MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవితా మధురాలు
-శివసాగర్
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
అమరత్వం
విత్తనం చనిపోతూ
పంటను వాగ్దానం చేసింది.
చిన్నారి పువ్వు రాలిపోతూ
చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది.
అడవి దహించుకుపోతూ
దావానలాన్ని వాగ్దానం చేసింది.
సూర్యాస్తమయం చేతిలో చేయివేసి
సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది.
అమరత్వం రమణీయమయింది .
అది కాలాన్ని కౌగలించుకొని
మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది.
("నెలవంక" కవితా సంపుటి నుండి)
-డా. రవూఫ్
మన్రో పాట
ఎయిర్ పోర్ట్ నించి వస్తోంటే,
దార్లో "మన్రో స్ట్రీట్" తటస్థపడింది .....
స్పీకర్ లోంచి పాట ఒకటి
బహుశా మన్రో దే కాబోల్ను ....
"When Love Goes Wrong”
అంటూ వస్తోంది.
మన్రో స్ట్రీట్ త్రోవ వెంబడి పోతోంటే ,
చీకటికి మల్లే అల్లుకుపోతూ ;
తెల్లగౌనులో నర్తిస్తోన్న మార్లిన్
హృదయం లోని
యుగాల నాటి పురా దుఃఖం
నలుపు తెలుపు రంగుల
చింతా క్రాంత చిత్రమై
కళ్ళక్కడుతోంది.
ప్రేమరాగాన్ని వినిపిస్తూ,
మరణంలోకి జారుకున్న
జవరాలు.....
మార్మిక లోకపు మంత్ర కవాటాల్ని తెరిచి ;
జీవనపర్యంతపు విషాదాన్ని
వెలిగించిన మరీచికలో
మరులొలుకుతూ పాడిన
అశ్రుతప్త శోకసిక్త గీతం
కాలానికి లోబడక
పరివ్యాప్తమౌతూ....
పరిఢవిల్లుతూనే ఉంది.
తమ్మినేని యదుకుల భూషణ్
రెండు ఏకాంత సమయాలు
1.
చిరుగాలి తెమ్మెర
మెరిసిపోయేఆకాశం
కిరణాల స్పర్శ
జలదరించే
జలదేహం
ప్రవాహంలో
రాలి పడే
పసుపురంగు పూలు
2.
కప్పల బెకబెకల మధ్య
ఆగి ఆగి విన వచ్చే
కీచురాళ్ళ చప్పుళ్ళు
గుసగుసలాడే
చల్లని గాలి
చీకటిపొలిమేరలు
అవలీలగా దాటి
మిణుకు మిణుకుమనే
తారలా మిగిలి పోతాను
-బారు శ్రీనివాసరావు
శతమానం భవతి
పెరటిలోని ఊటబావి
పొంగే నదుల మించి దాహాన్ని తీరుస్తుంది
అనుభవసారం నిండిన సలహా
గ్రంథాలను దాటి జ్ఞానాన్ని పంచుతుంది
మూల వెలిగించిన దీపం
గదంతా వెలుగు నింపుతుంది
లేశమంత చందనం
పది కాలాలు సువాసన చిమ్ముతుంది
ఊటబావి, మాట సాయం
మట్టి దీపం, మంచి గంధం
గుర్తొచ్చిన ప్రతిసారి
గుండె చల్లపడుతుంది
స్థాయిని దాటి సాయంచేసే ఉపాధి
సంతృప్తి సర్వత్రా నింపుకున్న విభూతి
తలచిన ప్రతిసారి
కళ్ళలో నీరు నిలుస్తుంది