరానికి, అభిమానానికి సాదరాభివందనాలు. అలాగే, ఆలస్యానికి క్షంతవ్యులము.
ఈ వ్యవధిలో భారతంలో జరిగిన పలు సంఘటనలని సంపాదక బృందం తీవ్రంగా
గర్హిస్తూ, ఈ సంచికని కీచకుల చేతిలో అసువులు బాసిన ఎందరో అమ్మాయిల స్మృతికి అంకితమిస్తుంది.
యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతా!
అందరికీ తెలిసినదే. స్త్రీలు పూజించబడే చోటే దేవతలు కొలువుంటారని. దేవతలు కొలువున్న చోటే, పూజించబడే చోటే, అభ శుభం తెలీని ఓ చిన్నారి కి రక్షణ కలిపించలేని దుర్భర పరిస్థితులు భారత దేశ శిక్షాస్మృతిలో మార్పులు రావలిసిన సమయం ఆసన్నమయిందని స్పష్టంగా తెలియజేసాయి. మానవత్వాన్ని మంటగలిపే కీచకులకి మరణశిక్షే సరైనదని మంత్రివర్గం ఆమోదముద్ర వేయటం ద్వారా ఈ మార్పు దిశగా ఒక అడుగు వేసినట్టే అని సంపాదక బృందం భావిస్తుంది.
కీచక దుశ్చర్యలని ఖండించవలిసిన బాధ్యత ప్రతీ వ్యవస్థ, సంస్థ, పత్రిక మీదుందని నమ్ముతున్నాము..
***
ఇక, ఈసంచికలో ఎప్పటివలెనే విభిన్న రచనలతో పాటుగా,
ప్రముఖ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత మునిపల్లె రాజు గారికి ఆత్మీయ నివాళిగా 'అలనాటి మధురాల్లో' వారి కథని అందిస్తున్నాము.
అలాగే, ప్రముఖ వాగ్గేయకారుడు, స్వరకర్త, రచయిత, తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరు శతాధికవత్సర సంగీత సాహితీ దురంధరుడు బాలాంత్రపు రజనీ కాంతరావు గారిని సంపాదకవర్గం స్మరిస్తుంది.
భగవంతుని సన్నిధిలో వారి ఆత్మకి ప్రశాంతత చేకూరాలని కోరుకుందాము.
***
మధురవాణి నిర్వాహక బృందం