MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
కాల సమీకరణాలు
ఓలేటి శశికళ
“ అయ్యో! అయ్యయ్యో! ప్చ్! ఎంత ఘోరం! దేవుడున్నాడండి! అయినా పాపం మరీ ఇలానా!”. టీవీ ముందు నేరాలూ-ఘోరాలూ ప్రోగ్రామ్ చూస్తూ, ఆ అపరాధ పరిశోధనలో పూర్తిగా లీనమైపోయి, ఆ ఘోర అన్యాయాలకు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, నేనిచ్చే ఈ శబ్ద ప్రతిక్రియలంటే మా ఆయనకు మహాచికాకు!
“ పిచ్చిగోల!” అంటూ లేచి వెళ్ళిపోబోతుంటే, “ ఓయ్! ఒకసారి చూడండి ఇక్కడ! మీ పండు మామయ్య కొడుకులా లేడూ?! లేడూ ఏవిటి అతనే! పాపం ఘోరమండి. మొగుడూ, పెళ్ళాలను ఇద్దరినీ చంపేసారు. పేరు మార్చుకుంటే మాత్రం, మనిషి మారతాడా! ఖచ్చితంగా అతనే!”. అంటూ నేను రిమోట్ ఊపేస్తూ, నిర్ధారిస్తుంటే మా వారు ఒక్కక్షణం ఆగి, వెనక్కి చూసారు!
కలవరమాయే ‘మదిలో’
పాణిని జన్నాభట్ల
చాలాసేపటి తర్వాత మెల్లగా తెరవమని చెప్పాను కళ్ళని. ఎప్పటిలాగే పక్కనున్న టేబుల్ మీదున్న మొబైల్ తీసుకోమన్నాను చేతిని.
"ఈ గొడవలు భరించలేను. మాట్లాడాలి నీతో! - మనోజ్"
మొబైల్ చూసి కళ్ళు పంపిన సందేశం. ఒక్కసారి నా నిద్రమత్తంతా వదిలింది. పనిలోకి దిగాను. గుండెని యాభై సార్లు ఎక్కువ కొట్టుకోమన్నాను. అది నన్ను తిట్టుకుంటూ వేగం పెంచింది. ఊపిరితిత్తులకి ఒక రెండు సెకన్లు శ్వాస తీస్కోవద్దన్నాను. కళ్ళని కన్నీళ్ళు రెడీగా ఉంచుకోమన్నాను. తొందరపడి కార్చద్దన్నాను. ఇంకేదో మర్చిపోయాను.. ముఖం! రక్తం ఎక్కువ ప్రవహించాలి ముఖంలోకి. ఎరుపెక్కాలి. ఇప్పుడు టైప్ చెయ్యమని చెప్పాను చేతి వేళ్ళకి - "ఇక నా వల్లా కాదు. మధ్యాహ్నం లైబ్రరీ వెనక కలుద్దాం!"
ఓ(టి)తీపి బతుకులు!
జయంతి ప్రకాశ శర్మ
డా. రఘురామారావు గారింటికి రెండు పనులు పెట్టుకుని, మా ఆవిడ్ని తీసుకుని వెళ్ళాను. ఒకటి- వాళ్ళింట్లో బొమ్మల కొలువు పెట్టారు, అది చూడాలి. రెండు- ఎలాగూ వెళ్తున్నాం కాబట్టి బిపి, సుగరు గట్రా చూపెట్టుకుంటే ఆ పని కూడా అయిపోతుంది.
ఆయనింటికి వెళ్ళేసరికి డాక్టరు గారు, వాళ్ళావిడ శాంతిగారు ఇల్లంతా కంగారుగా తిరుగుతున్నారు. మమ్మల్ని చూస్తూనే 'రండి, రండి కూర్చోండి!' అంటూ మమ్మల్ని కూర్చోబెట్టి, వాళ్ళద్దరూ హడావిడిగా ఇల్లంతా కలియతిరుగుతున్నారు. వాళ్ళల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. రాకూడని సమయంలో వచ్చామా అనే చింత నాలో వచ్చేసింది.
రఘురామారావు గారు ఊర్లో పేరున్న డాక్టరు. ఆయన దగ్గర అపాయిట్మెంటు దొరకాలంటే పది పదిహేను రోజులు పడుతుంది. అంత బిజీలో కూడా సాహితీకార్యక్రమాలు నిర్వహిస్తూ కళాసేవ కూడా చేస్తారు. నాకే కాదు, చాలమందికి మంచి మిత్రులు.
పాపం! సుబ్బలక్ష్మి గారు
వెదురుమూడి రామారావు
పాపం! సుబ్బలక్ష్మి గారు నిద్ర లో గట్టిగా అరుస్తున్నారు. “పట్టుకోండి, నన్నుపట్టుకోండి, పడిపోతున్నాను“ అంటూ.
పక్కనే వున్న సుబ్బారావు గారు ఆమెని గట్టిగా పట్టుకొని "అదేమీ లేదు, నువ్వు మంచం మీదే వున్నావు. అంతా బాగానే వుంది, నేనూ ఇక్కడే వున్నాను" అంటూ ఒక గ్లాసుడు మంచి నీళ్లు తాగించారు. ఆమె సుబ్బారావు గారి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆయన వైపు తిరిగి ముడుచుకొని పడుకొన్నారు.మళ్ళీ నిద్ర లోకి జారుకున్నారు ఇద్దరూ. పొద్దున్నే ఈ సంఘటన చెప్తే "ఛ, అదేం గుర్తు లేదు" అని ఊరుకొన్నారు సుబ్బలక్ష్మి గారు.
రెండు, మూడు రోజులు గడిచాయి. ఆ రోజు రాత్రి కూడా మళ్ళీ నిద్రలో అరవటం మొదలు పెట్టారు సుబ్బలక్ష్మి గారు. “పడి పోతున్నాను, పడిపోయాను" అని.
కోణాలు ( తమిళ మూలం: జయకాంతన్ )
అనువాదం: రంగన్ సుందరేశన్
హఠాత్తుగా గతిలేని ఒక స్థితిలో ఏకాంతంగా, ఎవరూ ఓదార్చలేనట్టు, నిరాదరువుగా తన్ను వదిలేసినట్టు రాజలక్ష్మి అల్లాడిపోయింది.
గడచిన అర్ధగంటనుంచి ఇంటి ముందు హాలులో ఒక సోఫాలో చంచల మనసుతో కూర్చున్న యజమానిని చూసి వంట మనిషి శంకరి అవ్వ మెల్లగా నడిచివచ్చి ఆవిడ పక్కన నిల్చుంది.
తను వచ్చి నిలబడినది గుర్తించక ఏదో ఆలోచనలో మునిగిపోయిన రాజలక్ష్మిని చూసి “ఏమే రాజం, నువ్వెలాగో ఉన్నావ్, నీకేమైందే?” అని అవ్వ అభిమానంతో అడిగింది.