top of page

కథా మధురాలు

నిర్వహణ:     దీప్తి పెండ్యాల

katha@madhuravani.com 

డీయసైడ్

నిర్మలాదిత్య

"దేవుడుని చూద్దాం, రా," అన్నాను నేను వడివేలు తో.

 

"ఏం వేళాకోళం గా ఉందా? నిన్న రాత్రి ఏదో పార్టీకని వెళ్లినట్టున్నావు. మత్తు ఇంకా దిగలేదా? అయినా నాకు ఛాయిస్ ఉండి ఏడ్చిందా? నువ్వెక్కడ తీసుకెళితే అక్కడికి పోవాల్సిందే కదా," అన్నాడు వడివేలు, మరో చెట్టు మొదలు వాసన చూస్తూ.

 

"మత్తులో కాదు. నిజంగానే చెప్తున్నాను. నా దేవుని దగ్గరికి తీసుకెళ్తాను," అన్నాను నేను.

 

"దేవుని దగ్గరికి తీసుకెళ్తావా? ఏమైనా సూయసైడ్ ఆలోచనలు వస్తున్నాయా కొంపదీసి. కావాలంటే నువ్వు ఆత్మహత్య చేసుకొని నీ దేవుడుని కలువు. అంతే కానీ, అదేదో ఈజిప్ట్ ఫారో చక్రవర్తుల లాగా నన్ను కూడా చంపి నీ వెంట తీసుకొనిపోకు," అన్నాడు వడివేలు.

మేఘన

ఇర్షాద్ జేమ్స్

అది అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో ఆస్టిన్ నగరం.

 

సాయంత్రం ఆరు దాటినా, ఎండా కాలం కావటం వల్ల ఇంకా చాలా వేడిగా వుంది.

 

మేఘన, మేఘన వాళ్ళమ్మ H.E.B. కూరగాయల దుకాణం లోంచి బయటికి  వచ్చారు, షాపింగ్ కార్టు తోసుకుంటూ.

 

ఇద్దరూ క్రాస్ వాక్ ముందు నిలబడ్డారు.

 

రెండు వైపుల నుంచి కార్లు వస్తున్నాయి.

 

కొన్ని నిమిషాల తర్వాత, "OK, ఇప్పుడు క్రాస్ చేద్దాం", అంది అమ్మ.

 

అమ్మ షాపింగ్ కార్ట్ ని ముందుకి తోయబోతుండగా, "Wait !!" అని అకస్మాత్తుగా పక్కనే వున్న ఒక పెట్ షాప్ వైపు పరుగెత్తింది మేఘన.

నవరాత్రి - 5

గిరిజా హరి కరణం

 

అది ఒక చెంచు గూడెం. శ్రీశైలానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అచ్చంపేట. ఆ వూరికి పక్కన ఒక ఏరు ప్రవహిస్తూ కృష్ణ లో కలుస్తుంది.

 

 దానికవతల అడవిలో వుందీ గూడెం. యింకా  చాలా చెంచు గూడేలూ సుగాలి తాండాలు వున్నాయట.  అతని పేరు నాగూ. ముగ్గురు భార్యలూ ఆరుమంది కొడుకులూ ఐదుగురు కూతుర్లు. కొడుకులందరికీ యిద్దరు ముగ్గురు భార్యలు పిల్లలు.

 

ఒక్కో భార్యకు ఒక్కొక్క గుడిశ, మొత్తం యిరవై ముప్పై గుడిశలు. చుట్టూ కంపతో పెద్ద కంచె. దీన్ని యానాది సంగం అంటారు. మధ్యలో తూర్పు ముఖంగా సామి గుడిశ వుంది.  దానికెదురుముఖంగా సంగం పెద్ద గుడిశ, అందులో నాగూ పెద్ద భార్య, దానికిటూ అటూ యింకో రెండు గుడిశల్లో  చిన్న భార్యలూ వుంటారు.

పొద్దు వాలేసరికి బయటికెళ్ళినవాళ్ళంతా వొక్కొక్కరే వస్తున్నారు. యెవరిళ్ళ ముందు వాళ్ళు తాము తెచ్చినవి, పళ్ళు కాయలు, దుంపలూ, చేపలూ, కుందేళ్ళూ, కౌంజు పిట్టలూ,  కట్టెలు కొట్టి యేరు దాటెళ్ళి వూళ్ళో అమ్మి సంపాదించినదంతా పెట్టారు.

భూతం  తమిళ మూలం: అఖిలన్

అనువాదం: రంగన్ సుందరేశన్

మీరు దెయ్యం, భూతం చూసివున్నారా? నేను చూడలేదు. అంతెందుకు? నేను దేవుడినికూడా చూడలేదు.

 

దేవుడి మాట అలా ఉండనీ. నేను దేవుడు పేర్లు వల్లిస్తూ, భజనలు పాడే భక్తుడు కాదు. అతన్ని దూషించే నాస్తికుల గుంపులో సభ్యుడూ కాదు. ఆ ఇద్దరూ కలిసి లోకజ్ఞానంలేని ప్రజలని, భక్తి లేని మందలని, బాగా మోసపుచ్చుతున్నారు. మూర్ఖులందరికి అదే గతి.

దేవుడు నాకు డబ్బు ఇవ్వలేదు, అతన్ని వదిలేసి కథకి వద్దాం. ప్రస్తుతం నా మనుగడకి ఆధారం భూతమే అనాలి.

భూతాలు కూడా భయపడే అంధకారం, అమావాస్య. “మీరు భూతాలని చూడలేదే?” అని నన్ను అడక్కండి. నేను చూడలేదు, నిజం. కాని నమ్మకం లేదని ఎవరన్నారు? భూతాలు కూడా భయపడే చీకటి అని చెప్పానుకదూ? అదొక చౌకుచెట్ల తోట.

 

 సూర్యుడు ఉగ్రంగా ప్రకాశించే మిట్టమధ్యాహ్నంలోనే అక్కడ ఏమాత్రం వెలుతురు కనిపించదు. ఇక ఈ అర్ధరాత్రిలో, అమావాస్య గురించి వేరే చెప్పాలా?

bottom of page