MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
సుజాత - చారిత్రక కథ
మధు చిత్తర్వు
తెల్లవారకముందే మేలుకుంది సుజాత .ఇంకా మసక చీకటి. కొంచెంగా పొగమంచు తెర కప్పిన ఊరిలోని గుడిసెలు ఇళ్ళూ దూరాన కనిపిస్తున్నాయి.
అప్పుడే కొద్దిగా కదులుతున్న ఆవులు బర్రెల దూడల చప్పుళ్ళు, గొడ్ల చావిడి లో నుంచి అంబా అనే అరుపులు వినిపించడం మొదలైంది.
బక్రూరు లో దూరాన కొండల వెనుక నుంచి సూర్యకిరణాలు పడే ముందే ఒక కోడి కూస్తుంది. చిలకలు కిల కిల మంటూ గాలిలోకి ఎగిరి పోతాయి. ఇంటి గూటిలో నివాసమున్న పావురాలు గువ్ గువ్ అంటూ ఉంటాయి.
సుజాత తలస్నానం చేసి తయారై ఒక్కొక్క ఆవు పొదుగు నుండి పాలు పితికి కుండలలో పోయటం వాటిని పొయ్యి మీద వేడి చేయడం జరిగిపోతోంది.
తలుపు
అనన్య
నూనె సలసలా కాగింది. గారెలు ఎర్రగా వేగుతున్నాయి. ఇంకొక్క వాయ వేస్తే, ఇవి కూడా అయిపోతాయి. ఆఖరున బూరెలు కూడా వేయించేస్తే, కాస్త ఫ్యాన్ కిందకి వెళ్లి కూర్చోవచ్చు- అనుకుంటూ తడి చేసుకున్న అరచేత్తో అరిటాకును తుడుస్తూ, మోచేత్తో నుదుటికంటిన చెమట తుడుచుకుంది సుబ్బలక్ష్మి. పప్పు సరైన పదునుగా రుబ్బుకుంటే గారెలు, బూరెలు కరకరలాడుతూ వస్తాయని తన నాన్నమ్మ దగ్గర నేర్చుకుంది. వాటి విషయంలో తను చేయి తిరిగిన వంటగత్తె. ఆఖరి వాయ గారెలు నూనెలో వేసేసి, అంతకుముందు వేసిన గారెలను చిల్లుల బుట్టలోంచి ఒక బేసిన్ లోకి కుమ్మరించింది. ఇక బూరెల సంగతి చూడాలని గ్రైండర్ లోంచి పిండి తీయబోతుండగా ధడ్ మని పెద్ద శబ్దం వినిపించింది. ఎవరో బెడ్ రూమ్ తలుపును గట్టిగా వేశారు. ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దం. హాల్లో కూర్చున్న అతిథులందరూ ఆ తలుపు వైపుకి ఒక్క క్షణం చూసి, మళ్లీ ఎవరి కబుర్లలో, పనుల్లో వాళ్ళు పడ్డారు.
అలాగే సుబ్బలక్ష్మి కూడా హాలు వైపు తొంగి చూసినదల్లా వెనక్కి వచ్చి, గ్రైండర్ లోంచి పిండి తీస్తోంది. అంత ధబ్బున తలుపులు వేస్తే, పై అంతస్తులో ఉండే ఓనర్లు వీళ్ళని ఏమీ అనరా అనుకుంది. మళ్లీ తన ఆలోచనకి తనే నవ్వుకుంది. మూడు నెలల నుంచి అద్దె బకాయి పెడుతుంటే తన ఓనర్ ఏమనుకుంటున్నాడో అనిపించింది.
కాలం చెక్కిన శిల్పం
లలితా వర్మ
కవరు తెరిచిన తులసికి అబ్బాయి వివరాలున్న కాగితం కనబడింది.
పేరు, ఇంటిపేరు, గోత్రం, పుట్టిన తేదీ లాంటి వివరాలు, సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేస్తున్నట్లు చదివి సంతృప్తిగా తలపంకించింది.
ఫోటో తీసి చూసి అవాక్కయింది తులసి.
"శ్రీకాంత్" -సంభ్రమంగా పలికాయామె పెదవులు.
ఒక్కసారిగా ఉద్విగ్నతకు లోనైంది.
"వదినా, వదినా! అంటూ వంటగదిలోకి పరుగుతీసి, "వదినా ! శైలు యీ ఫోటో చూసిందా?" అడిగింది రుక్మిణమ్మ ని.
"ఊఁహు లేదమ్మా అసలు పెళ్లి పేరెత్తితేనే ససేమిరా అంటుంది. ఏఁ ? అబ్బాయి మీకేమైనా తెలుసా ? అడిగింది రుక్మిణమ్మ.
శాంత
గిరిజ హరి కరణం
యాగ స్థలమును నిర్ణయించి, దున్ని చదును చేసి, కస్తూరి కలిపిన కలాపులు జల్లి ముత్యాల ముగ్గులు తీర్చారు. ఆ రంగవల్లుల నడుమ తామరలు, కలువపూలు అలంకరించారు.
మామిడాకు తోరణాలు, చేమంతి మాలలు, మొగలిరేకులతో బాటు ముత్యాలసరాలు, బంగారుజలతారు పట్టుకుచ్చులతోనూ అలంకరించారు. గెలలువేసిన అరటిచెట్లు స్థంభాలకుకట్టారు. అరటి, మామిడి, పనస మొదలైన అనేకరకాల పండ్లు బండ్లతో వచ్చాయి. నేతపనివారు, స్వర్ణకారులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు.
ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు అను నానుడికి సరితూగుతోంది అచటి వాతావరణం.
అక్బర్ శాస్త్రి ( తమిళ మూలం: జయకాంతన్ )
అనువాదం: రంగన్ సుందరేశన్
మాయవరం జంక్షన్ లో దిగి, భోజనం చేసి, నేను మళ్ళీ నా కంపార్టుమెంటు చేరుకున్నప్పుడు ఒక మూడో మనిషి నా తోలు సంచీని, దుస్తుల సంచీని, పక్కకి నెట్టేసి, నా జాగాలో కూర్చొని, పూరీ, బంగాళ దుంప కూర తింటున్నారు.
ఊరికే తినడం లేదు. కూర అంటుకున్న చేయి వేళ్ళని, అటూ ఇటూ ఊపుతూ మాటాడుతున్నారు. కంఠధ్వని కంచు మోగుతున్నట్టుంది. అందులో ఠీవీ, వయస్సుకి తగిన గర్వమూ కలిసి ఉన్నాయి.
"Excise Department అంటున్నారు, మరి మీ ఉద్యోగం ఏమిటో చెప్పరేం?” అని అతను గదమాయించగానే, వినయంతో, చిరునవ్వుతో ఎవరో అధికారికి జవాబు చెప్తున్నట్టు “సూపరింటు!” అన్నారు ఆ చివరన కూర్చున్న అతను.
షీర్గాళి స్టేషన్ లో ఎక్కి, అక్కడి నుంచీ రైలు ప్రయాణం చేస్తున్న నన్ను కనీసం లెక్కచెయ్యకుండా, రైలు గైడులో మొహం దాచుకున్న ఇతనికి ఈ కొత్త మనిషిని చూడగానే ఎంత మర్యాద, ఎంత వినయం?!
ఎదుట బెంచీలో కాలు చాచి నిద్రపోతున్న ‘సూపరింటు’ భార్య ఒకసారి కళ్ళు తెరిచి చూసింది. మళ్ళీ కళ్ళు మూసుకుంది.
అశరీరవాణి
డా|| అర్చన
నాడు
సువిశాలమైన చిత్రకూట రాజ్యం అపారమైన జన సంపదతో అలరారుతున్నది. అద్భుతమైన చరిత్రతో ప్రపంచ విఖ్యాతిగాంచిన రాజ్యమది. కష్టజీవులుగా,అలుపెరగని శ్రామికుల్లా, అపరమేధోసంపతికి మారుపేరుగా ఖండాంతరాల్లో తమ రాజ్య ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న ప్రజలతో అలరారుతున్న రాజ్యమది.
నేడు
రాజ్యపాలన సరళతరం చేయడానికి సమంతరాజ్యాలుగా చీలిన సువిశాల సామ్రాజ్యం, సువిశాలమైన రాజ్యాన్ని ఏకతాటిపై నడిపించలేని ప్రభువు, కనీస బాధ్యతలు విస్మరించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న అనేకమంది ప్రజలు మరీ ముఖ్యంగా స్వార్థపరులుగా ఉన్నయువతరంతో బాధ్యత గల కొద్దిపాటి పౌరుల శ్రమ , తెలివితేటలు బూడిదలో పోసిన పన్నీరవుతున్న వేళ మరో భీకర ప్రమాదం ఆ సువిశాల రాజ్యాన్ని తాకింది. ఆ తాకిడికి ప్రభువులు, ప్రభుత్వాలు, వర్తక వాణిజ్యాలు ఒకటేమిటి? పూర్తి ప్రజావ్యవస్థ కుదేలయింది.