MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
సాహిత్యం - కొన్ని ఆలోచనలు
మంచి సాహిత్యం అంటే?
మధు చిత్తర్వు
మంచి సాహిత్యం అంటే ఏమిటి?
సాహిత్యం అంటే నవల కథా కవిత్వం ఎక్కువగా చర్చిస్తాం. ఇంకా విమర్శనా వ్యాసాలు, సాహిత్య చర్చా వ్యాసాలూ , కావ్యాలూ, నాటకాలూ, ఇతిహాసాలూ కూడా సాహిత్యం పరిధిలోకి వస్తాయి.
"సాహిత్యం సమాజానికి దర్పణం" అని చిన్నప్పటి నుంచి వినేవాడిని. సాహిత్యంలో సమాజం ఉండాలి. సామాజిక స్పృహ ఉండాలి అని ఎప్పుడూ సాహితీ విమర్శకులు విశ్లేషకుల వద్ద వినేవాళ్ళం. మంచి సాహిత్యం అంటే సమాజాన్ని చిత్రించేదీ, సామాజిక స్పృహ ఉండేదీ, విలువలని చెప్పేదీ అని ఇదే కొలబద్ద, లేక ప్రామాణికత అప్పటికీ ఇప్పటికీ.
అసలు సాహిత్యం లేనిదే మానసిక సామాజిక అవగాహన ఉండనే ఉండదు. మామూలుగా స్కూలుకి ,లేక కాలేజీకి వెళ్లి మనం చదువుకునే సైన్స్ సోషల్ స్టడీస్ ఆ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమేటీక్స్, కంప్యూటర్స్ లేక మెడిసిన్ ఇవన్నీ మనకి డిగ్రీ లని,వృత్తి నైపుణ్యాన్ని ఇస్తాయి.ఉద్యోగాలనీ జీవనభృతినీ ఇస్తాయి.
కానీ కాలేజీ చదువు కాక ఇతర సాహిత్యం చదువుతూ పెరగటం వల్ల మనకి మన చుట్టూ ఉన్న సమాజం గురించీ పరిస్థితుల గురించీ అవగాహన వస్తుంది. మనం మన ఇంట్లో పెరిగిన జీవితం వాతావరణం విలువలు కంటే మన చుట్టూ ఉన్న సమాజంలో మరొక రకమైన వ్యక్తులు జీవితంలో ఉన్న సమస్యలు బాధలు వాటికి వారు వెదుక్కునే పరిష్కారాలు వారి సంఘర్షణలు విజయాలు అన్నీ మనకు తెలుస్తాయి. అందుకనే మంచి సాహిత్యం మంచి ఆలోచనలను ,ఈ సమస్యలని వాటికి చేయవలసిన మంచి పరిష్కారాలను సూచిస్తుంది. ఇది శాస్త్ర విజ్ఞానము అధ్యయనం లాగా కాక , శిల్ప వైచిత్రి తో వినోదాత్మకంగా వైవిధ్యంతో ఉండటంతో మనని ఆకర్షిస్తుంది. కొత్త మార్గాలు చూపిస్తుంది. మన వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. ఆయా కథల్లో పాత్రలు వారి కష్టాలు మనకి ఉండి ఉంటే ఆయా పాత్రల సంఘర్షణ పోరాటం విజయం మనకు స్ఫూర్తిని కలిగిస్తాయి. కానీ ఈ "మంచి"అనే మాట చుట్టూ నే అసందిగ్ధతా అస్పష్టతా ఉంది. చిన్నప్పుడు చదివిన క్లాసిక్స్ రామాయణం భారతం భాగవతం లాంటి పురాణాలు మనం పెరుగుతున్నకొద్దీ చదివితే మనకు వయసు కొద్దీ అవగాహన కలుగుతుంది. అప్పుడు చిన్నతనంలో ఫాంటసీ కథల్లా రెక్కలతో ఆకాశంలో ఎగిరే మనుషులు దేవతలు లాంటి పాత్రలు వింతగా ఆశ్చర్యంగా కనిపిస్తే ఇప్పుడు వాళ్లే మన జీవితంలో ఎదుర్కొనే సంఘర్షణలకు ప్రతిరూపంలా కనిపిస్తారు. ఇప్పుడు పరిణతి చెందిన కొద్దీ ఆ పాత్రలూ కథలలో వారి సంఘర్షణా మనకి కనిపిస్తుంది.మన జీవితాల సమస్యలకి పరిష్కారం దొరకవచ్చు కూడా.
అలాగే కొన్ని కథలు నవలలు కవిత్వం ఎన్నిసార్లు చదివినా ఆ కథలకి సాహిత్యానికి మళ్లీమళ్లీ కొత్త అర్థాలు కనబడి మనకి ఉత్సాహం ధైర్యం నింపే విధంగా ఉంటాయి.
అదే మంచి సాహిత్యం. ఆ సాహిత్యం మళ్లీ మళ్లీ తన వైపు రమ్మని ఆహ్వానించి మనని చదివిస్తుంది. మళ్లీ మళ్లీ మనోధైర్యాన్నీ ఆశనీ చిగురింప చేస్తుంది.
అయితే ఈ విలువలు ఒక యుగం లో అంటే జరిగిపోయిన కాలం లో ఒక రకంగా వుంటే, మధ్య యుగాలలో మరొక రకంగా ఉండవచ్చు.
21వ శతాబ్దంలో ఈ విలువలు మారి కూడా ఉండవచ్చు. ఇదే యుగ ధర్మం అని కూడా అనుకోవచ్చు ఒకప్పుడు మన దేశంలో అయితే వర్ణాశ్రమ ధర్మాలు పాతివ్రత్యం సత్య పాలన ఇలాంటివి గొప్పవిగా చూపించే సాహిత్యం ఉండొచ్చు. ఇప్పుడు కులవివక్ష ,కుల నిర్మూలన స్త్రీల హక్కులు, మత సహనం గురించీ ఈ వివక్షను ఎలా ఎదుర్కోవాలో పోరాడాలో చెప్పే సాహిత్యం ఉన్నతమైనది గా పరిగణించవచ్చు. రచయిత లేక కవి సమాజంలో తను చూసిన వ్యక్తుల బాధలకి అన్యాయానికి స్పందించి రచన చేస్తాడు. మనం ఆ రచన తో ఏకీభవిస్తే మనం స్పందిస్తాం. కానీ ఆ పరిష్కారాలు వివిధ రకాలుగా ఉండొచ్చు. కొందరికి భక్తి ప్రార్థన మతపరమైన నమ్మకం మంచి విలువలు అయితే, మరికొందరికీ వర్గపోరాటం శ్రామిక వర్గాల పాలన దోపిడి చేయబడిన దానికోసం ఆయుధం పోరాటం పరిష్కారమని అవగాహన ఉండొచ్చు. నాలాంటి వారికి సైన్స్ అది ఏ రకమైన సైన్స్ అయినా అది చూపిన మార్గం పరిష్కారం అనిపించవచ్చు.
ఈ రకంగా సమాజం బాధ లే నా బాధలు అనే రచించిన రచయితలు కొందరు సంప్రదాయ మార్గం, కొందరు ప్రోగ్రెసివ్ ప్రగతిశీల మార్క్సిస్టు మార్గం, కొందరు వ్యక్తిత్వ వాద అస్తిత్వ వాద మార్గం కొందరు విజ్ఞాన శాస్త్రం సూచించిన మార్గం ఎన్నుకోవచ్చు.
ఆ రోజుల్లో యవ్వనంలో దేవదాసు చదివినప్పుడు ప్రేమ విఫలమైతే , మద్యం తాగటం పాటలు పాడటం పరిష్కారం అనిపించి రొమాంటిక్ గా ఉండేది. చలం పుస్తకాలు చదివి ప్రణయం సౌందర్యఉపాసన ఇలాంటి స్వేచ్ఛా జీవితం గ్లామరస్ గా ఉండేది. ఆ తర్వాత అస్తిత్వవాదం వ్యక్తివాదం ఉన్న సాహిత్యం చదివితే వ్యక్తి తన కోసం తను ఆనందంగా ఉండాలి అనే ఎవరి జీవితం వారికి ముఖ్యమని, వ్యక్తిత్వ వికాసం, విలువలున్న జీవితం ముఖ్యమనే సాహిత్యం నచ్చటం మొదలైంది.
అందుకని ఇప్పుడు సమాజం నుంచి వ్యక్తి వైపు సాహిత్యం మలుపు తిరిగింది అనిపిస్తుంది. సాహిత్యం సమాజానికి దర్పణం అనే ఉద్దేశం నుంచి, అది వ్యక్తి వికాసానికి తోడ్పడాలి మానవ హక్కుల కోసం పోరాటం చేసేది అవగాహన కల్పించే దిశగా ఉండాలి అని 21వ శతాబ్దంలోని ప్రామాణికంగా నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో, జాతి వివక్షత పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల అన్యాయాలు నియంతృత్వ దేశాల్లో కమ్యూనిస్టు దేశాల్లో కూడా హక్కుల దురాక్రమణ అణచివేత, మతపరమైన పరిపాలనలో వున్న సమాజాల్లో మతఛాందస తా, ఇలాంటివి అన్నీ మనిషి వ్యక్తిత్వాన్నీ స్వతంత్రాన్నీ హరిస్తూనే ఉన్నాయి. ఇది కాక వాతావరణ కాలుష్యం, యుద్ధాలు సృష్టించే బాధలు, బీభత్సం, శరణార్థుల వలసలు అంతేకాక తరచూ వచ్చే కరోనా వైరస్ లాంటి మహా మారులు, మనిషి మనసుతో జీవితాలతో ఆడుకుంటూనే ఉంటాయి, విషాదం సృష్టిస్తూనే ఉంటాయి.
అందుకే మంచి రచయితలు అనబడే వాళ్ళు మనిషి వైపు ఉంటారు. మనిషి కోసం మానవత్వం విలువల కోసం, మైనారిటీలు ఇతర బలహీన వర్గాల కోసం రాస్తూ ఉంటారు. దీనివల్ల బాధాతప్తులకీ దీనులకీ మంచి సాహిత్యం అంధకారంలో మంచి కరదీపిక అవుతుంది. అది మంచి శిల్పంతో మనోరంజకంగా రాస్తే గొప్ప సాహిత్యం అవుతుంది. మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.
ఈ లక్షణాలు సాహిత్యంలోని అన్ని ఉప శాఖల్లో అంటే అపరాధ పరిశోధన వైజ్ఞానిక కల్పనా, భయానక, హాస్య సాహిత్యంలో కూడా వర్తిస్తాయి. ఏ జానర్ లో అయినా సాహిత్య ప్రయోజనం సామాజిక స్పృహతో మానవ హక్కుల తో అవగాహనతో ఉండాలి.
రామాయణంలో తండ్రి మాట పాటించి త్యాగాలు చేసే శ్రీరాముడి దగ్గర్నుంచి, నిజమే మాట్లాడాలని కష్టాలు పడిన హరిశ్చంద్రుడు దగ్గర దాకా, పాతివ్రత్యం కోసం బాధలు పడి న స్త్రీల కథలు దగ్గర్నుంచి, ఈ శతాబ్దపు,స్నేహం కోసం విలువల కోసం నిలబడి చెడ్డ మాంత్రికుల తో పోరాడే పిల్లమాంత్రికుడు హ్యారీపోటర్ వరకూ ఇవే విలువలు వర్తిస్తాయి అనుకుంటున్నాను.
ఇప్పుడు వర్ణవివక్ష, లింగ వివక్ష ఎలా ఎదుర్కోవాలనే బుద్ధి కలిగించే సాహిత్యం విలువలున్న సాహిత్యం మంచి సాహిత్యం గా మారుతోంది. అప్పటికీ ఇప్పటికీ చరిత్ర గతిలో విలువలు మారుతూనే ఉంటాయి కానీ మనిషి మానవత్వం అతని సంఘర్షణ పరిష్కారం ఈ ప్రక్రియని సూచించే సాహిత్యం మాత్రం మనిషి మనసులో నిలిచిపోతుంది. అది హారీ పోటర్ అయినా, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో హాబిట్ బిల్ బో బాగిన్స్అయినా, ఇప్పటి నవలలు అయిన నీలా , మీనా, శప్తభూమి ,కొండ పొలంలో లాంటి ధీరోదాత్తులైన నాయకీ నాయకులైనా, మనకు స్ఫూర్తి కలిగించే మనిషి ,లేక స్త్రీ చేసే సంఘర్షణ, అతను లేక ఆమె పడే బాధలు,వారు సాధించే విజయాలు ఇవే మనకి స్ఫూర్తిని కలిగిస్తాయి.
ఈ సూత్రం చారిత్రక వైజ్ఞానిక ఊహాకల్పిత ఫాంటసీ కి కూడా వర్తిస్తుంది అని అనుకుంటాను. ఏ సాహిత్యం అయితే, చెడును అవినీతిని గొప్ప విషయం గా చిత్రించి, మానవ విలువలకు విరుద్ధంగా ప్రవర్తించమని ప్రోత్సహిస్తున్నదో, అది ఏ రాజకీయ సిద్ధాంతమైనా, ఎంత వినోదాత్మకమైన, ఎంత నీచమైన ఉత్కంఠను కలిగించినా అది మంచి సాహిత్యం కాజాలదు.
కాబట్టి ఇప్పుడు మళ్లీ ఆలోచించండి. సాహిత్యం సమాజానికి దర్పణమా, లేక వ్యక్తి ప్రయోజనాల చిత్రణ, లేక సమకాలీన సమాజానికీ వ్యక్తి జీవితానికీ మధ్య జరిగే విలువల సంఘర్షణల ప్రతి రూపమా?
*****