top of page

సంపుటి 1    సంచిక 4

కథా మధురాలు

హుండీ

Damayanti

ఆర్. దమయంతి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కథ

‘the best way to find yourself is to lose yourself in the service of others’ -Mahatma Gandhi.

  గుడి మెట్ల మీద నిశ్శబ్దంగా కూర్చుని, ఆలయ ప్రాంగణాన్ని పరికించి చూస్తున్నాడు  నీలకంఠం.

రావి చెట్టు చుట్టూ - దీపాలు వెలిగించి వదిలేసిన ప్రమిదలు ఎడా పెడా పడున్నాయి. చెట్టుకల్లా ఆన్చి దీపాలు  పెట్టొద్దంటే  వినరు.  వాళ్ళ మూఢ భక్తికి  వృక్ష కాండం మాడి నల్ల బొగ్గౌతోంది. దాని పక్కనే కొత్తగా నాటిన మూడడుగుల వేప మొక్క –   అజ్ఞానపు  మంటలంటుకుని లేత రెమ్మలన్నీ మాడిపోయి,  తల వాల్చేసింది.

ప్రాంగణం లో ఓ మూల  చెత్త బుట్ట పెట్టించాడా?!  ఊహు. చెత్త అందులో తప్ప అంతటా పోస్తారు.  వెలిగి ఆరిన వొత్తులు, అగరబత్తుల డబ్బాలు,  పసుపు కుంకుమల  పొట్లాలు,  నూనె తెచ్చుకున్న ప్లాస్టిక్ గ్లాసులూ  అన్నీ అక్కడే పారేసి పోతారు. గోడల నిండా  జిడ్డు మరకలే. తెల్ల గోడని -  చేయి తుడుచుకునే బట్ట లా వాడేస్తుంటే, అది రంగోలీ ముఖమేసుకుని చూస్తూ నిలబడింది. 

ఎంతకని చెబుతాడు? అయినా, ఇంకా చెబుతూనే వున్నాడు -  విసుగూ విరామం లేకుండా!  ఈ ఆలయం మనది. మనమే పరిశుభ్రంగా వుంచుకోవాలి అంటూ నల్ల బోర్డ్ మీద ఒక నీతి వాక్యం రాస్తూనే వున్నాడు. అయినా వినరు. చదవరు. పట్టించుకోరు.

గట్టిగా మాట్లాడితే ఇదిగో - గుడికొస్తున్న ఈ అర కొరా భక్తులు కూడా రారని భయం. ఆ వచ్చే హుండీ డబ్బులు కూడా రాకుంటే నిత్య  దీపారాధనలకూ గండి పడుతుందని వెరపు. కాదు. వ్యధ.  పెద్ద వ్యధ గా మారింది. ఇలా తీవ్ర ఆందోళన కు గురయినప్పుడు గుండె పట్టేస్తోంది. 

పదేళ్ళ క్రితం వరకు ఎంత  జనం... ఎంత  భక్త జనం!  తీర్ధం లా గుడి అంతా కళ కళ లాడుతుండేది. మంగళ వారాలు, శుక్రవారాలు, శని వారాలు కిక్కిరిసిపోయి వుండేది ప్రాంగణం. అవిరామంగా గంటలు మోగుతుండేవి. దీపాలు వెలుగుతుండేవి. పంతుళ్ళు నోటికి విశ్రాంతి లేకుండా అష్టోత్తరాలు చేయిస్తుండేవారు.  కొబ్బరి కాయలు ఆగకుండా పగులుతున్నప్పుడు… వినిపించే సముద్రపు కెరటాల చప్పుళ్ళు ఇప్పుడు లేవు.  ఆ ప్రభంజన కాలం ముగిసింది.

 టీవీల ప్రభావమో,  లేక కాలనీలోనే కొత్త గా వెలిసిన మరో నాలుగు దేవాలయాల మహిమో, కులాల కులాలు గా విడిపోయిన వీధుల వల్లో… ఏమో  కానీ,  క్రమక్రమం గా జనం తగ్గిపోతూ వస్తున్నారు.  వారాంతం లో తప్ప విడి రోజుల్లో ముఖ్యం గా ఉదయం పది దాటాక ఒక్క పిట్టా కనిపించదు. చివరికి తను ఒక్కడే ఇలా ఒంటరిగా మిగిలిపోతుంటాడు. భవిష్యత్తు లో ఈ దేవాలయం పరిస్థితి ఏమిటా అని  తీవ్ర ఆలోచనకు గురి అవుతుంటాడు. ఒక పక్కన వయసు డెభై లోకి వచ్చింది. ఓపిక తగ్గిపోతోంది. ఈ మెట్లెక్కి పైకొచ్చి కుర్చోవడమే గగనమైపోతోంది. అలాంటిది ఎక్కడికని వెళ్ళి చందాలు పోగుచేసుకొస్తాడు?

 పూర్వపు మిత్రులు ఇప్పుడు లేరు. కొందరు కాలం చేసారు. కొందరు భాగస్వామినులను పోగొట్టుకుని, ఆ విషాదం తో ఇళ్ళు అమ్ముకుని వెళ్ళారు. మరి కొంతమంది పిల్లలు పర రాష్ట్రాలలో, విదేశాలలో స్థిర నివాసమేర్పరచుకోవడం వల్ల  తమ నివాసాలని బదిలీ చేసుకున్నారు. ఒకటీ అరా కొంతమంది మిగిలినా, ఇళ్ళు అద్దెకిచ్చి సెంటర్లో అద్దె తీసుకుని వుంటున్నారు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల కావొచ్చు. కాలనీకి ఎప్పుడొచ్చి వెళ్తారో కూడా తెలీదు.

కాలం తెచ్చే మార్పులతో దేవాలయానికి ఆప్తులు దూరమయ్యారు. పాత మిత్రులు దూరమయ్యారు.

“సార్!”  పిలుపుకి ఉలిక్కిపడి చూశాడు. అర్చకుడు. గుడి తలుపులకి తాళాలేసి, తాళం చెవుల గుత్తి ఆయన చేతికిస్తూ...” మా ఆవిడకి బాలేదు సార్.  డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అందుకని అరగంట ముందుగా వెళ్తున్నా! ఇక గుడికొచ్చే వాళ్ళు కూడా లేరు...” అంటూ చెప్పాడు.

ఒక్కసారి అర్చకుని ముఖం లోకి సూటిగా చూసి,  “ఇవాళ ఏకాదశి కదూ?” అని అడిగారు.

ఔనన్నట్టు తలూపాడు. ఆయనకు తెలుసు. పంతులు బయట పూజలు చేయించడానికి వెళ్తున్నాడని. “మరి మన గుళ్ళో లేవేం ప్రత్యేక పూజలు? “

“ఎవ్వరూ బుక్ చేసుకోలేదు సార్… మీరే ఆలోచించి మంచి స్కీంలు పెట్టాలి సార్… లేకపోతే మన కాలనీ వాళ్లందరూ పక్క కాలనీ రామాలయానికెళ్ళిపోతారు”–సలహా పడేశాడు.

“స్కీములూ స్కాములూ ఎందుకయ్యా? నువ్వొక్కడివి జాగ్రత్త గా భక్తులకు చెప్పి, పూజలు చేయిస్తే చాలదా? ఇవాళ ఏకాదశి అని, బయట పూజలు, సంపాదనలు  పోతాయని నువ్వు పరుగులు పెడుతున్నావు. అదే పరుగు గుడి కోసం పెడితే ఈ పాటికి గుళ్ళో శివలింగాభిషేకాలతో కళకళ లాడేది కాదా?... అడిగితే మీకు కోపాలు. మాకు శాపాలు అంతే గా… పోనీ నీకేమైనా తక్కువ చేస్తున్నానా? హుండీ పైకం తో నిమిత్తం లేకుండా, నా జేబులోంచి తీసి నీకు ఇస్తున్నానా లేదా? మరి? ” ఉన్న మాట ముఖాన ఊదేశాడు నీలకంఠం.

ఒక వెలిసిపోయిన నవ్వు నవ్వాడు పంతులు.

“సర్లే. వెళ్ళు.” అన్నాడు ఆయన తాళం చెవులు అందుకుంటూ..

 ఏదో చెప్పడం మరిచిపోయిన వాడిలా వెనక్కి వచ్చి చెప్పాడు  “సార్. ఇందాక ట్రెజరర్ గారు ఫోన్ చేసారు. రేపు ఆదివారం హుండీ తెరవడానికి ఎన్నింటికి రమ్మంటారూ  అని…”

“హు’ లోలోన నిట్టూర్చాడు. హుండీ దిమ్మరిస్తున్నప్పుడు వినిపించిన చిల్లర పైసల శబ్దానికి! ఎంత లెక్కేసినా నెలకి ఐదువేల సంఖ్య దాటటం లేదు.  అందులోనే పంతులు గారి జీతం, పనమ్మాయి జీతం, ప్రసాదాలు, నెయ్యి నూనె ఖర్చులు వెళ్ళాలి.

“సార్, ...” ఆగాడు జవాబు కోసం.

“కిందటినెల జనమే లేరు. హుండీ లెక్కపెట్టడమూ దండగే. అయినా లెక్కలేయాల్సిందే కదా”  మనసులో అనుకుని పైకి మాత్రం “మధ్యాహ్నం రెండింటికి కూర్చుందాం. నే చెబుతాలే ఫోన్ చేసి. నువ్వెళ్ళు పంతులు...” అన్నాడు.

వెళ్ళిపోతున్న పంతుల్ని  చూస్తుండిపోయాడు. అతనెళ్ళిపోయినట్టు స్కూటర్ శబ్దమైంది. ఆ తర్వాతంతా నిశ్శబ్దం. రావి చెట్టు పత్రాలు గాలికి వూగి గలగలా నవ్వినప్పుడలా… ఆయనకి గతం గుర్తొస్తోంది. పచ్చని పచ్చిక లాటి జ్ఞాపకాల కాలం అది.

 రాంపురం రైల్వే గేట్ నించి ఈ కాలనీ దాకా అంతా  సీతయ్య పొలాలే వుండేవి.  ఆ పొలాలే ఇప్పటి ఇళ్ళుగా మారాయి. కొండల మధ్య ఆ పొలం ఇప్పుడు ఆనవాళ్లకైనా కనపడదు. కొండలు తవ్వుకుపోయారు. లోతైన గుంటలేమో నిల్వ నీటి తో  చెరువులుగా మారాయి. ప్లాట్స్ చేసి  అమ్మిన స్థలాలు ఇప్పుడు పెద్ద కాలనీగా మారింది.

తనూ స్థలం కొని, ఇల్లు కట్టుకోడానికి  వచ్చినవాడే ఇక్కడికి. ఓ రెండు గదులేసుకుని గృహప్రవేశం చేసుకున్నాడు.

గుడి కోసం వెదికితే -   విరిగిపోయిన రెండు రాతికొండ చెరువుల మధ్య కాసింత జాగాలో చిన్న గుడి కనిపించింది. గోపురం కూడా లేదు.  గుడి బయట సీతయ్య కుర్చునుండేవాడు. అశాంతి ముఖం తో! ఆస్తి వున్నవాడికి సుఖమెక్కడుంటుంది. మనిషిని పీక్కు తినేస్తారు. ఎవరోకాదు. కడుపున పుట్టిన పిల్లలే. పైగా అన్నదమ్ముల మధ్య కొట్లాటలు. హత్యలు చేసుకునేంత కక్షలు, కార్పణ్యాలు. వీటన్నిటినీ తట్టుకోలేక... గుడికొచ్చి కుర్చునే వాడు. ఎంతటి  ధనవంతుడూ… దేవుని ముందు బికారే కదా.   గుళ్ళో – ఇద్దరికీ మాటలయి, ఆ మాటలు   చనువుగా మారి అది స్నేహం గా రూపు దిద్దుకుంది. వయసులో  పెద్దవాడైన ఆయన ఎందుకు తనని ఇష్టపడ్డాడో తెలీదు కానీ,  గుడికి  పెద్దని చేశాడు. ప్రాణాలు పోయేముందు కూడా తన చేతిలో చేయి వేయించుకున్నాడు ఎలాటి పరిస్థితుల్లోనూ గుడి ని విడిచిపెట్టనని,   మాట తీసుకుని, చేతిలో చేయి వేయించుకుని… ప్రాణాలు వదిలాడు.

అప్పట్నించీ గుడిని ప్రాణప్రదం గా కాపాడుకుంటూ వస్తున్నాడు. 

వంద గజాల స్థలాన్ని కాస్త వెనక్కి జరిపి మరో యాభై గజాలు గుడిపేర రాయించాడు. స్థలం లోతట్టులో  వుందని, పిల్లర్స్ లేపి, సెల్లార్ వేయించి, కిందనున్న దేవాలయాన్ని  మొదటి అంతస్తుకి కి మార్పించాడు.  చేయంత విగ్రహం చోటున పదడుగుల బాలాజీ విగ్రహాన్ని చేయించి, ప్రతిష్టాపన చేయించాడు.

 శివుడుంటే శైవులూ వస్తారని లింగాన్ని తీసుకొచ్చాడు. నవగ్రహాలుండాలన్నారు. సరే అన్నాడు. ఎన్నో పథకాలు వేసుకున్నాడు. జనం రావడం కోసం.   సెల్లారంతా గచ్చు పరిచి, వంట గదులు ఏర్పాటు చేశాడు. కాలనీ వాసులు శుభకార్యాలు చేసుకుంటే ఉపయోగపడుతుందని. కానీ జనానికి  హంగూ పొంగూ వుండే ఏసీ హాల్సే నచ్చుతాయనీ,  దేవాలయాలలో శుభకార్యాలు చేసుకోవడం నామోషీ గా భావిస్తారన్న సంగతి ఆ తరవాత తెలిసింది.

ప్రస్తుత గుడి పరిస్థితి ఎలా వుందయ్యా అంటే సిమెంట్ లేని గోడలు ఇటుక ముఖాలేసుకునున్నాయి. రూఫ్ సీలింగ్ కి తెల్ల సున్నం వేసే స్తోమతూ లేదు. సిమెంట్ పూత తో ఆగిపోయింది.

ఏం చేయాలిప్పుడు తను?

ఎవరు పట్టించుకునే నాధులు? – గుడి స్థాపకుల వంశీకులు తమకు తోచింది ఇస్తున్నారు. కానీ బాధ్యత తీసుకోవడం లేదే? తన మీద భరోసా కావొచ్చు.

గేటు చప్పుడికి తలెత్తి చూశాడు.

ఎవరో అపరిచితుడు లోపలకొస్తూ కనిపించారు. జీన్స్ పాంట్ మీద ఖద్దరు కుర్తీ ధరించి వున్నాడు. దగ్గరకొస్తుంటె మరింత స్పష్టంగా,   నెరిసిన క్రాఫ్ తో కళ్ళద్దాలు సవరించుకుంటూ కనిపించాడు.   చూడగానే చదువుకున్న  సంస్కార వంతుడిలా మనిషిలో హుందాతనం కొట్టొస్తూ వుంది.

“నీలకంఠం గారంటే మీరేనా?” అని అడుగుతుంటే  ‘ఔనన్నట్టు’ తలూపాడు.

మనిషి తీరు చూస్తుంటే గుడికి పెద్ద మొత్తాన్ని  డొనేట్ చేస్తూ, చెక్ రాసిచ్చేలా అనిపించింది.  అందుకే మరింత మర్యాద గా పైకి లేచి నిలబడి, చేయందించాడు.  “నేనేనండి ఆ నీలకంఠాన్ని. రండి. పైన కూర్చుందాం” అంటూ గబగబా మెట్లెక్కి పైకి వచ్చాడు. రెండు కుర్చీలు దగ్గరకి జరిపి “కూర్చోండి. కొత్త గా వచ్చారా కాలనీ లోకి?” అని పరామర్శించాడు.

“ఔనండి.  అదిగో ఆ అపార్ట్ మెంట్స్-  కొత్తగా ఫ్లాట్ కొనుక్కున్నాం. త్రీ బెడ్రూం ఫ్లాట్.”

 “ఓహో అలానా!  మీ పేరు ఏమిటన్నారు?”

“రామకృష్ణా రావండి. ఇరిగేషన్ డిపార్ట్ మెన్ట్ లో ఇంజినీర్ గా పని చేసి రిటైరయ్యాను. నిన్న మీకోసం వచ్చాను. కలిసి వెళ్దామని. బయటకెళ్ళారని చెప్పారు...”

“నా కోసం వచ్చారా?”

“మీ కోసమే వచ్చాను. మీ సాయం కావాలని...”       

“నా సాయమా!? ...”

“ఔనండీ. మీ సెల్లార్ని నేను ఉపయోగించుకోవచ్చా? రోజూ సాయంకాలాలు..” అసలు విషయం లోకి దిగుతూ అడిగాడు.

“దేనికీ?”- 

“పేద పిల్లలకి నేను చదువు చెబుతుంటానండీ.  ఇంతకు ముందు నేనున్న ఇల్లు ఇండిపెండెంట్ హౌస్. ఇప్పుడిక్కడ అపార్ట్ మెంట్ లో నాకు ఆ అవకాశం లేకుండా పోయింది.  అలా అని చేస్తున్న సేవనీ హఠాత్తుగా మానుకోలేను.  మీరు  కూడా మీ  సమయాన్ని చాలా వరకు గుడి సేవలకి ధారపోసారనీ, సేవాతత్పరులని  విని నేనెంతో ముగ్ధున్ని అయ్యాను. నా ఆశయాన్ని అర్ధం చేసుకుని ఈ   ప్రాంగణాన్ని విద్యా సేవ వినియోగానికి అనుమతిస్తారన్న ఆశతో వచ్చానండి…” రామకృష్ణ చెప్పడం ఆపాడు.

అంతా శ్రధ్ధగా ఆలకిస్తున్న నీలకంఠం - రామకృష్ణని  పరీక్షగా చూస్తూ అన్నాడు.

“గుళ్ళో పాఠాలంటే ఎవరొస్తారండీ?... కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు..వచ్చాక? బీద వాళ్ళు స్కూలుకెళ్ళి రావడమే గొప్ప గా వుంది కదా… మీ క్లాసులకి వస్తారంటారా? అందులో ఉచితం గా  అంటే చులకన కాదూ? అస్సలు రారు.. అయినా… సాయంకాలాలు పూజలుంటాయి. భక్తి గీతాలు పెడతాం... ఎలా వీలౌతుందీ? కాదు. అసలిప్పటి దాకా ఎవరికీ ఇలా ఇవ్వలేదు ఈ ప్రాంగణాన్ని.  కాలనీ వాసులు  శుభకార్యాలు చేసుకుంటారని, కొద్దో గొప్పో గుడికి ఆదాయం వస్తుందని ఇలా సెల్లార్ కట్టి   వదిలేసాం...అంతే…” అంటూ నసిగాడు.

 రామకృష్ణ ఉత్సాహం చప్పున చల్లారి పోయినట్టైంది. అయినా బయటపడకుండా మళ్ళా అడిగాడు.

“గుడి తెరిచే వేళకి నేను పాఠం ఆపేస్తానండి. సాయంత్రం మూడున్నర  నించి అయిదున్నర వరకు క్లాస్ చెప్పుకుంటా… అలా అయితే మీకు ఇబ్బంది వుండదు కదా?” అర్ధింపుగా అడిగాడు.

 నీలకంఠం తలూపాడు. నిలువుగా ఒక సారి అడ్డంగా ఒకసారి. అవునూ కాదో అర్ధం కానట్టు.

“ఆదివారం హుండీ తెరుస్తాం రెండింటికి. అప్పుడొకసారి రండి. మా కమిటీ మెంబర్స్ తో కలిపించి మాట్లాడిస్తా.” అనిచెప్పి లేచాడు.

రామకృష్ణ కూడా లేచి నిలబడి, చేయి కలిపి, సెలవు తీసుకుని బయల్దేరాడు.

మెట్లు దిగివెళ్ళిపోతున్న ఆ ఇన్జినీర్మాస్టారి వైపు చూస్తూ నిట్టూర్చాడు. గుడికి పెద్ద మొత్తం లో డొనేట్ చేస్తాడేమో,  ఏ అన్న దానానికో, రంగులేయించడానికో పనికొస్తుందనుకున్నాడు. కానీ... తననే సాయం అడగడానికొచ్చాడు పాపం!

అవునూ! ఈయనకి ఈ పిచ్చేమిటీ? చదువు చెప్పే పిచ్చీ? అదీ, ఉచితం గానా? పేదవారికా? అందుకు గుడి ప్రాంగణం కావాలా? ఆలోచిస్తుంటే చాలా చిత్రం గా వుంది  నీలకంఠానికి. ఇంత కాలం లోనూ అలా అయన్ని అడిగిన జీవి ఒక్కడైనా  లేకపోవడం వల్ల కావొచ్చు.

ఎవ్వరొచ్చినా ఏదో ఇంత చందా ఇచ్చి వెళ్ళే వారే కానీ... సమాజం లో పేదలకింత చదువు చెప్పుకుంటా. గుళ్ళో నా కింత చోటివ్వమన్నదెవరనీ?

కాసేపు చిత్రమనిపించినా, ఆ తర్వాత మరిచిపోయాడా సంగతిని.

గుడి గేటు మూసి, తాళం వేసి  ఇంటికెళ్ళిపోయాడు.

**

ఆదివారం మధ్యాహ్నం చిన్న హుండీ తెరిచారు. పదిహేను - వంద నోట్లు, ఒక -ఐదువందల నోటు, మరి కొన్ని పదులు, జాస్తి చిల్లర… పరిచిన గోనె సంచీ మీద దిమ్మరించారు.

కార్యదర్శి, కోశాధికారి, మరో ఇద్దరు మెంబర్స్ సమక్షం లో లెక్క వేసారు. కిందటి నెల కంటే తగ్గిందని నిర్ధారించారు.  నీలకంఠం గుండె ఇంకా చిక్కబడింది దిగులుతో.

ఇక తన వల్ల కాదు గుడి నిర్వహణ అని చెప్పేద్దామని తీర్మానించుకుని వచ్చాడు… మాటే నోరు విప్పి చెప్పబోయేంతలో… మనిషి వచ్చి నిలిచిన అలికిడికి వెనక్కి తిరిగి చూసారందరూ.

రామకృష్ణ నవ్వుతూ  నిలబడ్డాడు.

నీలకంఠం అంత  విసుగులోనూ, ఈ మాస్టారి ముఖంలో ని వెలుగు చూసి శాంతించాడు. ఏదో చెప్పలేని ప్రశాంతత వుంటుంది ఆ కళ్ళల్లో. నిజమే. సాటి మనిషిని, అతని కష్టాన్ని కాచే కళ్ళు అవి మరి. దేవుడి కళ్ళు అవి.

కూర్చోమని చెబుతూ, అక్కడున్న నలుగురికీ నామ మాత్రం గా పరిచయం చేసి,  అసలు విషయం చెప్పాడు. ‘నాకైతే అభ్యంతరం లేదు. మీకుంటే  చెప్పండి.  మాస్టారి ఎదుటే  చెప్పేయొచ్చు...’ అంటూ సమస్యని  వాళ్ళ ముందుంచాడు. “గుడి పెద్దలు మీకు లేని అభ్యంతరాలు మాకేం వుంటాయి సార్? అలానే కానీండీ...” అన్నారు. అలా నలుగురి చేత నోటితో అనిపించుకుంటే ఆ పైన  విమర్శలు రావన్న నిజం ఆయనకి తెలుసు. ఇన్నేళ్ళు ఏక ధాటిగా నీలకంఠమే గుడి నిర్వహణ చేస్తున్నాడంటే లోకం ఎంత తెలిసివుండాలనీ!

మాస్టారి ముఖం వెలిగిపోవడానన్ని గమనిస్తూనే వున్నాడు నీలకంఠం.

అందరూ వెళ్ళి పోయేదాక,  మాస్టర్ కూడా వున్నాడు. వెళ్తూ వెళ్తూ చాక్ పీస్  అడిగి తీసుకుని నోటీస్ బోర్డ్ మీద ఇలా రాసాడు.

‘ప్రియమైన తల్లితండ్రుల్లారా! మీ ఇంట్లో  పిల్లలు బాగా చదువుకోవడం లేదని దిగులు పడొద్దు. సరైన శిక్షణ  కోసం మీ పిల్లల్ని మా దగ్గరికి తీసుకురండి. అన్ని తరగతుల వారికీ  ఇంగ్లీష్, లెఖ్ఖ్లు , సైన్స్ సబ్జెక్ట్స్లు  ఇక్కడ ఉచితంగా బోధించబడును.

 సమయం రోజూ సాయంత్రం నాలుగు నించి ఐదు న్నర వరకు. ఈ మహత్తర అవకాశాన్ని కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వివరాలకు సంప్రదించండి.

శ్రీ నీలకంఠం గారు.

గుడి నిర్వాహకులు.

సెల్ నెం :  ….. …..’

 అతని వెనక నిలబడి చూస్తున్న  నీలకంఠం ముఖం లో నవ్వు తళుక్కుమంది. తనకు పెద్దరికమిచ్చి గౌరవిస్తున్నందుకు. ‘తెలివైన వాడే ఈ మాస్టారు‘ అనుకున్నాడు మనసులో.

***

మొదటి వారం రోజులూ ఎవ్వరూ  రాలేదు కానీ, మాస్టార్ తన పాత స్టూడెంట్స్ ని గుళ్ళోకి పిలిపించుకుని పాఠాలు చెప్పడం ప్రార్రంభించాడు.

స్కూల్ నుంచి  వస్తూ పిల్లలు, పిల్లల తల్లులు గుడి తెరిచుందేమిటా అని తొంగి చూడటం మొదలు పెట్టారు.  చూసి, వింతపోయారు. ఆ తర్వాత నీలకంఠంకి  ఫోన్ చేసి మాస్టారి వివరాలు కనుక్కునేవారు.

ఈ సమాచారం  ముందుగా ఒకరి నించి ఇంకరికి ఆ తర్వాత పదిమందికి... వీధి నించి వీధుల్లోకి పాకింది.

‘మా వాడు స్కూల్ నించి వచ్చిన సంది వీడియో గేంస్ లో మునిగి చస్తున్నాడు. మొన్న టీచర్ పిలిచి  కోప్పడింది   జాగ్రత్త పడకపోతే ఇకనించి పాసు మార్కులు కూడా రావని. గుళ్ళో మాస్టార్ దగ్గరికి పంపించి చూస్తా… ఒక నెల...” అంటూ బయల్దేరింది ఒక తల్లి.

ఆ పిల్లాడితో బాటు అతని చెల్లెలూ జేరింది మరో నెలలో.

“గుళ్ళో పాఠాలు చెప్పే మాస్టారట... నిన్న మా షాప్ కాడికొచ్చి, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? అని అరుచుకుని, తన కాడికి అంపమన్నాడు. పీజులుగట్లా ఇవ్వలేము సారూ అని అంటే, గవేం వొద్దు, ఊరికే   సెబుతానన్నాడు.  నాకు నెలకు ఐదొందలు కలిసొచ్చినా కలిసొచ్చినట్టే గందా అక్కా... నెలైంది పిల్లల్ని పంపబట్టి. మంచిగా సెప్తుండు. ఇప్పుడు మా పోర గాడు కూడా స్కూల్ నించి వస్తూనే టూషన్ పోవాలంటూ ఉరుకుతున్నాడు.” – చెప్పింది వంటలు చేసుకుని జీవితం గడిపే సంగీత పక్కింటామెతో.

“సారూ! మన గుళ్ళో మాస్టారెక్కడున్నారు?” అంటూ ఉద్వేగం గా అడుగుతూ వచ్చింది పోచమ్మ మొగుణ్ని తీసుకుని. ఆ కాలనీ లో బట్టలు ఇస్త్రీ చేసే దుకాణం వాళ్ళది.  ఇద్దరు మగపిల్లలు. కష్టపడి చదివిస్తున్నారు. ఒకడు పదోక్లాస్. మరొకడు ఎనిమిదో క్లాసు. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని అయినా పిల్లల్ని చదివించాలని కోరిక. అందరి లా వాళ్ళూ దర్జాగా బ్రతకాలని ఆశ.  గుళ్ళో మాస్టారొచ్చి అడిగితే ట్యూషన్ కి పంపుతున్నారు. ఇప్పుడు ఆఘమేఘాల మీదొచ్చి మాస్టారెక్కడా అని అడుగుతుంటే నీలకంఠం  కంగారు పడ్డాడు. ఏమైనా ఫిర్యాదు చేయడానికొచ్చిందేమో అని.

“ఇంకా రాలేదమ్మా. ఎందుకు?” అడిగాడు. వివరం కోసం ఆమె వైపు చూస్తూ.

ఆమె కళ్ళెంట నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. “ఆ సారు ని కలిసి నా ఆనందాన్ని సెప్పి పోదామని వచ్చాను సారు. నిన్న మావాడు నన్నూ మా అయన్నీ పక్క పక్కన నిలబడిమని సెప్పి కాళ్ళు మొక్కిండు సారు… మాకు సంతోసంతో కళ్లెంట నీళ్ళు  ఆగలేదు. ‘ఇది వరకంతా స్కూల్ కెళ్లరా సదువుకోరా; అంటే ‘ఫోవే… నీ యమ్మా’ అంటూ ఖాతర్ లేకుండా బేషరం మాటలు మాట్లాడేవాడు. ఈ మద్య బుధ్ధి గా వుంటున్నాడు. నిన్న వాడి పుట్టినరోజని వంద కాగితమిస్తే ఇస్సిరి కొడతాడనుకున్నం మా ఆలుమగలం. కానీ వాడు అది తీసుకుని మా సేతికే ఇచ్చిండు. ఇచ్చి కాళ్ళు మొ..క్కిం..డు. సార్..” ఆమె బతకమ్మ సంబరమైపొతుంటే ఆ ముఖం లో ఆనందాన్ని చూసి  చలించిపోయాడు   ‘నువ్వు ఉచితం గా చదువు చెబుతానంటే ఎవరొస్తారు మాష్టారూ?’ అని అడిగాడు. కానీ మాస్టారు బీద పిల్లల్ని అడిగి మరీ తన దగ్గరికి  తెచ్చుకుంటున్నాడు. ఈ గుడిలో విద్యా దానం చేసి వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకుంటున్నాడా!! 

పోచమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది. “ఇక మా పిల్లగాడు ఏం సదివినా సదవకున్నా సరి సారు. వానికింత బుధ్ధినిచ్చిన మాస్టారి ౠణం మేము తీర్చుకోలేం… రేపటి సంది ఆయన ఇంటి బట్టలన్నీ మేమే సుబ్రం చేయాలి.  అది అడుగుదామనే మేం వచ్చాం...”

ఆమె కళ్ళు మాస్టారి రాక కోసం ఎదురుచూస్తున్నాయి.

“నీలకంఠం గారూ! గుళ్ళో  ఇంజినీర్ మాస్టారట.  ఇక్కడ ఊరికే పాఠాలు చెబుతారట?  మా పనమ్మాయి తన పిల్లల్ని తీసుకొచ్చింది జేర్చడానికనీ.  నన్నూ కూడా వచ్చి ఒక మాట చెప్పమంటే వచ్చాను...” అంటూ కళ్ళతో మాష్టారి కోసం వెదికింది. ఆమె కాలనీలో వుండే పేరున్న ఒక  లేడీ డాక్టర్!

అప్పుడే సెల్ మోగింది. జేబులోంచి సెల్ తీస్తూ అనుకున్నాడు. మాస్టార్ గారి గురించి ఎంక్వైరీ నే అని.

“…ఎవరండీ? ఆ. అవునండి. అంటే… పక్క కాలనీ నే కదా… అవునవును. మాస్టారు... కరెక్టే… అవును. గుళ్ళోనే.. చెబుతారు. వచ్చేస్తారు మరో ఐదు నిముషాల్లో... ఓకే…  రండి... అయితే.”

ఆ పాటికే మాస్టార్ రావడం, సెల్లార్ లోకెళ్ళడం, కుర్చీల్లో కుర్చున్న పిల్లల్ని నవ్వుతూ పలకరించడం అయిపోయింది. బోర్డ్ మీద ఏదో రాస్తున్న మాస్టార్ని చూసి, గర్వం గా మెట్లెక్కి పైకొచ్చాడు  నీలకంఠం.

చీకట్లు ముసురుకుంటున్నాయి. అప్పుడే గుడి తలుపులు తెరుస్తున్నారు. దీపాలు వెలిగించే ప్రయత్నం లో వున్నాడు పంతులు.

కాళ్ళు జాపుకుని, రెండు చేతులూ తల వెనక చేర్చి కుర్చీలో జారగిలబడి కూర్చున్న నీలకంఠానికి  పిల్లలు ఇంటికెళ్ళిపోతున్న సందడి వినబడింది.

అతనాశించినట్లే మాస్టారొచ్చి పక్కనే కూర్చున్నాడు. “వెళ్తూ కలవమన్నారు?”

కళ్ళు విప్పి చూస్తూ మెల్లగా అన్నాడు  . “మాస్టారు, మీ పుణ్యమా అని ఈ దేవాలయం సరస్వతీ విద్యాలయమైంది. ప్రతి శనివారం అన్న దానం జరిగినప్పుడు కూడా నాకింత తృప్తి కలగలేదు. మీ పేరు, ఈ దేవుని గుడి పేరు చెప్పుకుని బీద వాళ్ళు కళ్ళు నిండిపోయేలా సంతోషిస్తున్నారు. గుడికి జనం వస్తున్నారు.  హుండీ లో ఇన్ని డబ్బులేసిపోతున్నారు. నాకెంతో సంతోషంగా వుంది మాస్టారు. అందుకే ఇక నించి మీరు కోరినట్టు సమయాన్ని పొడిగిస్తున్నాను. మీ ఇష్టం ఎంతసేపైనా చదువు చెప్పుకోండి. అలానే ఆదివారాలు స్పెషల్ క్లాసుల కోసం మధ్యాన్నం నించి  సాయంత్రం దాకా కావాలన్నారు కదా?... అలానే తీసుకోండి…” మనస్ఫూర్తిగా చెప్పాడు.

వింటున్న మాస్టారు  సంతోషం తో  తబ్బిబ్బైపోయాడు.  ఆయన చేతులు పట్టుకుని…’థాంక్స్ సార్. థాంక్యు వెరీ మచ్.. మీ సహకారాన్ని ఎంత పొగిడినా తక్కువే. నాకింకా చాలా ప్లాన్స్ వున్నాయి సార్. మన గుడిని ఎన్ని మంచి పనులకు ఉపయోగించవచ్చో అని..”

“ఎలా…” నిఠారుగా కుర్చున్న వాడు కాస్తా, కాసింత ముందుకు వొంగి ఆసక్తి అడిగాడు.

ఒక హుండీ పెడదాం సార్. విద్యాదాన హుండి అని రాద్దాం. అందులో వచ్చే మొత్తం తో మన వాడలో నివసిస్తున్న అతి బీద విద్యార్ధికి  చదువు చెప్పిద్దాం. ఒక యేడాది చదువుకయ్యే ఫీజులు, పుస్తకాలు, తిండి ఖర్చుల్ని భరించే దాతలెవరైనా వుంటే ముందుకు రావాల్సిందిగా కోరదాం.

ఈ ఖర్చుని ఎంతమందైనా పంచుకోవచ్చు అని సూచిద్దాం.     

ఆ  యేడాది చదువు పూర్తయిన విద్యార్ధికి  దాతల చేతుల మీదుగా అతనికి సర్టిఫికెట్ అందచేద్దాం.   ఒక ఏడాది చదువు చెప్పించినందుకు కాదు సార్. ఒక ఏడాదిపాటు జ్ఞానాన్ని సంపాదించుకునే అదృష్టాన్ని ప్రసాదించినందుకని చెబుదాం. ఆ ఘనమైన కార్యాన్ని నిర్వహించినందుకు గాను మన కాలనీ దాతలని సన్మానించుకుందాం. ఇక్కడే. ఈ గుళ్ళోనే.  ఈ వార్త  మరెందరో కాలనీ దాతలకు స్ఫూర్తి గా నిలుస్తుంది.

 మన దగ్గరకొస్తున్న పిల్లల స్కూల్ కెళ్ళి ప్రిన్సిపాల్ ని కలిసి,  దేవాలయం తరఫున మనం చేస్తున్న విద్యా సేవల  కార్యక్రమాలని వివరించి, మన ఆశయం ముందుకు సాగాలంటే… ఫీజులో సగం మినహాయింపు ఇవ్వమని అభ్యర్ధించి వద్దాం. 

అంతే కాదు, పిల్లల కి  హెల్త్ కాంప్ ఒకటి ప్లాన్ చేస్తున్నా.  తల్లులు పిల్లలకివ్వల్సిన  ఆహారపు జాగ్రత్తల గురించి డాక్టర్ గారు వివరిస్తారు. అవసరమైన సూచనలు సలహాలూ ఇస్తారు…

వింటున్న నీలకంఠం రెప్ప వేయకుండా చూస్తున్నాడు.

అంతే కాదు సార్. మన కాలనీ లో రచయితలు, కవులు, తెలుగు పండితులు వున్నట్టు తెలుసుకున్నాను. వాళ్లతో కలిసి సాహితీ సభలు ఏర్పాటు చేసుకోవచ్చు. సాహిత్యం, సంగీతం, పురాణం, తాత్వికం, వేదాంతం ప్రసంగాలతో కాలనీ వాసులకి వినోదం తో బాటు విజ్ఞానమూ అందచేసిన వాళ్ళమౌతాం. మీకు జనం చూసి మనసు నిండుతుంది. అటు హుండీ నిండి, మీ దిగులూ తీరుతుంది. ఏమంటారు?” అని నవ్వుతూ చెప్పాడు నీలకంఠం.

నీలకంఠం  అమాంతం మాస్టార్ని దగ్గరికి తీసుకుని భుజం నిమిరాడు.

ఆ రోజు తను ఒక అసహాయుడి లా ఖర్చుల భారం మోయలేననుకుంటూ... గుడి నిర్వహణనొదిలేద్దామనుకున్నాడు. కానీ దేవుడు తనని వదలలేదు. మాష్టారి ని పంపాడు. సేవ ని నిరాటంకంగా చేసుకోమన్నాడు. ఆయన కళ్ళు కృతజ్ఞత తో నిండాయి.

***

ఆ రోజు ఒక శుభ దినం. పండగైన రోజు.  గుడి ప్రాంగణం కిక్కిరిసిపోయుంది.   గుడికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి విచ్చేస్తున్నారు.

ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్వాహకుల వారి సహాయం తో ముగ్గురు పేద విద్యార్ధులు ఇంజినీరింగ్ పట్టా ని పొందారు. ఆ ముగ్గురిలో ఒకరు కాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగాన్ని కూడా సాధించాడు. అతనెవరో కాదు. దోబీ జంట పోచమ్మ, లక్ష్మణ్ పెద్ద కొడుకు. మరొకడు రాజస్థాన్ నించి వచ్చి జొన్న రొట్టెలమ్ముకుంటూ బ్రతుకుతున్న కిషన్  కొడుకు, మూడు - స్కూల్లో ప్యూన్ ఉద్యోగం చేస్తున్న సాయమ్మ బిడ్డ – ఇంద్రాణి. వీరి చదువుకయ్యే ఖర్చులు, ఫీజులు, స్పెషల్ కోచింగులు ఇచ్చి  చదివించింది దేవాలయం వారైతే, ఆ భారాన్ని మోసింది కాలనీ దాతలు. మంత్రి గారి చేతుల మీదుగా అందరకీ అభినందనా సత్కారాలు జరగబోతున్నాయి. కాలనీ వాసులు అంతా ఒకే చోట చేరి  ఒకర్నొకరు సంతోషం తో పలకరించుకుంటున్నారు. తాము చేసిన చిన్ని సాయానికి పొందబోతున్న సత్కారం కంటేనూ ఒక పేద కుటుంబంలో విద్యా దీపాన్ని వెలిగించామన్న ఆత్మ తృప్తి వారి ముఖాలలో స్పష్టం గా కనిపిస్తోంది.

ఇక మాస్టారుని పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తున్నారు.

ప్రతి దేవాలయం – ఒక విద్యాలయం గానూ, పేద వారిని ఆదుకునే విద్యాలయం గానూ మారాలని... విద్యా దానం హుండీ నిండాలని... మంత్రి గారు ప్రసంగిస్తున్నారు. ప్రెస్ వాళ్ళు చక చకా సమాచారాన్ని రాసుకుంటున్నారు. ప్రత్యేక కథనానికి తయారౌతోంది ఈ వార్త.

  గుడికొస్తున్న జనం… కళ్ళుచెదిరే జనం చూసి పండగ చేసుకుంటున్నాడు – నీలకంఠం.    

 ఇప్పుడు ఆయనకి హుండీ గురించిన ఆలోచనలే లేవు. భక్తులు గుడికి రావడమే ఒక ధనం. ఒక సిరి. ఒక సౌభాగ్యం. అది జరుగుతోంది మాష్టారి పుణ్యమా అని! సంతృప్తిగా నిట్టూర్చాడు.

దేవాలయం లో ఇంకా తీసుకు రావలసిన సంస్కరణల గురించి యోచిస్తున్నాడు – మాస్టారు. రిటైర్మెంట్ తర్వాత తన జ్ఞానాన్ని సమాజ సేవలకే వినియోగించాలని నిర్ణయించుకున్నాడు.  కడు పేదవాళ్ళు నాలుగు మెతుకుల కోసం, బ్రతుకు ఆసరా కోసం, ఆర్ధిక పరిస్థితి మెరుగు కోసం - బలవంతపు మతమార్పిడీలకు లొంగిపోతున్నారు. అవి  జరగకుండా తన వంతు సామాజిక ధర్మాన్ని నిర్వహించానన్న తృప్తి గుండె నిండా నిండిపోయింది. అంతే కాదు. ప్రతి ఆలయం ఇలా విద్యా దానాలకు మూలస్థంభాలై  నిలిస్తే సమాజం - విజ్ఞానంతో విలసిల్లుతుంది కదూ! అనుకున్నాడు.

ప్రతి మంచి ఆలోచనలోనూ దేవుడుంటాడు. ఉన్నత సమాజం కోసం శ్రమించే ప్రతి మనిషి దేహమూ – ఒక దేవాలయమే. నడిచే దేవాలయమే. ఇతరులకు ఉపకారం చేయడానికి నీ దగ్గర ధనం ఉండనవసరం లేదు. సాటివాని కష్టాన్ని అర్ధం చేసుకునే హృదయం వుంటే చాలు. అదే సిరినిండిన హుండి. శాంతి ని గుమ్మరించే హుండీ!

.

oooo

Bio

ఆర్. దమయంతి

ఆర్. దమయంతి- దమయంతి గారికి ప్రముఖ వారపత్రికల్లో ఉపసంపాదకురాలిగా చేసిన అనుభవం ఉంది. కథా సాహిత్యమంటే ప్రత్యేక మక్కువ చూపే వీరు రాయటం కంటే కూడా చదవటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.  కృష్ణా జిల్లా – మచిలీపట్నం లో పుట్టి, పెరిగారు. ఎమ్మే సోషియాలజీ చదివారు. హైదరాబాద్ లో స్థిరనివాసం. ప్రస్తుతం రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతూ, ఆన్ లైన్ పత్రికలకు రాస్తుంటారు.

***

Damayanti
Comments
bottom of page