top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

భార్య...భర్త... ఓ గ్లోబల్ ఖడ్గం

karanam srinivasulu reddy

డా. కరణం శ్రీనివాసులు రెడ్డి

కుటుంబం మానవ నిర్మితమైన వ్యవస్థల్లో అత్యంత ప్రాచీనమైనది. ప్రాథమికమైనది. అంతేకాదు సార్వత్రికమైనది కూడా. కుటుంబమనేది ఒక మనిషి జైవిక, మానసిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక మరియు ఆధ్యాత్మిక జీవితానికి మొదటి పాటశాల. ఒక వ్యక్తి వైయక్తికత నుండి సామాజికత వైపుకు సరైన రీతిలో పరిణామం చెందే ప్రక్రియ కుటుంబం నుండే మొదలౌతుంది. మానవుడి భావి జీవితం కుటుంబం నుండే మొదటి అడుగు పడుతుంది.

 ప్రపంచంలో పటిష్టమైన కుటుంబ వ్యవస్థ కలిగిన దేశాలలో భారతదేశం ప్రముఖమైనది. వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వర్ధిల్లింది. అదే వ్యక్తి వికాసానికి, సామాజిక సంబంధాలకు బలమైన పునాది వేసింది. భారతీయ కుటుంబ వ్యవస్థ లోపాలకు అతీతం కాకపోయినా, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాఇప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబoధాలు మిగిలి ఉన్నాయి. కానీ అవి కూడా ఆవిరైపోయే సన్నివేశాలు ఇప్పుడు మన కళ్ళ ముందు దర్శనమిస్తున్నాయి. కుటుంబానికి ఆలంబనమైన భార్యాభర్తల  సంబంధాలు బీటలువారి కుటుంబ పునాదులే కదిలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

సగటు మనిషి దీనికి కారణాలు ఏమిటా అని ఆలోచిస్తే తోచే సమాధానం కాలం మారిపోయింది అని. మరి ఆ  కాలం ఎందుకు మారుతోంది ,ఆ మార్చే శక్తి ఏది అన్న దానికి అతని దగ్గర సరైన సమాధానం లేకపోవచ్చు. ఆ సామాజిక చలన సూత్రాన్ని ప్రతిపాదించేవారు సామాజిక శాస్త్రవేత్తలు మరియు సాహిత్యకారులు. ప్రస్తుత సాహిత్య సందర్భంలో కవిత్వాన్ని ఆధారం చేసుకొని కుటుంబంలో బార్యాభర్తల సంబంధాలను పరిశీలన చేద్దాం.

          కుటుంబమనే బండికి భార్యాభర్తలు కాడెద్దుల్లాంటి వారు. ఇరువురు అన్యోన్యంగా, సఖ్యతతో, సమన్వయంతో, సక్రమంగా నడిస్తేనే కుటుంబమనే బండి సాఫీగా సాగుతుంది. లేదంటే అడుగడుగునా ఒడిదుడుకులే. అందుకే భారతీయ సంస్కృతి భార్యాభర్తల అనుబంధానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. భార్య లేని జీవితం భర్తకు, భర్త లేని జీవితం భార్యకు దుర్భరమైనదిగా భావిస్తారు.వివాహం లేని జీవితానికి భారతీయ సమాజంలో అంతగా గౌరవం లేదు. వొంటి కట్టెతో పోవడం(అవివాహితుడిగా చనిపోవడం)పాపమని మన విశ్వాసం.

          ప్రపంచీకరణ దేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్యంతో మొదలౌతుంది. ఆపై  ప్రతి మనిషిని  వస్తు వినియోగదారుడుగా మారుస్తుంది. అంతిమంగా మనిషినే వస్తువుగా రూపాంతరం చెందిస్తుంది. మనిషిలోని మానవాంశ(Human Element)ను తొలగిస్తుంది. ఎదురుగా రక్తమాంసాలతో, స్పందిచే హృదయంతో ఉన్న మనిషిని సైతం వ్యాపార దృష్టితో, వస్తు కోణంలో చూసే తత్వాన్ని మనిషిలో పెంపొందిస్తుంది. దీంతో అన్ని మానవ సంబంధాలూ వ్యాపార, వస్తు సంబంధాలుగా మారిపోతాయి. ఆఖరుకు కుటుంబమే ఒక వ్యాపార సంస్థగా మారిపోతుంది. ఇదంతా చాప కింద నీరు చేరే ప్రక్రియ లాంటిది. గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి వుంటుంది.

          కుటుంబంలో ప్రవేశించిన ప్రపంచీకరణ భార్యాభర్తల సంబంధాలపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.మానవ సంబంధాలకు ఆధారమైన వేర్ల వంటి భార్యాభర్తల మధ్య పెట్టుబడి భావన, వ్యాపారాత్మక దృక్పథం ప్రవేశించింది. దాంతో అవి కాస్తా పెట్టుబడి సంబంధాలుగా మారిపోయాయి.

పెట్టుబడి సంబంధాలు:

                   ఒక సినిమా పాటలో శ్రీశ్రీ “మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము” అంటారు. ఆ తోడు భర్తకు భార్య, భార్యకు భర్త. నేనే నీవు. నీవే నేను అనే బంధాన్ని కొలవడానికి ఏ కొలమానాలూ లేవు. అందుకే పెళ్లి చుట్టూ ఎంతో సంస్కృతి, మరెన్నో సంప్రదాయాలూ అల్లుకొన్నాయి. పెళ్లి ఒక పవిత్ర కార్యమనీ ఆ పెళ్లి ద్వారా ఒక్కటైన ఆ జంటది జన్మజన్మల బంధమనీ అంటారు పెద్దలు.

                   కుటుంబ సంబంధాలే తర్వాత సామాజిక సంబంధాలకు ఆధారభూతమౌతాయి. కానీ సంఘటితం,ఉమ్మడితత్త్వం,సామాజిక అల్లికలోని చిక్కదనం పెట్టుబడికెప్పుడూ ప్రమాదమే.పెట్టుబడి వేళ్ళూనుకోవాలంటే మొదట ధ్వంసం కావాల్సింది కుటుంబమే. అందుకే పెట్టుబడి మొదటి టార్గెట్ కుటుంబమే. కుటుంబంలోకి పెట్టుబడి ప్రవేశించడమే జరగబోయే విధ్వంసానికి నాంది.

                   జూకంటి జగన్నాథం ఈ విషయాన్ని ‘సంధికాలం’ కవితలో-

                             “అవును నిజమే

                                    అన్ని షరతులకు లోబడి

                                    పెట్టుబడిని ఆహ్వానించినపుడే

                                    పురుషుడు ఒక వస్తువు

                                    పెండ్లాం ఒక చెక్ బుక్

                                    పిల్లలు వ్యాపారపు చేను” (జూకంటి జగన్నాథం కవిత్వం-1, పుట-17) అని స్పష్టం చేశారు. తనువూ, మనసూ ఒకటై బ్రతుకుతున్న భార్యా భర్తల మధ్య పెట్టుబడి, డబ్బు, వస్తువు ప్రవేశించినపుడు నిజంగానే అతడు ఆమెకొక వస్తువు. ఆమె అతనికొక చెక్ బుక్. ఇక వారి మధ్యనుండేవి వస్తు సంబంధాలే తప్పించి ఆత్మీయానుబంభాలు కాదు.

                             “ఒకరికొకరం వస్తువులమైనపుడు

                                    ఒకరికొకరం ఆస్తులమైనపుడు

                                    ఇతరుల దురాక్రమణ నుంచి

                                    ఆస్తుల సంరక్షణే

                                    జీవితాలకు ఏకైక లక్ష్యమైనపుడు” అంటూ ఓల్గా  ‘దాంపత్యం’ అనే కవితలో భార్యా భర్తల సంబంధాలు వస్తు సంబంధాలుగా రూపాంతరం చెందిన వైనాన్ని వివరించారు.

                   వస్తు సంబంధాలలో ప్రధానంగా కనిపించేది డబ్బు కొద్దీ ప్రేమ, వస్తువు కొద్దీ సుఖం. కార్లు, ఎ.సి లు, సెల్ఫోన్లు. ఇంట్లోని వస్తు సంచయమే వారి మధ్య బంధానికి చిహ్నాలుగా నిలుస్తాయి. అంటే తప్ప ప్రేమ, ఆప్యాయత వారి బంధానికి కొలమానాలు కావు. ఎ.విద్యా సాగర్ ‘రెడ్డి గారి పార్కు’ కవిత ఇదే చెప్తోంది.

                             “వాళ్ళిద్దరూ కలిసి వొకే కార్లో వచ్చినా

                                    సీటు బంధమే తప్ప

                                    నోటి సంబంధముండదు వాళ్లకి

                                    కలిసి నడిచేందుకొచ్చినా సరే

                                    చెవిలో చెరికో సెల్ ఫోను

                                    బాట సంబంధమే తప్ప

                                    మాట సంబంధముండదు వాళ్లకు” అని భార్యాభర్తలిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నా, ఒకే కార్లో తిరుగుతున్నా, ఒకే బాటపై నడుస్తున్నా ఎవరికి వారై, వొకరికొకరు ఏమీ కానట్టే ఉండటమనే విషయాన్ని వివరిస్తున్నాడు. ఇలాంటి సంసారాల్లో భార్యాభర్తలు ఒకే ఇంట్లో కలిసి ఎంత దూరం ప్రయాణించినా ఎన్నటికీ కలవని రైలు పట్టాలే.

                             “రెండూ సమాంతర రేఖలే

                                    మధ్యదూరం పెరిగి పెరిగి చివరికి ఒంటరిగా

                                    దూరం శూన్యమై శూన్యమై చివరికి ఒక్కటిగా

                                    మధ్య రూపాయి బిళ్ళ భళ్ళున క్రింద పది ... పరుగే పరుగు

అంతా డొల్ల

వస్తువులు వస్తువులుగా

పగళ్ళు పగళ్ళు, రాత్రులు రాత్రులుగా

బ్యాంకు బ్యాలెన్సులుగా జీవితాలను లెక్కించి లెక్కించి

మెట్లు...మెట్లు...ఎడతెగని మెట్లపై

అలుపెరుగని అధిరోహణం” అని ‘అడుగులు నేలపై ఉన్నప్పుడు’ కవితలో రామాచంద్రమౌళి అంటారు.

            గమ్యం లేని ఆ మెట్ల అధిరోహణంలో కోల్పోయేదేమిటనినే స్పృహ లేకుండా చేసే ఆ పరుగులో యాంత్రికంగా, శూన్యంగా ఎన్నో సంసారాలు నెట్టుకొస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి సమయమెక్కడిది? సంసారమంతా చిట్టాపద్దుల వ్యవహారం.

          భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే గానీ సంసారం గడవదనే భావన బాగా నాటుకుపోయింది. బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాల విషయాల్లో సర్దుకుపోతున్నాం గానీ సంపాదనలో మాత్రం రాజీపడలేకపోతున్నాం. ఉన్నదానితో సర్దుకోలేకపోతున్నాం. సంపాదనకై పెట్టే పరుగులో పొందుతున్నదేమి? పోగొట్టుకుంటున్నదేమి? అన్న స్పృహ కూడా లేకుండా పరుగుపెడుతున్నాం. చివరకు మనిషి డబ్బు సంపాదించి వస్తువులు పోగేసే యంత్రంగా తయారవుతున్నాడు.

లైంగిక సంబంధాలు:

                        కుటుంబమనేది భార్యాభర్తల లైంగిక సంబంధాలకు వ్యవస్థాగత రూపమిచ్చే విభాగం. అంటే కుటుంబానికి మూలం భార్యాభర్తల మధ్యగల లైంగిక సంబంధాలే. భార్యాభర్తలను జీవితాంతం కలిపి ఉంచే అంశాలలో లైంగికత చాలా కీలకమైనది.

                   కాని సంపాదన కోసం, వస్తు సంచయాన్ని పోగేసుకోవడం కోసం చేసే పరుగు పందెంలో అది చాలా యాంత్రిక చర్యగా మారిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తే గాని సంసారాలు గడవని పరిస్థితి ఏర్పడింది. పిల్లల చదువు కోసం, వస్తు సామాగ్రి కోసం,హోదా కోసం ఇద్దరూ సంపాదనలో పడ్డారు. ఆ క్రమంలో వారు దాంపత్యంలోని లైంగిక జీవితాన్ని కోల్పోతున్నారు. పగలంతా కష్టపడి అలసి ఇద్దరూ సాయంత్రం ఇంటికి చేరుకొంటారు.

                   “సాయంత్రం

                        సీడీలు, మల్లెపూలతో రిలాక్స్ కోసం

                        బడ్జెట్లు, బాధ్యతల చిట్టా విప్పనీయని అతను

                        కూరలు,తినుబండారాల మోతలో నిస్సత్తువతో

                        కామా పెట్టిన పనులూ,

                        పిల్లలూ కల్లలు కావంటూ

                        గూడ్సు బండి లగేజీల ఆమె

                        రాత్రి

                        ఛీ! నువ్వెప్పటికీ నా ప్రియురాలివి కాలేవు

                        ఛా! నువ్వెప్పటికీ నా చెలికాడివి కాలేవు” అని ‘శిలాలోలిత’ ‘అనగనగా ఓ ఇల్లు’ కవితలో భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేయసీ ప్రియులు కాలేని సందర్భాన్ని వివరించారు.కేవలం అతడికి ఆమె ఒక  భార్య . ఆమెకు అతడొక భర్త . అంతే, అంతకు మించి వారు ఎవరికీ ఏమీ కారు .

దాంపత్య జీవితం మనిషికి ఆ అవసరాన్ని తీర్చడమే కాక జీవితానికి ఒక నిండుదనాన్ని, పరిపూర్ణతను చేకూర్చుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సంపూర్ణంగా అర్పించుకోవడంలోనే దాంపత్య మాధుర్యం దాగి వుంది. ప్రపంచీకరణ ప్రభావం పడకటింటిపై కూడా పడింది.  భార్యాభర్తలిప్పుడు ఒకరికొకరు తనువులు, మనసులు కాదు డబ్బులు, వస్తువులు. వారి మధ్య కేవలం భౌతిక చర్యలు మాత్రమే కొనసాగుతాయి.

                    

కంప్యూటర్ కాపురాలు:

                        ఇది కంప్యూటర్ యుగం. పడగ్గది నుండి దేశ పరిపాలన వరకు అంతటా కంప్యూటరే ఆపరేట్ చేస్తోంది. ఆ కంప్యూటర్ పై ఆధారపడి ఎన్నో ఉద్యోగాలు. అందులో  ముఖ్యమైనది   సాఫ్ట్ వేర్ ఉద్యోగం. కార్పోరేట్ స్వర్గంలో కాలుపెట్టే అవకాశాన్ని, ఆ స్వర్గానికి రాజధాని అయిన అమెరికాలో నడయాడే కోర్కెను తీర్చే కల్పవల్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం. సమాజంలో దానికున్న క్రేజ్ ఇంతా అంతా కాదు.ఎంతలా అంటే మన సమాజంలో అదొక ప్రత్యేక వర్గంగా తయారయ్యింది. వారి జీతాలు, జీవన శైలి వారిని సాధారణ ప్రజానీకం నుండి శిష్ట వర్గంగా మార్చివేశాయి. సాఫ్ట్ వేర్ కొడుకు, సాఫ్ట్ వేర్ అల్లుడు ఒక హోదాకు చిహ్నం(స్టేటస్ సింబల్).

                   సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుల జీవితాలలో కంప్యూటర్ ఒక భాగం. వారి సంబంధాలు, వ్యవహారాలూ అన్నీ కంప్యూటర్ ద్వారానే. ఈ కంప్యూటర్ వ్యవహారాన్ని ‘కంప్యూటర్ కాపురం’ కవితలో కె.గీత కళ్ళకు కడుతోంది.

                   “అక్రమార్జనంతా ధారపోసి

                        వరుణ్ణి తెచ్చాడు నాకు

                        ...  ...  ...  ... ...

                         మొదటి రాత్రే “రెండో భార్యవి” నువ్వన్నడాయన

                        ఉలిక్కి పడేలోగా

                        ‘కంప్యూటర్’ని ముందే పెళ్లి చేసుకున్నానని సర్దేడులెండి

                        ...     ...     ...   ...

                        మా నాన్నిచ్చిన కారు ఎప్పుడూ ఆఫీసు పార్కింగులోనే

                        ఏ ఫంగ్షను కెల్లాలన్నా ఒంటరిగానే

                        ...   ...   ...   ... 

మల్లెపూలు కొనుక్కొని ఆనందించాలి నేనే

ఆయన కంప్యూటర్ ని పెళ్లి చేస్కుంటే-

నేను కంప్యూటర్ తో కాపురం చేస్తున్నా

...   ...   ...   ... 

భర్తంటే

కలలో వచ్చి, నిద్ర లేచే లోపు వెళ్ళిపోయేవాడని

నిర్వచనమేమో

తారీకు మారే వరకు ఇంటికెపుడూ రాని ఆయన

చివరకు నాతో

కలిసినదెప్పుడూ

ఇవాలొద్దు –రేపు” రోజూ తారీఖు మారే సమయానికి ఇంటికి వచ్చి భార్యతో గడిపే జీవితం “ఇవాలొద్దు-రేపు” గా తెల్లవారుతోంది. భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి సమయం లేక మెయిల్స్, చాటింగ్ ను ఆశ్రయించుకొని తొలినాళ్ళ వైవాహిక జీవితం కూడా ‘వర్చువల్’ గానే గడచిపోతుంది.

ఇక ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులైతే ఆ మాత్రం సమయం కూడా ఉండదు. వారాంతంలో కలుసుకోవడమే. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉండే చిలిపి చేష్టలు, సరదాలు, సరసాలు, విరసాలు, విరహాలు, అలకలు, బుజ్జగింపులు, ఎదురుచూపులు ఏవీ ఉండవు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు గడిపే సమయం కంటే ఆఫీసులో కొలీగ్స్ తోనూ, కంప్యూటర్ తోనూ, ఇంటర్నెట్, సెల్ ఫోన్ తదితరాలతోను గడిపే సమయమే అధికంగా ఉంటుంది.

 

          మొత్తానికి భార్యాభర్తల సంబంధాలు ప్రపంచీకరణ వల్ల తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. వస్తువులు, డబ్బు, ఉద్యోగం, సెల్ ఫోన్, టీవి, కంప్యూటర్ వంటివి వీరి మధ్య చొరబడ్డాయి. ఇవి కుటుంబంలో వ్యాపార సూత్రాలను, యాంత్రికతను ప్రవేశపెట్టాయి. ఇది సమాజానికంతటికీ తల్లి వేరు లాంటి కుటుంబానికి పట్టిన చీడ పురుగు.

          సాహిత్యం సామాజిక దర్పణం. ఈ దర్పణం మామూలు కంటికి కనబడని దృశ్యాలను, చర్యలను, కుట్రలను, మార్పులను కూడా స్పష్టంగా చూడగలదు. చూపించగలదు. ఇప్పుడు మన జీవితాల్లోని డొల్లతనం, అస్తవ్యస్తత, యాంత్రికత, పరాధీనత మనకు స్పష్టంగా మనకు సాహిత్య దర్పణం చూపిస్తోంది. చైతన్యం కలిగిస్తోంది. సమున్నత మానవ సంబంధాల నిర్మాణానికి పూనుకోవడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. ఆ కార్యాచరణ దిశగా అడుగులు వేద్దాం. ఎందుకంటే మానవ సంబంధాలే మనిషి అస్తిత్వానికి మూల సూత్రాలు.

OOO

Bio
bottom of page