MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవితా మధురాలు
-తమ్మినేని యదుకులభూషణ్
పాత ఇల్లు
వెదురు పొదలవెనుక
మెట్లు విరిగిన పాత ఇల్లు
చలి సాయంత్రం
ఇంటి కప్పు మీద-
పరచుకునే చెట్ల
కొమ్మల నీడలు
కలిసి ఎగిరే సంధ్య
పక్షుల కలకలం
***
పాడు బడక ముందు,
మెరవని గాజు కిటికీల గుండా
ధారాళంగా ప్రసరించే ఎండ
లాలనగా గాలిలో
తేలివచ్చే పిలుపు,
తలతిప్పి అమాంతం
పరుగులు తీసే పసి బాలుడు !
దూరమై క్రమంగా క్షీణించే
లేత పాదాల చప్పుడు
***
రంగు వెలసిన ద్వారబంధం
బార్లా తెరుచుకున్న వాకిలి -
ఏ భావమూలేని ఏకాకి స్త్రీ కన్ను
ఆహ్వానిస్తుంది నన్ను.
ఎవరూ రారని
భయమెరుగని జింక
గడ్డిపరకలు నములుతూ
బయట తచ్చట్లాడుతున్న
అపరిచితుని ఉనికి
అసలు పట్టించుకోదు .
- తెలుగు వెంకటేష్
కల కన్నకల
శబ్దం విరిగిన తరువాత
ముక్కల్ని చేటలో వేసుకుని
బయటకు విసిరేసింది నిశ్శబ్దం
తలలు తెగిన శబ్ద దేహాలు
ఏకాంతంగా కుములుతూ
పేయింటింగ్ను వేశాయి
అద్దంలోంచి
ఎగురుకుంటూ వచ్చి
ఊదారంగు కాకి
కొనవూపిరితో ఉన్న సడి పేయింటింగ్ను
ముక్కున కరచుకుని ఎగిరిపోయింది
గూటిలో పేయింటింగ్ను తగిలించి
కాకి ముచ్చట పడింది
తెల్లవారుజామున
చప్పుడు చిత్రంలోంచి అనేక శబ్దాలు
మళ్ళీ కొత్తగా బతికి
నిశ్శబ్దం గూటికేసి కాకులై అరుస్తూ
ఎగిరాయి
ఏకాంతంగా నిశ్శబ్దం ధ్యానం చేస్తూవుంటే
పిల్లశబ్దాలు బతికి వచ్చి
నిశ్శబ్దం పీక పిసికాయి
మరణించిన నిశ్శబ్దంలోంచి
శూన్యం పడగ బుసకొట్టింది
దూరంగా లార్వా నవ్వుకుంది
మందిరంలో దేవుడు తలపట్టుకున్నాడు.
*****
రంగుల పండుగ
యోగనిద్రలో మునిగి
విరామం తీసుకునే ముందు
అడవిలో చెట్లు పరస్పరం
వీడ్కోలు చెప్పుకున్నాయి
ఒకరి ఆకుల మీద ఒకరు
రంగుల సంతకాలు చేసుకున్నాయి.
ఒద్దికగా, ఓపికగా చేసుకున్న అలంకరణతో
ఇవాళ చెట్లన్నీ
కొత్త పెళ్ళికూతురిలా తయారయ్యాయి
హేమంతునితో సంగమం కోసం
ప్రేమగా ఎదురు చూస్తున్నాయి.
ఎండలకి, వానలకి లేని ఎదురుకోలు
అడవి హేమంతునికి మాత్రం ఇస్తుంది
కొండల్లో, కోనల్లో
ఎటుచూసినా ఎడతెగని పెళ్లి సందడి!
అడవి సంరంభం నుంచి
అడుగు బయట పెట్టాక
ఊరే ఎందుకో ఒంటరిగా అనిపిస్తుంది.
పండిన ఆకులు నిండుగా కప్పుకుని
ఎదురు పడిన ఈ ఊరి చెట్టు
పేరంటానికి వెళ్ళని
పెద్ద ముత్తైదువులా కనిపిస్తుంది.
*****
-విన్నకోట రవిశంకర్
-నాగరాజు రామస్వామి
సాయం సంజ
మల్లె మొగ్గలు బద్దలై
చీకటి పుప్పొళ్ళను చిమ్ముతున్నవి;
జిలుగు తావుల వెలుగు పులుగులు
ఆకసాన్ని తాకి నల్ల నక్షత్రాలౌతున్నవి.
నీలి రేయి.
ముగ్ధ మోహన స్నిగ్ధ తారలు
చిద్రుపలై అశ్రు గంధాలను కార్చుతున్నవి;
నింగి కాసారాల నీలి రేకులు
నేల రాలి నల్లరాతి కలువలౌతున్నవి.
స్మశాన సంధ్య.
కన్నె చితిలో దగ్ధమైన నిశిగంధ ధూమదేహాలు
అర్ధరాత్రి అగ్నికీలలై భగ్గుమంటున్నవి;
కొరివి దయ్యాల బొమ్మదేవర కాటి’కాపరి’
కాల్చుకుతింటున్న శవ దహనాల విందులో
పైశాచికాలు చేయి చేయి కలుపుతున్నవి.
*****
( ‘అభయ’ చట్టాలు చట్టుబండలై, నీటి మీద రాతలౌతున్న తిమిర సంధ్యలో )
-బారు శ్రీనివాస రావు
భ్రష్ట
ఒకప్పుడీ మనసు ఇలా లేదు
కల్మషం, కసి అప్పుడప్పుడు తలెత్తినా
కామం, కార్పణ్యం అటూ ఇటూ పరుగెత్తినా
ఎప్పుడూ ఓ మూల ప్రేమ స్రవిస్తూనే ఉండేది
ఒకప్పుడీ ఇల్లు ఇలా లేదు
మాట మాట పెరిగి ఓ సారి తిట్టుకున్నా
మూతి ముడిచి మౌనంతో నన్ను నేను చుట్టుకున్నా
ఆప్యాయత గడప దాటి ప్రవహిస్తూనే ఉండేది
ఒకప్పుడీ ఊరు ఇలా లేదు
వర్గభేదాలు అప్పుడప్పుడు వెక్కిరించినా
వర్ణభేదాలు రాకపోకలను అడ్డగించినా
స్నేహబంధం చెరువు గట్టుకు లాగుతూనే ఉండేది
ఒకప్పుడీ దేశమూ ఇలా లేదు
లైసెన్స్, పర్మిట్ రాజ్యం పౌరుడి గొంతు పట్టుకున్నా
మోహర్రంకో, చతుర్థికో ఒకరిద్దరు కొట్టుకున్నా
మతం కన్నా మానవత్వం ముందు వరసలోనే ఉండేది
మచ్చేలేనీ వెన్నెలను చూడాలనుకుంటే
జాబిలినే మింగేసే గ్రహణం ముంచుకొచ్చింది
*****