top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కవితా  మధురాలు

నిర్వహణ 

విన్నకోట రవి శంకర్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

Ajantha

సముద్రంలో సూర్యుడు 

~సైదాచారి

సంపాదకుల ప్రత్యేక ఎంపిక

 

పగలంతా కాయకష్టంలో ముక్కలయినా రెక్కల్ని

మళ్ళీ అతికించుకోనీ – నన్ను నిద్రపోనీ!

చెమట కనణికెలుగా రాలిపోయిన

ఎర్రెర్రని రక్త కణాల్ని

ఈ మహోజ్వల నిద్రలోంచి ఏరుకోనీ-

మండే కొలిమి వేడిలో

మాడిన ఈ దేహాన్ని మసకబారిన చూపుల్ని

మళ్ళీ వెలిగించుకోనీ-

 

నన్ను నిద్రపోనీ-

బొక్కెడు కూడెలాగూ నోటికందలేదు

కాస్త నిద్రయినా కాళ్ళ కందనీ-

అన్నం ముద్దలోంచి తెచ్చుకోవాల్సిన శక్తులు

నిద్రలోనయినా విచ్చుకోనీ-

 

ఇది సుదీర్ఘ సుషుప్తి కాదు

సుఖవాంఛా స్వప్న వీచిక కాదు

రేపటి పొయ్యిలోకి పుల్లల్ని ఏరుకోవటం

రేపటి నిర్మాణానికి పునాదుల్ని తవ్వుకోవడం

రేపటి జల సముద్భవం కోసం

పూడికలు తీసుకోవడం-

నువ్వు నోటిదగ్గర మెతుకునే కాదు

కాళ్ళ మీది నిద్రనూ కాజెయ్యగలవ్-

ఏ మెలకువ అంచుననో కూచుని

నా గుండెపై రేపటి కుంపటి రాజెయ్యగలవ్-

గండుబిల్లిలానో, ముళ్ళపందిలానో

భీకర స్వప్నమై

అర నిద్ర నాకు మిగల్చ గలవ్

నిద్రలోని శక్త్యాగారాల్ని కొల్లగొట్టగలవ్.

 

అందుకే నేను నిద్రపోతే-

సముద్రంలో సూర్యుడిలా నిద్రపోతాను

మబ్బు వెనక చంద్రుడిలా నిద్రపోతాను

అడవి గర్భంలా నిద్రపోతాను

అగ్నిపర్వతంలా  నిద్రపోతాను-

 

(ఇటీవలే అకాల మరణం చెందిన కవిమిత్రుడు ఆయిల సైదాచారి స్మృతిలో...

ఆయన మొదటి సంకలనం “ఆమె నా బొమ్మ” నుండి)

***

Poondla Mahesh

నేను నా కవిత్వం

~ముకుంద రామారావు

నాకో వాయిద్యాన్ని


స్వరాన్నీ


నేనే అయి


సంతృప్తి నొసగేవరకూ


పాడటానికి ప్రయత్నిస్తున్నట్టు


నా కవితలు


కవిత్వ నదిమీద నమ్మకంతో


ఏదో ఒక ఒడ్డుకు


చేరకుండా పోతానా అని


ఆశతోను నమ్మకంతోను


నాదైన భాష అనే పడవలో


పయనిస్తూ


నేను. 

***

bottom of page