MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మా వాణి ...
గ్రీకు మహాకవి ఒడీసియస్ ఎలైటిస్ రాసిన పోస్టుమార్టం అనే కవితలో చివరి వాక్యం ఇలా ఉంటుంది -
“ఈ ఏడాది ఆకులు రాలు కాలం ముందే వస్తుంది”.
ప్రస్తుత పరిస్థితిలో మనం దీనిని కొద్దిగా మార్చి “ఈ ఏడాది ఆకులు రాలు కాలం ఆలస్యంగా వచ్చింది” అని చెప్పుకోవాలి. కాలచక్రం గతిలో మార్పు లేకపోయినా, ఋతుచక్ర గమనం మాత్రం ఎందువల్లనో ఈసారి కొంత మందగించింది. తెలుగు క్యాలెండర్ లో వచ్చిన అధిక మాసాన్ని సుదూరంలో ఉన్న ఈ అమెరికా ఋతువు అనుసరించినట్టుగా ఉంది. మిగతా ఋతువుల కంటే భిన్నమైన ఈ ఋతుశోభ ఒక కమనీయమైన దృశ్యం. అందమైన రాజకుమారి విశ్రమించబోతూ, తన నగలన్నిటితో అలంకరించుకొని, మళ్ళీ వాటిని ఒకటొకటిగా తొలగించినట్టుగా ఉంటుంది. ఐతే, ఈసారి రాజకుమారి తన అలంకరణ కోసం ఇంకా ఎదురు చూస్తోంది. బాటల పక్కన రంగురంగుల బ్యానర్లు కట్టడానికి చెట్లు ఎదురు చూస్తున్నాయి. ఆకులు రేకులై విరిసిన చెట్లను పువ్వులుగా చేసి తురుముకొనే సద్దుల బతుకమ్మలుగా రూపుదిద్దుకోవటానికి కొండలు ఎదురు చూస్తున్నాయి.
అలాగే, కొత్త, పాత శీర్షికలతో, కొత్త, పాత రచయితల విభిన్న రచనలతో సర్వాంగ సుందరంగా తయారై వచ్చే మధురవాణి కోసం మీరంతా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మీ ఎదురు చూపులకి తెర దించుతూ కొత్త సంచిక మీ ముందుంది.ప్రతీ సంచికకీ మల్లేనే ఈ సంచికతో కూడా మరో కొత్త విశేషం పంచుకోనున్నాము.
ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ గారు ఈ సంచికనుంచీ "హాస్య మధురాలు" లో తన కార్టూన్ల ద్వారా మన పత్రికకి మరిన్ని వినోదపు హంగులు సమకూర్చనున్నారు. అందుకు జయదేవ్ గారికి పత్రికా సంపాదకబృందం తరఫున ధన్యవాదాలు.
ఈ సంచికలో ఎప్పటిలాగానే మీ కిష్టమైన కథలు, కవితలు, వ్యాసాలు, శీర్షికలు గత స్మృతులను స్మరణకు తెచ్చే అలనాటి మధురాలు మిమ్మల్ని అలరిస్తాయని ఆశిస్తున్నాం. ఈ శీర్షికలని మరింత సంపన్నవంతం చెయ్యటానికి ప్రసిద్ధ, వర్ధమాన రచయితలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం.
ఈ వేసవి వెళుతూ వెళుతూ ఒక విషపు నవ్వు నవ్వింది. రౌద్ర తాండవంతో తాపం సృష్టించిన పరమశివుడు అంతంలో తన జటాజూట గంగతో ముంచెత్తాడా అన్నట్టు, పశ్చిమంలో దావాగ్నిని రగిల్చిన వేసవి, ఆగ్నేయంలో వరదగా మారి నిష్క్రమించింది. ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులకు గురైన కాలిఫోర్నియా, ఉత్తర దక్షిణ కేరోలీనా వాసులకు మా సానుభూతిని తెలియజేస్తున్నాం.
అఖండమైన తెలుగు సాహిత్య వైభవాన్ని చాటిచెప్పే ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వేడుకలు మరొక కొత్త ఖండానికి విస్తరించటం ముదావహం. వంగూరి ఫౌండేషన్, ఆస్ట్రేలియా తెలుగు సంఘం మరియు లోక్ నాయక్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నవంబరు 3,4 తేదీల్లో మెల్బోర్న్ నగరంలో నిర్వహిస్తున్న ఈ సభలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నిర్వాహకులకు మా అభినందనలు తెలియజేస్తున్నాం.
సంవత్సరంలో చివరి మాసత్రయం ఒక పండుగల పంట. ఇందులో వరుసగా రాబోయే దసరా, దీపావళి, Thanks Giving మరియు క్రిస్ మస్ పండుగలు మీ జీవితాల్లో ప్రేమని, ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం!
మధురవాణి నిర్వాహక బృందం