MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
కరోనా కట్టడిలో కాడెద్దులు
డాక్టర్ చాగంటి కృష్ణకుమారి
నేనో తొంభై ఏళ్ళ తొక్కుని. నాకే తొంభై ఏళ్ళుంటే ఇంకా నా మొగుడు బతికుంటాడా? ఎప్పుడో వెళ్లిపోయాడు పైలోకాలకి.
నాకున్నారు ఇద్దరు కొడుకులు. వాళ్ళికా నా దగ్గరుంటారా? ఎప్పుడో వెళ్ళిపోయారు పరాయి దేశాలకి.
నేనొంటరిని. రెండు కాడెద్దులతో బతుకుబండి నడిపిస్తున్నా. ఓ ఎద్దు నాకు పాచిపనులు చేసిపెట్టే ముసలిది. రెండోది నాకు వండిపెట్టే పడుచుది.
రెండెడ్లకి మేలైన దానా దండిగా పెడుతున్నానంటే అది స్వార్ధమే! ప్రేమగా చూసుకుంటున్నానంటే - అదీ స్వార్ధమే.!
ఈ గడ్డు కాలపు కరోనా భీతిలో నాకున్న ఆధారాలు ఆ రెండే! అందువల్ల వాటిపట్ల నా ప్రేమ పదింతలైంది.
నా ముసలిదాని కొడుక్కి కరోనా కట్టడిలో కొలువు వూడిందట. పడుచుదాని మొగుడికి కూలీ నాలీ బందయ్యిందట.
రెండూ వచ్చి మొరపెట్టుకున్నాయి. మీరిచ్చే నాలుగురాళ్ళే ఆధారం. ఇంట్లో ఎవరికీ తిండి లేదు మొర్రో మన్నాయ్.
ఉడతా భక్తిగా నేనిచ్చిన నాలుగు కాగితాలు నాలుగు కళ్లల్లో కాంతిని నింపాయ్. అంత కాంతిని నేనెప్పుడూ చూడలేదు.
ఈ కరెన్సీ కాగితపు పీరికలకి ఇంత శక్తి వుందా అని ఆశ్చర్యపోయా.
జాగ్రత్తలు పాటిస్తూ పనిలోకి వస్తామన్నాయ్. జాలి గొలిపే చూపులతో.
సరే, రండిద్దరూ అన్నా! తొంభై ఏళ్ల తొక్కుని, చచ్చిపోతే దేశానికొచ్చే నష్టమేమిటి?
నా పాదాల కింద చదునైన చలువ రాయి నేల వుంది. కప్పు పైన పంకా తిరుగుతున్నాది.
నీళ్లున్నాయ్, పాలున్నాయ్, వెచ్చాలూ వున్నాయ్, మంచం మీద పరుపు, దిండు వున్నాయ్. నాకే లోటూ లేదు.
ఇరవై నాలుగు గంటల అంతర్జాల సదుపాయం పుణ్యమా అని ప్రపంచం మొత్తం నా సావిట్లో వుంది.
గతుకుల దారులలో బారులు తీరి నడుస్తున్న వలస కూలీ కుటుంబాల కష్టాలు చూడలేక చానల్ మార్చేసా.
నా కాడెద్దులూ వలస జీవులే…
భూమి దున్నడంలో గిట్టుబాటు లేదని
గ్రామాన్ని వదిలి గంపెడాశతో భాగ్య నగరానికొచ్చాయ్. నా బండి లాగుతున్నాయ్.