MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
తెలుగు సాహిత్యం - మనోవైజ్ఞానిక విమర్శ
డా. ఒభిన్ని శ్రీహరి
సాహిత్యం సమాజానికి దర్పణం వంటిది. “హితేన సహితం సాహిత్యం” అన్నారు మన లాక్షణికులు. సమాజ హితాన్ని కోరుకొనే సాహిత్యం మనిషి వక్తిత్వాన్ని ఆమూలాగ్రం పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. మనిషి మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకొని, పాత్రలను సజీవంగా తీర్చిదిద్దడంలో తెలుగు రచయితలు ఏ భాషా సాహిత్యంలోని రచయితలతోనూ తీసిపోరు. తెలుగు రచయితల్లో కొంతమంది ఫ్రాయిడ్ వంటి మనోవిశ్లేషణా సిద్ధాంతాలను చదవనప్పటికీ , మనిషి మనస్తత్వాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సమయంలో తెలుగు సాహిత్యంలో కవులందరూ వారి రచనల్లో అవసరాన్ని బట్టి పాత్రల అంతరంగ పొరల్లోకి వెళ్ళి పరిశీలించారు. ఈ రకమైన అధ్యయనాన్ని మనోవైజ్ఞానిక విమర్శ అంటారు. మనోవైజ్ఞానిక శాస్త్రం మనిషి ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.
మానవునికి సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకే విధంగా ప్రతిస్పందించరు. కొంతమంది తమ కష్టాలను తట్టుకొని ధీరులుగా తయారైతే , మరికొంత మంది కష్టాలను తట్టుకోలేక మతిస్థిమితం లేనివారుగా మారిపోతారు. ఇలా ఎందుకు జరుగుతున్నది అన్న విషయాలను మనం తెలుసుకోవాలంటే మనిషి అంతరంగ పోరాల్లోకి వెళ్ళి అన్వేషించవలసిన అవసరం ఉంది. ఆ విధమైన మనిషి ప్రవర్తనను వెదకి పట్టుకొని మనిషిని, మనిషిగా చేసే కృషిలో మనోవైజ్ఞానిక శాస్త్రం చేసే పని మాటలలో చెప్పలేనిది. ఈ క్రమంలో సిగ్న౦డ్ ఫ్రాయిడ్ ఆల్ఫ్రెడ్ అడ్లర్, కార్ల్ గుస్టాన్ యూంగ్ వంటి ప్రసిద్ధ మనోవైజ్ఞానికి శాస్త్రవేత్తలు ఈ రంగంలో చేసిన కృషి అపారమైనది. ముఖ్యంగా ఫ్రాయిడ్ మనోవైజ్ఞానిక రంగంలో తనదైన ముద్ర వేశాడు.
తెలుగు సాహిత్యంలో ఈ రకమైన అధ్యయనం అనేది నాటి నన్నయ కాల౦లోని సాహిత్యం నుండి నేడు ఆధునిక రచయితల సాహిత్యం వరకు వారి రచనల్లో అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంది. అయితే ప్రాచీన సాహిత్యంలో అది ఒక శాస్త్రంగా లేకపోయినా మన కవులు ఆయా పాత్రల అంతరంగ ప్రవృత్తిని చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. ఉదాహరణకు మహాకవి కవిబ్రహ్మ తిక్కన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం తృతీయ శ్వాసంలో ధర్మ రాజు బిష్ముడితో మనిషి అంతరంగ ప్రవృత్తి గురించి చెపుతూ....
సౌమ్యుల సౌమ్యుల భంగి న
సౌమ్యులు సౌమ్యుల విధమున జనవర! చిత్తా
గమ్యత దోతురు వారిని
సౌమ్యజ్నిశ్చయత గాంచు చందము సెపుమా.
ధర్మరాజు మంచివారు, చెడ్డవారిగాను చెడ్డవారు మంచివారిగాను నాకు కనిపిస్తున్నారు. మంచి వారిని నాకు గుర్తించడం సాధ్యంకావడంలేదని బిష్ముడితో అంటాడు. తిక్కన గారి ఈ మాటలు ఫ్రాయిడ్ సైకోఎనాలసిస్ సిద్ధాంతంతో చెప్పబడినదే. ఫ్రాయిడ్ మనిషికి చేతన అచేతన మనస్తత్వం ఉంటుందని చెపుతూ మనిషి మనస్తత్వాన్ని ఒక ఐస్ ముక్కతో పోలుస్తాడు. అంటే ఒక ఐస్ ముక్కను నీటిలో వేసినట్లయితే మూడొంతులు నీటిలో మునిగి ఉంటుంది, ఒక వంతు పైకి కనిపిస్తుంది, అదే మనిషి పైకి కనిపించే మనస్తత్వం అంటాడు ఫ్రాయిడ్. అంటే మనిషి మాటలు, ప్రవర్తన ద్వారా మనం చాలా తక్కువ తెలుసుకొంటామని అసలైన మనిషి అంతర్ముఖంగా ఉండి పైకి కనపడడని ఫ్రాయిడ్ చెప్పాడు.
ఇదే విషయాన్ని తిక్కన 13 వ శతాబ్ధంలో చెప్పడం గొప్ప విషయం. ఈ విధంగా తిక్కన భారతంలో పాత్రల అంతరంగ ప్రవృత్తిని చాలా సందర్భాలలో మనిషి మన కళ్ళముందు ఉంచాడు. ఇదే విధంగా నన్నయ ఎఱ్ఱన, శ్రీనాధుడు వంటి మహా కవులు రచనల్లో పాత్రల అంతరంగ విశ్లేషణ అన్నది వారి రచనల్లో చాలా సందర్భాలలో స౦దర్భోచితంగా కనిపిస్తుంది.
ప్రాచీన సాహిత్యంలో జన వ్యహారంలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన ప్రక్రియ శతక సాహిత్యం. శతక పద్యాలలో రచయితలు మనిషి మనస్తత్వాన్ని చాలా చక్కగా చిత్రించడం జరిగింది. వేమన పద్యాలలో ఈ విషయం ఎక్కువగా కాపాడుతున్నది. ఉదాహరణకు వేమన ఒక పద్య౦లో ఆత్మన్యూనతా భావం కల మూర్ఖుడి గురించి చెపుతూ....
తన్ను జూచి యెరులు తగమెచ్చవలెనని
సొమ్ము లరవు దెచ్చి నెమ్మి మీర
యొరుల కొరకు తానే యుబ్బును మూర్ఖుడు
విశ్వదాభిరామ వినుర వేమ.
ఈ పద్యంలో తనను ఇతరులు మెచ్చుకోవాలని సొమ్ములు ఎరువు తెచ్చుకొని మూర్ఖుడు తనను తాను అలంకరించుకొంటాడు, తననెవ్వరు పట్టించుకోవడం లేదని తెలిసి తనకు తానే మురిసిపోతాడు. అది ఆత్మనున్యతాభావం దీనిని దగ్గరకు రానియకూడదు. దీనిని వేమన చక్కగా తన పద్యంలో చెప్పాడు. అడ్లర్ తన సిద్ధాంతంలో ఆత్మన్యూనత భావం అనేది ఎంత ప్రమాదకరమైన విషయమో వివరించారు . అడ్లర్ చెప్పక ముందే మన వేమన గారు దీని గురించి చెప్పారు. ఇక్కడ వేమన గారు inferiority కాంప్లెక్స్ అనే పేరుతో చెప్పకపోయిన ఆత్మన్యూనతా భావం కలవాడు ఎలా ఉంటాడో చెప్పాడు. ఆత్మన్యూనత కలవాడి అంతరంగాని ఈ పద్యం ద్వారా వేమన మన ముందు ఆవిష్కరించాడు.
ఆధునిక కాలంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొదలుకొని నేటి రచయితల వరకు పాత్రల మనసులోని అంతరంగాన్ని వారివారి రచనల్లో చిత్రించారు. వీరేలింగం గారి తర్వాత ఆధునిక యుగకర్తగా చెపుతున్న గురజాడ అప్పారావు గారు పాత్ర మనసులోని అంతరంగాలల్లోకి వెళ్ళి వారిమనస్తత్వాన్ని బయట ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు. గురజాడ వారు ఒక సందర్భంలో “ చిన్నతనంలోనే బొమ్మలాట నేర్చి ఉండడం చేత లోకమనే రంగంలో చిత్రకోటి రీతులు ఆనాడే మనుషులనే పాత్రల సొగసు కనిపెట్టడం నాకలవటయ్యింది” అనడంతో గురజాడ పాత్రల మనః ప్రవృత్తులను ఆయన రచనల్లో చర్చించడం జరిగింది.
గురజాడ తరువాత తెలుగు సాహిత్యలో తనదైన ముద్రవేసిన రచయిత విశ్వనాద సత్యనారాయణ. ఆయన మనిషి మనస్తత్వం గురించి చెపుతూ “నేను మానవ ప్రవృత్తిని ఆమూలాగ్రం పరిశీలించి తెలుసుకొన్నాను. నాకు గ్రంధ రచన అంటే ఏమిటో తెలుసు. నేను ఏది వ్రాసినా తెలిసి రాస్తాను” అన్నారు. చెప్పినట్లుగానే విశ్వనాధ వారి రచనల్లో పాత్రల మనస్తత్వాన్ని అద్భుతంగా చిత్రించడం జరిగింది. విశ్వనాధ వారి రచనల్లో ఏకవీర, తెరచినరాజు బద్ధనా సేనాని వంటి నవలల్లో మనిషి అంతరంగ పోరాల్లోకి వెళ్ళి వారి ఆలోచనలను బయటకు తీసుకువచ్చాడు.
ఉదాహరణకు ఏకవీర నవలలో కధనాయకుడిలో Id ego super ego ల మధ్య సంఘర్షణ కనబడుతుంది. ఈ సంఘర్షనతో అతడు ఈ విధంగా ఇబ్బంది పడ్డాడో తెలుస్తుంది. అలాగే ఏకవీరకు ప్రియుడు జ్ఞాపకం వచ్చినప్పుడు తెల్లబట్టలు ధరించడం నేనుక లిబిడో అనలాగ్ ఉందని మనస్తత్వ శాస్రం ప్రకారం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏకవీరలో guilty consciousness అనేడి కనబడుతుంది. విశ్వనాధ ఇంత చక్కగా పాత్రల మనస్తత్వ విశ్లేషణను బట్టి సైకో ఎనాలసిస్ గురించి అవగాహన చేసుకొన్నారేమో అనిపిస్తుంది. అయితే ఆయన ఎక్కడ ఆ విషయం ప్రస్తావించలేదు.
మనిషి మనస్తత్వాన్ని చక్కగా కళ్ళముందు చూపించిన రచయిత చలం. చైతన్య స్రవంతి విధానం తెలుగులోకి రాకముందే ఆయన తన సాహిత్యంలో చైతన్య స్రవంతి పద్ధతిని వాడడం జరిగింది. చలం నాయుడు పిల్ల, హంపి కన్యలు వంటి కథలో పాత్ర మనసుల్లోని అలజడలను ఆవిష్కరించాడు. అలాగే చలం దైవమిచ్చిన భార్య నవలలో కథా నాయకుడు రథాకృష్ణ inferiority complex నుంచి బయట పడేందుకు అతడు చేసిన masculine protest ని చలం ఈ నవలలో చూపించాడు. ఆతర్వాత అడవి బాపిరాజు తుఫాను, కోనంగి వంటి తన నవలల్లో పాత్రల అంతరంగాలను తెరచి చూడడం జరిగింది.
మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని చదివి ఫ్రాయిడ్ ను అర్థం చేసుకొని కొన్ని ఆధుతమైన రచనలు చేసిన రచయితలు ఉన్నారు వారు శ్రీశ్రీ, బుచ్చిబాబు, గోపిచంద్, రాచకొండ విశ్వనాధ శాస్త్రి మొదలైనవారు. శ్రీశ్రీ కోనేటిరావు కథలు చైతన్యస్రవంతి విధానాన్ని తెలుగువారికి పరిచయం చేశాయి. శ్రీశ్రీ ఒసేయ్ తువాలందుకో అశ్వమేధయాగం వంటి కధల్లో మనిషి మనస్తత్వంలో చీకటి కోణాన్ని ఆవిష్కరించాడు.
ఫ్రాయిడ్ సైకోఎనాలసిస్ సిద్ధాంతాన్ని బాగా అవగాహన చేసుకొన్న వాడు బుచ్చిబాబు. ఈయన అంతరంగంలోఅణచవేయబడిన శృంగార భావాలున్న పాత్రలేన్నో సృష్టించి కధలురాశాడు. దీనికి నన్ను గురించి కధవ్రాయవు, పొగలేని నిప్పు వంటి కధలను ఉదాహరణగా చెప్పవచ్చు. మనిషి అంతరంగంలో చెలరేగే సంఘర్షణకు దానివలన చోటు చేసుకొనే ego anxiety ని బుచ్చిబాబు తన కథల్లో చూపించాడు.
అదేవిధంగా బుచ్చిబాబు తెలుగు సాహిత్యంలో పాఠకుడు మరచిపోలేని “చివరకు మిగిలేది” అన్న అద్భుతమైన రచన చేశాడు. Mother fixion గురైన వక్తి ఏ విధంగా జీవితంలో సంఘర్షణ పడతాడో బుచ్చిబాబు వివరించాడు. కోమలి లాంటి స్త్రీ వల్ల దయానిధిలో తొలగిపోని mother fixion అమృతం వలన తొలగిపోతుంది. దయానిధి కోమలిని గొంతు పిసికి చంపాలనుకోవడం ఆయనలోని idipus complex ప్రభావమే. ఈ నవలలో చివరకు రచయిత దయానిధిలో mother fixion తొలగి పోవడంతో పాటు idpus complex కూడా తొలగిపోయి సాదారణ మనిషిగా కనిపిస్తాడు.
తెలుగు నవలా సాహిత్యంలో మనోవైజ్ఞానిక దృక్పథంతో మరో అద్భుతమైన రచన చేసిన వాడు త్రిపురనేని గోపిచంద్. గోపిచంద్ పేరు చెపితే ఆయన రచించిన “అసమర్ధుని జీవిత యాత్ర” రచన గుర్తుకు వస్తుంది. నవలలో సీతారామారావు ఆత్మన్యూనతా భ్రాంతితో “న్యూరోసిస్”కు గురై తనలోని విరుద్ధ ప్రవృత్తులతో పొరాడి శ్మశానంలో చివరకు తనను తాను చంపుకొవడం హృదయ విదారకంగా ఉంటుంది,
ఈ నవలలో సీతారామారావు ఆత్మన్యూనత నుండి బయటపడానికి మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన compensation activity, masculine protest అనేవి చేయడు. ఈ సమయంలో గోపిచంద్ సీతారామారావులో చెలరేగే అలజడులను కళ్ళకు కట్టినట్లు వివరించాడు. తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తనలో తాను తీవ్ర సంఘర్షనకు గురి అవుతాడు. ఒక వ్యక్తిగా సమాజంలో ఎవరితోనూ కలవాడు. ఈ నవలలో inferiority complex అనేది మనిషిని ఏ స్థాయి వరకూ చేర్చుతుందో వివరించాడు
మనోవైజ్ఞానిక నవలల్లో అత్యంత ప్రాచుర్యం కలిగిన మరొక నవల రవి శాస్త్రిగారి అల్ప జీవి. ఈ నవలలో కవి ఆత్మన్యూనతా భావంతో బాధపడే సుబ్బయ పాత్రను అద్భుతంగా చూపించాడు. సుబ్బయ్య ప్రతిదానికి బయపడుతూ, పెళ్ళానికి బావమరిదికి కూడా బయపడుతుంటాడు. చివరికి సుబయ్య తనలోని ఆత్మన్యూనతను ఆత్మాధిక్యతగా మార్చుకోవడానికి కావలసిన దానిని compensation activation ద్వారా సాధిస్తాడు. శాస్త్రి గారు సుబ్బయ్య పాత్రను నవలలో అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇంకా కొడవటిగంటి కుటుంబరావుగారు మనోవైజ్ఞానిక దృక్పథంతో అమాయకురాలు, ఫోర్త్ డైమెన్షన్ వంటి కధలు రాశారు. తెలుగు కధకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన పాలగుమ్మి పద్మరాజుగారు పడవ ప్రయాణం వాసనలేని పువ్వు వంటి కధాలు రాశారు. నవీన్ చైతన్య స్రవంతి పద్ధతిలో అంపశయ్య అనే గొప్ప నవల రాశారు. అలాగే తిలక్, ఆర్.ఎస్ సుదర్శన్, వినుకొండ నాగరాజు, శశీభట్ల వేణుగోపాల్, మాదిరాజు రామలింగేశ్వరరావు మొదలైన వారు మనోవైజ్ఞానిక దృక్పథ౦తో అద్భుతమైన నవలలు రాశారు. నేటి కాలంలో మాదిరాజు రామలింగేశ్వరరావు గారు బొమ్మా-బొరుసు, అనుభవాలకు ఆవలి ఒడ్డున, శృతి చేసిన తీగలు మొదలైన నవలల్లో పాత్రల అంతరంగ విశ్లేషణ చక్కగా చేశారు. ఈయన మనస్తత్వ సిద్ధాంతాను ఆకలిపుచేసుకోని ఒక మానసిక శాస్త్రవేత్త ఈ నవలలు రసారేమో అనిపిస్తుంది. అంత చక్కని పాత్రల అంతరంగ విశ్లేషణ మాదిరాజు వారి నవలల్లో కనిపిస్తుంది.
మనోవైజ్ఞానిక దృక్పథంతో తెలుగు నవల సాహిత్యాన్ని విశ్లేషిస్తూ కోడూరి శ్రీరామ మూర్తిగారు “తెలుగు నవల సాహిత్యంలో మనోవిశ్లేషణ”, డా. కామేశ్వరి “తెలుగు నవల మనోవిశ్లేషణ”, కాత్యాయనీ విద్మహే “చివరకు మిగిలేది” మొదలైనవారు ఉత్తమ మనోవైజ్ఞానిక పరిశోధన రచనలు చేశారు. ఇవి మనోవైజ్ఞానిక రంగంలో పరోశోధన చేసే పరిశోధకులకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. అలాగే ఆర్.ఎస్ సుదర్శనం నవీన్ డి.రామలింగం వంటివారు మనోవైజ్ఞానిక పరమైన గొప్ప వ్యాసాలు రాశారు.
చివరగా మనోవైజ్ఞానిక దృక్పథంతో ఒకరచనను కానీ, ఒక రచయితను కానీ విశ్లేషించడం తెలుగులో తక్కువగానే వచ్చిందని చెప్పవచ్చు. అయితే అధునిక మనస్తత్వ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉండడం ఒక కారణం కావచ్చు. ఏది ఏమైనా మనోవైజ్ఞానిక దృక్పథంతో విశ్లేషించడానికి అవకాశమున్న కధ, నవల వంటి సృజనాత్మక పక్రియలను ఆ విధంగా పరిశీలించినప్పుడు అద్భుతమైన రచనలు వస్తాయి.
సంప్రదింపు గ్రంథాలు:
1.శ్రీరామమూర్తి కోడూరి: తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ: 1995 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్: హైదరబాద్.
2.వెంకటేశ్వర రెడ్డి అన్నపరెడ్డి: సిగ్మండ్ ఫ్రాయిడ్:1985: పల్లవి పబ్లిషింగ్ హౌస్: హైదరబాద్.
3.వెంకట సుబయ్య, వల్లంపాటి, నవలా శిల్పం:1989 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్. .
4. తిక్కన, కవిత్రయ మహా భారతం(ఉద్యోగ పర్వం):2006 తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి.
5.Freud S: A General introduction to Psycho Analysis:1967: Washington Square press: Newark.
డా. ఒభిన్ని శ్రీహరి
డా. ఒభిన్ని శ్రీహరి. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నూజివీడులో తెలుగు అధ్యాపకుడిగా మరియు NSS COORDINATOR గా పనిచేస్తున్నారు.
గోదావరి తీరం రాజమండ్రి దగ్గర తాళ్ళూరు అనే పల్లెటూరుకి చెందినవారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో M.A, M.Phil. చేశారు. తర్వాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో Ph.D. చేశారు.
35 పైగా జాతీయ సదస్సులలో, 10 పైగా అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణ చేశారు. 10 పైగా వీరి వ్యాసాలు అనేక సదస్సు సంచికలలో, సాహిత్య పత్రికల్లో వచ్చాయి.