MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కథా మధురాలు
కొత్త యుగంలోకి
తమిళ మూలం : జయకాంతన్
తెలుగు అనువాదం : రంగన్ సుందరేశన్.
తమిళ మూలకథ - 'యుగ సంధి' అనే పేరుతో ఆనంద వికటన్ పత్రికలో 1963 లో ప్రచురితమైంది.
గౌరీ అవ్వ ఓర్పుతో చాలాసేపు బస్సులో నిల్చొనివుంది. అందరూ దిగిన తరువాత తన ఖాకీ సంచెని నడుములో ఎత్తిపెట్టుకొని, ఆఖరున వచ్చింది.
“అవ్వా, అవ్వా! నేను సంచి మోసుకొని రానా? ఒక అణా ఇవ్వు, అవ్వా! ”
“అమ్మగారూ, రండి. బండి కావాలా?”
“పుదుపాళయం వకీలు గుమాస్తా అయ్యరు ఇల్లు కదండీ? రండి, వెళ్దాం. ”
ఇలాగ పల స్వరాల్లో ఆవిడకి స్వాగతం చెప్పి బస్సునుంచి దిగకుండా అడ్డగించే వాళ్ళని చూసి అవ్వ అభిమానంగా నవ్వింది.
“నాకేం వొద్దు నాయనా. కొంచెం దారి వదలండి, నేను నడిచి వెళ్తాను. నీకు ఇల్లుకూడా తెలుసన్నమాట! నేను ప్రతీ నెలా వస్తున్నాను, కాని ఎప్పుడైనా బండిలో వెళ్ళడం చూసావా?” అని ఒక్కొక్కరికీ జవాబు చెప్పి అవ్వ ఆ మండుటెండలో, తన తలకప్పుని బిగువుగా లాక్కుని, నడుమున ఉన్న సంచితో, నేలనున్న మట్టిని గట్టిగా నొక్కుతూ, ఒక పక్క వొంగుతూ, నడిచింది.
అవ్వకి డెభ్బై నిండాయి కాని శరీరం దృఢంగానే ఉంది. ఇంటికి వెళ్ళిన తరువాతే కదా వృద్ధాప్యం వలన కలిగే అలసట ఆవిడ తెలుసుకుంటుంది!
ఆమె దృష్టిలో నిన్న పుట్టిన పిల్లలందరూ రిక్షాల్లో, గుర్రం బండీలలో, సైకిల్లో ఎగురుతున్నారు.
వర్షం, ఎండ మానవుడిని బెదిరించే ధోరణి చూసి అవ్వ తనలో నవ్వుకుంటుంది.
ఇవన్నీ ఆవిడకి ఏం లెక్క? ప్రవాహంలాగ పెరిగి గడచిన తన జీవితంలో మలుపులు, గభీమని ఎడారిగా మారిన జీవితంలో అగ్ని జ్వాలలు చోటు చేసుకున్నప్పుడు ఓర్పుతో సమర్ధించుకున్న ఈ ముసలమ్మని ఈ ఎండ, వర్షం ఏం చెయ్యగలవు? ఎది ఎలాగున్నా సరే.
మండుటెండలో పాదాలని గట్టిగా నేలమీద నొక్కుతూ, నొక్కుతూ, ఆవిడ మెల్ల మెల్లగా నడిచింది.
దారిలో ఒక చోట - నలుగైదుగురు నిలబడి విశ్రాంతి అనుభవించడానికి తగినట్టుగా - ఒక చిన్న వేపచెట్టు పెద్ద గొడుగులాగ వ్యాపించి ఉంది.
దాని నీడలో ముసలమ్మ ఒంటరిగా నిల్చుంది.
మండుతున్న ఆ ఊష్ణంలో, యంత్రాలు తప్పిస్తే మరేదీ నమ్మని ఈ ఇరవైయ్యో శతాబ్దంలో గత శతాబ్దంకి చిహ్నంగా తన సొంతకాళ్ళనే నమ్ముకున్న ఆ ముసలమ్మకి ఊరటగా ఆ వేపచెట్టు కొమ్మల చిలిపి గాలులు గిలిగింతలు కలిగించాయి.
‘మహాదేవ ప్రభో!’ అని దేవుడికి కృతజ్ఞత చెప్పి ముసలమ్మ ఆ శీతలం అనుభవించింది.
గుండ్రమైన అవ్వ మొహంలో పసిపాపలాంటి ఒక శోభ ఉంది. ఈ వయస్సులోనూ ఆవిడ నవ్వినప్పుడు పళ్ళు వరుసగా కనిపించడం ఎంత ఆశ్చర్యం! ఆవిడ చుబుకంకి కుడిపక్కన ఒక మిరియం కంటే కొంచెం పెద్దదిగా ఒక అందమైన మచ్చ, దానిపై మాత్రం దట్టంగా వెండ్రుకలున్నాయి. ఇవన్నీ కలిసి చూసినవారికి యౌవనంలో ఆవిడ ఎలా ఉండేదని ఆలోచించక తప్పదు.
అవ్వ ధరించిన చీర ఆవిడ సువర్ణవర్ణంలోని దేహానికి పోటీగా గాలిలో రెపరెపలాడింది. కారుతున్న చెమట వలన నెత్తిమీదున్న విభూది మాసిపోయింది. అవ్వ కొన్ని నిమిషాలలో తన మొహం, చేతులు, చీర మడతలు సరిదిద్దుకుంది.
నీడని వదిలి అవ్వ మళ్ళీ మట్టి నేలని నొక్కుకుంటూ ఒక వంతెన చేరుకుంది. దాని గచ్చు నేలలో మెల్లగా పాదాలు పెట్టి నడిచింది.
వంతెన కాలిబాటలో - వోరగా - ముసలమ్మని తాకకూడదని జాగ్రత్తగా నిలబడి చేతిలోని తగరపెట్టెతో ఆమెను నమస్కరించాడు ఒక పాత, పరిచయమున్న మంగలివాడు.
“అమ్మగారూ. ఎక్కడినుంచి వస్తున్నారు?. నైవేలీ[1] నుంచా?” అని అభిమానంతో అడిగాడు.
“ఎవరు? వేలాయుధమా? అవును. నీ పెళ్ళాం పురుడు పోసుకుందా?” అని అవ్వ ఆతురతగా అడిగింది.
“అయింది. ఇదీ మగపిల్లవాడే.”
“మంచిది. బాగా ఉండనీ. అంతా దేవుని దయ!. ఇది మూడవ అబ్బాయి కదూ?”
“అవును” అని సంతోషంతో వేలాయుధం నవ్వాడు.
“నీకిది అదృష్టం అన్నమాట. విను, ఎలాగైనా కష్టపడి వాడికి చదువు చెప్పించు, సరేనా?” అని అవ్వ అడగ్గానే వేలాయుధం పిలకని తడుముకుంటూ నవ్వాడు.
“ఏం, ఎందుకు నవ్వుతావ్? రోజులు మారుతూ వస్తున్నాయి. నీ నాన్నా, నువ్వూ ఇలాగే పెట్టె ఎత్తుకొని బతికారు. ఇక అది జరగదు. మగవారందరూ ఉద్యోగం చేస్తున్నారు. ఆడవాళ్ళలోకూడా నాలాగ ఎవరూ లేరని చూస్తున్నాం. అంతా మంచికే, కాలం మారినప్పుడు మనుషులూ మారాలి, అవునా?” అని ఏదో హాస్యంగా మాటాడినట్టు అవ్వ నవ్వేసింది. వాడూ నవ్వాడు.
“ఇదిగో, ఈ ఎండకి ఇది మంచిది, తిను” అని అంటూ అవ్వ తన నడుమునున్న సంచెనుంచి వేలాడుతున్న రెండు చిన్న దోసకాయలు బయటకి తీసి వాడి చేతుల్లో వేసింది.
“బస్సులో వచ్చినప్పుడు అణాకి నాలుగని అమ్మారు. పిల్లలకని పావలాకి కొన్నాను.” అని ఆవిడ అనగానే వేలాయుధం ఒక దండం పెట్టి ఆమె తనని దాటి వెళ్ళినంతవరకూ అక్కడే నిలబడి ఆ తరువాత తన తోవలో నడిచాడు.
**
చిదంబరంలో పుట్టిన గౌరీ అమ్మాళ్ తన పదేళ్ళ వయసులో ఈ కడలూరులో శ్రేయస్సుగా నున్న ఒక కుటుంబంకి కోడలుగా వెళ్ళింది. పదహారవ వయస్సులో ఒక శిశువుతో వైధవ్యము కలిగిన తరువాత ఇంత వరకూ తన కొడుకుని, తన భర్త భాగంగా దొరికిన ఇల్లుని వదిలి ఆవిడ ఏ ఊరుకీ వెళ్ళనేలేదు.
కాని తన కొడుకు కడుపులో పుట్టిన జేష్ఠ కుమార్తె పెళ్ళయి పదినెలలలో తన సుమంగళితనాన్ని పోగొట్టుకొని ఏడుస్తూ వచ్చి తన ఒడిలో వాలిన ఆ రోజు నుంచి తన జీవితంలో జరిగిన ఆఖరి దుర్ఘటనగా గౌరీ అమ్మాళ్ గీతని భరించింది. తన ఆదరణలో, తన ప్రేమానురాగాల్లో, తన ఏడ్పులో, తన అనుభూతిలో ఆమెను ఇముడ్చుకోవడం తన బాధ్యతగా ఆమె నిశ్చయించుకుంది. అంతవరకూ గీతపై కొడుకు కన్న అమ్మాయి అనే వాత్సల్యం మాత్రం ఉండేది. కాని తన భర్త కన్ను మూసిన తరువాత తన ప్రేమ అంతా కొడుకు మీదే అని జీవించిన ఆ తల్లికి ఈ మార్పు రావడానికి కారణం గీతకి ఆదరువు చూపాలని మాత్రం కాదు.
గౌరీ అవ్వ తన గతకాల పక్షంకి విరుద్ధంగా ఇప్పటి కాలం ప్రతినిధిగా తన ఎంచుకుంది.
అవ్వ కొడుకు గణేశయ్యర్కి తన తండ్రి చావూ, అందువలన కలిగిన అత్యంత శోకమూ తెలియదు. అతని భార్య తరచుగా, రహస్యంగా గొణుక్కున్నట్టు అతను ‘అమ్మ మాట విని నడిచే కుమారుడు’.
వితంతువైన గీత గురించి, అన్నివిధాలా బాధ పడి, కలవరపడుతూ ఆఖరికి ఒక రోజు హైస్కూల్ చదువుతో ఆపేసిన ఆమెని టీచర్ శిక్షణకి పంపాలని ఆలోచించి, తటాపటాయించుతూ గణేశయ్యర్ తన తల్లి అభిప్రాయం అడిగినప్పుడు ఆవిడ అతని నిర్ణయం పొగడి, సమ్మతించినది చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది.
రోజులు మారుతున్న కాలంలో గీతకి కలిగిన భాగ్యం గురించి గౌరీ అవ్వ సంతోషించింది.
శిక్షణ పూర్తయి చాలా రోజులు సొంత ఊరులోనే ఉద్యోగం చేసిన గీతకి గత సంవత్సరం - కొత్తగా ఆరంభించి త్వరగా పెరుగుతున్న పారిశ్రామిక నగరం నైవేలికి బదిలీ అయినప్పుడు గణేశయ్యర్ ఏం చెయ్యాలో తెలియక బాధపడ్డారు.
“దానికేం, నేను వెళ్తాను సాయానికి!” అని గౌరీ అవ్వ - ఈ వయసు చెల్లిన కాలంలో కొడుకుని, కుటుంబంని త్యజించి, ఒంటరిగా తనంతట తానే, వెళ్ళడానికి నిర్ణయించడానికి కారణం - ముప్పైయేళ్ళు కూడా నిండని గీత వైధవ్య అంధకారంలో చిక్కుకొని ఎలా పెనుగులాడుతుందో అనే బెంగ.
ఈ ఒక సంవత్సరం ఎడబాటులో, పొడుగాటి శెలవులలో, అవ్వ, గీత కలిసే ఉంటారు. లేకపోతే, శని ఆదివారాల్లో తనకి ఇష్టం వచ్చినప్పుడు అవ్వ బయలుదేరి వచ్చేస్తుంది. అందుకు ముఖ్యమైన కారణాల్లో ఒకటి - ఆమెకి వాడుకైన మంగలివాడు. వేలాయుధం, అంతకు ముందు వాడి తండ్రి - వాళ్ళని తప్పిస్తే మరెవరిదగ్గరా అవ్వ క్షవరం చేసుకోదు.
ఇప్పుడు దారిలో కనిపించిన వేలాయుధం రేపు ఉదయం ఆమె ఇంటిముందు వచ్చి నిలబడతాడని అవ్వకి తెలుసు. రావాలని వాడికి తెలుసు. అదే వాడుక.
ఒక మైలుకి తక్కువగా ఉన్న ఆ దూరం సూటిగా అరగంటలో నడిచి అవ్వ ఇల్లు చేరుకున్నప్పుడు గణేశయ్యర్ మొహాన్ని వార్తాపత్రికతో మూసుకొని హాలులో ఏటవాలైన కుర్చీలో నిద్రపోతున్నారు. పక్కనే కోడలు పార్వతి అమ్మాళ్ ఏదో పనిలో ఉంది. ఆవరణ ముందు భాగాన్ని అడ్డగిస్తూ ఇనుము తీగలతో అల్లిన ఒక తడ ఉంది. దాని వెనుక, ఎండకి దూరంగా కూర్చొని, తనంతట తానే ఏదో కూని రాగంలో వల్లించుకంటూ ఆఖరి మనవరాలు ఆరేళ్ళ జానా ఆడుకుంటోంది. పక్కనే, నేలమీద పిడతలు చెల్లాచెదరి ఉన్నాయి.
అవ్వ రావడం ఎవరూ గమనించలేదు. అవ్వ మెల్లగా ఆవరణ తడని తట్టింది. ఆవిడని చూడగానే జానా మొహం వికసించింది. సంతోషంతో “నానమ్మ” అని పిలిచింది.
“తలుపు తీయవే” అని అవ్వ మాటలు వినిపించడానికి ముందే జానా “అమ్మా, అమ్మా, నానమ్మ వచ్చేసింది! నానమ్మ వచ్చేసింది!.” అని అరుస్తూ లోపలికి పరుగెత్తింది.
తలుపు తెరవకుండా తన రాకని తెలియజేడానికి లోపల పరుగెత్తిన బాలికని చూసి అవ్వ నవ్వుకుంది.
గణేశయ్యర్ మొహంని కప్పుకున్న వార్తాపత్రికని లాగి కళ్ళు తెరచి చూసారు. జానా కూత విని లేవగానే అతను ఏమీ తెలియక ఒక నిమిషం అటూ, ఇటూ చూసారు. ఇంతలో “ఎందుకే అరుస్తావు?” అని కూతురుని మందలించుతూ “రండి. ఎండలో నడిచి వచ్చారా? బండిలో రాకూడదా?” అని అభిమానంతో అడుగుతూ కోడలు పార్వతి లేచివచ్చి తలుపు తెరిచింది.
“ఇక్కడే ఉన్న జాగాకి బండి ఎందుకు? ఎనిమిది అణాలు, పది అణాలు అని అడుగుతాడు.” అని విసుక్కుంటూ మెట్లెక్కి వచ్చిన తల్లిని చూసి గణేశయ్యర్ “అమ్మా, మంచి ఎండలో వచ్చావ్. పార్వతి, అమ్మకి మజ్జిగ ఇయ్.” అని ఉపచారం చేస్తూ ఏటవాలు కుర్చీనుంచి లేచారు.
“పాపం, నువ్వు బాగా నిద్రపోతున్నావ్. ఇంకా కొంచెం నిద్రపో.” అని ఒక చేతితో సైగ చేస్తూ అవ్వ ఏటవాలు కుర్చీకి పక్కనే ఉన్న ఒక స్టూల్ మీద తన ఖాకీ సంచిని పెట్టి, పెరటికి వెళ్ళి మొహం, కాళ్ళూ చేతులూ కడుక్కుంది. ఆ తరువాత హాలుకి తిరిగివచ్చి నెత్తిమీద విభూది పూసుకుంది. ఆవిడ వచ్చేవరకూ గణేశయ్యర్ ఏటవాలు కుర్చీపక్కన నిలబడి చూస్తున్నారు.
ఆ ఏటవాలు కుర్చీ నాయనమ్మకి మాత్రం సింహాసనం. ఆవిడ ఇంటిలో లేనప్పుడే మరెవరైనా అందులో కూర్చుంటారు. ఇప్పుడు ఆవిడ అందులో కూర్చున్న తరువాత గణేశయ్యర్ పక్కనే ఉన్న ఒక కుర్చీని లాక్కుని దానిమీద కూర్చొని తల్లికి ఒక విసనకర్రతో వీచారు. అందుకోసమే కాచుకున్నట్టు నాయనమ్మ కూర్చున్నవెంటనే జానా ఆవిడ ఒడిలో ఎక్కి కూర్చోంది.
“నానమ్మ ఇప్పుడే ఎండలో వచ్చింది, కొంచెం జరుగవే. రాగానే ఇలా ఎక్కుతావూ. “ అని మందలించుతూ గణేశయ్యర్ విసనకర్రతో కూతురుని తట్టారు.
“పోనీలేరా, చిన్న పిల్లే కదా? రామ్మా, నువ్వు కూర్చో!” అని అభయమిచ్చి అవ్వ బాలికని లాక్కుని అణచుకుంది.
‘ఇప్పుడు నువ్వేం చేస్తావ్?’ అని అడుగుతున్నట్టు జానా నాలికని ముందుకు జాపి నాన్నగారిని చూసి ఎగతాళి చేసింది.
జానాని ఒడిలో పెట్టుకొని అవ్వ పక్కనే స్టూల్ మీదున్న తన సంచి నుంచి దోసకాయలు బయటకి తీసి వరుసగా నేలమీద పెట్టి, ఒకటి జానా చేతికి అందించింది. మడిచిపెట్టిన తన మారు చీరని సంచినుంచి తీసిన తరువాత ఆ సంచిని తలక్రిందుగా పట్టుకున్నప్పుడు దానిలోనుంచి అర కిలో వేరుసెనగలతోబాటు ఒక కవరు నేల రాలింది.
“మీనా, అంబీ కనిపించరేం?” అని పరిసరాలు చూసి అడుగుతూ “ఇది గీత నీకు ఇవ్వమంది” అని చెప్పి అవ్వ కవరుని అందించింది.
‘ఇరవైయేళ్ళ అమ్మాయిని అంబి సాయంతో మాటినీ షో చూడడానికి - అది ఎంత సమీపంలో ఉన్నా సరే - సినిమాకి పంపించడం పొరబాటు కాదా?’ అని తల్లికి కోపం కలుగుతుందనే భయంతో గణేశయ్యర్ కవరును అందుకుంటూ “అదేదో గీత చదివిన మంచి నవల, సినిమాగా వచ్చిందని చెప్పింది. అబ్బబ్బా, పొద్దున్నుంచీ ఇద్దరూ నా ప్రాణం తీసేసారు! ‘మాటినీ షోవే కదా, సరే’ అని వెళ్ళమన్నాను. ” అన్నారు.
“ఓ, సీరియల్ గా వచ్చిన ఆ నవలా? నేనూ ఆ పేరు చూసాను.” అని అన్న తరువాత, అవ్వ, ఆ పత్రిక పేరు, ఆ రచయత పేరు, అడిగి తెలుసుకుంది. “దీనికోసం నీకెందుకురా కోపం? నీకూ, నాకూ, సినిమా అంటే ఏమీ తెలీదు. ఇప్పటి పిల్లలకి సినిమా తప్పిస్తే మరేం తెలీదు! మన పిల్లలు ఎంతో నయం అని జ్ఞాపకం ఉంచుకో!” అని కొడుక్కి బుద్ధి చెప్పి “కవరులో ఏముందో చదివి చెప్పు. దాన్ని అడిగినప్పుడు ‘నాన్నగారు మీకు చెప్తారు’ అని నాకు జాడగా చెప్పింది” అని అవ్వ వివరించింది.
కళ్ళద్దాలు ధరించి, కవరు తెరిచి ఆ ఉత్తరంలో క్లుప్తంగా రాసివున్న వాక్యాలు చదవడానికి ఆరంభించగానే గణేశయ్యర్ చేతులు వొణికాయి. మొహమంతా చెమట పట్టేసింది. పెదిమలు ఉద్రేకంతో పెనుగులాడాయి. చదివిన తరువాత తలెత్తి ఎదుట గోడలో వేలాడుతున్న గీత పెళ్ళి పోటోని అతను తేరిపారి చూసారు.
తల్లి పక్కన ఇంపైన వాతావరణంలో కూర్చొని ఉన్న అతని మొహంని గభీమని అంధకారం కప్పేసింది. కుర్చీ చేతులు గట్టిగా పట్టుకొని తల్లిని అతను రెప్పవాల్చకుండా చూసారు. తన చేతినుంచి ఉత్తరం నేల వాలడం అతను గమనించలేదు.
“అసలు ఏమైంది?” అని అదిరిపడి అవ్వ నేల పడిన ఉత్తరంని తీసుకొని వెలుతురులో చదివింది. కళ్ళద్దాలు లేకుండానే చదవడం ఆవిడకి సాధ్యం.
“నా ప్రియమైన నాన్న, అమ్మ, నానమ్మ, మొదలైనవారికి.
ఈ ఉత్తరం రాసినప్పుడు ఆరు మాసాలు దీర్ఘంగా ఆలోచించి, ఆఖరికి నిర్ణయం చేసి, సందిగ్ధత లేని మనసుతో నేను రాస్తున్నాను. ఈ ఉత్తరం తరువాత మీకూ నాకూ ఉత్తరప్రత్యుత్తరాలు, ముఖాముఖి దర్శనం పూర్తిగా ఆగిపోవచ్చు అనే అవగాహనతోనే దీన్ని రాస్తున్నాను.
వచ్చే ఆదివారం నేను నా సహోద్యోగి, హిందీ పండిట్ మిస్టర్ రామచంద్రన్ గారిని రిజిస్టర్ పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించాను. నేను వితంతువు అని అతనికి తెలుసు. ఆరు నెలలుగా నేను నా భావావేశంతో - ‘ఇది పాపకరమైన పని’ అని ఒక నిరర్థక భావనతో పోరాడిన తరువాతే ఈ నిర్ణయంకి వచ్చాను. భావావేశానికి కట్టుబడి వైధవ్య వ్రతం అనుసరింపలేక, సమాజంలో కపటంగా మెలగుతూ, అపకీర్తికి పాలయి, కుటుంబంకి చెడ్జ పేరు రాకుండా జీవించడమే పవిత్రత అని నా నమ్మకం. నాకిప్పుడు ముప్పైయేళ్ళు నిండాయి. ఇంతవరకూ నేను అనుభవించిన బాధలు భరించలేక పెనుగులాడుతుంటే, మరి వచ్చే ఐదు సంవత్సరాల తరువాత నేను ఇదే నిర్ణయం చేస్తానేమో అనే భయమూ నాకు వచ్చేసింది. అందుకే ఇప్పుడే చెయ్యాలని నిశ్చయించాను.
నేను చేసేది నా వరకూ యోగ్యమైన పని!
నేనేదో పొరబాటు చేస్తున్నానని, దానికోసం బాధపడాలని కూడా నాకనిపించడంలేదు. కాని మీ బంధుత్వం, ప్రేమ పొగొట్టుకుంటున్నానేమోనన్న బాధ కొన్ని సమయాల్లో నాకు ఎక్కువగా కలుగుతోంది. కాని ఒక కొత్త జీవితాన్ని జ్ఞానోదయంతో ఒక కొత్త యుగ పౌరురాలిగా నేను సంచరించబోతున్నాననే ఆదర్శభావనలో నా మనసులో ఊరడింపు, సంతోషం చోటు చేసుకున్నాయి.
ఈ రోజుల్లో ఎవరి మనస్సు ఎలా మారుతుందో చెప్పలేం. ఒక వేళ మీరు నా నిర్ణయంతో ఏకీభవిస్తే, ఇంకా ఒక వారం టైముంది. మీ సౌజన్యమైన దీవెనలు ఎదురుచూస్తున్నాను. లేకపోతే మీ వరకూ ‘గీత చచ్చిపోయింది’ అని పాప పరిహారం కోసం స్నానం చేసేయండి.
అవును, ఇది చాలా స్వార్ధంతో నేను చేసే పని. నాకోసం నానమ్మ తప్పిస్తే మరెవరు తమ క్షేమం ‘త్యాగం’ చేసారు?
ఇట్లు,
మీ పై నిత్యం ప్రేమతో, గీత”
“ఇదేమిట్రా - ఇలాగ అయిపోయింది?” అని అడగడం తప్పిస్తే మరేం చెయ్యలేక అవ్వ బెంగతో కొడుకుని చూసింది.
“అది చచ్చిపోయింది. అవును. దానిగురించి మరేం విచారం వద్దు!” అని దాక్షిణ్యం లేకుండా గణేశయ్యర్ ఖండించారు.
గౌరీ అవ్వ నిర్ఘాంతపోయింది.
తల్లి బోధన, ఆజ్ఞ, సలహా ఎదురుచూడక తనంతట తానే గణేశయ్యర్ నిర్ణయం చేసినది ఇదే మొదటిసారి.
“అదేనా నీ ఉద్దేశం?” అని గుండెమీద చెయ్యి పెట్టుకొని పూర్తిగా తడిసిపోయిన కళ్ళతో, సానుభూతితో అవ్వ అడిగింది.
“మరెలా చెప్పమంటావ్? నువ్వు పుట్టిన వంశంలో, ఈ కుటుంబంలో. అయ్యో, ఇదెలా భరించడం?” అని ఈ అవమానం ఊహించలేక గణేశయ్యర్ వాపోయారు.
“నేను పుట్టిన యుగం వేరు. ” అని అవ్వ చెప్పాలనుకుంది కాని అప్పుడే ఆవిడకి ఒక నిజం ఇన్ని రోజుల తరువాత బోధపడింది.
‘నా కొడుకు నా మాటకి, నా ఆజ్ఞకి కాచుకొనివుండడానికి కారణం మాతృప్రేమ మాత్రం కాదు. నేనీ యుగానికి ప్రతినిధి. అది ఆచారమైన యుగం. నేను పుట్టినది ఆచారాలు అనుసరించి నడిచే కుటుంబంలో. అలాగే తన కుటుంబం సాగడానికి తనకి అసాధ్యమైనా, తన తల్లి మూలంగా అది సాధ్యమౌతుందని, ఆ ఆచార జీవితాన్ని తప్పకుండా గౌరవించాలని వాడి ఉద్దేశం.’
ఇప్పుడే ఆవిడకి తన పక్షం, కొడుకు మూర్ఖత్వం, నిరాధారంగా నిలబడే గీత అవస్థ తెలిసాయి. మౌనంగా కూర్చుంది.
అప్పుడు అక్కడికి వచ్చిన పార్వతి ఆ విపరీతకారక ఉత్తరం చదివి “పాపి, ఎంత పని చేసావే! మా కొంప ముంచేసావ్!” అని నెత్తి మొత్తుకొని ఏడ్చింది.
అవ్వ తన స్వభావంకి తగినట్టుగా నిదానంతో ఆ ఉత్తరంని తీసుకొని ఆఖరి వాక్యాలు మళ్ళీ చదివింది.
“ఇది చాలా స్వార్ధంతో నేను చేసే పని. నాకోసం నానమ్మ తప్పిస్తే మరెవరు తమ క్షేమం ‘త్యాగం’ చేసారు?”
ఈ మాటలు చదవగానే అవ్వకి గుచ్చుతున్నట్టనిపించింది. పెదిమని కఱచుకుంది.
ఆ మాటల అర్ధం ఇతరులకి తెలీదు. అవ్వకి తెలుసు.
గీత పద్దెనిమిది వయస్సులో నెత్తిమీద కుంకం మరిచిపోయినట్టు, జుత్తులో పువ్వులు పోగొట్టున్నట్టు, ‘అది దాని కర్మ!’ అని ఆమె తల్లిదండ్రులు ఆ శోకంని
పూర్తిగా మరిచిపోలేదా? ఆ తరువాతే కదా మీనా, జానా పుట్టారు? దానికేం? అదే జీవించే జనుల స్వభావం.
జీవించని గీత మనసులో మొలకెత్తి, నాశనమై, మరిగిపోయిన భావనలు, జ్ఞాపకాలు, ఆశలు, కలలు వాళ్ళకి తెలుసా?
కానీ, గీతలాగే, ఆమెకంటే చిన్న వయస్సులో, గత అర్ధ శతాబ్ద హైందవ వైధవ్య అగ్నివివర్ణతలో బలి అయి, జీవితం అనుభవించాక, ఆ జ్ఞాపకాలు, ఆ కలలు కన్న గౌరీ అవ్వ గీత గురించి ఆలోచించకుండా ఉంటుందా?
అందువలనే గణేశయ్యర్, పార్వతి లాగ, గీత ఇక ఏం చెయ్యబోతుందో అని తెలిసిన తరువాత, అవ్వకి ఆమెని దూషించాలనో, శపించాలనో తోచలేదు. ‘అయ్యో, ఇక మనం చేసేదేముంది?’ అనే ఆవిడ కలవరడుతోంది.
సాయంకాలం ముగిసి దీపం వెలిగించే సమయం మాటినీ షోకి వెళ్ళిన మీనా, అంబి ఇంటికి తిరిగివచ్చారు. గడపలో కాలుపెట్టిన అంబి, హాలులో ఏటవాలు కుర్చీలో బాగా నిద్రపోతున్న నానమ్మని చూడగానే గభీమని ఆగాడు.
“చూడు, నానమ్మ! ” అని మీనాకి హెచ్చరిక చేసాడు.
“ఎక్కడ? లోపల ఉందా? హాలులో ఉందా?” అని మీనా వెనకాడింది.
“సింహాసనంలో నిద్రపోతోంది” అన్నాడు అంబి.
మీనా భుజంమీద సొగసుగా వేలాడుతున్న వోణీని బాగా తెరిచి, నడుములో ఇమిడ్చుకొని, పైటకొంగు సరిగ్గా ఉందా అని ఒకసారి చూసుకొని, తల వంచుకొని సాదువుగా ఇంటిలోకి ప్రవేశించింది.
లోపల వచ్చిన తరువాతే నానమ్మ నిద్రపోలేదని తెలిసింది. ఒక పక్క నాన్నగారు కుర్చీలో. ఇంకొక పక్క అమ్మ మొహంని చీరకొనతో కప్పుకొని నేల మీద పడి ఏడుస్తోంది. ఏమైందని తెలియక కలవరంతో మీనా, అంబి అలాగే నిల్చున్నారు.
అప్పుడే జానా నవ్వుతూ అంబి దగ్గరకి పరుగెత్తుకొని వచ్చింది. “చూడు, నానమ్మ దోసకాయలు కొని తెచ్చింది!” అని ఆమె మాటలు విని అవ్వ కళ్ళు తెరిచి చూసింది.
“నానమ్మ, ఎప్పుడు రావడం?” అని అడిగిన తరువాత మీనా “ఏం జరిగింది? ఇదేంటి?” అని సైగ చేస్తూ అడిగింది.
అవ్వ కళ్ళు తడిసిపోయాయి.
మీనాని చూసిన తరువాతనే అవ్వకి ఇంకొక సంగతి గుర్తుకి వచ్చింది. గణేశయ్యర్ గీతని ఖండించడానికి కారణం, పార్వతి కూతుర్ని శపించడంలో న్యాయం, ఆవేశం అవ్వకి బోధపడ్డాయి.
అక్కడ నేలమీదున్న ఉత్తరం మీనా చదివింది. “నువ్వేం దాన్ని చదవవద్దు” అని అవ్వ చెప్పాలనుకుంది, కాని ‘పోనీలే, చదవనీ’ అని ఆలోచించి మీనా మొహాన్ని చూసింది.
మీనా మొహం జుగప్సతో చిటచిటలాడింది.
“ఎంత పని చేసావే, చచ్చిపో!” అని సణుక్కుంటూ మీనా ఉత్తరం పూర్తిగా చదివింది. ఆమె భుజం వెనుక నిల్చున్న అంబి కూడా చదివాడు. ఆముదం తాగినట్టు మొహం మార్చుకున్నాడు.
ఇంటిని శూన్యం పూర్తిగా ఆవరించుకుంది. ఊరంతా ప్లేగు వ్యాధి వ్యాపించి, తమ ఇంటిలో ఒక మూల చచ్చిన ఒక ఎలుకని చూస్తున్నట్టు కుటుంబ సభ్యులందరూ సంకోచంతో ఒకరినొకరు చూసుకున్నారు.
రాత్రంతా గౌరీ అవ్వ నిద్రపోలేదు. భోజనం చెయ్యలేదు. హాలులోని ఏటవాలు కుర్చీనుంచి లేవనేలేదు.
కొడుకునీ, కోడలునీ, పిల్లలనీ చూస్తూ, గీతగురించి ఆలోచిస్తూ ఆవిడ నిట్టూర్పు వదులుతోంది.
‘గీతా, ఆ రోజు నన్ను సాగనంపడానికి బస్సు స్టాండ్ వచ్చినప్పుడు, బస్సు బయలుదేరడానికి ముందు నువ్వు కళ్ళు తుడుచుకోవడం చూసాను. ఇప్పుడే నాకు బోధపడింది - నానమ్మని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడం నీకు ఎంత బాధగా ఉందని! పాపిని, నీ కన్నులో ధూళి పడిందని అనుకున్నాను.’
‘ఎందుకిలా చేసావే!’ అని పదే పదే వేదనతో అవ్వ గీతని తనలో అడుగుతున్నట్టుగా తనలో తాను గొణుక్కుంది.
ప్రాతఃకాలానికి కొంచెం సమయం ముందు అవ్వ ఆలోచిస్తూనే నిద్రపోయింది. ఆవిడ లేచి చూసినప్పుడు బాగా తెల్లవారిపోయింది.
వీధిలో ఆవరణ తడకి పక్కన మంగలివాడు వేలాయుధం కనిపించాడు.
అవ్వకి పూర్తిగా మెలకువ వచ్చేసింది. ‘జరిగినదంతా కలగా మారిపోతే ఎంత బాగుణ్ణు!’ అనే ఆలోచన కలిగింది. ‘కల కాదు, ఇది నిజం!’ అని జవాబు చెప్తున్నట్టు స్టూల్ మీద ఆ ఉత్తరం ఉంది.
అవ్వ ఆ ఉత్తరాన్ని మళ్ళీ చదివింది. ఇప్పుడు గదిలోనుంచి వచ్చిన గణేశయ్యర్ రాత్రంతా దీనిగురించే ఆలోచిస్తూ బాధపడుతున్న తల్లిని ఓదార్చాలని “అమ్మా, వేలాయుధం వచ్చాడు. అది చచ్చిపోయిందనే భావనతో క్షవరం చేసుకొని స్నానం చేసేయ్” అని అన్నారు.
“నోరు మూసుకో!” అని అవ్వ గర్జించింది. “పొద్దున్నే ఎందుకీ అశుభమైన మాటలు? ఇప్పుడు ఏం కొంప మునిగిందని దాన్ని చావమంటావ్?” అని అడిగి భరించలేని దుఃఖంతో మొహం ఎర్రబడుతూంటే వెక్కి వెక్కి ఏడ్చింది. తరువాత ఎర్ర కన్నులు తెరిచి అతన్ని అడిగింది.
“అదేం పొరబాటు చేసిందిరా? అదేం పొరబాటు చేసింది, చెప్పు. ” అని తల్లి అడిగిన ప్రశ్న విని గణేశయ్యర్ ఒక క్షణం విస్తుపోయారు.
“ఏం పొరబాటా? అమ్మా నువ్వేమంటున్నావ్? నీకేం పిచ్చా?” అని గణేశయ్యర్ అరిచారు.
తన స్వభావానికి తగినట్టుగా అవ్వ నిదానంగా కొడుకు మొహం చూసి నెమ్మదిగా ఆలోచించింది. తన కొడుకు తనతో ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి.
“అవును, నాకు పిచ్చి. ఇప్పుడు కాదు, అది పాత పిచ్చి. నయంకాని పిచ్చి, కాని నా పిచ్చి. నాతో అది పోనీ. ఆ పిచ్చి గభీమని దాన్ని పట్టుకుంటే మనం చేసేదేముంది? అది చెప్పేసింది కదూ - ‘నేను చేసేది నా వరకూ యోగ్యమైన పని! సమాజంలో కపటంగా మెలగుతూ, అపకీర్తికి పాలయి, కుటుంబంకి చెడ్జ పేరు రాకుండా జీవించడమే పవిత్రత’ అని?”
“అలాగ వాదిస్తే అది సరి అయిపోతుందా?” అని గణేశయ్యర్ ఎత్తి పొడిచారు.
“దాని మనసుకి ఇది సరైన నిర్ణయం అంటోంది. నువ్వేమంటావ్?”
“అది మన శాస్త్రాలూ, ఆచారాలూ ఎరుగని మూర్ఖురాలు. మన కుటుంబం ప్రతిష్టని నాశనం చేసేసింది. అది చచ్చిపోయిందని క్షవరం చేసుకో!’ అని అంటున్నాను” అని పళ్ళు కొరుతూ గణేశయ్యర్ బొబ్బలు పెట్టారు.
అవ్వ ఒక నిమిషం తనను, తన కొడుకుని ఇతరులలాగ భావించి, నవ్వుతూ మాటాడింది.
“మన శాస్త్రాలూ, ఆచారాలూ! అలాగైతే నువ్వేం చేసివుండాలో తెలుసా? ఆ శాస్త్రం నన్నేం చేసిందో. తెలుసా? అప్పుడు నువ్వు పాలు తాగే శిశువు. నాకు పదిహేనేళ్ళు. నా బిడ్డ నా మొహం చూసి దెయ్యాన్ని చూసినట్టు ఉలికిపడింది. కన్నతల్లి దగ్గర పాలు తాగలేక నువ్వు భయంతో బొబ్బలు పెడతావ్. అవును, నన్ను అంటరానిదానిగా ఒక మూల కూర్చోబెట్టేసారు. ఆ ఘోరం నువ్వెందుకు గీతకి చెయ్యలేదు? ఏం, ఎందుకు చెయ్యలేదు?” అని తడిసిన కళ్ళతో ఆవిడ అడిగినప్పుడు గణేశయ్యర్ కూడా ఏడ్చారు. అవ్వ ఇంకా మాటాడుతునే ఉంది.
“నీ శాస్త్రం గీతని రంగుల చీరలు ధరించాలని చెప్పిందా? కొప్పుని అలంకరించుకొని స్కూలుకి వెళ్ళమని చెప్పిందా? ఉదరనిమిత్తంకోసం ఉద్యోగం చెయ్యమందా? వీటికోసం నువ్వు నా అనుమతి అడిగినప్పుడు నేనూ సరే అన్నాను. ఎందుకు? రోజులు మారుతున్నాయి. ‘నేను పుట్టిన వంశం’ అని అన్నావ్. నాతో నువ్వున్నావ్. మనకి ఇల్లూ, పొలాలు ఉండేవి. ఆ రోజులు అలంటివి. గీత చేసే పని ఎవరూ కల్పనకూడా చెయ్యలేని యుగం అది. కాని ఇప్పుడో? నాకు నీ మనస్సు బోధపడిందిలే, నీ పిల్లలు భవిష్యత్తులో బాగా వర్ధిల్లాలి. అదే గీతకూడా రాసింది. నీ శాస్త్రం దాని జీవితంకి దోహదం చేస్తుందా? అందుకే అది వొద్దనేసింది. కాని గణేశా, విను, నాకు గీత కావాలి, అదే కావాలి! నాకు మరేం కావాలి, చెప్పు! నా శాస్త్రం నాతో పోనీ! మీరందరూ బాగా ఉండండి. నేను వెళ్తున్నాను, గీతతోనే ఇక నేను ఉంటాను.. నువ్వూ ఆలోచించి చూడు. అదే మంచిది అని తెలుసుకుంటావ్, లేకపోతే నీ కూతురులాగే నేనూ చచ్చిపోయానని స్నానం చేసేయ్, సరేనా?”
“అమ్మా” అని గణేశయ్యర్ చేతులు కలుపుకొని మౌనంగా ధారధారగా కన్నీరు కార్చారు.
“నువ్వెందుకురా ఏడుస్తావ్? నేనూ బాగా ఆలోచించే ఈ నిర్ణయంకి వచ్చాను. అదేం చేసినా మన బిడ్డ. ” అని నెమ్మదిగా చెప్పిన తరువాత అవ్వ “పార్వతీ, ఇల్లు బాగా చూసుకోవమ్మా, నేను వస్తాను.” అని అందరి దగ్గర శెలవు తీసుకొని అవ్వ బయలుదేరింది.
“నేను వెంటనే వెళ్ళి గీతని చూడాలి” అని అంటూ అవ్వ తిరిగి చూసినప్పుడు, దూరంలో నిల్చున్న మంగలివాడిని చూసింది.
“నువ్వు వెళ్ళవయ్యా. నేను తొందరగా నైవేలీ వెళ్తున్నాను” అని అంటూ వాడికి నాలుగణాలు ఇచ్చి పంపించింది.
“ఇక వాడికి ఇక్కడ పని లేదు. దానికేం? లోకంలో ఎన్నో మార్పులు! నేను ఒక మంగలివాడిని మార్చుకుంటే ఏంపోయింది?” అని నవ్వుతూ, నడుమున ఖాకీ సంచిని ఎత్తిపెట్టుకొని అవ్వ మళ్ళీ అందరిదగ్గర శెలవు తీసుకుంది.
అదిగో, ఆ ఉదయాన, ఇంకా వేడెక్కని ఆ మట్టినేలని తన పాదాలతో నొక్కుతూ ఒక పక్క వొంగి, వొంగి నడిచే ఆ అవ్వ దృశ్యం.
రాబోయే కొత్త యగంవైపు తొలి అడుగులు వేస్తూ ఒక గత కాల యుగ ప్రతినిధి ప్రయాణం చెయ్యడమంటే దానికి ఎంత పరిపక్వత కావాలి!
****
[1]* - చెన్నై నగరంకి సమీపంలో పారిశ్రామిక నగరం