MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
కోణాలు
తమిళ మూలం : జయకాంతన్
తెలుగు అనువాదం : రంగన్ సుందరేశన్.
ఎన్ని కోణాలు! ఎన్ని చూపులు!
గభీమని గతిలేని ఒక స్థితిలో ఏకాంతంగా, ఎవరూ ఓదార్చలేనట్టు, నిరాదరువుగా తన్ను వదిలేసినట్టు రాజలక్ష్మి అల్లాడిపోయింది.
గడచిన అర్ధగంటనుంచి ఇంటి ముందు హాలులో ఒక సోఫాలో చంచల మనసుతో కూర్చున్న యజమానిని చూసి వంట మనిషి శంకరి అవ్వ మెల్లగా నడిచివచ్చి ఆవిడ పక్కన నిల్చుంది.
తను వచ్చి నిలబడినది గుర్తించక ఏదో ఆలోచనలో మునిగిపోయిన రాజలక్ష్మిణిని చూసి “ఏమే రాజం, నువ్వెలాగో ఉన్నావ్, నీకేమైందే?” అని అవ్వ అభిమానంతో అడిగింది.
“ఏమీ లేదు. ఉత్తికే కూర్చొనివున్నాను . . . మీ పనులు మీరు చూసుకోండి,” అని అంది రాజం.
అవ్వ ఒక క్షణం రాజలక్ష్మిని తేరిపారి చూసింది. వెంటనే ఒక చిరునవ్వు నవ్వి,“ఓహో, ఈ రెండురోజులూ పిల్లలతో ఇంటికి వచ్చిన అమ్మాయలూ, అల్లుళ్లూ అందరూ వెళ్ళిపోయారని నీకు బాధగా ఉందా? బాగుందమ్మా నీ న్యాయం! మహారాజులాగ అబ్బాయికి ఒక పెళ్ళి చేసి ఈ ఇంటిలోని పిల్లల్ని ముద్దాడకపోయావా? కూతుళ్ళ పిల్లల్ని కలకాలం నమ్ముకుంటే ఎలాగ?” అని ఒక ప్రశ్నని సాగదీసి అడుగుతూ వంటగదికి నడిచింది.
అవ్వ చెప్పినది నిజం, కాని రాజలక్షి మొహంలో కనిపించే కలవరంకి అది పూర్తి కారణం కాదు.
ఆవిడ కుమార్తెలు, పిల్లలు చాలా సార్లు - తరచుగా - ఇంటికి వస్తూ పోతూనే ఉన్నారు. పండుగలు, పర్వాలు అంటే చాలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్ళు ఇక్కడే మకాం. అందువలన వాళ్ళకి లాభం రాజలక్ష్మికి, ఆమె కొడుకు మురళీకి తృప్తి. జ్యేష్ట కుమారుడు - ఒకడే కొడుకు - ముప్పైయైదు నిండినా బ్రహ్మచారిగా, నెలా వెయ్యిరూపాయలకిపైగా జీతంతో, కారూ, బంగళాతో ఉన్నప్పుడు అతని చెల్లెళ్ళు ఎలాగ ఒంటరిగా మెట్టినిల్లులో ఉండడానికి ఇష్టపడతారు? వాళ్లు ఇష్టపడినా, ఆ తల్లి ఊరకే ఉంటుందా?
అందువలనే ఆ ఊరులోనే నివసించే తన కుమార్తెలు, పిల్లలు అర్ధగంట ముందు తమ తమ ఇంట్లకి తిరిగివెళ్ళిపోయారనే కారణం వలన తనకి బాధగా ఉందని శంకరి అవ్వ అజ్ఞానంతో పలికిన మాటలు గుర్తు చేసుకొని రాజలక్ష్మి తనలో నవ్వుకుంది.
మంచిదయింది.సుబ్బు శాస్త్రి వచ్చినప్పుడు, ఆ ఘటన జరిగినప్పుడు, శంకరి అవ్వ మద్యాహ్నం వంటపనులు ముగించుకొని ఇంటి వెనుక భాగంలో గుఱకపెట్టి నిద్రపోతోంది.
అవ్వ ఆ ఇంటికి దాదాపు ఒక దూరపు బంధువే. కాని ఆ ఆ ఉనికికి తగినట్టుగా గుణాలు చోటుచేసుకోవడం సహజమే కదా? అందువలన నౌకరులకి కొన్ని సంగతులు తెలియకపోవడం మంచిదే!
కాని ఆ ఇంటిలో జరిగే ప్రతీ చలనం, ముఖభావం చూసిన క్షణమే మనసుని పూర్తిగా గ్రహించే నైపుణ్యం ఆవిడకి ఉంది! శంకరి అవ్వ అన్నీ తెలుసుకుంటుంది, ఒక అభిప్రాయమూ తనలో ఏర్పరచుకుంటుంది, కాని దేనిగరించి ఎవరితోనూ మాటాడదు! అవును, ఆవిడ ఆ ఇంటిలో కేవలం ఒక వంటమనిషి మాత్రం కాదు! ఏ నౌకరు యజమానిని ‘ఏమే’ అని పిలవగలదు?
రాజలక్ష్మి ఎదుట మేజామీద రెండు నోటు పుస్తకాలున్నాయి.
అవి రెండూ రెండు వేరే వేరే జాతకాలు. మేజామీదున్న తన అందమైన బంగారు ఫ్రేం కట్టిన కళ్ళద్దాలని తీసుకొని, ధరించి, ఆ రెండిటినీ ఆవిడ విడిచి విడిచి చూసింది. ఆ తరువాత వాటిలో ఒకటి తీసుకొని మేజా అరలో భద్రపరచింది ఆ రెండవ జాతకంని జుగుప్సతో చూసింది.
“ఈ సంబంధం వొద్దు, ఇది జరగనే కూడదు!” అని దృఢంగా గొణుక్కుంటూ, కళ్ళద్దాలని తీసి తలెత్తి చూసినప్పుడు ఆవిడ చూపు గోడమీదున్న, గతించిన తన భర్తపై వాలింది అతను తన్ను తేరిపారి చూస్తున్నట్టనిపించింది.
ఆ ఫోటో చూసినప్పుడు - పదేళ్ళ మీనా, ఆరేళ్ళ కమల - తన ఇద్దరు కుమార్తెలని నిరాదరువుగా వదిలేసి అతను కన్ను మూసిన రోజుల్లో తనకేర్పడిన బాధ్యతలు, వాటిని భరించి తను ముందుకు సాగడానికి నమ్మకం, విశ్వాసం ఇచ్చిన మురళి బాల్యరూపం ఆవిడకి గుర్తులోకి వచ్చింది.
వాడే ఇన్ని శ్రమల మధ్య, నిరుపేద జీవితంలో ప్రయాసపడుతూనే ఇవాళ ఉన్న ఈ అంతస్తుకి పెరిగి ఆ నమ్మకం, కలలు, కల్పనలు, సఫలం చేసాడు. ఇరవై ఐదు సంవత్సరాలు నిండకుండానే ఒక తండ్రి స్థానంలో వాడెలాగ ఓర్పు, బాధ్యతలు వహించి తన చెల్లెళ్ళకి తగిన వరులకోసం వెతికాడు! ఇవాళ మీనా, కమల తమ అంతస్తుకు పైగా అనుభవించే భర్తలు, సుఖప్రద కాపురాలు, ఆ రోజుల్లో ఊహించి కూడా ఉండరే?
అప్పడాలు వొత్తుతూ, శంకరి అవ్వకి వంటలో సాయంకని ఆవిడతో వెళ్తూ, జీవనపోరాటం చేసిన తనకి ఈ రోజు కారు, బంగళా, పట్టు చీరలు, బంగారు ఫ్రేం కట్టిన కళ్ళద్దాలు, ఉన్నాయంటే అందుకు మూల కారణం మురళీయే కదా? ఆ రోజుల్లో మనుగడ కోసం తను నమ్ముకున్న శంకరి అవ్వకి ఇప్పుడు తనింట్లోనే వంట మనిషిగా ఆశ్రయం ఇచ్చి తన్ను ఈ ఇంటి యజమానిగా గౌరవంగా జీవించడానికి దోహదం చేసినది ఎవరు?
అందువలనే రాజలక్ష్మికి మురళి మీద - తన కొడుకే ఐనా - గొప్ప మాన్యత, గౌరవం ఉన్నాయి. వయసు ముప్పై అయిదు నిండినా తన పెళ్ళి గురించి ఏ ఆలోచనా లేకుండా రాత్రి పగలూ పని చేస్తూ ధనం, పేరు, ప్రతిష్ట, పోగు చేస్తున్న వాడితో పెళ్ళి గురించి మాటాడానికి రాజలక్ష్మికి ధైర్యం లేదు.
అంత గౌరవప్రద కుమారుడు ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించి, తనే ఒక అమ్మాయి జాతకంని సుబ్బుశాస్త్రికి ఇచ్చి పొందిక చూడమని చెప్పాడని సుబ్బుశాస్త్రియే ఆ మధ్యాహ్నం ఆవిడకి చెప్పినప్పుడు తన జీవితం సఫలమైందని రాజలక్ష్మి ముప్పొంగిపోయింది.
సుబ్బుశాస్త్రిగారు ఈ కుటుంబంకి సంబంధించినంతవరకూ ఊరకే జోస్యులు మాత్రమేకాదు. ఈ కుటుంబం శ్రేయంలో అతనికి మంచి ఆసక్తి ఉంది. మురళి తండ్రికి అతను ఆత్మీయ మిత్రుడుకూడా. అందువలనే అతని ద్వారా ఈ సంగతి తన కుటుంబ సభ్యులకి తెలియజేయాలని మురళి నిశ్చయించాడు.
ఆ మధ్యాహ్నం - మురళి చెప్పినట్టు - కమల, మీనా తమ భర్తలతో ఇంటికి వచ్చినప్పుడు - ఆ రెండు జాతకాల పొందిక గురించి మాట్లాడి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని వచ్చిన శాస్త్రిగారు జాతకాల పొందిక వివరించడంతో తన బాధ్యత తీరిపోయిందని భావించలేదు.
“ఇది శ్రేష్ఠమైన పొందిక,” అని అతనన్న మాటలు వినగానే, రాజలక్ష్మి అమ్మాయి ఎవరు అని ఆలోచించకుండా, “ఇప్పుడైనా పెళ్లిచేసుకోవాలని దేవుడు మురళికి బుద్ధి ఇచ్చాడే, మంచిది” అని సంతోషంతో ఒక నిట్టూర్పు వదిలింది. అదే సమయం పెద్ద కూతురు కమల భర్త మొహం చిరచిరలాడడం సుబ్బుశాస్త్రి గమనించారు.
తల్లీ, చెల్లెళ్ళని నేరుగా కలుసుకోకుండా ఒక మూడవ మనిషి ద్వారా తను చూసిన అమ్మాయి గురించి అన్నయ్య తమకు తెలియజేయడంలో కమల, మీనాకి మురళి చేష్టలో ఉపేక్ష కలిగింది.
తన సంతోషం, సంతృప్తి మరెవరూ పంచుకోలేదని కలవరపడి రాజలక్ష్మి ప్రతీ ముఖం చూసింది. ఆ అసంతృప్తికర నిశ్శబ్దంలో మీనా భర్త మాటాడాడు: “ఈ పెళ్ళికి మీ అబ్బాయికి బుద్ధి ఇచ్చినది - మీరనుకుంటున్న దేవుడు కాదు కాదండి! అది శని భగవంతుడు!”
“అయ్యో, ఇదేం అపశకునం!” అని రాజలక్ష్మి రెండు చెవులూ మూసుకుంది.
అప్పుడే సుబ్బుశాస్త్రి గరగరమని శబ్దం చేస్తూ మాటాడారు. “మురళి నన్ను జాతకాల పొందిక మాత్రం చూడమన్నాడు. ఇవాళ మురళి ఎంత అంతస్తులోవున్నాకూడా వాడు నా అన్యోన్యమైన స్నేహితుడు శివరామన్ కొడుకేకదా? ఆ శివరామన్ ఒక పేద గుమాస్తావే, కాని అతని కుటుంబం ఆచారమైన, గౌరవమైన కుటుంబం అని అందరికి తెలుసు. ఆ గౌరవంకి భంగం రాకూడదని నాకుంది. అదే మీ అల్లుడుగారు కూడా చెప్తున్నారు. అమ్మాయి గురించి అతనికి తెలుసు అని నా అభిప్రాయం. అవునా?” అని అతను అడగడానికి ముందే మీనా భర్త, “అదేం “పెద్ద రహస్యం కాదే? ఆ అమ్మాయిని చూసి ఊరంతా నవ్వుతున్నారే? అది మరెవరో కాదు, ఈ నోటిసులోని అడ్రసు చూడండి! మన కాలనీలోనే Sixth Main Street లో ఉన్న Playback Singer ప్రమీలనే మీ అన్నయ్య ఎంచుకున్నాడు!” అని మండిపడుతూ మీనాకి వివరించాడు.
“ఇదేం గ్రహచారం!” అని రాజలక్ష్మి నెత్తిని బాదుకుంది.
అవును. ఆ గాయకి ప్రమీల గురించి ఊరులో అందరూ అధికంగానే మాటాడుకుంటున్నారు. ఆ మాటల్లో ఎంత నిజం ఉందని మాటాడేవారికి, వింటున్నవారికి, ఏ చింతా లేదు.
ఆ సాయంకాలం, బయలుదేరి వెళ్ళేవరకు, రాజలక్ష్మి కుమార్తెలు, అల్లుళ్ళు, ఆ ప్రమీల గురించి తెలిసిన, తెలియని, కబుర్లు మళ్ళీ మళ్ళీ మాటాడుకున్నారు:
‘దాసోహం’ అని వశమైపోయి, ఆమె ఇంటిలోనే నిలకడగా బస చేస్తూ, ఆమె దయలో బతికే ఆ మన్నార్గుడి రాజగోపాలన్ గురించి
వాడు బాగా తాగేసి కారుని నడిపే విధం గురించి, గిండి రేసులో డబ్బు తగలపెట్టి వాడు తిరిగివచ్చినప్పుడు నిషాలో, ప్రజ్ఞ తప్పి సైదాపేట్ వంతెన దగ్గర ఎదుట వచ్చే లారీతో ఢీకొట్టుకొని మరణించిన విపత్తు గురించి,
ప్రమీల మీదున్న మోహం వలన తన భార్యని, పిల్లని వదలిబెట్టి, ఆమె కోసం తన ఆస్తిని పోగొట్టుకున్న వివరాల గురించి . . .
ఇవన్నీ తమకిష్టం వచ్చినట్లు వారందరు మాటాడుతుంటే రాజలక్ష్మి బెంగతో, తల వంచి, మౌనంగా వింటోంది.
ఆఖరికి వాళ్లందరు సెలవు తీసుకున్నప్పుడు “వచ్చే ఆదివారం మురళీ పుట్టినరోజు. మీరందరూ రండి!” అని రాజలక్ష్మి అల్లుళ్ళకి చెప్పింది.
అప్పుడే కమల భర్త నిర్మొహమాటంగా జవాబు చెప్పాడు:
“ఇక మేం మీ ఇంటికి రావడానికి ముందు ఈ పెళ్ళి సంబంధం గుంచి మీ నిర్ణయం ఏమిటో మాకు తెలియాలి,” అని చెప్పి తన తోటల్లుడిని చూసి, “నేనన్నది సరేనా?” అని అడిగాడు. అతను మాత్రమే కాదు, మీనా, కమల కూడా అతనితో ఏకీభవించి “అమ్మా, విను, ఈ పెళ్ళి సంబంధం అన్నయ్య మానుకోవాలి. లేకపోతే ఈ ఇంటికీ, మాకూ పొత్తులేదని అన్నయ్యకి చెప్పేయ్!’ అని వక్కాణించి చెప్పేసారు. గభీమని గతిలేని ఒక స్థితిలో ఏకాంతంగా, ఎవరూ ఓదార్చలేని పరిస్థితిలో రాజలక్ష్మిని వదిలేసి అందరూ వెళ్ళిపోయారు.
‘వాళ్లు చెప్పినది సరే,’ అనే భావనతో తన కొడుకుతో ఈ పెళ్ళి సంబంధం గురించి ఎలా మాట్లాడి, ఈ ప్రయత్నం ఆపడం?” అని ఆలోచిస్తూ రాజలక్ష్మి చాలా సేపు హాలులో, సోఫాలో కూర్చొనివుంది.
వంటగదిలో పనిచేస్తున్న శంకరి అవ్వ మాటి మాటికి రాజలక్ష్మిని చూస్తూవుంది.
ఆవిడ మనసులో “ఛీ, ఈ ఆడజన్మకి ఎంత స్వార్థం! దీనికి తనూ, తన కుమార్తెలు హాయిగా ఉంటే చాలు! వాడు ఎంత కఠినంగా పని చేసి ముసలాడైపోయినా ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది! . . . వాడికి పెళ్ళి అని వినగానే, ఈ కూతుళ్ళు మూతిముడుచుకున్నారు! పోనీలే, వాళ్ళు పెళ్ళైయి వేరే ఇళ్ళలకి వెళ్ళిపోయారు, మరి కన్న తల్లికి కూడానా? ఇప్పుడేం కొంప మునిగిపోయిందని రాజం ఇలా అల్లాడుతోంది? ‘కొడుక్కి పెళ్ళి!’ అనే సంతోషం మొహంలో రవంతైనా కనిపించదే? దేవుడా, ఆడపిల్లల్ని ఎందుకు ఇంత బలహీనంగా సృష్టించావ్?” అని ఆ మధ్యాహ్నం జరిగిన ఘటనలని అస్పష్టంగా గ్రహించిన అవ్వ తనలో చిరచిరలాడింది.
ఇలాగే జీవితంలో ఒకరి గురించి ఒకరు తమకి తెలిసిన ఒకే కోణంనుంచి, ఒక భాగం మాత్రం అవగాహన చేసుకొని, ఒక నిర్ణయంకి వచ్చి, అదే ఒక సమస్తమైన నిర్ణయం అని నొక్కిచెప్తుంటారు.
**
వాడుకగా శంకరి అవ్వ వంటపనులన్నీ పూర్తిచేసుకొని రాత్రి ఎనిమిదన్నర గంటలకి వసారాలో పడక విరిచి నిద్రపోయింది. వయసు చెల్లిన కాలంలో కఠినంగా చాకిరీ చెయ్యడం వలన పడుకున్న కొన్ని నిమిషాలలోనే ఆవిడ నిద్రపోతుంది. కాని ఇవాళ మధ్యాహ్నం మాత్రంమే కాదు, ఇప్పుడుకూడా . . . ఆవిడ గురక మాత్రం వదలుతోంది.
తొమ్మిది గంటలు అవగానే బంగళాకి ముందున్న చెట్లమీద కాంతిని వెదజల్లుతూ మురళీ కారు గేటుముందు వచ్చి ఆగింది. మురళీ తనే కారునించి దిగివచ్చి గేటు తలుపులు తీసి, కారుని షెడ్డులో పెట్టి, ఇంట్లోకి వచ్చి, మేడమెట్లు ఎక్కి తన గదికి వెళ్ళాడు. పాపుగంట తరువాత దుస్తులు మార్చుకొని డైనింగ్ హాలుకి వచ్చాడు. ఆ తరువాతే రాజలక్ష్మి సోఫానుంచి లేచి వచ్చింది.
వాడికి అన్నం వడ్డించినప్పుడు, ఆమె తన్ను చూడనప్పుడు, కొడుకు తల్లిని చూసాడు వాడు భోజనం చేస్తున్నప్పుడు, తన్ను చూడనప్పుడు, తల్లి వాడిని చూసింది. చూపుల ద్వారానే తల్లీ, కొడుకు భావనలని ఊహించుకున్నట్టనిపించింది.
ఆ మౌనంలోని భారంని కోంచెం తగ్గించాలని మురళీయే ముందు మాటాడాడు: “కమలు, మీను ఎన్ని గంటలకి వెళ్ళారు?”
“నువ్వు రావడానికి ఆలస్యమవుతుందని చెప్పావుకదా? . . . అందువలన కాచుకోవద్దని మధ్యాహ్నమే వెళ్ళిపోయారు.”
డైనిగ్ హాలులో సంభాషణ ఆరంభమగగానే వసారాలో నిద్రపోయే శంకరి అవ్వ గురక శబ్దం తక్కుతూ వచ్చింది.
“మధ్యాహ్నం సుబ్బుశాస్త్రిగారు వచ్చారు.”
ఒంగిన తల ఎత్తకుండా మురళీ ‘హుమ్’ అన్నాడు.
అవ్వ నిద్రపోతోందని ఖాయం చేసుకున్నతరువాతే రాజలక్ష్మి ఆ సంగతి గురించి మాటాడం ఆరంభించింది:
“అతను ఆ జాతకం గురించి మాటాడానికే వచ్చారు. జాతకాల పొందిక బాగానే ఉందన్నారు, కాని . . . ”
భోజనం చేస్తున్న మురళీ తలెత్తి చూసాడు. అదే సమయం వసారాలో తేలికగా వినబడుతున్న గురక శబ్దం పూర్తిగా ఆగిపోయింది.
“ఆ పిల్లగురించి ఊరులో అందరూ గాలిమాటలాడుతున్నారు . . . నీకు తెలీదేమో? . . . తెల్లగా కనిపిస్తే అది స్వచ్ఛమైన పాలని నీ నమ్మకం . . . మీనా భర్త కూడా ఆక్షేపించారు . . . వాళ్ళెవరికీ ఈ సంబంధంలో ఇష్టం లేదు . . . అసలు అమ్మాయి ఎవరని నాకు ముందు తెలీదు, నువ్వు ఇలాంటి అమ్మాయి జాతకం తెస్తావని నేను ఊహించగలనా? ఇన్నిరోజుల తరువాత నువ్వు నీ పెళ్ళి గురించి ఆలోచిస్తున్నావని నేను మురిసిపోయాను . . . అవును, నీకు దాని కులగోత్రాల గురించి ఏమైనా తెలుసా?” అని తొందరగా, ఆవేశంతో రాజలక్ష్మి అడగ్గానే మురళి ఒక చిరునవ్వు నవ్వి నిదానంగా జవాబు చెప్పాడు.
“తెలుసు అని అన్నవాళ్ళందరికీ ఎంతవరకు తెలుసని నాకు తెలుసు నీ ఉద్దేశం ఏమిటో చెప్పు!”
“ఈ పెళ్ళి సంబంధం మానుకోపోతే ‘ఈ ఇంటికీ, మాకూ పొత్తులేదని అన్నయ్యకి చెప్పు!’ అని చెప్పేసి మీనా వెళ్ళింది. ”
“మీనా అలాగ చెప్పిందా? బాగుంది!” అని ఆమె కోపంని విని ఆనందించినట్టు మురళి నవ్వాడు.
“మీనా మాత్రం కాదు . . . అందరూ అలాగే మాటాడారు . . . ఇక ఈ ఇంటి గుమ్మం కూడా ఎక్కడం జరగదన్నారు . . . సుబ్బుశాస్త్రికి కూడా ఈ సంబంధంలో తృప్తి లేదు”
తన తల్లి అందరి అసంతృప్తి, నిరాకరణ వివరించి చెప్పడం సహించలేక మురళి తటాలున అడిగాడు: “అమ్మా, సుబ్బుశాస్త్రి, పప్పుశాస్త్రి సంగతి అలాగే ఉండనీ . . . నాకు నీ అభిప్రాయమే ముఖ్యం . . . అది నువ్వే నాకు చెప్పడానికి వెనకాడుతావని నేను సుబ్బుశాస్త్రికి చెప్పి పంపించాను. ఇక నీ మనసులో ఏముందో చెప్పు!”
కొంచెం సేపు గూఢంగా ఆలోచిస్తున్నట్టు రాజలక్షి మౌనం వహించి ఆ తరువాత మాటాడింది: “వాళ్ళు చెప్పేది న్యాయమని నాకనిపిస్తోంది. మన గౌరవంకి ఈ సంబంధం వొద్దు అని నా అభిప్రాయం.” అలా అన్న తరువాత తన సందేశం ఖాయపరిచే ధోరణిలో “అదే నా అభిప్రాయం!” అని ముగించింది.
“ఓ, అలాగా? సరే, అమ్మా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. ఈ పెళ్ళి జరగదు!” అని చెప్పి, మురళి భోజనం ముగించి చెయి కడుక్కోడానికి పెరడుకి వెళ్ళాడు.
మురళి ఒక నిమిషం తల వంచి ఆలోచించాడు తల్లి మొహాన్ని తేరిపార చూసాడు ఏదో ఆలోచనలోపడి తల ఊపాడు.
“మురళీ, నేనూ బాగా ఆలోచించాను: నీకు నలుగురుకి బుద్ధి చెప్పే త్రాణ ఉంది. చిన్న వయసులోనే నువ్వు చాలా బాధ్యతలు తీసుకొని పెద్ద మనిషిగా పెరిగావ్. నువ్వుకూడా ఇలాంటి పొరబాటు చెయ్యగలవా అని నేనూ బాగా ఆలోచించాను . . . ఎంత పెద్ద మనిషి అయినా, నాలుగైదుసార్లు బాగా ఆలోచించి ఒక పని చెయ్యాలని నిశ్చయించినవారు కూడా ఇటువంటి విషయంలో ముందాలోచన లేకుండా తొందర పడతారు. అందుకే నేను ఇంత నిశ్చయంగా ఈ పెళ్లి వద్దంటున్నాను. కాని నీకు ఈ నెల పెళ్ళి జరగాలి. ఎంతమంది పోటీపడతూ తమ పిల్లలతో నీకోసం కాచుకొని ఉన్నారని నీకు తెలుసా?” అని ఆమె అనగానే మోహం తుడుచుకుంటున్న మురళి చెయిలోని తువ్వాలును పిసుకుతూ, తల వంచి, గరగరమని మాటాడాడు:
“అమ్మా, నీ మనసులో ఏముందో, ఇతరుల అభిప్రాయం ఏమిటో నేను తెలుసుకున్నాను. నీ మాట నేను వింటాను. ఇతరుల గురించి నాకు లెక్కలేదు. కాని నువ్వు నా మనసుని గ్రహించాలి. నేనేం పిల్లవాడిని కాదు, ప్రేమా, ఇదీ, అదీ అని కల్పించుకొని బాధ పడడానికి. నాకేమో అనిపించింది - నువ్వు వద్దంటే సరే. కాని ఇంకొక పెళ్ళిగురించి నాకు ఏ ఆలోచనా లేదు. దానిగురించి మాటాడవద్దు!” అని మురళి అన్న మాటలు వినగానే రాజలక్ష్మికి గుండెలో ఎలాగో అనిపించింది.
“మరి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు నీకు నీ పెళ్ళిగురించి ఆలోచన వస్తుంది?” అని ఆరాటంతో అడిగింది.
“సరే, అసలు ఆ ఆలోచన ఇక రానేలేదనుకో, దానిగురించి ఇప్పుడు ఎందుకు?” అని చిరచిరలాడుతూ తువ్వాలుని పారేసి హాలుకి మురళి వెళ్ళిపోయాడు.
అతను వెళ్తున్న దిశని చూస్తూ అలాగే నిలబడిన రాజలక్ష్మి మనసులో రకరకాల ఆలోచనలు లేచాయి. వాటి భారం సహించలేక కుమ్మరించాలని గబగబ హాలుకి పరుగెత్తింది.
సోఫాలో వాలి మూసుకున్న కళ్ళతో కూర్చున్న మురళీ ఎదుట నిలబడి రాజలక్ష్మి “నీకు ఈ సంబంధంలోఇంత పట్టుదల ఉందన్నమాట! అది చూస్తే నాకు భయమేస్తుంది. నువ్వెందుకు నీకు పెళ్ళే వద్దంటున్నావ్? . . . ఒకవేళ పెళ్ళి చేసుకోకుండా ఆ గాయకురాలుతో . . . ” అని తాను చెప్పదలచుకున్నది బాహటంగా చెప్పలేక ప్రయాసపడింది.
“అయ్యో, అమ్మా, నువ్వేమంటున్నావ్?” అని దయతో తల్లిని చూస్తూ మురళి లేచి నిలబడ్డాడు. “అమ్మా, నేను శివరామన్ గారి కొడుకుని. ఈ కుటుంబం గౌరవం నిలబెట్టే బాధ్యత నాకుంది. నన్ను నమ్ము, నీకేం భయం వద్దు!” అని హామీ ఇచ్చి మేడమీదున్న తన గదికి మురళి వెళ్ళాడు.
ఆ రోజు రాత్రంతా నిద్ర లేక రాజలక్ష్మి మానసిక వ్యధతో పెనగులాడింది.
తన అభిలాషకి నిరాకరణ కలిగిందని తను రవంతైనా బాధపడనట్టు మురళి ప్రవర్తించాడు.
తల్లి బెంగపడుతున్నట్టు తనకి పెళ్ళే వద్దని, సన్యాసి జీవితం కావాలని మురళి నిర్ణయించలేదు. అటువంటి పిచ్చి దశలు అతను దాటి చాలా కాలమైంది. ఇల్లు వదలితే అతనికి వాణిజ్య సంబంధంలో వెయ్యి ప్రశ్నలు వాటిమధ్య సంగీతంలో అతనికి ఉన్న అభిరుచి వలన ఈ గాయకురాలుతో పరిచయం ఏర్పడింది. ఒక ఘట్టంలో ఆమె ఒంటరిపాటు తెలుసుకున్న తరువాత మురళి తన ఏకాంతమూ గ్రహించాడు. అందువలనే ‘ఈమె నాకు భార్య అవుతే?’ అని ఒక ఆలోచన అతనికి తట్టింది. ఆ గాయకురాలులో కనిపించిన స్వభావం, సహజ గుణాలు, అతనికి నచ్చాయి. అందరూ ఏకీభవించితేనే ఆమెను తన భార్యగా చేసుకోవాలని మురళికి మనసులో ఉంది, అంతే! మరే విధమైన ‘మెలో డ్రామా’ ఏదీ వాళ్ళిద్దరిమధ్యా జరగలేదు.
ప్రేమ అని అన్నప్పుడు జాతకాల్లో పొందిక ఎవరికి కావాలి?
***
ఆ మరుదినం మురళి అలవాటుగా ఆఫీసుకి వెళ్ళిన తరువాత ఒంటరిగా ఉన్న రాజలక్ష్మి తనకీ, తన కుమార్తెలకి జీవనాధారం ఇచ్చిన కొడుకు వాంఛకి తను అడ్డుగా నిలబడి వాడి హృదయంని చితకగొట్టినందుకు అంగలార్చుకుంది.
అప్పుడు శంకరి అవ్వ తన పనుల మధ్య దొరికిన అవకాశంలో హాలుకి వచ్చింది.
“ఏమే రాజం, ప్రొద్దున్న ఒక గుక్కెడు కాఫీ తాగేసి ఇలా కూర్చున్నావ్! స్నానం ఎప్పుడు?” అని అడుగుతూ అవ్వ ఆమె ఎదుట సెమెంట్ నేలమీద చెయిని ఆనుకొని కూర్చుంది.
రాజలక్ష్మి అవ్వని చూసి ఒక నిట్టూర్పు వదిలింది, మరేం అనలేదు.
“ఏమిటే, అలా చూస్తున్నావ్?” అని అవ్వ దగ్గరకి జరిగివచ్చి ఆమె చెయిని అభిమానంతో తీసుకొని అదుముకుంది. రాజలక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. అంతే! అవ్వ ఇక భరించలేకపోయింది. దేహంలో ఒక వణుకు బయట ఒక వెక్కు గొంతు ఉక్కిరిబిక్కిరియైపోయింది మొహమూ, పెదిమలూ ఎఱ్ఱబారిపోయాయి. తలకప్పుని పైకిలాగ్గొని, కళ్ళు అదుముకొని “నాకన్నీ తెలుసులే! ‘దీనికెందుకు?’ అని మీరు తోసిపెట్టినా, నేనుకూడా ఒక భూతంలాగ ఒంటరిగా ఈ ఇంట్లో ఉన్నా, మురళి మనసు నన్ను ఆవరించుకొని ఉంది! వాడికి పెళ్ళయి, ఆ దంపతులకి వడ్డించకుండా నేను చావను, అది జ్ఞాపకం ఉంచుకో! నాకు మరేం సంతోషం కావాలి? నాకు మరెవరున్నారు చెప్పు, కొడుకా, కూతురా?” అని అవ్వ తనకి మురళిపట్ల ఉన్న సౌజన్యం తెలియజేసింది.
“ఎప్పుడైనా ఒకరోజు మురళి వంటగదికి వచ్చి, ‘ఏమండీ, ఇవాళ ఏమిటి వంట?’ అని అబిమానంతో నన్ను అడుగుతూ ఒక అప్పడం కొఱుకుతాడు. నేనూ వాడికి చెప్తాను: ‘కుఱ్ఱవాడులాగ నన్ను వెక్కిరించడం నీకు అలవాటైపోయింది నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవడం చేతకాదు! మీ అమ్మా ఈ జన్మలో చూడదు!” అని. అవును, వాడికి పెళ్ళవలేదంటే దానికి నువ్వే కారణం! . . . హుం, ఇవాళ మురళి బాత్ రూమ్ నుంచి వస్తున్నప్పుడు చూసాను, వాడి జుత్తు బాగా నెరసిపోయింది! రాజం, నీకు నీ కూతుళ్ళూ, మనవలు చాలు! . . .
“ఇప్పుడెందుకు నువ్వు కొంప మునిగినట్టు ఇలా కూర్చున్నావ్? నువ్వు చూసిన అమ్మాయి వొద్దని వాడు అనలేదే? ఇప్పుడు వాడు చూసిన అమ్మాయి వద్దని మీరందరూ అంటున్నారు . . . ఎవరెవరికి మనసులో ఏముందో? నువ్వు వాడిని కన్న తల్లి, అందుకే వద్దని చెప్పేసినా నీకు చాలా బాధగా ఉంది . . . ” అని అన్నప్పుడు అవ్వ తనకొక కొడుకు లేడని గుర్తు చేసుకొని దుఃఖపడింది. దాన్ని మింగుతూ ఇంకా చెప్పింది: “ఇంత అదృష్టం ఉన్నా నువ్వు అల్లాడిపోవడం చూసి నాకెలాగో ఉందే!” అని చెప్పి సగంలో వదిలేసిన పనులు పూర్తిచేయడానికి మళ్ళీ వంటగదికి వెళ్ళింది.
అవ్వ ఏం వట్టి వంటమనిషి కాదుకదా?
ఒక క్షణంలో తాను కూడా ఒకప్పుడు అవ్వలాగ ఉన్నప్పుడు ఆవిడ తనకు చేసిన ఆదరణ రాజలక్ష్మి గుర్తుచేసుకొని హాలునుంచి వంటగదికి వచ్చింది.
“మీరన్నది నిజం . . . కాని వాడు చూసిన అమ్మాయిగురించి ఊరులో అందరూ ఏమేమో మాట్లాడుతున్నారే?” అని రాజలక్ష్మి అడగ్గానే, అవ్వ ఒక నిమిషం ఆలోచించి చెప్పింది.
“ఇదిగో, రాజం, విను . . . మురళీ ఏమీ తెలియని కుఱ్ఱవాడా? కొంచెం ఆలోచించు! వాడికి ఈ వయస్సులోనే జుత్తు నెరసిపోయిందంటే ఏమిటి కారణం? వాడికి ఎన్ని బాధ్యతలున్నాయి! వాడికి ఇప్పుడు అందంని చూసి మైమరచే వయస్సు కాదు ఇంత తెలిసిన వాడికి ఈ అమ్మాయి ఇష్టమంటే దానికి తగిన కారణం ఉండితీరాలి! . . . మీకు ఇష్టం లేదని ‘వద్దు!’, ‘వద్దు!’ అని అనడానికి ఆ కమలాకి, మీనాకి, ఎంత ధైర్యం!” అని అవ్వ చిరచిరలాడింది.
“మీరేమంటున్నారు? అన్నయ్య పెళ్ళిలో వాళ్ళకేం హక్కు లేదంటున్నారా?” అని రాజలక్ష్మి అడ్డు ప్రశ్న వేసింది.
“హక్కు, ఏం హక్కు? ‘అన్నయ్య పెళ్ళి గురించి వాళ్ళకి శ్రద్ధ ఉందా?’ అని అడుగుతున్నాను! ఉంటే ఇంత హుటాహుటిగా వద్దని చెప్పేస్తారా? నేనంటున్నది ఇదే - ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం చేస్తే అది కోర్టులో చర్చ లేకుండా చేసిన తీర్పులాగ!”
అవ్వ మాటలు, వాదం విని రాజలక్ష్మి ఆవిడకి మురళీ గురించి, తన కుటుంబం గురించి ఎంత బంధం ఉందని గ్రహించింది. “ఆహా, మీరు బాగా చెప్పారు! మీ ఆయన కోర్టులో వకీలు గుమాస్తాగా పనిచేసారుకదూ? అందుకే మీరు ఇన్ని points తో మాటాడుతున్నారు! ” అని శ్లాఘించి రాజలక్ష్మి హాలుకి తిరిగి వచ్చేసింది.
ఆదే సమయం ఆవిడ మనసులో ఒక మంచి తీర్పు చోటుచేసుకుంది.
***
‘ఆ ప్రమీలని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మురళికి ఎలా వచ్చింది? అందుకు ఒక మంచి కారణం ఉందంటే ఆ నిర్ణయంకి విరుద్ధంగా వాదించడానికి ఎవరికి అధికారం ఉంది? అది పొరబాటు అని ఎవరెవరో చెప్పడం విని, వాడి మనసుని గాయపరిచిన తరూవాత నాకెందుకీ బతుకు?” అని అనేక విధాలుగా ఆలోచించిన రాజలక్ష్మి ‘సరే, ఆ ప్రమీలలో ఏ విశేషం ఉందో చూద్దాం,’ అని ఆ సాయంకాలం ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి బయలుదేరింది.
ప్రమీల ఇంటికి వెళ్ళే దారిలో ‘ఎవరో ఒక అమ్మాయివలన నా కుమార్తెలు, ప్రియమైన నా మనవలు, నాకు దూరమైపోతారా?’ అనే భయం రాగానే, ఇంటికి తిరిగి పోవాలని ఆమె ఒక నిమిషం ఆలోచించింది: ‘నాకు నా కొడుకుమీద అభిమానం లేదా?’
“నీకు నీ కూతుళ్ళూ, పిల్లలు హాయిగా ఉంటే చాలు!” అని ఆ ఉదయం శంకరి అవ్వ చెప్పిన మాటలు రాజలక్ష్మి గుండెని ఎత్తిపొడిచాయి.
రాజలక్ష్మి ఆ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు, హాలులో తంబూరాని భుజంమీద ఆనుకొని, కళ్ళు మూసి, ప్రమీల పాడుతోంది. ఆమె గానంకి అడ్డుబాటు వద్దని రాజలక్ష్మి మౌనంగా ఒక నిమిషం నిలబడి ఆ ఇంటిలో చూడడానికి తన కళ్ళకి ఎది సాధ్యమో అవన్నీ చూసింది.
ప్రవేశించగానే కళ్ళకి స్పష్టముగా కనిపించే ధోరణిలో ‘వాడి’ ఫోటో, దాన్ని చుట్టుముట్టుకొనివున్న ఒక పూలదండతో కనిపించింది. తరచుగా తమలపాకు నమలడం వలన అతని పెదిమలు నల్లబారిపోయాయి. కంఠంలో గొలుసు, సిగ అలంకరణ చూడగానే ఇతనే ఆ ‘మన్నార్గుడి మైనరు’ అని ఎవరైనా ఊహించుతారు. ఆ తరువాత రెండు పక్కలా దీపాలమధ్య త్యాగయ్య పఠం ఒక మూల, ఒక చిన్న మేజామీద కనిపించిన ఆ ఫోటో - ఆమె ప్రమీల తల్లి - అయివుండాలి ఇవన్నీ ఒక నిమిషంలో రాజలక్ష్మి అర్ధంచేసుకుంది.
‘నన్ను పాలింప నడిచివచ్చితివో?’ అని మోహన రాగంలో ప్రమీల పాడుతుంటే రాజలక్ష్మి ఆమెను అంచనా వేస్తున్నట్టు చూసింది.
‘ఆమె ఏం గొప్ప అందగత్తె కాదు వయసు ముప్పైకి పైగానే కనిపిస్తోంది. ఆమెలో కనిపించే ప్రత్యేకత గానం మాత్రమే . . .’ అని రాజలక్ష్మి ఆలోచిస్తున్న సమయం ప్రమీల గభీమని కళ్ళు తెరిచి, పాట ఆపి, తంబూరాని గోడకి ఆనించి, లేచివచ్చి రాజలక్ష్మికి స్వాగతం చెప్పింది ఇవన్నీ ఒక నిమిషంలో జరిగాయి.
“క్షమించండి . . . నేను మిమ్మల్ని చూడలేదు . . . కూర్చోండి!” అని హాలులో ఉన్న కుర్చీలలో ఒకటి చూపించింది.
“సరేలే . . . నువ్వు పాడమ్మా . . . ” అంది రాజలక్ష్మి.
“రోజంతా నేను ఒంటరిగా పాడుతున్నాను కదా? నాలాంటివారికి మీ రాక ఒక దోహదం . . . మీరు ఎవరని నేను తెలుసుకోవచ్చా?” అని ప్రమీల భవ్యంగా అడిగింది. ఆమె మనసులో వచ్చిన స్త్రీ స్థానిక లేడీస్ క్లబ్ వార్షిక ఉత్సవంలో తన పాట కచేరీ గురించి సంప్రదించడానికి వచ్చిందేమో అని అనుమానం కలిగింది.
“నేనే మురళీధరన్ తల్లిని” అని రాజలక్ష్మి అన్న మాటలు విని ప్రమీల ఒక క్షణం నివ్వెరపడింది. చేతులు జోడించి, “మీరుగాని కబురు పంపించివుంటే నేనే వచ్చివుంటానే?” అని అంది.
“లేదమ్మా, నిన్ను ఇక్కడ చూడాలని నేనే వచ్చాను” అని అన్న తరువాత రాజలక్ష్మి మౌనంగా తల వంచింది. ఆ సమయం ఉపయోగం చేసుకోవాలని కాఫీ చెయ్యడానికి ప్రమీల వంటగదికి పరుగెత్తింది.
కొంచెం సమయం తరువాత ఇద్దరూ మాటాడవలసిన విషయం మాత్రం మాటాడకుండా వేరే వేరే కబుర్లు పరివర్తన చేసుకున్నారు.
ఐదారు సంవత్సరాలకుముందు తనకి సినిమాల్లో పాడడానికి ఛాన్సు దొరికిందని, ఇప్పుడు స్థానిక సభల్లో పాటకచేరీలకి పిలుపులు వస్తున్నాయని ప్రమీల చెప్పింది. అందువలన తనకెటువంటి నష్టం లేదని, తనకి, ఒంటరి మనిషిగా, అదే చాలు అని తన తృప్తి తెలియజేసింది.
ఆ తరువాత రాజలక్ష్మి ఆమెగురించి మరి కొన్ని కబుర్లు అడిగి తెలుసుకుంది. క్రిందటి సంవత్సరం ప్రమీల తన తల్లి పోయిన తరువాత ఒక పనికత్తె సాయంతో ఒంటరిగా జీవించుతోంది అని తెలియగానే రాజలక్ష్మి “అవునులే, నీకెలా మురళి తెలుసు?” అని యదేచ్చగా, చిరునవ్వుతో అడిగింది.
ప్రమీల కూడా నిధానంగానే జవాబు చెప్పింది. “ఒకసారి అతని ఆఫీసు వార్షిక ఉత్సవంలో నేను పాడాను. అంతకుముందే చాలా సార్లు అతన్ని కచేరీలలో చూసివున్నాను అతనికి సంగీతంలో మంచి అభిరుచి ఉందని మాత్రం అనుకున్నాను. ఆ తరువాతే అతనొక పెద్దమనిషి అనికూడా గ్రహించాను. నా అమ్మ జబ్బుతో మంచమెక్కినప్పుడు, నా కారుని తీసుకొని వెళ్ళిన రాజూ అంకుల్ దుర్ఘటనలో పోయినప్పుడు ఇతని సాయం లేకుంటే నా గతి ఏమైవుంటుందో? ఇతనే దేవుడులాగ . . . ” అని ఆమె చెప్తూంటే రాజలక్ష్మి తనకి మంచి తరుణం దొరికిందని, “అవును, రాజూ అంకుల్ అని అన్నావుగా, అతనెవరు?” అని అడిగింది.
ప్రమీల ఆ పఠం చూపించింది.
“అతను - నాకు బంధువు కాదు . . . అతను ఊరులో ఉన్నప్పుడు నా పాట వినడానికి బ్రహ్మ ప్రయత్నం చేసేవారు మా పొరుగింటి మనిషి బోలెడు ఆస్తి . . . మీరు వినివుంటారు - మన్నార్గుడి మైనర్ రాజగోపాలన్ అని పిలుస్తారు. మా నాన్నగారు పోయిన తరువాత మాకున్న ఇల్లుకూడా అప్పుల వలన పోయింది. నేనూ మా అమ్మా అనాధగా నిలబడినప్పుడు ఇతనే మమ్మల్ని మద్రాసుకి తీసుకొనివచ్చి, పరిచయం ఉన్న నలుగురుతో మాట్లాడి నాకు సినిమాలో పాడడానికి దోహదం చేసారు. నా ఆదాయం వందలకొలదీ పెరిగిందంటే అందుకు రాజూ అంకుల్ దయ, సహాయం కారణం . . . ” అని అంటూంటే రాజలక్ష్మి మొహం, చూపులో మార్పుని ప్రమీల గమనించింది.
కొంచెం సేపు మౌనం వహించి, ఒక చిరునవ్వు కల్పించుకొని రాజలక్ష్మి మాటాడింది.
“నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు . . . నీ గురించి తెలుసుకోవాలనే నేను ఇవన్నీ అడుగుతున్నాను . . . ఇతనిగురించి ఊరులో చెడ్డగా మాటాడుకుంటున్నారే? అవన్నీ మురళికి తెలుసా?” అని ఆ పఠం చూపి అడిగింది.
ప్రమీల ఒక దీర్ఘమైన నిట్టూర్పు వదలి మాటాడింది: “అతని గురించి ఎవరైనా చెడుగా మాటాడలేదంటేనే ఆశ్చర్యం అనాలి. ఏదో ఒక చెడ్డ అలవాటంటే ప్రపంచంకి తెలియకపోవచ్చు. కాని అతని దగ్గర తీరా అన్ని దుర్గుణాలు చోటుచేసుకున్నాయే? మనేం చెయ్యగలం, చెప్పండి. అందుకు కారణం అతని పెంపకం, పెరిగిన పరిసరాలు, సహవాసం.”
ప్రమీల దుఃఖంతో అతని గురించి తనకు తానే గొణుక్కోవడం గమనించి రాజలక్ష్మి సముచితంగా, తొందరగా, ఒక ప్రశ్న అడిగేసింది: “సరే, ఇంత తెలిసిన తరువాత కూడా నీలాంటి అమ్మాయికి ఎందుకు అతనితో పొత్తు ఉండాలి? అందువలన నీ జీవితంకి హాని కాదా?”
ప్రమీల గూఢంగా ఆలోచిస్తున్నట్టు మౌనంగా తల వంచింది ఆ కొంచెం సమయంలో రాజలక్ష్మిని ఆవరించుకున్న ప్రశ్నలూ, ఆవిడ వచ్చిన కారణమూ, ప్రమీల పూర్తిగా గ్రహించింది.
ఆమె వివరించింది: “ప్రపంచంలో ఎవరూ పూర్తిగా చెడ్డవారు కాదు పూర్తిగా మంచివారూ కాదు. చాలా చెడ్డవాళ్ళున్నారు, చాలా మంచివాళ్ళూ ఉన్నారు. ‘ఇందులో రాజూ అంకుల్ చాలా చెడ్డవాళ్ళతో ఒకరు’ అని మీ అబ్బాయి తరచుగా అనేవారు. అటువంటి చాలా చెడ్డవాళ్ళతో దగ్గఱగా మెలగుతే వాళ్ళ దగ్గఱ కూడా మంచి గుణాలేవైనా ఉంటాయని అతను అనేవారు. అవును, అన్ని దుర్గుణాలున్న రాజూ అంకుల్కి ఇతని వంటి ఒక ఉత్తముడు మిత్రుడుగా ఉన్నారే, ఆదొక మంచి ఉదాహరణం అని నేను అనుకున్నాను. చెడ్డవాళ్ళన్నప్పుడు వాళ్ళు అందరికీ చేడు చేస్తారని అనడంలో న్యాయం ఉందా? నన్నడిగితే రాజూ అంకుల్ నాకు దోహదం చేసిన ఉదాత్త మనిషి . . . ఊరులో అందరూ ఏమేమో చెప్తారు . . . ”
అప్పుడు రాజలక్ష్మి జోక్యం చేసుకొని అడిగింది.
“అదెలాగమ్మా? నిప్పులేకుండా పొగ వస్తుందా?”
“బాగా చెప్పారు. నిప్పువలనేకదా పొగ? కాని అందరూ పొగని మాత్రం చూస్తున్నారు. నిప్పు ఉందని మరిచిపోతున్నారు. ఊరంతా అతనొక చెడ్డమనిషి అనే నింద పొగలాగ వ్యాపించి ఉంది. ఎంత చెడ్డమనిషి అయినా అతనిలోనూ మానవత్వం అన్నది ఉంటుందికదా - పొగ అని ఉంటే నిప్పు కూడా ఉన్నట్టు? చెడ్డవాళ్ళందరికీ మనసు అని ఒకటి ఉంది. అది బలహీనంగా ఉండడంవలనే వాళ్ళు చెడుని ఎదిరించలేకపోతున్నారు. నా అవగాహనలో రాజూ అంకుల్ అటువంటి మనిషి . . . ఒకానొకప్పుడు అతను నాకు సాయం చేసి దాని గురించి ఏ చింతా లేకుండా జీవించారు . . . ఐదు సంవత్సరాల తరువాత తన ఆస్తి అంతా పోగొట్టుకొని అనాధగా - నేను శ్రేయస్సుగా ఉన్నానని తెలుసుకొని - నా ఇంటి ముందు వచ్చి నిల్చున్నారు. ఈ ఇల్లూ, కారూ, డబ్బు అతని దయవలనే నాకు దొరికాయని గుర్తుచేసుకని అతనికి ఎది కావాలో అవన్నీ నేను ఇచ్చాను. “ఏమే, నీకు మతి పోయిందా?” అని అమ్మ కూడా నన్ను తిట్టింది . . . అతని సాయం లేకపోతే మా బతుకు గ్రామంలో నలుగురు ఇంట్లో పాత్రలు తోముకొని ఉండవలసిందే అని అమ్మ రవంతైనా ఆలోచించలేదు . . .
“అతనికి నా దగ్గఱనుంచి కావలసినది డబ్బు మాత్రమే. నా దగ్గఱ అప్పుడు డబ్బు ఉంది, సరే అని ఇచ్చాను . . . ఊరులో అందరూ ఏమేమో చెప్పుకున్నారు . . . పొగని మాత్రం చూసినవారు - పొగని చూసి నిప్పు లేదనే బుద్ధిమంతులు ఏమన్నా ఎవరికి కావాలి? ఒక చెడ్డమనిషి సహాయం వలన నాకు ఈ అంతస్తు లభించింది. ఆ కృతజ్ఞత మరవకుండా అతనికి నేను తిరిగి సహాయం చేస్తే నా పేరు, ప్రతిష్ట పాడైపోతాయా? ‘సరే, అలాగే కానీ!” అని నేను నిశ్చయం చేసుకున్నాను. నా అమ్మకే అది బోధపడలేదు. కాని నన్ను - నా ఆత్మని - గ్రహించినది మీ అబ్బాయి మాత్రమే . . .అందువలనే అతను నా జాతకం అడిగినప్పుడు అంతవరకూ అతనికి అటువంటి ఆలోచన ఉందని తెలిసి నేను మురిసిపోయాను. ఒక బుట్టడు పువ్వులని గభీమని నా తలమీద ఒలకబోసి దేవతలు దీవించినట్టనిపింటింది. కాని ఈ పెళ్ళి జరుగుతుందని నాకు నమ్మకం లేదు . . . నేనూ ఆ రోజునుంచి దానిగరించే ఆలోచిస్తున్నాను. మొదట జాతకాల్లో పొందిక రావాలి అంతకు మించి, పొందిక ఉన్నంత మాత్రాన పెళ్ళి అవాలని నియమం ఉందా ఏమిటి? అతను నాలాగ ఒంటరి మనిషి కాదు, అతని బంధువులు ఏమంటారో అని కలవరపడ్డాను. కాని ఒకటి . . . ఈ పెళ్ళి జరగ్గపోయినా నాకు సంతోషమే . . . అతనికి అటువంటి ఒక ఆలోచన వచ్చిందే, అది నాకు చాలు! నా గురించి సరిగ్గా, గౌరవంగా అత్మార్ధంగా అతను తెలుసుకున్నారు . . . ఆ జ్ఞాపకంతోనే చాలారోజుల దాంపత్య జీవితం అనుభవించిన తృప్తి నాకు వచ్చేసింది . . . ” అని అంటున్న ప్రమీల తన ఎదుట ఉన్న రాజలక్ష్మి వెక్కుతూ, కళ్ళు తుడుచుకుంటూ, ఏడవడం చూసింది. ‘ఎందుకు, నేనేం చెప్పాను?’ అని అర్ధం కాని కలతతో ప్రయాసపడింది.
“అమ్మా, నువ్వు ఇంత గొప్ప ఉత్తమురాలువి. నీ గురించి ఊరులో ఏమేమో మాటాడుకుంటున్నారు . . . దేవుడా, వాళ్ళని క్షమించు!” అని రాజలక్ష్మి తన కుమార్తెలు, అల్లుడ్లని గుర్తుచేసుకొని, ప్రమీల చేతులు పట్టుకుంది.
“అమ్మాయీ, నిన్ను చూస్తే నాకెలాగో ఉంది. నీవంటి సుగుణవతికి ఈ అవస్థ రావడం ఎంత దురదృష్టం! నా అమ్మాయిలూ, అల్లుళ్ళూ ‘ఈ పెళ్ళి జరుగుతే ఇక మా సంబంధం తెంచుకున్నట్టే!’ అని చెప్పి వెళ్ళారు. ఒక మంచి పని చెయ్యాలంటే ఇటువంటి ఆక్షేపణలు వస్తే దాన్ని ఎందుకు మనం ఆపాలి? నా కొడుకు పొరబాటు చెయ్యలేదని నాకిప్పుడు బాగా బోధపడింది . . . జాతకాల్ల పొందిక కూడా బాగుంది . . . ” అని పొంగివస్తున్న కన్నీళ్ళని అణచుకొని రాజలక్ష్మి తన అనుమతి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ప్రమీల ఆవిడని సముదాయించి తన నిర్ణయం తెలియజేసింది.
“మీకేం భయం వద్దు, విచారం వద్దు! జాతకాల్లో జోడు ఉంటే చాలంటున్నారా? ఈ పెళ్ళి జరగదు. ఎందుకంటే చుట్టరికాలు బలపరచి సంసారం వర్ధిల్లడానికే పెద్దలు పెళ్ళి అనే ఆచారం నియమించారు. అందుకని ఇప్పటి చుట్టిరికాలు పాడు చేయడం పొరబాటు కదా? నాకు నా తంబూరా ఉంది, సంగీత కళ ఉంది . . . మీలాంటి మంచివారి ఆదరణ, అభిమానం ఉంటే నాకు అంతకంటే మరేం కావాలి?”
“అలా అనకమ్మా. . . ఈ పెళ్ళి జరగాలని నాకుంది . . . నా మాట విను . . . చుట్టరికాలు అంత సులభంగా తెగించిపోవు . . . కొన్నిరోజుల్లో అందరూ మన గురించి తెలుసుకుంటారు . . . నేను ఇప్పుడే వెళ్ళి మురళీకి నా సమ్మతి చెప్తాను!” అని రాజలక్ష్మి తొందరగా లేచింది.
“వొద్దండీ . . . ఈ పెళ్ళి గురించి మరేం ప్రయత్నం వద్దు . . . ఇవాళ ఉదయం జాతకం తిరిగి ఇవ్వడానికి మీ అబ్బాయి వచ్చారు. ఈ పెళ్ళి వద్దని మేమిద్దరం మంచి మనసుతో ఏకీభవించాం. మీ కుటుంబంకి నావలన ఏమైనా చేడు రావటం నేను సహించను. నాగురించి ఊరులో అందరూ వింటున్న మాటలు ఎంతవరకు నిజమో, అబధ్ధమో, ఎవరికి తెలుసు? కాని అవన్నీ నాగురించే కదా? అందువలనే మేం మా నిర్ణయం మార్చుకున్నాం. మనసు మార్చుకోవడం అన్నది ఒక సారే జరగాలి. అది నా పక్షంలో జరగనీ!” అని స్పష్టంగా ప్రమీల మాటలు విని రాజలక్ష్మి తన కన్నీళ్ళని దాచుకోవాలని మొహం వేరే దిశలో తిప్పుకుంది.
***
ఆ ఆదివారం మురళీ పుట్టినరోజు వచ్చింది.
రాజలక్ష్మి కుమార్తెలు, అల్లుళ్ళు, పిల్లలు అందరూ ఇంటిలో గుమిగూడి ఉన్నారు.
అప్పుడు ఒక ఎవర్ సిల్వర్ టిఫన్ కారియర్ లో శంకరి అవ్వ మురళీ పుట్టినరోజుకని విశేషంగా తయారుతేసిన తినుబండారాలని నింపుకొని, ఆ వేసవికాల మండుటెండలో ఎవరినో చూడడానికి రాజలక్ష్మి బయలుతేరుతోంది.
“ఈ ఆడ జన్మకి స్వార్థం తప్పిస్తే మరే చింతా లేదు! దేవుడా, స్త్రీలని ఎందుకు ఇంత బలహీనంగా సృష్టించావ్?” అని శంకరి అవ్వ గొణుక్కుంది.
ఆవిడకి తెలిసిన కోణం, ఆవిడ చూసిన చూపు అలాంటివి. కాని జీవితమనేది ఎన్ని కోణాల్లో, ఎన్ని చూపుల్లో చూసినా అది ఎన్ని విధాలుగా కనిపించినా - అది ఏదో ఒక న్యాయం అనుసరించి, అన్నిటినీ ఆవరించే ఒక సంపూర్ణతేకదా?
*****