MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు
తరమా.....?
~మస్తాన్ అల్లూరి
నీ అడుగుజాడ అగాథపు లోతు కొలవడమెలా ...?
అతివ అనే పదార్థాన్ని అర్థం చేసుకోవడమెలా ..?
ప్రేమ అనే సామ్రాజ్యాన్ని జయించడ మెలా ..?
శిఖండి సాయంతో అర్జునుడు
శ్రీ కృష్ణుడి సాయంతో కుచేలుడు
సాంత్వన పొందినట్టుగా
నేను ఏ శిఖండి,కుచేలుర సాయం తీసుకోను....?
నువ్వెదురొచ్చి నప్పుడల్లా ఈ విధమైన ప్రశ్నలు
నా రోమాలను నిక్కపొరుచుకునేలా చేస్తున్నాయి.
నీలో మంగళకరమైన ఆలోచనలున్నాయో
నిలువెల్లా ముంచే ఏ మతలబులున్నాయో
అని తలుచుకున్నప్పుడల్లా.....?
వంటి మీద చెమట.....
గుండెల్లో మంట .....
నీవు విసిరే గాలులకు
నా వంటిపై చెమట పోవునేమో గానీ
గుండెల్లో మంట ఏ విధంగా పోతుంది....?
వర్షించే కళ్ళు...
~డా. జడా సుబ్బారావు
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన
కవితలపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన కవిత.
మాతృత్వం మురిసిపోయేలా
పుడమి పులకించేలా
భూమ్మీదపడినప్పుడు
కష్టాన్ని దిగమింగి
కారుణ్యాన్ని వెదజల్లుతూ
కళ్ళు... ఆనందబాష్పాలవుతాయి
తడబడు అడుగులతో పడిలేచే
పాదనర్తన చూసినప్పుడల్లా
ఎన్నేళ్లు గడిస్తేనేం...
పసితనపు ఆనవాళ్లన్నీ
కంటిచివరి చెమ్మతో మమేకమవుతుంటాయి
ఉన్నఊరినో కన్నవారినో తల్చుకుని
గుండె బరువెక్కిన ప్రతిసారీ
ఓదార్పునందిస్తూనో ఓ దారి చూపిస్తూనో
కళ్ళు... నీటిచెలమల్లా రూపుదాల్చుతుంటాయి
పల్లెకు పరిగెత్తాలనో
తల్లి ఒడిలో తలవాల్చాలనో
పోగొట్టుకున్నవి గుర్తొచ్చినప్పుడల్లా
మొదలు నరికిన చెట్టులా
నిలువెత్తు దేహం
నిలువునా నీరై ప్రవహిస్తుంటుంది
అనిపిస్తూ ఉంటుంది..
రాల్చిన ప్రతి కన్నీటి బొట్టూ
జీవితం నేర్పిన పాఠాలకి తొలిమెట్టని..!
మనిషి చుట్టూ అల్లుకున్న
జ్ఞాపకాలకు ఆయువుపట్టని...!
వర్షాల్లో కాలేజి
~ఇస్మాయిల్
కలత నిద్దరోయే చెరువుల
కళ్ళు తెరిపించి,
చేతులెత్తేసిన చెట్లకు
కర్తవ్యం బోధించే వాన
మా కాలేజికి రాత్రంతా
మహోపన్యాసం దంచినట్టుంది.
పొద్దున వెళ్ళి
చూద్దును కదా
కాలేజి పునాదుల్నించి
వేలాడుతున్నాయి నీడలు
మెరిసే నీళ్ళలో
మెల్లిగా కదుల్తో.
కాలేజి నిజస్వరూపం
కళ్ళెదుట నిలిచినట్టుంది :
పంచరంగుల దారాలు వేలాడుతో
మగ్గంపై సగం నేసిన తివాచీలా ఉంది.
నాయుడుగారే కాంతులతో
నేయాలనుకున్నారో కాలేజిని
ఇప్పుడు బోధపడింది నాకు.
బిగుసుకున్న మన హృదయాల్లోకి
గగనపు లోతులు దింపాలనీ,
తెరిచికొన్న పసికళ్ళల్లో
తెలిమబ్బులు నడిపించాలనీ.
కుంటినీడ వంటి కుర్రతనానికి
నీటిరెక్కల్ని అతికించాలనీ,
నాయుడుగారనుకునుంటారు.
నాయుడు గారి రంగుల తివాచీ
నేత సగంలోనే ఆగింది.
ఇవాళ కాలేజికి నిండా
ఎగజిమ్మిన కాంతులు
ఇంకిపోయి, చివరికి
ఏ మూల గుంటలోనో
తారకం గారి కళ్ళల్లో
నాయుడు గారి జ్ఞాపకంలా
తళుక్కుమంటాయి కావును.
***
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
ఏమో
~చాగంటి తులసి
నీడ
పిలుస్తుంది
పరిగెట్టు పట్టుకో
అంటుంది.
నీడల వెంట
పరిగెట్టకే
అడ్డుకుంది అమ్మమ్మ
చిన్నతనంలో.
బాగుంటాయి మరి
నీడలు
వాస్తవం ఏమూల
వాటి ఎదట!
చీకట్ల నీడలు
వెన్నెల నీడలు
వెంట పడుతూనే ఉన్నాయి
పట్టు దొరక్క
పరుగు ఆపక జాపోత!
వద్దు వద్దు వద్దు
అన్నాను కాదటే
అంటుంది అరవయ్యవ ఏట
అమ్మ!
నా వెర్రి గాని
ఎవరు పడలేదు
నీడల వెంట
అమ్మమ్మ పడలేదా
అమ్మ పడలేదా
రేపు మా అమ్మాయి
పడదా!
అమ్మాయి
వాళ్ళ అమ్మాయి
నీడ వెంట
పడని రోజు
వస్తుందా?
ఏమో!!
ఆరబోసినంతనె
పిండి వెన్నెలౌనా
చిదిమినంతనె
బుగ్గ దీపమౌనా
చిరునవ్వు నవ్వగనె
రతనాలు రాలునా
ఇల్లు అలుకగనె
పండుగౌనా.
పండుగైన దినము
ఇల్లు అలికెదమూ
అలికిన నేలపై
ముగ్గులే్సెదమూ
ముగ్గులద్దిన నేల
వెన్నెల వెదజల్లదా
ముగ్గు గొబ్బిల“నాడు”
పిల్లబుగ్గల నిగ్గు
దీపమై మెరవదా
ఆ పిల్ల నవ్వుల్లు
రతనాలు రాల్చవా.
ఉత్ప్రేక్ష
~దాసు మధుసూదన రావు
ప్రగతి మార్గం
~కళ్ళె శాస్త్రి
మనిషికి మనసంటూ ఒకటుంటే
దాని మరో పేరు మమత.
ఆ మమతకు మారుపేరే మానవతా .
మనసున్న మనిషి
మమత నెలవైన మనసుతో
మానవతకు ప్రతిరూపం కావాలి
మనుషుల మధ్య అనుభంధం పెరగాలి
మతానికి మానవతకు మధ్య ఉన్నదూరం తొలగాలి
కలిమిలేముల ప్రసక్తిలేని స్నేహభావం పెరగాలి
అందరికీ అందలం ఎక్కే అదృష్టం రావాలి
కలతలు చెదరి
జాతిమత అంతరాలు తొలగి
సమానతనే దివ్వె ప్రతిహృదిలో వెలగాలి
అప్పుడే
నవసమాజ నిర్మాణం సాధ్యం
అప్పుడే జాతిప్రతిష్టా సౌధం దుర్బేధ్యం
అదే ప్రగతి మార్గం
నా తొలియౌవనానికి ప్రతీకవి నువ్వు!
నా ఆకాంక్షలకీ వైఫల్యాలకీ నడుమ
ఊగిసలాడిన తాళ్ళ వంతెనవి నువ్వు!
నా పట్ల ఆదరాన్నో అనురక్తినో
వ్యక్త పరచిన ప్రియురాలివి నువ్వు!
నా పెదాలపై చిరునవ్వు ఒలికినప్పుడు నువ్వూ నవ్వావు.
నా కళ్ళలో కన్నీళ్లు చిప్పిల్లినప్పుడు నువ్వూ ఏడ్చావు.
నా పైన సహానుభూతిని ప్రకటించావు.
నా వెంట సహచరివై నడిచావు.
కాకినాడా.. ఓ కాకినాడా!
మసీదు సెంటర్లో రణగొణల
జీవన ప్రవాహమై నువ్వు
లచ్చిరాజు వీధిలో
ఇస్మాయిల్ కవిత్వపు టోయాసిస్సువై నువ్వు
మెడికల్ కాలేజీ రంగుటద్దాల కెలైడోస్కోప్ లో
తారడుతున్న ఇంద్రధనూ తోరణమై నువ్వు
ఒళ్ళంతా తుళ్ళింతలైన పడుచువాళ్ల
గుండె కేరింతవై నువ్వు
నాలోని కల్లోల సముద్రమై నువ్వు.
అలలలలుగా నాలోకి విస్తరించిన
వలపు వలల వర్తులానివై నువ్వు
దూరాన్నించి సముద్ర మధ్యంలో కనపడుతోన్న
‘హోస్ ఐలాండ్’లా
ఆశల పల్లకీవై నువ్వు
నాలోని సంవేదనలకీ సంస్పందనలకీ
నిలువెత్తు నిదర్శనంగా నువ్వు!
కాకినాడా.. ఓ కాకినాడా!
నేన్నిన్ను ప్రేమించాను
ప్రేమిస్తూనే ఉంటానూ!
కాకినాడకో ప్రేమలేఖ
~ఎం.రవూఫ్
బహుమతి
~శిరీష కుంభారి
బాధ్యత, సంపాదన, ముందు జాగ్రత్త, ప్రణాళిక
ఈ పదాల చక్రభ్రమణంలో
విరామం లేక తిరిగి తిరిగి
అలసిన ఓ మిత్రమా...
నీ బాధ్యతలు తీర్చలేను,
నీ పరుగులు నిలుపలేను,
ఆరటం ఆపలేను.
కాని, ఓ జీవన విహారీ..
ఒక చిన్ని బహుమతి
ఎంచి, ఎంచి, భద్రంగా,
పదిలంగా, దాచి తెచ్చాను..
ఏమిటో తెలుసా అది?
నీ బాల్యాన్ని అప్పడిగి
స్వచ్ఛమైన రోజులని,
ఇష్టమైన ఙాపకాలని
నీ కోసం తెచ్చానోయీ.
కొద్ది సేపు అన్నీ మర్చిపో.
బంధాలు, అశయాలు,
గమ్యాలు, లక్ష్యాలు
అర నిముషం పక్కన పెట్టు.
ఈ ఙాపకాలలో మునిగి
చిరునవ్వులు ఏరుకో!
తేలికైన మనసుతో
హాయిగా నవ్వుకో!
మండు వేసవి లాంటి
పరుగుల నుండి
రవ్వంత వేరుపడి
దాహం తీర్చుకో.
చిన్ననాటి స్నేహమనే
మంచినీటి తీపిని
దోసిలితో ఒడిసిపట్టి
తాపం చల్లార్చుకో.
మనసు కుదుట పడ్డాక
నవ్వులతో బదులివ్వు.
కేరితల ఉరవడి తో
నీ బాటని చేరుకోవోయి...