MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
కవిసామ్రాట్ ముద్దులపట్టి కిన్నెర!
వెంపటి హేమ
అనగా అనగా ఒక కోన ఉంది. ఆ కోనలో ఒక కొండ ఉంది. కొండంటే మరీ పెద్ద కొండేమీ కాదు, అది ఒక కొండగుట్ట (హిల్లక్), అంతే. ఒక వాగు ఆ గుట్టని చుట్టి, కోనలో దిగువకంతా ప్రవహించి, అడవుల వెంట సాగివచ్చి, చివరకు జీవనది గోదావరిలో లయమైపోయింది. ప్రత్యక్షంగా కనిపించే విషయమిది. ఆ వాగు పేరు “కిన్నెరసాని”! ఆ కొండగుట్టని “పతిగుట్ట” – అంటారు. ఆ రెండు పేర్లకూ ముడివేస్తూ, ఆ ప్రదేశంలోని జానపదులు మనకు చెప్పే కథ ఒకటి ఉంది...
ఖమ్మం జిల్లాలోనే పుట్టి, అడవులగుండా ప్రవహించి భద్రాచలం సమీపంలో గోదావరి నదిలో కలిసిన ఒక సెలయేరు కిన్నెరసాని. కొ౦డగుట్టను చుట్టి ప్రవహించిన ఆ సెలయేటిని కనులారగా చూసి, దాని చుట్టుపక్కల అలమి ఉన్న ప్రకృతి సొగసుల్ని ఆస్వాదించి, ప్రవహించే కిన్నెర నడకల్లోని నేవళీకానికి ముగ్ధులైన శ్రీ విశ్వనాధ హృదయం స్పందించింది. అక్కడి జానపదులు చెప్పుకునే పుక్కిటికథ దానికి జీవమిచ్చింది .
జానపదులు చెప్పుకునే పుక్కిటి కథ : కిన్నెర అనే ఒక ఇల్లాలు, అత్తగారు తనను అన్నట్టి తప్పుడు మాటను భర్త ఖండించలేదని అతనిపై అలిగి, ఆ కోపంతో ఇల్లు వదలి, పరుగుపరుగున అడవుల వెంట వెళ్లిపోతూంటే, వెళ్ళవద్దని బ్రతిమాలుతూ ఆ భర్త తన భార్య వెనకే పరుగెడతాడు. భార్యాభర్తలు రాజీకి రావలసిన తరుణంలో, విధివశాన అతడు ఒక కొండగుట్టగా, ఆమె ఒక సెలయేరుగా మారిపోయి, వాళ్ళు ఇక ఇంటికి తిరిగి వెళ్ళకుండా, ఆ అడవిలోనే ఉండిపోతారు.
ఈ కథ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి చెవిని పడింది. వెంటనే ఆయనలోనున్న కవిహృదయం స్పందించింది. ఆ కథకి ఆయన మరెన్నో మెరుగులద్ది “కిన్నెరసాని పాట”గా రూపొందించారు. అలా అదొక కరుణారసమయ కావ్యమై మన చేతుల్లోకి వచ్చింది. “కిన్నెరసాని పాట” రాసినప్పుడు ఆయన వయసు పందొమ్మిదేళ్ళుట!
“రవిగాంచని చోటులు కవిగాంచును” అన్నది అక్షర సత్యమని మనకి, ఈ గేయకథ చదివినప్పుడు తప్పక అర్థమౌతుంది. భావుకుడైన కవి ప్రత్యక్షంగా కనిపించని సంగతుల నెన్నింటినో తానూహించి, తన రచనలలో చొప్పించి, మనోరంజకములైన రచనలు చేయగలడు - అన్నదానికి ఒక చక్కని ఉదాహరణ ఈ “కిన్నెరసాని పాట!”
పతివ్రతయైన కిన్నెరను కడలిరాజు మోహించడం, వాగుగా మారిన కిన్నెర తనను చేరకుండా ఎక్కడికి పోగలదు - అన్న సాగరుని ధీమా, కిన్నెర దుఃఖం, ఆమెను గోదావరీ దేవి చేరదీసి ఆశ్రయమివ్వడం, ఆ తల్లి ఒడిలోచేరి కిన్నెర రక్షణ పొందడం - ఈ కథంతా శ్రీ విశ్వనాధవారి కల్పనయే కావచ్చు.. ప్రకృతి సిద్ధమైన విషయాలకి చక్కని రూపకల్పన ఈ "కిన్నెరసాని పాట!" ,ఇది ఒక చిన్న గేయ కథ అయినా, ఇందులో ప్రేమ, గౌరవం, విరహం, ఆర్తి, వ్యామోహం, ఆత్మీయత, ఆదరణ, భక్తి మొదలైన జీవిత విశేషాలన్నీ చక్కగా వర్ణి౦చ బడ్డాయి. ఇది స్వేచ్చాఛందంలో లయబద్ధమైన గేయ కథగా, పాడుకోడానికి వీలుగా రాయబడింది. ఎంత చిరుతప్రాయంలో రాసినా, రాసినవారు భవిష్యత్తులో “పాషాణపాక ప్రభువులు” అన్న అన్వర్ధనామాన్ని పొందిన శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు కనక, ఈ విషయాన్ని మనం మరీ అంత తేలికగా తీసుకోకూడదు. కొంచెం నిదానించి చూస్తే తెలుస్తుంది, దీనిలో వాడుకలో లేని, మారుమూలల నక్కివున్న తెలుగుపదాలు ఎన్నో - తోగు, పడువు, కదుపు, లాంటివి ఎన్నో ఉన్నాయి. కొన్ని కొన్నిచోట్ల అన్వయం కూడా క్లిష్టంగా ఉంటుంది. అంతేకాదు, “యతి, ప్రాస” ల్లాంటి ఛందోరీతులు సైతం ఇందులో అక్కడక్కడ తొంగిచూస్తూ౦టాయి. పూవు పుట్టగానే పరిమళిస్తుంది – అంటారు. అలాగే భవిష్యత్తులో కవిసామ్రాట్ అనిపించుకోదగిన ప్రజ్ఞ తాలూకు ఛాయలు మనకు ఇందులోనూ గోచరిస్తాయి. మొత్తానికి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు ఒకపాటిగానైనా లలితమైన శైలిలో రాసినది ఇది ఒకటి మాత్రమేనేమో!
పతిగుట్టను, దానిని చుట్టి ప్రవహించిన కిన్నెరవాగును చూడగానే - అత్తా కోడళ్ళ వాదులాటలలో తల్లిని ఏమీ అనలేక, భార్యను సముదాయించలేక సతమతమై, కడకు ఒక బండరాయిగా మారిన యువకుడు; నిష్కారణంగా ఘోరమైన అపవాదు పాలై, అపరిమిత దుఃఖంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఏడ్చి, ఆ కన్నీటి వరదలోనే కరిగి నీరై, వాగుగా మారి పారిన పతివ్రతయైన ఒక కులస్త్రీ - ఆయన కళ్ళకుకట్టడంతో - ఆ యువ దంపతుల కరుణామయ గాధ మనసును తట్టడం, ఆపై ఆయన ఈ గేయకథను రాయడం జరిగి ఉంటుంది. అంతేకాదు, కరుణారస ప్రధానమైన ఈ గేయకథ ఆయనను ఎంతగా స్పంది౦పజేసిందంటే - అది ఆయన మాటల్లోనే చూడండి ...
“వనములన దాటి, వెన్నెల బయలు దాటి ,
తోగులను దాటి, దుర్గమాద్రులను దాటి,
పులుల యడుగుల అడుగులు కలుపుకొనుచు
రాళ్ళవాగును దాటి, పధాంతరములు దాటి
అచట కిన్నెరసాని - - -
నా ఆత్మయందు ఇప్పటికీ దాని సంగీతమే నదించు.
కిన్నెరయందు విశ్వనాధ ఇంత ఆత్మీయతను చూపించారు కనుకనే ఆమె నాయన ఆత్మజగా భావించి ఈ నా చిరు సమీక్షకు “కవిసామ్రాట్ ముద్దులపట్టి కిన్నెర” అనే మకుటం (headding) ఉంచడం జరిగింది. ఆయనకు ప్రశిష్యురాలినైన నేను గురువరేణ్యులకు శతాధిక వందనములతో ఈ కిన్నెరసాని పాటకు నా క౦టికి ఆనినంతలో ఒక వీక్షణం రాయాలనిపించింది. దీనిని నేను ఎంతవరకూ సమర్ది౦చగలనో తెలియదు, పాఠకుల స్పందనకై వేచి చూడాలి మరి!
“జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమెందులకు?” అన్నది ఒక నానుడి. కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ గురించి ప్రత్యేకం పరిచయవాక్యాలు చెప్పవలసిన పనిలేదు. ఎందుకంటే, ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు! తెలుగుదేశంలో ఆయనను గురించి తెలియనివారు లేరు అనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. పొరపాటున ఏ ఒక్కరైనా ఆయనని గురించి తెలుసుకోవాలనుకునే వారు ఎవారివా ఏవంకనైనా మిగిలి ఉన్నారేమోనని, అట్టివారి సౌకర్యం కోసం ఆయనను గురించి క్లుప్తంగా నాలుగు మాటలు ఇక్కడ రాస్తున్నాను...
శ్రీ విశ్వనాధ తెలుగు భాషా కోవిదులు. మాతృ భాషను ఆయన ఆభిమానించారు, ఆరాధించారు; లాలి౦చారు, ప్రేమించారు, పాలించారు, పోషించారు. పిన్నవయసులో, బందరులో ఆయన విద్యాభ్యాసం జరిగినప్పుడు, శ్రీ తిరుపతి వేంకట కవులలో ఒకరైన శ్రీమాన్ పండిత చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఆయనకు తెలుగు నేర్పిన గురువులు. శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు తన అసమాన ప్రతిభతో గురువుకు ప్రియ శిష్యులయ్యారు. భాషమీద పట్టు సంపాదించి, “గురువునకు తగిన శిష్యు”డని పేరు పొందారు.
శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు తన చిరుతప్రాయంలోనే రచనలు చెయ్యడం మొదలు పెట్టారు. అది మొదలు ఎన్నెన్నో రచనలు వారి కలం నుండి వెలువడ్డాయి. వేయిపడగలు, చెలియలికట్ట, ఏకవీర, వేనరాజు కల, ఆహా హుహూ ... ఇలా ఎన్నో నవలలు రాశారు. అందులో ముఖ్యంగా చెప్ప వలసినది “వేయిపడగలు.” ఇది వేయి పాత్రలతో కూడిన వేయికి మి౦చి ఉన్న పేజీలతో వ్రాయబడిన బృహన్నవల . ఎన్నో సాంఘిక, చారిత్రాత్మక రచనలు, “ఆహా హుహూ” లాంటి అభూత కల్పనలు కూడా ఆయన కలం నుండి ఉద్భవించాయి. ఒకేసారి నాలుగైదు నవలలను లేఖకులకు చెప్పగలిగిన ఉద్దండులు ఆయన. అంతేకాదు, “పురాణవైర గ్రంధమాల” అనే పేరుతో, కొన్నిఅమూల్యమైన నవలలు కూడా రాశారు. మరీ పూర్వపు రోజుల్లో మన దేశంపైకి దండెత్తి వచ్చి, మనకు పురాణవైరులైన గ్రీకుల గాధలివి. వారి దండయాత్రలను , వారు మనదేశాన్ని పాలించిన నాటి చరిత్రను ఆధారంగా చేసుకుని రాసిన నవలలు ఇవి. శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి రచనలన్నిటిలోకీ విశిష్టమైన రచన, “శ్రీమద్రామాయణ కల్పవృక్షము!” వాల్మీకి రామాయణమునకు తనదైన శైలిలో కొన్ని అదనపు మెరుగులు దిద్ది రచించిన అమూల్యమైన రచన ఇది. ఈ విధంగా ఇహ, పరములను రెండింటినీ తన రచనలద్వారా సాధించిన మహామనీషి శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు. తెలుగు భాషా సాహిత్యంలో, ఇటీవలికాలంలో అంతటి ప్రజ్ఞ చూపించిన వారు ఎవరూ లేరు. అంతేకాదు, ఆయనకు సంస్కృతాంగ్లాల మీదకూడా మ౦చి పట్టు ఉండేది. అటువంటి మహనీయులు అందరికీ సుపరిచితులూ, చిరస్మరనీయులు కూడా కావడంలో వింతేముంది!
ఆయన S.R.R., C.V.R. కాలేజి, విజయవాడలో తెలుగు భాషాధ్యాపకులుగా చాలా కాలం పనిచేసి ఎందరో విద్యార్ధులకు భాషతోపాటు, మాతృభాషాభిమానాన్ని కూడా నేర్పినారు. “కిన్నెరసాని పాట” ఆయన పిన్నవయసులో రచనావ్యాసంగాన్ని మొదలిడిన తొలినాళ్ళలో రాసినది. ఆయన రచించిన అమూల్య రచనల మణిహారానికి ఇది కొలికి ముత్యమని చెప్పవచ్చును. కొలికిముత్యం ఎంత చిన్నదియైనా దాని ప్రత్యేకత దానికి ఉంటుంది.
చదవడం మొదలెట్టగానే మనకు, ఈ కిన్నెరసాని పాటను ఆయన అలవోకగా, ఒక పిల్లాటగా రాసి ఉంటారు - అనిపించకపోదు. కౌమార ప్రాయంలో రాసినది కనుక ఇందులో మనకి ఎంతో లలితమైన భాష, భావాలు ఉంటాయని తోస్తుంది. కాని అంతలోనే తెలుస్తుంది - ఇందులో కూడా ఎన్నో మారుమూల పదాలు గుప్పించబడ్డాయని. కొన్నిచోట్ల అన్వయంకూడా మనకు అందని లోతులకు తీసుకుపోతుంది. కస్తూరికా పరిమళాన్ని ఆస్వాదించ దలచి నప్పుడు దాని ఘాటునుకూడా భరి౦ చక తప్పదు కదా!
“పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అంటారు. నిజమే మరి, అది దాని స్వభావం కదా! తరువాతి కాలంలో “పాషాణపాక ప్రభువులు”గా పేరొందిన శ్రీ విశ్వనాధ మరోలా ఎలా రాయగలరు! శ్రద్ధ పట్టి ఆయన రచనలు చదివినవారికి మంచి భాషా జ్ఞానం అబ్బడం మట్టుకు ఖాయం.
తాను విన్న జానపద గాధను ఆధారంగా చేసుకుని, కిన్నెర వాగును వనితగా, ఆ వాగు చుట్టి వచ్చిన కొండను ఆమె భర్తగా మలచి, ఈ కరునారసపూరిత గేయకథను మన మనసులకు హత్తుకుపోయీ విధంగా అభివర్ణించారు శ్రీ విశ్వనాధ! చదివినవారి మనసులను౦డి చదివిన విషయం ఒకపట్టాన తొలగిపోనీని విధంగా రాయడంలోనే మనకు కవి ప్రతిభ కనిపిస్తుంది మరి! పిన్నవయసులోనే ఆయన అంతటి ప్రతిభాశాలి.
మన వాగధీశ్వరులైన భాషావేత్తలు, స్త్రీ - అన్న ఒక్కమాటకు నాతి, తరుణి, మగువ, పడతి, వనిత, ముదిత - ఇలా పరిపరి పర్యాయపదాలు సృష్టించి వాడారు. నా లెక్కకే వందకి మించిపోయాయి ఆ పేర్లు. ఇలా ఇంకా ఎన్ని పర్యాయపదాలు ఉన్నాయో ఏమో! పిన్న వయసులో రాసినదైనా, ఈ కిన్నెరసానిపాటను శ్రీ విశ్వనాధ, మనసుపెట్టి రచియించారు. కిన్నెరను ఆయన ఎంతో ముద్దుగా స్త్రీకున్న పర్యాయపడాలనెన్నింటినో ఉపయోగించి ప్రియమారా సంబోధించారు. కిన్నెరసానిపాట నాయన అందమైనపదజాలాన్ని మనోహరములైన కవిసమయాలతో చేర్చి అతిసుందరమైన గేయకథగా రూపొందించారు. ఇందులో సతీపతులమధ్య నున్న పవిత్ర ప్రేమానుబంధాన్ని, వియోగ దుఃఖాన్ని చక్కగా వర్ణించారు. ఆశలుడిగి విరాగిణిగా మారిన కిన్నెర భద్రాద్రి రామునికి దాసానుదాసియై చివరకు తన జన్మను సార్ధకం చేసుకున్న వైనం కూడా చక్కగా రాయబడింది. మొత్తం మీద జనరంజకమై, చదువరుల మనస్సులో కలకాలం నిలిచి ఉండేది ఈ "కిన్నెరసాని పాట!"
కవిప్రకాండులైన శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు ముట్టని సాహిత్య ప్రక్రియ లేదు. ఆయన స్పర్శ “పరుసవేది!” ఆయన రాయడం వల్లనే, పుక్కిటి కథగా చెప్పుకునే ఒక అతిసామాన్య జానపద గాధకు ఇంతటి అందమూ, ప్రశస్తీ వచ్చాయి. కిన్నెర తెలుగింటి ఆడపడుచు అయ్యింది. ఆమె కష్టాలు మనందరిచేతా కన్నీళ్లు పెట్టి౦చాయి. మనచేత మాత్రమేకాదు, వాటిని వెలుగులోకి తెచ్చిన కవీశ్వరునిచేత కూడా... ఈ కథను పాటగా పాడుతూ ఆయన భావావేశంతో కంట తడి పెట్టడం నేను కనులారాగా చూశాను.
శ్రీ విశ్వనాధకు గాయకుడన్న పేరు లేకపోయినా, తనకున్న సంగీతశాస్త్ర పరిజ్ఞానంతో ఈ “కిన్నెరసాని పాట"ను ఎంతో శ్రావ్యంగా మనసులకు పట్టీలా, భావయుక్తంగా పాడీవారు. ఆయన ఎంతో బాగా, పాటలో లీనమై దీనిని పాడీవారు. ఆపాట ఆయననేకాదు, వి౦టున్న మనల్ని కూడా తన్మయుల్ని చేసీది. కిన్నెర కష్టాలు శ్రోతలను కదలించి కళ్ళు చెమ్మగిలజేసేవి. అంతేకాదు అలా పాడుతూడగా కిన్నెర దుఃఖం ఆయనను కదలించి కళ్ళు చెమ్మగిలజేసేది.
ఒకసారి ఆయన పాడుతూ౦డగా నేను వినడం జరిగింది. నేను డిగ్రీ క్లాసులో ఉన్నప్పుడు మా కాలేజీలో ఆయనకు సన్మానం జరిగింది. ఆ సభలో ఆయన ఈ "కిన్నెరసాని పాట"ను బహుశ్రావ్యంగా పాడి వినిపించారు. ఆయన పాట నా మనసుకు హత్తుకుపోయింది. ఆ తరువాత ఆయన పాడిన బాణీలలోనే నేను కూడా ఈ పాట పాడీ దానను.
ఇక మనం కథలోకి వద్దాము :- ఈ కిన్నెరసాని పాటలో కవి పూర్వకథను మనకు సూటిగా ఎక్కడా చెప్పలేదు. కాని, కిన్నెర, ఆమె భర్త మాటాడిన మాటల్లో, కవి చెప్పిన అంశాలలో మనకు పూర్వకథ అంతా చక్కగా అవగతమౌతుంది ...
పూర్వ కథ : ఘనత వహించిన ఈ మన తెలుగుగడ్డ పైన యువకుడైన ఒక భూకామందు ఉన్నాడు. అతనికి అందాలరాసియైన భార్య ఉంది. ఆమె పేరు కిన్నెర! యజమాని “స్వామి” అయినప్పుడు, అతని భార్యయైన యజమానురాలిని “స్వామిని” అనడం సహజమే కదా! ఇక సౌలభ్యం కోసం దానిని కుదించడంవల్ల, “స్వామిని” అన్న మాటకాస్తా “సాని” అయ్యింది. యజమానిని దొర అన్నవాళ్ళు యజమానురాలిని దొరసాని - అనడం దీనికి నిదర్శనంగా తీసుకోవచ్చు. తమకు యజమానురాలైన కిన్నెరను చుట్టూ మసిలే పరిజనం “కిన్నెరసాని” అని వ్యవహరించడం మామూలయ్యింది. అలా కిన్నెర అన్న పేరు కిన్నెరసాని అయ్యింది. భర్తతోసహా ఆమె నందరూ అలాగే పిలిచీవారు. చివరకు కవి కూడా అదే మాటను వాడారు తన గేయ కథకు మకుటంగా, “కిన్నెరసాని పాట” అన్న పేరు పెట్టి...
ఇందులో అత్త ప్రసక్తి ఎక్కడా లేదు. కాని, మనకు అది స్ఫురిస్తుంది. అనాదినుండి అత్తా కోడళ్ళ మధ్య చిట్టి పొట్టి తగవులు, తంటాలూ ఉండడం అన్నది మామూలే కదా! లక్ష్మీ సరస్వతులను అత్తాకోడళ్ళుగా చెపుతారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ రాజీకి వచ్చి, స్నేహితులైనదానికి గుర్తు ఉంది. ఎక్కువ విద్యావంతునికి ఎక్కువ జీతంతో గొప్ప ఉద్యోగం రావడం, అధికవిద్యావంతుడైన అతడు సిరిసంపదలు కలిగి గొప్పగా ఉండడం లక్ష్మీసరస్వతుల సయోధ్యకు నిదర్శనంగా చెప్పవచ్చు. కానీ లౌకికులైన అత్తా కోడళ్ళమధ్య మాత్ర మింకా పరస్పర అవగాహన కుదరడం లేదు.
కిన్నెరకు కూడా తన అత్తగారితో అప్పుడప్పుడు వచ్చే పేచీలు ఉండేవి కాబోలు. ఒకరోజు కోపోద్రేకంతో ఆ అత్త మితిమీరి, కోడల్ని అనరాని మాట ఒకటి చటుక్కున అనేసింది. మరో మాటేదైనా అన్నా అంతగా బాధపడేది కాదేమోగాని, కిన్నెరకు “నీవు పతిశీలవు కావు” అన్న మాట ఎంతమాత్రం భరించరానిదయింది.
అత్తగారు మనకు ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించకపోయినా, ఇక్కడ తగవు వచ్చినది అత్తా కోడళ్ళ మధ్యనని అనుకోడం సమంజసమే ఔతుంది. అత్తా కనుకనే కోడల్ని అంత ఘోరమైన మాట అవలీలగా అనగలిగింది. అంతేకాదు, ఆ తల్లికి కొడుకు కనకనే కిన్నెర భర్త - తల్లి అన్న మాట తనకు ఎంత నచ్చనిదయినా కూడా, పెద్దవాళ్ళను గౌరవించడం మాత్రమే తెలిసిన అతడు, తనను కనిపెంచిన తల్లిని ఏమీ అనలేక మౌనంగా బాధను భరిస్తూ ఉండిపోయాడు.
అతడు తల్లిని కోప్పడనూలేదు, భార్యను ఓదార్చనూలేదు. అదే కిన్నెర ఎడల అతడు చేసిన పెద్ద తప్పు! భర్త మౌనం, అసలే గాయపడివున్న కిన్నెర మనసును మరింతగా గాయపరచి ఆమెను ఇంకా ఎక్కువ బాధ పెట్టింది. అతడు తల్లి మాటని బలపరచాడన్న భ్రాంతిలో పడింది కిన్నెర. అది భర్తకు తనపైనున్న అలసభావంగా తలచి పట్టరాని దుఃఖంతో అభిమానవతియైన కిన్నెర ఇల్లువదలి పరుగెత్తుకుంటూ అడవుల వెంట వెళ్లిపోయింది. ఇంతవరకూ మన ఊహ - అంటే, మనకు స్ఫురించినట్టి గడిచిపోయిన కథ. ఈ తరువాతినుండి మొదలయ్యింది కవిరాజు రాసిన "కిన్నెరసాని పాట".
దీన్ని ఆయన ఎనిమిది అంకాలుగా విభజించి రాశారు : ౧. కిన్నెరసాని పుట్టుక, ౨. కిన్నెర నడకలు, ౩. కిన్నెర నృత్యం, ౪. కిన్నెర సంగీతం, ౫. కడలి పొంగు, ౬. కిన్నెర దుఃఖం, ౭. గోదావరీ సంగమం, ౮. కిన్నెర వైభవం. ఈ ఎనిమిది అంకాలలోనూ వివిధ దశలలో ఉన్న కిన్నెరవాగు యొక్క స్థితిగతులు విధవిధాలుగా వర్ణించబడ్డాయి. ఒక్కొక్క అంకంలో ఒక్కొక్క దశలో ఉన్న కిన్నెరను వర్ణించి, దానికి తగిన పేరు ఉంచారు కవి శ్రీ విశ్వనాధ!
* * *
“కిన్నెర పుట్టుక” అన్న ఈ మొదటి అంకం, అడవుల వెంట పరుగెట్టుకుపోతున్న కిన్నెరసానిని “ఓహో కిన్నెరసానీ!” అంటూ ఆమె భర్త పిలిచిన పిలుపుతో మొదలౌతుంది. ఆర్తితో కూడిన ఆ పిలుపు మన హృదయాలలో ఎప్పటికీ ప్రతిధ్వనించేలా ఉంటుంది. అంతేకాదు, అతడు ఎలుగెత్తి పిలిచిన ఆ పిలుపులో, ఆమె నుద్దేశించి అతడు మాటాడిన మాటలలో, అతనికి కిన్నెరపైనున్న అపరిమితమైన ప్రేమ తొణికిసలాడుతూ ఉంటుంది.
“ఓహో కిన్నెరసానీ! ఓహో కిన్నెరసానీ!
ఊహా మాత్రములోపల నేల నిలివవే జవరాలా!
ఓహో కిన్నెరసానీ! ఓహో కిన్నెరసానీ!” అని ఇల్లువిడిచి అడవులవెంట పరుగెడుతున్న భార్యను గొంతెత్తి పిలుస్తూ ఆమె వెంట పరుగెడతాడు ఆమె భర్త!
అతడు తన పిలుపులోనే ఆమెను ప్రియమారా “ఓహో కిన్నెర సానీ!” అంటూ ఆమె పేరుపెట్టి పిలవడమే కాకుండా, “ఊహా మాత్రము లోపల నేల నిలువవే జవరాలా!” అంటూ ఆక్రోశిస్తాడు కూడా!
ఇక్కడ “జవరాలా” అన్న సంబోధన చక్కగా అమరింది.
తీరైన భర్తకు, తన భార్య - వయసు ఎంతపెరిగినా కూడా - నిత్యజవ్వనిలాగే కనిపిస్తుంది మరి! అతని భాషణలను బట్టేకదా మనం కూడా కిన్నెరను యవ్వనవతియైన ఇల్లాలిగా, ఆమెభర్తను యువకుడైన భూకామందుగా ఊహి౦చుకు౦టున్నాము! కానీ స్త్రీలకు తమ వయసును ఎవరైనా తగ్గించి చెప్పినప్పుడు ప్రియమౌతుందన్న అపోహ ఒకటి ఉంది కదా! అదైనా అతని ఉద్దేశ౦ కావచ్చు. ఆమెను మెప్పించి, తనవెంట ఇంటికి తీసుకువెళ్ళడం అతని అభిప్రాయం కావచ్చు. ఏది ఏదైనా కానియ్యి, అన్నీ ఊహలే కదా! కథ రక్తి కట్టాలంటే మాత్రం , ఆమె భర్త సంబోధనల్ని బట్టి మనం కూడా కిన్నెరను మంచి యవ్వనంలో ఉన్న ఒక యువతిగానూ, ఆమె భర్తను ఒక యువకునిగానూ ఊహించడమే సమంజసము.
అడవిలో ప్రవేశించిన కిన్నెరను భర్త త్వరగానే అ౦దుకున్నాడు. వెంటనే ఆమెను తన కౌగిలిలో బంధించి, ఆమె నలాగే ఇంటికి తీసుకెళ్ళిపోవా లనుకున్నాడు. కాని విధి వక్రి౦చి౦ది. సమయం మించిపోయింది. అతని కోరిక తీరలేదు. అతని కౌగిలిలో ఉండగానే ఆమె కరిగి నీరై, మరుక్షణంలోనే వాగై ప్రవహిస్తుంది. అతడు నిర్ఘాంతపోతాడు. ఏరుగా మారిన భార్యను చూసి ఖిన్నుడై, “ఓహో కిన్నెరసానీ!” అంటూ, పరిపరి విధాలుగా భార్యనుద్దేసించి మనసువిప్పి మాటాడుతూ పరిపరి విధాలుగా దుఃఖిస్తాడు ...
“ఇప్పుడె కదె నాకౌగిట కప్పితి నీ శోకమూర్తి !
అప్పుడె నిలువున నీరై ఎప్పుడు ప్రవహించితివే!” అంటూ.
మరోచోట కిన్నెర భర్త విలాపం ఇలా ఉంటుంది... .
“కరిగిపోతి (వి) నిలువెల్లను,
తరలి౦చితి (వి) నా జీవము
మరిగిపోయి నా గుండియ
సురిగిపోయెనే ప్రియురాలా!” - అంటాడు.
“ప్రియురాలా!” అన్న సంబోధనతో అతడు ఆమెపై తనకున్నఅపరిమిత ప్రేమను వ్యక్తం చేస్తూ ఆపై ఇలా మాటాడతాడు...
ఆమె కరగి నీరై , ఆ వెల్లువలో అతని ప్రాణాలనే తీసుకు పోయింది - అంటాడు. తన గు౦డె మరిగిమరిగి, చివరకు మాయమైపోయింది – అని కూడా అంటాడు. ఇప్పుడు కిన్నెర తన వెంట లేకపోడంతో హృదయమేలేని వానిగా మిగిలి ఉన్నానంటాడు. ఇది మరి కొద్ది సేపటిలో అతనికి రాబోవు దుర్దశకు సూచన కావచ్చు.
ఇక్కడ కవిత మొదటి లైనులో “వి“ లోపి౦జేసినా అర్ధం “వి“ తో కూడినదే ఔతుంది. అదొక చమత్కారమైన వాక్యరచన.
అతడు కిన్నెరను కఠినాత్మురాలివని నిందిస్తాడు. “భర్త తప్పుచేసినా, లోకంలోని భార్య లెవరూ భర్తలపైన ఇంతచేటు కోపం తెచ్చుకోరు కదా, మరి నీకెందుకు ఇంతకోపం" అని అడుగుతాడు.
“ఇ౦త కోపమెందులకే?
ఇ౦త పంతమేమిటికే!
ఇంతులు నీవలె కఠినలు
కనిపి౦చరులే ఎందును, ఓహోకిన్నెరసానీ!” అంటూ ఆమెపైన నిష్టూరం వేస్తాడు.
ఆ తరువాత తమ దాంపత్య జీవితంలో గడచిన అందమైన అనుభవాలను, తలుచుకుని దుఃఖిస్తాడు. అందులో ఒకటి - సుకుమారియైన కిన్నెర తొలినాళ్ళలో రాళ్ళపై నడవలేకపోయీదన్నది! రాళ్ళపై నడవాలంటే, నడవలేక ఆమె బాధపడేదిట! అది తలుచుకుని అతడు దుఃఖంతో, వాగై పారిన కిన్నెర నుద్దేసించి అంటాడు ...
“రాళ్ళపైన తొలినాడుల
కాలిడగా నోర్వలేవు
రాళ్ళను కొ౦డలగుట్టల
నేలా ప్రవహి౦చెదవో!”
అంటూ ఆమె సౌకుమార్యాన్నీ, ఇప్పుడు సెలయేరుగా మారడంవల్ల ఆమె పడుతున్న కష్టాన్ని తలుచుకుని బాధపడతాడు.
“ఇప్పుడే కదా నేను నిన్ను కౌగిలి౦చుకున్నది, అప్పుడే ఎలా నువ్వు వాగుగా మారి ప్రవహించావు” అంటూ ఆశ్చర్యపోతాడు. ఎలాగైనా ఆపాలని ఆమె జడను పట్టుకుంటే, అతని చేతిలోకి జుట్టుకి బదులుగా నీరు వచ్చిందిట! దుర్భరమైన ఆ విషయాన్ని తలుచుకొని అతడు విచారిస్తాడు.
“పరుగెత్తే నీ వేణీ
బంధము పూనితి చేతను
కరమున వేణికి బదులుగ
కాల్వగట్టె నీటి పొరలు! ఓహో కిన్నెరసానీ!”
అతని మనసులో భార్యపైన ఏ అపోహా లేదు. ఆ మాటే చెపుతాడు, “నీవు మహాపతిశీలవు కావని నేనంటి నటే” అని సూటిగా అడుగుతాడు. అలా అన్నట్లయితే తన కంఠాన్ని తానే కత్తితో నరుక్కుని ఉండే వాడిని కదా - అంటూ తనపై తానే సవాలు విసురుకుంటాడు.
వాగై ప్రవహిస్తున్న భార్యను చూస్తున్న అతనికి, ఆ వాగులో కూడా ఆమె మానినీ రూపమే కనిపిస్తుంది.
ఆమె నవ్వులు నురుగులుగా, కళ్ళు చేపలుగా, వళులు తరగలుగా – ఇలా ఆమె సొగసులన్నీ ఆ కిన్నెర వాగులో అతనికి రకరకాలుగా దర్శనమిచ్చాయి. అలా చూస్తూ దుఃఖంతో అనుకుంటాడు, “ నీ జఘనము నిసుకతిన్నెగా జూసిన నాకన్నులు, ఊడిపడవు నేలపైన, నురిసిపోవు లోనలోన!” అంటూ తనని తాను తూలనాడుకు౦టాడు.
కిన్నెర వాగును అతడు సురనది గంగతో పోలుస్తాడు...
“ మున్ను భాగీరధ భూపతి వెన్నువెంట పరుగెత్తిన
అన్నాకధునీ వైఖరి నున్నది నీ చన్నతోవ!” అంటాడు కిన్నెర భర్త.
విష్ణు పాదమ౦దు పుట్టి, శివుని జటాజూటమును మెట్టి, భగీరధుని కోరిక మన్నించి హిమనగాన్ని దిగివచ్చి మైదానంలోకి ప్రవేశి౦చి౦ది సురనది గంగ! నీటికి సహజమైన గుణంవల్ల పల్లానికి ప్రవహించివెళ్ళి, భగీరధుని పితరులను తరి౦పజేసి, చివరకు సాగరునితో సంగమిస్తుంది. శివుని భార్యగా చెప్పబడిన గంగానదికి మరొకరి సంపర్కమా? కాని, ఎంత సురనది ఐనా, నది కావడం వల్ల గంగకు సాగరుని పొందక తప్పలేదు.
ఇది కిన్నెరకు భర్త చేసిన హెచ్చరిక అయినా కావచ్చు. “ అన్నాకధునీ వైఖరి నున్నదినీ చన్న తోవ” అంటూ గంగతో పోల్చడం వల్ల, అప్పుడు గంగకు పట్టిన దుర్దశ ఇప్పుడు నీకూ పట్టవచ్చునన్న సూచన ఉంది ఆ మాటలో - ఇది నా ఊహ కావచ్చు! " నా
తల్లి నోటివట్టంగా “నువ్వు పతిశీలవు కావు” అన్నందుకే ఇంత అభిమానపడి ఇల్లువిడిచి పరుగెట్టి వచ్చి, విధి వంచితవై నువ్వు వాగైపోయినావే! ఇక, ఇప్పుడింక నువ్వేం చెయ్య గలవు? గంగ అంతటి దానికే నది అవ్వడంవల్ల సాగరసంగమం తప్పింది కాదుకదా! ఇక నువ్వెంత? నోటి దురుసుతనం వల్ల అన్న మాటకే కదా నువ్వు ఇంత అల్లరి చేశావు! మరి ఇప్పుడీ దుర్దశను౦డి ఇక నువ్వెలా తప్పి౦చుకోగలవనుకు౦టున్నావు – అన్న ధ్వని ఉంది ఈ “నాకదునీ వైఖరి నున్నది నీ చన్న తోవ” అన్న మాటలో. అతని కేమోగాని మనకు మాత్రం అది స్ఫురించక మానదు. కాని, భార్య నంతగా ప్రేమించే అతడు ఆమెనలా ఎత్తిపొడిచాడని అనుకోడంకన్నా అది మన ఊహే అనుకోడం సమంజసమేమో!
కిన్నెర భర్త ఆమె తనకు ఎంత ప్రియమైనదో తలుచుకు తలుచుకు విలపిస్తాడు. అంత కంతకీ తనకు దూరమైపోతున్న కిన్నెర నుద్దేసించి అంటాడు ఆమె భర్త ...
“నీవే నా జీవన్మణి, నీవే నా జీవేశ్వరి,
నీవేనే నా చూడామణి – నీవేనే ప్రియురాలా !” అంటాడు అతడు.
అతడన్న ఈ మాటల్లో మనకి తెలుస్తుంది ఆమెపైన అతనికి ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉన్నాయో! కిన్నెర లేని తన బ్రతుకు శూన్యమని విలపిస్తాడు.
“నీవే ఇట్లైతివ ఇక జీవముండునే నా మెయి
నీవలె నేనూ ప్రవాహంబై వచ్చెద, రానీవే - ఓహోకిన్నెరసానీ!” అన౦టూ విలపిస్తాడు. తానూ నీరై, ఆమెతో కలిసి ప్రవహి౦స్తూ ఆమె వెంట తనూ వెళ్ళిపోవాలని ఆశిస్తాడు. కాని అది సాధ్యపడదు. పడరాని మాట పడి దుఃఖిస్తున్న కిన్నెరను కష్ట సమయంలో ఓదార్చనందుకు తనని తాను శిలాహృదయుడని అనుకు౦టూ, మరింతగా దుఃఖిస్తాడు.
“నీవు రసాకృతి వగుటను ఈ వైఖరి ప్రవహి౦చితి
వేను శిలాహృదయు౦డను పూనుదునే ధునీ వైఖరి?” అని తనని తానే ప్రశ్నించుకుంటాడు. తన తప్పును తాను ఒప్పుకోడమే కాకుండా, అడవులు కూడా “ నీదే - నీదే తప్పు“ అని తననే వేలెత్తి చూపుతున్నాయని కూడా చెప్పి వాపోతాడు.
అంతలో విధివశాన అతనిలో కూడా ఒక బ్రహ్మాండమయిన మార్పు చోటుచేసుకోసాగింది. అది అతడు గమనిస్తాడు...
“ఈ ఏడుపు రొదలోపల నా యెడలే నేనెరుగను,
నా ఈ దేహమదేమో రాయివోలె నగుచున్నది “ అంటూ గగ్గోలు పడతాడు. అంతలో అతని ఎలుగు అంతకంతకూ సన్నమై క్రమంగా అసలు వినిపించడమే మానేస్తు౦ది.
అతడు స్తబ్దుడై రాయిగా మారడంతో చేష్టలుడిగి అవాక్కై, అచేతనుడై, స్థిరంగా ఉన్నచోటనే ఉండి ఒక కొండగుట్టగా మారిపోతాడు. అతడు నిలబడి ఉన్నచోట అతనికి మారుగా ఒకపాటి ఎత్తులో ఉన్న కొండగుట్ట ఏర్పడుడుతుంది. ఇక్కడితో “ కిన్నెర పుట్టుక అన్న ప్రధమా౦క౦” సమాప్తమయ్యింది.
* * *
నీటి గుణం పల్లానికి జారి ప్రవహి౦చడమే కదా! పతి కౌగిలిను౦డి నీరై జారిన కిన్నెర వాగై ముందుకు ప్రవహించసాగింది. అలా కిన్నెర వాగై ప్రవహించిన వివరాలనూ, అందాలను ఇక్కడ శ్రీ విశ్వనాధ పరిపరి విధాలుగా వర్ణించారు. అందుకే రెండవ అంకానికి “కిన్నెర నడకలు” అని పేరుపెట్టారు.
“కదలి కిన్నెరసాని ఒదుగుల్లుపోయి౦ది,
సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది,
ముదిత కిన్నెరసాని నురుసుల్లు కక్కి౦ది “ అంటూ –
సెలయేరైన కిన్నెరలోని నీరు ప్రవహించే తీరు గురించి పరిపరి విధాలుగా మనోహర౦గా వర్ణించారు కవిరాజు.
“గడచింది కడరాళ్ళు, నడిచింది పచ్చికలు ...” అంటూ ఆ వాగు ప్రవహించిన చోటును గురించీ చెప్పారు. అంతేకాదు, “కదలగా కదలగా కాంత కిన్నెరసాని, తరగ చాలులమధ్య తళతళా మెరిసింది” అని ఆమె హోయలను పొగిడారు. “ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది” అంటూ సహజ వర్ణనలూ చేశారు. కాని, దానితో తృప్తి చెందక అతిశయోక్తులకు దిగారు. ఆ వాగు ఆయనకు “పదువుకట్టిన లేళ్ళ కదుపులా” తోచిందిట! “కడుసిగ్గుపడురాచ కన్నెలా” కనిపించిందిట!
ఆ తరువాత, “ నడవగా నడవగా నాతి కిన్నెరసాని, తొడిమ ఊడిన పూవు పడతిలా తోచింది” అంటూ, కవిరాజు ఆపై కిన్నెర దుర్దశను ప్రస్తావనలోకి తెచ్చారు.
ఇంటిని వదలి వచ్చిన కిన్నెరసానిని తొడిమ ఊడిన పూవుతో పోల్చడం చాలా సబవుగా బాగుంది. తొడిమవల్లకదా పూవు చెట్టును అంటి ఉంటుంది. తొడిమతో కలసే పూవుకున్న రక్షకపత్రం కూడా ఉంటుంది. వనితకు రక్షకుడు భర్త. అతనితో ఆమెకు వున్న బంధం తొడిమ! ఇక్కడ మనం తొడిమ ఊడిన పూవు – అంటే, భర్త రక్షణనుండి తప్పిపోయిన స్త్రీ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి కిన్నెర స్థితి అదేగా!
పడరాని మాటపడి, దుఃఖిస్తున్న కిన్నెరను కనీసం ఓదార్చనైనా ఓదార్చకు౦డా ఆమె భర్త స్తబ్దంగా ఉ౦డిపోయినప్పుడే ఆమె రక్షకపత్రాన్ని కోల్పోయిన పూవయ్యి౦ది – అని మనం అనుకోవచ్చు. అందుకే తనను తానూ అనాధగా ఊహించుకుని ఆమె ఇల్లు వదిలి చెట్ల వెంట, పుట్టల వెంట అడవిలోకి వెళ్ళిపోడమే మేలనుకు౦ది . రక్షకపత్రాన్ని కోల్పోయిన పువ్వుతో ఆమెను పోల్చడం గొప్పగా ఉంది. తొడిమ ఊడి పోగానే పూవు నేల రాలిపోతుంది. సహజమే అది కదా!
భర్త కంఠధ్వని వినిపించకపోడంతో ఏమయ్యి౦దో చూడాలని వెనుదిరిగి చూసి౦ది కిన్నెర. ఆమె అలా చూస్తూండగానే, ఆమె కళ్ళకు ఎదురుగా అతడు రాయిగా మారిపోయాడు. వెంటనే, కంగారుపడుతూ వాగుగా మారిన కిన్నెర వెనుదిరిగి, భర్త రాయిగా మారి పడివున్న తావుకి వస్తుంది. కాని ఏమి లాభం, అంతా ముగిసిపోయింది.
ఐపోయింది, అంతా ఐపోయింది. అది శాపమో, నేరక చేసిన పాపమో గాని, రాతిగుట్టగా మారిన అతడు ఉన్నచోటును౦డి ఇసుమంతైనా కదలలేడు, సెలయేరుగా మారిన ఆమేమో, క్షణమైనా నిలకడగా ఒక చోట ఉండలేదు! కాని అతనికి తనపైనున్న అపారమైన ప్రేమను గురించి తెలియగానే, ఆమెకు అతనిపైనున్న ప్రేమ ఇనుమడించింది. అతన్ని విడిచి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం పోయి, మళ్ళీ మనిషి కిన్నెరసానిగా మారిపోయి అతనితో కలిసి బ్రతకాలని కోరుకుంది . అంతలోనే ఈ అవాంతరం వచ్చిపడింది.
కిన్నెర పట్టరాని దుఃఖంతో కొండగుట్టగా మారిన భర్తపై వాలి గోడుగోడున ఏడుస్తుంది. అతనితో కలిసి, అక్కడే ఉండిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరదని తెలుసుకుంటుంది. ఆపై – ఆ గుట్టపై వాలి అలల చేతులు చాపి అతన్ని కౌగిలించుకుని , “నాకుమల్లే నీవు నదివోలె పారిరా
జలముగా ఇద్దరమూ కలిసి ఉందామురా”
అని వాపోతూ భర్తను బ్రతిమాలుకు౦టు౦ది కిన్నెర. కాని రాయిగా మారిన అతనిను౦డి ఏ జవాబూ రాలేదు.
ఉప్పెనలా ఉవ్వెత్తున ఉబికిన కోపంవల్ల, ఉప్పొంగిన ఉద్రేకంతో తను ఇల్లువిడిచి వచ్చినందుకు పశ్చాత్తాప౦తో కుమిలిపోతుంది కిన్నెర. తన తొందరపాటుతనం వల్లనే ఇంత ముప్పు వచ్చిందని అనుకుంటూ బాధపడుతుంది. గతంలో చక్కగా సాగిన తమ దాంపత్య జీవితాన్ని పరిపరి విధాలుగా తలుచుకుని విచారిస్తుంది. ఇదంతా స్వయంకృతమే కదా - అనుకుని బాధ పడుతుంది. ఏది ఎలా ఉన్నా, ఎలాగైనా అతనున్న తావునే నిలిచి ఉండిపోవాలని తాపత్రయ పడుతుంది. కాని, అవేమీ ఆమె నక్కడ నిలబెట్ట లేకపోతాయి. అతనిని విడిచి వెళ్ళలేక ఆ గుట్ట చుట్టూ తిరుగుతూ, దానినే అంటిపెట్టుకుని అక్కడే ఉ౦డిపోవాలని చూస్తుంది కిన్నెర, కాని కుదరదు. నీరుగా మారిన ఆమె తీరు పూర్తిగా మారిపోయింది. తన ఇష్టప్రకార౦ నిలిచి ఉండిపోడం సాధ్యం కాదన్నది ఆమెకు అర్థమౌతుంది. ఇక భర్తను వదిలి వెళ్ళిపోక తప్పదని తెలుసుకుంటుంది. జలదేవతలు వచ్చి మరీ మరీ తొందరచేయడంతో, అసహాయురాలైన ఆమె నిరాశతో, “నీ తోవ నీదిరా, నా తోవ నాదిరా, మరల నాతొ నీవు మాటాడబోవురా” అంటూ వాపోతూ భర్త దగ్గర సెలవు తీసుకుని, “ ఓ నాధ! నీ యెడల నేను చేసినతప్పు తిరిగి ఎప్పటికైనా తీర్చుకు౦టానురా” అంటూ అతనికి వీడ్కోలు చెప్పి, తల్లి పొదుగును౦డి మెడపలుపు పట్టుకుని లాగబడుతున్నప్పటి లేగదూడలా, వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ, తప్పనిసరియై మనసు రాయిచేసుకుని జలదేవతల వెంట ముందుకు కదిలింది సెయేరైన కిన్నెర సాని .
జలదేవతల వెంట ప్రవహించి వెడుతున్న కిన్నరసాని నడకలో ఆమెకు అతిసహజమైన హొయలు, వయ్యారం కనిపించాయి కవి విశ్వనాధకి. కిన్నెర వాగు ఆయనకు “అడవి తోగుల రాణి” లా కనిపించింది. ఇక కిన్నెరలోని నీరు? దాని రుచి అచ్చంగా - “బంగారు తీగలు” అనబడే అత్యంత శ్రేష్టమైన చెరుకు గడలను పిండి తీసిన చెరుకు పానకంతో, ఆవు పాలతో, కొబ్బరి నీళ్ళతో సమాన మన్నారు కవిగారు. ఇక కిన్నెర నడకలు! పరికిణీ కట్టుకున్న పదేళ్ళ పిల్ల నడకలా, తెల్లని ఆవుదూడ వేస్తున్న చిన్న చిన్న గంతుల్లా, పసిపాప చెలవిపై చెలువారు బోసినవ్వుల్లా కనిపించాయి ఆయనకు. చివరకు “తెలుగుపాట వెంటనుండే తీపిలా తోచింది “కిన్నెరసాని” లోని నీరు శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారికి.
అతిశయోక్తిని అలంకారాల్లో ఎవరు, ఎప్పుడు, ఎలాగ చేర్చినారోగాని, అది మొదలు దానిని కవులు ఎడా పెడా బాగా వాడుకున్నారు. కవి నిరంకుశుడు! తన మనసులో పుట్టిన మాటను అందంగా అందరిముందుకూ తెచ్చే ఆసక్తి,, హక్కు అతని స్వంతం.
వయ్యారి నడలతో వస్తున్న కిన్నరసానిని చూసి వనదేవతలు పుష్పవృష్టి కురిపించారు, వాయు దేవతలు స్వాగతించారు. భూదేవతలు ఎదురెళ్ళి
దీవించారు. ప్రకృతి సంతోషించింది. కోయిలలు పాటలు పాడేయి, పికిలిపిట్టలు మేలిరకపు కూతలు కూశాయి. ఇక తెలుగుపిట్టల సంగతి సరే సరి! అవి ఒళ్ళు మరచిపోయి గానం చేశాయి!
ఇక్కడ తెలుగు పిట్టలు అంటే తెలుగు కవులు అని మనం అర్థం చేసుకోవచ్చు. కవి – అంటే నీటిపక్షి అనే అర్థం కూడా ఉంది. వాగుగా మారిన కిన్నెర పైన నీటి పక్షులకు, అంటే – కవులకు అభిమానం ఉండడం సహజమే కదా!
కిన్నెర రాకకు వనమంతా తన సంతోషాన్ని వ్యక్తం చేసిందిట! ఇంత వైభోగం తన వెంటనున్నాగాని కిన్నెరకు మాత్రం సంతోషం లేదు. ఆమె తన భర్తను తలుచుకుని బాధపడుతోంది. వెనక్కి తిరిగితిరిగి చూసుకుంటూ, జలదేవతలు ఎంతగానో బలవంతపెట్టడంతో తప్పనిసరిగా ముందుకు నడుస్తోంది.
“పతివంక చూచుచూ పడతి కిన్నెరసాని
పారేటి వేళలో భూమి తనంతతా
తోరమై విరియుచూ త్రోవగా చేసింది
కెరటాలతో తాను చొచ్చుకోదు కిన్నెరసాని!”
భూదేవి తొలగి ఆమెకు వెళ్ళవలసిన దారిని చూపిస్తో౦ది. అయినా, కెరటాల ఉరవడితో పరుగులు తీయకుండా కిన్నెర అణకువగా, తాను బ్రతికి ఉన్నప్పుడు తనలోనున్న ఇల్లాలి నెమ్మదితనాన్ని వాగుగా మారాకకూడా చూపిస్తూ, తనకు అతి సహజమైన వయ్యారి నడకలతో నెమ్మదిగా ముందుకు సాగుతోంది కిన్నెరసాని. దానినిలా వర్ణించారు గురువుగారు ...
“బ్రతికి ఉన్నప్పుడు అతివ కిన్నెరసాని
ఎంత వయ్యారియో ఎంత నెమ్మది చానో
అంత వయ్యారము అడుగడుగు పోయింది,
అంత ఇల్లాలి నెమ్మదితనము చూపింది.”
ఇక్కడితో “కిన్నేర నడకలు” అనే రెండవ అంకం మొదలయ్యినది.
అడవిలో వాగై ప్రవహిస్తున్న కిన్నెర ఉరవడిలో గురువుగారికి నృత్యరీతులు గోచరి౦చడంతో వాటిని వర్ణిస్తూ “కిన్నెర నృత్యం” అని ఒక అంకమే రాశారు. కదలే చిరు అలలపై తేలియాడుతున్న తెల్లని నురుగు కదలికలలో, ప్రవాహ వేగానికి చెలరేగే నీటి తు౦పురులలో, గాలికి కదలాడే అలల విన్యాసాలలో, ఒడ్డులొరసుకు ప్రవహించే సెలయేటి వడిలోని హొయలలో – అన్నింటా ఆయనకు నర్తించే కిన్నెర యొక్క నృత్యవిన్యాసాలు ప్రస్ఫుటమవ్వడంతో ఎంతో చక్కగా, మనోహరంగా వాటిని వర్ణించారు ఆయన...
“కెరటాలలో నుర్వు, తెరజాలులో నీటి
పొరజాలులో కిన్నె రటు కదలి, ఇటు కదలి
చిట్టి తరంగాలతో, పొట్టి తరంగాలతో
నటనాలు మొదలెట్టెనే క్రొన్నీటి తుటుములా కదలానే!” అన్నారు.
అక్కడతో ఆగలేదు...
“చిరుగాలిలో నూగు కొరవంపులో నీటు
తరి తీపులో కిన్నెరటులేచి, ఇటులేచి
జల్లుతు౦పురులతో, కొల్ల తు౦పురులతో
మెల్లమెల్లన ఆడెనే కెరటాల జల్లులో ముంచెత్తెనే!” అన్నారు
ఇలా విధవిధాలుగా సెలయేరౌ కిన్నెరసానిలోని నీరు చేసే సహజ నృత్యాన్ని తనివితీరా కొనియాడారు శ్రీ విశ్వనాధ.
కిన్నెరవాగు తన నృత్యానికి తగిన విధంగా పాటకూడా పాడుకుందిట! “అచ్చరల గొంతులా, గజ్జియల మ్రోతలా మొరసింది కిన్నెర” అని కూడా మెచ్చుకున్నారు ఆయన. అంతేకాదు,
“తెగపాడుతూ అందముగ నాడుతూ, తేనె
వగలోడుతూ కిన్నె రటువాలి ఇటువాలి
తళుకు వాకలతోడ బెళుకు వాకలతోడ
మలకలై నటియించేనే, తెలినీటి
పులకలై బుగులెత్తెనే!” అన్నారు ఆమె నృత్యాన్ని. అయినా తనివి తీరక -
“లయ పెంచుతూ, మధ్య లయ దించుతూ, పాట
రయమెంచుతూ కిన్నెరటు సోలి, ఇటు సోలి
తెలినీటి మేనితో, రాలిరాకు మేనితో
ఒయ్యారములు పోయెనే కిన్నెరా, అయ్యారే అనిపి౦చెనే!" అని కూడా అన్నారు.
అలా పలువిధాలుగా కిన్నెర ఆటపాటలను పొగడి పొగడి చివరకు “తెలుగు ఒదుగులు పోయెనే కిన్నెరా, తెలుగు తీపులు చిమ్మెనే” అంటూ ఆమె తెలుగుతనాన్ని కూడా లోకానికి ఎలుగెత్తి చాటారు.
తెలుగు గడ్డపై పుట్టి, ప్రవహించి , తెలుగునేలనే అంటిపెట్టుకుని ఉన్న సెలయేరు కావడంతో, కిన్నెరలో అన్నిటా ఆయనకు తెలుగుతనమే కనిపించింద౦టే అందులో విడ్డూర మేముంది!
ఇలా ఆ అడవిలో -
”పాయలై, వాకలై, సోనలై, జాలులై
కిన్నెరటు ప్రాకి, ఇటు ప్రాకి దివ్యనృత్యముతో,
దివ్య నిస్వనముతో దిగ్దిగంతము లంటెనే,
సురనదీ దీప్తి దిక్కుల జిమ్మెనే” - అన్నారు కవి.
అలా ఆమెను నృత్యసంగీతాలలో వున్న ప్రజ్ఞలో,సురనది గంగతో సమంగా ఆమె ప్రతిభ కూడా దిగ్దిగంతాలకు వ్యాపించింది అంటూ ఆమెను గంగానదితో పోల్చారు. అయినా తనివితీరలేదు ఆయనకు.
మళ్ళీ –
“ధన దంగిణా౦ ధదోంగిణ తక్కిణం” అన్న మద్దెలదరువుకు అనుగుణంగా కిన్నెర మృదుతాండవం చేసింది – అని కూడా పొగిడారు! అప్పటికిగాని ఆమె నృత్యాన్ని తనివితీరా వర్ణించిన తృప్తి కలగలేదు కాబోలు ఆయనకు. ఆ తరవాతే ఆయన "కిన్నెర నృత్యం" అన్న అంకాన్ని ముగించి తరువాతి అంకమైన "కిన్నెర సంగీతం" అన్నది మొదలుపెట్టేరు.
మరి, ఇంత ఇదిగా శ్రీ విశ్వనాధ మదిని గెలుచుకున్న తెలుగు వాహిని ఐన కిన్నెర, “నెత్తావి తెలుగు పాటలు పాడేనే” అంటూ ఇక మనకు ఆయన వేరే చెప్పాలా ఏమిటి! తెలుగింటి ఆడబిడ్డ, పైగా సురగంగతో సమానమైన ప్రజ్ఞాపాటవాలున్న కిన్నెర నెత్తావి “తెలుగుపాటలు” పాడినా, ఆ పాటలలో “తేనె కాలువ” లూరినా, “అమృతపు వానచినుకులు” జాలువారినా అందులో ఆశ్చర్యమేముంది!
అసలే కిన్నెరాయే! కిన్నెరకు సంగీతానికి అవినాభావ సంబంధ ముందన్నది మనందరకూ తెలిసివున్న విషయమేకదా! కిన్నెర అంటే – అది ఒక తంత్రీ వాద్య విశేష౦. దానిని కిన్నెరవీణ – అని కూడా అంటారు. ఇక కిన్నెర వీణయితే, దానికి సంగీతానికి కొదువేమిటి? అందుకే కిన్నెర వాగుగా మారిన తరువాత ఆ వాగు చేసిన చిరు అలల సవ్వడి కూడా గురువుగారి చెవులకు, కొనగోళ్ళతో మీటిన కిన్నెరవీణా తంత్రుల నిక్వాణంలా అనిపి౦చివుంటుంది. ఆపైన ఆయనకు, కిన్నెర పాడిన “నెత్తావి తెలుగు పాటలు” వినిపించడంలో ఆశ్చర్యమేముంది? అలా వినవచ్చిన ఆ సంగీతమే ఆయనచేత “కిన్నెర సంగీత౦” అన్న అంకాన్ని రాయించివుంటుంది.
తానెంతో జగమంత – అనిపిస్తుంది ఎవరికైనా సరే! మన మనసులో పుట్టిన భావాలనిబట్టే కదా మనం లోకాన్ని అర్థం చేసుకుంటాము! కిన్నెర సంగీత మాధురిలో చిక్కి, సొక్కిన విశ్వనాధ, తాను తన్మయులవ్వడమే కాకుండా, “ ఆ రసవార్ధిలో లోకాలు ఛుళుకితమ్ములయిపోయాయి” అని రాశారు. “చిరురాలపై, మిర్రులగు నేలపై, మెట్టలగు చేలపై” పారుతూ పోతూ కిన్నెరచేసే ప్రతి సవ్వడిని సంగీతంగా భావించి గురువుగారు దాన్ని ఎంతో హృద్యంగా కొనియాడారు.
“అలల పెన్నురుసుతో,
సెలల పెన్నురుసుతో
తెలుగు ఒదుగులు పోయెనే కిన్నెరా,
తెలుగు తీపులు చిమ్మేనే!” అంటూ ఆమె తెలుగుతనాన్ని అడుగడుగునా ఎత్తి చెప్పారు. పూల చెండ్లతో, విరి తోపులతో పోల్చారు కిన్నెరని. ఎంతగా ప్రశంసించినా తనివితీరటంలేదు ఆయనకు. ఇది చూడండి...
“చెరకు పానక మెర్రజీర పాకమువోలె
తరుణి కిన్నెర పాటపొంగిపోవుటజూసి, పువ్వులో, లేసంజ రువ్వులో దానిమ్మ
తెలతెల్లనైపోయెనో, క్రొంజిల్క పల్కులే పసదప్పెనో...” అన్నారు.
ఎంత పొగడినా తనివితీరని సొగసులు కిన్నెరవి అనుకోవాలి మనం. “తేనెలై, కలకండ సోనలై, వానలై” చాన కిన్నెర పాట సాగిందన్నారు విశ్వనాధ ! అలా అని అక్కడితో ఆపలేదు ...
“జిలుగుటందియలతో, కులుకు క్రొన్నడలతో
వెలది కిన్నెరసాని పలు త్రోవలుగ పోయి,
తెలిపూల తేనె వాకలు వారగా జేసి,
తెలుగు వాగై ఇలా పారెనే,
నెత్తావి తెలుగుపాటలు పాడేనే! “ అన్నారు.
“ఒకసారి చిన్నగా , మరొకసారి మిన్నగా!” “ అ౦చ కన్నెల ఎలుగులా”, “అందగత్తెల జిలుగు టందెలు మ్రోసిన యట్లుగా” అంటూ - ఎన్నెన్నో మేలిపోకడలతో ఇలా కిన్నెర సంగీతాన్ని వర్ణించిన కవి ఆమె కష్టాల్ని మరిచిపోలేదు...
“ముద్దు ముద్దుగ నడిచి, ప్రౌఢ పోలికనాడి,
మురిపెమ్ముగా పాడి ముగుద కిన్నెరసాని
ఎడదలో ఎదురైన బెడదలో కష్టాల
కడలియే కలగా౦చెనో కన్నీటి
కడవలే ప్రవహి౦చెనో” అన్నారు చివరగా ...
పుట్టెడు దుఃఖంలో ఉన్నా కిన్నెరకు సహజమైన హొయలు, వయ్యారం పోలేదని చెప్పడానికి బహుశః, ఈ “కిన్నెర నృత్యం”, “కిన్నెర సంగీతం” అన్న రెండు అంకాలూ రాసి ఉంటారు గురువుగారు. కాని మోతాదు ఎక్కువనిపిస్తో౦ది. పట్టరాని దుఃఖ౦తో కొట్టుమిట్టాడుతున్న కిన్నెర పాట పాడుతూ నృత్యం చెయ్యగలదా, మనసు ఒప్పుతు౦దా - అన్న సందేహం, ఈ గేయకథ చదివిన పాఠకుల మనసుల్లోకి రాకపోదు. అందులోనూ గురువుగారు - పోనీ, ఎదో వల్లమాలిన విచారంలో ఉంది కదా పాపం – అని ఏ ముఖారి రాగంలోనో , మరో రాగంలోనో దీనంగా తన దుఃఖాన్ని వెళ్ళబోసుకోడానికి తగిన విషాదగీతాలు పాడింది - అనలేదు, “తెలిపూల తేనెవాకలు వారగా ... నెత్తావి తెలుగుపాటలు పాడింది” అన్నారు. అందుకు ఒకే ఒక్క జవాబు మనకు మనం చెప్పుకుని మనసు సరిపెట్టుకోవాలి. ఆమె ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, సుఖదుఃఖాలలో- వేటిలో ఈదులాడుతున్నప్పటికీ, కన్నవారు పుత్రిక అందచందాలను గుర్తించకుండా ఉండలేరు. అలా తన బిడ్డ కిన్నెర ఆయనకి ఇంటికి దీపంలా, కంటికి వెలుగులాగ కనిపించింది – అనుకోవాలి మరి . అదే వాత్సల్య౦! అంటే - బిడ్డమీద కన్నవారికి ఉండే అపారమైన ప్రేమ! అలా అనుకోవాలి మనం.
అత్తవారింట అగచాట్లకు లోనయి పుట్టినింటికి తిరిగివచ్చిన తన కూతుర్ని చూశారు ఆయన కిన్నెరలో -అనిపిస్తుంది. ఆమె కష్టాలలో మమేకమై తానూ కన్నీరు పెట్టుకుని, పాఠకులమైన మనచేత కూడా కన్నీర పెట్టించేలా కవితలల్లారు. అలాగే ఆమె వాగై ప్రవహించే వళులనూ, హోయలనూ మిన్నంటే విధంగా వర్ణించారు. “కవి నిరంకుసుడు” అన్న మాటను మనం మరోసారి తలుచుకోవాలి! మనోహరమైన కిన్నెరసాని పాటలో మల్లెపూలలో మత్కుణాల్ని వెతికినట్లు లోపాల్ని వెతకడం మంచిపని కాదేమో!
"అతిషయోక్తి" కి సాహిత్యంలో అల౦కార అన్న గౌరవాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు ఇచ్చారో ఏమోగాని, అదిమొదలు కవులు దీనిని బాగా ఉపయోగి౦చుకుని గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం మొదలుపెట్టారు!
ఇక్కడినుండి తరువాతి అంకం మొదలయ్యింది ...
ఇంతవరకూ కిన్నెర అనుభవించిన కష్టాలు చాలవన్నట్లు, అన్నింటికీ మించిన అతిగొప్ప కష్టం మరొకటి ఆమెకై కనిపెట్టుకుని ఉంది. “కడలి పొంగు” అన్న ఈ అంకంలో మన కది విశదమౌతు౦ది.
కిన్నెరసాని వాగై ప్రవహి౦చి వస్తో౦దని, ఎలా తెలిసి౦దోగాని కడలిరాజుకు తెలిసిపోయింది! ఆ విషయాన్నిలా రాశారు కవి...
“ గాలి పిల్లలే పోయి ఊదెనో,
మొగిలు కన్నెలుపోయి చెప్పెనో,
తగని కోరికతోడ తనలోన కడలిరాజు,
సొగసు కిన్నెరసాని చూడాలెననిపి౦చి
ఉర్రుట్టలూగెనూ, మిర్రెక్కి చూచెను!”
కిన్నెర వాగయ్యిందన్న వార్త విన్న సముద్రుడు, ఆమె తన కొరకే నదిగా మారి వస్తోందన్న భ్రాంతిలో పడ్డాడు. “కామాతురాణా౦ నభయం న లజ్జా!” – అన్నారు. అలా కిన్నెరపై జనించిన వ్యామోహంతో కడలిరాజు తన స్థితి గతులను తాను మరచిపోయాడు. ఆ సమయంలోని సాగరుని పరిస్థితిని ఇలా వర్ణించారు కవిసామ్రాట్ ...
“మిసమిసని మింటికై పొంగెను,
మసక మసకల కళ్ళు విప్పెనూ,
ఎంత దూరానుందొ ఈ చిన్ని పడుచంటు
సంతోషమే మేను సకలమ్ముగా మారి
ఉర్రుట్టలూగెనూ, మిరిమిర్రి చూచెను.”
ఇక్కడ “మసక మసకల” అని రెండు సార్లు అనడం చక్కగా నప్పింది. ఒక కన్నుకి, కామప్రకోపంతో కన్ను మూసుకుపోయి సరిగా కనిపించకపోడం వల్ల వచ్చిన మసక, రెండవ కంటికి, వయసు మీరడంతో శుక్లాలు రావడం వల్ల వచ్చిన మసక - అనుకోవచ్చు. వృద్ధాప్యంలో శుక్లాలు వచ్చి కళ్ళు మసకబారడం అన్నది సహజమేకదా! మొత్తానికి సాగారునికి రెండు కళ్ళూ కూడా మసకలుగానే ఉన్నాయి.
బొటన వేళ్ళపై లేచి, మసకలైన తన కళ్ళును బాగా తెరిచి, కష్టపడి దూరదూరాలకి చూపులు సారించి, ఆశగా కిన్నెర రాకకోసం ఎదురుతెన్నులు చూస్తున్నాడు కడలిరాజు! ఉత్కంఠ భరించలేక తాపంతో అల్లాడిపోతున్నాడు ఆ వయోవృద్ధుడైన రసికచక్రవర్తి రత్నాకరుడు! తనలో నిక్షిప్తమైయున్న బడబాగ్నియే చెలరేగి తనను దహి౦చి వేస్తున్నట్లుగా ఉంది అతని పరిస్థితి. తాపం పట్టలేక తనలో తాను రగిలిపోతున్నాడు! ఆత్రం పట్టలేక అల్లాడిపోతున్నాడు!!
“గగనమ్ము కొసదాక కెరటాలు ఉబికి౦చి
దూరాలు చూచెనూ, బారలూ చాచెనూ”
ఇంతవరకూ తనకు భార్యలైన వాహినులందరినీ మరచిపోయాడు. చిన్ని కిన్నెరయే లోకమైపోయి, ఆమె ప్రవహించి వస్తున్న వైపుకే చూస్తూ, ఆమె రాకకై వెంపరలాడిపోతున్నాడు.
“గంగ తన ఇల్లాలు కాదటే, యమున తన ఇల్లాలు కాదటే!
ఎంతమందీ లేరు, ఇన్ని ఏళ్ళూ వచ్చి,
చిన్న వాగునుచూసి చిత్తమెరియి౦చుకో
తనకు ఇది తగదు కడలి రాజునకు” అన్నారు కవిరాజు .
ఎంత గొప్ప నదులైనా, వాటి పుట్టుక ఎంత గొప్పది అయినా కూడా, నీటి స్వభావం ఎప్పుడూ పల్లానికి ప్రవహించి పోవడమే కనుక, కడకవి సాగరునిలో లయమవ్వక తప్పదు కదా! ఇప్పటికే ఎన్నో నదులు అలా ఎక్కడెక్కడో పుట్టి, ప్రవహించివచ్చి సాగరునితో సంగమి౦చాయి. కడలి పజ్జను చేరిన ఆ నదులను అతని భార్యలుగా చెప్పడం మనకు అనాదిగా వస్తున్న అలవాటు. అదేవిధంగా శ్రీ విశ్వనాధ కూడా నదులను కడలి రాజుకు భార్యలుగా చెప్పారు...
అంతా బాగానే ఉందిగాని, ఇక్కడొక చిన్న ఇబ్బంది కనిపిస్తోంది. జంటకవుల పేర్లలాగ గంగా యమునల పేర్లను కలిపి పలకడం మనవాళ్ళకున్న ఒక అలవాటు. శ్రీ సత్యనారాయణగారు కూడా అదే పాటించి “గంగ తన ఇల్లాలు కాదటే, యమున తన ఇల్లాలు కాదటే “ అని - అనివుంటారు, సముద్రుని భార్యలను గురించి చెపుతూ. కాని ఇక్కడ ఒక విషయం గమనార్హం – గంగ సాగరునిలో కలిసిందే తప్ప, యమున అలా కలవలేదు.
“విష్ణు పదం, శివుని శిరం, హిమాచలం, మహీతలం ...” ఇలా స్వర్గంలో పుట్టిన గంగానది, మానవులను పునీతులను చెయ్యడం కోసం దివినుండి భువికి దిగివచ్చి, ఆపై సముద్రుని పొంది, చిట్టచివరకు పాతాళానికి చేరుకుందని పురాణాలు చెపుతున్నాయి.
కాని యమున అలాకాదు - యమున ఒక కన్నెవాగు! హిమనగంలో పుట్టి, దిగువకు, అల్లరిపిల్లలా దుడుకుగా - వడివడిగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చిన యమునానది, ప్రయాగ దగ్గర గంగమ్మ తల్లి చల్లని ఒడిలో చేరి విశ్రమి౦చింది. “యమునాతీరం రాగాల సారం” అంటారు. అది నిజమే కావచ్చు. కాని యమున మాత్రం ఎవరి అనురాగమూ ఎరుగదు. శ్రీ కృష్ణుని రాసలీలా విలాసాలకు యమున ఒక ప్రత్యక్ష సాక్షి మాత్రమే! అంతేకాదు, జహంగీరు బాద్షా తన ప్రియభార్య ముంతాజ్ కు ప్రేమ నజరానాగా కట్టించిన జగత్ప్రసిద్దమైన పాలరాతి సౌధం, తాజమహల్ కూడా యమునలో తన అందాన్ని చూసుకుంటూ యమునా తీరంలోనే విడిసి ఉంది. కాని యమున మాత్రం అమ్మ ఒడి తప్ప అన్యమెరుగని బాల! ఆమె వివాహిత యనిగాని, కనీసం వలపు వలలో పడిందనిగాని ఎవరూ వర్ణించలేదు. యమునానది యమునికి సోదరి అని పురాణాలు చెపుతున్నాయి. గంగ ఒడిలో చేరిన యమున సాగరునికీ పుత్రిక ఔతుంది లేదా పుత్రికా సమానురాలు ఔతుంది గాని, ఎట్టి పరిస్థితిలోనూ ఇల్లాలు గాని, ప్రియురాలుగాని కాదు, ఎప్పటికీ కానేరదు.
గురువుగారు, “గంగ తన ఇల్లాలు కాదటే, కృష్ణ తన ఇల్లాలు కాదటే” - అనివుంటే ఎంతో బాగుండేది. ఆయన కృష్ణానదీ తీరంలో పుట్టిన వారు కనుక, ఆయన ఒకసారి గలగలాపారే కృష్ణమ్మను కూడా తలుచుకున్నట్లు అయ్యేది.
“ఏనాటి ముసలి ఈ కడలి, ఏనాటి పెద్ద ఈ కడలి!
తిరిగి నలుగురిలోన తిరగనేర్చినవాడు
పరగ కామమునకై బడలిపోయెనటన్న
తనకేమి పరువు కడలి రాజునకు!”
ఇంత వరకూ ఎందరు భార్యలున్నా, జనానా ఎంత పెద్దది అయినా కూడా కడలిరాజుకు లోకంలో అఖండ గౌరవం ఉంది. ఎ౦దుకంటే, ఆ నదులన్నీ, తమకి తామై అతన్ని కోరి వరించి వచ్చాయి గాని, అందులో బలవంతమేమీ లేదు. అందుకే ఏ విధమైన సంకోచమూ లేకుండా “జలనిధి” అనీ, “రత్నాకరు”డనీ జను లాయనని ఎంతో గౌరవంగా పిలుస్తారు. ఇప్పుడిలా ఒక చిన్న వాగు కోసం అతడు అంతగా తపించిపోవడం అన్నది ఎవరూ హర్షి౦చ లేరు. పతివ్రత అయిన కిన్నెర సాగరుని పొందు ఎంతమాత్రం కోరడం లేదు కదా! అలాంటప్పుడు అతడు ఆమెను ఆశించడం అన్నది చాలా పెద్ద తప్పు. ఆ విషయ౦ విప్పి చెప్పి, ఇప్పటి స్థితికి కడలిరాజును కవి చక్కగా తప్పుపడుతున్నారు. ఒక పొందుకు కనీసార్హత ఇరుపక్షాలకు ఇష్టమవ్వడం. అదికూడా లేనప్పుడు ఇది రాక్షసమే! చాలా పెద్దతప్పు, ఎవరూ హర్షించరు.
“తనకున్న మరియాద ఎంత! తనకున్న గౌరవమ్మెంత!
లోకాలు తప్పుత్రోవల పోవునాయేని సరిదిద్దగలట్టి
సామంతుడీ రాజు, తానుగా దిగెనా - తప్పుదారులకు!” – అంటూ తన నిరసనను, ఆశ్చర్యాన్ని ప్రకటించారు.
ఎంత గొప్పవాడైనా చెయ్యకూడని తప్పు చేస్తే జనాలకు లోకువ కాక తప్పదు - అన్నది ఇక్కడ మనకు అర్ధమౌతుంది.
ఇంతవరకు సముద్రుడు ఎన్ని పెళ్ళిళ్ళయినా చేసుకుని ఉండవచ్చు, కాని ఆ నదీ లలామల౦దరూ, గంగ, గోదావరులతో సహా అందరూ, తమకు తామై కోరి వరించి వచ్చి ఆయన పజ్జను చేరినవారే! ఇంతవరకూ కడలిరాజు ఇలా ఏ నదీవనిత కోసమూ అల్లాడిపోయి౦ది లేదు. ఇప్పుడు ఈ చిన్ని వాగుకోసం ఎందుకనో మరి అతని మనసు అంతగా దిగజారిపోయింది! వింతగా లేదూ ...
కడలి రాజు ఆశ పడినంతలో ఆ ఆశ తీరుతుందన్న నమ్మకం ఏమిటి?
“అన్నివాగులవంటి దగునా!
అన్నితోగులవంటి దగునా?
మంచి కిన్నెరసాని మగనికెక్కిన చాన
కొ౦చమేమోపొంది కోపమిట్లైనంత
తన్ను పొందు నటే, తనకు దక్కునటే?”
ఇదీ అసలైన ప్రశ్న! పతివ్రత ఐన కిన్నెర, అతడు ఎంత గొప్పవాడైనప్పటికీ పరపురుషుని పొందు ఆశించదు. ఇది అందరికీ అర్థమయ్యే విషయమే! అయినా ఒక చిన్న ఆశ మిగిలి ఉ౦ది కడలి రాజుకు ...
“వాగుగా తానెప్పుడైనదో, తోగుగా తానెప్పుడైనదో
జల జలా స్రవియి౦చి, బిలబిలా ప్రవహించి
కడలిరాజు హొరంగు కౌగిలిలో దూరు
టపుడె రాసినది అన్నివాగులకు!” అని అనుకున్నాడు ధీమాగా సాగరుడు.
శివుని భార్యగా చెప్పబడిన గంగ ప్రవహించి వచ్చి కడకు కడలిని చేరలేదా - అన్నదే అతడి ధీమా. ఈ చిన్ని కిన్నెర సురగంగ కంటే గొప్పదా ఏమిటి? వాగైనందున కిన్నెర, ఎంత పతివ్రతయైనప్పటికీ కూడా, “బిలబిలా స్రవియించి, గలగలా ప్రవహించి (వచ్చి) కడలిరాజు హొరంగు కౌగింటిలో దూరక తప్పదు” అని తనను తాను సమర్ధించుకుని ఆనందంతో ఉప్పొంగి పోయాడు సముద్రుడు. కెరటాలు ఆకాశాన్ని అంటేలా ఉబికించి కిన్నర వచ్చే దారివంక చూపులు సారించి ఆమె రాకకై ఎదురుతెన్నులు కాచి వున్నాడు అతడు.
అకాలంలో అలా గగనాన్ని తాకేలా ఉబికి, ఉప్పొంగిన సముద్రాన్ని చూసిన జనం, పెద్దగా ఉప్పెన వచ్చి ఊళ్ళను ముంచెత్తబోతోందన్న భయంతో, ప్రాణాలు అరచేతుల్లో ఉంచుకుని కకావికలుగా పరుగులుపెట్టారు. కాని ఎంతకీ, పైకిలేచిన కడలికెరటం భూమిపై విరుచుకు పడనందుకు ఆశ్చర్యపోయారు పాపం, బుడుత మానిసులు! నెమ్మదిగా, ఇది కేవలం కడలి పొంగేగాని ఉప్పెన కాదని తెలుసుకున్నారు. కడలి బద్దె దాటనందుకు సంతోషించారు వాళ్ళు. వారి భయం తగ్గి౦ది. ఇక్కడ కడలి కెరటంతో మనిషిని పోల్చి బుడత మానిసులు అనడం బాగుంది. ప్రకృతి చెలరేగినప్పుడు మనిషి అసహాయుడు కాక తప్పదు కదా! సముద్రం చెలియలికట్ట దాటి వచ్చిననాడు మనిషి ఏమి చెయ్యగలడు?
అది కడలి పొంగేకాని ఉప్పెన కాదని తెలుసుకున్న జనం భయం తగ్గి మామూలు స్థితికి వచ్చారు. కాని, చిన్ని కిన్నెరసాని చిత్తాన ఎగసిన సెగలు పొగలు గురించి వాళ్ళకేమి తెలుసు!
“చిన్ని కిన్నెరసాని చిత్తాన పొగలెగయ
క్రొన్నిప్పుకలలోన కుమిలి౦చి దహియించు
టెవ్వరెరుగుదురు ఈ నవ్వేటి జనులు!”
అంతలో, “కడలి(కి) తనపై వలపు కమ్ముకొని వచ్చెనని కిన్నెరెరిగినదీ, కీడు తలచినది.” వెంటనే కిన్నెర యదలోని వగపు బిట్టు పెరిగి, భర్తను తలుచుకుని ఆమె పరిపరి విధాలుగా దుఃఖి౦చి౦ది...
“ఓ నాధ! నిను వీడి వచ్చీ, ఓ రాజ! నిను వీడి వచ్చీ
నా యొడలు సైతమ్ము నానా జనులు కోర
ఈ ఏవపుం బ్రతుకు ఏల పొందితినిరా” - అనుకొంటూ తనని తానె ఏవగి౦చుకుంది కిన్నెర.
ఎలాగైనా ఈ ఉపద్రవాన్ను౦డి తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది. ఉన్నచోటనే ఉ౦డాలనీ , మరి కదలకుండా ఆ చోటనే ఆగిపోవాలనీ, ఎక్కడ ఉన్నది అక్కడనే నిలిచిపోవాలనీ ఎన్నో విధాలుగా తాపత్రయ పడింది, పతివ్రత ఐన కిన్నెర, పాపం!
“రాయడ్డముగ చేసి నిలచు, పొదలడ్డముగ చేసి ఆగు,
ఇంక నిలిచితినంచు ఎంచి లోనుప్పొంగి,
పొంత పొంతల రాళ్ళు, పొదలపై పై పొ౦గి,
అడవి పరుగెత్తు, అంతలో ఏడ్చు...”
శ్రీ విశ్వనాధ కిన్నెర దుఃఖాన్ని మనకు విశదపరచడ౦ ఇక్కడితో ఆపెయ్యలేదు. ఆమె అనుభవించిన భయంకర దుఃఖాన్ని మనకు సమగ్రంగా, వివరంగా తెలిపే౦దుకుగాను “కిన్నెర దుఃఖం” అనే ఒక అంకాన్ని ప్రత్యేకంగా రాసి కిన్నెర వగపుని మనం కూడా పంచుకునీలాచేసి, కేవలం పాఠకులమైన మన చేత కూడా కన్నీరు పెట్టించారు కవి.
ఎలాగైనా కడలి దరికి చేరకుండా ఉండడానికై శతవిధాలుగా ప్రయత్నించింది పాపం సెలయేరు కిన్నెరసాని ...
“ఊగులాడు కెరటాలనాపుకొన,
సాగులాడు తరగల్లు నిల్పుకొన,
పాకిపోవు తన గుణము చంపుకొన
చాలక, చాలక, చాలక, చాలక
“హాఁ” యని కిన్నెర ఏడ్చెన్!” - అన్నారు శ్రీ విశ్వనాధ.
“చాలక – అన్న మాటను నాలుగు సార్లు వాడి ఆమె ముందుకు సాగకుండా ఆగడానికై పలుమారులు పరిపరి విధాలుగా ప్రయత్నించినట్లు సూచి౦చారు. తన ప్రయత్నాలేవీ ఫలించక పోవడంతో, ఇక నేమిచెయ్యడానికీ తోచక అసహాయంగా, “హాఁ” యని ఏడ్చింది కిన్నెర – అని రాశారు ఆయన! అంతేకాదు...
“తన మనోహరుడు శిలయైనాడని,
తానేమో ఈ వాగైనానని
”హాఁ” యని కిన్నెర ఏడ్చెన్” – అన్నారు.
ఈ ఒక్క పదంలో ఆమె దుఃఖానికి కారణమైన విషయాన్నంతటినీ పొందుపరచారు. ఈ అంకంలో, విధవిధాలుగా కిన్నెర దుఃఖానికి మూలకందాలైన విషయాలన్నీ చక్కగా వర్ణించబడ్డాయి!
“ఏడుపు నిప్పుక లెగసి చిమ్ముకుని,
ఏటి నీరముల నెండగట్టుకుని,
చేటుతప్పిపోయేటి రీతిగా బాట ఏల
కనరాదని, రాదని “హాఁ” యని కిన్నెర ఏడ్చెన్!”
ఎదుట పొ౦చి ఉన్న పెను ముప్పును తప్పి౦చు కోడం ఎలాగో తెలియక, తానిలా వాగు కాకుండా ఏ చుక్కో, మొక్కో, ఇంకోటో, మరోటో మరోటో అయ్యివుంటే తనకీ దుర్దశ వచ్చేదికాదు కదా - యని తలుచుకు తలుచుకు గోడుగోడున ఏడ్చి౦దిట కిన్నెర.
“కడలి లోకముల నేలెడి రాజుట,
కడలి ధర్మమును నిలిపే దొరయట,
కడు పతివ్రతల కవయానెంచుట
కడలికి తగునా, తగునా ఇట్లని
“హాఁ” యని కిన్నెర ఏడ్చెన్!”
కడలిరాజు లోకాల నేలే దిట్ట, ధర్మమును నిలిపే దొర! అంతటి వానికి పతివ్రతలను కోరడం ఎంతమాత్రం తగదు - అనుకుంటుంది తనలో కిన్నెర. కాని అంతలోనే ఆమెకు మరో ఆలోచన వస్తుంది – అసలు తప్పు తనదేగాని అతనిది కాదు, తాను వాగుగా మారడంవల్లనే కడలిరాజు ఇలా తనను కోరడం జరిగింది, లేకపోతే అతడు తన గురి౦చి ఎంతమాత్రం ఆలోచించేవాడు కాడు కదా – అని అనుకుంటుంది మళ్ళీ. ఇలా ఊహాపోహలతో కొట్టుమిట్టాడుతూ -
“బొట్టు బొట్టుకోక వేయి యదలుగా,
తరగ తరగ కొక వేయి నోళ్ళుగా,
బడలి నీరమే ఏడుపు మయమై
కడలి మోతలే ఎక్కుడు భయమిడ – “హాఁ” యని కిన్నెర ఏడ్చెన్!”
పరిపరి విదాలుగా రకరకాలైన ఆలోచనలతో తన దుర్దశకు విలపిస్తుంది కిన్నెర. కేవలం నోటివట్టంగా అన్న మాటనే భరించలేక, కినూకతో ఇల్లు విడిచివచ్చి అడవుల పాలైన కిన్నెరకు ఇప్పుడొక గొప్ప తగులాటమే వచ్చిపడింది. దాని నామె భరి౦చ గలదా? ఈ ఆపదను తప్పి౦చుకోడం ఎలాగో తెలియక లోయెలుగుతో భోరు భోరున ఏడుస్తో౦ది పాపం, కిన్నెర! గట్టిగా ఎలుగెత్తి ఏడ్చే ధైర్యం కూడా లేకపోయింది ఆమెకు.
సన్నని ఎలుగుతో కిన్నెర ఏడ్చిన ఏడ్పులు విని ఆ అడవిలోని జీవులన్నీ ఆమెను ఓదార్చడానికని తరలి వచ్చాయి! ఆమె ఏడుపు చూసి సానుభూతితో చెట్టు కొమ్మలనున్న పక్షులు ఏడ్చాయి! వాగునీరు తాగడానికై వచ్చిన పులులు దిగులుపడ్డాయి. అడవిలోని మృగాలన్నీ కూడా కిన్నెర ఏడవడం చూసి తామూ ఏడ్చాయిట! ఎక్కడెక్కడి మృగాలు, పక్షులూ వచ్చి ఆమెను ఓదార్చబోయి, అంత వంతను ఎలా తీర్చాలో తెలియక ఆమెతోపాటుగా అవికూడా ఏడ్చాయిట! నీటి పులుగులూ, నేలపులుగులూ గుమిగూడి ఒకే ఇదిగా అవీ ఏడ్చాయన్నారు కవి. అడవి పక్షులు గూటిలోని పిల్లల్ని కూడా వదిలి, మేతకి పోవడం మరచి కిన్నెర దుఃఖంలో పాలు పంచుకోడానికి వచ్చాయిట!
ఇలా ఆ అడవి అంతా కిన్నెరతోపాటు తనుకూడా శోకించిందని రాశారు విశ్వనాధ! విషయం ఏదైనా సరే, దానిని ప్రస్ఫుటపరచినవారి ప్రజ్ఞను బట్టి రాణిస్తుంది ఆ విషయం. ఇలా కిన్నెర దుఃఖాన్ని, ఆయన మన మనసులకు హత్తేలా చేసి, మన౦ కూడా కన్నీరు పెట్టుకునేలా చిత్రీకరిచారు.
“అల్లనల్ల కిన్నెర ఏడుపులవి
మెల్లమెల్ల గోదావరి గర్భము
వెల్లిలోన చొరబారి మొత్తుకొని
ఘొల్లుమంచు మొరపెట్టుకొన్నయవి!”
కిన్నెర ఏడుపు తాలూకు సన్నని శబ్దం ఆ అడతా వ్యాపి౦చిపోయి౦ది. అది క్రమక్రమంగా గోదావరిని దరిశి, అలల సందుల్లో దూరి, నెమ్మదిగా గోదావరీదేవి హృదయాన్ని చేరుకున్నాయి. ఆ ఏడుపు వినగానే జాలితో గోదావరీదేవి గుండెగూడులు కదిలిపోయాయి. అలల హస్తాలు చాపి కిన్నెరను అందుకుని ప్రియమారా చేరదీసుకుని తన హృదయానికి హత్తుకుంది ఆమె. అంతగా విలపించడానికి, ఇంతకీ ఆమెకు వచ్చిన కష్టమేమిటని అడిగింది కిన్నెరను గోదావరీదేవి. కిన్నెర ఏడుస్తూనే తన గోడంతా విన్నవి౦చుకుంది. కిన్నెరను హృదయానికి హత్తుకుని ఆమెకు వచ్చిన కష్టానికి ఆమెతోపాటుగా తానూ ఏడ్చిందిట గోదావరి. ఆపై ఆ దేవి కిన్నెరను ఓదార్చింది, “నీకు నే నున్నాను, ఇకనేమీ భయము లేదు నీకు” అంటూ అభయమిచ్చింది. అక్కడితో భయం తగ్గి, తన చిరు అలల హస్తాలతో ఆ తల్లిని కౌగిలించుకుని, ఆమె ఒడిలో ఇమిడిపోయి, సేదదీరి౦ది కిన్నెర.
“నీ భర్త శిలయై, నీవు వాగై, రారాని కష్టాల రాశిలో ఇంతవరకు మగ్గావు! నీ దుఃఖంతో రోదసి నిండిపోయింది, ఇకచాలు! నన్ను దక్షతగా నమ్ము. నువ్వింక ఆ కడలిజోదుకి కనిపి౦చకుండా, నిన్ను నేను నా కడుపులో దాచుకుంటా. నీ కొచ్చిన భయమేదీ లేదు” అంటూ గోదావరీమహాదేవి కిన్నెరను తన అక్కున చేర్చుకుంది. తల్లి కొంగు చాటున చేరిన పసిబిడ్డలా కిన్నెర తన భారమంతా ఆమెపై ఉంచి, ఏడుపాపి నెమ్మదిగా ప్రశాంతత పొ౦దింది. దుఃఖం తగ్గి, గోదావరి కెరటాలకు తన చిరు అలల న౦దించి, గోదావరి ఒడిలో ఒదిగి స్వాంతన పొందింది.
ఇకనుండి కిన్నెర “గోదావరీ సంగమం” గురించి గొప్పగా వర్ణించారు మహాకవి శ్రీ విశ్వనాధ.
“గోదావరీ జాలిగుండె గూడులు కదలి
సాదు కిన్నెర కెదురుబోయీ , ఆమెలో
దిగులు తరగ చేదోయి వారించి
ఆదరమున ఆమె నదిమి కౌగిలించి,
ఏదీ నీ మొగము చూపు నాతల్లీ!
నీ దిగులు నికమాను చెల్లీ!” - అంటూ చేరదీసి, అక్కున జేర్చుకుని ఓదార్చింది గోదావరీ మాత! ఆపై కిన్నెరను తనలో కలుపుకుంది.
గోదావరీ నదిలో ఉపనది కిన్నెర కలిసిన తీరును కవి ఇలా హృద్యంగా వర్ణించారు...
“గోదావరీ మహా కూలంకషామృతశ్రీ దివ్వతరంగాలూ, చిన్ని
సాదు కిన్నెర తరంగాలూ కలుసుకొని ప్రోదిగొను
గంగా సరస్వతుల నీరములవలె -” భాసించాయిట! ఇలా ఆ రెండు నదుల వర్ణనలో తను వాడిన సమాసాల తీరులో ఆ రెండింటి నీటిలోగల వ్యత్యాసాన్ని చక్కగా విశదపరచారు.
కిన్నెరను సరస్వతితో పోల్చడంలో విశ్వనాధవారి ఉద్దేశం ఏమిటో! గోదావరిలో కలిశాక కిన్నెరకు నామమేగాని రూపం మిగలలేదని చెప్పడానికా! లేక గోదావరిలోని జలరాసితో పోలిస్తే కిన్నెరలోని నీరు ఉండీ లేనంత తక్కువ అని అర్థమవ్వడానికా? ఏమో మరి ... ఇక్కడ వెనుకటిలాగే గంగా యమునలనకు౦డా, గంగా సరస్వతు లనడంలో కవి ఉద్దేశమేమిటో మరి!
పాత పురాణాలలో సరస్వతీ నదిని గురించి చాలానే వర్ణించారుగాని ఇప్పుడు నదిగా దాని ఉనికి మనకు ఎక్కడా కనిపించదు, ఒక్క త్రివేణీ సంగమమన్న పేరులోతప్ప! ప్రయాగలో గంగా, యమునా, సరస్వతులు అనబడే మూడు నదులూ కలిసాయనీ, సరస్వతి అక్కడకి అంతర్వాహినిగా వచ్చి చేరి౦దనీ చెపుతారు.
కవిరాజుకు గోదావరిలోని కెరటాలకొసలో ముత్తెముగా మెరిసే తుంపురులు, కిన్నెరలోని చిరు అలలును కలిసి లేత వెన్నెల లో అప్పుడే విరిసిన మల్లెపూలవలె కనిపించాయిట.
“గోదావరీదేవి కొస తళుకు ముత్తెముల
మాదిరి నెలంగు కెరటాలూ చిన్ని
సాదు కిన్నెర తరంగాలూ కలిసికొని
లేతళుకు వెన్నెలలో తలిరు మల్లికల
మూదలి౦చిన యట్లు వొలసె!”
ఆపై ఇక ఏది గోదావరి నీరో, ఏది కిన్నెర నీరో తెలియరాని విధంగా నది, ఉపనది రెండూ కలిసిపోయి, ఏది ఎదో వివరం తెలియరాని విధంగా ఏకమై ప్రవహించసాగాయి. గోదావరీదేవి కోరి కిన్నెరను తనలో కలుపుకొన్న తీరును పరిపరి విధాలుగా వర్ణించారు కవిసామ్రాట్!
గోదావరీదేవి కిన్నెరకు అభయమిచ్చి౦దని కడలిరాజుకు తెలిసింది. అది ఆయనకు కోపం తెప్పించింది. కాని, గోదావరీదేవి గొప్పవంశపు రాణి! ఆమెను కాదనడానికిగాని, ఆమె కాదన్నది చెయ్యడానికిగాని ఎంతటి వారికైనా ధైర్య౦ సరిపోదు. గోదావరీ దేవి గొప్పగుణములున్న చాన, తప్పును ఒప్పదు. న్యాయాన్నివీడి మసలదు. అంతేకాదు, ఆమె ఒకానొకప్పుడు సీతారాముల వియోగాన్ని చూసి దుఃఖి౦చివుంది! అసలే పతిని ఎడబాసిన దుఃఖంలో మునిగి ఉన్న కిన్నెరకు వచ్చిన అదనపు కష్టాన్ని గురించి తెలిశాక ఆమె భరి౦చ గలదా!
అందుకే, కిన్నెరకు సాయపడి, రావణాసురునిలా పరదారాపహరణం చెయ్యాలని చూసిన సముద్రుని ఆట కట్టించింది. కిన్నెరను మరి అతనికి కనిపిచనీయ లేదు. అంతేకాదు, “ఈ వాగు పేదరాలని తక్కువగా చూడబోకు, పతివ్రతలని అలా తక్కువగా అంచనా వెయ్యడం మంచిపని కాదు” అంటూ అతన్ని మందలించింది కూడా. అక్కడితో అతని పొగరు తగ్గక తప్పలేదు.
కిన్నెరను పేదరాలిగా భావించడానికి కారణం, ఆమె సౌభాగ్యాన్ని, భాగ్యాన్ని కూడా వదులుకుని అడవుల పాలవ్వడం కారణం కావచ్చు లేదా, గోదావరీ నదిలోని జలరాసితో కిన్నెరలోని కొద్దిపాటి జలాన్ని పోల్చడం వల్లనైనా కావచ్చు. ఇంతకీ కవి హృదయమేమిటో మరి!
“గోదావరి, సప్తర్షులు తమ బిడ్డలా చూసుకునే వాహిని! ఆమెకు అప్రియం చేసి సాగరుడు ఆమె ఎదుట ఇంక ఏ మొహంతో నిలబడగలడు” అంటూ జనం రకరకాల మాటలతో కడలిరాజును “ఛీ” కొట్టి తూలనాడేరు. ఆ మాటలతో కడలిరాజు మరింతగా సిగ్గుతో కృంగిపోయి, తన ఉబ్బు తగ్గి మామూలు స్థితికి వచ్చేశాడు. అది చూసిన జన౦ ఉప్పెన భయం తగ్గి సుఖంగా బ్రతకసాగేరు.
“జాతస్య మరణంధృవం!” పుట్టిన ప్రతి జీవీ గిట్టక తప్పదు. మానవ జన్మమెత్తినవారూ మరణించక తప్పదు. కాని విధివశాన తమలో వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడు కిన్నెర, ఆమె భర్త కూడా, మరణమనే దురదృష్టాన్నుండి తప్పించుకుని, చిరంజీవులై ప్రకృతిలో భాగమై కలకాలం మిగిలి ఉంటారన్న విషయాన్ని గుర్తిస్తుంది కిన్నెర. అది ఆమెకు సంతోషాన్ని కలిగి౦చి, ఆమె దుఃఖాన్ని చాలావరకూ పోగొడుతుంది. నెమ్మదిగా కిన్నెర మనసు దిటవు చేసుకుని గోదావరీమాత అండదండలతో తృప్తిపడి నెమ్మదిగా కోలుకొని ప్రశాంతతను పొందింది.
ఇకనుండి విశ్వనాధ సత్యనారాయణ గారు, సేదదీరిన కిన్నెర విభవాన్ని మనసారా కొనియాడడం మొదలుపెట్టారు. ఆఖరుదైన ఈ అంకానికి పేరు, “ కిన్నెర వైభవం!” ఏయే సమయాలలో కిన్నెరవాగు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఇందులో గొప్పగా అభివర్ణించారు శ్రీ సత్యనారాయణగారు.
ఆ యా సమయాల్నిబట్టి రకరకాలుగా మారిపోతున్న ఆ వాగు తీరుతెన్నులన్నీ కాలానుగుణమైన వర్ణనలతో కొనియాడారు గురుశ్రేష్టులు. ఝాముఝాముకూ వచ్చిన మార్పులనుకూడా సునిశితంగా పరికించి, వాటిని కూడా హృదయంగమములుగా వర్ణించారు. వాగులో వచ్చిన మార్పులతోబాటుగా ఆయా సమయాల్లో అక్కడి అడవిలో చోటుచేసుకున్న అందాలనుకూడా తనివితీరా వర్ణించారు. తొలిఝాము, ఝామున్నర, మలిఝాము, మూడవఝాము, తొలిపొద్దు, బారెడుపొద్దు, నడిపొద్దు, పొద్దు వాటారడం, పొద్దు కృంగడం, ముదిపొద్దు, రేయి, నడిరేయి – ఇలా ఒక రోజులో తడవ తడవకూ మారే స్థాయీ భేదాలలో కిన్నెరలో వచ్చేమార్పులను, ఆమె ప్రవహించే అడవిలో వచ్చే మార్పులను చక్కగా, తనివితీరా వర్ణించారు.
వసంతకాలపు తొలిజాము సంజలో కిన్నెర రూపం ఎలాఉందో వర్ణించారు శ్రీ విశ్వనాధ...
“తలలపై రత్నాలు తళతళా మెరిసేటి
నల్లత్రాచులు దూకి నాత్యమాడినయట్లు
మెరిసింది కిన్నెరా, ఒడ్డుల్లు ఒరిసిమ్ది కిన్నెర!” - ఇది తొలిజాము సంగతి
ఇక జామున్నర పొద్దులో కిన్నెర ఎలావు౦ద౦టే ...
“తరగవిరిగినచోట తరణి కాంతులు ప్రబ్బి
గాజుముక్కలు సూర్యకాంతిని మండినయట్లు
పొదిలింది కిన్నెరా, అందాలు వదిలింది కిన్నెర!”
మలిపొద్దులో, గాజుముక్కల మీద సూర్యరశ్మి పడి నిప్పుపుట్టినట్లుగా, కెరటం విరిగినచోటల్లా నీరే నిప్పులా మెరిసిందిట.
సూర్యుడు నడినెత్తికి వచ్చినవేళ, అడవంతా నిశ్శబ్దమైపోయి ఉన్న తరుణంలో ఆకుపచ్చని ఆకులమీద బంగారురంగు చేరిన విధంగా సొగసులు చూపింది కిన్నెర!
ఇక సూర్యుడు పడమరకు తిరిగిన వేళలో కిన్నెర అప్పుడే పండిన గోధుమల రాసిని తూర్పారబట్టిన తీరులో, పూర్తి బంగారు రంగులో ప్రవహించింది. ఆ తరవాత ...
“మూరగా బారాగా పొద్దువాటారి౦ది
పొలము పిచ్చుకల గుంపు పురుగు మే తేరింది
అడవి చెట్ల నీడ నవఘళించిన నీరు,
వలపు తిరిగిన పైరు నాట్యమాడినయట్లు
తరలింది కిన్నెరా , ఉరలింది కిన్నెర!”
ముదిపొద్దు వేళ కిన్నెరలోని నీరు మసక మసకగా మాసిన రంగులో కనీకనిపి౦చకుండా ప్రవహించింది.
“కొండ దగ్గరగా కృంగి౦ది ముదిపొద్దు
వినవచ్చేను పిట్టల గముల రెక్కల సద్దు ...” ఇలాసాగిందివర్ణన.
రాత్రి తొలిజాములో నైతే - హరినీలమణుల కాంతితో ప్రవహించిందిట కిన్నెర.
ఇంక “నడిరేయి నల్లనయి నాట్యమాడిన దడవి ...” అని అర్ధరాత్రి వేళలో ప్రవహిస్తున్న వాగును పొగిడారు కవి. కానీ ... ఆ సమయంలో చెలరేగిన చీకటిలో కిన్నెర నల్లగా, కంటికి కానరాని విధంగా మారిపోయింది. అప్పుడు కూడా అక్కడ మసిలే జీవులకు యేరు ఉనికిని తన సెలయేటి గలగలల ద్వారా తెలిపింది కిన్నెర !
రోజు లోని భాగాలు అయ్యాక నెలలోని రెండు పక్షాలలో – ఏ పక్షంలో కిన్నెర ఎలా ఉందన్నది అభివర్ణించారు కవి -
శుక్లపక్షం వచ్చింది. పశ్చిమదిక్కున ఆకాశం వెల్లనయ్యి౦ది. శుక్లపక్ష వర్ణన మిలా సాగింది ...
“శుక్లపక్షము వచ్చె చూచుచు౦డగ మింట
శోభిల్లె చిన్న జాబిల్లి ..."
శుక్లపక్షం రాగానే, పశ్చిమదిక్కున గగనమండలంలోనున్న తారారాశిలో నెలవంక పొడజూపింది! రోజురోజుకీ చంద్రుడు తాను పెరుగుతూ వెన్నెల కాంతిని కూడా పెంచుతున్నాడు. అలా దినదినం పెరిగిన ఆ సుధాపూరంలో కిన్నెర, పున్నమి వచ్చేసరికి కంసాలి, మణుగుల కొలదీ వెండిని కరిగించి పోసిన (వెండి) నీరులా తళథళా మెరిసిపోతూ ప్రవహించిందిట!
ఇక ఆపై కృష్ణ పక్షంలో – మిన్నూ మన్నూ కనరాని చీకటిలో నీరు కనిపి౦చకుండా పోయినప్పటికీ, అడవి జంతువులకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండే౦దుకు, ప్రవహిస్తున్న నీటి సవ్వడినిబట్టి అక్కడ ఏరు ఉందని తెలిసే విధంగా, మారిపోయిందిట కిన్నెర.
ఇక ఆ తరువాత ఒక సంవత్సరంలోని ఆరు ఋతువులలోనూ ఆయా ఋతుధర్మాలనుబట్టి కిన్నెరలో వచ్చిన మార్పులను తనివితీరా వర్ణించారు గురువరేణ్యులు .
1. వసంత ఋతువు రాగానే భర్త తలపుకి రావడంతో కిన్నెర దిగులుతో చిక్కిపోయి, బహు సన్నగా మారింది. కాని మృగముల దప్పిక తీర్చడం కోసం బూడిదరంగు నీటితో సన్నని కాల్వలుగా ప్రవహించింది. చూస్తూండగా వసంతం గడిచిపోయింది.
2. గ్రీష్మ ఋతువు వచ్చింది, ఎండలు పెరిగాయి. ఎండలు మెండవ్వడంతో నీరు తగ్గి ఇసుక బయటపడింది. కిన్నెర లోని నీరంతా ఇగిరిపోయి చిరు ఊటగా మారింది. కాని దానివల్ల నీటికి రుచి హెచ్చింది. పాలలో పంచదార కలిపినట్లు మధురంగా ఉండి, ఆ నీరు జీవుల దప్పికను చక్కగా తీర్చింది.
౩. వర్ష ఋతువు వచ్చింది వడగళ్ళ వానతో! పతిగుట్టపై కురిసిన నీరు, తన పతి ప్రేమామృతఝరిలా వచ్చి కిన్నెరను చేరుకుంది. ఆ అనురాగలహరిలో ఓలలాడింది కిన్నెర. అప్పుడు పంగనామాల చెరకు పానకంలా తీయనైన, బూడిదరంగు నీటితో ఒడ్డులొరసి ప్రవహించింది సెలయేరు కిన్నెరసాని.
4. ఇక శరదృతువు రాగానే రాయంచ రెక్కల వంటి తెల్లని వెన్నెల ప్రకృతి అంతటా పరుచుకుంది. వాగులోని నీరు కూడా బురద విరిగి తేటబడింది. రోజురోజుకూ ఇంకా ఇంకా తేరుకుని తేటపడిన ఆ నీరు, అత్యంత శ్రేష్టమైన బంగారు తీగల చెరుకు పానకంలా, వడ్లగింజ రంగులో మరీ చిక్కనా కాకుండా, మరీ పలుచనా కాకుండా ఉన్న నీటితో రమ్యంగా పారింది కిన్నెర.
5. హేమంత ఋతువు రాగానే కిన్నెర రాణివాసపు రమణిలా మంచు తెరల మాటున దాగి, గుట్టుగా ప్రవహించింది. ఇక వాగులోని నీరు – “శైవాభిషేకరంజన్నారికేళగర్భా౦బువులు” వాకలై అడవిని ప్రవహి౦చాయా – అన్నట్లుగా పవిత్రంగా ఉన్నాయిట!
6. శిశిర ఋతువు రాగా చెట్లనుండి రాలిన ఆకులు నీటిలోపడి మాగి, ఆ నీరంతా ఎర్రనై, కొత్త మధువు కాలువై ప్రవహిస్తో౦దా అన్నట్లుగా ఉంది కిన్నెరలోని నీరు – అన్నారు శ్రీ విశ్వనాధ..
అలా ఋతువు రుతువుకీ మారే రూపు రేఖలతో, కారు కారుకీ వచ్చే కాంతి భేదాలతో, తెలుగు కవిరాజు అంటే – శ్రీ విశ్వనాధ అంతటి వారు కూడా వర్ణించడానికి అలవికాని రీతిలో “చవులూరి, చవులూరి” ప్రవహించింది కిన్నెరవాగు. భద్రాద్రిపైన నెలకొన్న రామయ్య తెలుగువారికి ఇష్ట దైవం. తెలుగు వాగైన కిన్నెర చివరకు భవబంధాలను త్యజించి, విరాగినియై, భక్తులు భద్రాద్రి రామయ్య దర్శనానికి వెళ్ళే త్రోవలో కాచి ఉండి, ఆ రామభక్తుల పాదాలు కడిగీ, వారి దప్పిక తీర్చీ – అలా వారికి సేవలు చేసి, భద్రాద్రి రామయ్యకు దాసానుదాసియై తన పుట్టుకను సార్ధకం చేసుకుంటో౦ది ఇప్పటికీ! ఎప్పటికీ కూడా ...
ఈ విధంగా గురు శ్రేష్టులైన శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు కిన్నెరవాగు కథను “కిన్నెరసాని పాట” – అనబడే ఒక కరుణారస ప్రధాన గేయకవితగా వ్రాసి మనముందు ఉంచడమే కాకుండా, స్వయంగా ఆయనే మనకు మనోహరంగా పాడి వినిపించేవారు కూడా. అలా పాడుతున్నప్పుడు ఆయన కిన్నెర కష్టాలలో తాదాత్మ్యమై, కూతురు కష్టాలకు చలించిపోయిన కన్నతండ్రిలా కంట తడి పెట్టుకునీవారు. కవికి, అతడు వ్రాసిన కావ్యానికీ మధ్యలో తండ్రీ బిడ్డల అనుబంధం ఉందనుకోవడం మనకు ఈనాడు కొత్తేమీ కాదు.
“బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూళలకిచ్చి అప్పడుపుకూడు భుజి౦చుటకన్న సత్కవుల్ హాలికులైన నేమి” అని అన్నాడు బమ్మెర పోతన ! ఇకపోతే పూర్తిగా గద్యకావ్యమైన “కాదంబరి”ని భట్ట భాణుని “ముద్దులపట్టి” అని కదా అంటారు! ఆ ఒరవడిలోనే ఈ కిన్నెరసానిని కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారికి ముద్దులపట్టిగా తలపోయడంలో తప్పు లేదనిపించింది. ఆ ధైర్యంతోనే నేను నా ఈ విధేయతతో కూడిన చిన్న సమీక్షకు కూడా, గురుశ్రేష్ఠుల (గుగ్గురువుల) ఎడల నాకున్న భక్తి గౌరవాలకు పురస్కారంగా “కవిసామ్రాట్ ముద్దులపట్టి కిన్నెర” అన్న పేరు ఉంచడం బాగుంటుంది అనుకున్నాను. కిన్నెరసాని పాటలో – గురువుగారు కిన్నెర కష్ట సుఖాలను వర్ణించడంలో, ఎల్లెడలా బాధ్యతా యుతమైన పితృ వాత్సల్యమే కనిపించింది నాకు. కిన్నెర వాగు ప్రవాహపు నడకలో నాట్యం, ప్రవహించే నీటి సవ్వడిలో సంగీతం పసిగట్ట గలిగారన్నా, కష్టాల కడలిని గడిచివచ్చిన కిన్నెర వైభవాన్ని అడుగడునా అంత హృద్యంగా పొగడగలిగారన్నా దానికి కారణం కిన్నెరపై ఆయనకున్న వాత్సల్యం కాకపొతే మరేమనుకోవాలి? ఎటుచూసినా మనకు బిడ్డ తొక్కు పలుకులకు, బుడిబుడి నడకలకు పెద్దగా అలరే పితృదేవుడే కనిపిస్తాడు కవిగారిలో ! బిడ్డల ముద్దుమురిపాలను ఆస్వాదించడంలో కన్నవారికి ఎంతకీ తనివితీరదు అన్నది బిడ్డలు గల అందరికీ అనుభవమే కదా! కిన్నెరసానిని గురించి అంతగా రాసినా, విరాగిణియైన కిన్నెర విభవాన్ని గురించి ఎంతగా పొగిడినా కూడా కవిసామ్రాట్ కి తనివి తీరలేదు! అందుకే చివరలో రాసుకున్నారు : తెలుగు సత్కవిరాజు (తనే!) పాటందుకోలేని రీతిలో “చవులూరి చవులూరి” సాగింది కిన్నెర! అని . ఇదికూడా కన్నవారిలో కనిపించే లక్షణమే! కౌమారప్రాయం వీడీ వీడని పందొమ్మిదేళ్ళ వయసులోనే ఆయనకి అంతటి పరిపక్వతా! అది ఆయనకే చెల్లింది!
మా ఊరి కాలేజీలోని శ్రీ అరబిందో ఆడిటోరియంలో శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారికి సన్మానం చేసినప్పుడు ఆ సభలో మా కుటుంబమంతా హాజరయ్యాము. నా భర్త విజయవాడలో కాలేజీలో చదివినప్పుడు ఆయనకు ప్రియశిష్యులు కావడంతో ఆయనకు మేము ఒక రాత్రి మా ఇంట్లో ఆతిధ్యము ఇవ్వగలిగాము. భక్తిశ్రద్ధలతో ఆయనకు సేవచేస్తూన్నప్పుడు, మా చిన్నతనంలోనే స్వర్గస్తులైన మా నాన్నగారు తలపుకి వచ్చారు. శ్రీ విశ్వనాధ మమ్మల్ని ఆశీర్వదించారు. జన్మకొక గొప్ప అనుభూతిగా ఆయన మా ఊరి రాక నాకు నాకు గుర్తుఉండిపోయింది.
గురువరేణ్యుల రచనలన్నిటిలాగే ఈ గేయకవితకూడా మన మనస్సులో కలకాలం నిలిచి ఉంటుందని నా నమ్మకం. స్వస్తి!
oooo
వెంపటి హేమ
ఎనిమిది పదుల వయసులో ఉన్న వెంపటి హేమ గారు ఫిజిక్స్ లో పట్టభద్రురాలు. 1970 లో రచనావ్యాసంగం మొదలుపెట్టి ఇప్పటి వరకూ 52 కథలు, 3 నవలలు, 60 కవితలు, 8 పిల్లల కథలు, 5 వ్యాసాలు, అర్థాలతో సహా 3000 పిల్లల పేర్ల సేకరణ, ఇకెబానా అమరిక అనే పద్ధతిని & మార్బులింగ్ టెక్నిక్స్ ని తెలుగులోకి అనువాదం చేశారు. “కలం పేరు కలికి. అమెరికాలో కొన్నేళ్ళు గడిపి ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఒక కుమారుడు, ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు మనవలు, ముగ్గురు మనవరాళ్ళు. “కలికి కథలు” అనే సమగ్ర కథా సంపుటి గత సెప్టెంబర్ 2015 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు.
***