MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మా వాణి ...
ప్రపంచవ్యాప్తంగా madhuravani.com ని ఆదరిస్తున్న సాహిత్యాభిమానులకి వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే, శ్రీరామనవమి శుభాకాంక్షలు.
వికారి నామ సంవత్సరం వస్తూ, వస్తూ దేశంలో, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలని తీసుకువస్తుంది. ఒక దేశానికి రాజకీయ"రాకాసులు" చేసే చేటు కన్నా ... విచక్షణ. వివేకం ఉన్న ఒక మేధావి మౌనం పెను ప్రమాదం. ఈ ప్రజాస్వామ్య మహా యాగంలో, దేశాన్ని ప్రేమించే ప్రతీ వ్యక్తి, ఓటు హక్కు వినియోగించుకోవాలని, సరయిన అభ్యర్థులని ఎన్నుకోవాలని అభిలషిస్తున్నాము.
ఇక, విళంబి నామ సంవత్సరం వెళుతూ వెళుతూ తెలుగు ప్రజలకి కొందరు గొప్ప వ్యక్తులని దూరం చేసింది.
సుప్రసిద్ధ రచయిత ద్వా.నా.శాస్త్రి గా పిలువబడే ద్వాదశి నాగేశ్వర శాస్త్రి గారు ఒక వక్తగా, సాహితీవేత్తగా తెలుగు సాహితీ రంగానికి చిరపరిచితులు. ఆయన రచించిన" తెలుగు సాహిత్య చరిత్ర" ఒక ప్రామాణిక గ్రంధంగా తెలుగు నాట ప్రఖ్యాతి పొందింది. ఒక గొప్ప వక్తగా వారి వాగ్ధాటిని ఎరిగినవారందరికీ వారి సాహితీ ప్రకర్ష ఎప్పటికపుడు ఓ అద్భుతంగా తోచేది. madhuravani.com తొలి సంచిక ఆహ్వానిత రచయితగా మన పత్రిక తొలి సంచిక పుటల్లో, తెలుగు సాహితీ వినీలాకాశంలో శాశ్వతంగా మిగిలిపోతారు.
తొలి సంచిక ఆహ్వానిత మధురం ... అబద్ధాయ నమః లంకె ఇక్కడ పొందుపరుస్తున్నాము https://www.madhuravani.com/blank-zfthz అలాగే ఈ సంచిక అలనాటి మధురాలలో వారికి నచ్చిన వారి కథ పాఠకులూ జాగ్రత్త! పంచుకుంటూ వారికి నివాళి సమర్పిస్తున్నాము.
ద్వా. నా శాస్త్రి గారు పరమపదించిన విషయం మరవకముందే మరో నిర్యాణం దిగ్భ్రాంతిపరిచింది.
మార్చ్ 23, 2019...మా అనసూయ గారు తన 99 వ ఏట పరమపదించారు అనే ఆ వార్త తో, ఆ మహా మనీషితో అవినాభావ సంబంధం ఉన్న మా madhuravani.com సంపాదక బృందానికే కాక, యావత్ తెలుగు సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సినీ రంగాలలో ఉన్న కళాకారులందరికీ ఒక పెద్ద దిక్కుని కోల్పోయిన లోటు స్పష్టంగా తెలిసింది.
ఎనిమిది తరాలకి చెందిన ఆఖరి ధృవతార శాశ్వతంగా వెలుగులు నింపడానికి గగనానికి చేరారు. వారి జ్ఞాపకార్దంగా ...“అసమాన అనసూయ” ‘కళా ప్రపూర్ణ’ డా. అవసరాల (వింజమూరి) అనసూయా దేవి గారి కి అక్షర నివాళి.
మధురవాణి నిర్వాహక బృందం