MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
ఆధునికత
రమాదేవి చెరుకూరి
ఆదివారం మధ్యాహ్నం రెస్టారెంట్ బాగా సందడి గా వుంది. బిల్ చెల్లించి, ఫణి మెట్ల వైపు అడుగు వేశాడు.
అతనికి ఒక అడుగు వెనకగా విజయ ఫాలో అయింది. చివరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి మొదటి మెట్టు ఎక్క బోతున్న చందూ కనిపించాడు. ఫణి ని చూడగానే, మొహం అంతా నవ్వు పులుముకుని చేయి ముందుకు చాచాడు. “ఒరేయ్ నిన్ను కలవాలనే అనుకుంటున్నాను. వెదక బోయిన తీగ.” అన్నాడు చందూ.
“కోయ్!“ అంటూ పలకరిస్తూనే చేయి కలిపాడు ఫణి.
“ఈసారి నిజం“ అన్నాడు చందూ, ఫణి మాటలకు బదులుగా.
“ఎందుకుట పాపం. “
“చెప్తాగా” అని చందూ అంటుండగానే, అతని దృష్టి వెనకగా వున్నవిజయ మీద పడింది.
“హే. నువ్వేంటీ ఇక్కడ?“ అన్నాడు.
దైవం మానుష రూపంలో
వాత్సల్య
పొద్దున్నే పనిమనిషి రాలేదని విసుక్కుంటూ వాకిట్లో ముగ్గేస్తున్న మహా లక్ష్మికి "అమ్మాయి ఫోనోయ్,ఏదో అర్జెంటుట" అన్న కేక వినపడినా వినబడనట్టే ముగ్గు వేస్తోంది.
కూతురి నుండి ఫోనంటే "అమ్మా,నేను ఈరోజు ఆఫీసుకెళ్ళాలి, చంటాడిని చూసుకో" అనో లేకపోతే "అమ్మా, నేను ఈ పూట వండుకోలేను, నాకు అన్నం, కూర నాన్నతో పంపించు లేకపోతే నువ్వొచ్చి వంట చెయ్యి" ఇవే కదా అనుకుంటూ.
ఆవిడ పలకకపోయేసరికి "ఇదిగో నిన్నే" అంటూ పొద్దున్నే చూస్తున్న వార్తలకి కలిగిన అంతరాయానికి విసుక్కుంటూ ఆ విసుగుని కూతురి మీద చూపించలేక, కోపంగా మహా లక్ష్మి వంక చూస్తూ, ఫోను ఆవిడ చేతికిచ్చారు నారాయణ రావు గారు.
"అమ్మా, ఈరోజు ఆఫీసుకెళ్ళాలి, కాస్త నాన్నని వచ్చి బుజ్జిగాడిని తీసుకెళ్ళమను" అంది నిద్ర గొంతుతో లావణ్య.
"ఈరోజు ఆఫీసుకెళ్ళాలని నిన్న రాత్రి తెలీదా?" విసుక్కుంది మహాలక్ష్మి.
"అది కాదమ్మా, ఏదో పనిలో పడి మర్చిపోయాను, అయినా అందరి తల్లులూ ఎంతో ఇష్టంగా కూతుర్లకి సాయం అందిస్తోంటే నువ్వొక్కదానివే విసుక్కుంటావు, అసలు నువ్వు నా కన్న తల్లివేనా అనిపిస్తుంటుంది ఒకోసారి" అంది విసుగ్గా.
"నిద్ర లేచిన వెంటనే కూడా దీని నాలుక పదునే " అని మనసులో అనుకుని "సరే నాన్నని ఎన్నింటికి పంపాలో చెప్పు" అని అడిగి ఫోను పెట్టేసింది.
మోడర్న్ మహాలక్ష్ములు
గొర్తి వాణిశ్రీనివాస్
ఆరనైదోతనము ఏ చోటనుండు?
అరుగులలికేవారి అరచేతనుండు....అ అ అ"
అంటూ పాటపాడుతూ వీధి అరుగుల మీద ముగ్గులు పెడుతూ తలపైకెత్తి చూసింది విజయలక్ష్మి.
విజయలక్ష్మికి విట్టుబాబుతో పెళ్ళి జరిగి సరిగ్గా ఒక్కరోజు. అత్తవారింటికి వచ్చిన మర్నాడే తెల్లవారకముందే లేచి, వీధి వాకిలి ఊడ్చి, నీళ్లు చల్లి, ముగ్గు గిన్నె పట్టుకుంది విజయలక్ష్మి.
మేడ పై అంతస్తులో నైటీ తో నిలబడి బ్రెష్ నోట్లో పెట్టుకుని తననే చూస్తున్న అత్తగారు అనంతలక్ష్మి కనిపించింది. ముఖం చిట్లిస్తూ కోడల్ని చూసింది అనంతలక్ష్మి.
ముత్యాలు ముగ్గు సినిమా గుర్తొచ్చి ముక్కు ఎగపీలుస్తూ అత్తగారి వంక చూసింది విజయలక్ష్మి. ఆ తర్వాత స్లోమోషన్ లో కిందికి చూసి, తను దిద్దిన ముగ్గులాంటి ఆకారాలని ముంగిట్లో తృప్తిగా చూసుకుని, పెరటి వైపు వెళ్ళింది.
నేనేం చెయ్యాలి చెప్పండి! ( తమిళ మూలం: జయకాంతన్ )
అనువాదం: రంగన్ సుందరేశన్
నలభై సంవత్సరాలైపోయాయి ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చి. చేతినిండా ఒక గంప పిడతలతో నాన్నగారు నన్ను తీసుకొచ్చారు. అప్పుడు అమ్మ - అంటే మా అత్తగారు - ఉండేవారు, అత్తగారికి అత్తగారుగా, తల్లికి తల్లిగా.
కన్నతల్లితో నేనున్నది ఐదు సంవత్సరాలేకదా? ఆ తరువాత అత్తగారికి కోడలేకదా? నాన్నగారు చావడిలో నన్ను దింపేసి అక్కడే నిలబడి తువ్వాలుతో మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. నాకేం బోధపడలేదు.
అప్పుడు పెరడులో నిలుచొని - అప్పుడే మొండితనం అతనిలో బాగా కనిపిస్తోంది - నాలికని బయటకి తీసి, చేతివేళ్ళని తెంచుతూ, ఆ పచ్చి ఇటిక నేలమీద బొంగరం వదలుతానని హఠం చేస్తున్న అతనే నా భర్త అని తెలియడానికి చాలా రోజులు పట్టాయి. ఐతే, దానికోసం అతను నా తలమీద కొట్టాలా? నేనుకూడా ‘సరేరా’ అని ఒకసారి బాగా వాయించాను. వంటగదిలోనున్న మా అత్తగారు పరుగెత్తుకొని వచ్చారు. “ఐయయ్యో, ఏమిటే ఇది?". అంటూ.
”మరి వాడెందుకు నన్ను కొట్టాలి?” విని ఆవిడకి ఒకటే నవ్వు. నన్ను కౌగిలించుకొని మా బంధుత్వం ఏమిటో వివరించి చెప్పారు. అన్ని సంగతులూ బోధపడే కాలం వస్తే అవే బోధపడతాయి. ఆలోచించిచూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు మావారిమీద ఎందుకు ఇంత భయం వచ్చింది? భయం అంటే అది ఒక సంతోషమైన భయం. మర్యాదతో వచ్చే భయం. భయం అని కూడా అనలేం, అది ఒకవిధమైన భక్తి. ఎలాగో వచ్చేసింది. నలభై సంవత్సరాలుకి పైగా ఐపోయింది.