MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవితా మధురాలు
ధవళా శ్రీనివాసరావు
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
15వ ఆగష్టు 1947
అమ్మ కడగండ్లన్ని అంతరించాయి
అమ్మ కమ్మని రోజులవతరించాయి
మా గాంధి బాబయ్య మంత్రమే మాయమ్మ
చెరబాపి స్వాతంత్ర్య శిఖరమెక్కించింది.
వెలుగుకై తపియించి విసిగిపోయిన రేయి
అన్నంబునకె అఱ్ఱు లెత్తి చాచిన పూట
గుడ్డకై మర్యాద గోలుపోయిన ఘడియ
ఇనుప సంకెళ్ళ బరువును మోయలేక.
కొనప్రాణములతోడ కొట్టుకొన్న యుగాలు
తలపులో పలుకులో నడకలో బాటలో
అన్నింట దాస్యమ్ము ననుభవించిన కాల
మాగష్టు పదిహేనుతో అంతమైనది.
మా తల్లి విజ్ఞాన మహిళయై యనిశంబు
తోడి దేశాలతో గూడి తలనెత్తుకొని
గరువంబుతో దిరుగు కాల మేతెంచింది
అమ్మ కడగండ్లన్ని అంతరించాయి.
("జాతీయ గీతాలు" సంకలనం నుండి.
సంపాదకులు : గురుజాడ రాఘవశర్మ)
పాలపర్తి ఇంద్రాణి
ఈ రాత్రి
ఎప్పట్లాగే
మామూలు
మోహరాత్రి
కావాల్సిన
ఈ రాత్రి,
సంధ్యాకాంతులను
తాగి
చీకటి లేపనాలను
పులుముకుని
నలుపెక్కి
సుదీర్ఘ
స్వప్న లోలకాలను
ఊగుతో
చింత
చింతన
రాటల మధ్య
ముందుకీ వెనక్కీ
సాగుతో
దిక్కుతోచని
చల్లగాలిని
చీకట్లలో
పలకరింతలకు
పంపుతో
వింత గొల్పుతోంది
ఎప్పట్లాగే
మామూలు
మోహరాత్రి
కావాల్సిన
ఈ రాత్రి,
చీకటి బురదలో
బంగారు అంచుల
నీలి తామరలు
విచ్చుతోంది
అఖండమైన
ఈ చీకటి
తనను తాను
స్పష్టాస్పష్ట
విచిత్రాకృతులుగా
చెక్కుకుని
కంటి ముందు
వివిధ భంగిమలలో
నిలుపుతోంది
అంతలోనే
చెరుపుతోంది
ఈ రాత్రి
సమ్మోహనాస్త్రాలను
విరివిగా వదులుతోంది
భయాన్ని
సౌందర్యాన్ని
సారస్వతాన్ని
కలగలుపుతున్న
ఈ రాత్రి
కంటిని
మెదడును
మనసును
కనిపించని
పాశాలతో
కట్టివేసి
ఆలోచనలను
అంతు లేని
కృష్ణబిలంలోకి
మహాబలంతో
పీల్చుతో
శూన్యాన్ని
కూడా
తిరిగి
ఇవ్వని
నిర్మోక్ష
నిశీధితో
నా చుట్టూ
నల్లని దారపు
గూడును
అదే పనిగా
అల్లుతోంది
తనలోనికి
పదే పదే
లాగుతోంది
ఎప్పట్లాగే
మామూలు
మోహరాత్రి
కావాల్సిన
ఈ రాత్రి.
దర్భశయనం శ్రీనివాసాచార్య
ఇక్కడ ప్రతి చెట్టూ
ఇక్కడ ప్రతి చెట్టూ ఒక అద్భుత కవిత
ఎప్పుడో మొదలయింది
ఇప్పటికీ కొనసాగుతున్నది
దాని మొదలూ శాఖలూ కవితావాక్యాలు
కొన్ని ఎప్పుడో రాయబడ్డాయి, మరి కొన్ని నిన్నా మొన్నా -
కొన్ని ధృఢంగా, మరెన్నో లలితంగా -
శాఖల సొగసైన అమరిక ఆ చెట్టుకు లయ
లయ లేకుండా చెట్టు లేదు
వాక్యాల్లో నడుమ నడుమ పూలు అలంకారాల్లా-
వర్ణం శబ్దాలంకారం, పరిమళం అర్థాలంకారం
పత్రాలు పలుకుబళ్లు-
శాఖల వొంపుల లయ చాలు సొబగుకు !
కవితావృక్షానికి పుష్పాలంకారాలు లేకున్నా ,
వుండి గబుక్కున రాలినా-
రాత్రి అందరూ నిద్ర పోయేటప్పుడు
ఏదో ఒక సమయాన అదీ నిద్ర పోతుంది
అపుడు ఎవరో ఒక అదృశ్య మూర్తి వచ్చి
దాని ఆకు ఆకునూ, పువ్వు పువ్వునూ, శాఖ శాఖనూ
శుభ్రంగా తుడిచి వెళ్తాడేమో
పగటి వేళ పేరుకున్న ధూళీ,
మొరటు చూపుల మలినాలూ మాయమయేలా -
ప్రతి ఉదయాన అది తళతళగా మెరుస్తుంది
రోజూ పొద్దున్నే దాన్ని పలకరించకపోతే
సూర్యుడికి పొద్దు పోదు
రాత్రిపూట చంద్రుడికీ అంతే!
బాటసారులు వెళ్తూ వెళ్తూ
దాన్ని చదువుకుంటూ వెళ్లొచ్చు
లేక దాని నీడలో విశ్రమించి
లేచి వెళ్తూ దాన్ని నేమరేసుకోవచ్చు
దానికి గాలి ప్రియమైనది
అది రాగానే పలుకుతుంది అడగకపోయినా -
పలుకుతూ అదీ, వింటూ ఇదీ వూగిపోతాయి
ఆ వూపుకు కొన్ని అలంకారాలు రాలిపోవచ్చు కూడా!
వచ్చినపుడల్లా వాన దానిలో తడిసి
తన్మయత్వంతో వెళ్ళిపోతుంది
చెట్టు ఆనంద బాష్పాల్ని రాలుస్తుంది.
జాని తక్కెడశిల
తండ్రి
పదుర్లు ఎక్కిన అర చేతుల్లో
ముత్యంలాంటి మాట వికసిస్తుందని
ఆకాశం రెండుగా చీలి
కొత్త దారిని నిర్మిస్తుందని
అడుగులో అడుగేసుకుంటూ
నిండు కుండ లాంటి వార్తను
మోసుకొచ్చిన
ఆమె ముఖంలో
అమ్మతనాన్ని చూశాను
నా చేయిని తీసుకొని
తన గర్భంపై తిప్పినప్పుడు
కొత్త స్పర్శను అనుభవించాను
ఒక్క క్షణం పాటు మైమరిచిపోయాను
గుండెను హత్తుకొని
ఆనందభాష్పాలను జారవిడిచినప్పుడు
శుభ్రమైన నా భుజాలు
కొత్త బరువును మోయడానికి
సిద్దమయినట్టే అనిపించింది
అవును
Prega Newsలో ఉన్నది
రెండు పింక్ గీతలే కానీ
రెండుగా ఉన్న మమ్మల్ని
మూడుగా చేయడానికి,
కుటుంబంగా ఎదగడానికి
సాక్ష్యాలుగా నిలిచినప్పుడు
వర్ణించలేని అనుభూతిని పొందాను
“నేను తండ్రిని కాబోతున్నాను”
ఇంతకంటే గొప్ప కవితా వాక్యం ఏముంటుంది?
ఈ వాక్యానికి మించిన కవిత్వం
ఎవరు రాయగలరు?
చందలూరి నారాయణరావు
నడిచే దేవుడు "నాన్న"
ఎనభై ఏళ్ల వయసులోనూ
ఆ చేతులు చల్లగా మాట్లాడతాయి.
బిడ్డలు ఎంత ఏపుగా ఎదిగినా
ఇంకా తేమనందించాలని తపిస్తాయి.
నంగి నంగిగా నొక్కిపలికే మాటలో
చొంగకార్చే పండుతనంలోనూ
ఊటతగ్గని ప్రేమతీపిని
పంచే పేగుబంధానిది ఎప్పుడూ
వృద్ధాప్యమెరుగాని పెద్దరికమే.
వయోభారంలోనూ
బంధం విలువును మరువని మనసు
వంగిన నడుములోనూ
వాలిన హుషారుని కూడతీసికొని
చూపులతో దగ్గరకు లాక్కొని
తడిమి చూసే స్పర్శ ఎంతటి అదృష్టమో!
బిడ్డలు ఎంతటి భాగ్యవంతులైనా
ఈ బంధానికి విధేయులే.
ఎప్పుడు చూసినా
ఏదో దాచి చెప్పినట్లుగా
ఎంతో కూర్చి ఇచ్చినట్లుగా
గుచ్చి గుచ్చి చెప్పే బాధ్యత ముందు
కన్నవారెంతవారైనా పారాడే పసివారే.
కడుపునపడ్డ క్షణం నుండే
కలలను జీవం పోసి
ఎదిగే బిడ్డను ఎప్పుడూ
ఎదలో పెట్టుకు మోసి
మొద్దుబారిన చేతులు
నెర్రెలుబారిన మడిమలు
కీళ్ళని సవరిస్తూ చేసే
ప్రతి కదలిక ప్రేమమయం.
తప్పటడుగుల్లో నడిపించి
నేడు వణుకుతున్న చిటికెన వ్రేళ్ళు,
లోకాన్ని చూపించి మురిపించి
అలసిన నీరుకారుతున్న గాజు కళ్ళు,
అందమైన జీవితానికి అహోరాత్రులు
నడిచి నడిచి అరిగిన మోచిప్పలు,
మంచిని భోదించి ,మాటల్ని నేర్పించి
మౌనంగా మాట్లాడుతున్న గొంతు..
నేటికి కడుపుతీపితో
పరితపించే ప్రేమ స్వరూపాలై
ఓ ప్రత్యక్ష అనుభవంగా
కురిసే ప్రేమే "నాన్న".
ప్రతి ఇంటి గుడిలో
నడిచే దేవుడు."నాన్న".
* * *
( జూన్ 20 వతేది ప్రపంచతండ్రులదినోత్సవం సందర్భముగా రాసి పంపినది!)