MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
చచ్చింది గొర్రె
డా. మూలా రవి కుమార్
“గవర్నమెంటు కంపెనీలంటే ప్రజా ప్రతినిధులకు ఎంత అలుసో!? వాళ్ళమాటలు వింటుంటే ఉజ్జోగం మీదే విరక్తి వస్తోంది సార్.” మేనేజరు గారి చాంబర్లోకి అడుగుపెడుతూ అన్నాడు కిరణ్.
“డవలెప్మెంటు ఆఫీసరుగా జాయినైన ఏడాదిలోపలే ఇంత వైరాగ్యమా!? అదీ కాక మరో మూణ్ణెల్లలో బ్రహ్మచర్యం వదులుకుంటున్నవాడివి కూడా. ఇంతకీ ఈ వైరాగ్యానికి కారణం ఏమిటి?” మేనేజరు నవ్వుతూ అడిగారు.
“ఈ జిల్లాలో గొర్రెల ఇన్సూరెన్సుని తాత్కాలికంగా ఆపేం కదా? ఈరోజు ఎమ్మెల్యే గారి కుడిభుజం నాకు ఫోను చేసి మళ్ళీ ప్రారంభించమని హుకుం. అది నా చేతులలో లేదు అని చెబితే, ఎవరి చేతులలో ఉందో వాళ్ళని ఎమ్మెల్యేగారికి ఫోను చెయ్యమని మరో ఆదేశం.”
పశువుల భీమా అనేది భీమా కంపెనీలకు లాభదాయకం కాదు. కానీ రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఇన్సూరెన్సు కంపెనీలచేత పశువుల భీమా చేయించి, ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పిస్తాయి. పదివేల రూపాయల పశువుకి ఐదొందలు ప్రీమియం ఉంటే, అందులో ప్రభుత్వం సగం సబ్సిడీ ఇచ్చి మరీ ప్రోత్సహించింది. ఇప్పుడంటే, ఈ విషయంలో చైతన్యం పెరిగి ఏ పశువుకి భీమా చేయిస్తారో దాని చెవికే పోగువేస్తున్నారు కానీ, ఓ ఇరవయ్యేళ్ళక్రితం ఐతే, చెవికి వెంటనే పోగు వేసేవారు కాదు. ఈ పథకానికి ప్రభుత్వం తరపున ప్రచారం చేసే పాలసంఘం సెక్రటరీయో పశువైద్య కార్యకర్తో తమ దగ్గర చెవిపోగులు పెట్టుకొనేవారు. ఒక రైతుకి నాలుగు పశువులుంటే ఒకదానికి భీమా చేయించి, ఏడాదిలోపు ఈ నాలుగింటిలో ఏ పశువు చనిపోతే, దానికి ఈ పోగు వేసి, పోస్టుమార్టం రిపోర్టూ, ఫోటోలూ తీసుకొని భీమా పరిహారం ఇప్పించారు. రైతులకు ఈ స్కీము గురించి చెప్పేటప్పుడు కూడా ఒక పశువుకి చేయించుకుంటే ఏది చచ్చిపోయినా పరిహారం వస్తుందనే చెప్పి ఒప్పించేవారు. అప్పట్లో చాలా చోట్ల ఏ రైతుకీ కూడా ఇది కంపెనీని మోసం చేయటం అని తెలీదు కూడా. ఇలా భీమా అలవాటైనకొద్దీ, రైతుల సంఖ్యపెరగటంతో, ఏ జిల్లాలో చూసినా ప్రీమియం కన్నా పరిహారం పెరగటంతో పశువుల భీమా అంటే కంపెనీలు వెనుకంజ వేయటం మొదలెట్టాయి. ప్రైవేటు కంపెనీలు ఎలాగో చెయ్యవు కనుక ప్రభుత్వరంగ సంస్థలకు ఇది తప్పనిసరి అయి కూర్చుంది. భీమా చేయించిన పశువుకే వెంటనే చెవిపోగు వేసేయటం వల్ల భీమా కంపెనీల నష్టాలు తగ్గినా, వ్యాపారపరంగా చూస్తే ఇది ఎప్పటికీ లాభదాయకం కాదు. అప్పటికప్పుడు చెవిపోగు వెయ్యటం వల్ల ఎన్నిపశువులు ఉంటే అన్నింటికీ ప్రీమియం కట్టాల్సి రావటాన్నే సాధారణ రైతులు దోపిడిగా భావించటం మొదలెట్టేరంటే కంపెనీల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
పాడికే తప్ప మాంసానికి పెంచని ఆవులు గేదెల్లో కొంచెం పర్వాలేదు గాని, గొర్రెల భీమా మరీ దారుణం. పెద్దమొత్తంలో గొర్రె మాంసం ఉపయోగించే బక్రీదు, కనుమ తర్వాత చెవిపోగులు తెచ్చి గొర్రె చచ్చిపోయిందని పరిహారం అడిగే కేసులు ఎక్కువయ్యాయి. అంటే ఐదువేల రూపాయలకు మాంసానికి అమ్ముకున్న గొర్రెలక్కూడా కంపెనీలు వందరూపాయల ప్రీమియం తీసుకొని రెండు వేల రూపాయల పరిహారం చెల్లించాయన్నమాట. అందువల్ల గొర్రెల భీమా తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. ఇదీ వీరి సంభాషణలకు నేపధ్యం.
కిరణ్ మాటలు విన్న మేనేజరు ఎమ్మెల్యేకి ఫోను చేసి "సార్, గొర్రెల ఇన్సూరెన్సు తాత్కాలికంగా ఆపేం కానీ, కొత్త నిబంధనలు నిన్ననే వచ్చాయి. త్వరలో గొర్రెల పెంపకం దారులకు ఈనిబంధనలు తెలియజేసి మళ్ళీ భీమా మొదలుబెడతాం.”
“ఓ పని చెయ్యండి మేనేజరు గారూ. రేపు మన జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం వారు నాకు సన్మానం చేస్తున్నారు. వాళ్ళ ప్రతినిధులు మిమ్మలిని కూడా ఆహ్వానిస్తారు. అక్కడికి రండి. అక్కడే మీ క్రొత్త నిబంధనలని వారికి వివరించండి.” ఫోను పెట్టేసారు.
చచ్చేం అనుకుంటూ, మేనేజరు గారు షీప్ ఇన్సూరెన్సు గైడ్లైన్స్ చదవుతూ, వాటిపై రైతులు ఎమ్మెల్యే గారి సమక్షంలో అడిగగలిగే ప్రశ్నలూ, వాటి సమాధానాలూ ఊహించి మరీ రాసుకున్నారు. నిజానికి కోట్లలో లాభాలు తెచ్చే వాహన భీమాలమీద వెచ్చించాల్సిన సమయం కన్నా లక్షల్లో నష్టాలు తెప్పించే విషయం మీద, అదీ నష్ట నివారణ కోసం కాక నష్టకారకులకు సంజాయిషీ ఇవ్వటం పై ఎక్కువ సమయం వెచ్చించాల్సిన వింత పరిస్థితి.
“సార్, మనం కేంద్ర ప్రభుత్వ కంపెనీలవాళ్ళం కదా. ఎమ్మెల్యేలకు ఇంత భయపడాలా?”
మనం, మన సంస్థకు లాభాలు తేవటానికి చాలా చేస్తాం. సంస్థ ప్రతిష్ట కోసం ఇలాంటివి చెయ్యాలి.
“రేపు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది సార్?”
గోటితో పోయే మొలకలాంటి సమస్యను ఉపేక్షిస్తే గొడ్డళ్ళతో నరకాల్సిన మానులా పెరుగుతుంది. రేపు ఎమ్మెల్యే గారి సమక్షంలో మనం అన్నీ రూల్స్ ప్రకారమే జరుగుతున్నాయని నిర్మొహమాటంగా చెబితే, ఆయన దానిని నిర్లక్ష్యం అనుకోవచ్చు. అసెంబ్లీనో, ఎంపీగారిదగ్గర పంచాయితీ పెట్టించి పార్లమెంటులోనో ప్రస్తావింపజెయ్యవచ్చు. అప్పుడు నాలాంటి వెయ్యిమందికి పైగా మేనేజర్లకి అధిపతి అయిన మన చైర్మన్ గారు సంజాయిషీ ఇచ్చే పరిస్థితి వస్తే, ఆయన సంజాయిషీ ఇచ్చి ఊరుకోకుండా, సమస్యకి మూలాలు వెతుక్కుంటూ మన దగ్గర ఆగవచ్చు. సమాజంలో ఉపకారుల పట్ల ఉన్న భక్తి కన్నా, అపకారులపట్ల భయమే ఎక్కువ. వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసి దొరికిపోయినా వెంట్రుకవాసి నష్టం జరగదు, కానీ మనం మాట్లాడే ప్రతి మాటకూ మనం జవాబుదారి.
ఉదయాన్నే షీప్ ఫెడరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ అధికారి ఫోను. మేనేజరు గారూ, గుడ్మార్నింగ్. మీరు కూడా టౌనుహాల్లో సమావేశానికి వస్తున్నట్లు తెలిసింది. మా షీప్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్ గారు మీనుంచి కొత్త గైడ్ లైన్స్ తీసుకొని చదివి మీటింగుకి రమ్మన్నారు. కొంచెం ఈ మెయిల్ చెయ్యగలరా. ఓహో. నేను చెప్పే నిబంధనలను గొర్రెల పెంపకం దారులు అంగీకరించకపోతే వాళ్ళ తరపున మాట్లాడే నిపుణుడిని నా మీదకు తోలేరన్నమాట. అదీకాక సదరు అధికారి స్వయంగా పశువైద్యుడు. చైర్మన్ గారికి విశ్వాసపాత్రుడు. దేవుడిమీద భారం వేసి ఈ మెయిల్ పంపారు మేనేజరు.
కార్యక్రమ ప్రారంభంలో జిల్లా చైర్మన్ మాట్లాడుతూ, నెలరోజులుగా భీమా సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్న మా సోదరుల సమస్యలను అర్ధం చేసుకొని, భీమా కార్యక్రమం వెంఠనే ప్రారంభించవలసిందిగా మేనేజరు గారిని ఆదేశించి, ఈ మీటింగుకు పిలిపించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు అనేసరికి చప్పట్లు మార్మోగేయి. చప్పట్లూ ఆగి చైర్మను మళ్ళీ ఏదో చెప్పేలోపల ఎమ్మెల్యే గారు మైకు అందుకొని, చైర్మను గారూ, మీరేదో అపార్ధం చేసుకున్నట్టున్నారు. మేనేజరుగారికి నేనెటువంటి ఆదేశలూ ఇవ్వలేదు. వారు కేంద్రప్రభుత్వరంగ సంస్థ అధికారి. మన రైతుల సమస్య వారికి వివరించి, ఈ మీటింగుకు వచ్చి రైతులను భీమా విషయంలో చైతన్యపరచగలరా అని అడిగితే, వారు సహృదయంతో వచ్చారు. వారు మన రైతు సోదరుల పక్షమే. కానీ ఒక సంస్థలో పనిచేసే నియమనిబంధనలు పాటిస్తూనే మనకు చేయగలిగే సహాయం తప్పకుండా చేస్తారు. అక్కడున్న ఐదారొందలమందిలో డజను లోపల మెదళ్ళకి మాత్రమే ఆ మాటల్లో హెచ్చరిక అర్ధం అయ్యింది.
మేనేజరుగారిని వేదిక మీదకు ఆహ్వానించగానే, ఇన్సూరెన్సు క్రొత్త నిబంధనలను ఒక అరగంట వివరించారు. గడచిన ఐదేళ్ళలో తమ కంపెనీ ఈ జిల్లాలో పశువుల భీమాపై తీసుకున్న ప్రీమియం, చెల్లించిన పరిహారం, వివరించారు. నష్టం వస్తున్న విషయం కావాలనే చెప్పలేదు. గ్రహించినవారు గ్రహించారు. క్రొత్త నిబంధనలు విన్న రైతులు, ఇలా ఐతే కష్టమే అనుకున్నారు.
రైతుల ఇబ్బందులని వివరించటానికి జిల్లా చైర్మన్ కుడిభుజం ఐన అభ్యుదయ రైతు మాట్లాడుతూ, “మేనేజరుగారు చెప్పిన క్రొత్త నిబంధనలన్నీ చదువుకున్న మాలాంటి రైతులు అర్ధం చేసుకోగలరు. కానీ మాలో చాలామంది నిరక్షరాస్యులు. కొండా,కోనల్లో గొర్రెలు మేపుకుంటుంటే అక్కడ ఏ రాత్రో గొర్రె పాము కరిచి చచ్చిపోయినా, తోడేలు ఎత్తుకుపోయినా గొర్రె కళేబరాన్ని పోస్టుమార్టం కోసం తీసుకురాలేరు. అంచేత గొర్రె కళేబరం కాకుండా కత్తిరించిన చెవితో పాటు ఉన్న పోగు, డెత్ సర్టిఫికేట్ చూపిస్తే పరిహారం ఇచ్చేలా చూడండి అని విన్నవించారు. అలా ఐతే మా రైతుసోదరులు కాలినడకన పశువైద్యశాలకు వెళ్ళి అక్కడ చెవిపోగుతో ఉన్న చెవిముక్క చూపించి, డెత్ సర్టిఫికేట్ రాయించుకొని ఆ రెండింటినీ మీకు సమర్పించగలరు.”
వెంటనే మేనేజరుగారు- “ఓ పని చేద్దామండీ, గొరె కళేబరం తీసుకురావటం కష్టం కనుక, చనిపోయిన గొర్రె తలను పశువుల ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అది చూసి డాక్టరుగారు సర్టిఫికేటు రాస్తారు. నేను ఆ సహాయం చెయ్యగలను” అన్నారు.
కుడిభుజం మాటలు తడుముకుంటూ ఉంటే, దిగువ కుర్చీల్లోంచి ఒక సన్నకారు రైతు విసురుగా ముందుకొచ్చి-
“తల తీసేస్తే గొర్రె చచ్చిపోతుంది కదండీ. చెవి కోస్తే, ఏ మందో రాసి, గొర్రెని రేటొచ్చాకా అమ్ముకుంటాం. మీరు చెవి కోసి తెస్తే డబ్బు ఇచ్చి తీరాల్సిందే....“ అని తీవ్రస్వరంతో చెప్పాడు.
ఒక్కసారిగా కుడిభుజం, చైర్మను, ఎమ్మెల్యే అంతా నోళ్ళు తెరుచుకొని ఉండిపోయారు. అందరికంటే ముందు తేరుకున్నది, ఎగ్జిక్యూటివ్ అధికారి. మైకందుకుని- “షీప్ ఇన్సూరెన్సుపై మేనేజర్ గారు తమ నిబంధనలు వివరించారు. ఈ విషయమై మనం అంతర్గత సమావేశంలో చర్చిద్దాం. ప్రస్తుతం, తదుపరి కార్యక్రమం ఐన గౌరవ శాసనసభ్యుల సన్మానం మొదలవుతుంది.” అన్నారు.
కాగల కార్యం సన్నకారు రైతురూపంలో వచ్చిన గంధర్వుడు తీర్చటంతో మేనేజరు ఊపిరి పీల్చుకున్నారు.
*****