MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవితా మధురాలు
రామా చంద్రమౌళి
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
తపస్సు
( "తపస్సు" కవితా సంపుటి నుండి )
జ్ఞానానికి రూపం లేదు. గాలి వలె
ప్రవహించడం జీవ లక్షణమైనపుడు
స్థితి స్థల సమయ కాలాదులు అప్రస్తుతాలు
అగ్ని ఎప్పుడైనా, ఎక్కడైనా దహిస్తుంది కదా
జ్ఞానమూ, కళా అంతే
దహిస్తూ, వెలిగిస్తూ, దీప్తిస్తూ, లీనమైపోతూంటుంది-
అది సంగీతమో, సాహిత్యమో , యుద్ధక్రీడో
శిష్యుడు తాదాత్మ్యతతో భూమై విస్తరించాలి విస్తృతమై .. ఎదుట
అప్పుడు ముఖం రెక్కలు విప్పిన 'ఆంటెనా' ఔతుంది
బీజాలు బీజాలుగా, సంకేతాలుగా .. జ్ఞాన వినిమయం
ఎప్పుడూ భూమిపై కురిసే చిరుజల్లుల వానే
తడుస్తున్నపుడు, రాగాలు హృదయాన్ని తడుతున్నపుడు
శరీరంలోనుండి.. గుంపులు గుంపులుగా పక్షులు సమూహాలై ఎగిరిపోతూ
లోపలంతా ఖాళీ
చినుకులు చినుకులుగా నిండిపోవాలిక మనిషి -
అలంకారాలుండవు.. శిష్యునికీ గురువుకూ
ఒక ఆత్మా.. ఒక దేహం.. ఇద్దరిలో రవ్వంత అగ్ని ఉంటే చాలు
కొండపల్లి నీహారిణి
అర్ర మందారాలు
ఔను! మీరు వింటున్నది నిజమే!!అవి,అర్రమందారాలు!బంధించకండి!!
ఆమెను‘పని’ఖానాలో,అహం తాళ్ళ తో
బంధించకండి.
రేపటి మీ ప్రశ్నలన్నింటికి తలెత్తే సమాధానమౌతుంది.
బంధిస్తే గాలినో, వెలుతురునో బంధించండి.
బంధిస్తే, సంద్రపు గంభీరాన్నో,
నదీమతల్లి పరుగులనో, జలపాత హోరునో,
ఎడారి ఇసుక వేటునో బంధించండి.
ఆమె అలుపెరుగని బ్రతుకు ఆరాటాల కావ్యంలో
వర్ణించని ఘట్టాలనన్నీ ఏరుకొని తెచ్చుకోండి.
మల్లెలో,చేమంతులో,గులాబీలో ,మందారాల వన్నెలో
పేరులేని ఆప్యాయతల పరిమళాల గంధాలో
తెచ్చుకోండి! ఏమరుపాటులేక ఏరి తెచ్చుకోండి !!
సుకుమార హృదయంలో కరుకు ముల్లు గుచ్చడం , ఇనుప గుండెతో ,ఇంగితపు లేమితో ఊరేగడం ,
ఇంధనం లేని బండిని కసితో నడపడం
నీటి పుష్పానికి వేటు గాలం వేయడం
మీకు బాగా తెలిసిన విద్యలు.
కోసి తెచ్చుకోండి ఆమె నమ్మకాల్ని, మీవైన అపనమ్మకాల్ని.
అనుమానాల బుట్టల్లోంచి , అబద్ధాల సంచుల్లోంచి , మీరిచ్చే
పిడికెడు అవమానపు బూడిద తెచ్చుకొని , భరణిలో దాచుకొనే ఆమె , పెట్టని బొట్టవుతుంది.
నీ పుట్టుకను తర్కించుకో! ఆమె మరణాన్ని గురించికాదు !!
ఈ నేల కనే కలలో అందమైన కారణాల ఇంద్రధనుస్సు ఆమె.
గుండె భద్రపేటికలో పెట్టిన వర్ణ సముదాయమై ,
నీ జీవన యవనికపై పలు రంగులు పరిచే వర్ణిక ఆమె .
ఉషస్సు మెరుపులు , ధ్వనించే గాజులు
వాకిలికీ, చీపురుకూ వాహకమంటాయి.
నవ్వుల ఖజానా కొల్లగొట్టిన
నిశీధి విషాదాలన్నీ కళ్ళాపిలో చేరుతాయి.
అంతరంగాల అలుకుపిడచతో ఇల్లంతా తుడుస్తుంది.
భుక్తి మార్గమో , భక్తి మార్గమో
గడప చుక్కల్లా ఆమెకు స్థిరమైనవేమీగావు.
ఉదయాస్తమయాలు ఈ ఉదరభాజనుల నిత్యసేవలో
కొత్తరుచుల పోపులు పలికించేందుకు
కూరగాయలనుండి ఊరగాయలవరకు వరమౌతుంది.
గుండ్రని రొట్టె ముఖమై కంచానికతుక్కుంటుంది.
జ్ఞాన బురుజునెక్కడానికి అంట్లు తోమి ,
శుభ్రమౌతుంది.
అలసటెరుగని నీ స్వేదపు కంపుకు
ఉతికిన ఉడుపులు పొదవుకొనే తీగ అవుతుంది.
స్వీయ నియంత్రణ కరుణలేని సమయాన
వంటగదో, పంటగదో మంటలు పుట్టించకుంటే ,
ఈ అర్ర మందారాలు, ఎర్ర మందారాలై
విరబూస్తాయి!!
( అర్ర = గది; ఉదరభాజనులు= పాత్ర
వంటి పొట్టతో ఉండేవాడు)
( కరోనా లాక్ డౌన్ సమయాన గృహ హింసలు పెరిగాయన్న వార్తను చదివి )
తమ్మినేని యదుకుల భూషణ్
ఖాళీ గది
ఇల్లు ఖాళీ చేసి
వెళ్లి పోయే ముందు
పాతకాలం నాటి మేజా సొరుగులో
నీ తాళాల కోసం దేవులాడుతుంటే
ఏనాడో ప్రియురాలు రాసిన ఉత్తరం
కనబడి , చదవాలని ఆత్రపడతావు
కానీ, కళ్ళ జోడు కనిపించదు.
“బూజులు దులిపే వాళ్ళు వచ్చారు”
ఆవకాయ జాడీని బరబరా జరుపుతూ
అవసరిస్తుంది ఆవిడ
మూలన దొరికిన బంతి
ఆనందంగా గంతులేసే పిల్లలు
బార్లా తెరిచిన కిటికీల గుండా
పడే ఎండలో- వెలిగిపోతుంది.
శిస్టా వేంకటేశ్వర రావు
కోనసీమ
మా కోనసీమ కథలండీ, కొబ్బరి తీగలమయమండీ
గోదావరి గలగలండీ, వరిపైరుల సిరులండి
ఆ అందాలు చూడాలంటే మరి రండి రండి రండి
అనుబంధాలు మీ నీడనంటే, నమ్మాలంతేనండి
కోనసీమ కొబ్బరిబోండం, కండ్రిగ పాలకోవం
ఆత్రేయపురం పూతరేకులు , రావులపాలెం బిర్యానీ కుండలు
చూడాలంటె ఆ రుచులన్నీ, మధురంగా ఉండాలంటే స్మృతులన్నీ
రావాలి మా సీమ
కోనసీమ కొబ్బరిసీమ కవితలసీమండీ
అందమయిన అరటి తోటలు, పచ్చనయిన పసుపు తోటలు
కళకళలాడే కంద తోటలు, తేనెలూరించు చెరుకు తోటలు
కడియం కడియపులంక కనరండి రారండి
అంతర్వేది లో సముద్ర స్నానం
అప్పన్నపల్లిలో అన్న ప్రసాదం
ఓడలరేవులో సాగరతీరం
సముద్రమొడ్దున ఈల తోటలు
కనువిందు చేసే మీ కళ్ళు సంకెళ్లు
కల కాదు నిజమే మరి అంత అంత0త
హద్దే లేని ఆనందం పొద్దే పోనీ ఆకాశం.
మద్దుకూరి విజయచంద్రహాస్
పాట వెలదులు
(పాట గురించిన పాట మకుటపు స్వేఛ్చాటవెలదులు)
పాట విన్న చాలు పరవశమ్ము కలుగు
పాట మనసు తోట పసిడి పూవు
పాట లేని ఇంట పండుగలే లేవు
పాట సిరులపేట బతుకు బాట
పాట కడుపు నింపు పరమాన్నములకన్న
పాట మిన్న విరుల పాన్పు కన్న
పాట జ్ఞప్తి సేయు ప్రణయంపు మధురిమ
పాట సిరులపేట బతుకు బాట
పాట తేలును సెలయేటి గలగలల
పాట వీను నించు ప్రకృతి మాత
పాట పలుకరించు పక్షి కలకలల
పాట సిరులపేట బతుకు బాట
పాట కడలి పెను తుఫానుఝంఝ ధ్వనించు
పాట స్ఫురణ తెచ్చు బండి నడక
పాట వీచి పోవు భ్రమరమ్ము మశకమ్ము
పాట సిరులపేట బతుకు బాట
పాట విన్న ఆవు పాలు బాగా యిచ్చు
పాట విన్న యంత పాము ఆడు
పాట మెచ్చు నెన్నొ సాటి జీవులిలను
పాట సిరులపేట బతుకు బాట
పాట సేయగలదు ప్రతి రాత్రి ఆమని
పాట తేలియాడు పంట చేను
పాట మోసి తెచ్చు పరువంపు విరిగాలి
పాట సిరులపేట బతుకు బాట
పాట జనన మందు పాగ్దిశ వీణలో
పాట గుర్తు సేయు ప్రమిద వెలుగు
పాట దాచి కాచు ప్రాచీన గాధలు
పాట సిరులపేట బతుకు బాట
పాట నర్తకాళి పదములు కదిలించు
పాట ఇనుమడించు నాటకమ్ము
పాట వరుస లోన పద్యమ్ము భాసిల్లు
పాట సిరులపేట బతుకు బాట.