MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
కలలూ - కళలూ
ద్వారం దుర్గా ప్రసాదరావు
కొన్ని కథలెలా ఉంటాయంటే - "కలలోనే ఒక మెలఁకువలా, ఆ మెలఁకువలోనే ఒక కలగా" ఉంటాయి.
మాన్యుల జీవితాల్లో కొన్ని సామాన్య సంఘటనలు మననం చేసుకొనవలసినవైతే - కొందరు సామాన్యుల తలపులూ, చేతలూ తలకెత్తుకోవలసిన ఆదర్శాలుగా కూడా నిలుస్తాయి. మనుగడ బాగుండాలంటే మంచి కలలు కనాలి. మంచి కలలే రావాలంటే మంచి కథలు చదవాలి. కళకు మంచి నిర్వచనం "మెలఁకువలోనే ఒక కల - ఆ కలలో ఒక మెలకువ" అని చెప్పవచ్చునేమో.
విజయనగరం సంస్థానంలో ప్రభువులు, ప్రజలు, పండితులూ మంచి కలలు కన్నారు. చాలా వరకూ అవి నిజాలయ్యాయి. మనకు చెప్పుకోడానికి బోలెడు కథలు.
వెయ్యి బఠాణీలు
ఆనందగజపతి గొప్ప వీణా విద్వాంసుడు. వీణ చినగురురాయాచర్యులు తన వార్ధక్యంలో తన కుమారుడు వెంకట రమణదాసును రాజా వారికి అప్పజెప్పి గొప్ప విద్వాంసునిగా తయారు చేయమని కోరారు. రమణదాసు మహారాజు శిష్యుడై "వీణా చక్రవర్తి" బిరుదులు వహించి సంస్థానానికి కీర్తి తెచ్చారు. వెంకటరమణదాసుకు బఠాణీలంటే చాలా ఇష్టం. ఆనందగజపతి వెయ్యి బఠాణీలు తన దగ్గర ఉంచుకుని రమణయ్యదాసుచేత "వెయ్యి త్రిస్థాయి" వీణ మీద సాధన చేయిస్తూ ఒక త్రిస్థాయికి ఒక బఠాణీ గింజ చొప్పున దాసుగారి నోట్లో ప్రేమతోవేస్తూ రోజూ సాధన పూర్తి చేయించేవారు.
తాను మహరాజైనా ఆనందుల శిష్యవాత్సల్యం, శ్రద్ధ చెప్పుకోవలసిన కథే.
ఆనందగజపతి - ఆయిల్ కలర్స్
చిత్రకళ గురించి ఒక కథ చెప్పుకుందాం.
శ్రీమతి ఇ.ఎం.మెర్రిక్ ఆంగ్ల వనిత. లండన్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో చిత్రకళ అభ్యసించింది. ఆ రోజుల్లో ఆయిల్ పెయింటింగ్ భారతదేశంలో క్రొత్త. వందలాది ఆంగ్ల చిత్రకారులు భారతదేశానికి వచ్చి రాజులవీ, అధికార్లవీ, అలాంటి గొప్పవారి ఆయిల్ పోర్ట్రైట్ లు, లేండ్ స్కేప్ లు, తైల వర్ణాలలో చిత్రించేవారు. ఐతే అలా వచ్చిన ఆంగ్లేయులందరూ మొగవారే కావడం వల్లనూ, రాచకుటుంబాలలో ఘోషాపద్ధతి వల్లనూ జనానాల్లోకి ప్రవేశం నిషిద్ధం. అంచేత శ్రీమతి మెర్రిక్ 1890 లో ఒక ప్రత్యేక ఉద్దేశంతో మనదేశానికి వచ్చింది. రాణివాసాలలోని రాణులవీ, రాచస్త్రీలవి ఆయిల్ పెయింటింగ్స్ వేద్దామని ఆమె ప్రణాళిక. బరోడా, మైసూర్ లాంటి సంస్థానాలు తిరుగుతూ విజయనగరం వచ్చింది ఆవిడ.
శ్రీ ఆనందగజపతి మహారాజావారిదీ, అక్క అప్పలకొండ యాంబరీవారాణివారిదీ, తల్లి అలకరాజేశ్వరి అమ్మాజీ సర్కార్ వారిదీ, భార్య వనకుమారీదేవిగారిది చిత్రాలు ఆమె వేసినట్లుగా చెప్పారు. ఊటీలో ఉన్నప్పుడు వారిద్దర్నీ కలిసారట ఆమె. ఆవిడ తిరిగి ఇంగ్లాండు వెళ్ళిపోయేక తన అనుభవాలను ఒక పుస్తకంగా వ్రాసింది. "త్రూ ఎ పేలెట్ ఇన్ ఈస్ట్రన్ పేలెసెస్" అని పుస్తకం పేరు. ఈ పుస్తకంలో చిత్రమైన సంఘటన ఒకటి ఆమె రాసింది. విజయనగరంలో ఆమె చిత్రాలు వేస్తున్నప్పుడు ఆనందగజపతి తను వేసిన ఆయిల్ పెయింటింగ్స్ ఆవిడకు చూపించేవాడట. ఒక చిత్రంలో అంశం ఏమిటంటే - ఒక స్త్రీ తనకు వచ్చిన లేఖను ఆసక్తితో చదువుతున్నట్లు. శ్రీమతి మెర్రిక్ ఆనందగజపతిని - "మీ దేశంలో మొగవాళ్ళు స్ర్రీలకు ఉత్తరాలు రాస్తారా? ఆశ్చర్యమే!" అని అడిగింది. ఆనందులు చమత్కారంగా "ఓ రాస్తారు, కాని, భార్యలకు మాత్రంకాదు" అని జవాబిచ్చేరట.
మహారాజువారు వేసిన ఇతర చిత్రాలు తల్లి అమ్మాజీ సర్కారువారి తైలవర్ణ చిత్రం, బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ వారి స్కెచ్ సెల్ఫ్ పొర్ట్రయిట్ - విక్టోరియా మహారాణి వారి చిత్రాన్ని తానే వేస్తున్నట్టు చిత్రించిన నిలువెత్తు పోర్ట్రయిట్ - ఇవన్నీ ఆనందుల ప్రతిభకు నిదర్శనాలు.
ఐతే కథ విన్నందుకు ఫలం ఎప్పుడు దక్కుతుందంటే - మెర్రిక్ వేసిన చిత్రాలు ఎక్కడ ఉన్నాయి? అంతకంటే ముఖ్యంగా ఆనందగజపతి వేసిన చిత్రాలు ఎక్కడున్నాయి? ప్రజలు చూడగలరా? సమాధానం దొరికితే గొప్ప ఫలమే.
ఇంక సామాన్యుల కథలు రెండు.
రామస్వామి
1919లో విజయరామగజపతి సంగీత కళాశాలను స్థాపించారు. హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసుగారిని అద్యక్షులుగానూ, ద్వారం, వాసావారి లాంటి మేరుసమానులైన విద్వాంసులను అధ్యాపకులుగాను నియమించారు.
అలాంటి సంస్థలో పనిచేసే దవాలా బంట్రోతు ఎటువంటివాడై ఉండాలి? నారాయణదాసుగారి కనుసన్నలలో మెలగాలికదా! అతను అందుకని విజయరామగజపతి తన పర్సనల్ అటెండరు రామస్వామిని సంగీతకళాశాల బంట్రోతుగా వేశారు. రామస్వామి ఎలా ఉండేవాడని? మంచి రూపం - మెరిసిపోతూ బుర్రమీసాలు, తిరుచూర్ణంతో నామం, తెల్లని పంచె, గ్లాస్కోలాల్చీ, తెల్లని పాగా, చేతిలో కర్ర, చెరగని చిరునవ్వు. అలాగ ఉండక మరి ఎలా ఉంటాడు? అతను హమేషా విజయరామగజపతుల సన్నిధిలో ఉండి వారి ఇంగితానికి అనుగుణంగాను, వారిని కలుసుకోవడానికి వచ్చిన ఇతర సంస్థానాధీశుల అవసరాలు కనిపెడుతూను మెలగాలి కదా! రాజావారితో అతడు అనేక ఉత్తరాది సంస్థానాలకు కూడా వెళ్ళినవాడు. ఇంతకూ అతడు హమేషా చేస్తుండిన రాజసేవ ఏమిటి? ప్రభువులకూ, అతిథులకు పలసినప్పుడో, అలసినప్పుడో సేవించడానికి అమృతం సిద్ధంగా ఉంచడం, వారి మతం, మితం గ్రహించి అందించడం. రామస్వామిది అమృతహస్తం. అంతటి నమకస్తుణ్ణి సంగీతకళాశాలకు అందునా దాసుగారికి సేవచేయమని రాజావారు నియమించేరు. నెలకు ఆరు రూపాయల జీతం మీద.
రామస్వామికి స్కాట్ లేండు ఆసవాల రుచులలోను, ఫ్రెంచి మధువుల మాధుర్యాలలోను ఎంత పాడిత్యమున్నా అతనికి అనునిత్యం అలవాటైనది మత్రం రామనామామృతమే - తాను మిగుల్చుకున్న డబ్బుతో తనవారికొక ఇంటితోబాటు రాములవారికి ఒక చిన్న గుడికూడా కట్టించేడు. రోజూ సాయంత్రం కళాశాలనుండి ఇంటికిపోతూ మిత్రులెవరైనా కనిపిస్తే (మాలాంటి చిన్న పిల్లలైనా సరే) అర్ధణావో, అణావో అడిగితీసుకుని పప్పుబెల్లాలు కొనేవాడు. తెల్లారకనే లేచి స్నానపానాదులయ్యాక గుడికి వెళ్ళి పూజచేసుకుని ప్రసాదం పంచుతూ కాలేజీకి వచ్చేవాడు.
రామస్వామికి ఫిడేలునాయుడుగారంటే పంచప్రాణాలు. ఆయన అధ్యక్షులుగా రిటైరయ్యేంతవరకూ రామస్వామి కూడా పనిచేసేడు. నాయుడుగారికి ఎంత పేరుప్రతిష్టలున్నప్పటికీ విస్తృతంగా కచేరీలు జరుగుతున్నప్పటికీ మొదట్లో కచేరీలకు డబ్బు మాత్రం తక్కువే ఇచ్చేవారు. 1920లలో మాటకదా నేచెపుతున్నది. నాయుడుగారు తనకు నూటపదహార్లు ఎవరైనా ఇస్తారా? తన సంగీతానికి విలువ కట్టేవారే లేరా అని బాధపడుతుండేవారు.
అదలా ఉంచండి. నాయుడుగారింట్లో గురుకులవాసం చేస్తూ చాలామంది శిష్యులు, కాలేజీ విద్యార్ర్థులు ఉండేవారు. రోజూ శిష్యుల్లో ఒకరు కూరగాయలు తెచ్చి నాయుడుగారికి చూపించి లెఖ్ఖచెప్పి మిగిలిన చిల్లర ఇచ్చేవారు. దమ్మిడీలతో సహా లెఖ్ఖ చూసుకున్న తర్వాతనే నాయుడుగారు సరే వెళ్ళండి అనేవారు. అప్పుడప్పుడు రామస్వామిని బజారుకు పంపేవారు కూరలు తెమ్మని. అతను తెచ్చినప్పుడు మాత్రం లెఖ్ఖ అంతగా పట్టించుకునేవారు కారు - అతను ఎంత చిల్లర ఇస్తే అంత తీసుకునేవారు. శిష్యులకు ఇది కంటకింపుగా ఉండేది. తెగించి ఒకనాడు గురువుగార్ని అడిగేసారు - ఈ పక్షపాతం ఏమిటని - ఐతే వినండి చెప్తాను అన్నారు నాయుడు గారు.
"ఎంత బాగా వాయించినా, ఎంత పేరువచ్చినా బాధపడుతూంటే రామస్వామి నన్ను ఊరడించే వాడోయ్ - బాధపడకండయ్యగారు! మీకు స్వర్ణాభిషేకాలు జరిగే రోజులొస్తాయండీ అనే వాడోయ్ - ఒక రోజున వచ్చి నన్ను అడిగాడు కదా - అయ్యగారూ - నేను చిన్న రాములోరిగుడి కట్టించానండి. రేపటి ఉదయం విగ్రహాలు పెడుతున్నారు. మధ్యాహ్నం సంతర్పణ జరుగుతుంది. సాయంత్రం తమరు కచేరీ చేస్తే ధన్యుణ్ణవుతానన్నాడోయ్ - పరమానందంతో నేను కచేరీ చేసేను - కచేరీ అయిన తర్వాత రామస్వామి నాకు నూటపదహార్లు తాంబూలం పెట్టి నమస్కరించేడు - అంత గొప్ప సన్మానం మొదటిసారిగా చేసినవాడిని చిల్లరలెఖ్ఖ అడగమంటారోయ్?"
రామస్వామి 80 ఏళ్ళుదాటి శుభ్రమైన జీవితం గడిపి ఒక సాయంత్రం రాములవారి దర్శనం చేసుకొని వచ్చి రాత్రి భోజనం వద్దు పాయసం చేయమని ఇంటివారికి చెప్పి అందరితో కలిసి పాయసం సేవించి సుఖనిద్రలో రాముని సన్నిధి చేరుకున్నాడు. అతను మాన్యుడా? సామాన్యుడా? అతని సంస్కారం ఈ నేలలోంచి వచ్చిందా? నెనరులోంచి వచ్చిదా? ఆ నిమ్మళమేదీ మనకు?
సన్యాసి - సంగీతం
ఒక రాత్రి - నేనూ మా సహ అధ్యాపకులు కవిరాయుని జోగారావు, కాట్రావులపల్లి వీరభద్రరావూ కాలేజీ నుంచి వస్తున్నాము. రోడ్డు చీకటిగా ఉంది - ఏదో మంచి కచేరీయే జరిగింది. దాని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. మంచిగానే మాట్లాడుకుంటున్నాము - అంతలో వెనుకనుంచి వినబడ్డది.
"మాగొప్ప కచేరీయే లెండి - మీరుఇనడం - బాగుందనడవూను - మేవూ ఇన్నాం కచేరీలు - సంగీతవంటే అలాగుండాలి - ఆ ఆ రోజులు పోయేయి" - నిర్ఘాంతపోయేము మేము - వీధి దీపాల వెలుగులో ఆగి ఎవరా అని చూస్తే - అతను బికారి. కొంచెం పట్టుమీద తూల్తున్నాడు. వయసు మళ్ళినవాడే - చూస్తూనే ఉండేవారం వీధుల్లో. గొడుగులు బాగుచేస్తూ తిరిగి సాయంకాలానికి వచ్చిన డబ్బు నిషాఖుషీలోకి వెళ్ళి రాత్రి "మాతా! ఒక కబళం తల్లీ" అని తిరిగేవాడు - అది తిని ఎక్కడో పడుకునేవాడు. ఏ సంగీతాలు విన్నావోయ్ నువ్వు? ఎక్కడ విన్నావు? అని అడిగాం - కాకినాడ సరస్వతీగానసభలోనండీ - తిరుచ్చి గోవిందస్వామి పిళ్ళె ఫిడేలు వాయిస్తేనండీ - ఆ నాదమండి జడివోనలో తడిసినట్టుండేదండి బాబూ - పల్లడం సంజీవరావు ఫ్లూటు ఇన్నారా తమరు - గొప్ప తీపండి ఓయిద్యం, కాని ఒకటే స్పీడండి, నాయుడుగారి వోయిద్యం సరేనండి - ఆరి ఇంట్లో రోజూ ఇనేవొఓడినంది - రోజూ అమృతమమేగదండీ - అయండీ సంగీతాలంటే" అని.
మాకు దివ్యోపదేశం చేసి గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. చాలా రోజుల్దాకా కనిపించలేదు. కొన్ని నెల్లతర్వాత ఒక రాత్రి నేనూ, మా మేనత్త ద్వారం మంగతాయారూ మా ఇంట్లో హాల్లో కూర్చుని ఈమని శంకరశాస్త్రిగారి వీణకచేరీ టేపు వింటున్నాము - కోలంక వెంకటరాజుగారు మృదంగం వాయిస్తున్నారు. అద్భుతసుందరంగా ఉంది - తన్మయంగా వింటున్నాము. ఇంతలో వీధి అరుగుమీంచి వినిపీంచింది ఆకాశవాణిలా - "అదండీ మృదంగం అంటే" అని - తలుపుతీసి చూశాం. ఆ గొడుగుల బికారే.
అన్నం పెట్టింది మంగతాయారు - నీ పేరేమిటని అడిగింది. సన్యాసండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సెలవులకు మెడ్రాస్ వెళ్ళినప్పుడు మంగతాయారు అడిగింది వాళ్ళ అమ్మగార్ని.
ఎవరీ సన్యాసి అని - మామ్మగారు "అయ్యో వాడా తల్లీ మాదాకవళం చేసుకుంటున్నాడా - వాడికి బట్టలిచ్చి రోజూ భోజనం పెట్టండి తల్లీ" అని సన్యాసికథ చెప్పింది.
చాగంటి గంగబాబుగారి కోసం 1919లో సంగీతకళాశాల విజయరామరాజుగారు ప్రారంభించారని అందరికీ తెలుసుకదా! ఇతను అంధబాలుడు. ఇతని తండ్రి జోగరావు పంతులుగారు విజయరామగజపతి అంతరంగిక కార్యదర్శి. గంగబాబు గుర్రబ్బండిలో కాలేజికి వెళ్ళేవాడు. అతనికి ఎస్కార్టుగా సన్యాసిని నియమించారు.
గంగుబాబుగార్ని 15 సంవత్సరాలు కాలేజీకి, ద్వారం నాయుడుగారింటికీ, కచేరీలకీ సన్యాసి తీసుకెళ్ళాడు. నాయుడుగారికి గంగబాబు కచేరీలలో ప్రక్కవాద్యం వాయించేవారు. అంచేత పెద్దపెద్ద సభలలో గొప్ప గొప్ప కచేరీలు వారితో పాటు వెళ్ళినప్పుడు వినేవాడు సన్యాసి, గంగబాబుగారు పెద్ద విద్వాన్సులయ్యేసరికి వారి ఆస్తులు పరగతం అయిపోయాయి. గుర్రబ్బళ్ళు పోయాయి. శిష్యులుండడంవల్ల వేరే ఎస్కార్టు అవసరం లేక సన్యాసి ఉద్యోగం ఊడింది. మరి తర్వాత ఏంపనులు చేసేవాడోగాని మేం చూసే సరికి గొడుగులు బాగుచెయ్యడమే అతనిపని.
గొడుగులు బాగుచేసేవాడికి గొడుగు లేకపోవచ్చుగాని, వాడు జడివానలో తడిసినట్టే ఒకప్పుడు గొప్ప నాదప్రవాహంలో మునిగేడు. నిత్యం సంగీతామృతం సేవించిన అతను రెండు చేతులు జోడించి ఏ రాత్రికి ఎంత దొరుకుతే అంత తినడం - అతనికి ఇది పరమేశ్వరుని వరమా? సన్యాసి నిజంగా సార్ధకనాముడా? సందర్భం సాగత్యం శుభ్రమైనవైతే మామూలు మనుష్యులకు కూడా గొప్ప అభిరుచి ఆత్మతృప్తి లభిస్తాయి.
విద్యలన్నీ ఉండి వినయవంతులవడం
అధికారమంతా ఉండి ఆనందభోజులవడం
విద్యలేవీ రాకపోయినా వివేకవంతులవడం
ఇదేకదా సంస్కారం
కోటలోను పేటలోను కథలు బాగుంటే
దేశ చరిత్రంతా మహాకావ్యమౌతుంది.
****