top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

'అలనాటి' మధురాలు

"మల్లెపువ్వు" - ఆదివిష్ణు గారి మాటల్లో శ్రీ తిలక్.

సేకరణ: మెడికో శ్యామ్

visaalaandhra1.JPG
alanati2.JPG

10 జులై 1966 న విశాలాంధ్రలో ప్రచురించబడిన తిలక్ గారి జ్ఞాపకాలపై ఆదివిష్ణు గారి వ్యాసం "మల్లెపువ్వు" అలనాటి మధురాలు పాఠకులకై ప్రత్యేకంగా...

మల్లెపూవు

 

చాలాకాలం క్రిందటి సంగతి.

తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడినట్లు మిత్రుడు రంగధామ్ ఉత్తరం రాసినపుడు నేనెంతో ఆనందించేను. అప్పుడు నాకు ఆవూరు దగ్గర్లోవున్న తణుకు జ్ఞాపకం వచ్చింది.

 

బాలగంగాధర్ తిలక్ మూలంగానే తణుకు గుర్తుకురావడం.

 

ఆయన ఖరీదయిన మనిషి. మంచి ఖరీదయిన కథలూ, విలువయిన పొయెట్రీలు రాయగలరు. ఒక చిత్రమైన జబ్బుతో ఆయన బాధపడుతున్నట్టు నేనెప్పుడో విన్నాను.

 

ఆయన బొమ్మని ఒకసారి చూసేను. చాలా అందమైన మనిషని ఆనాడే అనుకున్నాను. అందమైన కథలు రాసే మనిషి అందంగా ఉంటే అదోరకమైన క్వాలిఫికేషనే మరి!

రంగధామ్ ఉత్తరం వొచ్చింతర్వాత నేను తాడేపల్లిగూడెం వెళ్ళేను. నేనక్కడికి వొస్తున్న వైనం ఓ మిత్రుడిద్వారాతెలుసుకున్న రంగధామ్ ఆశ్చర్యపోలేదుట. నన్ను వెంటనే పోల్చేసుకుని క్షేమాలడిగేడు. క్షేమసమాచారాలు ముగిసిన వెంటనే నా మనసులోని కోరిక చెప్పేను. బాలగంగాధర తిలక్  ని మనం తప్పకుండా కలుసుకోవాలని.

 

ఆ మరుసటిరోజే మేమిద్దరం తణుకు వెళ్ళేం. తణుకు మహారద్దీగా వుండే చిన్నవూరు. ఆ ఊళ్ళో తిలక్ గారిని తెలీని మనిషంటూ లేరేమో. ఓ కిళ్ళీషాపులో సిగరెట్లు కొనుక్కుంటూ ఓ ఆసామిని తిలక్ గారిల్లు కోసం వాకబు చేసేను.

 

తణుకులో టౌన్ హాలుంది. టౌన్ హాలు పక్కగా ఒక రోడ్డుంది. ఆ రోడ్డుకి కుడివేపునున్న పెద్దయిల్లు దగ్గర మేము నించున్నాము.

 

ఈ ఇంటికి రాకముందు ఈ యింటిగురించి గూడా నేను విన్నాను. సంపన్నుల లోగిలి ఎంత హుందాగా వుంటుందో నేనక్కడ చూసేను. మేము బయట తారట్లాడుచూండగా ఓ కుర్రాడు వొచ్చి వివరాలడిగేడు, చెప్పేము. అతనెంతో ఆదరంగా మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాడు.

 

ఒక విశాలమైన గది. అందంగానూవున్నది. గది అంచున ముచ్చటైన మంచం. దీనిమీద పరుపూ, పాలపొంగులాంటి దుప్పటి. ఆనాడు ఆ మంచం మీదనున్న మల్లెపువ్వుపేరే శ్రీ బాల గంగాధర తిలక్. తెల్లని ఛాయ, మనోహరమైన రూపు, అయిన తెల్లని మనిషి మరింత తెల్లని బట్టల్లో మమ్మల్నాహ్వానించినప్పుడు నేను కొంచెం తడబడ్డాను.

 

వినయంగా కూర్చునేందుకు ప్రయత్నించేము. ఆయన ఆ ప్రయత్నాన్ని చనువుగా మందలించేరు. గదిలో పంకా తిరుగుతోంది. నాకెదురుగా ఓ కిటికీ వున్నది. ఆ కిటికీగుండా ఎంచక్కా వీధివేపు చూచుకోవచ్చు.

 

"మంచినీళ్ళు తాగుతారా?" అన్నారాయన.

తలూపేను. నీళ్ళు తాగుతూ ఓ మాటు ఆ గదినంతా కలియజూసేను.

 

ఆయనస్సలేం ఉద్యోగం చేయనక్కర్లేదు గదా? అస్తమానూ ఇంట్లో కూర్చుని వేళకింత భోంచేసి గదిలో ఆ అందమైన సింహాసనం మీద నడుంవాల్చి హాయిగా ఆలోచించుకోవచ్చుగదా! సొంత వూరొదిలి సంవత్సరానికో దిక్కుమాలిన వూరు బదిలీ కాక్కర్లేదు గదా! ఇవన్నీ నాకా క్షణం గుర్తుకొచ్చి, ఆయన మీద అసూయ కలిగింది. మా సుబ్బరామయ్య చెప్పినట్టు మనలో దాకున్న "వెధవ మనిషి"కి తిక్కపుట్టినప్పుడు దారుణంగా ఆలోచిస్తాట్ట! అది ఇదేనేమో!

 

"మీరిద్దరూ కూడా ఈ మధ్య చక్కగా రాసేస్తున్నారు" అన్నారాయన. కొంచెం కుదుటపడ్డాను. అప్పుడు వారి ఆరోగ్య విషయం అడిగేము. దానికాయన చాలా తేలిగ్గా నవ్వేశారు.

 

"ఐయామాల్ రైట్" అన్నాడు.

 

వారి రచనలు నేను చాలా చిన్నతనం నుంచీ చదివేను. రచనల పరంగా నాకు చాలా ఇష్టమైన వాళ్ళలో వారొకరు. సుందరీ సుబ్బారావు. నల్లజర్లరోడ్డు, సుచిత్ర ప్రణయం గురించి నేను మాట్లాడేను.

 

అప్పుడాయన నా కథలు కొన్నిటి గురించి గొప్పగా మెచ్చుకున్నారు.

 

నేను అతి చిన్నవాడిని. వారు రచనావ్యాసంగం ప్రారంభించిన క్షణాన్ని నేనింకా ఉక్కా, ఉంగాల్లోనే వుండి వుంటాను. వారొక మహోన్నర శిఖరం! నాలాంటి కథకులకు ఓ దారి చూపుతున్న మార్గదర్శి. వారి ప్రతీమాటలోనూ సొగసున్నది. మర్యాదా మంచీవున్నాయి. మాట్లాడటం ఒక అళ అనే పాథమూ వున్నది.

 

మాటల్లో ఆయన అనుభవాలు కొన్ని దొర్లేయి. మచ్చుకి ఒకటి చెప్తాను.

 

పేరేదో గుర్తులేదుగాని, తణుకు దగ్గిర ఒక చిన్నవూళ్ళో ఒక గొప్ప ధనవంతుడున్నాడు. కేవలం సాహితీరంగాన్ని ఉద్ధరించే నిమిత్తం ఆయన అవతరించేరన్న నిందొకటి ప్రచారములోనూ వున్నది. రచయితా అప్పుడప్పుడే గమనింపబడుతూన్న శ్రీ తిలక్ వారిని కలుసుకోవలిసిన అవసరమొకటి ఏర్పడింది. ఆ శ్రీవారికి తిలక్ ని 'రచయిత' గా పరిచయం చేశార్ట, తిలక్ మిత్రులెవరో. శ్రీవారు వారిదగ్గరున్న పుస్తకాన్ని ఒకటికి రెండుమాట్లు తిరగేసి అన్నారట.

 

"చూడు బాబూ! నాకీ పుస్తకంతో తప్ప మరో పుస్తకంతో యింతవరకూ పరిచయం లేదు. నువ్వేదో రచయితవంటున్నాడీయన. మంచిదేకానీ "నేను మీకు తెలుసా?" అని ఎవర్నీ ఎప్పుడూ అడగబాకు,అవతా"వని.

 

శ్రీవారి చేతిలో వున్న ఆ పుస్తకం ఒకానొక రైల్వే గైడుట!

 

కావాలని ఈ సంఘటనని మాకు చెప్పి హెచ్చరించేరు. ఆయన చేసిన హెచ్చరికలోగల నిజాన్ని గ్రహించి ఆశ్చర్యపోయేను.

 

"ఒక మంచినవల మీరు వ్రాయగా చదవాలని వుంది మాస్టారూ!" అన్నాను చొరవగా.

అప్పుడాయన కొంచెంసేపు మవునంగా వుండి తర్వాత జవాబు చెప్పేరు. అది విని ఆయన చేసే రచనల్లో ఆయనకు గల సిన్సియారిటీని తెలుసుకుని మురిసిపోయేను. పూర్వం ఆయనో నవల ప్రారంభించి, ఒక చోట మరి రాయడం మానుకున్నారట. ఆ నవల్లో ఒక పాత్ర ఉత్తరదేశంలోని ఒక పుణ్యక్షేత్రాన్ని చూళ్ళేదు. చూడనిదాని గురించి రాయకూడదన్న కారణంగా - అక్కడితో ఆ నవల్ని అసంపూర్ణంగానే వుంచేశారుట.

 

చేతులు రెండూ జోడించేశాను. (దరిమిలా ఇదే అంశాన్ని ఓ రచనలో ప్రవేశపెట్టి ఆయన అభినందననీ పొందగలిగేను.)

 రెండు గంటలు రెండు నిమిషాల్లా గడిచేయి. కొన్ని అర్జంటు పనులుండటం మూలంగా ఆ రాత్రి వారింట భోజనం చేసే యోగ్యత మాకు లేకపోయింది. మరోసారెప్పుడైనా వొచ్చి రెండు రోజుల పాటు వారికి 'అతిథి' గా వుండమని అడిగేరు. కానీ నా దురదృష్టం కొద్దీ వారికి నేను 'అతిథి' కాలేకపోయాను.

 

***

 

మా వూరొచ్చేసింతర్వాత, అప్పుడప్పుడూ తిలక్ గారి గురించి నా మిత్రులకి చెప్తూండేవాడిని. ఆయన దగ్గిర్నుంచి వొచ్చే ప్రతి ఉత్తరవూ మావాళ్ళకు చూపుతూండేవాడిని. భమిడిపాటి జగన్నాథరావు,  సింగరాజు రామచంద్రమూర్తి మొన్నమొన్నటివరకూ తిలక్ గారి ఆరోగ్యం గురించి అడుగుతూనే వున్నారు. వారు అనారోగ్యంగా వున్నట్టు నేను గ్రహించలేకపోయేను.

 

ఆ తర్వాత తిలక్ గారు చాలా తడవలు బెజవాడకి వొచ్చారు. వారొచ్చినప్పుడు మేమిద్దరం ఒక గంటైనా సరదాగా మాటాడుకునేవారము.

 

ఓనాడు ఆ సుకుమార రాజకుమారుడు బెజవాడలో ఓ హోటల్నుంచి మా ఆఫీసుకి ఫోన్ చేశారు. ఆకాశవాణికి వెళ్ళాలి. తోడు రమ్మని, ఆఫీసులో పర్మిషనుపెట్టి హోటలుకు వెళ్ళాను. వారు నాకోసమే ఎదురుచూస్తున్నట్టు కౌంటర్ దగ్గిర నించున్నారు. మేమిద్దరమూ ఆకాశవానికి వెళ్ళేము. సాహిత్యనందిని కార్యక్రమం నిమిత్తం వారి స్వీయకవిత రికార్డుచేసేముందు అక్కడ అధికార్లు, వారి పొయిట్రీలో ఒక చిన్న మాటని సవరించవలిసిందిగా కోరేరు.

"సవరించను" అన్నారాయన నిబ్బరంగా.

చివరికి ఆయన కోరిక ప్రకారంగానే రికార్డయింది. బయటకొచ్చి "చెక్కు" తీసుకుని రిక్షా ఎక్కేము.

 

లీలామహల్లో ఇంగ్లీషు సినీమా (హెలియన్స్ కాబోలు)కి వెడదామన్నారు. సరేనన్నాను, కానీ, రిక్షా లీలామహల్  వేపు వెళ్ళలేదు. తిన్నగా వారు దిగిన హోటలు దగ్గిరాగింది.

"మనం సినిమాకి వెడదామనుకున్నాం గదండీ!" అన్నాను.

 

"ఇప్పుడెవరు కాదన్నారండీ! మా ఆవిడ గూడా నావెంట వొచ్చింది. మనం ముగ్గురం కలిసి వెళదాం" అన్నారు.

 

నేను మొహమాటపడ్డాను.నేను రాలేకపోతున్నందుకు క్షమించవలసిందిగా కోరి అద్దెగదికి చేరుకున్నాను. గదిలో సిగరెట్టు కాలుస్తో తిలక్ గారి 'దాంపత్యం' గురించి కాసేపాలోచించేను. తిలక్ గారబ్బాయి అప్పట్లో గుంటూరులో మెడిసిన్ చదువుతున్నాడు. తిలక్ గారమ్మాయి గుంటూరు వుమన్స్ కాలేజీలో చదువుకుంటోంది. తిలక్ గారి వయస్సెంతో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ, ఆ వయస్సులో వారు, వారి శ్రీమతితోపాటు బెజవాడకి వొచ్చి సినీమాలు చూస్తారనే విషయం గుర్తుకొచ్చినప్పుడు వారి 'సీతాపతి' కథ నా మనసులో తియ్యగా మెదిలింది. ఏ జన్మ పుణ్యఫలితమో. ఈ జీవితాన్నింత రమ్యంగా గడుపుతున్నారు మీరూ అనుకున్నాను.

బెజవాడ ఆఫీసులో ప్రతి శనివారం మేమంతా శ్రీవేంకటేశ్వరస్వామివారి పూజ చేస్తోండేవాళ్ళం. ఓ శనివారం నేను స్వామికి అలంకారం చేస్తున్నవేళ కిందనుంచి మా ఫ్యూను కబురు తెచ్చేడు. (మా ఆఫీసు రెండంతస్థుల మేడ. మేము పై అంతస్థులో వుండేవాళ్ళం.)

 

"ఎవరో సార్! మీ కోసం వొచ్చేరు. పైకి రండంటే ఫర్లేదు మిమ్మల్ని పిలవమన్నారు." అన్నాడు.

నేనే కిందికి వొస్తూ చూసేను. మెట్లవారగా విలాసంగా నించుని నవ్వుతున్నారు తిలక్. గబగబ ఆయన్ని చేరుకుని అన్నాను.

'రండి మాస్టారూ! పైన పూజచేస్తున్నాం. ప్రసాదం పుచ్చుకుని వెడదాం రండి."అన్నాను.

 

నవ్వుతూనే అన్నారు. "నేనీ మెట్లు ఎక్కలేనండి. పూజ పూర్తయింతర్వార ప్రసాదమూ పట్రండి. నేనిక్కడే వుంటాను. మరి నన్నిక బలవంతం చేయకండి."

 

వారికో కుర్చీ వేయించేను. నేను మెట్లెక్కుతూ అనుకున్నాను 'ఆయన ఆరోగ్యం బాగోలేదు కాబోలు.' ఆ ఒక్కరోజే వారు అనారోగ్యంగా కనిపించేరు నాకు.

 

పూజ పూర్తయింతర్వాత ప్రసాదం పట్టుకొచ్చేరు. ఆ ప్రసాదం పుచ్చుకుని పదండన్నారు. ఓ హోటల్లో కూర్చున్న తర్వాత వారొచ్చిన పని చెప్పేరు. వారి కథలూ, గేయాలూ పుస్తకరూపంగా తీసుకురావాలని వారి ఉద్దేశమట. బెజవాడలో నాకు తెలిసిన పబ్లిషరునెవర్నయినా ఈ విషయం కనుక్కోవలిసిందిగా చెప్పేరు.

 

కొన్నిరోజుల తర్వాత నేను జ్యోతి కార్యాలయానికివెళ్ళాను. అక్కడ బాపూ, ముళ్ళపూడి వెంకటరమణగార్లతో ఈ విషయమై ముచ్చటించేను. వాళ్ళిద్దరికీ శ్రీ తిలక్ పట్ల విపరీతమైన గౌరవమున్నది. ఆయన పుస్తకాలని అచ్చువేయడమే ఒక ప్రివిలేజ్ గా భావిస్తున్నామని చెప్పేరు. ఆ విషయం శ్రీ తిలక్ గారికి రాసేను. కానీ, కొన్ని సొంతపనుల మూలకంగా, వారినుంచి రచనలు తెప్పించుకోవడంలో జాప్యం జరిగింది. అటు తరువాత నేను మా సొంతవూరు బదిలీ కావడమూ, ఇక్కడ ఆఫీసుపనుల్లో తలనిండుగా మునిగిపోవడం మూలంగా ఇప్పటికొచ్చి వారికి నేనుత్తరం రాయలేకపోయేను. కనీసము నా బదిలీ గురించైనా రాయలేదు. అందుచేతనే వాళ్ళమ్మాయి వివాహశుభసందర్భంలో వారు పంపిన శుభలేఖ బెజవాడ వెళ్ళి నాకు చేరింది ఆలశ్యంగా. శ్రీ తిలక్ గారినుంచి వొచ్చిన చివరి లేఖ అదే!

 

ఇప్పుడు తిలక్ లేరు. వారుత్తరాలూ, వారి స్నేహం, వారి చిర్నవ్వూ, హెచ్చరికలూ అన్నీ భద్రంగా దాచుకున్నాను. నన్నలరించిన మల్లెపూవు వాడిపోదు.

*****

bottom of page