top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

మాష్టారి విజయం

Jayanthi Sarma.jpg

జయంతి ప్రకాశ శర్మ

"నమస్కారం మాష్టారు. బాగున్నారా?" మాష్టారింట్లోకి అడుగు పెడుతూ రెండు చేతులు జోడించాను.


"రా నాయనా... రా!  అలా కూర్చో!" మాష్టారు సాదరంగా ఆహ్వానించి లోపలకి తీసుకెళ్ళారు.


తెల్లటి గ్లాస్కో పంచె , తెల్లటి సైన్ గుడ్డతో కుట్టిన జుబ్బా వేసుకుని, నిండుగా ఆరడుగుల మాష్టారి గొంతుకలో ఎక్కడా మార్పులేదు.  ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం స్కూల్లో పాఠాలు చెప్పుతున్నట్టే ఉంది.

పాత కాలం ఇల్లు. చతురస్రంగా నాలుగు వాసలిల్లు. ఆ నాలుగు వరండాల మధ్యలో పెద్ద వాకిలి. వరండాల చూరుల్లోంచి సన్నని తీగలతో అల్లిన పందిరి. ఆ వాకిలి మధ్యలో తులసికోట. నాలుగు వరండాలనుకుని నాలుగు గదులు. ఓ గది... చావిడి లోంచి వీధిలోకి దారి, దాని ఎదురుగా వసారాలో ఉండే గదిలోంచి వెళ్తే, ఇంటి వెనుక పెరడు వస్తాయి. కుడివైపు వరండాలో పెద్ద పీట ఉయ్యాల. మాష్టారి భార్య అందులో కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నారు. వాకిలి ఓ వైపు కాస్త మట్టి జాగ. అందులో ఎదిగిన జాజి తీగలు పైన పందిరి మీద పొందికగా అల్లుకున్నాయి. మరో వైపు బీరపాదు దట్టంగా ఆక్రమించి నిండుగా పింజలతో చూడముచ్చటగా ఉన్నాది. ఆ జాజి, బిరపాదుల ఆకుల మధ్యలోంచి వాకిల్లోకి రావడానికి సూర్యుడు మిట్ట మధ్యాహ్నం ప్రయత్నం చేస్తున్నాడు. వీధిలోంచి ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కోడానికి వీలుగా వాకిట మధ్యలో నీళ్ళ గోలెం, చెంబు ఉన్నాయి. వాడుకున్న నీళ్ళు వీధి కాలువలోకి వెళ్ళటానికి ఓ కాలువ. ఆ వరండాలో కూర్చుని చూస్తే... అటు పెరడు, ఇటు వీధి కనబడతాయి. పెరట్లో ఓ వారగా నుయ్యి, గిలకతో తోడుకుని అక్కడే స్నానం చేస్తే, ఆ నీళ్ళు అలా మొక్కల లోకి వెళ్ళటానికి వీలుగా అక్కడో పెద్ద కాలువ. మధ్య మధ్యలో పిల్ల కాలువలు. అక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. నలభై సంవత్సరాల కిందట ఆ ఇల్లు ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది.


మాష్టారిని కలవటానికి వచ్చి, వాటన్నింటినీ చూస్తూ అన్ని విషయాలు మర్చి పోయాను. ఆయన పని చేసిన ఎలిమెంటరి స్కూల్లోనే నేను చదువుకున్నాను. ఆ స్కూలు వదిలేసి ముప్పై సంవత్సరాల పైచిలుకే అయింది. ఏడాదికో రెండేళ్ళకో ఓసారి ఆ ఊరు రావటం, పని చూసుకుని వెళ్ళపోవాటమే గాని మాష్టార్ని కలవటం కుదరలేదు. ఈసారి ఎలాగైనా ఆయన్ని చూడాలనే ఆలోచనతోనే వచ్చాను.


"ఏం బాబు. ఎక్కడున్నావ్, ఏం చేస్తున్నావ్?" మాష్టారు మాటలకి ఒక్కసారి లోకంలోకి వచ్చాను.


"నేను ఢిల్లీలో ఉంటున్నాను మాష్టారు! అక్కడే మాష్టారుగా పనిచేస్తున్నాను. "


"ఓ అలాగా. చాలా సంతోషం బాబు! పిల్లలు ఏం చదువుతున్నారు "


"ఇద్దరు పిల్లలు. అక్కడ చదువులు బాగాలేక ఇక్కడే చదివిస్తున్నాను. మన అయ్య కోనేరు గట్టు మీద ఉన్న అరటిచెట్ల బడిలోనే చదువుతున్నారు!"
మాష్టారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.


"అరటి చెట్ల బడిలోనా?"


"అవును మాష్టారు! నేను అక్కడే చదువుకున్నాను. చదువుతో పాటు సంస్కారం వచ్చింది. అది కూడా బడే కదా సార్"


"అవుననుకో! కాని ఈ తరం వాళ్ళ భాషలో అది దుంపల బడి! దాని అర్ధం నాక్కుడా తెలియదు. కాని ఎందుకో అందరికి ఈ బడులంటే చిన్న చూపే!."
"నిజమే మాష్టారు! కాని అలాంటి స్కూళ్ళల్లో శ్రద్ధగా చదువు చెప్తారు. చదువుతో పాటు నడవడిక, మంచి చెడ్డ.‌. అన్ని తెలుస్తాయి. అంతకు మించి, మంచి బాల్యం లభిస్తుంది! అందుకే నా నిర్ణయాన్ని మా ఇంట్లో అందరు వ్యతిరేకించినా సరే, నేను మార్చు కోలేదు. వాళ్ళ పునాది, భవిష్యత్తు బాగుండాలనీ ఆ బడి లోనే చేర్పించాను!. "


"భేష్ !! చాలా మంచి పని చేసావు. అలాంటి చోట పిల్లలకి ప్రపంచం తెలుస్తుంది. మనుషుల మధ్య ఉండవలసిన అనుబంధాలు అలవడతాయి! అంతకు మించి.. పేద, గొప్ప, కులం, మతం వంటి విషయాలు బుర్రలో నాటుకోవు! అందరు కలసి మెలిసి పెరుగుతారు! వాళ్ళ మధ్య బంధలు ఏర్పడతాయి! అందుకే నీ నిర్ణయన్ని నేను పూర్తిగా సమర్ధిస్తాను! అంటే నేను అక్కడ పని చేసాను కాబట్టి ఆ స్కూలంటే అభిమానంతో అనటం లేదు. ఆ స్కూలే కాదు, అలాంటి ఏ స్కూల్లో నువ్వు మీ పిల్లల్ని చదివించినా, నేను అభినందిస్తాను! స్కూలు పేరు చెపితే , చదువు రాదు! ఉపాధ్యాయులు చెపితే వస్తుంది!"
అలా కాస్సేపు ఆ స్కూలు విషయాల మీద మా సంభాషణలు సాగాయి.


"అన్నట్టు... మాష్టారు మీ పిల్లలు..." అంటూ అడిగాను.


"ఏవుంది. నీలా ఆరోజుల్లో నేను అలోచించలేదు. ఉన్న దాంట్లో వాళ్ళని కాన్వెంటు స్కూళ్లలో చదివించాను! ఒకడు అమెరికాలో, ఇంకోకడు బెంగుళూరులో, అమ్మాయి బొంబాయిలో ఉన్నారు! ఇక్కడ ఒంటరిగా ఎందుకూ, అక్కడికి వచ్చి ఉండ మంటారు! కాని పుట్టి పెరిగిన ఊరు, వదలాలని లేదు. అప్పటికీ, వాళ్ళు పట్టుపడుతుంటే, అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉంటాం! అదేమిటో.. అక్కడ ఉన్నన్నాళ్ళు మందులు, మాకులు వాడాలి! ఆశ్చర్యంగా ఇక్కడ ఉండే రోజుల్లో వాటి అవసరం ఉండదనుకో!" మాష్టారు నవ్వుతూ అన్నారు.


"నిజమే మాష్టారు! నాక్కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది! పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు సంపాదించి, మనసులకు, మనుషులకు దూరంగా వెళ్ళి పొయానని! అందుకే నేను కోల్పోయిన జీవితాన్ని పిల్లలకి అందించాలనే తాపత్రయంతోనే వాళ్ళని ఇక్కడ పెట్టేను!"


"చాలా మంచి పని చేశావు! జననీ జన్మ భూమిశ్చ.. స్వర్గాదపి గరీయసి.. అన్నట్లు ఎవరికైనా సరే పుట్టిన ఊరు స్వర్గంలా ఉంటుంది! నన్ను చూడు. ఇప్పుడు ఈ వయస్సులో పిల్లల దగ్గరకి వెళ్లి ఉండొచ్చు. బాగా చూసుకుంటారు! కాని ఏదో వెలితిగా ఉంటుంది. ఇది నాది అనే భావన అక్కడ ఇంట్లోనూ ఉండదు, బయటా ఉండదు! అందుకే అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వెళ్ళి వస్తూంటాం!" మాష్టారు మాటలు వింటుంటే స్కూల్లో పాఠాలు చెప్తున్నట్టే ఉంది. ఎప్పటినుంచో అడగాలనుకున్న విషయం జ్ఞాపకం వచ్చింది, ఆ విషయమే అడిగాను.


“మాష్టారు! చాలా రోజులబట్టి ఓ సంశయం ఉండిపోయింది! మీరు ఏమి అనుకోకపోతే అడుగుతాను!”


“అదేమిటయ్యా... అలా మొహమాటం పడతావు! అడుగు!”


“మిమ్మల్ని చాలా మంది బాటసారి మాష్టారనే పిలుస్తారు కదా... ఆ పేరు ఎలా వచ్చింది?”


మాస్టారు ఒక్కసారిగా భళ్ళున నవ్వి అన్నారు “అవునయ్యా! ఆ పేరే ఇంటా, బయట కూడా అలవాటైపోయింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘బాటసారి’ సినిమా రిలీజ్ అయిన తేదీనే నేను కూడా ఈ ఉద్యోగం లో చేరాను! అదిగో... ఆ కాలేజీ కుర్రాళ్ళు అది తెలుసుకుని, నాకు ఆ పేరు పెట్టేసారు!”
“కాలేజీ కుర్రాళ్ళు...”


“అవునయ్యా.. ఆ రోజుల్లో కాలేజీ, ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు అన్న భేదాలులేవు! మాస్టారు అంటే ఏ స్కూల్లో పనిచేసిన గౌరవం ఉండేది! ఆ చనువుతోనే పేర్లు పెట్టేవారు!”


ఒక్కసారి నా కాలేజీ గుర్తుకొచ్చింది. కాంపస్ లో మాష్టారి ఎదురుగానే, సిగరెట్టు తాగుతూ, విచ్చలవిడిగా తిరిగే విద్యార్థులు కనపడ్డారు. ఓ నిమిషం అలోచించి, విషయం మార్చాలని అడిగాను. 


"మాష్టారు మరి మీకు కాలక్షేపం?"


"పుట్టి పెరిగిన ఊర్లో కాలక్షేపానికి కరువెంటీ! క్షణం తీరిక ఉండదు... దమ్మిడి ఆదాయం ఉండదు... అంటూ రోజు మా ఆవిడా సరదాగా దెప్పుతుంటుంది! నీలాంటివాళ్ళు వస్తుంటారు. వాళ్ళతో కాస్సేపు కబుర్లు! మా ఆవిడ ఏవో పుస్తకాలు, పేపర్లు చదివి వినిపిస్తుంది! తర్వాత కృష్ణా రామా అనుకునే సరికి రోజు గడిచి పోతుంది! ఇంతకీ నువ్వు అక్కడ ఏ స్కూల్లో పని చేస్తున్నావూ?"


"నేను డిల్లీ ఐఐటి లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను మాష్టారు! అంతా మీ పునాదే"


నా మాటలు వింటూనే మాష్టారు చాలా ఆనందపడి, ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి, నా చేయి పట్టుకోడానికి ప్రయత్నించారు. 


ఒక్కసారి షాకయ్యాను.


"మాష్టారు మీకూ..." నా మాటలు పూర్తికాకుండానే ఆయన అన్నారు.


"అవునయ్యా! వయస్సుతో పాటు చూపు పెరగలేదు. పూర్తిగా మందగించింది! అలాగని... ఇబ్బంది ఏమి లేదులే! నా పనులన్నిటినీ నేనే చేసుకుంటాను! నిర్భయంగా వీధి చివరి వరకు వెళ్ళొస్తుంటాను! ఇక్కడి ప్రతీ అణువు తెలిసినవాడ్ని... నాకేం భయం చెప్పు!"


ఆశ్చర్య పోవడం నా వంతైంది. మాష్టారికి కంటి చూపు పూర్తిగా లేదు. అప్పుడే నాకో అనుమానం వచ్చింది 'ఇంతకీ నన్ను మాష్టారు గుర్తు పట్టేరో..లేదో?' 
ఇంతవరకు జరిగిన సంభాషణలో ‘బాబు’ అనే సంబోధించారే గాని, పేరుపెట్టి పిలవలేదు. అడగలేదు. నిజమే.. ఆయనకి కొన్నివేలమంది శిష్యులు ఉంటారు. వాళ్ళందరి పేర్లు గుర్తుంచుకోవడం కష్టం. గుర్తు ఉన్నా.. చూడలేరు. కాబట్టి గొంతుక బట్టి పోల్చుకోవడం కష్టం !! అదే మాట అడిగాను
"మాష్టారు! ఇంతకీ నన్ను గుర్తు పట్టారా సార్?"


"అయ్యో ! ఎంత మాట.. గుర్తుపట్టకపోవటమేమిటీ? నువ్వూ కృపాకర్ కదూ. కృపాదానం గారబ్బాయివి!"


నాకు నోటంట మాటలు రాలేదు. అప్రయత్నంగా వంగి మాష్టారు కాళ్ళకి దండం పెడుతుంటే నా కన్నీళ్ళు ఆయన పాదాలు తాకాయి.


ఇది ఏడాదికోసారి తలచుకుని, కొలుచుకునే దినం కాదు. అనునిత్యం తలపు కొచ్చే మాష్టారి విజయం!

*****

 

bottom of page