top of page

కథా మధురాలు

నిర్వహణ:     దీప్తి పెండ్యాల

katha@madhuravani.com 

అజ్ఞేయవాది

నిర్మలాదిత్య

"నేను ఓ గుడి కట్టాల్సి వచ్చింది!" అంది కిరణ్మయి.

 

"కిరణ్మయి. డాక్టర్ కిరణ్మయి! నువ్వేంటి, గుడి కట్టడం ఏమిటి?" అన్నాను నేను,  నా గొంతులోని వెటకారం ఏమాత్రం దాచకుండా.

 

"నేనో అజ్ఞేయవాదినే. అగ్నోస్టిక్. కానీ, నేను గుడి కట్టింది నిజమేనే.  జాహ్నవి, పిల్లలు కనేందుకని వైద్యం కోసం నువ్వు పంపావని వచ్చింది. నేను నాకు తెలిసిన విద్యలన్నీ ప్రయోగించి,ప్రయత్నించాను. విఫలమయ్యాను. అందుకే గుడి కట్టడమే శరణ్యమనుకున్నాను.థట్ ఈజ్ ది బాటమ్ లైన్."

 

కిరణ్మయి, నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. అమెరికాకు దాదాపు ఒకే సారి వచ్చినా, మా భాగ్య రేఖలమీది ప్రయాణం ఒకటే వేగంలో జరుగలేదు.  నేను పైకి చూపెట్టకపోయినా, అదో చిన్న అసంతృప్తి ఉంది నాకు. ఎంత దాచుకుందాం అనుకున్నా, అప్పుడప్పుడు నా వెటకారం లో బయట పడుతూనే ఉంటుంది. 

రోబోట్ వైఫ్

జయంతి ప్రకాశ శర్మ

 

దసరాకి వెళ్ళినావిడ ఉగాదికి కూడా రాకపోయేసరికి నరసయ్యగారికి కోపం ముంచుకొచ్చింది.

"ఏఁవయ్యా? ఇదేం బావుందా! కరోనా కారణంగా రెండేళ్ళ నుండి పండగా పబ్బం లేదని గొడవ చేస్తుంటే.. దసరాకు సరదాగా వచ్చాం. పండగయిన తర్వాత బయలుదేరితే,'అక్క ఓ వారం రోజులు ఉంటుందని, నన్ను పొమ్మనమని మీ ఊరి భాషలో చెప్పకనే చెప్పావు! పైగా 'మీకు మీ కామ్రేడ్స్ ఉన్నారుగా, దేనికీ లోటుండదని'  ఎద్దేవా కూడా చేసావు! అయినా నీకు బుద్ది లేదు సరే, మీ అక్కకి ఉండక్కర్లేదా చెప్పూ? అమ్మమ్మ అవతారం ఎత్తిన తర్వాత కూడా ఇంకా పుట్టింట్లో తిష్ట వేయడం అస్సలు బాలేదు!" అంటూ బామ్మర్దికి ఫోన్ చేసి చెడామడా తిట్టిపోసాడు. 

"అదేం మాట బావగారు? మీరైనా, మేమైనా కొంపల్లో లింగులింగుమంటూ ఇద్దరేసే ఉ‌న్నాం కదా? మన నలుగురం ఒక దగ్గరే ఉంటే, పేకాటకి హెండ్స్ సరిపోతాయని అంటే, అప్పుడు ఊ అన్నారు. ఇప్పుడేమో ఉఁహు అంటున్నారు!" అంటూ బామ్మర్ది ఫోన్లోనే బావగారికి తాయిలం రాశాడు.

అమ్మ - అపోహ

శర్మ దంతుర్తి

 

ఇంటికొచ్చిన శ్రీకర్ ని పలకరించాడు తండ్రి – “ఏరా ఈ రోజు ఎలా ఉంది స్కూల్లో? భోజనం చేస్తావా? అన్నీ వండి పెట్టాను.” భోజనం చేస్తూంటే అక్కడే కూర్చుని తండ్రి అడుగుతున్నాడు ఏవో విషయాలు.

 

ఒక్కసారి కన్నీళ్ళొచ్చాయి శ్రీకర్ కి. తల్లి పోయినప్పటినుండీ తనకున్నది తండ్రి ఒక్కడే. తనని స్కూల్ లో జేర్పించడం, తన బట్టలు ఉతకడం, వంట వండడం అన్నింటికీ ఆయనే. కంట్లో నీళ్లు కనబడకుండా గబుక్కున ఒక్కసారి బాత్రూంలోకి దూరి కాసేపటికి తమాయించుకుని బయటకొచ్చాడు, “కంట్లో ఏదో పడింది, కూరలో కారం ఎక్కువైంది కాబోలు,” నవ్వుతూ చెప్పాడు ఈసారి.

 

తండ్రి ఏమీ మాట్లాడలేదు.

 

మూడునాలుగు నిముషాలు ఆగి మళ్ళీ చెప్పాడు శ్రీకర్ – “ఈ రోజు క్లాసులో థైరాయిడ్ గురించి చెప్పారు. అమ్మ పోయినది ఈ థైరాయిడ్ సమస్య వల్లే అని నేను కూడా చెప్పాను. కానీ ఆయన చెప్పేదేమంటే థైరాయిడ్ వల్ల గుండె కీ మెటాబోలిజం కీ కూడా సమస్యలు వస్తాయిట. అమ్మకి ఏ సమస్యయుంటుందో అనిపించింది పాఠం వింటున్నప్పుడు.”

నవరాత్రి - 3

గిరిజా హరి కరణం

ఆమెకు తొలిచూలు ఆడపిల్ల .రెండోకానుపు మగపిల్లవాడు.

“మా యింటి యెదురుగా అపార్ట్మెంట్ కడుతూ వీధిలో యిసుక పోశారు. అందులో పిల్లలు ఆడుకుంటున్నారు. కొంతసేపయ్యాక, పక్కింటామె వచ్చి మీ ధాత్రిని యెవరో కార్లో యెక్కించుకుని వెళ్ళారట, మా అబ్బాయి ఆటల్లో పడి మరిచినట్లున్నాడు. యిప్పుడే వచ్చి చెప్పాడు అని చెప్పింది. వెంటనే నేను మీ అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పి, మీకు కాల్ చేశాను నాన్నా. యీ చుట్టుపక్కల చాలా మందిని అడిగాను, కారు వివరాలెవరూ చెప్పలేక పోతున్నారు. అని చెప్పింది.

 

నా కూతురు దుఃఖాన్ని భరించలేక పోతున్నాను. వెళ్దామంటే రాత్రికి గానీ బస్సులేదు అన్నారు.

 

గుడిలోకొచ్చి వో మూలగా కూర్చుని బిడ్డ క్షేమంగా దొరకాలని సంకల్పం చేసుకుని, తల్లి భ్రమరాంబికను ధ్యానిస్తూ కూర్చున్నాను. వచ్చిన భక్తులందరికీ మా నాయనగారు తీర్ధ ప్రసాదాలు యిస్తున్నారు.

 

గుడిమూసే వేళయి చాలా సేపయింది.

సాటి లేని మిత్రుడు -  తమిళ మూలం: జయకాంతన్

అనువాదం: రంగన్ సుందరేశన్

“సార్, మిమ్మల్ని ఎవరో ఫోనులో పిలుస్తున్నారు” అని ఆఫీసు నౌకరు సందేశం విని ముద్రణ యంత్రం ముందు నిలబడి అచ్చు కాగితాలు సవరించుతున్న చంద్రన్ తలెత్తి చూసాడు.

 

“నన్నా? కొంచెం ఎవరని అడుగు.”

 

“ఎవరో వేణు అట!” అని అంటూ ఆఫీసు నౌకరు తిరిగి వచ్చాడు. ‘వేణు’ అని ఆ పేరు వినగానే తలెత్తిన చంద్రన్ ఒక క్షణం ఆఫీసు నౌకరు మొహం తేఱిపార చూసాడు. అతని చేతిలోని కలం - నళ్ళించిన వేళ్ళనుంచి - కిందకి జారి, నేల మీదున్న తడిసిన అచ్చు కాగితాలపై పడగానే వాటిని సిరా తాకింది.

 

‘ఎవరో వేణు అట. అవును, వాడు ఎవడో ఒకడే. ’ అని అసాధారణమైన బలంతో చంద్రన్ తనలో గొణుక్కున్నాడు.


“సరే, నేను లేనని చెప్పేయ్!”

bottom of page