top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అర్చన ఫైన్ ఆర్ట్స్ రచనల పోటీలు

క్షత్రి

laxmi pala.jpg

లక్ష్మీ పాల

అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ

“లేదు... లేదు... నేను అమ్మకి మందులు కొనాలి. నాన్నగారిని ఈవెనింగ్ వాక్ కి బయటకి తీసుకెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తమ్ముడూ, చెల్లి స్కూల్ నుండి వచ్చేసి ఉంటారు. ఇంకా లేట్ అయితే, నాన్నమ్మ ఫుల్ గా తిట్టేస్తుంది. మనం తరువాత కలుద్దాం ప్రియా ప్లీజ్...!” చెప్పి, సారూప్ వైపు తిరిగి “క్షమించండి సారూప్ దయచేసి ఏమీ అనుకోవద్దు. మళ్ళీ కలుద్దాం.” ఖాళీ అయిన కాఫీ కప్పు టేబిల్ పై పెట్టి, బ్యాగ్ తీసుకుని వడివడిగా బయటకు వెళ్ళిపోయింది క్షత్రి. తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు ప్రియంవద, సారూప్.

“తనకి ఇంట్రస్ట్ లేదేమో ప్రియా...తనని బలంవంత పెట్టకు...ఓకే... నేను కూడా బయల్దేరతాను బై” అన్నాడు సారూప్ తనూ పైకి లేస్తూ...! ఆశాభంగంతో, అవమానభారంతో అతని ముఖం కళ తప్పడం చూసి నొచ్చుకుంది ప్రియంవద. క్షత్రి ఇలా చేస్తుందని ఊహించలేదు. తమ ఆఫీస్ లో తమతో పాటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సారూప్ క్షత్రిని చాలా ఇష్టపడ్డాడు. చాలారోజులుగా తన ప్రేమను ఆమెకు తెలియజేయమని బ్రతిమాలుతుంటే కాదనలేక, క్షత్రికి తెలియకుండా... ఇలా కాఫీషాప్ లో వాళ్ళిద్దరూ కలుసుకునే ఏర్పాటు చేసింది. కానీ, అది ఇలా ప్లాప్ అవుతుందని అనుకోలేదు. క్షత్రిమీద విపరీతమైన కోపం వచ్చింది ప్రియంవదకు. 

ఇరవైఎనిమిదేళ్ళ వయసున్న క్షత్రికి అసలు వివాహం పట్ల ఈ విముఖత ఏమిటో ఇప్పటికీ అర్దం కాలేదు. చూస్తూ ఉండిపోవాలనే అందం క్షత్రిది. ఎత్తుకు తగిన లావు, చక్కని మేని ఛాయ, పొడుగు జడ, ఎప్పుడూ ఛుడీదార్ లేదా లైట్ కలర్ కాటన్ చీరలలో పొందిగ్గా, నిండుగా కనబడుతుంది. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలను చూడటం అరుదు అనిపించేలా హుందాగా ప్రవర్తిస్తుంటుంది. ఉన్నతమైన చదువు, అయిదంకెలలో జీతం, తండ్రి ఆర్జించి పెట్టిన డబ్బుతో కొనుక్కున్న స్వంత ఇల్లు... అన్నివిధాల మంచి పొజిషన్ లో ఉంది తను. ఇక మిగిలింది వివాహం ఒక్కటే...! కానీ, ఎప్పుడూ ఆ ఆలోచనే లేనట్లుగా ప్రవర్తిస్తుంటుంది. ఎప్పుడయినా ఆ టాపిక్ గురించి మాట్లాడితే, అనాసక్తిగా మాట దాటేస్తుంది. ఇంకా ఎన్నాళ్ళిలా పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతుంది...? 

పోనీ ఎవరినైనా ప్రేమిస్తోందా అంటే... అదీ లేదు. ఎప్పుడు చూడూ... అమ్మా,నాన్న, బామ్మ, తమ్ముడు, చెల్లి అంటూ... వారి బాగోగుల గురించే మాట్లాడుతుంది. ప్రతిక్షణం వారి గురించే ఆలోచిస్తూ, వారి కోసమె కష్టపడుతూ అనుభవించాల్సిన వయసంతా వృధా చేసుకుంటోంది. ఏదో ఒకరోజు వాళ్ళ ఇంట్లో వారితో తనే ఈ విషయాన్ని గురించి మాట్లాడాలి. టేబిల్ పైని తన హేండ్ బ్యాగ్ తీసుకుని తను కూడా కాఫీషాప్ నుండి బయటకు వచ్చేసింది ప్రియంవద.

**

డోర్ తీసుకుని ఇంట్లోకి వస్తూనే నానా హడావుడి చేసేసింది క్షత్రి.

“అమ్మా... నీకు మందులొచ్చేసాయి.” తల్లి అరుంధతి కోసం తెచ్చిన మందుల కవర్ టేబిల్ పై పెట్టింది. 

“నాన్నగారూ... రెడీగా ఉన్నారా...? స్నానం చేసి ఓ రెండు నిమిషాల్లో వచ్చేస్తాను. బయటకి వెళదాం.” వరండాలో వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న నాన్న ఆనందరావు కి హుకుం జారీచేసింది. 

“ఒసే ముసలి శబరి... ఇంక సణక్కు... రోజూలాగే ఈరోజు కూడా నేను త్వరగానే ఇంటికి వచ్చేసాను.” పూజగదినుండి బయటకు వస్తున్న బామ్మ సావిత్రమ్మ బుగ్గలు పట్టి సాగదీస్తూ చెప్పింది.

 “మధూ,... వినయ్... ట్యూషన్ కి బయలుదేరారా...? టైమవుతుంది బ్యాగులు తీసుకుని బయలుదేరండి...” తొందర చేసింది తను బాత్రూమ్ లో దూరుతూ.  

రాత్రి భోజనాల టేబిల్ దగ్గర చెప్పింది. ఈరోజు సారూప్ ప్రపోజ్ చేయాలనుకున్న విషయాన్ని.

“నువ్వేం చెప్పావు...?” ఆనందరావు అడిగాడు.

 

“నేనా...?” నవ్వింది. “అసలా అవకాశమే ఇవ్వలేదతనికి. నేను బిజీ అని చెప్పి తప్పించుకుని పారిపోయి వచ్చేసాను” గలగలా నవ్వింది. 

తల్లి అరుంధతి నొచ్చుకుంది. “అంటే... నువ్వింక పెళ్ళే చేసుకోవా...? నీ ఈడు వాళ్లందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కంటూ ఉంటే... నువ్విలా ఎన్నాళ్ళుంటావు..? ఇప్పటికే పెళ్ళీడు దాటిపోయింది. ఆపైన చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు...? ఏ పెళ్ళాం చచ్చిపోయినవాడో, లేదా పెళ్ళాం లేచిపోయినవాడో తప్ప” కోపంగా అంది.

 క్షత్రి నవ్వింది. “ఏం వాడు మాత్రం మనిషికాదా...? రానివ్వు. అలాంటివాడినే చేసుకుంటాను.” 

 ఆ మాటలకు అరుంధతి ఏదో అనబోతుంటే... ఆనందరావు అడ్డుకుంటూ క్షత్రిని అడిగాడు. 

“క్షత్రి... అసలు పెళ్ళిపట్ల నీ అభిప్రాయం ఏమిటమ్మా...? మా కోసం, మమ్మల్ని పోషించడం కోసమేనా పెళ్ళికి దూరంగా ఉంటున్నావు? చదువు, ఉద్యోగం అంటూ ఇప్పటికే చాలా ఆలస్యం చేసావు. మేమూ కాదనలేకపోయాము. ఇప్పుడు అడిగితే... పెళ్ళి పట్ల సుముఖంగా లేవు. ఇంకా ఎంతకాలం...? ఈ రోజు మేమున్నాము. మేము కాలం చేసాక...నీ పెళ్ళి గురించి, నీ గురించి ఎవరు పట్టించుకుంటారు...?” 

క్షత్రి కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయింది. 

“ఒక వ్యక్తికి భార్య పాత్రను పోషించవలసిన సమయం నాకింకా రాలేదేమో నాన్నగారూ. మీ ఇద్దరి ముద్దుల కూతురిగా, నానమ్మకు మనవరాలిగా, అదిగో ఆ తమ్ముడూ చెల్లెలికి అక్కగా... నా పాత్రను నేనింకా తృప్తిగా పోషించనేలేదు. మీ ఆత్మీయతను, ప్రేమానురాగాలను పూర్తిగా అనుభవించనేలేదు. అప్పుడే... మిమ్మల్నందరినీ వదిలి ఎవరికో భార్యగా వెళ్ళిపోవాలా...?”

అర్ధం కానట్లు చూసారు అరుంధతి, ఆనందరావులు. 

తియ్యగా నవ్వుతూ లేచి తను తిన్న కంచాన్ని తనే కడుక్కుని టేబిల్ పై బోర్లించి, తన గదిలోకి వెళ్ళి తలుపు మూసేసుకుంది. 

**

“అన్నయ్యా... నాకో సహాయం చేయాలిరా...!” లాన్ లో కూర్చుని లాపిలో ఏదో వర్క్ చేసుకుంటున్న పెదనాన్న కొడుకు ధర్మతేజ దగ్గరకు వెళ్ళి, పక్కనే ఉన్న చైర్ లాక్కుని కూర్చుంటూ అడిగింది ప్రియంవద.

“చెప్పు ప్రియా... అన్నయ్యగానా? సైకియాట్రిస్టు గానా...?” లాప్ టాప్ లోంచి తలెత్తి చూడకుండానే అడిగాడు.

“సైకియట్రిస్టుగానే....! నా ఫ్రెండ్  ఒక అమ్మాయి ఉంది. దానిని ఎలాగోలా నీ హాస్పిటల్ కి తీసుకొస్తాను. దాన్ని బెడ్ కి కట్టేసి, నీ హిప్నాటిజంతో దానిలో పెళ్ళంటే ఉన్న భయాన్ని తీసేయ్...!”

ధర్మతేజ నవ్వుతూ... “పెళ్ళంటే భయపడే అమ్మాయిలా...? అదీ ఈ రోజుల్లోనా...? నమ్మలేని విషయం...!” బుజాలెగరేసాడు. “అయినా... పెళ్ళి పట్ల ఉన్న భయానికి కారణాలేమిటో తెలుసుకుని, ఆ భయాన్ని కౌన్సిలింగ్ ద్వారా ఆమె మనసులోంచి తొలగించాలే గానీ, ఇలా హిప్నాటిజం ద్వారా... అభ్రకదబ్ర... అభ్రకదబ్ర అంటూ మెజీషియన్ లా చేతులు గాల్లో ఆడించి, ఆమెకు పెళ్ళి పట్ల లేని ఆసక్తిని కలిగించలేము. ఇంతకూ... ఎప్పుడైనా ఎందుకిలా అని ఆమెను అడిగావా...?”

“చాలాసార్లు అడిగాను అన్నయ్యా! దానికి... నా తల్లిదండ్రులతో, నా కుటుంబంతో కలిసి, నా జీవితాన్ని నేనింకా పూర్తిగా, సంతృప్తిగా అనుభవించనేలేదు. అప్పుడే వేరొకరితో జీవితమా...? అంటూ అదేదో ఆశ్చర్యకరమైన, విచిత్రమైన జవాబు చెప్పింది. ఇంత వయసొచ్చాక ఇంకా అమ్మానాన్నా... అంటూ వాళ్ళతోనే ఉండాలనడం ఏమిటో నాకేం అర్ధం కాలేదు.” చెప్పింది ప్రియ. 

 ధర్మతేజ చిత్రంగా చూసాడు. 

“ఇంట్రస్టింగ్...ఇంటిలో తనే పెద్దకూతురు అయి ఉంటుంది. అందరు ఆడవాళ్ళలా పెళ్ళి చేసుకుని వెళ్ళడం ఇష్టం లేక తన కుటుంబ బాధ్యతలను తనే మోయాలనుకుంటుందేమో...! మరి దీనికి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు...?” అడిగాడు.

“అసలు... ఎపుడైనా నన్ను వాళ్ళింటికి తీసుకెళితే కదా...! వాళ్ళ అమ్మానాన్నలను చూడడానికైనా, మాట్లాడడానికైనా...! ఈ జాబ్ లో చేరినదగ్గరనుండీ మేమిద్దరమూ స్నేహితురాళ్ళమే. కానీ, ఒక్కసారి కూడా... అది మా ఇంటికి రావడం కాని, నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళడం గానీ, జరగలేదు. ఇలాంటివి నాకు నచ్చవు అంటుంది. అందువలన నేను కూడా ఎప్పుడూ... దాని ఇంటికి వెళ్ళాలని అనుకోలేదు.”

 

“గొప్ప స్నేహితురాళ్ళే... ఈ సారి వాళ్ళింటికి వెళ్ళి, ఆమె తల్లిదండ్రులతో ఈ విషయం మాట్లాడు. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి, ఆ తరువాత... ఆమె గురించి ఆలోచిద్దాం...” చెప్పాడు ధర్మతేజ.

**

“ఇది ఒక రకమైన చిత్త బ్రాంతి. దీన్ని ఇంగ్లీష్ లో Hallucination అంటారు. మీ అబ్బాయికి నిజంగానే మీరెవరికి కనబడని మనుషులు కనబడుతున్నారని, మాట్లాడుతున్నారని మీరు భయపడుతున్నారు. సరే, కొన్ని టెస్టులు చేసి, మీ అబ్బాయిని కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంచుదాం. ఆ టెస్టులలో కూడా... మీ అబ్బాయి మానసిక స్థితి ఇలాగే ఉందంటే, ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం. లేదు, అన్ని రిపోర్టులు నార్మల్ గా ఉంటే, మీ వాడు ఎందుకో... అలా  నటిస్తున్నాడని అర్ధం.” తన టేబిల్ ఎదురుగా కూర్చుని ఉన్న పేషంటు తల్లిదండ్రులకు చెపుతున్నాడు. 

“నటిస్తున్నాడా... ఎందుకు...?” భార్యాభర్తలిద్దరూ అయోమయంగా ఒకరి ముఖాలను ఒకరు చూసుకున్నారు.

“అవును. మీరిద్దరూ ఉద్యోగస్థులు. ఉదయాన్నే లేచి, అబ్బాయిని స్కూల్ కి పంపి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. డబ్బులు సంపాదించుకోవాలనే నిరంతరమైన పరుగులో కన్నకొడుకుకు అందించాల్సిన ప్రేమ, ఆప్యాయతను అందించలేకపోతున్నారేమో... అందువలన మీ అబ్బాయి, ఇంట్లో ఉన్నపుడు మీరు తనతో ఉన్నట్లు ఊహించుకుని తనకు తానే మాట్లాడుకుంటున్నాడో... లేదా  ఇలాగైనా మీ దృష్టి తనపై పడటం కోసం, తన ఆరోగ్యస్థితి పట్ల మీరు ఆందోళన పడి, రోజూ... తనని అంటిపెట్టుకుని ఉండాలని అలా నటిస్తున్నాడేమో...! ఇది ఇలాగే కంటిన్యూ అయితే... అతడు క్రమక్రమంగా తను నటిస్తున్నదే వాస్తవమనే స్థాయికి చేరుకుంటాడు. చివరికి పిచ్చివాడైపోతాడు. ఓకే... మీరు వెళ్ళి నేను చెప్పిన సమయానికి మీ అబ్బాయిని తీసుకురండి...” చెప్పి పంపించాడు.

ఇంతలో... ప్రియంవద నుండి ఫోన్... 

“అన్నయ్యా...” ఆమె గొంతులో ఏదో ఆందోళన. “ఈ రోజు క్షత్రికి తెలియకుండా, వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడడానికి వాళ్ళ అపార్ట్ మెంట్ కి వెళ్ళాను. అక్కడ ...” జరిగిందంతా ఊపిరి పీల్చుకోకుండా గబగబా చెప్పింది ప్రియంవద. ఆమె చెప్పినదంతా విని, అతని భృకుటి ముడివడింది. ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు.

**

“మీకు నేను తెలియదు. కానీ, మిమ్మల్ని రోజూ చూస్తుంటాను. ఈ మధ్య మా చెల్లెలు ప్రియంవద చెపితే తెలిసింది. మీరు తన ఆఫీస్ లోనే పని చేస్తున్నారని. అక్కడికీ రెండు మూడు సార్లు మీ ఆఫీస్ కి వచ్చాను కూడా... మిమ్మల్ని చూడడానికి... !” 

కాఫీషాప్ లో క్షత్రి ఎదురుగా కూర్చుని ఉన్నాడు ధర్మతేజ. తనవంకే రెప్ప ఆర్పకుండా చూస్తూ... చెపుతున్న  అతని మాటలకు ఇబ్బందిగా కదులుతూ “అవునా...” అన్నట్లు బలవంతంగా నవ్వింది క్షత్రి. 

“మీరు మాట్లాడుతూ ఉండండి. నేను స్నాక్స్, కాఫీ తీసుకొస్తాను.” గబగబా లేచి కౌంటరు వైపు వెళ్ళింది ప్రియంవద. ఆమె ఉద్దేశ్యపూర్వకంగానే, తామిద్దరిని ఇక్కడ వదిలేసి వెళ్ళిందని క్షత్రికి అర్ధమైంది. 

ముళ్ళమీద కూర్చున్నట్లుగా ఇబ్బందిపడుతున్న క్షత్రిని చూసి చెప్పాడు. “మీరు ఇదివరకటికన్నా, ఈ రోజు చాలా అందంగా కనబడుతున్నారు. బహుశా... మీరు కట్టుకున్న ఈ పింక్ శారీ వల్లనేమో... చాలా లవ్లీగా ఉన్నారు.”

ఆ మాటలకు తలెత్తి అతనివైపు చాలా చురుగ్గా చూసింది. అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి.

 “బాగా కోపం వచ్చినట్లుందే...? మీ అందమైన కళ్ళు ఉరిమి చూస్తున్నాయి. అయినా... అందాన్ని ఆస్వాదించడం, మెచ్చుకోవడం నా హాబి...! ఉన్నమాట చెప్పాను. కోపం దేనికండీ...?” నవ్వుతూ అన్నాడు. ధర్మతేజ కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంటాడు. నవ్వితే, ఇంకా అందంగా కనబడుతున్నాడు. కానీ, అదేమీ క్షత్రికి పట్టట్లేదు. అతని మాటలు, చూపులు భరించలేకపోతుంది తను.  

ఇంక అక్కడ ఉండలేకపోయింది క్షత్రి. సీరియస్ గా ముఖం పెట్టి, “చెల్లెలి ఫ్రెండ్ తో మాట్లాడాల్సిన మాటలు కావివి. మీ చూపులు, మీ ప్రవర్తన సరిగ్గా లేదు. నేను వెళ్తున్నాను. ప్రియతో చెప్పండి” అంటూ విసురుగా టేబిల్ పై బ్యాగ్ తీసుకుని కోపంగా పైకి లేవబోయింది. అతడు చప్పున ఆమె చేయిపట్టుకుని కూర్చోబెడుతూ...”ప్లీజ్...మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే, ఈ రోజు...మా ప్రియను బ్రతిమిలాడి... మరీ మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. అది వినకుండా వెళ్ళిపోతే ఎలా...?” చెప్పాడు.

“ఏమిటీ...?” అతనిచేతినుండి బలంగా తన చేయిని విడిపించుకుంటూ అసహనంగా అడిగింది.

“నిన్న... నేను మీ నాన్నగారిని కలిసాను.” ఉలిక్కిపడింది క్షత్రి. 

“అవును. మీ పెళ్ళి గురించి అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతే, మీ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటానని చెప్పాను. ఆయన సరేనన్నారు. ఓ మంచిరోజు కబురు చేస్తాను. వచ్చి అమ్మాయిని చూసుకోండి అని చెప్పారు.” టేబిల్ పై ఉన్న రోజా పువ్వును చేతిలోకి తీసుకుని దాన్ని మునివేళ్ళతో సుతారంగా రాస్తూ అన్నాడు.

క్షత్రికి చెమటలు పోసాయి. “అబద్ధం... మా నాన్నగారు ఈ విషయం నాతో చెప్పనేలేదు. ఆయన నా దగ్గర ఏదీ దాచరు. ముఖ్యంగా నా పెళ్ళి విషయంలో...”  సీరియస్ గా అంది.

“హా... అవును. అదికూడా చెప్పారు. ఈ విషయం మీతో అస్సలు చెప్పొద్దన్నారు. ’తెలిస్తే, అది ఒప్పుకోదు. మనమే అన్ని ఏర్పాట్లు చేసుకుని దానికి చెపుదాం’ అని కూడా అన్నారు. కానీ, ముందుగా మీ అభిప్రాయం తెలుసుకోకుండా ఈ విషయంలో ప్రొసీడ్ అవడం నాకిష్టం లేదు. అందుకే... ముందుగా మీకు చెపుతున్నాను.” అన్నాడు ధర్మతేజ.

“నో... నాకీ పెళ్ళి ఇష్టంలేదు. మీరు వేరే చూసుకోవచ్చు.” ఖరాఖండిగా చెప్పి మళ్ళీ లేవబోయింది. 

“ఎందుకు ఇష్టం లేదే...? ఎన్నాళ్ళు ఇలా పెళ్ళి పెటాకులు లేకుండా ఉంటావు...?అయినా, వాళ్ళేం తల్లిదండ్రులే... కూతురు సంపాదిస్తుంటే హాయిగా తిని కూర్చుంటున్నారు?” అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియంవద చేతిలోని కాఫీకప్పులు, స్నాక్స్ ట్రేను టేబిల్ పై పెడుతూ కోపంగా అంది.

ఆ మాటలకు క్షత్రి చివ్వున లేచి నిలబడింది. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. “ప్లీజ్... ప్రియా... ఇంకొక్కమాట మా అమ్మానాన్నను అన్నావంటే అస్సలు ఒప్పుకోను. నువ్వు, నీ స్నేహం లేకపోయినా నాకు ఫర్వాలేదు. వాళ్ళు నాకు దేవతలు. నా మంచి చెడూ వాళ్ళకి తెలుసు. మీరెవరు నా గురించి ఆలోచించనక్కరలేదు.” అక్కడినుండి వేగంగా వెళ్ళిపోయింది. 

**

“నాన్నగారూ... నేనేమైనా చిన్నపిల్లనా...? నెనెప్పుడు పెళ్ళి చేసుకోవాలో నాకు తెలియదా...? ఎవడో ముక్కూ మొహం తెలియని వాడొచ్చి, అడిగేస్తే... నన్నడగకుండా ఒప్పేసుకోవడమేనా...?” ఇంటికొచ్చి తండ్రి ఆనందరావుతో గొడవేసుకుంది క్షత్రి. 

“అదేమిటే... ఇలా ఎన్నాళ్ళని పెళ్ళి చేసుకోకుండా ఉంటావు...? అబ్బాయిని నేను చూసాను. చాలా బాగున్నాడు.” నచ్చజెప్పబోయింది తల్లి అరుంధతి.

“ఆ... అబ్బాయి చాలా బాగానే ఉన్నాడు. అయితే, చేసేసుకోవాలా...? అసలు నువ్వు మధ్యలోకి రావద్దమ్మా... ఇది నాన్నగారితో నేను తేల్చుకోవలసిన విషయం.” కయ్యిమంది.

“ఒప్పుకోవే... నిన్న ఆ అబ్బాయి మనింటికి వచ్చాడు... మా అందరికీ నచ్చేసాడు. మన మధు, వినయ్ లకు కూడా బాగా ఇష్టమయ్యాడు. అప్పుడే వరసలు కలిపి బావగారు.. బావగారూ అంటూ పిలిచేస్తున్నారు కూడా...!” పూజగదిలోంచి నాన్నమ్మ చెపుతుంటే... అక్కడే ఉన్న పిల్లలిద్దరూ, “అవునక్కా... బావగారు తెల్లగా, ఎత్తుగా చాలా చక్కగా ఉన్నారు. నవ్వితే ఎంత అందంగా ఉన్నాడో తెలుసా...? నువ్వు ఆయన పక్కన నిలబడితే, ఇద్దరూ చక్కని జోడిగా ఉంటారు.” ఉత్సాహంగా అన్నారు.

“నోర్మూయండి... బావగారట... బావగారు. తెల్లగా, ఎత్తుగా ఉండి అందంగా నవ్వితే, బావగారైపోతాడా...? చిన్నపిల్లలు చిన్నపిల్లల్లాగే ఉండండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. వెళ్ళండి వెళ్ళి చదువుకోండి. అయినా... నువ్వేంటే ముసలిదానా...! ముక్కు మూసుకుని నీ పూజలేవో నువ్వు చేసుకో...బోడి సలహాలు ఇవ్వకు !!” గట్టిగా అరిచేసింది. 

అందరిమీదా అరుస్తుందే కానీ, క్షత్రి మనసులో కూడా ఎక్కడో ఓ మూల ధర్మతేజ కదులుతున్నాడు. సాయంత్రం కాఫీ షాప్ లో... అతడి అల్లరి నవ్వు, హఠాత్తుగా అతడు తన చేయి పట్టుకుని బలంగా కుర్చీలో కూర్చోబెట్టడం, అతని చేతి స్పర్శ... గుండెను కలవరపెడుతున్నాయి. అది కప్పి పుచ్చుకోడానికి, అతడి ఆలోచనలు తనలోనుండి తీసేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది క్షత్రి.

“మీరెన్ని చెప్పినా, నేను వినను. అతడిని చేసుకోను. నాకసలు పెళ్ళే వద్దు... ప్లీజ్... నన్ను ఇబ్బంది పెట్టకండి.” చేతులతో రెండు చెవులు గట్టిగా మూసుకుని అరుస్తూ మొండిగా తెగేసి చెప్పింది.

ఇదంతా గుమ్మం బయట నిలబడి చాటుగా వింటున్న ధర్మతేజ, ప్రియంవద... ఒకరిని చూసి ఒకరు ముసిముసిగా నవ్వుకున్నారు. “ఇప్పుడు లోపలికి వెళదాం...” అంటూ కాలింగ్ బెల్ కొట్టాడు ధర్మతేజ.

విసురుగా వచ్చి తలుపుతీసిన క్షత్రి, గుమ్మంలో వాళ్ళిద్దరినీ చూసి నివ్వేరపోయింది. ఆమెతో సంబంధం లేనట్లు లోపలికి తోసుకుని వచ్చేసారు. వాళ్ళ చొరవకు ఉన్నచోటనుండి కదల్లేక అలాగే నిలబడి వాళ్ళనే చూడసాగింది.

“ఆంటీ... మంచి కాఫీ పెట్టండి ప్లీజ్...!” అంటూ కిచెన్ దగ్గర నిలబడ్డ అరుంధతికి చెప్పి, హాల్లో... ఉన్న సోఫాలో కూర్చుంది ప్రియంవద. గుండె ఆగినట్లనిపించింది. గాజుకళ్ళతో కిచెన్ వంక చూసింది క్షత్రి.

“అంకుల్... అయామ్ సారీ... మీరెంత చెప్పొద్దన్నా... నేను మీ క్షత్రితో చెప్పేసాను. దయచేసి ఏమీ అనుకోకండి. తనకు ఈ విషయం తెలియకుండా, తనతో సంప్రదించకుండా ఒకేసారి మీ ఇంటికి పెళ్ళిచూపులంటూ రావడం నాకు ఇష్టమనిపించలేదు. అందుకే... ఇందాక సాయంత్రం క్షత్రితో నా మనసులో మాట చెప్పేసాను. అస్సలు పరిచయమే లేని నన్ను, తను ఒప్పుకోదని నాకు తెలుసు. అందుకే, తన వెనుకే మేమూ వచ్చేసాము. మనమందరం కలిసి, తనని ఒప్పిద్దామని.” వాలుకుర్చీలో కూర్చుని ఉన్న ఆనందరావు ఎదురుగా నిలబడి చేతులు కట్టుకుని చెపుతున్నాడు ధర్మతేజ. 

తలతిప్పి... అతడిని, అక్కడున్న వాలు కుర్చీనీ నీటి తెరలు కమ్ముతున్న కళ్ళతో చూసింది క్షత్రి. 

“మధూ... వినయ్... ఇలా రండి నా పక్కన కూర్చోండి. ఆ బుక్సేంటి...?ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా...?” వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకోవడం కోసం చేతులు ముందుకు చాపిన ప్రియంవదను చూసేసరికి... క్షత్రి కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఉబికి చెక్కిళ్ళ మీదనుండి జారిపోసాగాయి. 

కుర్చీముందు నిలబడిన ధర్మతేజ... అక్కడినుండి కాస్త ముందుకు వచ్చి, పూజగదిలో ఉన్న బామ్మను చూస్తూ, “బామ్మగారూ... మీకు ముహుర్తాలు అవీ తెలుసుగా... ఓ మంచి ముహుర్తం చూడండి.” అన్నాడు.

అన్నట్లు, “క్షత్రి గారూ... ఒకసారి ఈ పేపర్ క్లిప్పింగ్ చూడండి.” పది సంవత్సరాల క్రితం నాటి తెలుగు న్యూస్ పేపర్ ని ఆమె కళ్ళముందుంచాడు. నెమలి అనే గ్రామంలో వ్యవసాయంపై చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబమంతా పురుగుల మందు త్రాగి మరణించి, శవాలుగా నేలపై పడి ఉన్న ఫైల్ ఫోటో. 


 

అందులో ఆ రైతు ఆనందరావు, అతని తల్లి వృద్ధురాలైన సావిత్రమ్మ, అతని భార్యా అరుంధతి. మూడేళ్ళ బాబు వినయ్, సంవత్సరం పాప మధులత.  ఆ ఫోటోను, న్యూస్ ని చూసిన క్షత్రి, గుండెలోతుల్లోంచి వస్తున్న దు:ఖాన్ని ఇంక ఆపుకోలేకపోయింది. ఒక్కసారిగా ఉన్నచోటే.. కుప్పకూలిపోయి, చేతులు నేలకు బాదుకుంటూ... “అమ్మా... నాన్న...” అంటూ బోరుబోరున విలపించసాగింది. 

అది చూసి  ఒక్క ఉదుటున సోఫాలోంచి లేవబోయింది ప్రియంవద. ఆమెను చూపులతోనే ’వద్దని’ వారించాడు ధర్మతేజ. “ఏడ్వనీ... ప్రియా... ఎంతసేపయినా ఆమెని అలా ఏడుస్తూ ఉండనివ్వు. తనను అడ్డుకోవద్దు. ఆ దు:ఖంలోనే... ఇన్నాళ్ళు తను బ్రతుకుతున్న అవాస్తవమైన కలల ప్రపంచం శాశ్వతంగా కరిగి, ఆ కన్నీళ్ళలో కొట్టుకుపోనివ్వు. ఏడ్చి, ఏడ్చి తనంతట తానే తెరిపిన పడనివ్వు. అప్పుడే ఆమె కళ్ళు  బ్రాంతినుండి వాస్తవాన్ని చూడగలుగుతాయి. అప్పుడే, ఇక తన అసలైన కొత్త జీవితం ప్రారంభమవుతుంది.” అంటూ సోఫాలో ప్రియ పక్కన రిలాక్స్ గా కూర్చున్నాడు. 

“క్షత్రి అమ్మగారికి, అమ్మానాన్నలు ఎక్కడున్నారమ్మా...? ఆరేళ్ళ క్రితం ఆ ప్లాట్ కొన్నదగ్గరనుండి అమ్మగారు ఒక్కరే కదా ఆ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళింట్లో... అమ్మా,నాన్న, బామ్మ, చెల్లి, తమ్ముడు... ఇలా ఎవరూ లేరమ్మా...!” ఆ రోజు... క్షత్రి తల్లిదండ్రులతో మాట్లాడడానికి వచ్చిన ప్రియంవదకు క్షత్రి ఉంటున్న అపార్ట్ మెంట్ వాచ్ మెన్, చెప్పిన మాటలు విని నోటమాట రాలేదు. అంతేకాదు, తన దగ్గరున్న స్పేర్ తాళంచెవితో తలుపు తీసి ఇళ్ళంతా చూపించాడు కూడా...! ఆ విషయమే అదురుతున్న గుండెతో... ధర్మతేజకు ఫోన్ లో చెప్పింది ప్రియంవద.

అప్పుడే క్షత్రిని గురించి ఎంక్వయిరీ ప్రారంభించాడు ధర్మతేజ. ఆమె చదివిన కాలేజి, స్కూలు, ఆమె తన పద్నాలుగో ఏటనుండి తను ఉన్న హాస్టలు, తను పుట్టి పెరిగిన ఊరు... అన్ని చోట్లకీ వెళ్ళాడు. ఆమెది ఒక పూరింటిలో బతికే పేద రైతు కుటుంబం. చిన్నప్పటినుండి తల్లిదండ్రులు పడే కష్టం చూసి, ఎలాగైనా తను పెద్ద చదువులు చదివి, గొప్ప ఉద్యోగం సంపాదించాలని, పసివాళ్ళైన తమ్ముడిని, చెల్లినీ మంచి బడిలో వేసి పెద్ద చదువులు చదివించాలని, తన వాళ్ళందరినీ అన్ని వసతులూ ఉన్న పేద్ద ఇంట్లో ఉంచి ఎవరికీ ఏ లోటు రాకుండా చూసుకోవాలని కలలు కనేది. 

హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న క్షత్రి... వ్యవసాయంలో నష్టపోయి, అప్పులబాధ తాళలేక తన కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరిదైపోయింది. ఆ నిజాన్ని తట్టుకోలేని ఆ పసి హృదయం అప్పటినుండే, తనవాళ్ళెవరూ చనిపోలేదని అందరూ ఊరిలోనే బతికి ఉన్నారంటూ ఒక అభద్దాన్ని మనసుకు చెప్పుకుంటూ పెరిగింది. ఎలాగోలా చదివి, పెద్దయి ఉద్యోగం సంపాదించుకుంది. చిన్నప్పటి తన కోరిక ప్రకారం...తన కుటుంబాన్నంతా తనతో పాటే తెచ్చిపెట్టుకున్నట్లు... వాళ్ళతో కలిసి జీవిస్తున్నట్లుగా, వారితో మాట్లాడుతున్నట్లుగా, వాళ్ళకి అన్నీ తానే అయి చూసుకుంటున్నట్లుగా... ఇన్నాళ్ళూ వాళ్ళతో గడపలేకపోయిన జీవితాన్ని... ఊహల్లో అందంగా అల్లుకుని ఆనందంగా గడపసాగింది. అయితే, ఆమెది బ్రాంతి కాదు. తను పూర్తిగా స్పృహలోనే ఉంది. తనవాళ్ళెవరు బ్రతికి లేరనే వాస్తవం తనకు తెలుసు. ఆ విషయం... చెల్లెలు సహాయంతో ఆఫీసులో ఆమెకు తెలియకుండా... ఆమెను, ఆమె ప్రవర్తనను దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసిన ధర్మతేజ అర్ధం చేసుకోగలిగాడు. 

ఎప్పటికో... కంటిలోని ఆఖరు కన్నీటి చుక్కా జారిపోయాక లేచి సరిగ్గా కూర్చుని తలవంచుకుని, వెక్కిళ్ళ మధ్య చెప్పింది క్షత్రి. “ప్రియా... ధర్మతేజగారితో పెళ్ళికి ఒప్పుకుంటున్నానని, మా అమ్మానాన్నలతో చెప్పు. ముహూర్తం చూడమని నాన్నమ్మకు కూడా...!” 

“వావ్...థాంక్యూ...” సంతోషంతో బిగ్గరగా కేకవేసి... ఒక్క ఉదుటున వెళ్ళి క్షత్రిని కౌగింలించుకుంది ప్రియంవద. వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తుండిపోయాడు ధర్మతేజ.

*****

Bio
bottom of page