MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మా వాణి ...
ఒక ఋతువు ముగిసింది. వేరొక ఋతువు రంగ ప్రవేశం చేయటానికి సింగారించుకుని వుంది. ఎవరో ఎప్పుడో ఆకాశంలో ఒంపిన రంగు బొట్టు బొట్టుగా ఆకుల మీదకి జారుతోంది. ఈ ఋతు సంధ్యలో నీటిలో నీడ చూసుకుంటున్న ఏ చెట్టుని చూసినా అలంకరించుకోవడానికి అద్దం ముందు కూర్చుని ఆలోచనలో పడిన అమ్మాయిలా ఉంటుంది.
ఈ రంగురంగుల ఋతువు లాగానే, వైవిధ్యభరితమైన శీర్షికలతో మీ ముందుకు వచ్చింది మధురవాణి. ప్రసిద్ధుల నుండి, వర్థమానుల వరకు వివిధ రచయితలూ, కవుల విశేష రచనలతో రూపొందించిన ఈ సంచిక ఎప్పటిలాగా ఆదరాభిమానాలని పొందుతుందని ఆశిస్తున్నాము. ఆయా రచనలలో మీకు నచ్చిన లేదా నచ్చని విషయాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ కాలం లో తెలిపితే మాకు ఉపదయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా, ఎటువంటి రచనలను మీరిక్కడ చూడటానికి ఇష్టపడతారో కూడా చెబితే మరింత బాగుంటుంది.
ఈ ఆకులు రాలే కాలం ప్రారంభ సమయంలో చిగురించే ఆశలతో, కళ్ళలో మిలమిల మెరిసే వెలుగులతో ఎంతో మంది విద్యార్థులు పాఠశాలలలో, విశ్వవిద్యాలయాలలో అడుగు పెడతారు. అదేవిధంగా అమెరికాలోని పలు ప్రాంతాలలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగు బడులలో కూడా విద్యా సంవత్సరం ఇదే కాలంలో మొదలవుతుంది. ఉత్సాహంతో మన మాతృభాషను నేర్చుకుంటున్న తెలుగు విద్యార్థులతో సహా అందరు విద్యార్థులకీ మా శుభాకాంక్షలు!
వెళ్లిపోయిన ఋతువు తెలుగు సాహితీ లోకానికి మాత్రం విషాదాన్ని మిగిల్చింది. సౌందర్య దృష్టితో కవిత్వం, పాండిత్య పటిమతో విమర్శనా వ్యాసాలు, కల్పనా చాతుర్యంతో కథలు,నవలలు రాసిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు ఇటీవల మరణించటం విచారకరం. కొంతకాలం వంగూరి ఫౌండేషన్ గౌరవ సంపాదకులుగా వ్యవహరించిన శర్మ గారు మధురవాణి కుటుంబానికి కూడా సన్నిహితులు. వారి మరణానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము.
ఈ ఐదు నెలలలో సాహితీలోకం కోల్పోయిన కె.బి. లక్ష్మి గారు, మన తెలుగు ఇల్లేరమ్మ -సోమరాజు సుశీల గారు, రామతీర్ధ & జగద్ధాత్రి గార్ల దివ్యస్మృతికీ మధురవాణి పత్రిక తరఫున నివాళులు అర్పిస్తున్నాం. వారు మన మధ్య లేకపోయినా వారి రచనలు అనేక తరాలపాటు పాఠకుల్ని తప్పక అలరిస్తాయి. ఈ నెల, రానున్న జనవరి సంచికల "అలనాటి మధురాల"లో వారి జ్ఞాపకార్థం వారి రచనలని ప్రచురించదలిచాము. ఆ అయిదుగురితో అపురూపజ్ఞాపకాలని పంచుకుంటూ చిట్టెన్ రాజు గారు సమర్పించిన అక్షరనివాళి- "వంగూరి పి.పా" లో చదవవచ్చు.
ఈ సంవత్సరం చివరి నెలలలో అమెరికాలో తెలుగు సాహిత్యం నవ చైతన్యంతో కళకళ లాడుతుందని చెప్పవచ్చు. అమెరికా ప్రాక్ పశ్చిమ తీరాల్లో కొద్ధి వ్యవధి తేడాలో జరగబోతున్న సాహిత్య కార్యక్రమాలే దానికి కారణం.
వంగూరి ఫౌండేషన్ వారు ప్రతి రెండేళ్ళకి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్న సదస్సులలో భాగంగా పదకొండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు పిల్లలకు, పెద్దలకు స్వప్న భూమి వంటి ఓర్లాండోలో నవంబరు 2,3 తేదీల్లో జరగబోతోంది. అమెరికా నలుమూలల నుండి మాత్రమే కాక ఇండియాకు చెందిన పలువురు కవులు, రచయితలూ పాల్గొనే ఈ సదస్సు సాహితీ ప్రియులందరికీ ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుందనటంలో సందేహం లేదు. అక్టోబరు 4-6 తేదీల్లో బే ఏరియాలో అమెరికా తెలుగు రచయితల సమావేశం జరగనుంది. సభలు, ఉపన్యాసాల రూపంలో కాకుండా, ఆసక్తి గల కవులు, రచయితల మధ్య ఇష్టాగోష్టిగా ఈ సమావేశం జరుగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశాలు విజయవంతంగా జరగాలని కోరుకొంటున్నాము.
భారతీయ సాంప్రదాయ వైభవాన్ని చాటిచెప్పే దసరా, దీపావళి పండగలు, అమెరికా సంస్కృతికి పట్టుకొమ్మలవంటి క్రిస్మస్, థాంక్స్ గివింగ్ పండుగలు రాబోయే నెలలలోనే వస్తాయి. రెండు సంప్రదాయాలకు వారసులు, రెండిటి సత్ఫలితాల గ్రహీతలైన ప్రవాసాంధ్రులు ఈ పండుగలన్నిటినీ తమతమ కుటుంబాలతో, స్నేహితులతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం!
*****
మధురవాణి నిర్వాహక బృందం