MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
కాలం చెక్కిన శిల్పం
లలితా వర్మ
" సారీ అత్తయ్యా! నాకు పెళ్లిచేసుకోవాలనే వుద్దేశ్యం లేదు. ప్లీజ్ నన్ను బలవంతపెట్టకండి"
దృఢంగా పలికిన కోడలి మాటలకు బాధపడింది రుక్మిణమ్మ.
చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుని మోడులా బ్రతుకుతున్న కోడలిని చూస్తుంటే ఆవిడ ఆడ మనసు చలించిపోతుంది.
కోడలికి అలాంటి దుస్థితి తన కొడుకును చేసుకున్నందువల్లే కదా ప్రాప్తించిందని అనుక్షణం బాధపడుతూనే ఉంటుంది.
కోడలికి మళ్లీ పెళ్లి చేసి ఆమె జీవితంలో వసంతాలు పూయించాలని రుక్మిణమ్మ అభిలాష.
'ఎలా శైలజని పెళ్లికి ఒప్పించటం'? అని ఆలోచిస్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది.
శైలజకి వాళ్ల పిన్ని తులసి మాటలమీద గురి . బహుశా తులసి చెప్తే వింటుందేమో నని చిన్న ఆశ.
పైగా తులసితో కలిసి టూర్ వెళ్లొచ్చినప్పటినుండీ
శైలజలో కనబడుతున్న మార్పు గమనించిన రుక్మిణమ్మకి, ఆ దిశగాప్రయత్నించాలనే ఆలోచన బలపడింది.
తెల్లవారి శైలజ ఆఫీసుకి, మనవరాలు స్కూలుకి వెళ్లగానే తులసికి ఫోన్ చేసి అర్జంటుగా మాట్లాడాలి రమ్మని పిలిపించింది రుక్మిణమ్మ.
విషయం చెప్పి , 'మంచి సంబంధం శైలజనెలాగైనా ఒప్పించు వదినమ్మా ' అంటూ అబ్బాయి వివరాలు, ఫోటో ఉన్న కవరు తులసి చేతిలో పెట్టి కాఫీ తెస్తానని వంటింట్లో కెళ్లింది రుక్మిణమ్మ.
కవరు తెరిచిన తులసికి అబ్బాయి వివరాలున్న కాగితం కనబడింది
పేరు, ఇంటిపేరు, గోత్రం, పుట్టిన తేదీ లాంటి వివరాలు, సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా చేస్తున్నట్లు చదివి సంతృప్తిగా తలపంకించింది.
ఫోటో తీసి చూసి అవాక్కయింది తులసి.
"శ్రీకాంత్" సంభ్రమంగా పలికాయామె పెదవులు.
ఒక్కసారిగా ఉద్విగ్నతకు లోనైంది.
"వదినా, వదినా! అంటూ వంటగదిలోకి పరుగుతీసి,
వదినా ! శైలు యీ ఫోటో చూసిందా? అడిగింది రుక్మిణమ్మ ని.
"ఊఁహు లేదమ్మా అసలు పెళ్లి పేరెత్తితేనే ససేమిరా అంటుంది. ఏఁ ? అబ్బాయి మీకేమైనా తెలుసా ? అడిగింది రుక్మిణమ్మ.
అవునంటూ ఆ అబ్బాయి తనకీ, శైలజకీ తెలుసంటూ ఆ వైనమంతా చెప్పింది తులసి.
అంతా విన్న రుక్మిణమ్మ లో ఆశ చిగురించింది.
అబ్బాయి ఫోటో చూపించి, తులసి చేత చెప్పించి కోడలిని వప్పించగలను అనుకుంది ఆశగా.
ఇంటికి బయలుదేరిన తులసికి నాలుగేళ్ల క్రితం జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చాయి.
**
"ఆహా ! అద్భుతం !!
గుండె లోతుల్లోంచి వెలువడినట్లుంది ఆ పారవశ్యంతో కూడిన మాట. వెనుదిరిగి చూసి పలకరింపుగా నవ్వింది తులసి.
ఆ నవ్వులోని ఆత్మీయభావన, ఆవిడకళ్లలో కనబడే ప్రశంసాభావం, మొహం లోని ప్రసన్నత , మనసుని స్పృశించగా ప్రతిగా చిరుదరహాసం చేశాడు శ్రీకాంత్.
ఒక్క క్షణం, అంతే మరలా గైడ్ చెప్పే మాటలు వినడంలో నిమగ్నమయ్యారు.
ప్రపంచ మేధావులకే అంతుపట్టని రీతిలో వేయి సంవత్సరాలకు పూర్వం నిర్మాణమైవున్న తంజావూరు బృహదీశ్వరాలయం లోని అద్భుతాలను వర్ణిస్తున్నాడు గైడు.
రాజరాజ చోళునిచేత నిర్మించబడిన ఆ మహా కట్టడం కొరకు టన్నులకొద్దీ బరువు గల గ్రానైటు రాళ్లను యెక్కడో గుజరాత్ దగ్గర నర్మదానదీ తీరంనుడి , ఆధునిక రవాణా సౌకర్యాలేవీ లేని ఆ కాలంలో ఏనుగుల చేత తెప్పించారట.
గోపురంపైనున్న కుంభం ఎనభైవొక్క టన్నుల బరువు గల ఏక శిలతో నిర్మించి, రెండువందలపదహారు అడుగుల ఎత్తున దానిని అమర్చటానికి రాంప్ నిర్మాణం చేసి ఏనుగుల చేత తరలింపచేశారట.
చదునైన నేలమీద రాతిపై రాతిని అమరుస్తూ నిర్మించిన ఆ బృహద్నిర్మాణంలో రాళ్లను అతికించటానికి ఏ పదార్థమూ ఉపయోగించలేదట.
కేవలం ఇంటర్ లాక్ సిస్టమ్ ద్వారా నిర్మాణం చేశారట.
ఆ విషయాలు వింటుంటే ఆ బృహద్నిర్మాణాన్ని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి తులసికి, శిరసు వంచి ఆ కళాకారులకు మనసులోనే పాదాభివందనం అర్పించుకుంది.
ఆ ఎత్తైన ఆలయశిఖరాలపై అలరారుతున్న శిల్పాలను చూస్తూ, కఠిన పాషాణాలను సుందర మూర్తులుగా చెక్కిన శిల్పులు నైపుణ్యానికి జోహారులర్పించింది.
నీరెండ వెలుగులో జిలుగులీనుతున్న ఆ మహాద్భుత కట్టడాన్ని , విశాలమైన ఆ ప్రాంగణం లో తిరుగుతూ తనివితీరా చూస్తుంది తులసి.
ఒక్కోచోట తన్మయత్వంతో నిలుచుండిపోతుంటే
"పిన్నీ పద అందరూ వెళ్లిపోయారు " అంటూ తొందర పెట్టి తీసికెళ్తుంది శైలజ .
రెండు రోజుల నుండీ యిదేవరస.
తమిళనాడు టెంపుల్ టూర్ కి హైదరాబాద్ నుండి ఓ ట్రావెల్ ఏజెంట్ ద్వారా నలభై మంది బస్ లో ప్రయాణమయ్యారు.
స్టార్ హోటళ్లలో బస, శుచికరమైన, రుచికరమైన భోజనం అన్నీ బాగున్నాయి కానీ యెక్కడి కెళ్లినా ఒకటే తొందర .
'రండి మేడమ్ టైమవుతోంది ' అంటూ టూర్ మేనేజరు ఒక ప్రక్క తొందర పెడుతూంటే, 'పద పిన్నీ' అంటూ శైలు.
ఇలా కాదు ఈసారి ఆయనతో కలిసి యిద్దరమే తీరిగ్గా రావాలి రోజూ ఒక ప్రదేశంలో బస చేసి తీరిగ్గా చూడాలి అనుకుంది తులసి.
ఇపుడు తనొచ్చిందే శైలు కోసం, శైలు మామూలు మనిషి కావాలి , తన కూతురి ముద్దుమురిపాలు
పంచుకోవాలి, అభం శుభం తెలియని ఆ చిన్నారికి తల్లి ప్రేమ దక్కాలి . ఈ టూర్ శైలు మనసుకు సాంత్వన చేకూర్చాలి అనే ఉద్దేశ్యంతో బలవంతాన శైలుని బయలుదేరదీసింది .
**
శైలజ , తులసికి అక్క కూతురు . బి.టెక్ చేసి టీసీఎస్ లో ఉద్యోగం చేస్తుండగా అదే కంపెనీలో పనిచేసే దూరపు బంధువు రోహిత్ , శైలూని యిష్టపడడంతో
ఒక్కగానొక్క కూతురు పెళ్లి రోహిత్ తో ఘనంగా జరిపించారు అక్కాబావ.
ఏ దేవుడి కన్ను కుట్టిందో, ఏ నరుని దృష్టి ప్రభావమో, విధి లిఖితమో, సంవత్సరం తిరక్కుండానే రోహిత్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
కడుపులో పెరుగుతున్న రోహిత్ ప్రతిరూపం తో పుట్టిల్లు చేరిన శైలజ జీవచ్ఛవమే అయింది.
రోజు రోజుకీ డిప్రెషన్ కి గురవుతుంది.
ఒక్క క్షణం కూడా కూతురికి దూరంగా వుండకుండా తల్లీ,తండ్రీ కంటికి రెప్పలా కాచుకున్నారు .
పండంటి పాపకు జన్మనిచ్చిందేకానీ పాపవంక కన్నెత్తి కూడా చూడలేదు.పాప యేడిస్తే ఎవరో ఒకరు ఒళ్లో పడుకోబెడితే యాంత్రికంగా పాలిచ్చేది.
శైలు లో మార్పు తీసుకు రావటానికి ఎన్నో విధాల ప్రయత్నిస్తూనే వున్నారు
అందులో భాగమే ఈ యాత్ర.
పాపకి రెండో సంవత్సరం. అమ్మమ్మ, నాన్నమ్మ తాతయ్యలు , అపురూపంగా చూసుకుంటున్నారు.
అందుకే పాపని వాళ్లదగ్గరుంచేసి , తనతో శైలుని వెంట బెట్టుకొచ్చింది తులసి.
తంజావూరు నుండి రామేశ్వరానికి బయలుదేరింది బస్. మానేజర్ తో పాటు ఉండే అసిస్టెంటు, టీవీ పెట్టాడు . ఏదో కొత్త సినిమా కుర్ర హీరో,హీరోయిన్.
"బాబూ మేం చూడలేం ఆ సినిమా మాకొద్దు " బస్ లోని సీనియర్ సిటిజన్ల గోల . నిజానికి బస్ లో వున్న నలభైమందిలో ఓ నలుగురు తప్ప అందరూ సీనియర్ సిటిజన్లే.
"సరే అయితే ఏం చేద్దాం "
"ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా!"
"అంత్యాక్షరి ఆడదామా"
"మా దగ్గర తంబోలా సరంజామావుంది ఆడదామా"
తలా ఒక సూచన చేస్తున్నారు.
ఇంతలో మానేజర్ , కాబిన్ లో నుండి ప్రయాణికుల దగ్గరకొచ్చి , మైక్ పట్టుకుని,
"మనం బయలుదేరి రెండు రోజులైంది . అందరూ అందరికీ కొత్తే సో ఒక్కొక్కరు తమ పరిచయం తాము చేసుకుని , ఈ టూర్ లో మీ అనుభవాలు సూచనలు చెప్పండి" అన్నాడు.
అదేదో బాగుందని ఒక్కొక్కరూ వరసగా తమ పరిచయం చేసుకోసాగారు.
శ్రీకాంత్ వంతొచ్చింది. తులసిలో ఉత్సుకత.
రెండు రోజుల్నుండీ గమనిస్తోంది.
పాతికేళ్ల కుర్రాడు తండ్రి వెంట యిలా యాత్రకు రావడమే కాదు, వెళ్లిన చోటల్లా జేబులోంచి చిన్న డైరీ తీసి ఏదో వ్రాసుకోవటం, శిల్పాలు చూస్తూ తన్మయం చెందటం, చూస్తుంటే ఈ కాలం కుర్రాళ్లకుండాల్సిన లక్షణాలు లేకుండా, మొహంలో భక్తి భావం వుట్టిపడేలా, ఎంత పద్ధతిగావున్నాడో అనుకుంటున్న తులసికి, ఆ అబ్బాయి పరిచయం మరింత అబ్బురం కలిగించింది.
పిహెచ్ డి చేస్తున్నాట్ట. భారతీయ కళలు అనే అంశంపై థీసిస్ తయారుచేయాలట. గూగుల్ లో సమాచారం దొరకొచ్చు కానీ స్వయంగా చూసిన దృశ్యం మనసులో నాటుకుపోతుంది కాబట్టి యాత్రలు చేస్తున్నాట్ట . భారతీయత అంటే మక్కువ అట. తన తోటి స్నేహితులంతా విదేశాల్లో చదువులకై వెళ్తూ తననీ రమ్మన్నారని, తనకిష్టం లేదనీ చెప్పాడు
చిన్నప్పుడే తల్లి చనిపోయిందనీ ,తండ్రే , తల్లీ తండ్రీ తనే అయి పెంచాడనీ , తల్లి సంగీత సరస్వతి అనీ , ఆవిడ పాటలంటే తన తండ్రికి చాలా యిష్టమనీ ఆయన కోసం ఆయనకిష్టమైన సంగీతం నేర్చుకుని, ఆయన సంతోషం కోసం పాడుతుంటాననీ చెప్పాడు.
అందరి మనసులూ ఆర్ద్రమయాయి.
వరసగా అందరి పరిచయాలూ పూర్తయాక , అందరి కోరిక మేరకు శ్రీకాంత్ పాటలతో అలరించాడు.
శ్రీకాంత్ గాన మాధుర్యం , అతని అద్భుతమైన కంఠస్వరం, అందర్నీ ఆకట్టుకుంది.
తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడమేకాదు, తోటి యాత్రకులందరి తలలో నాలుకలా మెలిగాడు శ్రీకాంత్.
మరో ఆరు రోజులు, ప్రయాణంలో వీనులవిందుగా శ్రీకాంత్ పాటలు వింటూ, తమిళనాట వెలసిన అద్భుత దేవాలయాలను , శిల్పకళను కన్నులవిందుగా చూస్తూ టూర్ ముగించుకుని తిరుగు ప్రయాణమయారు.
శైలజలో కాస్త మార్పు కనబడుతుంది. అదే తులసికి కొండంత సంతోషం.
తనతో టూర్ కి తీసుకొచ్చిన ఫలితం కాస్తయినా దక్కిందని సంబరపడిపోతుంది.
ఇల్లు చేరిన మరునాడు తులసి మొబైల్ చూస్తుంటే తన నంబరు తమిళనాడు టూర్ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చడం కనిపించింది. టూర్ మానేజర్ క్రియేట్ చేశాడు. ఆత్రంగా మెసేజ్ లన్నీ చూసింది. టూర్ లో తీసిన ఫోటోలు , గ్రూప్ ఫోటోలు , దేవాలయాల ఫోటోలు, ఎత్తైన ఆలయశిఖరాల చిత్రాలు చాలా బాగున్నాయి.
సంబరంగా భర్తకి అన్నీ చూపించింది. గ్రూపు ఫోటో లో ప్రతి ఒక్కరి గురించీ చెప్పింది.
శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పింది. ఆ అబ్బాయి ఉన్నత వ్యక్తిత్వం అతనికీ బాగా నచ్చింది.
'ఆ అబ్బాయిని యెవరు చేసుకుంటారో గానీ అదృష్టవంతురాలే' అనుకున్నారిద్దరూ.
ఇప్పుడు, నాలుగేళ్ల తరువాత , ఆ అదృష్టం తలవని తలంపుగా తమను వెతుక్కుంటూ వచ్చిందని తెలిసి సంబరపడుతోంది తులసి.
శైలజ ఒప్పుకుంటే అదృష్టవంతురాలే అనుకుంది.
**
"లేదు పిన్నీ నువ్వెన్నైనా చెప్పు. నేను పెళ్లి చేసుకోను. రోహిత్ ని మర్చిపోలేను. రోహిత్ ఆశయాలకు తగినట్లుగా నా కూతుర్ని పెంచుకోవటమొక్కటే నా కర్తవ్యం. నా కూతురికి తల్లీ తండ్రీ నేనే అయి ప్రేమని పంచగలను. మళ్లీ పెళ్లి చేసుకుని లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోవాలని లేదు"
స్థిరంగా పలికింది శైలజ కంఠం.
"అది కాదు శైలూ , వేరెవరో అయితే సందేహపడాలి కానీ శ్రీకాంత్ గురించి మనకి తెలుసుగా. నీ గురించి తెలిసీ నిన్నే పెళ్ళాడాలని నిర్ణయించుకుని యీ ప్రపోజల్ తీసుకొచ్చాడంటే, ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం ఆ అబ్బాయిది! ఆలోచించు " సాధ్యమైనంత వరకూ కన్విన్స్ చేయటానికి ప్రయత్నిస్తుంది తులసి .
"అవును పిన్నీ ఆ అబ్బాయి చాలా ఉన్నతుడు, అతని వ్యక్తిత్వం ఆలయశిఖరం కావచ్చు. కానీ, సారీ పిన్నీ ! నన్నిలాగే వుండనివ్వండి "
అని స్థిరంగా పలికి, రెండు చేతులూ జోడించి నమస్కరించి, తన ఆరేళ్ల కూతురు చేయి పట్టుకుని, అక్కడి నుండి కదలివెళ్తున్న శైలజ ని చూస్తూ అలాగే ఉండిపోయింది తులసి.
'కాలం చెక్కిన శిల్పం' మనసులో మెదిలిన మాటని అప్రయత్నంగా పైకే అంది తులసి, ఆమె దృఢనిర్ణయాన్ని ఆమెకే వదిలేయాలా అని ఆలోచిస్తూ!
*****