top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

లవ్ చెయ్యండి సార్!

 

తమిళ మూలం : జయకాంతన్
తెలుగు అనువాదం : రంగన్ సుందరేశన్.

Rangan Sudareshan.jpg

జయకాంతన్ గారి తమిళ మూలకథ 1961 లో ఆనంద వికటన్ తమిళపత్రికలో తొలుత ముద్రితమైనది.

“ఏమండోయ్, మిమ్మల్నేఇలా రండి హోటల్ పక్కన రాగానే ఏదో ఆలోచనలో పడినట్టు ఇలాగా అలాగా చూస్తారేం? అవన్నీ నాకు తెలుసు మీరు తప్పకుండా లోపలికి రావాలి, మీకూ మరేం పని లేదుగా? ఆదివారం అని బాగా డ్రస్సు చేసుకొని బయలుదేరేరన్నమాట! ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తారని నాకు తెలుసులెండి! నన్ను అడగండి, చెప్తాను.

ఒరేయ్, ఎందుకురా ఎప్పుడూ ఆ రేడియో పక్కనే నిలబడతావ్? ఎందుకలా చూస్తావ్? ముందు ఆ టేబుల్ క్లీన్ చెయ్! అయిందా, ఇక అటు వెళ్ళు!

రండి సార్, ఆ రూములోకి వెళ్ళి కూర్చోండి ఏమిటి కావాలి? ఏమీ వద్దా? ఏం, ఎందుకు? సరే, కాఫీ మాత్రం ఒరే, నారాయణా, సార్ కి కాఫీ తీసుకురా, పంచదార తక్కువగా, స్ట్రాంగుగా  ఉండాలి ఎందుకు రేడియో గర్రుబుర్రుమని అరుస్తోంది? దాన్ని ముందు ముయ్!  

ఏమండీ, ఇదేం మ్యూజిక్, చెప్పండి? ఏమైనా మన కర్ణాటక సంగీతంకి ఈ డబ్బా కూత సాటి అవుతుందా? నేను చెప్పేది నిజం, కర్ణాటక సంగీతం గొప్ప మన ఊరులో ఉన్న మందమతులకి తెలీదు, అమెరికాలో దానికి మంచి పేరట వీడెక్కడ, కాఫీకి వెళ్ళాడు, ఇంకా రాడేం? సరే, మీకేం తొందర లేదని నాకు తెలుసు, ఐతే అందుకోసం వాడు ఆలస్యం చెయ్యవచ్చా? రేపు మీరే త్వరగా కాఫీ తాగాలని వచ్చారనుకోండి - అబ్బే, తొందర అంటే ఇక్కడకి ఎందుకు వస్తారు? అసలు వచ్చారనుకోండి, అప్పుడూ ఇలాగే చేస్తాడు! సత్యానికి కట్టుబడి మన పని మనం చెయ్యాలని ఎవరు ఈ కాలంలో ఉన్నారు చెప్పండి ఏమో, ఎవరికి తెలుసు?

ఆ రోజుల్లో - ఇప్పుడు నాకు అరవై నిండాయంటే మీరు నమ్మరు; మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం సరిపోతుందా, చెప్పండి! అంతా మనం చూసుకోవడంలో ఉంది సార్! అది చెడిపోకుండా మనం కాపాడాలి! నేనేం కసరత్తు చేస్తున్నానా? అదేం కాదు,  మనం మన పని మనస్పూర్తిగా చేసుకుంటే కసరత్తు ఎందుకు? ప్రకృతిలో మన శరీరం ఎటువంటి కొరతా లేకుండా లక్షణంగా ఉంటుందినా ఒళ్ళు ఇలా ఉందంటే ఏమిటి కారణం? నేను ఎటువంటి తప్పూ, తంటాలకి పోను; అకాల వేళలో భోజనం చెయ్యడం, నిద్రపోవడం నాకు చేతకాదు రాత్రి పదిగంటలవగానే మంచంమీద వాలుతాను, ఉదయం ఐదుగంటలు ఎప్పుడవుతుందా అని కాచుకొనివుంటానుఎంత చలి అయినా, వర్షం కురిసినా, చల్లనీళ్ళలోనే స్నానం చేస్తానుస్నానం తరువాత నుదుటమీద విభూది రాసుకుంటాను ఇవన్నీ మన పెద్దలు scientific గా ఆలోచించి చెప్పినవే! స్నానంలో జుత్తు తడిసిపోతుంది కదా? ఆ విభూది తలలోవున్న నీరంతా ఒక blotting  paper లాగ పీల్చేస్తుంది; ఆ విభూది మీద చందనం - ఒక గీటు గీయాలి వర్షం కురిసినా, పళ్ళు ఇలకరించినా మనం ఆ చలిని భరించగలం చలి మన శరీరంనుంచి పొట్టకి వెళ్తుంది కాని ఎప్పుడూ నా ఒళ్ళు మీద ఒక తువ్వాలు మాత్రమే కనబడుతుంది. నా తమ్ముడు నన్ను ఒక Glasco షర్టు వేసుకోమన్నాడు. మనకెందుకు అవన్నీ? ‘వొద్దు!’ అనేసాను ఆ రోజులనుంచీ చొక్కాయి వేయని ఒళ్ళు ఇది.

ముప్పై ఐదు సంవత్సరాలకు ముందు ఈ మెయిన్ రోడ్లో ఈ దుకాణం ఆరంభించినప్పుడు - అప్పుడు మా నాన్నగారు ఉండేవారు - అతని దగ్గర పనిచేసిన మనుషులగురించికదా నేను చెప్పదలచుకున్నాను? వాళ్ళకి యజమానుడు అంటే ఒక విశ్వాసం, ఉద్యోగం అంటే ఒక భక్తి ఉండేది ‘ఈ వ్యాపారం బాగా సాగుతేనే మన యజమానుడికి మంచిది, మనకీ మంచిది,’ అనే ఆలోచన ఉండేది సరేలేండి, మిఠాయి దుకాణంలో యజమానుడు, నౌకరులు అనే ప్రశ్నలు ఎందుకు సార్? అవన్నీ ఈ రోజుల్లోనే.

ఇవాళ ఉదయం రేడియోలో నేను వెంకటేశ సుప్రభాతం విన్నాను మరెవరు వింటారు? ఆ నారాయణన్ అస్తమానం - మంద బుద్ధి అంటే అదే - సిలోను స్టేషనే వింటాడు! నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలీదు, వాడు హిందీ పాటలు వింటాడట! “నువ్వు ఇక్కడ రావడం ఉద్యోగంకోసం, పాటలు వినడానికి కాదు!” అని నేను అడగ్గానే అదిరిపోయాడు నాకు కోపం రాదు, అలాగ వచ్చినా నేను శాంతంగా మాటాడతానుఐతే ఈ అబ్బాయిలు నా శాంతంనే కోపం అని అర్ధం చేసుకుంటారు నాకు తెలుసు ఇంకా కొన్నిరోజుల్లో నాకు వీళ్ళ యూనియన్ నుంచి ఒక నోటీసు పంపుతారు - ‘ప్రతీ హోటల్లో ఒక రేడియో తప్పకుండా ఉండాలి. లేకపోతే సమ్మె చేస్తాం,’ అని.

మరేం లేదు ఒక మాట వరుసకి చెప్తున్నాను, ఈ వీధి చివరన అంబికా లాడ్జ్ ఉందే, దాని యజమాని మా నాన్నగారి దగ్గర సర్వర్ గా  పని చేసినవాడేకదా? ఇప్పుడేగా అతనికి కారూ, బంగళా ఉన్నాయి? ఐతే అతనికి మా నాన్నగారంటే విశ్వాసం, కృతజ్ఞత ఉన్నాయి. అతని గల్లాపెట్టె పక్కన పూలదండ మధ్య ఉన్న ఫోటో మా నాన్నగారిదే! అటువంటి విశ్వాసం ఉంటే వాడికి మంచి భవిష్యత్తు ఉండదా మరి? అష్టలక్ష్మి ధారధారగా ఐశ్వర్యం పోయదూ? మనిషికి మంచి హృదయం ఉండాలి సార్! ఏమంటారు? నేను చెప్పేది బోధపడిందా?

అప్పుడేమో ఆ మణి మా నాన్నగారి ఎదుట “అన్నయ్యగారూ ” అని తలవంచుకొని నిలబడతాడు.

“ఏమిట్రా?” అని ఇతను అడుగుతారు.

ఎవరు, మా నాన్నగారు  “ఇంట్లో చీర కావాలని అది అడుగుతోంది ” అని మెల్లిగా భుజాలు తడుముకుంటూ అడుగుతాడు మణి.

“ఒరేయ్ నీ ఆవిడ అడిగిన తరువాతనే నువ్వు చీర కొనాలా? తప్పురా మీ ఆంటీ దుకాణంలో మంచి చీరలు వచ్చాయని రెండు సుంగడి చీరలు కొందినువ్వుకూడా నా ఖర్చులో రెండు కొను  వెళ్ళుఆ తరువాత నువ్వు పనికి రావచ్చు” అని వాడిని పంపేసిన తరువాతే మా నానాన్నగారు తక్కిన పనులు చూసుకుంటారు.

చూసారా? వీళ్ళలో యజమానుడు ఎవరు, నౌకరులు ఎవరు? ఈ రోజుల్లో వీధికి వీధికి సమత్వం, సోషలిజం అని కూతలు పెడుతున్నారే, అవన్నీ మనకి ఎప్పుడూ ఉండేవే కాని ఆ రోజుల్లో మనకి ఆ పదాలు తెలియవు, కాని ఈ రోజుల్లో వీళ్ళకి ఆ పదాలు మాత్రం తెలుసు - అర్ధాలు వదలేసారుయజమానుడు వలన నౌకరు చెడ్డాడు, నౌకరు వలన యజమానుడు చెడ్డాడు.

నా ఒళ్ళు మండుతోంది సార్! పని కావాలని బతిమాలుతూ దుకాణం ముందు నిలబడినవాడిమీద జాలిపడి ‘సరేలే’ అని మూడుపూట్లా భోజనం పెట్టి పది రూపాయలు జీతం ఇచ్చిన తరువాత ఒక నెలలో ఈ ‘యజమానుడు నా మొదటి విరోధి!’ అని కేకలు పెడుతున్నాడుఅలాంటివాళ్ళు యూనియన్ లో చేరి, జండాలు పట్టుకొని, పాలిటిక్స్ మాటాడుతున్నారు ఉద్యోగమూ, మూడు పూట్ల భోజనం ఇచ్చిన యజమానుడిని ద్వంసం చెయ్యాలని ఎగురుతున్నారు ఐతే, వాళ్ళని మాత్రం తప్పుపట్టవచ్చా? ఈ రోజుల్లో యజమానుడికికూడా “వీళ్ళందరూ మనదగ్గర పనిచేసే మనుషులేకదా?” అనే భావనా, ప్రేమ పోయాయి.

అరేరే కాఫీ తెచ్చి టేబులుమీద పెట్టి నారాయణ వెళ్ళిపోయాడు కాబోలు, మాటల సందడిలో నేనది గుర్తించలేదు ఇప్పుడు నాకే మజా మీకూ బోర్ కొట్టుతోంది నాకు తెలుసు, ‘కాదు’ అని అనకండి ఇవాళ నా దగ్గర మీరు బాగా చిక్కుకున్నారు ఒరే, నారాయణా, కాఫీకి కొంచెం డికాషన్ తీసుకురా నారాయణకి నామీద కోపం, నేను రేడియో మూడమన్నానని పని చేసినప్పుడు రేడియో ఎందుకు, చెప్పండి.

అదేమిటండీ, నేను ఏమేమో చెప్తున్నాను, మీరు కిటికీ బయట ఏదో చూసి ఆనందిస్తున్నారు?  అదే మీరు వచ్చినప్పుడే నేను చెప్పానుగా? నాకంతా తెలుసు మీరు కిటికీ ద్వారా ఆ రోడు చూసారు ఆ బస్ స్టాండులో నిలబడేది ఎవరు? అదంతా నాకు తెలుసులేండి ఐతే అందులో తప్పేం లేదు ఒక వయసులో ఇది అందరూ చేసేదే !

మీకెందుకు మొహమాటం? మీరెందుకు సిగ్గుపడాలి? నేను చెప్పేది వినండిఇటువంటి ఆలోచనలకీ, కోరికలకీ, గురి అవని మనుషులు ఎవరూ లేరుఇందులో తప్పేం ఉంది? ఐతే దానికి ఒక లిమిట్ ఉండాలిమనం ఎవరు? మన బాధ్యత ఏమిటి? మనం నిలబడేది ఎక్కడ? భూమి పైనే కదా? భారత భూమి అని విన్నాంకదా, దానిగురించి కొంచెం ఆలోచించాలిమన చుట్టుపక్కలా నిబడేది ఎవరు? ‘వాళ్ళు Indians, Americans కాదు!’ అని జ్ఞాపకం ఉంచుకోవాలిLove అనేది అందరికీ సమానంగా వర్తించే గుణంకాని ప్రతీమనిషికీ అది వేరే వేరే విధంగా ఉంటుందిమీరు విన్నారుగా, It’s after all love!’ అనే వచనం! అలాగ లైట్ గా తీసుకోవాలి నేను కూడా ఒకప్పుడు ఇవన్నీ చేసాను కాని కళ్ళతో చూడడం, మనసులో తలచుకోడం, అంతే Love అంటే అంతే,  అది మించితే life లో భరించడం కష్టం ‘ఈ love మన మనసులో మాత్రం ఉన్నంతవరకూ ఎవరూ భయపడవద్దు, సిగ్గపడవద్దు’ అని అంటున్నాను: ఎందుకంటే ఈ లోకం love మయం.

ఈ ప్రపంచంలో love చెయ్యని ప్రాణి ఉందా? మనిషి మాత్రం చెయ్యకూడదా? అన్ని యుగాల్లోనీ love ఉందినేను అడుగుతాను: love గురించి గొప్పగా పెద్ద కబుర్లు చెప్తున్నారే, కాని ఇవాళా, రేపూ  love అంటే మీకేం తెలుసు? love అంటే ఏమీ తెలియదు, life అంటే ఏమీ తెలియదు! Love  కోసం life పాడుచేసుకుంటున్నారు! Love కోసం life వ్యర్ధమవుతే అదేం love? కొంచెం ఆలోచించండి.

మన సీతా, రాములవారు చెయ్యని లవ్వా? మన పురాణాల్లో చదివిన వళ్ళీ, సుభ్రహ్మణ్య స్వామి చెయ్యని లవ్ మన మానవుడు చెయ్యగలడా? వాళ్ళు ఒక వయసు, అదను చూసి లవ్ చేసారుఅంతకు మించి వాళ్ళు ఈ భూమికి వచ్చిన పని గొప్ప! ఆ పనికూడా తీవ్రంగా చేసారు; ఆ బాధ్యత వాళ్ళు మరిచిపోలేదు శ్రీరాములవారి, సుభ్రహ్మణ్య స్వాములవారి కీర్తి లవ్ చెయ్యడం వలన కాదుఐతే, ఈ రోజుల్లో వెధవలకి లవ్ మాత్రం లక్ష్యం ఐపోయిందిఅందుకోసం ప్రాణంకూడా త్యాగం చేస్తామని చాటించుతారు ఇదేం వక్రబుద్ధి, చెప్పండి.

లవ్ చెయ్యండి నేను వద్దననను కాని ఒక లిమిట్లో అంతే.

రోడ్డులో, ఇంటి వసారాలో, పొలాల్లో, జరిగేవన్నీ - ఒక ముసలమ్మలాగ - తప్పు అని నేనననుకాని ‘లవ్’ అంటే ‘లవ్’ మాత్రం కాదని తెలుసుకోవాలిసినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారని అంటున్నారునేను ఒప్పుకోను‘లవ్’ చేసేవారే జతలు జతలుగా ‘లవ్’ సీనులు ఉన్న సినిమాలకి వెళ్తున్నారుఐనా, సినిమాలో వచ్చే లవ్ సీనులు చూడడానికి వీళ్ళకేం టైముంది? వీళ్లు చేసే చేష్టలు చూసే ఆ తెర మీద సినిమా చెడింది సినిమా అంటే అది life లోని reflection కదా?

ఇంకొక మాట - బాగా ఆలోచించవలసిన సంగతి ఇప్పుడు మీరున్నారు, మీరు bachelor బ్రహ్మచారి   మీరు బాగా, సొగసుగా, డ్రస్ చేసుకొని రోడ్డులో   నడుస్తుంటే కన్నులున్నవారు మిమ్మల్ని చూస్తారు వాళ్ళు చిరునవ్వు నవ్వితే మీరుకూడా ఒక చిరునవ్వు నవ్వుతారు మీరు మాట్లాడితే వాళ్ళుకూడా మాటాడుతారు అందులో  ఒక సంతోషమూ, ఒక తృప్తి అదే కదా లవ్ అంటే?

మీ గ్రామంలో ఉన్నారే - ఇద్దరు ముసలి జీవులు - అవును సార్, మీ అమ్మా, నాన్నా - మిమ్మల్ని కన్నవాళ్ళు మీరు మాట్లాడితే మాటలాడి, నవ్వుతే నవ్వి, ఆనందించేవారు; మీబాల్యంలోనే మీగరించి కలలు కన్నవారు; మిమ్మల్ని చదివించి, పట్ణంలో ఉద్యోగం చేసే అబ్బాయి ఉరికి రాగానే ఒక పెళ్ళి చేసిన తరువాత హాయిగా కన్ను మూయాలని పగలూ, రాత్రీ తాపత్రయపడుతున్నారే, వాళ్ళకి మీమీద ఉండే బాధ్యతకి ఏమిటి పేరు? అది ‘లవ్’ కాదంటే ఈ ప్రపంచంలో మరే కర్మంకి ‘లవ్’ అని పేరు?

మీకొక మాట చెప్తాను, వినండి. మిమ్మల్ని కన్నవాళ్ళనీ, వాళ్ళకి మీమీదున్న ప్రేమని జ్ఞాపకం ఉంచుకొని మీరు మీ ప్రేమలో దూకండి. వాళ్ళ మనసుని నలిపేసి మీరు ఎవరితోనో పారిపోతే మీకు ఈ జన్మలో ముక్తి దొరకదు అవును, ఇప్పుడొక ఆడదాన్ని చూసి, ప్రేమలో పడి, మిమ్మల్ని పెంచిన పాలుకీ, రక్తానికీ, ద్రోహం చేసి వాళ్ళ కడుపు మండుతుంటే ‘ఇప్పుడు కనిపించిన ఈ ప్రేమ గొప్ప!’ అని పురిగొల్పే ఆ ప్రేమకి ఏమైనా అర్ధం ఉందా?

అవును సార్, నేను ఏడుస్తున్నాను. మీ దగ్గర ఎందుకు దాచాలి? మంచివేళ, రూములో ఎవరూ లేరు ‘నాకేం విచారం లేదు, నేను సంతోషంగానే ఉన్నాను’ అని టూకీగా చెప్పడానికే మీతో ఇలాగ మాటాడుతున్నాను. దేవుడి దయవలన నాకేం కొరతా లేదు కాని ఉవాళ ఉదయంనుంచి నా మనసు బాగా లేదు. 

ఉదయం లేవగానే ఈ రోజు దీని జన్మ నక్షత్రం అనే తలంపుతో ఈ ఫోటోను తీసిపెట్టాను చూసేరా, ఇది? ముప్పై సంవత్సరాలముందు తీసినది దానికప్పుడు నాలుగేళ్ళు దాన్ని మోసుకొని నిలబడ్డాను, అదే మా అమ్మాయి కళ్యాణి  మీకు తెలియదు మీరు ఈ మెయిన్ రోడుకి వచ్చి ఒక సంవత్సరం కదా అయింది? ఇది పది సంవత్సరాలముందు మీకు ఎవరైనా చెప్పివుంటారు, కాని పది సంవత్సరాల తరువాత ఎవరికి గుర్తు ఉంటుంది, చెప్పండి ఊరులో దీనికంటే ఎన్ని చోద్యమైన కబుర్లు ఉన్నాయో? ఊరులోని మనుషులు మరిచిపోవచ్చు, నేను మరవగలనా?

కళ్యాణి తరువాత నాకు పిల్లలు పుట్టలేదు మా నాన్నగారి ఆస్తిని నేనూ, నా తమ్ముడూ పంచుకున్నాం  అందులో ఒక చిన్న తగవు తమ్ముడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు ‘కొడుకు లేకపోతేనేం, కూతురు ఉందికదా? దేవుడి దయ ఉంటే కొడుకు పుట్టనీ, లేకపోతే ఈ అమ్మాయే చాలు!’ అని అనుకున్నానుఒక కాన్వెంట్లో దాన్ని చదిపించాను, సార్! సరే, మన చేతిలో ఏముంది? అంతా మన కర్మ!

ఇదిగో, ఇలా చూడండి ఆ కిటికీకి తిన్నగా ఒక రేడియో షాపు కనిపిస్తోంతే - అక్కడ ఒక సాయబు దర్జీ దుకాణం ఉండేదిఅక్కడ పనిచేసేవాడు ఒక నాయుడు అబ్బాయి  చాలా మంచివాడులాగ కనిపించాడు ఎందుకలా అంటాను? వాడు మంచివాడే! మన కర్మకి తక్కినవాళ్ళని తప్పుపట్టవచ్చా? వాడు అప్పుడప్పుడు హోటలుకి వస్తాడు, మా ఇంటికి కూడా - అమ్మాయికి రవికలు కుట్టాలని  కొలతలు తీసుకొని వెళ్ళేవాడుఅదికూడా నెలకి నూరు రూపాయలకి బట్టలు కొనేది‘సరే, మన అమ్మాయే కదా, బాగా అనుభవించనీ!’ అని ఊరుకున్నానుఆ తరువాతే అసలు సంగతి బోధపడింది.

దాని పెళ్ళికోసం ఇరవై వేల రూపాయలు బాంకులో పొదుపు చేసానునాకు మెయిన్ రోడులో మూడు దుకాణాలు ఉన్నాయి, అద్దె వస్తోంది ఊరులో భూములు ఉన్నాయి, ధాన్యం వస్తోంది ఇవన్నీ ఎందుకు? నన్ను పాతి తగలబెట్టడానికా? నా వంశాన్నే కాల్చేసి మా అమ్మాయి ఆ నాయుడు అబ్బాయితో కట్టుకున్న చీరతో రహస్యంగా లేచిపోయింది.

నా మనసు రాతిలాగ గట్టిపడిపోయిందిమీకు నా వయసు వస్తేనే  కఠిన హృదయంతో ఈ ముసలాడు పడిన తాపం అర్ధమవుతుంది

ఎక్కడెక్కడో వెతికాను పిచ్చివాడులాగ ఐపోయాను అవును, నేను బాగా మారిపోయాను నా తమ్ముడు పరుగెత్తుకొని వచ్చాడు, కొడుకులాగ నాకు ఆశ్రయం ఇచ్చాడు  ఐనా,  వాడు నేను కన్న బిడ్డ కాదుకదా? అదేమిటో, వాడికి పెళ్ళై పదిసంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు.

రెండు సంవత్సరాల తరువాత ఆ దర్జీ - ఆ సాయబు - వచ్చి నాకు చెప్పాడు - మా అమ్మాయీ, ఆ నాయుడు అబ్బాయీ బెజవాడలో ఉన్నారనిఆ సాయబుని ఈడ్చుకొని, ఎవరికీ చెప్పకుండా, నేను రైలెక్కేను.

వెళ్లి చూస్తే,  దేవుడా, ఈ లోకంలో ఏ తండ్రికీ అటువంటి అవస్థ రాకూడదు! చెత్త, మురికిదుర్వాసన నిండిన ఒక సంధులో, పదిపదహేను కుటుంబాలు ఉండే ఒక శిథిలమైన కొంపలో  ఇల్లు అంటే ఒక గది మాత్రమే తలుపు కూడా లేదు, ఒక గోనె తెర, అంతే ఇంటి బయట కూర్చొని ఎవరెవరో పేకాట ఆడుతున్నారు ఒకటే చుట్టల పొగ వాళ్ళ వృత్తి బీడీలు చుట్టడం.

ఒక లక్షాధిపతి మనవడు ఒళ్ళంతా మట్టితో వెక్కి వెక్కి ఏడుస్తూ నేలమీదున్న మొక్కజొన్న గింజలని తీసుకొని తింటున్నాడుఒక మూల, ఒక గంపలో బీడీల పౌడరు, చుట్టిన బీడీలు కనిపించాయి - అదే side business కాబోలు! నా సీమంత పుత్రి - ఏక పుత్రి కళ్యాణి - నిండు గర్భవతిగా - తన శరీరాన్ని కూడా  కప్పుకోలేని అవస్థలో ఒక గుడ్డపేకలితో - ఆకలివలనో లేక ఆయాసంవలనో -నిద్రపోతోంది. 

నేను భరించలేను సార్! ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ దృశ్యం నేను భరించలేను. 

ఆఖరికి “నన్ను క్షమించండి!” అని కళ్యాణి నా కాలు పట్టుకుందినేను వెంటనే వెనకాడానుదాన్ని తాకడానికి కూడా నాకు మనసు రాలేదునాతో వచ్చిన సాయబుని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చానుదాన్ని చూస్తే ఇంకా ఏడవాలనిపించిందిఆ పసిపిల్లవాడుకూడా తన కళ్ళతో నన్ను తనపక్కన లాగుతున్నాడు.

ఆ తరువాత నాయుడు అబ్బాయి వచ్చాడు. పాపం, వాడేం చేస్తాడు, చెప్పండి? రోజుకి వచ్చే జీతం ఒక రూపాయో లేక రెండు రూపాయలో? నాకు బాధగా ఉంది, కాని వాళ్ళిద్దరూ సంతోషంగానే కనిపించారు  అమ్మాయి నా బతుకులో మన్ను పోసేసింది  వాడు నా ఎదుట తల వంచుకొని నిలబడ్డాడు. నాకు వాడిని చూస్తే జాలిగా ఉంది‘అబ్బాయి మంచివాడు, బుద్ధిశాలి’ అని అనిపించింది.

“ఎది ఏమైనా సరే, ఇప్పుడు నువ్వు నా అల్లుడువి, నేను నీ మామగారుని. ఈ లోకం దాన్ని ఒప్పుకోదు, కాని మనం ఒప్పుకున్నట్టే  ఇదిగో, ఇక్కడ నిద్రపోతోందే నీ ‘లవ్’ లేక నీ పెళ్లాం మీ బాషలో ఏమంటారో? దీని పెళ్ళికి నేను ఇరవై వేలు రూపాయలు తీసిపెట్టాను, అది నాకు వద్దు! ఊరికి వెళ్ళగానే నీకు ఆ సొమ్ము పంపిస్తాను. మీరు నాకు తెలియని ఏదో జాగాకి వెళ్ళిపోండి. నువ్వు నాలుగైదు మెషిన్లు కొనుక్కొని మంచి వ్యాపారం చెయ్,  మీరు బాగా ఉండండి!” అని చెప్పి, నా మొహంమీద తువ్వాలు కప్పుకొని వచ్చేసాను.

బయటకి రాగానే “నాన్నగారూ ” అని ఎవరో పిలిచారు. వీధిలో పోయేవాడెవడో నన్ను తిరిగిచూసాడు నేను వచ్చేసాను.

నా ప్రేమ వలన వాళ్ళ జీవితం పాడవకూడదని వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేసాను. వాళ్ళు ఎక్కడో హాయిగా ఉన్నారని నా నమ్మకం.  మీరేమంటారు? ఆ అయ్యప్ప స్వామి దయ వలన వాళ్ళు బాగా ఉంటారా సార్? ఇవాళ దాని జన్మ నక్షత్రం.  ఇప్పుడు నాకేం విచారం లేదు. ఆ తరువాత మా తమ్ముడికి ఒక పిల్లవాడు పుట్టాడు. మంచి అబ్బాయి, ఆరేళ్ళు నిండాయి నాకుండేది వాడొక్కడే. అదిగో, చూడండి పరుగెత్తుకొని వస్తున్నాడు. ఒరే బాబులు, ఎందుకురా తొందర?

 

పెద్దనాన్నగారిని ఎవరూ ఈడ్చుకొని పోలేదు, నేనిక్కడే ఉన్నాను వెళ్లు, ఆ మేజామీద ఎక్కి కూర్చో! నీకు చేతకాదా, నేను వస్తానులే కూర్చొని వ్యాపారం చెయ్.

ఈ అంకుల్  కాఫీ మాత్రం తాగారు, దానికేం డబ్బు అడగవద్దు వీధిలో వెళ్ళే మనిషిని నేనే పిలిచాను కాని చాలా సేపైంది, రూమ్ అద్దె అడుగు.. 

 

“రూమ్ అద్దె ఇవ్వండి, అంకుల్!”

“చూసారా సార్? అబ్బాయి ఎలాగ? ఒరే బాబులూ, నువ్వు ‘లవ్’ చేస్తావా?

“ఓ, బాగా ‘లవ్’ చేస్తాను!”

“ఎవరిని ‘లవ్’ చేస్తావని అంకుల్ కి చెప్పు!”

“నాన్నగారినీ, అమ్మనీ, పెద్దనాన్నగారినీ, అంకుల్నీ - అందరినీ లవ్ చేస్తాను!”

“మంచిది. మరెవరినైనా లవ్ చేసావంటే చెప్పి చెయ్. ఏమిటి సార్, మీ కళ్ళు తడిగా మారిపోయాయి? ఇవన్నీ life లో ఎప్పుడూ జరిగేవే లోకమంటే ఎలా ఉందో చూడండి ‘లవ్’ లో ఎన్ని రకాలున్నాయి! ఇదంతా మనసులో పెట్టుకొని బాగా లవ్ చెయ్యండి. సరే, ఆ బస్ స్టాండ్ కి వెళ్ళి నిలబడండి బాబులూ, అంకుల్ కి నమస్తే చెప్పు!”

 

*****

bottom of page