top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సత్యాన్వేషణ-7

. బానిసలమండీ, బానిసలం!  

సత్యం మందపాటి

నేను దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం భారతదేశంలో నివసించేటప్పటినించీ నన్ను వెంటాడుతున్న విషయం ఒకటున్నది. ఆరోజుల్లో తెలుగు ఇంగ్లీషు పుస్తకాల్లోనూ వార్తాపత్రికల్లోనూ చదివినవీ, ఇండియాలో చూసిన కొన్ని సంఘటనలూ నన్ను కలత పెట్టేవి. కొన్ని శతాబ్దాలుగా అప్పటినించీ ఇప్పటిదాకా, తెల్లవారు నల్లవారిని బానిసలుగా చేసుకుని వారిని హింసించిన సంఘటనలూ, మనదేశంలోనే అంతకు ముందు రోజుల్లో భూస్వాములూ, ఇతర అగ్రకులాలవారూ హరిజనులని బానిసలుగా చూసి వెలివేసిన సంఘటనలూ కలవరపెట్టేవి.  

ఒక మనిషి తన సాటి మనిషిని బానిసలా చేసుకుని, వారిని గానుగ ఎద్దుల్లా తయారు చేసి, వెట్టి చాకిరి చేయిస్తూ వారి జీవితాలని సర్వనాశనం చేయటంలో వాళ్ళ ఉద్దేశ్యం ఏమైవుంటుంది అని. వాళ్ళలో మానవత్వం ఏమయిందీ అని. అసలు అలాటి మనస్తత్వం మనుష్యుల్లో ఎందుకు వుంటుందీ అని.

తర్వాత అమెరికాకి వచ్చాక అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో నల్లవారి మీద తెల్లవారు చూపించిన, ఇప్పుడు కూడా ఇంకా చూపిస్తున్న ఆ బానిసత్వం, ఆ జాత్యహంకారం పుస్తకాల్లో చదవటం, హాలీవుడ్ సినిమాల్లో చూడటం ఎక్కువ చేశాను. అంతేకాదు అలాటి మంచి పుస్తకాలు చదివినప్పుడు, డాక్యుమెంటరీలు, సినిమాలు చూసినప్పుడు, వాటి మీద కుతూహలమున్న మిత్రులకి చెబుతూనే వున్నాను. మరింత అవగాహన కోసం వారితో అలాటి విషయాల మీద చర్చలు చేస్తూనే వున్నాను. ‘సెల్మా’, ‘మార్షల్’, ’రోసా పార్క్స్ స్టోరీ’, ‘ఫ్రీ స్టేట్ ఆఫ్ జోన్స్’ లాటి బయోపిక్ సినిమాలు చూస్తే, మన కళ్ళల్లో నీళ్ళు రాకమానవు. నల్లవారి వీపుల మీద కొట్టిన కొరడా దెబ్బల రక్తపు గీతలు, వారిని హింసించి చెట్లకి తల్ల క్రిందులుగా కట్టేసి చనిపోయేదాకా అలా వదలి వేసిన సంఘటనలూ, ఒకసారి చూస్తే ఆజన్మాంతం మన మనసుల్లో అలాగే నిలచి బాధ పెడుతుంటాయి. 

 

ప్రెసిడెంట్ లింకన్‌తో మొదలై, ప్రెసిడెంట్ జాన్సన్‌ జాతి, రంగు, లింగ బేధాల్లేకుండా అందరినీ సమానంగా చూడాలని చేసిన చట్టాలు, అక్కడక్కడా ఆచరణలో కొన్ని అవకతవకలు వున్నా, చాలవరకూ బాగానే పనిచేశాయి. నాలాటి మీలాటి బ్రౌను దొరలు, చైనీస్ జపనీస్‌లాటి పసుపు పచ్చ ఆసియావాసులు, ఎన్నో రకాల సంస్కృతుల, రంగులవారూ, అమెరికాలోనూ ఇతర తెల్ల దేశాల్లోనూ మంచి ఉద్యోగాలు చేసుకుంటూ నివసించటం దానికి మంచి ఉదాహరణ.

ఇక్కడ ఒక విషయం చెప్పి తీరాలి. ఆనాటి భారతదేశంలో ఈ విషయపరంగా అందరు అగ్రకులాల వారూ ఎంత చెడ్డవారు కాదో, అలాగే అమెరికాలో కూడా ఎనభై శాతం పైగా తెల్లవారు జాత్యహంకారులు కాదు. కాకపోతే ఒక గ్లాసెడు పాలలో, ఒక్క బొట్టు విషం వేస్తే చాలు, మొత్తం ఆ గ్లాసెడు పాలనీ పాడు చేయటానికి. ఇండియాలో ఎందరో అగ్రకులాల వారు నిమ్న జాతుల పరిరక్షణకు ఎలా పాటుపడ్డారో, అలాగే ఎందరో తెల్లవారు నల్లవారి హక్కుల కోసం అమెరికాలోనూ పోరాడారు.     

కాకపోతే రెండేళ్ళ క్రితం అమెరికాలో శ్వేత అహంకార గ్రూపులతో చేతులు కలిపి, ప్రతి ఎన్నికల మీటింగులోనూ తన జాత్యహంకారం చూపించి ఎన్నికయిన ఇప్పటి అమెరికా అధ్యక్షుడు, మళ్ళీ దేశాన్ని వందేళ్ళు వెనక్కి తీసుకువెళ్ళాడు. తన శ్వేత జాతి వివక్షతతో, తెల్లవారు కానివారిని తొక్కి పెట్టటమనే లక్ష్యంతో, ఏనాడో హిట్లర్ చేసిన పనులు ఈనాటి సభ్య సమాజంలో మళ్ళీ మొదలుపెట్టాడు.

          ప్రపంచ చరిత్ర చదివినా ఇలాటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. శ్రీశ్రీగారు చెప్పినట్టు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం. ఎక్కడినించో వచ్చిన నవాబులు,  బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఆక్రమించటమే కాకుండా, మనల్ని బానిసలుగా చేసుకుని, కాలి క్రింద తొక్కిపెట్టి మరీ పరిపాలించారు. అదే బానిసత్వం మనల్ని ఇంకా వదిలిపెట్టలేదు. రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఆఫీసర్లకి  వంగి వంగి దణ్ణాలు, సాష్టాంగ నమస్కారాలు చేసే వాళ్ళని చూస్తుంటే, స్వార్ధం కోసమో మనుగడ కోసమో తమకు తామే కోరుకునే ఈ బానిసత్వం ఎలా వుంటుందో చూడవచ్చు.

ఇవన్నీ చూస్తుంటే నా ఆలోచనలు రకరకాలుగా కట్టలు తెంచుకున్నాయి. ఇలా తమ రంగు, జాతి, కులం, మతం కాని వారి మీద వివక్షత, అసహ్యం, ద్వేషం చూపించి, వారిని బానిసలుగా చూసే వారందరూ తమ తమ మతాల మీద, దేవుళ్ళ మీద ప్రేమ వున్నవాళ్ళే. పేరుకి సాంప్రదాయకులమని (Conservatives) చెప్పుకునేవారే! మరి ఏ మతమూ, దేవుడూ ఇతరులనిలా విచక్షణా జ్ఞానం లేకుండా వివక్షత చూపించమనీ, బానిసలుగా చూడమనీ, వారిని తొక్కిపెట్టమనీ చెప్పలేదే! క్రిస్మస్ పండగ రోజుల్లో, కుటుంబాలు కలిసి వుండే సమయంలో, ఇలా పిల్లల్ని తల్లిదండ్రులనించీ వేరు చేయమని ఏ మతమూ చెప్పదే! మరి జంతువులలో కూడా సహజంగా వుండే ఈ ప్రేమ, అనురాగం, మమత మనుష్యులలో ఎలా మాయమయింది? దాని బదులు ద్వేషం ఎలా చోటు చేసుకుంది? అసలిలాటి మనస్థత్వం ఎక్కడినించీ వస్తుంది? పుట్టినప్పుడు పిల్లలందరూ స్పటికమంత స్వచ్ఛంగా వుంటారే, మరి ఈ తేడాలు పెంపకంలో వస్తాయా? చుట్టూ వున్న సమాజం అలావుంటే, సమాజంలోనించీ వచ్చిందనుకోవచ్చు, కానీ అన్ని సమాజాలూ అలా లేవే! సమాజాలకు సమాజాలే అలా మారుతున్నాయా? ఎందుకు?

          ఇలాటి బానిసత్వానికి మూడు కారణాలు అవవచ్చు అనుకుంటున్నాను. ఒకటి ధనమదం, దురాశ; రెండు రాజ్య కాంక్ష (ఈరోజుల్లో పదవీ వ్యామోహం), మూడు హింసానందం (శాడిజం).  

పూర్తి విశ్లేషణకి జవాబులు మాత్రం నా దగ్గర లేవు.

నా మనసులోని ప్రశ్న మాత్రం ఒక్కటే, ‘మానవత్వమా ఎక్కడున్నావ్?’ అని.   

మనమందరం సత్యాన్వేషణ చేయవలసిన విషయం ఇది!

***

ఇప్పటిదాకా, చాలా సీరియస్‌గా వుంది ఈ వ్యాసం. అందుకని కొంచెం గేర్లు మారుద్దాం.

బానిసత్వంలో ఇంకొక రకమైన బానిసత్వం కూడా వుంది.

ఇందాక చెప్పుకున్నది, వివక్షత అనేది తమ తలకెక్కాక, ఇతరులని బానిసలుగా చూసి అణగదొక్కేది.

ఇప్పుడు చెప్పబోయేది, మనంతట మనమే (దాదాపు తొంభై శాతం మనుష్యులు) ఈ రోజుల్లో కావాలని, ఎలా బానిసలుగా మారుతున్నారో చెబుదామని.

***

నేను కాకినాడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగులో 1960 దశాబ్దం మధ్యలో చదువేటప్పుడు, డాక్టర్ వెంకటరత్నంగారని ఒక ప్రొఫెసర్ గారు వుండేవారు. ఆయన ఆరోజుల్లో అంటుండేవారు, “Man has invented so many great things in life, but after all he became a slave to his own creation” అని.

ఎందుకో నా మనసులో ఆ మాటలలా నిలచిపోయాయి. నిజంగా ఈరోజుల్లో వున్నన్ని పరికరాలు కానీ, మెషీన్లు కానీ ఆరోజుల్లో లేవు. అందుకే అప్పటికన్నా ఇప్పుడే మనం సృష్టించుకున్న సాంకేతిక పరికరాలకు, పరిజ్ఞానానికీ మనం పూర్తిగా బానిసలమై పోయామనిపిస్తున్నది.

నేను నా ‘సత్యమేవ జయతే!’ పుస్తకంలో ‘సైబరుడి శాపం’ అని ఒక వ్యాసం వ్రాశాను. సరదాగా వ్రాసిన ఆ వ్యాసం నాకెంతో ఇష్టమైన వ్యాసమే కాకుండా, ఎంతోమంది పాఠకులకి నచ్చి మెచ్చుకున్నది కూడాను.

దానిలో సైబారారణ్యంలో సైబర మహాముని ఘోర తపస్సు చేసుకుంటుంటే, పిల్లలతో సహా ఆ అరణ్యానికి కారులో వెడుతున్న ఒక కుటుంబం కంట పడ్డాడా మహాముని. అమాయకులైన ఆ పిల్లలు ఆయన తపస్సుని భగ్నం చేస్తే, ఆయనకి కోపం వచ్చింది. అన్యోన్యంగా వుండవలసిన కుటుంబాలు, రాబోయే సైబర యుగంలో సాంకేతిక పరికరాలకు బానిసలైపోయి, మానవ సంబంధాలకు దూరమవుతారని శాపం పెడతాడు. ఆ శాపం వల్లనే ఇప్పుడు మనమిలా తయారయామని కథాంశం.

ఇంతకు ముందు భార్య పుట్టిన రోజున, భర్తగారు ప్రొద్దున్నే భార్య బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి, ‘పుట్టినరోజు శుభాకాంక్షలు, బంగారం!’ అనేవాడు. ఇప్పుడయితే ముఖపుస్తకంలో, ‘హాపీ బర్త్ డే హనీ’ అని బాత్రూమునించీ పెట్తేస్తాడు. అతని భార్య వంటింట్లోనించీ ‘థాంక్స్’ అని పెట్టేస్తుంది. అంతేకాదు అతని పోస్టింగుకి లైక్ కూడా ఇస్తుంది.

ఇంతకు ముందు, ఆఫీసు పని మీద వూళ్ళు తిరిగే త్రినాధరావు తమ వివాహ వార్షికోత్సవం నాడు ఇంటికి గులాబీ పూలగుత్తి పంపిస్తే, ఆ ఇంతి సంతోషం పట్టలేకపోయేది. ఇప్పుడు ఒక టెక్స్ట్ మెసేజిలో ఒక పూలగుత్తి ఇమోజి పంపిస్తాడు రామోజి. అతని భార్య స్పందన దానికి స్పందించి, ముందు లైక్ కొట్టి, వెంటనే మనసు మార్చుకుని ‘లవ్’ చేస్తుంది. స్పందన గాఢ స్నేహితురాలు స్నేహ మాత్రం, స్పందనకి ఇష్టమైన చాకొలెట్ కోటెడ్ ఆల్మండ్స్ పాకేజి పెట్టె బొమ్మని వాట్సప్లో పంపిస్తుంది. ‘వావ్, ఐ లవిట్’ అని జవాబిస్తుంది స్పందన.

ఇంతకు ముందు రాత్రి భోజనాల దగ్గర అందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళం. ఇప్పుడు కుడి చేత్తో అన్నం తింటూ, ఎడమ చేతితో సెల్ఫోన్ని చెవికి ఆనించుకుని మాట్లాడుతుంటుంది భార్యామణి. నిర్మలతో మాట్లాడటం అవకముందే, లలిత పిలుస్తుంది. ఆవిడని హోల్డులో పెట్టి, ఈవిడకి బై చెప్పి, ఆవిడని ఫోన్లో పెట్టి, ‘హలో, బాగున్నారా? భోజనమా? ఎప్పుడూ వుండేదేగా.. చేస్తున్నాం. ఫరవాలేదు చెప్పండి.’ అంటుంది. పక్కనే ఐపాడ్ పెట్టుకుని పిల్లల కార్టూన్ పాటలు పెట్టుకుని వింటూ, అదే చేతి వేలితో కార్టూన్లు మారుస్తూ, ఒక్కొక్క మెతుకే తింటూ కూర్చుంటుంది నాలుగేళ్ళ నర్మద. ఆ పిల్ల తినే కూర, పప్పు, పెరుగు అన్నీ ఆ ఐపాడ్ బుల్లి తెర మీద పులుముకుని వుంటాయి. ఐపాడ్ ఆగిపోతే ఆ పిల్ల తినటం కూడా ఆగిపోతుంది. ఇంటాయన మాత్రం మౌనంగా టీవీలో వస్తున్న గేమ్ షో చూస్తూ, మధ్యా మధ్యే కొంచెం కొంచెం తింటూ, తన లోకంలో తనుంటాడు. మధ్యలో బాస్కెట్ బాల్ గేమ్ గుర్తుకి వచ్చి, ‘అలెక్సా, చేంజ్ ది ఛానల్ టు ఫార్టీ నైన్’ అంటాడు.

నలబై ఏళ్ళ క్రితం నేను సోఫాలో పడుకుని, ‘అనంత్, టీవీ ఛానల్ని నలభై తొమ్మిదికి మార్చు. అక్కడ బాస్కెట్ బాల్ గేమ్ వస్తుంది’ అనే వాడిని, మా ఐదేళ్ళ అబ్బాయితో. అప్పుడు అలెక్సా లేదు. కనీసం టివీ రిమోట్ కంట్రోల్ కూడా కనిపెట్టలేదు మరి. ఇప్పుడు మా అలెక్సా లైట్లు, ఫాన్లు వెలిగిస్తుంది, ఆర్పుతుంది. ఘంటసాల, బాలు, సుశీల పాటలు పాడమంటే పాడుతుంది. (పాడదు, పాటలు పాడిస్తుంది).

ఆడవాళ్ళయితే ఫేస్ బుక్కులో లైకులు కొడుతూ, ‘అలెక్సా. స్విచ్ ఆన్ ది రైస్ కుక్కర్, మైక్రోవేవ్, కాఫీ పాట్.. అంటుంటే అలెక్సా అలా చేస్తుంటుంది. ‘అలెక్సా పెసరట్లు వేయి, బొబ్బట్లు చేయి..’ అంటే అవి చేసే స్థాయికి మన సాంకేతిక రంగం ఇంకా ఎదగలేదు. అదీ ఎన్నాళ్ళో లేదు. త్వరలోనే వస్తుందనుకుంటాను.

ఈమధ్య ఒక పెళ్ళిలో చూశాను. పురోహితుడుగారు, ఒక పక్క సెల్ ఫోన్లో మాట్లాడుతూనే, పెళ్ళి కూతురి తండ్రితో ‘అయ్యా, ఈ నీళ్ళు ఇక్కడ ఆకు మీద చిలకరించండి’, ‘అక్షితలు చల్లి నమస్కారం పెట్టండి’ అంటున్నాడు. నాకేమనిపిస్తుందంటే, ఆరోజుల్లో రాజులు యుద్ధానికి వెళ్ళి, కత్తికి భాష్యం కట్టి లాంగ్ డిస్టెన్స్ పెళ్ళి చేసుకున్నట్టు, ఇప్పుడు కూడా లాంగ్ డిస్టెన్స్ పెళ్ళిళ్ళు సైబర్ కల్యాణ మండపాల్లో జరుగుతాయేమోనని.

పదిమందీ కూర్చుని విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు ఎవరిదో ఫోన్ మ్రోగితే, నారాయణతో సహా ఆ నలుగురు తమ ఫోనేనేమో అని చూసుకుంటున్నారు.

‘హే గూగుల్’ కూడ అలెక్సా లాగానే బయట వాతావరణం ఎలా వుందో చెబుతుంది. మా ఆస్టిన్లోనే కాదు, ఇండియాలో గుంటూరులో వాతావరణం కూడా చెబుతుంది. ఒక డాలరుకి ఇప్పుడు రూపాయలెన్నో చెబుతుంది. నాలుగు వందల ఇరవై నాలుగుని, ఆరువందల తొంభై తొమ్మిదితో హెచ్చవేసి చెప్పమంటే వెంటనే చెప్పేస్తుంది. మనం హాయిగా కూర్చుని ఉల్లిపాయ పకోడీలు తింటూ వాటికి బానిసలమై పోయాం. ఎప్పుడయినా అవి కొంచెంసేపు పని చేయకపోతే చేతులూ కాళ్ళూ ఆడవు. బ్లడ్ ప్రషర్ చకచకా పెరిగిపోతుంది. ఎవరో ఆత్మీయుల్ని కోల్పోయినట్టు అనిపిస్తుంది. 

ఇలా చెప్పుకుంటూ పోతుంటే.. ఎన్నో.. ఎన్నో.. నిత్యం మనం చూసేవే, చేసేవే.

మరి ఎందుకు మనం సృష్టించుకున్న పరికరాలకు మనమే అంతగా బానిసలమయిపోయాం? ఒక్క గంట ఇంటర్నెట్ పనిచేయక పోతే విలవిల్లాడతాడు వినయ్. ముఖపుస్తకం ముప్పై నిమిషాలు ముఖం చాటేస్తే, ముఖం మాడ్చుకుంటుంది ముక్త. అలెక్సా చెప్పిన మాట వినిపించుకోకపోతే కోపంతో అరుస్తాడు అరవింద్. అలెక్సా మీద కాదు. పెళ్ళాం మీద.

ఈ పరికరాల వల్ల మన జీవితం సుఖవంతం అవుతుంది కదా, అందులో తప్పేమిటి అనేది ఒక వాదన.

అన్నీ ఆ పరికరాలే చేస్తుంటే, ఇక బుర్ర ఉపయోగించటం తగ్గిపోతున్నది అనేది ఇంకొక వాదన.

బయట ఆటలు ఆడుకునే పిల్లలు, ఇప్పుడు కంప్యూటర్లో ఆడుకుంటున్నారు.

పెద్దలు నడక మానేసి, టీవీకి అంకితమైపోయారు.

శరీరానికి అవసరమైన వ్యాయామం లేక ఎంతోమంది లావయిపోతున్నారు. ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయి అంటున్నారు. ఆఁ మరచిపోయాను. ఇప్పుడు వ్యాయామం కూడా కొందరు వ్యాయామం యాప్ లోనే చేస్తున్నారు.

మరి.. ఇలాటి బానిసత్వం మంచిదా.. కాదా?

మీరే చెప్పండి చూద్దాం!

*****

bottom of page