top of page

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

కల కానిది

palepu buchiraju

పాలెపు బుచ్చిరాజు

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కథ.

ఉదయం లేచిన దగ్గరనుంచీ జానకికి మనసేమీ బాగోలేదు. ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. గతం భూతమై భయపెడుతోంది. యాంత్రికంగా కాఫీ కలుపుకుని తాగింది. ఏదో కొంత ఉడకేసుకుని తింది. ఒంటరితనం భరించరానిదిగా ఉంది. రాత్రి కూడా అంతా కలత నిద్దరే అయింది. ఏవేవో పీడ కలలు. అలవాటుగా ప్రక్కన పడుకునే సునీత లేకపోడంతో నిద్ర సరిగ్గా పట్టలేదు. సునీత ఇంట్లో ఉంటే చేతినిండా పని ఉంటుంది. అసలు తీరిక ఉండదు. దాని స్నానం అయ్యాక తల దువ్వి, డ్రస్సువేసి, బడికి పంపాలి. లంచి బాక్సు తయారు చేసి ఇవ్వాలి. తిరిగి వచ్చేసరికి ఏదో ఒక పిండి వంట చేసి ఉంచాలి. అది పెట్టే చిన్నా చితకా పేచీలని సంబాళించుకోవాలి. అయినా ఏమాత్రము విసుగు కోపము లేకుండా అన్ని పనులూ చేస్తుంది. తనకి మాత్రం ఇంకెవరు ఉన్నారని? ఒక్కగానొక్క కూతురు సునీత మాత్రమే తన సర్వస్వం. భర్త రాఘవ పెళ్ళయిన అయిదేళ్ళకే ఆనందపుటంచులు చూపించి, ఒక్కసారిగా దు:ఖసముద్రంలో ముంచి, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు. ఎంత ప్రేమ! అతనికి కూతురంటే! ఎన్ని కలలు కంది తను. అన్నీ పేకమేడలై కూలిపోయాయి.  చావు రాలేదేమని కుమిలి పోయింది. సునీతలో అతని రూపు చూసుకుంటూ, గుండె రాయి చేసుకుని బతుకుతోంది.

నిన్న, తన స్నేహితురాలు కమల అక్కగారి పెళ్ళికి వాళ్ళతో వెళ్తానని పట్టుపట్టింది సునీత. ఇంతవరకు ఆమెని ఒంటరిగా ఎక్కడికీ పంపలేదు. ఎనిమిదో క్లాసులోకి వచ్చింది. తెలిసీ తెలియని వయసు. తను వద్దంది. కమల తప్పకుండా రమ్మని పట్టుపట్టింది అంది సునీత. ఆఖరికి ఇద్దరి మధ్యనీ ఉన్న ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం, సునీత ‘అవును’, ‘కాదు’ అని రెండు చీటీల మీద రాసి, సాయిబాబా పటం దగ్గర పెడుతుంది. ఆ పటానికి నమస్కరించి, బాబాని మనసులో తల్చుకుని తను ఆ రెండిటిలో ఏదో ఒకటి తీయాలి. దానిలో ఏది రాసి ఉంటే అలా చేయాలి. కాదన కూడదు. ఆ రోజు ‘అవును’ అని వచ్చింది. అందుచేత జానకికి ఒప్పుకోక తప్పలేదు. ఎప్పుడూ గెలుపు సునీతదే. ఎందుకంటే, తనకేం కావాలో అదే రెండు చీటీల్లోనూ రాస్తుంది. ఆ విషయం తెలిసీ కూడా, ఆ చిన్నారి మనసుని నొప్పించ కూడదని, ఓటమిని అంగీరిస్తుంది జానకి. ఎలాగైతేనేం, పెళ్లివారితోనే వెళ్లి వారందరితోనే తిరిగి రావాలనే షరతు మీద పంపడానికి ఒప్పుకుంది జానకి. సునీత ఎగిరి గంతేసింది.

సాయంత్రం అవుతుండగా మాధవ రావడంతో జానకి ఆలోచనలకి అడ్డకట్ట పడింది. రాగానే “సునీత ఏది?” అని అడిగాడు. జానకి చెప్పింది. “మరయితే ఖాళీగానే ఉన్నావుగా, ఏ పార్కుకో వెళ్దాం పద.”అన్నాడు. తనకైతే

 

వెళ్లాలనీ ఉంది, వద్దనీ ఉంది. ఫలితంగా మౌనం వహించింది. దానిని అంగీకారంగా తీసుకుని, బైటికి దారి తీశాడు మాధవ. మైకంలో ఉన్నట్టుగా లేచి, తలుపుకి తాళం వేసి, అతని వెంట నడిచింది జానకి.

మనసులో బెరుకు బెరుకుగా ఉంది. ఎన్నెన్నో శంకలు. ప్రపంచం ఏమనుకుంటుంది?  ఏమనుకుంటేనేం? అతను చాలా మంచివాడు. ఎప్పడూ హద్దు మీరడు. సునీత అంటే ప్రాణం పెడతాడు. తనకి ముందునుంచీ బాగా తెలిసిన వాడు. అయితే మాత్రం? లోకం దృష్టిలో పరాయి మొగాడితో విచ్చలవిడిగా తిరగడం ఏమనిపించు కుంటుంది?

అతను మాత్రం ఆ విషయాన్నేం దాచిపెట్టలేదు. ఎన్నో సార్లు తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. “మోడువారిన నిండు జీవితాన్ని అలాగే వదిలేస్తావా? నీరు పోసి చిగురించనియ్యవా? అలా కుమిలి పోతూ ఎంతకాలం జీవించ గలవు? ఆలోచించు. ఆలస్యం అమృతం విషం అన్నారు. తొందరగా ఒక నిర్ణయానికి రా!” అంటాడు.

ప్రశాంతమైన నీటి మడుగులో ఒక రాయి వేశాడు. అది అంతులేని అలల కల్లోలాన్ని లేపింది. తన మనసు పరిపరి విధాల పోతోంది. ఊయలలా ఆ చివరినుంచి ఈ చివరికి ఊగిసలాడుతోంది. ఏం? ఒక సామాన్య వనితలా బతికే అధికారం తనకి లేదా? కన్నెవయసులో కన్న కలలు సాకారం చేసుకోవాలనుకోవడం నేరమా? ఆచారాలు, సంప్రదాయాలు, చట్టుబండలు అంటూ, వాటి వెనక తనని తాను మోసం చేసుకుంటూ, బూటకంగా బతకడం ఎంతవరకు సమంజసం?

మరి సునీత మాటేమిటి? మాధవ వరకు అయితే ఫరవాలేదు. అతను దానిని ప్రేమగానే చూసుకోగలడన్న నమ్మకం తనకి ఉంది. కాని ఆ చిన్నారి మనసు మరొక క్రొత్త తండ్రిని ఆహ్వానిస్తుందా? అవేమీ తెలుసుకోకుండా అడుగు ముందుకు వేస్తే భావి జీవితం దుర్భరం కావచ్చు.

ఒక ప్రక్క మాధవ దగ్గర్నుంచి ఒత్తిడి ఎక్కువైంది. రంగుల మయమైన జీవితాన్ని చేతులారా చీకటి వలయం చేసుకోవద్దని మందలిస్తున్నాడు. ఎండిపోయి పాషాణమైపోయిన తన గుండెల్లో, ఆశ అనే సౌగంధిక పుష్పాన్ని అవతరింపజేశాడు. దాన్ని పెంచి పోషించే బాధ్యత తనమీద పెట్టాడు. తను ఎటూ తేల్చుకోలేకపోతూ ఉంది.

అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. పోనీ సునీతనే అడిగితేనో? అని. దానికేమీ తెలియనంతటి చిన్న వయసయినా బాగుండేది. నిర్ణయం పూర్తిగా తనదే అయ్యేది. అలా కాకుండా, వయసులో ఉన్న ఒక స్త్రీ అవసరాల్ని, అభధ్రతల్ని, తెలుసుకోగలిగినంత ఎదిగిన పిల్లయినా బాగుండేది. ఈ పరిస్థితుల్లో ఈ మాట దాని చెవిన వేస్తే, అది దాని మనసు మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో అని భయం వేసింది.  అయినా భగవంతుడి మీద భారంవేసి, ఒకనాడు అడగనే అడిగింది.

“సునీతా! నీకు ఒక నాన్న ఉంటే బాగుండును కదా!”

సునీత తెల్లబోయి చూస్తూ అంది. “అమ్మా! నాన్న ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా? మరి ఇప్పుడెలా రాగలడు?”

“అది కాదమ్మా! నేను మాధవ అంకుల్ ని పెళ్లి చేసుకున్నాననుకో. అప్పుడాయన నీకు నాన్న అవుతాడు కదా1”

ఊహించని ఈ ప్రశ్నకి సునీత దెబ్బతింది “మాధవ అంకుల్ నాకు నాన్న ఎలా కాగలడమ్మా? మాధవ అంకుల్ మాధవ అంకులే. ఆయనకీ నేనంటే చాలా ఇష్టం. కాదనను. మంచివాడు. కాని, నాన్న నాన్నే. ఆ స్థానంలో నేను మరెవరినీ చూడలేను. ఒకసారి కమల కూడా అంది. ‘మీ అమ్మ మాధవ అంకుల్ ని పెళ్లి చేసుకుంటుందట కదా? నీకు కొత్త నాన్న వస్తాడన్నమాట. అయినా అమ్మలెక్కడైనా పెళ్లి చేసుకుంటారా? నాకూ మా నాన్న లేడు. అయినా అమ్మ మళ్లి పెళ్లి చేసుకుందేమిటి? అక్కలకి పెళ్లి అవుతుంది. మా అక్క పెళ్లి అవుతోంది.’ అంది.

 వద్దమ్మా! నువ్వు మాధవ అంకుల్ ని పెళ్లి చేసుకోవద్దు. ఈ మధ్య ఆయన మనింటికి తరుచూ వసున్నాడు. నువ్వు కూడా ఆయనతోనే ఎక్కువసేపు ఉంటున్నావు. నన్ను లెక్క చేయడం లేదు. ఆయనంటే నాకు ఇష్టమే. కాని… నాన్న...? వద్దమ్మా! వద్దు. నా ఫ్రెండ్సు నాకు కొత్త నాన్న వచ్చాడు అంటారు.” అని ఏడుస్తూ అక్కడినుంచి పారిపోయింది.

జానకి గుండె తరుక్కుపోయింది. ఒక్కసారిగా ఏడుపు ముంచుకు వచ్చింది. ఆ విషయం ఎత్తి పసి పిల్ల మనసుని గాయ పరిచానని పశ్చాత్తాప పడింది. అది బాధపడితే తను భరించలేదు. ఈ ప్రపంచంలో తనకి ‘నా’ అంటూ ఎవరైనా ఉంటే, అది సునీత మాత్రమే. దానికి దూరమై తాను బ్రతకలేదు. స్వార్థంతో ఎంత తప్పు చేశాను అని బాధపడింది. ఆ క్షణంలోనే గట్టి నిర్ణయానికి వచ్చింది. మాధవకి తానంగీకరించలేనని చెప్పి, దూరంగా ఉంచాలని నిశ్చయించుకుంది. మరెప్పుడూ ఈ ఆలోచన తన మన:ఫలకం మీదికి రాకుండా చెరిపేయానుకుంది. ఇదే విషయం ఎన్నోసార్లు అతనితో చెప్పాలని ప్రయత్నం చేసింది. కాని అంత మంచి మనిషిని ఎలా నిరుత్సాహపరచాలో బోధపడలేదు.

 

ఈ రోజు తప్పకుండా చెప్పేయాలనే తలంపుతోనే అతనితో పార్కుకి వచ్చింది. కాని మాటలు పెదాలు దాటి బైటికి రావడం లేదు.

“గంట సేపుగా ఇక్కడ కూర్చున్నాం. నేనేదో వాగుతూనే ఉన్నాను. నువ్వు పెదవి కదిపి ఒక్క ముక్క మాట్లాడిన పాపాన పోలేదు. అదీకాక ఆలోచనల్లో ములిగిపోయి, పరిసరాల్ని కూడా మరిచిపోయి అన్యమనస్కంగా ఉన్నావు. ఏమయింది ఈ రోజు? “ అడుగుతున్నాడు మాధవ.

అప్పటికి తేరుకుంది తను. “ఏం లేదు. సునీతని ఒంటరిగా ఎప్పుడూ బైటికి పంపలేదు. ఎలా ఉందో అని ధ్యాస అంతా దాని మీదే ఉంది.” అంది.

“అంత బెంగ పెట్టుకోవడం దేనికి? పదిమందితో కలిసి పెళ్ళికి వెళ్ళింది కదా. వేడుకల్లో చాలా ఆనందిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒకరకమైన అనుభవం. అప్పుడప్పుడూ అలా పంపడం మంచిది కూడా. నాలుగు విషయాలూ తెలుస్తాయి. అనవసరంగా బాధపడకు.” అన్నాడు అనునయంగా మాధవ.

“చాలా ఆలస్యం అయింది. ఇక మనం వెళ్దాం.” అంటూ లేచినిలబడింది జానకి.

మాధవ జానకిని ఇంటిదగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు.

ఒంటరిగా ఇంట్లో మిగిలిన జానకికి వంట చేసుకోవాలనిపించలేదు. శరీరం ఎంతో అలసటకి గురైనట్టుగా తన వశంలో లేదు. మానసిక క్షోభ కూడా మనిషిని శారీరకంగా కృంగదీసేస్తుంది కాబోలు. ఆ రాత్రికి బ్రెడ్ తిని, పాలు తాగి పడుకుంది.

తెల్లారి లేస్తూనే సునీత వస్తుందన్న విషయం గుర్తుకి వచ్చింది. హుషారుగా అన్ని పనులు ముగించుకుని, వేడి వేడిగా పూరీ కూరా చేసి ఉంచింది. అదుంటే చాలు. ఇష్టం కనక మాట్లాడకుండా తినేస్తుంది సునీత. ఉప్మా, ఇడ్లి లాంటివైతే, ఆకలి లేదని, ఇప్పుడు కాదు. తరవాత తింటానని తప్పించు కుంటుంది.

అన్నీ రెడీ చేసుకుని, సునీత కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. వీధి గుమ్మం వైపు, గోడగడియారం వైపు మార్చి, మార్చి చూస్తూ. టైము అసలు నడవడం లేదు అనుకుంది.

ఇంతలో బాణంలా లోపలికి దూసుకు వచ్చి, అమ్మని లతలా పెనవేసుకుపోయింది సునీత. కాస్త స్థిమిత పడి, స్నానం చేసి వచ్చాక, ప్లేటులో టిఫిను అందిస్తూ, “పెళ్లి ఎలా జరిగింది?” అని అడిగింది జానకి.

 

“చాలా బాగా జరిగిందమ్మా. ఎంత మంది చుట్టాలు వచ్చారో! రకరకాల ముచ్చట్లు. ఎంత బాగా జరిపించారో. రోజంతా పండగలా గడిచిందనుకో. కమల అయితే, నన్నసలు వదిలిపెట్టలేదు. ఇద్దరం కలిసి పెళ్ళికొడుకుని ఆట పట్టించాం. వాళ్ళమ్మా, అక్కయ్యా కూడా నేను పెళ్ళికి వెళ్ళినందుకు చాలా సంబర పడ్డారు. మంచిమనసుతో పంపావని నిన్నుకూడా ఎంతో మెచ్చుకున్నారు. “ అంటూ గుక్కతిప్పుకోకుండా విశేషాలన్నీ వివరంగా చెప్పింది.

చాలా రోజుల తరవాత, కూతురి ముఖంలో అంత ఆనందం చూసిన జానకి హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆమె ముఖంలో ఒక విదమైన క్రొత్త కళ వచ్చినట్టు అనిపించ సాగింది.  పెళ్ళికి పంపించి తాను తప్పు చేయలేదని తృప్తి పడింది.

భోజనాలు పూర్తయి, జానకి వంటగది చక్కబెట్టుతూ ఉంటే, వెనక వెనకనే తిరగ సాగింది సునీత. ఏమిటని వెనక్కి తిరిగితే ఏమీ చెప్పేదికాదు. “అబ్బే! ఏం లేదు.” అనేది.

పని పూర్తి చేసుకుని వచ్చి తీరిగ్గా సోఫాలో కూర్చున్నాక, ఎదురుగా నేల చూపులు చూస్తూ కూర్చున్న సునీతని, “ఏంటమ్మా! ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏదో చెప్పాలనుకుంటున్నావు. అడిగితే, ఏమీ లేదంటావు. నా దగ్గర నీకు దాపరికం ఏమిటి? చెప్పమ్మా! ఏం కావాలి?”  అని అడిగింది జానకి.

అప్పటికి కాస్త ధైర్యం చేసుకుని నోరు విప్పింది సునీత. “ మరి, అమ్మా! మనం ఏవిషయంలోనైనా ఏం చేయాలో తోచనప్పుడు ‘అవును’, ‘కాదు’ చీటీలు రాసి బాబాని అడుగుతాం కదా! ఇప్పుడు కూడా అలా చేద్దాం.”

“బాగానే ఉంది. ఇప్పుడు అలాంటి అవసరం మనకేం వచ్చింది?” అడిగింది జానకి.

“అదేనమ్మా! మాధవ అంకుల్ ని నువ్వు పెళ్లి చేసుకోవాలా? వద్దా? అన్నదానిని గురించి.“ అంది సూటిగా అమ్మ మొహంలోకి చూస్తూ.

జానకి ఒక్కసారిగా నిశ్చేష్టురాలయింది. షాక్ నుంచి తేరుకోవడానికి ఒక్క నిముషం పట్టింది. చీటీల విషయంలో సునీత ఏం చేస్తుందో తనకి తెలుసు. రాఘవ స్థానంలో మరొకరెవరూ రావడం సునీతకి సుతరామూ ఇష్టం లేదు. అందువల్ల కాదనే రాస్తుంది. ఈ విషయంలో తానూ ఒక నిర్ణయానికి ఎప్పుడో వచ్చేసింది. కనుక కాదని ఆ చిన్న పిల్ల మనసుని కష్టపెట్టే కంటే సరేనని, ఓటమిని అంగీకరించడమే ఉత్తమం. ఈ చిక్కుముడిని ఇలా విప్పాలని, భగవంతుడే సునీతకి ఈ ఊహ కల్పించాడేమో!  ఇక్కడితో ఈ సమస్యకి భరత వాక్యం పలికి, భావి జీవితానికి ఒక చక్కని రాచబాట వేసుకోవచ్చును.

 

ఈ ఆలోచన రాగానే, “సరే! నీ ఇష్టం.” అంది జానకి.

సునీత పరుగు పరుగున పోయి రెండు తెల్ల కాగితాల మీద ఏదో రాసి తెచ్చి సాయిబాబా పటం ముందు పెట్టింది.

“అమ్మా! నువ్వు బాబాని మనసులో తల్చుకుని వీటిలో ఏదో ఒక చీటీ తియ్యి. అందులో ఏది వస్తే అలా చేయాలి. తరవాత నేను మోసం చేశానంటే కుదరదు. సరేనా?”  అంది.

“నా చిన్ని తల్లీ! నీ మాట నేనెప్పుడు కాదన్నాను? నేనేం చేసినా నీ మంచిని కోరే. నువ్వు కాక నాకింక ఎవరున్నారు? పిచ్చి తల్లీ!” అంది జానకి.

“అయితే ఒక చీటీ తియ్యి.” అంది సునీత.

జానకి బాబాకి మనసులో ప్రణామం చేసి, కళ్ళు మూసుకుని వణుకుతున్న చేతులతో, ఒక చీటీని తీసింది. సునీత వెంటనే ఆ రెండో దానిని చించి పారేసింది.

కాగితం మడత విప్పి, ఎదురుగా పట్టుకుని, కళ్ళు విప్పిన జానకి ఆశ్చర్యానికి అంతులేదు. దానిలో ‘అవును’ అని రాసి ఉంది. ఎప్పట్లాగే ఈ సారికూడా సునీత చేతుల్లో తాను ఓడిపోయింది.

సునీత నవ్వు ముఖంతో నిశ్చలంగా తనవైపే చూస్తూ నిలబడింది.

స్నేహితురాలి అక్క పెళ్ళికి వెళ్లి వచ్చిన సునీత బాగా ఎదిగిపోయింది అనుకుంది జానకి.​

OOO

bottom of page