MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవితా మధురాలు
నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కవితలపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన కవిత.
మనిషి మరింత
కోతకు గురైనప్పుడే కదా !
అగ్రమో..అగాథమో చేరేది.
మనసు ఇంకొంత
వెతను భరించినప్పుడే కదా !
పథమో..పతనమో పిలిచేది.
హృదయం కాసింత
బాధతో ద్రవీభవించినప్పుడే కదా !
దృఢమో.. అదృఢమో తెలిసేది.
వృకోశీకరణ ప్రవాహ కరవాలం
ఓ వైపు తనను కోసినా..
ఇంకోవైపు ఒడ్డై నిలుస్తుంది.
మరింత దూరంలో..
మైదానంగానైనా మొలుస్తుంది.
క్రమక్షయ కభళింపులో..
చివరాఖరికీ..
ఇసుక మేటగైనా మెరుస్తుంది.
అలల శిల్పుల తాకిడికే కదా..!
తీరశిలలు అందమైన శిల్పాలయ్యేది.
రాపిడి తీవ్రమయితేనే కదా..!
వజ్రమైనా ఖరీదయిన ఖనిజ రాజమయ్యేది.
వృకోశీకరణమో..
క్రమక్షయమో..
హృదయ వెతనో..
మనసు కోతనో..
అలల తాకిడో..
తీవ్ర రాపిడో..
భూమికైనా..
మనిషికైనా.
స్థితి మార్పు సహజమే కదా..!
సహజ వాక్యం
~అశోక్ అవారి
మిశ్రచాపుతాళం
పల్లవి: ఖరహరప్రియ
నవ్యాంధ్ర జననీ ఓ దివ్య కుంభిని
అనుపల్లవి: ఖరహరప్రియ
ప్రగతి మార్గము నడచు ఆంధ్రుల పాలిట భాగ్యావని
చరణం-1: ఖరహరప్రియ
మిన్నుతాకే కనుమలే మణి మకుటమై
అలల తళుకుల నదులు ఆభరణమ్ములై
నీలి ఖాతము కీర్తిచాటు పతాకమై
భరతమాతకు కొత్తబిడ్డగ వెలిసినావమ్మా ।। నవ్యాంధ్ర।।
చరణం-2:సారంగ
చరితగల అమరావతిని మా రాజధానిగ ఎంచుకుని
రాష్ట్రమంతటి మట్టిగట్టి పునాదిగా వేసి
సంప్రదాయము అధునికతల మేలికలయిక జేసి
జాతియే గర్వించు నగరము కట్టినామమ్మా || నవ్యాంధ్ర
చరణం-3: బౌళి
చతుర్ముఖునిగ చేబ్రోలున చేరినాడా బ్రహ్మయ్య
ఏడు కొండలపై వెలిసాడు శ్రీనివాసుడే
మల్లికార్జునుడై శ్రీశైలమున నిలిచాడు శివుడే
నాల్గు వైపుల దేవతలు దిక్పాలకులురైరమ్మా || నవ్యాంధ్ర
చరణం-4: శహానా
గోదావరి గట్టుపై కవితలెన్నో పుట్టెనే
కృష్ణవేణీ తీరమే కళల కాణాచయ్యెనే
తుంగభద్రా సీమలే రత్నగర్భగ నిలిచెనే
పల్లముల పలనాడు శౌర్యము చాటెనోయమ్మా || నవ్యాంధ్ర
చరణం-5: పంతువరాళి
పరిశ్రమలే మందిరాలను ఆధునిక భావాలతో
విధులు నిర్వర్తించుటే నిజమైన పూజగ నమ్ముతూ
పురోగతినే కోరుతూ నిష్ఠతో నడిచేటి యువతను
ప్రోతసహించే క్షమత కలిగిన తల్లినీవమ్మా|| నవ్యాంధ్ర
చరణం-6: కాపి
మతము ఏదైనా మానవత ఉత్తమమైన మతమని
బ్రతుకు తెరువేదో ఆ వృత్తినే నిజమైన కులమని
ఐకమత్యమె బలమని నమ్మేటి మా జాతివారిని
సమన్వితమౌ శక్తితో నడిపేవు నీవమ్మా || నవ్యాంధ్ర
చరణం-7: శ్రీరాగం
సూర్య చంద్రులు భూమిపై వెలుగుతూ వున్నంతకాలం
సముద్రములీ అవనిపై నీరు కలిగున్నంతకాలం
ప్రాణికోటికి పీల్చేందుకు మంచిగాలున్నంతకాలం
తెలుగు నేల తెలుగు జాతి వెలుగునోయమ్మా || నవ్యాంధ్ర
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కవితలపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన కవిత.
కాలాన్ని కవిత్వీకరిస్తున్నాను
కాఠిన్యాన్ని కలంపై కాచి కరిగిస్తున్నాను
కాలపుక్రమశిక్షణలో అతుక్కుపోయిన నీరసాన్ని బయటకు వంపేసి
పాదాలకు పాదరసాన్ని పూస్తున్నాను.
నా అనుభవాల భస్మాన్ని
మంచి చెడుల కూలంకష ప్రవాహంలో ఎప్పటికప్పుడు తర్పణ చేస్తున్నాను.
ఋతువులు నవ్వినపుడు
ఆ నవ్వుల కనుమల్లో పూసిన
సెకన్లను, నిమిషాలను గంటలదండలుగా కడుతున్నాను.
దినచక్రవాహనాలలో
నెలకు ముప్ఫైసార్లు యముడికి ఎగుమతి చేస్తున్నాను.
ముతక బారిన మేఘాలను
సముద్రాల్లో నానబెట్టి వానచుక్కలకోసం బండలపై బాదుతున్నాను.
ప్రచండ భానుడి కిరణాలు
చలికి వంకర్లు పోకుండా వెచ్చని ఆకాశాన్ని కప్పుతున్నాను.
వేసవి వేధింపుల నుండి ఆత్మరక్షణకోసం
భూదేవిని ఏసీ సంచులలో దాచి ఉంచుతున్నాను.
రోజుకో గోపురంతో దర్శనమిచ్చే
సమాజ ఆలయం చుట్టూ
సమానత్వం కోసం 365 ప్రదక్షిణలు చేస్తున్నాను.
భూమ్యాకాశాల సరిహద్దు పంచాయితీలో నిలబడి
రాత్రింబవళ్ళ దాయాదులను ఒకరినొకరికి పరిచయం చేస్తున్నాను.
ఉగ్రవాదపు క్రషర్‌లో పడి నుజ్జయి
ఎర్రగా ఎగసిపడుతున్న జీవితపు అలలకు
ఆనకట్ట కట్టాలని తలకిందులుగా తపస్సు చేస్తున్నాను
ప్రయత్నం ప్రతి రోజు జరుగుతున్నా
ఫలితం మాత్రం బొమ్మాబొరుసును కోరుతోంది
వారంలేని నాడు వాసనామాత్రంగా మారుతోంది
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కవితలపోటీ లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.
‘పోకేమాన్’ను పట్టుకోవడం సరే
నీ సమస్త ఆశలను మార్కెట్లో సరుకుగా చేసి
దోచుకుంటున్న ‘ప్యాకెట్ మ్యాన్’ సంగతేం చేద్దాం
నిన్ను నిన్నుగా జీవించనివ్వలేని
నిన్ను నిన్నుగా ఆవిష్కరించుకోనివ్వని మార్కెట్ లోకం
వైఫైలా నిన్ను వెంటాడుతుంటే
యాంటీ వైరస్‌లా మారాల్సిన విషయాన్ని గూర్చి ఏం ఆలోచిద్దాం
నీ సాంస్కృతిక విలువలన్నింటినీ ఎవడో మూటగట్టుకొనిపోయి
మళ్ళీ వాటికే వాడి రంగు, ఆలోచనలు తొడిగి
ఫ్లిప్‌కాట్‌లోనో అమేజాన్‌లోనో పార్సిల్ చేస్తుంటే
మురిసిపోతున్న మనం
పన్నెండుమెట్ల కిన్నెర రాగాలను ఎలా విందాం
నీ కంటికి తారుపూసి, నీ ఆలోచనలకు ఇనుపకంచె నిర్మించి
నిన్ను నిష్క్రియాపరుణ్ణి చేసి
నీకు తెలియకుండానే
నీ చేతి వేళ్ళకు గూగుల్ కళ్ళజోడును తొడిగించిన
‘గూగుల్ గుండు’కు గుండెను ఇంకెన్నడు ఎదురొడ్డుదాం
నీ చుట్టూ వాట్సప్ ఉచ్చు బిగిస్తూ
నీ లోకంలో నువ్వు ఉండేలా వలయాలను నిర్మించే యూట్యూబ్‌లను సృష్టిస్తూ
నీకు తెలియకుండానే,
నీ ప్రమేయం లేకుండానే
నీ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి
నీపై అప్రకటిత నిఘాను అమలుచేస్తున్న
నేడు ‘సిల్వర్ చిప్’లను తమ ఇనుప పాదాలకు
నాడాలుగా తొడుక్కుంటున్నవాణ్ణి
నిలువరించాల్సింది ఇంకెప్పుడు
ఫేస్‌బుక్‌లో ఫేషియల్ చేసిన ముఖాలను
ఆరబోసుకునేవారు చాలామందే ఉంటారు
ఎన్నడూ ఫేషియల్ జోలికెళ్ళని
నీ అరవై ఏళ్ళ ముసలమ్మ ముఖమ్మీద
మడతలకు కారకులను ఎప్పుడు లెక్కకడుదాం!
వారి లెక్కలను ఎప్పుడు సరిచేద్దాం!!
వాడి గుండెనే వాడి ఊపిరితిత్తులకు
ఎప్పుడు వేళాడదీద్దాం!!!
వాట్సప్‌కు ఓ యుద్ధగీతం
~శివన్న చందు
కవిత్వమంటే... కదిలే నది...!
~జడ సుబ్బారావు
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కవితలపోటీ లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.
అక్షరాల్ని అలంకారాలలో బంధించాలో
అనుభవాల్ని అక్షరాల్తో సంధించాలో
తేల్చుకోలేని అయోమయంలో కవిత్వమెప్పుడూ తీరని దాహమే...!
ఆశల్నీ ఆశయాల్నీ అలవోకగా చిత్రించి
కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ముందుకు నడిపే
అనంతానంత జీవన మాధుర్యం కవిత్వం...!
కవిత్వమంటే కదిలేనది
చైతన్యాన్ని అణువణువూ నింపుకున్న అంబులపొది
కవిత్వమంటే స్వేచ్ఛావిహంగం...
దిక్కులు పిక్కటిల్లేలా నినదించగల అక్షర ప్రవాహం
దేశకాల పరిస్థితులకు ఎదురీది
మత్తునిద్ర పోగొట్టి మార్గం చూపే అంతర గవాక్షం
ఆవలితీరాన్ని అవలీలగా చూడగలిగిన విశాలనేత్రం...!
కవిత్వమంటే కొండంత ఓదార్పు...
కాలం ఎన్ని మానని గాయాల్ని సృష్టించినా
బ్రతుకు చిత్రం ఎంత విచిత్రంగా మారినా
గుప్పెడు అక్షరాలతో గుండెలోతుల్ని తడిమి
పుడమిపైనే పునర్జన్మను ప్రసాదిస్తుంది...!
కవిత్వమంటే...
అనుభూతుల మాలిక... అనుభవాల వాహిక
పడిలేచే కడలి తరంగంలా ప్రతినిత్యం ఎగిసిపడుతుంది
మన లోపలి లోతుల్ని
ఆర్ద్రంగా కొలుస్తూనే అనునిత్యం వెన్నుతట్టుతుంది
జనజీవన స్రవంతికి జీవనదిలా మారి
చైతన్య సిరుల్ని అందిస్తూనే ఉంటుంది...!