MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవితా మధురాలు
నాగరాజు రామస్వామి
సంధిగీత - మానుష గీతం
అనాది బృహద్విస్ఫోటనంలో చిందిన ఆదినాదం
అనంత విశ్వాంతరాళంలో అవిరామంగా విస్తరిస్తున్నది;
యుగసంధులను అతిక్రమిస్తూ చిరంతన జీవనరేఖ!
కాల పరిణామంలో
నేను తొలి జీవధాతువునై పారుతున్నాను;
నా రక్త నాళాలలో సనాతన జన్యు కణాలు.
అనంత మహాశూన్యం నిండిన ఆకాశ అసీమలో
నిబిడాంధకార నిశ్శబ్ద ఖగోళ డోలలో
నా ప్రాణగీతం ఊగిసలాడుతున్నది.
కాలం సంధి గీతలను గీస్తున్నది;
నేను సరిహద్దులను దాటుతున్నాను,
యుగాలు తమోకుడ్యాలను మొలిపిస్తున్నవి;
నేను తిమిర తీరాలను ఈదుతున్నాను.
సృష్టి అనివార్య పరివర్తనాలను సృష్టిస్తున్నది,
మార్పుకూ మార్పుకూ మధ్య
మరణ మృదంగాన్ని మ్రోగిస్తున్నది కాలం;
నేను ఒక్కొక్క మృత్యుఘోషను
సరికొత్త జీవనగీత గా పాడుకుంటూ
మెట్లు మెట్లుగా అధిరోహిస్తున్నాను.
నిత్యం అగణిత అవరోధాలను అధిగమిస్తూ
నిరంతరంగా సాగుతున్నది నా అనంత యాత్ర.
సంధి గీతల మీద గంతులేస్తూ నేను!
ప్రతి అడుగున ప్రతిధ్వనిస్తూ ప్రబోధ సంధిగీత!
నేను అజరామర ఆది మానవున్ని!
అనాది అనుస్యూత జీవన చైతన్యాన్ని!
నేను నిర్మరణ ఆదిభౌతిక మానుష గీతాన్ని!
ముకుంద రామారావు
ఎక్కడైనా
అక్కడి చివరి కిరణాలకు వీడ్కోలిచ్చి
ఇక్కడి మొదటి కిరణాల్ని అహ్వానించాలని వచ్చాం
చలికాలపు ఎండ
ఎండాకాలపు వర్షం
వర్షాకాలపు తెరిపి
రాత్రికోసం పగలు
పగటి కోసం రాత్రి
ఎక్కడైనా ఎదురు చూస్తూనే ఉన్నాయి
ఎవరూ చూసినా చూడకపోయినా,
రెప్పలు మూయకుండా ఆకాశాన్నీ, అనంతాన్నీ
చూస్తూనే ఉంది
తెరిచి ఉంచేసిన కిటికీ
ఎవరున్నా లేకున్నా
వెలుగుకు ముందు చీకటి
చీకటికి ముందు వెలుగు
ధ్వంసం చేసుకుంటూనే ఉన్నాయి
కలలకు వాస్తవం ముందున్నా వెనకున్నా
కలలూ వాస్తవాన్ని ధ్వంసం చేస్తూనే ఉన్నాయి
పద్మావతి రాంభక్త
విశ్రాంతివాక్యాన్నై
కురిసీకురిసీ మబ్బు
వెచ్చని ఆకాశం చాటున
విశ్రాంతి తీసుకుంటుంది
ఎండ పాదాలతో
రోజంతా పరుగులు తీసిన సూర్యుడు
రేయి ఇంట్లో నిదురిస్తాడు
వెన్నెలై కాసి
అరిగిన నిండుజాబిలి
అమావాస్యకు నెలవంకముక్కై పోయి
పున్నమికి మళ్ళీ పుంజుకుంటుంది
పూసీ పూసీ విసిగిన కొమ్మ
నాలుగు రోజులు మౌనంగా ఉంటుంది
అనంత సౌందర్యాన్ని
తనివితీరా తాగాక సైతం
ఆ పుటలను
తలచుకుని మురియడానికి
కాస్త విశ్రాంతి కావాలి
వింత మలుపుల మధ్య
తిరిగి తరిగిన పాదాలకు
ఇప్పటి వరకు
కడుపు నిండుగా తిన్న జీవితాన్ని
నెమరు వేసుకోవడానికి
కంట్లో పడ్డ నలకలను
తీసుకోవడానికి
గుండెకడవ నిండా
పట్టుకున్న కన్నీళ్ళను
పారబోయడానికి
హృదయం నిండా పొంగిపొరలుతున్న
అనుభవాలను మడతపెట్టి
అలమరలో సర్దుకోవడానికి
అనుభూతుల సుగంధాలను మరోమారు
మనసు మునివేళ్ళతో అద్దుకోవడానికి
బ్రతుకుఅలసటవస్త్రాన్ని వెలుగులో ఆరబెట్టుకోడానికి
కొంచెం విశ్రాంతి కావాలి
బొట్టుబొట్టుగా ప్రాణశక్తిని
కూడగట్టుకోవడానికి
అద్ధం ఎదుట నిలబడి
మాసిపోయిన ముఖాన్ని
సరిచేసుకోవడానికి
కోల్పోయిన మనలను
వెతుక్కుని తిరిగి తెచ్చుకోవడానికి
ఉన్నట్టుండి నింగిలో చటుక్కున మెరిసే
చిటికెడు రంగుల క్షణాలతో
పొదిగిన ఇంద్రధనుస్సులాంటి
విశ్రాంతి కావాలి
ఒక విశ్రాంతివాక్యాన్నై
కొన్ని కవితావాక్యాల మధ్య
తలుపులన్నీ మూసుకోవాలి
మళ్ళీ ఎప్పుడో
తళతళలాడే పచ్చనాకులా
ఒక అందమైన ఉదయమై తెల్లవారాలి
బహుశా మీరు కూడా-
సాంబమూర్తి లండ
బతుకు వాసన వేయని చోట
తల్లి వేరును తెంచేసుకుని
చాలా దూరమే వచ్చేసినట్టున్నాం
వెనుదిరిగి వెళ్లలేనంత దూరం
చీకట్లోకి జారిపోయిన చూపులతో
మొండివైన కాళ్ళతో
అక్కడక్కడే సుడులు తిరిగే నడకలతో
ఏదో అంచు వెంట నడిచిపోతుంటాం
ఏదీ
బతుకు వాసన వేయని చోట
ఏదీ
ఒక దానికొకటి అతుక్కుని
మనిషిని పేనని చోట
జీవితంపంట ఎలా పండుతుంది?
పులిసిన దేహాలతో
రోజులు
కాలం వెంట పరుగెడుతుంటాయి
పాక్కుంటూ వచ్చి
పాదాలను చుట్టేసే పసిపాపల్లాంటి
పైరు స్పర్శలలోనో
చేతుల్లో లాటరీ టిక్కెట్లు పట్టుకుని
కదలాడే నల్ల మబ్బుల గడపల్లోనో
ఊరి మొదట్లోనే
తడారిపోయిన కళ్ళతో ఎదురయ్యే
పెద్ద చెరువు గట్టునో
ఎక్కడో చోట
గుండెను పారేసుకుని
ఎడారిలో
ఎటు ఒయాసిస్సుల వాసనేస్తే అటు
పరుగెత్తి పరుగెత్తి అలసిపోతుంటాం
తెలుగు వెంకటేష్
పిట్టలవేళ
ఆచెట్టు కింద
పద్యం వాసన వేస్తోంది
పరదేశి కవికి తరువు
ఆతిథ్యం ఇచ్చినట్టుంది
బహుళ ప్రచారంలో ఉన్న దేశంలో
పద్యం జాడ లేదు
కవి కాందిశికుడయ్యాడు
కవిత్వం జీవించే తావు కొరకు
ఆగిపోయి నిల్చున్నావు
అలాగే ఉండిపోకు
ఒఠ్ఠి పోతావు
రెండు పద్యాల్ని సాయమడుగు
మళ్ళీ కవి జన్మ నీకు కొత్త
చూరుకు కంకులు వేలాడుతోన్నాయి
పిట్టలు వచ్చేవేళయింది
ఇక ఆలస్యమెందుకు
పద్యమయిపో...
వరద ఉధృతిలా
భావప్రకంపన
నీలో అనుభూతి వానకు
మొలకెత్తె పచ్చి మట్టివాసన పద్యం.
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
అయినా... ఆగదు నడక
ఏదీ శాశ్వతం కాదు
నిజమే!
తాత్కాలికమని తెలిసినా
అక్కడే ఆగిపోలేం మరి
ముందుకు సాగకుండా
తేనెలు కురిసే వానలు
వెన్నెల దారిలో నావలు
ఆకాశాన్నీ విశ్వంభరనూ
ఏకం చేయాలనే మనిషి తపన
సృష్టిలో నిరంతరం
అడుగు అడుగూ నిత్య కృషే
మనసు పూసే పూల గంధం
మనిషి అక్షరాల చెట్టులో గ్రంధం
విసిరే గాలిలో ప్రాణం దారాలూ
అన్నీ శాశ్వతాలేనని నమ్మకంలో
మనం సాగుతాం నడక ఆపకుండా
పొలం అలికిన మొలకలో
మడినారు పారె నీరులా
మట్టిలో కలిసిన చెమట తడిలా
మనిషి అల్లుకున్న ఆశలు
సంతోష సంగీతాల వెల్లువలే
బతుకంటే ఓ చెట్టు ఆకుల లయ
వేళ్లన్నీ నేల పొత్తిళ్ళు పాడిన గేయం
రక్త ప్రవాహాల నదులు
కొమ్మల్లో కోటి సరదాలూ
రెమ్మల్లో నాటిన పూల అందాలూ
ఒకింత నీడనిచ్చే నిరుపేద గుడిలా
వూరు ఉషిక వాగు సెలయేరులా తడిసే
తడిసిన వొళ్ళంతా ఎండే ఎండలా
సుందర స్వప్నాల వొడిలో బతుకు
ఎన్ని సవాళ్లున్నా నడక ఆగదు శ్వాసలా
నిరాశల నేర్పిన ఆశల హరివిల్లు
మనిషి మనసు తీర్చిన అందాల పొదరిల్లు
బతుకు బతికేందుకు ఉపకారమై పరిమళించే
ఊపిరి ఆడినంత దాకా ఒలకని నడక
విలువల జీవితాన్ని పంచాలి ప్రపంచ నాడిలో
నిలవాలి మానవీయ దారులు శాశ్వతమై
నడకంటే అనంతమైన స్వేదం
బతుకేమో ప్రమోదమై వెలిగే వ్యవసాయం
బారు శ్రీనివాసరావు
నాలో నేనే
పడగ్గదిలో కొంత , పెరట్లో కొంత
పేపరులో కొంత, టివిలో మరికొంత
పక్కింట్లో కొంత, పార్కులో కొంత
జాగ్రత్తగా ముక్కలు చేసి జారవిడిచినా
ఒంటరితనం ప్రతిరోజూ నాలో మిగిలే ఉంటుంది
పరిచయమున్న ముఖం కోసం కళ్ళు పరితపిస్తూనే ఉంటాయి
ఉపోద్ఘాతం లేని మాటకు మనసు ఉబుకులాడుతుంటుంది
గోడ మీది పాత ఫోటొ అకస్మాత్తుగా మసకబారిపోతుంది
నిట్టూర్పుల శబ్దం గాలి హోరులా తోస్తుంది
నిశ్శబ్దం ఇల్లంతా ఆక్రమించుకుంటుంది
నా చుట్టూ నేను గీసుకున్న వృత్తం
క్రమక్రమంగా కుంచించుకు పోతోంది
పర్యవసానం అర్ధమయ్యే గడియకు
పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోతుంది
నన్ను నేను మరచినపుడు కదా ఏకాంతం
నాలో జ్యోతి వెలిగితే అప్పుడది ఏకాంతం