MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు
నాకో అపనమ్మకాన్నివ్వు
~యార్లగడ్డ రాఘవేంద్రరావు
నాకో అపనమ్మకాన్నివ్వు
ఇక నీకోసం
ఒక నమ్మకానికి ఎప్పుడూ
ముఖచిత్రంలా ఉంటాను
నాకో ఉక్కపోతనివ్వు
ఇక నీ కోసం
ఏ వ్యూహాలూ పన్నని
గాలి పాటలకొక కోట కడతాను
నాకో శిశిరపు నీడనివ్వు
ఇక నీ కోసం
ఆలాపనగా నన్ను సాధన చేసుకుని
విదిలింపుల మీద వసంతఝరులకు
ఓ మడిని చెక్కుతాను
నాకో కొనచీకట్ల కొసచూపునివ్వు
ఇక, కిక్కిరిసిన నిరాకారాలు
నిన్నెప్పుడూ అపహరించకుండా
నీరింకిన మడుగుల్లో
తరగనంత కొండతేనెను వంపుతాను
నాకో అవ్యక్తాన్నివ్వు
ఇక, నిన్ను ఎగబోతపోసే
తడబాటుల్ని తుంపేసి
ఎప్పటికీ అలగని ఇవ్వాళల్ని
గుత్తులు గుత్తులుగా కాయిస్తాను
* * *
ఆకు తెగిన చోట
ఒక జ్ఞాపకం జన్మనెత్తుతుంది
ఆ నిశ్వాసాన్ని మోస్తున్న గాలిలో
ఓ గంధపు చెట్టు విరగబూస్తుంది
నేనేమో
మైలపడ్డ కాంతి పతాకాల మీదుగా
నువ్వు నడిచొచ్చిన పశ్చాత్తాపాల్ని
ఊడ్చేస్తుంటాను
ప్రశ్నల్ని పారబోయటానికి కూడా
సందేహిస్తున్న నీ కోసం
గిద్దెడు జీవితాన్ని పల్లకీకెత్తించి
సంజెచీకట్ల ముందు
తాంబూలం నిండా సరికొత్త శ్వాసల్ని
జావళీలుగా సిద్ధం చేస్తుంటాను.
పిచ్చి తలపులు
~ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
ననుజూసి నవ్వింది
నవ్వులో మెరిసింది
కనుగొనల పొంగేటి
కలత కోరికలేవొ
మిణుకుమిణుకూమంటు
కనికరిస్తాయి
ఆ చిన్ని హృదయాన నేమున్నదో-గాని.
పసిడి మెడవంపులో
పరువులెత్తే తళుకు
తళుకులో మెలుకువై
తలలు దిప్పేపాట
పూలవాసనమల్లె
జాలిపెడుతుంది
ఆ చిన్ని గొంతులో నేమున్నదో-గాని.
బాల్యయౌవన దశలు
బంతులాడే వేళ
తొంగిచూసే మిసిమి
దొరికిపోయే వేళ
మెదిలితే అందాలు
కదిలిపోతాయి
ఆ చిన్ని వయసులో నేమున్నదో-గాని.
ఆ పిల్ల జడలోన
నేపూలొ ముడుచుకొని
ఘుమఘుమా వాసనల
కులుకుతూ వచ్చి
ననుజూచి తలవంచి
నవ్వుకుంటుంది
ఆ చిన్ని సిగ్గులో నేమున్నదో-గాని.
పూల సన్నని వలపు
బాల కమ్మని తలపు
పాట తియ్యని పిలుపు
పలకరించేసరికి
పేద గుండెల్లోన
పిడుగు పడుతుంది
బీద కళ్ళల్లోన బెంగ పుడుతుంది.
***
చిత్ర గీతం
~చాగంటి కృష్ణ కుమారి
ఎవరు పెట్టారే నిన్నక్కడ బుట్టా?
ఎవరు నిల బెట్టారే బుట్టా?
వాడుకొనీ వాడు వదిలాడా బుట్టా?
బుట్టా ఓ వెదురు బుట్టా?
అందంగ పదిలంగ నన్నీటి మధ్య
నిలబెట్టాడే పిల్ల, పదిలంగ నిలబెట్టాడే
నిలబెట్టి నన్ను నిదుర కెళ్ళాడే పిల్లా
వాడు నిదురోయాడే పిల్లా
రేపటి పొద్దున- నింపుతాడే పిల్ల
రసాలు నింపుతాడే
నా నిండుగ పెద్ద రసాలు నింపుతాడే !
తీయ తేనియ బరువు మోయగలవా బుట్టా?
బుట్టా ఓ వెదురు బుట్టా?
అరచేతులతో నన్నెత్తుతాడే పిల్ల
నెత్తికెత్తుకుంటాడే
పూవులా నడకకి
వాడి పూవులా నడకకి
నేనూగుతానే పిల్ల
ఉయ్యలలూగుతానే పిల్ల
పొద్దు గుంకంగ
పరుగులా నడకకి
వాడి పరుగులా నడకకి
ఎగిరెగిరి పడతానే
నేనెగిరెగిరి పడతానే
నెత్తికెక్కించుకొన్న వాడి నెత్తిమీద
నేనెగిరెగిరి పడతానే
నిలబడతాడే పిల్ల, మళ్ళీ నిలబడతాడే
నిలబడలేని నన్ను
మళ్ళీ నిలబడతాడే
అందంగ పదిలంగ
నన్నీటి మధ్య మళ్ళీ నిలబడతాడే
పిల్ల, మళ్ళీ నిలబడతాడే
అందంగ పదిలంగ నిలబడతాడే! మళ్ళీ నిలబడతాడే
అమ్మ చేతి
అన్నంతిని
అరుబయట చల్లగాలితో
పులకరిస్తున్న అరుగుపై కూర్చొని
ఆకాశపు నగరంలో
చిన్నగా కనిపిస్తున్న వీధి దీపాలను
పెద్ద వెలుగుతో కనిపిస్తున్న
లైట్ హౌస్ ను చూస్తూ
కవిత్వం రాయాలని ఆలోచిస్తున్నాను
ఆలోచనలు అండమై పిండమై
మనసులో కుంతిగర్భమై
బ్రహ్మాండం చేరి
పాఠకులను అలరించేది ఎప్పుడో
ఎప్పుడో
~అభిరామ్ ఆదోని
ఒక్క మాట
~దాసరాజు రామారావు
నాలుగంటే నాలుగే అక్షరాలు
రెండే రెండు పదాలు
ఎంత సునాయాసంగా అనగలిగావు
ఏజ్ ఫాల్ట్...!
వయసుల మధ్య అంతరాల్నే చూసినవు
ఆత్మ కొట్టుకునే తీరును
కంపరమెత్తిన నువ్వు కనిపెట్టవు
విసుగెత్తిపోతవు-
ఏళ్లుగా అల్లుకుపోయిన స్నేహబంధాల్ని పదే పదే
చేతిమట్ట మీద బెల్లంలా
నాలుకను తీపి చేసుకుంటుంటే -
కళ్లెర్రబార్చుకుంటవు-
దులిపిందే దులుపుతూ
తుడిచిందే తుడుస్తూ
ముడతలు తీస్తూ ,మడతలు పెడుతూ
శ్రమ సౌందర్యాన్ని అపురూపం చేస్తుంటే -
ముఖాన్ని ఉడికించిన కందగడ్డ లా జేవురిస్తవు
నీవు కత్తిరించి చేసిన డిజైన్ లో
పచ్చిస్ కాయలా వుండనందుకు
తన ఆరోగ్యానికి నీ మాట
మందు అవదు
తన ఆకలికి నీ రుచి నంటగడతవు
నీ వాదన తనకి వేదన
ఇందాక వచ్చిన నీ పడుచు వయసుకు
ఎందాకో మోసిన బతుకు ముడతల్లో
దాచిన చెమట స్మృతుల ముడి విప్పగలిగావా ఎపుడైనా ?
ఊయలూపుతూ నిదురని
కళ్ళరెప్పల కిందే నిలిపేయడం
గుర్తు లేదా
ఎదగడానికి ఎదమీద ఎగరేసిన
సన్నివేశం మరచినవా
దిద్దే అక్షరం కోసం
పది పలకలై పగిలిపోయినప్పుడు
చూడలేదా
పట్టుజారి పడిపోతున్నప్పుడు
పట్టుకొమ్మై నిలిచింది
తెలియదా
ఎన్ని కోరికలు చంపుకుంటేనో
నీ కోరికలు తీరినవో
ప్రేమనా,అనురాగమా, అభిమానమా,
ఇష్టమా,బాధ్యతా
,త్యాగమా, ఇంకేమన్నానా,
లేకపోతే ఇవన్నీనా
జిహ్వ రుచులకు అలవాటు పడ్డాక
మనసు రుచులెట్లా తెలుస్తయి?
సంసారమంటూ ఏర్పడ్డాక
ప్రేమ పరిధులెట్లా కురుచవుతయి ?
ఏజ్ ప్రయాణంలో స్టేజ్ లెన్నో
దాటేస్తూ వుంటవు
మోకాళ్ళ మీదికొచ్చిన జీవితం
ముందుకు కదలక,మొరాయిస్తది
అప్పుడు
నువ్వన్న మాటే
నువ్వినవలసి వస్తుందేమోనని
భయపడుతున్నా...!
తొందరపడి ముందే కూసే కోయిలలా
జోరువానకు సిద్దమైన ఆకాశంలా
ఒకసారి
మనసులో కలవరపడి చూడు...