MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు
అమ్మంగి వేణుగోపాల్
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
చెట్టు ఆత్మఘోష
మా అమ్మ ఎవరో తెలియదు
కాకో, పిట్టో ముక్కున కరుచుకొని
ఏ చెట్టు పండునో భూగర్భంలో పడేసిపోతే
మొండిదాన్ని, ఓ మొండిగోడ పక్కన పెరిగినదాన్ని
బారెడు పెరిగాక ఒక చిన్నారి అమ్మాయి నన్ను చూసి
"నాన్నా నాన్నా మన పెరట్లో వేపమొక్కే"
అని చప్పట్లు చరుస్తూ కేరింతలు కొట్టింది
నాకు నామకరణం జరిగిందన్న సంతోషంతో ఊగిపోయాను
కానీ ఇంటి యజమాని
"పిచ్చి మొక్కమ్మా అది మన ఇంటి పునాదులు
పాడవుతాయి" అంటూ పెరికేయబోయాడు
అమ్మాయి అడ్డుకుంది అలా గండం గడిచింది
రెండేళ్లలో ఏపుగా పెరిగినప్పుడు
"నీళ్లు లేవు, నిప్పుల్లేవు ఎట్లా పెరిగిందో దయ్యం చెట్టు"
అని యజమాని ఈసడించుకున్నప్పుడు కుంగిపోయాను
కానీ, పందోంపుల్లలను విరుచుకున్నప్పుడు పొంగిపొయాను
ఒకరోజు యజమాని భార్య
"ఈ ఉగాదికి మన చెట్టు పూతతోనే పచ్చడి" అని ప్రకటించింది
ఆ సంతోషంతో ఇబ్బడిముబ్బడిగా
పూతపూశాను కాతకాశాను
రాలిన పళ్ళను బద్దలకు పెట్టి దూరంగా విసిరికొట్టి
ఆడుకునేది అమ్మాయి
యజమాని భార్య నేను రాల్చిన పళ్ళను ఏరి జాగ్రత్త చేసేది
పగలంతా కష్టపడి ఇల్లు చేరే యజమాని
నా నీడలో మంచం వాల్చుకోగానే వింజామరనై వీచేదాన్ని
మరుసటి వానాకాలం
నా చుట్టూరా ఎన్నెన్నో చిన్నారి వేపమొక్కలు పుట్టాయి
అవన్నీ నా సంతానమేనని ఎంతగా గర్వించానో
నా నీడలో బొమ్మలపెళ్ళిళ్ళు చేసిన అమ్మాయికి
పెళ్లీడు వచ్చింది పెళ్లి కుదిరింది
యజమాని నా నాలుగు చేతుల్ని నరికి
ఇంటిముందు పందిరివేశాడు
ఆ పందిట్లో అమ్మాయి పెళ్లి జరిగింది - నా దీవెనతో
అత్తవారింటికి వెళ్తూ వెళ్తూ నా నీడలో కూచుని
పెళ్లికూతురు శకుంతల కన్నీరు పెట్టింది
ఆకుల కళ్ళతో నేను బాష్పోత్సేకం చెందాను
నాకు కాళ్ళుంటే
ఆ మండుటెండలో అమ్మాయికి గొడుగుపడుతూ నడిచివెళ్లేదాన్నే
పెళ్లికూతురుతోబాటు వసంతం వెళ్ళిపోయింది
నా గుబురుల్లో దాక్కుని కూస్తూ వచ్చిన కోయిలా వెళ్ళిపోయింది
ఒకరోజు యజమాని పెద్దకొడుకు
టేపుతో పెరట్లో స్థలాన్ని కొలిచాడు
మరునాడు కత్తెలంగడి షావుకారు వచ్చి
నన్ను ఎగాదిగా చూసి బేరం చేశాడు
ఇద్దరు కూలీలు నా నీడలోనే గొడ్డళ్లని సానబట్టి మొదలు నరికేశారు
నేను నిలువునా కూలిపోతుంటే
నా కొమ్మల్లో గూడుపెట్టుకున్న
కాకి మాత్రమే శోకాలు పెట్టింది
నేను నేలతల్లి గుండెల మీద వాలిపోయి
ఆఖరి శ్వాస తీస్తుండగానే ఇసుక సిమెంటు ఇనుప సామగ్రి
వచ్చి పడ్డాయి నా పక్కన
నా పచ్చని బతుకు వంట చెరుకుగా మారిపోయింది
రేపు అగ్నికి ఆహుతై బూడిదగా మారుతాను
మట్టిలో పుట్టిన నేను మట్టిలో కలుస్తాను
పొగగా మారి గాలిలో లీనమవుతాను
ఇంకా పైకి వెళ్లి మబ్బుల్లో చినుకునవుతాను
నా ఆత్మఘోషతో ఆకాశం పొగచూరుతుంది
ఇలా పంచభూతాల్లో కలిసి
తనువు చాలించే ముందు అనుకుంటాను
ఇక మనిషిని నమ్మకూడదని ( “పచ్చబొట్టు పటంచెరు” కవితా సంపుటి నుండి )
లుప్తాత్మ
తెలుఁగుబిడ్డ
||మత్తకోకిల||
ముద్దమాటల నాడు ముద్దుల మూటలందియు ముగ్ధవై,
విద్దెనేర్చిన పాఠశాలల పెద్దతోడుగ నుందువే,
సిద్ధినొంద విదేశయానము జేతియూతగ నైతివే,
మద్దతందుకు శుద్ధినిచ్చిన మాతృభాషగ గొల్తుగా!
||కందం||
పలుకు పలుకుకి బలిమిగా
జిలుఁగు వెలుగులు వెదజల్లు జీవశిలవుగా
తెలుఁగుఁదనంబుకు మాతవె
తెలివితెలుపు విద్యనేర్పి తెఱవునొసగగన్
||తేటగీతి||
తెలుఁగుదేశమన త్రిలింగ దివ్యభూమి,
తెలుఁగుభాష త్రిలింగాల తేనెముద్ద,
తెలుఁగు వచనమెంతొ మధుర తేట గీతి,
తెలుఁగుబిడ్డవగుట పుణ్యఫలము రామ!
డా. మీసాల అప్పలయ్య
రుచి చెడిన మౌనం
దిటవు ను
గావంచాగా కట్టి
బతుకును భుజాన వేసుకొని
శకునం చూసుకొని
కనురెప్పలు దించుకొని
'నమస్తే' చెయ్యి ఆసరాతో
వొంగి ఒదిగి చేరుతుంది
వరిగడ్డి దేహం
బరువైన కుర్చీలు
చులకన చూపుల డెన్ కి
దారి తప్పి వాలిన
ఒక పావురం
#
నలగని బట్టల చప్పుళ్ళలో
కొన్ని మీసాలు కసిరాయ్
కొన్ని కళ్లజోళ్లు చూసికూడా
దాక్కున్నాయ్
కొన్ని చూపులు పటపట కొరికాయ్
కొన్ని ఉరిమి కాల్చేశాయి
కొన్నికాగితాలపైకి ఉరికి
బేరాల గుస గుసలాడాయి
కొన్నిమాటల చీపురులు
తోసేశాయ్
#
గన్పౌడర్ నిండిన కాగితం
ఖాకీల చేతుల తూకం లో
అదొక పిల్లల పేపర్ తుపాకీ
వారికి 'సార్ రాలేదు' పలుకు
కాల్చి విసిరేసిన సిగరెట్
అది బడుగు ప్రాణికి
వరదలో మునిగిన పంట
ఇక్కడ ఎదురుచూడడం
తలక్రిందులా వేలాడడమే
#
ఇక్కడే గదా
తెల్లటి నిజాల పై
నల్లటి నయగారాలు
వాయిదాల్లో కలల్ని
ఉసిగొల్పుతారు
బీదాబిక్కులు
కలగనే వజ్రాల పేటికలు
ఊరిస్తాయ్
కాలిపోయిన
ఆశల బూడిదని
నేలమట్టమైన
బ్రతుకుల్ని
ప్రకటించ డా నికి
పీకల దాకా
మునిగి ఉంటాయి
ఇక్కడి మెట్లు ఒక మనిషిని
కౌమారం నుంచి చరమం దాకా
చూసి నవ్వుకుంటాయ్
డబ్బు కనుసైగచేస్తే
అద్భుత దీపమై
ఒదిగి పోతాయ్
వరాలు ఒలికిస్తాయ్
#
వేలిమీద చుక్కతో
కుర్చీలనుంచి దించనూ గలడు
కిరీటాలు పెట్టనూ గలడు
ఆ నాటక రంగ పాత్ర గా
మెరవనూ గలడు
స్టేజి దిగాక
కుర్చీలు కిరీటాలు
బ్రూటస్ లెంపకాయ లై
అతన్ని ఒక కొత్త
రుచి చెడిన మౌనంలోకి
విసిరేస్తాయ్
(ఇండియా లోని ప్రభుత్వాఫీసులకు, కోర్టులకు , పోలీస్ స్టేషన్లకు వెళ్లే ఒక సామాన్యుని పై జాలితో )
డా. గరిమెళ్ల నారాయణ
నిలువెత్తు తోలు-బోలు!
ఇంతా చేసి నిలువెత్తు తోలు-బోలు!
టంగుటూరి కేమీ టంగస్టన్ గుండె లేదు
బుల్లెట్ ఛిద్రం చేయగలదని తెలిసినా
ఎదురొడ్డి మరీ సవాల్ విసిరింది!
అల్లూరి బాణానికేమి అచంచల స్థితిస్థాపకత లేదు
అన్యాయాన్ని మాత్రం
గురి తప్పకుండా ఛేదిస్తూనే ఉంది!
ఐనస్టీన్ మెదడు పాదరసం కాదు
సాధన కీ శోధన కీ మధ్య సయ్యాటలాడి
శాస్త్రాన్ని ఉరికించింది!
మండేలాలో మండే లావా ఉందా?
లూథర్ కింగ్ వి మాత్రం
నినాదాలే కదా కలసి కవాతు చేశాయి
గాంధీలోని
సత్యాగ్రహమే కదా
ఘటనా ఘటన సామర్ధ్యాలతో
గాలిలో పావురాలను ఎగరేసింది.
మలాలా కి
మంగళంపల్లికి తేడా లేదు
అన్నీ నిలువెత్తు తోలుబోల్లే
పరిస్థితులకు ఎదురొడ్డి
అప్రతిహతంగా ధిక్కరించినవో,
ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుని
అనన్య సామాన్యంగా పరిమళించినవో
మనిషి జాతిని మహోన్నతంగా నిలబెడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు
ఆస్ట్రేలియా లో
కార్చిచ్చుకాహుతైపోయిన
అడవులకూ,
చైనా లో చావు వరకూ
కొనిపోయిన కరోనా వైరస్ కూ
కరుణా కర్త్యవ్యాలతో
కలసి ఎదుర్కొని
కాపాడుకోగలమని
చేసి చూపించాలి.
మనుషులనే కాదు
మృగాలను, వృక్షాలనూ కూడా
ఆదరించి అక్కున చేర్చుకోగలమని
నిరూపించి రావాలి.
డా. బాలాజీ దీక్షితులు పి వి
వాన జల్లు
వానొచ్చింది
మట్టి మనసు పులకించింది
వానొచ్చింది
పుడమి ఎదపై పచ్చని తివాచీకి మెులకొచ్చింది
వానొచ్చింది
బుడి బుడి అడుగులకు కేరింతల సడి వచ్చింది
వానొచ్చింది
ఎద దాగిన ప్రేమకు పిలుపొచ్చింది
వానొచ్చింది
చెమ్మగిళ్ళిన రైతుకు భరోసానిచ్చింది
వానొచ్చింది
కొన్ని కనులను చెమర్చింది
రామసుబ్బారెడ్డి ధనిరెడ్డి
జన్మ సాఫల్యము
పెళ్లిళ్లకో పేరంటాలకో ధరించే
పట్టు చీరల జట్టులో చేరి
ఇస్త్రీ ముడుతల్లోపల ఇరుక్కుపోయి
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యే కంటే----,
పనిలో జీవన వనిలో
పగలూ రేయీ శ్రమించే
పల్లెపడుచు పైట చెంగు రెపరెపలో
నుదుటి చెమట తుడిచి మురిసి తరించాలని
-----ఓ దారం పోగు
-----------------/------------
భుక్తాయాసం నిక్కి చూసేలా
బలవంతంగా నింపిన గిన్నెల
పండుగ నాటి పరమాన్నం లో
జీడిపప్పు ద్రాక్ష లతో కులికే కంటే -----
నకనక లాడే ఆకలి కడుపులు
ఆవురావురని మింగుతు ఉంటే
పచ్చడి మెతుకుల పంచన చేరి
తృప్తిగ త్రేన్చిన "ఆ కళ్ళకు" నైవేద్యంగా మారాలని ---
------ఓ బియ్యం గింజ
------------------//--------------
వత్సరానికోసారి ఒంటిమీద తిరణాల
మిగతా బ్రతుకంతా గాలిచొరని చెరసాల
క్షణం పాటు మిరుమిట్లు, అంతులేని చీకట్లు
కఠినమైన వజ్రంలా కలకాలం నిలిచే కంటే. ...
కారు నలుపు రూపైనా , కట్టెలతో కలిసున్నా
పేదవాని పెన్నిధిగా ప్రతి దినమూ ప్రజ్వలించి
అనుక్షణం మంటలతో అణువణువూ రగిలిపోయి
వంట ఇంటి యజ్ఞంలో ఒక సమిధై పోవాలని
------ఓ బొగ్గు ముక్క
---–---------///---------------
విలాసాల విందులలో వినోదాల విహారంలో
విరుచుకుపడి తెరచుకునే విస్కీ సీసాలు
"గాజుల "చేతులు అందించే "గాజు " గ్లాసు గలగలలో
చల్లదనం కోసం కలిపే మంచు ముక్కనయ్యే కంటే ------
నడినెత్తిని మండించే మధ్యాహ్నపుటెండ లోన
నడువలేక నడువలేక అడుగులోన అడుగిడుతూ
దరిదాపుల దప్పి తీరు దారి తెన్ను కానలేక
దాహంతో అలమటించు బాటసారి తృప్తి తీర
ఎంచక్కా చిరు చుక్కై గొంతు తడిమి (పి ) చూడాలని
-------- ఓ నీటి చుక్క
విన్నవించుకున్నాయి ,నన్ను గెలుచుకున్నాయి
మనసున్న మనిషిగా నన్ను మార్చివేశాయి
మానవత్వపు విలువలు మరీ మరీ తెలిపాయి
నిగూఢ రహస్యము, వేదాంత సారాంశము
జన్మ సాఫల్యమే జన్మరాహిత్యము!
శారద కాశీవఝల
మాతృభూమి జ్ఞాపకం!
ఎన్నేళ్ళు ఉన్నా పరాయిదేశంలా అనిపిచే గడ్డపై మమకారాన్ని
పదేళ్ళ తరువాత, మాతృభూమిని చూడాలన్న కాంక్ష జయించింది...
నెలరోజుల క్రితం భరతావనిలో చుట్టపు చూపుగా కాలుపెడుతూ,
బాల్యాన్ని గుర్తుతెచ్చిన మట్టి వాసనని ఆస్వాదించిన జ్ఞాపకం -
కాదనుకుని కాసుల కోసం దేశం వదిలి వచ్చేసినా,
మర్చిపోని కన్నతల్లి బెంగలా మనసు వెన్నంటే వచ్చింది...
బాకాలూది చెప్పినా తోకతో దులిపేసుకుని కదలమని మొరాయించే గోవులూ,
తమ నిద్రలని త్యాగంచేసి మరీ మొరిగి, మన నిద్రలు ఎగరగొట్టే కుక్కలూ,
చేతుల్లోంచి బలవంతంగా పెట్టెలు లాక్కుపోయి దారిలో బేరాలాడే కూలీలూ,
చేతుల్లో బలవంతంగా సరుకు పెట్టేసి డబ్బులివ్వమని డబాయించే వీధివర్తకులూ,
పగలూ రాత్రీ అనే తేడా ఎరుగని నడిరోడ్డు పోసుకోలు ఊసుగాళ్ళూ,
విమానాశ్రయం దగ్గిరే నడిరేయి స్వాగతం ఇచ్చారు!
కేరింతల నాట్యాలతో కొమ్మల చివురుటాకులూ,
మాతృభాష మధురిమలతో పక్షుల రావాలూ,
సగం నిద్రమత్తుతో పలకరించిన సన్నజాజి తీగలూ ,
రాక కోసం ఎదురుతెన్నులు చూస్తున్న ముంగిలీ,
చిరునవ్వులతో బాహువులు చాచి రమ్మన్న ద్వారాలూ
చల్లని గాలుల చేతులతో కౌగిలించి, తమ నిరీక్షణా, ఆదరణా చూపించాయి!
పక్కింట్లోని నడిజాము సందడి విని ఉగ్గబట్టుకున్న సందులోని పిల్లలంతా
తెల్లారగానే బిలబిలమని దాడి చేసి హక్కుతో అమెరికా చాక్లెట్లు పట్టుకుపోయారు -
అనవసరమైన మొహమాటాలన్నీ వదిలేసి, ఆపాదమస్తకం పరీక్షించేస్తూ
'పిల్లా!రంగొచ్చావ్!దుమ్ము రోడ్డు చూసుకుంటుందిలే' అని అమ్మలక్కలు పరాచికాలాడారు -
రంగులు మారుస్తున్న ప్రాగ్దిశ సాయంత్రం దాక సాయం ఉంటానని వేడెక్కి, గూడెక్కి,
వడదెబ్బకు పడిపోతే 'అప్పుడేనా ముందుంది పండగ' అని కన్నుగీటి కిసుక్కుమంది!
శుక్ర గ్రహానికి అవతల, దిక్కు తెలియని కుర్రకారంతా పొలోమని పోయే
నిరుపయోగ ప్రదేశమే అమెరికా ఖండమంటే అని నిశ్చయిన్చేసి,
అక్కడ మనుషులు సరిగ్గా బట్టలేసుకోరు, మనవాళ్ళు సరిగ్గా మాట్లాడుకోరు
వాళ్ళ నైజం విడ్డూరం పోగాలం - కాబట్టి మనదేశమే మెరుగని తీర్మానించేసి,
పరుగుల పాలు తప్ప నిలబడి నీళ్ళూ తాగరని ఈసడిన్చేసి,
ఆరాతో నిద్రరాని బామ్మగారు జవాబులన్నీ తనే ఇచ్చుకుని ముక్కు చీదుతూ వెనుతిరిగింది!
భూ భారమంతా బండిమీద తోసుకుంటూ పోయే పాకీవాడు ఆగి
“అక్కడ మీ చెత్త మీరే ఎత్థుకోవాలంట కదా” అని అడిగిన వివరం-
రోడ్డు మీద దుమ్ము ఎక్కడిదక్కడే ఉన్నా, అస్త్ర సన్యాసం చేసి
బీడీలు ఊదుతూ చాడీలు ఏకరువు పెట్టుకునే పనివాళ్ళ విలాసం-
రెండు రోజులు కొనగానే సందు మలుపులో రెండు మూరల మల్లెలతో ఆశతో నిల్చునే పూలమ్మీ,
దగ్గితే, మురికి చేతులతో ఎంగిలినీళ్ళూ ఆరాటంగా అందించే అమాయకులూ - అంతా గమ్మత్తే !
పావుశేరు పల్లీలు అమ్మడానికి రోజంతా ఎండకి
తెగించి కూచున్న అవ్వ చెప్పే నిశ్చింత కబుర్లూ ,
పవిత్ర మంత్రాల మిశ్రమ గుడి ప్రాంగణంలో
అంతర్జాతీయ స్టాక్స్ గురించి వర్తకుల ముచ్చట్లూ,
పక్కవాడి భక్తికి పోటీపడిపోయి గంట గోలగోలగా వాయించి తన గోడు వినమనే భక్తుల ఇక్కట్లూ,
దానం చేసి పాపాలు కడుక్కోమని బెదిరించే బిచ్చగాళ్ళూ - అంతా విడ్డూరమే!
ప్రతి కూడలికీ అన్ని దిశలనుంచీ ఒకే వేగంతో దూసుకొచ్చి
కంటి సైగతో నిర్ణయాలు తీసుకుని దూసుకుపోయే వాహనాలూ,
పొరబాటున కాళ్ళు ఎడంగా పెట్టి నుంచున్నా, సవ్యసాచి గాండీవం అంతటి ఆటో గేరుతో
మధ్యనుంచి దూసుకెళ్ళగల నేర్పరులు - ఆటో అభిమాన్యులూ, బైక్ భస్మాసురులూ,
కొత్త కార్ అయినా, చెత్త సైకిల్ అయినా
గుద్దితే అరుచుకుని, దులుపుకుని, సద్దుకుని పోయే సామ్యవాదులూ - అన్నీ వింతలే!
ఊళ్ళోని చిరుతిళ్ళు మంచివి కాదని తిడుతూనే
కొని దొంగతనంగా అందించే అమ్మమ్మలూ, తాతయ్యలూ,
ఉన్న మూడు వారాల్లోనే తమ తలకు మించిన ఆరాటంతో ప్రేమలు కురిపించే అత్తమామలూ,
ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా మధ్యలో జొరబడి తీర్మానాలు చెప్పేసే పక్కింటి వాళ్ళూ,
మూడు బస్సులు మారి, మూడు గంటలు ప్రయాణించి వచ్చిన మరదళ్ళూ, చెల్లెళ్ళూ
ఆకస్మిక రాకకి విస్తుపోయి, నిష్టూరాలాడి అంతలోనే కలిసిపోయే చుట్టాలూ - అంతా అపురూపమే!
పానీపూరీ, మినపసున్నీ, ముంజలూ, జామపళ్ళూ తినే యోగం చూపిన రాశిఫలాలూ ,
ఉప్పులో ఉడికించిన వేరుశనగలూ, రేగివడియాలూ, పనస తొనలూ, సీతాఫలాలూ,
బంగినిపల్లి, తోతాపురి, రసం మావిడిపళ్ళూ, తర్బూజ వాసనొచ్చే తర్బూజాలూ,
వెల్లుల్లి ఆవకాయ, బెల్లం మాగాయ ముక్కలూ, రసగుల్లా తీపులూ, పప్పు చెక్కలూ,
బాబాయ్ హోటల్ ఇడ్లీలూ, దేవుడి బండి పులిహోర ప్రసాదాలూ,
బకాసుర బాబాయి దీవెనతో - కాదేదీ మళ్ళీ దొరకని తిండికి అనర్హం!
నా 'కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు' లాంటి షాపింగుకి
తోడుగా తిరగలేక నొప్పి-కాళ్ళు వేడి నీళ్ళల్లో పెట్టుకునే స్నేహితులూ ,
హోటళ్ళలో భోజనం చేసేసాక క్రెడిట్ కార్డు పనిచెయ్యకపోతే,
జాలేసి అరువిచ్చి, ఇంటిదాకా తీసుకెళ్ళి దింపి డబ్బు తీసుకున్న రిక్షావాళ్ళూ,
అత్యాశ లేని చెప్పుల వాళ్ళూ, ఆరాటపడి చల్లబరిచే అయిస్క్రీంవాళ్ళూ,
బేరం లేకపోయినా చీకు లేక కులాసాగా పడుకునే కొబ్బరిబొండం వాళ్ళూ - అంతా మురిపెమే!
మల్లెలూ, మావిడిపళ్ళూ , మమతలూ, మాటలూ అన్నీ ఆనందమే!
మనుషులూ, మొక్కలూ , మాటకారులూ , మూగాజీవులూ అన్నిటితో బంధమే!
అవే గోవులూ, ఆకులూ, పువ్వులూ, గాలులూ విమానాశ్రయానికి తిరిగి వెళ్తుంటే మాట్లాడవేం?
వచ్చినప్పుడు సంతోషంతో కన్నీళ్ళు, వెళ్ళిపోయేటప్పుడు బాధతోనూ కన్నీళ్ళే!
ఎందుకు బాధ? బోలెడు జ్ఞాపకాలతో 'నా' ఇంటికేగా తిరిగి వెళ్తోంది!
ఏ దేశంలో ఉన్నా, నా తల్లీతండ్రీ దేవుడి పక్కనే నిలబడి రక్ష ఇస్తారుగా!
వాళ్ళిద్దరూ ప్రత్యక్షంగా లేకపోయినా మాతృభూమి వైపు మనసు లాగుతోందేంటో!
శుక్రవారం సాయంత్రం వచ్చేసి ఆదివారం సాయంత్రం తిరిగి వెళ్ళిపోయే వీలుకోసం
ప్రవరాఖ్యునికి పాదలేపనం ఇచ్చిన అ ముని జాడ తెలుసుకుంటే సరి!
ఎంచక్కా ప్రతి వారాంతమూ గతంలోకి వెళ్ళిపోయి అమ్మానాన్నలతో ఉండిపోవచ్చు!