MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మా వాణి ...
మధురవాణి - రంగు రంగుల కొత్త చీర కట్టుకుని మిల మిలా మెరిసిపోతూ ఎలా వచ్చేసిందో! అవును, క్రితం ఏడాది వచ్చినప్పుడూ ఇదే సొగసు. అదే మెరుపు. ఆమెను చూస్తూనే భవిష్యత్తంతా వెలుగవాలనే ఆకాంక్ష!
ఎన్ని ఉగాదులొచ్చివెళ్లినా ప్రతి సంవత్సరమూ ఇంకో ఉగాది కోసం ఎదురుచూడడం, మంచి రోజులు రావాలని మళ్ళీ మళ్ళీ అనుకోవడం. దానికి కారణం మనమూ, మనతో పాటు ఈ భూమి మీద పుట్టిన ప్రతిజీవిలో బతుకు మీద వుండే ఆశే కదా? నలుపు, తెలుపు,పసుపు, గోధుమ రంగు భేదాలుంటాయా ఈ జీవితేఛ్చకి? మనం గిరులు గీసుకుని తయారు చేసిన దేశపు సరిహద్దులూ , మానవత్వం పేరుతొ మన చుట్టూ పెంచుకున్న తత్వాలూ, మతాలూ, వాటి అన్నిటి నడుమ పెంచుకున్న అంతరాలూ జీవితసత్యానికి అడ్డు గోడలై నిలవగలవా? జీవితం సముద్రం లాంటిది. అది ఉప్పెనై ఉరికితే ఈ గోడలు, దాని వెనక మనం నిలువగలమా? ద్వేషం విషనాగై కొంతమందిని కాటు వేయవచ్ఛు. కొంత కాలం పాటు రాజ్యం చెయ్యవచ్చు. కానీ 'కట్టెలోని నిప్పు కట్టెనే కాల్చదా' అన్న నార్ల మాట నిజం కాదూ? ఏ ద్వేషమైతే ప్రపంచాన్ని దహించుతోందో అదే భస్మాసురుడి హస్తంలా తనను తానే దహించుకుపోయే రోజు త్వరలోనే రాదా మరి? రావాలనే ఆకాంక్ష.
అవును. కొత్త సంవత్సరం కదూ, మరో కొత్త ఉగాది కదూ! ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కొత్త మామిడి పూతలా చిగురించే ఆశ. చిన్నప్పుడైతే కొత్త బట్టలు కట్టుకుని పెద్దవాళ్ళకి చూపించి దణ్ణం పెట్టి ఆశీర్వచనాలు తీసుకున్న అలవాట్లు. చేసే ప్రతి పనిలో, ప్రతి ఆచారం లోను తెలిసో, తెలియకుండానో, ఏదో ఆశ. ఏదో నమ్మకం. మనకు మంచి జరగాలని ఆకాంక్ష. మనం బతికే ప్రతి క్షణం అనుకూలం కావాలి. అయితే కాలం మనం అనుకున్నంత మంచీ చెయ్యదు, చెడూ చెయ్యదు. మనం ఎక్కడో మధ్యలో ఉంటాం. అది గుర్తుచేస్తూ పెద్దలు ఉగాది పచ్చడి తినమన్నారని మా అమ్మ చెబుతుండేది.
కథల్లో ఎన్నో రుచులు. ఉగాది పచ్చడిలా అన్ని రుచులు, రంగులు, రసాలు కలగలిపినవి కొన్నైతే, ఒక్కో రుచినిస్తూ రాసిన కథలు మరికొన్ని. అంతే కాదు. కథలు రాసే వాళ్ళు కొందరే కానీ వాళ్ళల్లో ఎన్నో రంగులు, ఎన్నో వైవిధ్యాలు. వైవిధ్యంలోంచే వస్తాయి మంచి కథలు.
ఎప్పటిలాగే ఈ ఉగాది సంచికలో కూడా మీరందరూ మెచ్చగలిగే వైవిధ్యం వున్న కథలు, కవితలు, వ్యాసాలు మరింత అందమయిన గెటప్ లో మీముందుంచుతున్నాం. హాస్య రాజు అందించే కితకితలు, చిరునవ్వులు తెప్పించే కార్టూన్లతో సహా, ఎన్నో శీర్షికలతో మీ ముందుకొచ్చింది మధురవాణి - మా సుమధురవాణి - ఈ హేవిళంబి నామ సంవత్సరానికి నాంది పలుకుతూ.
మధురవాణి నిర్వాహక బృందం