MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు
పి.మోహన్
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
ఒకటికి ఒకటి
ఇవాళ్టి సరిగ్గా మూడు దినాలు
ఒక దుఃఖానికి మూడు దినాల ఆయుష్షు
రేయింబవళ్ళ పురాశోకంలో
రోజుకైదుసార్లు దగ్గరెక్కడో 'అజా'
ఎడారి బిడారుల్లోంచి
ఒంటరిగా
ఒయాసిస్సు జాడ కోసం
ఓ యువకుని ఒంటరి ఆక్రందన
ప్రియ ప్రవక్తా!
'ఆయా అల్లా!
ఇస్ దో జాఖ్ సే ముఝే జల్ దీ బచావో' అని
నా తరఫున ప్రార్థన చేయుము!
ఔను
ప్రేలాపన సద్యోజనితాల పెనుగులాట
ఉన్నదే లేనట్లు లేనిది ఉన్నట్లు
పెను కాలరాహిత్యంలోంచి బ్రోచేవారెవరు?
ఊహాతీత వెల్లువలా సుడిలో
ప్రాచీన నావికుడి ఆత్మఘోష
ఒకటికి ఒకటి
ఇలాంటి చోట బహుభారమైనది
****
నేటికీ సరిగ్గా ఏడు దినాలు
బైట నాకోసం పూచినా పూలన్నీ ఏమాయెనో
మిత్రుల సాయంత్రపు టీ వేళలు అలిగినవో
అయ్యా
కాసేపు కిటికీ పిట్ట రెక్కలు తెరవండి
కాళ్ళకు గట్టి తాళ్ళే కట్టుకొని వదలండి
రెక్కలున్నది ముడుచుకోడానికా!
ఈకె పక్కన ఈకె విసనకర్ర వీవెన
రెక్కల టపటపలో ఈకెలెన్ని రాలినా చింతలేదు
ముడుచుకుపోయిన స్థితి కంటే
ఆత్మహననమైనా
పురివిప్పడం గొప్ప కాదూ!
రాలిన ఈకెల లెక్కప్రకారమే
నేటికీ సరిగ్గా పదకొండు నరకాలు
పెరిగిన చేతిగోళ్లు
గడిచిన నిర్బంధ దినాలకు గుర్తుగా
గోడలపై చిత్తరువులేవో చెక్కుతూ
గుహ చుట్టూ క్రూరమృగాలు ముసిరినవేళ
దుఃఖిత ఆదిమానవుని
నెత్తుటిగోళ్ళ చిత్రలిపి!
సూర్య కిరణం
చంద్ర శీతలం
మృగ్యమైపోయిన
పదమూడు కన్నీటి రేయింబవళ్ల
బరువు బరువైన పలవరింత
నాకే హిమసమూహాలూ అక్కర్లేదు
ఏ పూలవనాల కోయిల పాటలూ అక్కర్లేదు
మీ కట్టెదుట
కాసేపలా నిల్చునో కూచునో
పొడిబారిన పగళ్ళనో
నక్షత్ర సహితమో నక్షత్ర రహితమో అయిన
నిరామయ చలిరాత్రులనో
చూస్తూ ఊరకే అలా కేవలం శ్వాసిస్తాను
ఇలాంటిచోట బహు దుఃఖమైనది
***
ఈ రేయికిక నిదుర లేదు
నెత్తురు పీల్చే దోమల గురించే కాదు
మనుషులను తింటున్న మనుషుల గురించే
ఈ హింసామయ కుటీరంలో
దీర్ఘతపంలో చింతనలు పోతున్నా...
అయినా ఏమిటిట్లా?
మనుషులనే ప్రేమించాననుకో
అరుణిమ పులుముకున్న సంధ్యలోనే
పేరు తెలియని పక్షినై పడుకున్నాననుకో
అయినా ఎందుకిట్లా?
గదిలో నేను బందీనా?
నాలో గది బందీనా?
అవునుగాని
ఇంతకూ రేపటిలా దినాలు లెక్కపెట్టే స్థితి
ఒకటంటూ ఉంటుందా మిగిలి!
సంశయమెప్పుడూ
తక్కెడ గిన్నెలు మధ్య ఊగే ముల్లు
ఊగిసలాట నావొక్కడి చావుబతుకుల గురించే కాదు
ఊపిరి పోయగల ఉద్యమాల హరివిల్లు గురించే
ఉబికిన నుదిటి నరాలను దిద్దుకుంటూనో
గడ్డం ముడిచిన పిడికిలితో
రోడిన్ చెక్కిన 'థింకర్' శిల్పంలా
ఎడతెగని ఒకేఒక నమ్మకపు చిరంతనావృతిలోనో
***
ఒకటికి ఒకటి
ఇలాంటి చోట
ఇప్పుడైనా ఎప్పుడైనా
గీతకావాల ఈవల వేలాడే తక్కెడ ముల్లే
తూకాల లెక్క తేలేవరకూ! ('కిటికీ పిట్ట' కవితా సంపుటి నుండి)
జాని తక్కెడశిల
గాజులు అవసరమా
ఎవరో ఇస్తే తీసుకోవడం ఏమిటి?
నేనే ఏరి కోరి తెచ్చుకున్నాను
మని కట్లపై ఘల్లు ఘల్లుమనేలా
ప్రకాశవంతమైన చీకట్లోకి నన్ను నేను నెట్టుకోడానికి
గాజు సంకెళ్ళను తెచ్చుకున్నాను.
ఆకాశం లాంటి నుదుటిని
ఎర్రని రంగుతో లాక్ డౌన్ చేసుకొని
శతాబ్దాలే గడిచిపోయింది
శరీర భాగాలను బ్లాక్ జోన్ లో ఉంచుకొని
సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయాను.
పొయ్యి గడ్డపై
నిన్నటి చద్దన్నంలా పులిసిపోయాను
ఇప్పుడు నాకు నట్టింట్లో కూడా చోటివ్వరూ
నిజమే…
నిన్న తీర్చిన ఆకలికి
నా విలువ ఎలా తెలుస్తుంది.
నాకు నేనే గోనే సంచిలో నిర్బంధించుకొని
ఎవరి గొంతులో నుండో నిరసన ధ్వనించ లేదనడం
రెక్కలు కట్టేసారనడం
కొన్నిసార్లు అమాయకత్వం మరికొన్ని సార్లు నాకు నేను చేసుకున్న మోసం.
ఎవరో నా రెప్పలు తెరిచి
వెలుగును పోస్తారనుకోవడం అవివేకం.
అవయవాలకు నేను వేసుకున్న బీగాలను తీసుకొనో
అవసరమైతే పగలగొట్టుకొనో ముందుకు సాగాలి.
ఇప్పుడు బొట్టు, గాజులు, కమ్మలు, ముక్కు పుడక, మెట్టలు, గజ్జలు ఇంకా ఎన్నో వదులుకొని నా శరీరం కోసం, నా హక్కుల కోసం నేనే పోరాడాలి.
ఆంగ్ల మూలం: రవీ౦ద్రనాద్ టాగూరు
తెలుగు అనువాదం: డా. పాలకుర్తి దినకర్
ఆ మంత్రోచ్ఛారణ వదిలేయ్
(రవీ౦ద్రనాద్ టాగూరు గీతాంజలిలోని 50వ కవిత కు అనువాదం)
ఆ మంత్రోచ్ఛారణ వదిలేయ్
ఆ కీర్తనలని మరియు ఆ పూసలని లెక్కించడాన్ని వదిలేయ్
తలుపులన్నీ మూసేసి, ఒంటరిగా ఈ దేవాలయపు చీకటి మూలల్లో
ఎవరి కోసం నీవు పూజలు చేస్తున్నావు?
నీ కళ్ళు తెరచి చూడు నీ దేవుడు నీ ముందు లేడు!
దేవుడు ఎక్కడున్నాడంటే
గట్టి నేలను దున్నుతున్న రైతు వద్ద
రోడ్డు వేసే పనివారు రాళ్ళు కొట్టే చోట
ఎండనకా వాననక పనిచేసే శ్రామికుల దగ్గరే అతనుంటాడు
అతని దుస్తులు పూర్తిగా దుమ్మూ ధూళితో నిండి పోయాయి
నీ మడి బట్టలు వదిలేసి
అతని వలెనే ధూళి ధూసరమైన నేల పైకి రా!
ముక్తి!
ముక్తి ఎక్కడ లభిస్తుందని నీవు భావిస్తున్నావు?
మన ప్రభువే, సంతోషంతో ఈ సృష్టి బoధాలను స్వీకరించాడు
అతను ఎల్లప్పుడూ మనతో జట్టు కట్టి ఉంటాడు
నీ ధ్యానం నుండి బయటకు రా ! ఆ పువ్వుల్ని, ఆ ధూప దీపాల్ని అలా పక్కన వుంచేయ్!
నీవు ధరించిన వస్త్రాలు చిరిగి పోతేనేం? మాసి పోతేనేం?
అతన్ని కలిసే క్రమంలో!
అతనితోపాటు శ్రమించు మరియు అతని నుదుటిపై చెమట చుక్కవలె ప్రకాశించు!
ఉమ .ఇయ్యుణ్ణి
సంధ్యా రాగం
ఈ నాటి సంధ్యా సమయాన ,
రహదారి నడిచే పాంథునికి
వినరావు వాహనాల ధ్వనులు
ఇదేమి వింత , ఈ విచిత్ర వాద్యాలు?
మనసు నవ్వింది , మనిషి అచ్చెరువొంద
ఒక్కక్షణపు నిశ్శబ్దములో , వినిపించు విపంచి గీతాలు
కావు మహతీ నినాదాలు , కానేకాదు వాణి వీణా నాదాలు
మనిషి మనుగడ గడబిడ రొదలలో
మరుగై పోయిన , పికముల ఎదల సొద లు
మలయ మారుతపు పలకరింపుకు
పులకరించిన పూరేకుల ,సుతిమెత్తని రెపరెపలు
మకరందపు మధురిమలకు
అలవోకగ తూగాడు మధుపముల కదలికలు
ఇవి చాలు ప్రభూ , ఈ జీవన స్రవంతి పులకింప
ఇవి కైమోడ్పులు , విధాత రచనలకు
ఇవి విస్మరించి , సాగిపోవు పయనాలు
ఆగిపోవుట కావా? సృష్టికర్తా, నీ చిత్రాలు??
చందలూరి నారాయణరావు
ఓ ఉత్తరం ఆశ...
మా వూరు ఉత్తరం రాసింది నాకు
ఒకసారి చూసి పొమ్మని.
కన్నీరు పెడుతున్న చెరువుకు
ఈత కొడుతూ
కలలో వచ్చానని....
జలతగ్గి గొంతులారుతున్న
బావులకు నా గొంతుతో
దప్పిక తీరాలని....
పాడుపడ్డ రచ్చబండ
ఒక్క పలకరింపుతో
పులకించాలన్నదని....
నేల అడుగుకు చేరిన
ఇంటి అరుగులు మనిషి స్పర్శ కోసం ఆశతో ఎదురుచూస్తున్నాయని,
ఒక్కరు తొంగి చూడక
చెదలు పడుతున్న గ్రంధాలయం
ఒంటరిగా ఉండలేననుంటుందని,
అందమైన జీవితాలను తయారుచేసిన
అక్షర కర్మాగారానికి అవసానదశకు వచ్చిందని,
కాంక్రీట్ కొత్త కళకు
ఆవిరౌతున్న చినుకును చూసి
వెక్కి వెక్కి ఏడుస్తున్న నేల తల్లి చూడాలన్నదని,
మా వూరు ఉత్తరం రాసింది నాకు
పదే పదే ప్రతి రాత్రి
గుర్తుకొచ్చిన ఊరి ఉత్తరానికి
ఓ బాధ్యతలా,
మా ఊరి నడిబొడ్డులో
పసివాడిలా పారాడి వస్తా......
కన్న తల్లిని పలకరించి వస్తా......