MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవితా మధురాలు
-నాగరాజు రామస్వామి
క్రాంతి ధార
జనాగ్రహం నింగిని తాకిందంటే
తాకదూ మరి?
నింపాదిగా పారే ఏరుకు
అడ్డంగా ఆనకట్ట పడింది.
తోక తొక్కితే
పసిరిక పాము సైతం
బుసకొడుతుంది.
ఎన్ని టెక్టానిక్ లు ఢీకొన్నాయో
పుడమి కడుపులో;
శిరసెత్తింది ఎవరెస్ట్ శిఖరం.
అడవి గుండెల్లో దావాగ్నులు
సాగర గర్భంలో బడబానలాలు
మంచు కొండల కింద
అగ్నిపర్వతాలు ఆవులిస్తుంటవి;
అవి ఎప్పుడైనా నిదురలేవొచ్చు.
జన సామాన్యం నివురు గప్పిన నిప్పు
ఎప్పుడైనా భగ్గుమనొచ్చు,
తెగేదాక లాగకు;
ఒంటిపురి దారం ఉరితాడుగా మారొచ్చు.
ఒట్టి అడవి పూలని నిరసించకు
అవి మండే గోగుపూల జండాలై ఎగురొచ్చు,
అరణ్యాన్నే కాల్చేయొచ్చు.
-కంచరాన భుజంగరావు
చెట్టూ...పిట్ట..!
నేల జారిన మబ్బుపొదలా
ఒళ్ళు విరుచుకుంది నిద్రగన్నేరు చెట్టు
తెల్లవారిందోయ్ అని చప్పుడు చేస్తూ
చల్లని గాలి తరకొకటి అలలా తాకింది
నిద్రమొహంతో ఉన్న నింగిలోకి
పొద్దు తూరేలా ఉన్న కొమ్మమీద
కళ్లు పులుముకుంటూ కొన్ని ముదురాకులూ
ఆవలిస్తూ కొన్ని చిగురాకులూ ఊగాయి
మెలకువ వాకిట్లో గలగల ముగ్గులు పెడుతున్న
పడుచు వాగును చూసి కళ్ళప్పగించేశాడు
కిరణ జులపాల కుర్ర సూర్యుడు!
బారెడు దూరం ఉరికేసరికి
అనియంత్రితంగా
కొనల నుండి జారుతూ మంచు చుక్కలు...
ఎరుపెక్కుతూ పచ్చబుగ్గల గడ్డి పెదాలు!
కిచకిచ రెక్కల పికిలి ఒకటి
ఎటునుండి ఎగిరొచ్చిందో?
చేయి చాచిన ఆకాశంలా ఉన్న
పొడవాటి కొమ్మమీద చప్పున వాలింది
తడవ తడవకూ గుండె భాగంలో
ముక్కుదూర్చి ఈకల్ని సవరిస్తూ -
"పిచికా! ఇదిగో ఇక్కడే
నువ్వు గూడు కట్టుకోవాల్సింది ఇక్కడే!"
అని ఎదుటి కొమ్మ మీది ప్రియునికి
మూగభాషలో అంతరంగం చూపుతోంది
పిట్టల ప్రేమ కథలెన్నో చూసిన చెట్టు
ఈరోజెందుకో స్వగతంలోకి జారుకుంది
మానవహారంలో చేతులు కలిపినట్టు
చుట్టున్న చెట్ల కొమ్మలు తన కొమ్మల్ని
పెనవేసుకున్న హరిత రుతువును గుర్తుచేసుకుంది
తన ఎండు కొమ్మలతో ఎంతని దేవులాడినా
చుట్టూరా పచ్చని ఆకుల శ్వాసల్లేవు
పలకరించే కొమ్మల ఊసుల్లేవు!
గుండె నొక్కుతుంటే పెదాలు బిగబట్టి
కళ్లు మూసుకుంది చెట్టు!
సైలెంట్ మోటార్ రంపం కోతకు నేలకొరిగి
మెంటుకి తరలిపోయిన మిత్రుల శవాలు
కళ్లముందు మెదిలాయి!
గడ్డు కాలమొస్తే తనకూ గొడ్డలి వేటు తప్పదేమో!
గుండెను నిమురుకుంటూ చెట్టు
లోగొంతులో పికిలితో అందికదా -
"పికిలీ! పికిలీ! నాకో సాయం చేస్తావా?
మీవాల్లందరినీ పిలుచుకొచ్చి
నా పళ్ళన్నీ ఏరి విత్తులన్నీ నోట పట్టి
బీడంతా బీలంతా చల్లుకురావాలి
నా చుట్టూ నేలంతా మళ్లీ తోటగా మలచాలి
రంపం గొడ్డలి చొరబడలేని
చెట్ల స్వర్గాన్ని నిర్మించాలి!"
సరేనన్న పికిలి
సైగ చేసి రమ్మంది చెలికాణ్ణి
నిండారా విత్తులున్న చెరో పండు నోటపట్టి
మోడు తీరాల కన్నీటి చాలుల్లో
విత్తుల్ని జారవిడుస్తూ ముందుకుసాగాయి
ఒక్క పిలుపుతో గుంపులు గుంపులు పక్షులొచ్చి
రెక్కలమబ్బుల్లా విత్తుచినుకుల్ని వర్షించాయి
రంపపు రుతువును బొందపెట్టి
నేలంతా చివురాకుల వెన్నెల మొలిచింది
పచ్చని పరవళ్ళతో అడవి వెలిసింది
పిట్టల జంటలకు విడిదిగా మారింది
పిట్టగూటిలో చెట్టు నిబ్బరంగా నిద్రపోయింది!
*****
- వంశీకృష్ణ
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
త్రిషాదం
ఒక రాత్రివేళ
ఎవరో మనసులో నుండి వెళ్ళిపోయిన చప్పుడు
పాంచ భౌతిక దేహం మీద కప్పుకున్న
కలల వస్త్రాలు జారిపడిన సవ్వడి
జీవితం ఒక కల
మృత్యువు కరకు వాస్తవం
కోకిల ప్రవేశించే కాలంలో
నిండు గ్రీష్మం పులకరింత
మండు వేసవిలో వర్షబీభత్సం
శీతల తరుచ్చాయ కనుమరుగవకుండానే
శిశిరం రానే వచ్చింది.
ఎప్పటికీ అనువదించలేని
పరభాషా పదంలా జీవితం
ఎప్పటికీ కవిత్వంలో ఒదగని
ఇష్టపడిన పదచిత్రంలా... ప్రేమ భాస్వరం.
ఈ ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుందా?
ఈ ప్రేమ మృత్యువుని జయిస్తుందా?
సౌందర్యం ఇటువైపు నుండి బాగోలేనప్పుడు
అటువైపు నుండి వీక్షించమన్న
గడుసుతనం- మృత్యువు.
వృద్ధాప్య జీవితం బావోలేదు
బాల్యాన్ని అరువు యివ్వమని వేడుకున్న
అమాయకత్వం జీవితం.
సముద్రంలో ఒంటరి ఓడ
తలవంచుకుని దిగులుగా వెళ్ళిపోతున్నప్పుడు
తీరం కార్చిన కన్నీటి వెలుతురు.. ప్రేమ.
ఈ లిప్తను యిప్పుడే జీవించు
మరుక్షణమే.. మృత్యువు.
("ఒక దేశం రెండు పద ప్రయోగాలు" కవితా సంపుటి నుండి)
మూలం - జిబాననంద దాస్
అనువాదం - నాగరాజు రామస్వామి
వనలతా సేన్
సహస్రాబ్దాలు సంచరించాను
అంధ నిశీథినీ పృథివీ పథాలలో;
సింహళ జలాలనుండి మలయా సాగరాల దాకా.
ఒంటరిగా తిరిగాను
అశోకుని, బింబిసారుని నాటి విదర్భనగర
చిరంతన చీకటి జగత్తులలో.
నురుగులుమిసే జీవన సంద్రాలు చుట్టుముట్టిన
అలసిన ప్రాణాన్ని నేను;
నాకు శాంతిని ప్రసాదించింది
నటోర్ నగర నివాసి వనలతా సేన్.
ఆమె చెదిరిన కురులు
అలనాటి విదిశానగర చిరుచీకట్లు,
ఆమె మోము శ్రావస్తీపుర శిల్పశోభ.
నడి సంద్రంలో చుక్కాని విరిగి,
కొట్టుకుపోతున్న నౌకాభగ్న నావికుడు
హటాత్తుగా సినెమన్ హరిత దీవిని కాంచినట్టు
నలనల్లని ఇరులు పొరల గుండా
నేను ఆమెను చూచాను.
ఆమె,
ఆ నటోర్ నగర నివాసి వనలతా సేన్ అంది
పక్షిగూడు వంటి కనుబొమ్మలను ఎగిరేస్తూ
ఇన్నాళ్ళు నీవు ఎక్కడికెళ్ళావని.
దినాంతాన ....
స్తబ్ధ శిశిర తుహిన తమస్సులా
కమ్ముకొస్తున్నది కడపొద్దు,
తన గరుత్తులకు అంటిన రవిరశ్మీ గంధాన్ని
దులిపేసుకుంటున్నది గరుడపక్షి,
పాలిపోయిన నేల గాలికి
మెరుపులద్దు తున్నవి మిణుగురులు,
సద్దు మణగుతున్నవి నదులు,
గూళ్ళకు చేరుకుంటున్నవి సందె పక్షులు,
స్తంభించింది సమస్త దినజీవన వ్యవహారం,
చివరకు అంతా చిమ్మచీకటి;
నా చుట్టూ శుద్ధ నిబిడాంధకారం,
నా కట్టెదుట
నటోర్ నగర నివాసి వనలతా సేన్!
* Banalata Sen of Jibanananda Das- Translated by Clinton B. Seely
*****