top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

కథా​ మధురాలు

జోడు పిట్ట

 

తమిళ మూలం : ఆర్. చూడామణి
తెలుగు అనువాదం : రంగన్ సుందరేశన్.

Rangan Sudareshan.jpg

వీధిలో సందడి వినిపించింది. ముందు వసారా కిటికీద్వారా బయటికి చూసిన తాతగారు గబాలున వెనుక వైపుకి వెళ్ళిపోయారు. కొంచెం సేపు తరువాత అతన్ని వెతుక్కుంటూ శ్రీమతి అక్కడికి వచ్చింది.

 

“తాతగారూ, మీకోసం ఎవరో వచ్చారు.”

 

“నాకు తెలుసు.”

 

“అక్కడికి వస్తారా?”

 

“హూహూం!”

 

“వాళ్ళు రావడం మీకోసమే కదా?”

 

“నేనెవరినీ చూడనక్కరలేదు. నువ్వే వాళ్ళందరూ చెప్పేది విని, పంపించేయ్.”

 

“మిమ్మల్ని చూడకుండా వెళ్తారా?”

 

“ఏదైనా కారణం చెప్పి పంపించేయ్,  నాకు అస్వస్థతగా ఉందని చెప్పు”

 

“వాళ్ళు నమ్మరు.”

 

“అలాగైతే నేను చచ్చిపోయానని చెప్పు!”

 

శ్రీమతి మరేం అనకుండా తిరిగి వెళ్ళిపోయింది. గుండెలో భారం తగ్గలేదు. ఇంతవరకూ ఎంతమంది తాతగారిని చూడడానికి వచ్చారు?! అందరూ పాఠం వల్లించినట్టు అతనికి చెప్పారు.

“పాపం, ఈ వయస్సులో మీకిలాంటి అవస్థ రాకూడదు.” 

 

“మీ ఆవిడ దీర్ఘ సుమంగళిగా, పెళ్ళికూతురులాగ పోయింది, అది గుర్తుచేసుకొని మీరు ఓదార్చుకోవాలి”. 

 

“కొడుకూ, కోడలూ మీకు అన్ని విధాలా సేవ చేస్తున్నారు. ఇక మీ మనవలూ, మనవరాళ్ళకీ మీరంటే ప్రాణం” “

 

వయసు చెల్లిన కాలంలో మీకిది  పెద్ద పోటు.”

 

శ్రీమతికే ఇవన్నీ నిరర్ధక, వట్టి మాటలుగా, సత్యంకి ఓ మోస్తరు చెత్తగా కనిపించాయంటే మరి తాతగారికి ఎలా ఉంటుంది?

 

పరామర్శకి వచ్చినవారిని అలాగే తిరిగి పంపించేయాలని శ్రీమతి నిశ్చయించింది, కాని లాభం లేదు. ఆమె ఎంత నాజూకుగా చెప్పినా, వినకుండా ఒకతను తాతయ్యను చూసి తీరాలని సరాసరిగా ఇంట్లోకి వచ్చేసారు.

 

“మిస్టర్ చారి.”

 

గొడ్లపాక పక్కనే నిలబడి ఆకాశంని చూస్తున్న తాతగారి దేహం బిగుసుకుంది.

 

“ఎవరు? వరదనా? రండి,  చూసారా, ఆకాశం? వర్షం వస్తుందనిపిస్తోంది. ” అన్నారు తాతగారు, తిరిగి చూడకుండానే.  వచ్చినతను నిర్ఘాంతపోయారు.  అతని నోటినుంచి ఏ మాటా రాలేదు.

 

“మాటలాడరేం? వర్షం కురుస్తే ఇప్పుడు మనం పడుతున్న నీళ్ళ కరువు నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది., అవునా?” అని తాతగారు మళ్ళీ అన్నారు.  తిరిగి వచ్చినతన్ని చూసి ఒక చిరునవ్వు నవ్వారు.

 

“మీకలా అనిపించలేదేమో, అలాగే కానీయండి. మన సమస్య తీరాలంటే బాగా కురవాలి, ఈ వర్షం చాలదని నేను అంటున్నాను. మీరేమంటున్నారు?”

 

పరామర్శకి వచ్చినతను ఎలాగో సముదాయించుకున్నారు.

 

“నాకు కబురు అందింది, మిస్టర్ చారి! అప్పుడు నేను ఊరులో లేను. తిరుచ్చికి ఒక పనిమీద వెళ్ళాను. రాగానే ఇది విన్నాను. నాకు చాలా బాధగా ఉందండీ,  మిమ్మ ల్ని ఎలాగ ఓదార్చాలో నాకు అర్ధం కావటం లేదు. ”

 

“మీ రెండో అబ్బాయి ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాడుకదూ, ఏమైంది?”

 

“అసలు ఆ ఆలోచనే వొద్దని మీకుందేమో? అదీ సబబైన పనే! దుఃఖంకి లొంగిపోతే, మనిషికి మళ్ళీ తేరుకోవడం కష్టం. మీరే మిమ్మల్ని ఓదార్చుకోవాలి. ఈ వయస్సులో మీకు ఇలాంటి కష్టం రాకూడదు. మామీ  తానే, పుణ్యవతిగా, మరేం కొఱత లేకుండా పోయారు.”

 

“ఆ ఇంటర్వ్యూ ఒక బ్యాంకు ఉద్యోగానికి కదూ? లేకపోతే మరేదైనా కంపెనీకి మీ అబ్బాయి అప్లై చేసాడా?”

 

వరదన్ అతన్ని తేరిపార చూసారు. ఒక క్షణం మనసులో లేచిన అనుమానం అణచుకున్నారు. ‘ఛీ, ఛీ, అలాగేం ఉండదు.’

 

“నేను కొందరు స్నేహితులతో వచ్చాను. వాళ్ళు ఎక్కడో షాపింగ్  కి వెళ్ళాలట. చూడండి, ఇంత పెద్ద ప్రపంచంలో మామీకి జాగా లేకుండా పోయింది! మన చేతిలో ఏముంది, సార్? అంతా దేవుడి దయ. ప్రాణం అన్నది ఎప్పుడూ అనిత్యమే, మనసుని ఓదార్చుకోవాలి. దేవుడు మీకు బలం ఇవ్వాలి. ధైర్యంగా ఉండండి సార్! ఇలాంటి సమయాల్లో ‘మళ్ళీ కలుసుకుందాం’ అని చెప్పకూడదంటారు. ”

 

“అంటే. మీరు బయలుదేరారన్నమాట. సరే, వెళ్ళిరండి. ఇంకొక రోజు సావధానంగా రండి. సాయంకాలం ఎండ తగ్గినతరువాత మనం అలా నడకకి వెళ్దాం” అన్నారు తాతగారు.

 

వచ్చినతను వెళ్తున్నప్పుడు తన స్నేహితులకి చెప్పారు.

 

“ఇతనిలో ఈ బడాయి ఎప్పుడూ ఉంది - చూసారా, ఇప్పుడుకూడా ఇతనికి నిష్కపటంగా మాటాడడం చేతకాదు! పాపం, ఆ పెద్దమ్మ ఇతనితో ఎలాగ కాపురం చేసిందో?” అని అతను పలికిన  మాటలు శ్రీమతి చెవులకి అందాయి.  శ్రీమతి మళ్ళీ పెరడుకి వెళ్ళింది.

 

తాతగారు ఇప్పుడు ఆకాశాన్ని తేరిపాఱ చూస్తూ నిల్చున్నారు.  తరువాత తన దృష్టిని  గొడ్లపాకకి మళ్ళించారు.

 

దాని పక్కనే ఉన్న బట్టలు ఉతికే రాతిని చూసారు. ఆ తరువాత దడిని అల్లుకుని వున్న మల్లెపూల మొక్కలు చూసారు.

 

అతని ప్రతీ చూపు ముద్దులాడుతున్నట్టుంది. నాన్నమ్మ గొడ్లపాకలో గొడ్లకి తవుడు, తెలకపిండి మేపడం, రాతిమీద తన మడిబట్టలని ఉతకడం, మల్లెపువ్వులని అభిమానంతో పోషించడం  - ఇవన్నీ అతనికి గుర్తుకి వచ్చాయి. భార్య

కన్నుమూసినప్పుడు తాతగారు శవాన్ని రెప్పవాల్చకుండా చూసారు, కాని ఏడవనేలేదు. అప్పుడూ, ఆ తరువాత రెండు వారాలూ, అతను ఏడవటాన్ని ఎవరూ చూడలేదు. ఇలాగ, ఇంటిలో ప్రతీ చోటుని  శ్రద్ధగా చూస్తూ, ఆ అనుభవాలు  నెమరు వేసుకుంటూ వాటిని కొనియాడారు.  అంతే!

 

వచ్చిన జాడ తెలియకుండా తిరిగిపోవాలని శ్రీమతి ప్రయత్నించినప్పుడు తాతగారి చూపు ఆమె మీద పడింది.

 

“ఇంకా ఎవరైనా వచ్చారా - పరామర్శకి?”

శ్రీమతి తడబడింది. అరవైయేళ్ళ ఆశ్రయం ముగిసిపోయింది. ‘ముగిసిపోయింది’  అని అంటే సరైపోతుందా? దాన్ని వివరించడానికి ఆ మాటలు చాలా?

 

అరవైయేళ్ళు - ‘ప్రభవ’, ‘విభవ’ అని ఆరంభించి ‘అక్షయ’ వరకూ ఒక వృత్తంలో పూర్తిగా అణగిపోయిన ఆ దాంపత్యం అరవైయేళ్ళ సహవాసం మాత్రం కాదే? ఈ  నాన్నమ్మని తప్ప మరే అమ్మాయిని ఇతను తిరిగి కూడా చూడలేదు. “నేను చాలా అదృష్టవంతురాలుని, నీకు తెలుసా?” అని నాన్నమ్మ కళ్ళంట నీళ్ళతో ఎన్నిసార్లు తనకి చెప్పిందో? గతించిన ఆ మొహంలోనూ ఆ పరవశం మారనేలేదు. ఆ సారాంశంలో ఉన్న అర్ధం - ఉత్తినే సంప్రదాయానికని పరామర్శకి వచ్చేవారు గ్రహించగలరా? ఎప్పుడు మౌనం వహించాలని కొన్ని మాటలకి తెలియనే తెలియదు.

 

“ఇక ఎవరైనా పరామర్శకని నాతో మాటాడాలని వస్తే చెప్పుతో కొట్టి తరుముతాను, జాగ్రత్త!” అని బెదిరించారు తాతగారు.

 

“సరే, తాతగారూ, మరెవరూ రాకుండా నేను చూసుకుంటాను.”

 

“మంచి పిల్ల. ఇలా రా!”

 

ఇంటి వెనుక వైపు వసారా మెట్లలో విశ్రాంతికి నాన్నమ్మ మామూలుగా కూర్చొనే మెట్టులో తాతగారు కూర్చున్నారు. శ్రీమతిని తన చేతులతో లాగి పక్కనే కూర్చోమన్నారు. అతని చూపు మళ్ళీ ఆ మల్లెపూల మొక్కలమీద వాలింది. అతను ఏమీ మాటాడలేదు. అంచువరకూ నిండిన గిన్నెనుంచి బొట్లు రాలకుండా జాగ్రత్తగా ఆ గిన్నెని పట్టుకున్నట్టు శ్రీమతి  అతని మౌనాన్ని కాపాడింది. తాతగారు తలెత్తి తన్ను చూసినప్పుడు చలనంకూడా భంగపరుస్తుందేమో అనే ఉద్దేశంతో కదలకుండా అలాగే ఉంది.  అప్పడప్పుడు తాతగారి దేహం వొణకడం మాత్రం   గ్రహించింది.

 

“నాన్నగారూ, భోజనానికివస్తారా?”

 

అప్పుడే రాత్రి వచ్చేసిందా? శ్రీమతి నాన్నగారు వెనకన నిలబడి పిలిచినప్పుడు ఆ ధ్వని ఒక రాతిబండలాగ ఆ మౌనాన్ని తాకింది. శ్రీమతి అదిరిపడి తాతగారిని చూసింది. కాని అతను “సరే, వస్తాను” అని మామూలుగానే జవాబు ఇచ్చారు. శ్రీమతి చేతిని వదిలేసి,  “అమ్మాయీ, నువ్వూ వెళ్ళి విస్తరాకుముందు కూర్చో, నేను వస్తాను” అని అన్నారు.

 

కాని అందరూ కలిసి భోజనం ఆరంభించినప్పుడు అతను రాలేదు.

 

“ఆయన ఇంకా చీకట్లోనే అక్కడే ఉన్నారు కాబోలు. ” అన్నారు  శ్రీమతి  తండ్రి.

 

“భోజనం చెయ్యాలని అతను మరిచిపోయారేమో?” అన్నాడు శ్రీమతి తమ్ముడు. “నానమ్మ గాని ఉంటే ఇప్పుడు అతన్ని బెదిరించేది, అతనూ వెంటనే వచ్చివుండేవారు.”

 

శ్రీమతి అన్నయ్య ఏమీ అనక ఊరుకున్నాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది.  భార్య ఇంకా అత్తవారింటికి రాలేదు.

 

“రోజువారీ ఇదొక నాటకంలాగ అయిపోయింది. ” అని శ్రీమతి  తల్లి విసుక్కుంది.

 

“పాపం, నాన్నగారు! అతను గట్టిగా నోరువిప్పి ఏడిస్తే బాగుండు" అని నాకనిపిస్తోంది,  దుఃఖాన్ని ఇలా మనసులో అణచుకోడం మంచిదికాదు.” అన్నారు శ్రీమతి తండ్రి, భార్యని చూస్తూ.

 

“అదేం దుఃఖమో? మనసులో ఎంత అణచుకున్నా, నిజంగా దుఃఖం అని ఉంటే, పెళ్ళాం శవం చూసిన తరువాత కూడా  మనిషికి కళ్ళంట నీళ్ళు రావా?”

 

“నువ్వేంటి, నాన్నగారికి అమ్మమీద ప్రేమ లేదంటున్నావా?”

“నాకేం తెలుసు? కాని ఈ మగవాళ్ళని మనం నమ్మలేం. ”

 

శ్రీమతి లేచింది. “నేను వెళ్ళి తాతగారిని పిలుస్తాను. ” అని గదినుంచి నిష్క్రమించింది.

 

తాతగారు వచ్చి భోంచేసారు. ఏమీ మాటాడలేదు. శ్రీమతి తల్లి అలవాటుగా అతనికి మర్యాదతో వడ్డించింది. తాతగారు అప్పుడప్పుడు తలెత్తినప్పుడు అతని చూపు చుట్టుపక్కలా ఏదో వెతుకుతున్నట్టు కనిపించింది. భోంచేసిన తరువాత, అతను లేచి వెళ్ళి చేతులు కడుక్కున్నారు.

చిన్న గిన్నెలో అన్నం తీసుకువచ్చిన శ్రీమతి తల్లి ఆశ్చర్యంతో -“ఏమిటి, అప్పుడే మీరు మధ్యలో లేచారు?” అని అడిగింది.

 

“భోజనం ఐపోయింది, లేచాను. ” అన్నారు అతను.

 

“నేనింకా మజ్జిగకి మీకు అన్నం వడ్డించలేదే?”

 

“ఓ, అలాగా? దానికేం, కడుపు నిండిపోయింది.”

 

శ్రీమతి తండ్రి అతన్ని బాధగా చూసారు. “నాన్నగారూ, నాకూ అలాగే ఉంది. దుఃఖం భరించలేనప్పుడు కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తున్నామని మనకే తెలీదు. ప్రతీ క్షణం అమ్మ జ్ఞాపకం వస్తూనేవుంది, ఎక్కడ చూసినా అమ్మ నిల్చున్నట్టనిపిస్తోంది. అమ్మ ప్రాణంతో లేదని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. ”

 

“శ్రీమతి బాగా పెరిగిపోయింది, త్వరగా దానికి వరుడు చూడడం ఆరంభించాలి” అన్నారు తాతగారు.

 

 అతను గదినుంచి బయటికి వెళ్ళగానే శ్రీమతి తమ్ముడు తన తండ్రిని అడిగాడు. “పెళ్ళయినప్పుడు తాతయ్యకి ఎంత వయస్సు?”

 

“అదేం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలా? భోజనం అయిందా, సరే, వెళ్ళు!  చేతులు కడుక్కొని పాఠం చదువు!”

 

శ్రీమతి, ఆమె అన్నదమ్ములు, అక్కడనుంచి నిష్క్రమించారు.

 

శ్రీమతి తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకున్నారు.

 

“నాన్నగారు కప్పిపుచ్చి మాటాడుతున్నారు. ” అన్నాడు రంగన్.

 

“నాకు అతన్ని చూస్తే భయంగా ఉంది.”

 

“ఏం, ఎందుకు?”

“ఇలాగ ఆవేశపడకుండా ఎవరైనా ఉండగలరా అని నాకు బాధగా ఉంది. పాపం, మీ అమ్మగారు అతనికి ఎలా సేవ చేసారు! జీవితమంతా కలిసి మెలిసివున్న భార్య పోయిందని ఇతనికి ఏ చింతా లేదే?”

 

“బాగుంది, నీకు కొత్తగా అమ్మమీద ఆరాటం వచ్చేసిందన్నమాట! అది ప్రాణంతో ఉన్నప్పుడు నువ్వేం గొప్పగా సర్దుకొని వెళ్ళడం నేను చూడలేదే? అది నమ్రతతో గొడ్లని మేపినప్పుడు, తన మడిబట్టలని ఉతికినప్పుడు నువ్వు సాయానికని దగ్గరకి కూడా వెళ్ళలేదే?” అని రంగన్ నవ్వుతూ అడగ్గానే కనకం అతన్ని తేరిపాఱి చూసింది.

 

“మీకూ సమయం చూసి నన్ను తిట్టాలనివుందేమో? ఆ రోజుల్లో   ‘అమ్మకి సాయం చెయ్!’ అని మీరెందుకు నాకు చెప్పలేదు?”

 

“ఇవన్నీ ఎవరైనా చెబితేనే తెలుసుకోవాలా?”

 

“ఎవరికైనా సరే - మనసులో దాచుకుంటే -  బయటపడకుండా ఉంటుందా? నేను ఎప్పుడైనా సాయం చేద్దామని మీ అమ్మ దారి దగ్గరకి వెళ్తే చాలు, ‘నా ఆచారం చెడిపోతుంది!’ అని ఆవిడ బొబ్బలు పెడతారు. అది మీకు తెలుసా? నేను చేసేదేకదా మీ కళ్ళకి కనిపిస్తుంది?”

 

“అది పోయిన తరువాత కూడా ఈ నిందారోపణ ఎందుకు?  అమ్మ ఉన్నంతవరకూ రోజూ మన ఇంటిలో ఒక కురుక్షేత్రం జరగలేదూ?”

 

“అబ్బాబ్బా. అంటే మీ మనసులో ఇదే భావన ఉందన్నమాట! ‘ఈ పిల్లి పాలు తాగుతుందా?’ అని అడుగుతున్నట్టుంది మీ వాలకం! ఎది ఎలాగున్నా ఆఖరికి మగవారందరూ అమ్మనే వెనకేసుకొని మాటాడతారన్నది ఎంత నిజం! పెళ్ళాం ఎంత చేసినా లాభం లేదు! నిత్యమూ మనసులో లోతైన జాగా అమ్మకే దత్తత ఇచ్చేసారన్నమాట. ”

 

“అలాగే కాబోలు. మన నాణు కూడా పెళ్ళాంమీద ఎంత ప్రేమ ఉన్నా మనసులో ముఖ్యమైన జాగా నీకు ఇచ్చేసాడని సంతోషించు. వాడికి పెళ్ళి చెయ్యడంవలన నాకెటువంటి సంతోషం వద్దంటున్నావా? ఈ భావన లేదంటే ఏ తల్లి ఐనా  తన పిల్లలకి ఎందుకు  పెళ్ళి చేస్తుంది?”

 

   “నేనేం అలాంటి తల్లి కాదు. పాపం అని మీ అమ్మగారిని వెనకేసుకొని మాటాడితే నాకీ శిక్ష!” అని కనకం మొహం ముడుచుకుంది.

 

‘నిజంచెప్తే దానికి కోపం వస్తోంది’ అని ఆలోచిస్తూ రంగన్ చెప్పారు. “కనకం, విను, కోపం వద్దు. నేను ఉత్తినే అన్నాను,  నాన్నగారి ధోరణి నాకు మాత్రం  నచ్చిందా? చావు అన్నది ఒక అనుచితమైన భావన. మనం ఏడ్చి, దానికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తే ఆ కలత కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. అలాగ కాకుండా రాయిలాగ కూర్చుంటే నువ్వన్నట్టు నాకూ ఏదో ఒక భయంలాగ ఉంది.”

 

“అది కాదండి. మీ అమ్మగారికోసం అతను ఏడవలేదంటే  - ఒక భార్యగా ఎంతగా సేవ చేసినా - ఆఖరికి అది వ్యర్ధం అంటే మనసుకి చాలా బాధగా ఉంది.” కనకం కంఠధ్వని శమించింది.

 

తన్ను ఆ స్థాయిలో కనకం చూస్తోంది. ఈ ప్రపంచంలో చావు అనే ఘటన అంతర్బుద్ధి అనే అస్తివారంపై ఆధారపడి ఉందా? మానవుడికి ఈ ప్రపంచమూ చిన్నదే.  అందుకని అతను చంద్రమండలం వెళ్ళనక్కరలేదు.

“ఏమేమో ఆలోచిస్తూ బాధ పడకు. ” అని అంటూ రంగన్ భార్య వీపుని తట్టి  ప్రోత్సహించారు.

 

“మన కోడలు ఇంటికి రానీయండి. ఆ తరువాత మేం ఎంత అన్యోన్యంగా ఉన్నాం అని చూడండి. ” అంది కనకం. 

 

**

 

శ్రీమతి అన్నయ్య, భోజనం అవగానే, స్కూటర్ లో తన అత్తవారింటికి వెళ్ళాడు. వత్సలా మొహం అతన్ని చూడగానే వికసించింది.

“ఏమిటిది, గబాలున ఇలా రావడం?ఇవాళ వస్తున్నట్టు మీరు చెప్పనేలేదే? భోజనం అయిందా?” అని వత్సల అడిగింది.

“అయింది” అన్నాడు నారాయణన్. ఇద్దరూ వత్సల గదికి వెళ్ళారు. వాళ్ళకి పెళ్ళయి ఒక నెల అయింది. ఆమెతో తనింటికి వెళ్ళడానికి పెద్దలు మంచి రోజు చూస్తుంటే  అతని నాన్నమ్మ మరణం వలన అది ఆలస్యమైంది.

“ఇంటిలో అందరూ నాన్నమ్మ గురించే మాటాడుకుంటున్నారు - ఆవిడని పొగడేవారూ, ఆవిడతో పరిచయం ఉన్నావారూ.  అలాగ చూస్తే తాతగారి ప్రవర్తన సరే అని చెప్పాలి. ”

“మీ తాతగారు కొంచెంకూడా ఏడవలేదని విన్నాను.  అతను నాన్నమ్మ గురించి ఒక మాటైనా అనలేదట. మీ ఇంటిలో మగవాళ్ళందరికీ ఇటువంటి రాతి మనసు కాబోలు. ”

“తుంటరితనం అంటే ఇదే! భార్యాభర్తలమధ్య ఎన్నో ఉంటాయి.  తాతగారి ప్రవర్తనకి ఏదైనా కారణం ఉండాలి, అది ఇతరులకి బోధపడుతుందా? నేను దానిగురించి మాటాడలేదు.”

 

“మరి దేనిగురించి?”

 

నారాయణన్ కళ్ళు మెరిసాయి.

 

“మా నాన్నమ్మ ఒక అద్భుతమైన మనిషి. ”

 

“మీకందరికీ ఆవిడ అంటే ప్రాణం’ అని శ్రీమతి నాకు చెప్పింది.”

 

“నాన్నమ్మతో పరిచయం ఉన్నవాళ్ళు ఎవరూ దానిగురించి ఆశ్చర్యపడరు.   మా అమ్మ కూడా అలాగే - కాని నిత్యమూ ఆవిడతో దెబ్బలాడుతుంది. ”

 

“అయ్యయ్యో, మీ ఇంట్లోనూ అత్తగారు-కోడలు జగడం ఉందన్నమాట! నాకిప్పుడే భయం పట్టుకుంది! మా నాన్నగారు నాకు చెప్పారు - ‘ముందుగానే మీరు ఒంటరిగా కాపురం చెయ్యండి’  అని. ”

 

నారాయణన్ నవ్వుకుంటూ ఆమె చెవిని పట్టుకొని గిల్లాడు.

 

“Don’t be silly, భయం ఎందుకు? అత్తగారు-కోడలు జగడం అనేది వాళ్ళలో ఉన్న ఒక వట్టి సంప్రదాయం, అంతే! బయట దెబ్బలాడినా మా అమ్మ - రోజూవారీ, రాత్రి నాన్నమ్మకని తన చెయితోనే కుంకుమ పువ్వు కలిపి పాలు కాచుతుంది.  ఆ పనికి శ్రీమతిని పిలవదు. అలాగే నాన్నమ్మ కూడా ఏది మరిచిపోయినా మా అమ్మ పుట్టినరోజు కోవిలకి వెళ్ళి ఆమె పేరులో అర్చన చేస్తుంది.”

 

“ఓ, అలాగా?”

 

“నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాన్నమ్మతో మెలగినవారందరికీ ఆవిడ పేరు ప్రతిష్టలు తెలుసు. అందుకు కారణమేమిటో తెలుసా?”

 

“ఏమిటి?”

 

“ఆవిడని చూస్తే చాలు ఎవరికైనా మానవ జీవితంలో ఎంత మహత్యం ఉందని సంతోషం కలుగుతుంది. ఆమె ప్రాణ స్వరూపం.  జీవితంకి అవతారం. మేం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆవిడ మాకు చాలా కధలు - రాణీ, రాజుల గురించి, మన పురాణాలు, దేవతలు గురించి - చెప్పేది. అన్ని కధల్లోనూ ‘మంచిది గెలుస్తుంది, చెడ్డది ఓడిపోతుంది! అనే సిద్ధాంతమే మానవాభ్యుదయానికి ఆధారం’ అని మన మనసులో పదిలమవుతున్నట్టు వివరించేది. ఎందుకంటే మంచిది  గెలుస్తే అది వికాసం, అది ఓడిపోతే నాశనం. ఆమె ధోరణిలో జీవితం ఒక మహత్తైన పండుగ.  ప్రాణం అనేది నిత్యమూ వర్ధిల్లే  ఒక అవకాశం, తరుణం. ఆవిడకి చావులో నమ్మకం లేదు. అందుకే నేను అన్నాను - నాన్నమ్మ గురించి మనం దుఃఖించామంటే మనకి ఆవిడ గురించి అవగాహన లేదని అర్ధం..”

వత్సల వింతగా అంతా వింటూ ఉంది. భర్త మొహంలో శోభ.  అతని కళ్ళలో పరవశం.  అవి ఆమెని ఒక ఇంద్రజాల వృత్తంలోకి ఈడ్చుతున్నట్టనిపించింది.

 

“మీ నాన్నమ్మతో పరిచయం లేకపోవడం నాకు చాలా విచారంగా ఉంది.”

 

“విచారం వద్దు. అటువంటి మనోభావంతో నాన్నమ్మని గ్రహించలేం. ‘జీవితం ఒక అద్భుతం’ అని గ్రహించే భావన నా నాన్నమ్మ. ”

 

కొంచెం సేపు ఇద్దరూ మౌనం వహించారు. నారాయణన్ భార్యని సానుభూతితో చూసాడు. “వత్సలా, నాన్నమ్మకోసం మనం దుఃఖించవద్దు, జీవితాన్ని కొనియాడుదాం! నాన్నమ్మపై నాకున్న ప్రేమానురాగాలు ఇంతకంటే గొప్పగా నిరూపించడం అసాధ్యం అనే ఆలోచనతోనే నేను నిన్ను చూడడానికి వచ్చాను.”

 

**

 

“ఏమే, ఎందుకు ఏడుస్తున్నావ్?” అని అడుగుతూ శ్రీమతి తమ్ముడు ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు.

 

శ్రీమతి కళ్ళు తుడుచుకుంది. “నాకే తెలీదు” అని అంది.

 

“నాన్నమ్మ జ్ఞాపకం వచ్చిందా? నాకూ అలాగే ఉంది, శ్రీమతి. నాన్నమ్మ లేకుండా ఇల్లు బాగా లేదు. ”

 

“అవును. కాని నేను నాన్నమ్మ కోసం ఏడవలేదు. విచిత్రం ఏమిటంటే నాకు తాతగారిని తలచుకుంటే ఏడవాలని ఉంది.”

 

“అతనికేం బాధ? అతను రవంతైనా ఏడవలేదు. అతనికోసం నీకు ఏడవాలని ఉందా? నీకేం పిచ్చి పట్టిందా?  సరేలే, శ్రీమతి, నేను ఒక పద్యం రాసాను - నాన్నమ్మ గురించి. వింటావా?”

 

“ఏదీ, చదువు. వింటాను. ”

వాసు ఉత్సాహంతో చదవడం ఆరంభించాడు. నాన్నమ్మ మరణం గురించి చాలా వర్ణించాడు. క్రమేణ అతను తన  భావనలు మెల్లమెల్లగా తెలియజేస్తుంటే, మొహంలో శోభ చోటుచేసుకుంది. “ఇక్కడ, ఈ క్షణం నీకు ఏడవాలని లేదు? అబ్బా, How moving!”  అని అడిగినప్పుడు వాసుకి సంతోషంగానే ఉంది.

 

వాడు పద్యం చదువుతూంటే శ్రీమతి కళ్ళు ముందు వసారాలో నేలమీద స్థిరంగా నిలిచిపోయాయి. ‘ఇంకా ఒక సంవత్సరంకి ఆ నేలమీద ముగ్గులు కనిపించవు’ అని శ్రీమతి గుర్తుచేసుకుంది.

 

ముందు వసారాలో, ఒక మూల, తాతగారు ఒక కుర్చీలో కూర్చొనివున్నారు. పక్కన చాలా మంది ఉన్నా, అతను ఏకాంతంలో తేలుతునట్టు కనిపించారు. ఐనప్పటికీ అతని మొహంలో ఒక విధమైన సంబద్ధత, సంతుష్టి చూసి శ్రీమతికి ఆశ్చర్యం కలిగింది.

 

శ్రీమతి తమ్ముడు లేచి వెళ్ళిన తరువాత కూడా తాతగారు అలాగే ఉన్నారు. శ్రీమతి మెల్లగా అతన్ని చేరుకొని “తాతగారూ, మీకు నిద్ర రాలేదా? ముందులాగ రామాయణం ఏదైనా చదవమంటారా?” అని అడిగింది.

 

  “వొద్దు.  నిద్ర వస్తున్నట్టుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ”

 

హాలులో తాతగారు, శ్రీమతి, ఆమె తమ్ముడు పడుక్కొని చాలా సేపైంది.  తమ్ముడు ఎప్పుడో నిద్రపోయాడు. కాని తాతగారు నిద్రపోలేదని శ్రీమతికి తెలుసు. ఆ సంగతి ఇటీవల ఆమెకి ప్రతీ రోజూ తెలుసని తాతగారికి తెలీదు. అతను పడకలో దొర్లుతూండడం, ప్రపంచమంతా నిద్రపోయే సమయంలో తన విసిగిన కళ్ళతో లోకప్పు చీకటిని తేరిపారి చూడడం - ఇవన్నీ ఆమెకి తెలుసని అతను ఎరుగరు.

 

అతను పడకనుంచి లేచి కూర్చొనే సద్దు వినిపించింది. శ్రీమతి తటాలున అతన్ని చూసింది. “తాగడానికి నీళ్ళు కావాలా?” అని అడగాలనుకుంది. కాని అతని అంతరంగంలో జొరపడడానికి ఆమెకి ధైర్యం  లేదు.

 

తాతగారు లేచి నిలబడ్డారు. కొంచెం దూరం  నడవసాగారు. శ్రీమతి భయంతో లేచి, అతనికి తెలియకుండా చీకటిలో దాగి, దాగి, అతన్ని వెంబడించింది.

 

తాతగారు ఒక్కొక్క గదికి నడిచి వెళ్ళారు. అక్కడ నిల్చొని పరిసరాలు రెప్ప వాల్చకుండా చూసారు. నాన్నమ్మ పూజ చేసే గదికి వెళ్ళి నిశ్చలంగా కొంచెం సేపు అక్కడ నిలబడ్డారు.

 

తరువాత పెరటి తలుపు తెరిచి వెనకవైపుకు నడిచారు.

 

నిద్రలో నడిచే యంత్రంలాగ ఉంది అతని వాలకం. పెరడులో గొడ్లపాక, ఉతికే రాయి, మల్లెపూల మొక్కలు - ఇవన్నీ చీకటిలో వరుస వరుసగా దర్శించారు. ప్రతీచోట మనసు ఊగీసలాడుతుంటే అతని చూపు నేలనుంచి ఆకాశంవరకూ వ్యాపించింది.   తరువాత అతను ఇంట్లోకి తిరిగివచ్చారు, తటపటాయించుతూ తన పడక చేరుకున్నారు. ‘అతని నడకలో మందగతికి  చీకటి కారణమేమో?’ అని  శ్రీమతికి అనుమానం కలిగింది. భయంతో పిల్లిలాగ అతని వెనుక నడచి, ఇంట్లోకి తిరిగి వచ్చిన  శ్రీమతి నెమ్మదిగా  తన పడకలో పడుకొని నిద్రపోతున్నట్టు నటించింది.  కళ్ళు మాత్రం తాతగారిని చూస్తున్నాయి.

 

తాతగారు కొంచెం సేపు కదలకుండా  పడకమీద కూర్చున్నారు. తరువాత పడుకున్నారు.  కాని అతను నిద్రపోలేదని తెలిసింది.  కళ్ళు తెరచి ఉన్నా, చీకటిలో అతని కనురెప్పల మెరుపు శ్రీమతి గమనించింది. అతను దీర్ఘంగా శ్వాస వదలడం శ్రీమతికి వినిపించింది.

 

మరుదినం ఉదయం తాతగారు లేవలేదు.

 

*****

bottom of page