top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

గొంగళి

adoori-haima.JPG

హైమావతి ఆదూరి

అవి ఎన్నికల పండగల రోజులు. 

పండగలు కొందరికైతే , ఉద్యోగులకు ఎండగలు, ప్రభుత్వ ఖజానాకు దండగలు. ఎలక్షన్ సిబ్బందికి గండాలు. కొంద రు గ్రామవాసులు కూలి పనులన్నీ, వదిలేసి ఎవరు డబ్బిస్తే వారి జెండాలుపట్టు కుని అరుస్తూ తిరిగి, ఒప్పందం ప్రకారం ముట్టినంత తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇహ ఎన్నికల సిబ్బంది కష్టాలు అదీ మహిళా ఉద్యోగుల ఇబ్బందులు  చెప్పనలవికానివి. గుండె ల్లో రైళ్ళు పరుగెడుతుంటాయి.                               

                                                                                       

 ఆ రోజూ అలాగే- భయపడుతూనే స్కూల్ కెళ్ళింది కళ్యాణి. ఆ మధ్యే కష్టపడి,పిల్లలతో పాటుగా ఏడేళ్ళు చదివి,చదివి ఎం.ఏ. ఏమెడ్ పూర్తిచేసి, ప్రెమోషన్ పొందింది .స్కూల్ కెళ్ళగానే" మేడం! ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ ఇవాళో రేపో వస్తాయిట! ఈ మారు మీకు పీ.ఓ.గా వస్తుందను కుంటున్నారు మేడం ఆర్.డీ.ఓ ఆఫీస్లో ." అంటూ  చావుకబురు చల్లగా అందించాడు అసిస్టెంట్ ఆనంద్.         

 

"బాబోయ్!పీ.ఓ నే!" అంటూ కల్యాణి కూర్చీలో వెనక్కు వాలింది భయంగా.                                                                                              

 

"అదేంటి మేడం! ఎన్నోమార్లు ఏ.పీ.ఓ.గా డ్యూటీ అద్భుతంగా చేసి,మంచిపేరు తెచ్చుకున్నారు,ఈమారు పీ.ఓ ఐతే మీకు పనంతా తెలుసు గనుక భయమేముందీ!" ఆశ్చర్యంగా అన్నాడు ఆనంద్.           

 

"నీకేం తెలుసయ్యా బాబూ!పీ.ఓ అనేవాడుంటే మనం ఏ.పీ.ఓ.గా డ్యూటీ చేయ డంవేరు,పీ.ఓగా డ్యూటీ చేయడంవేరూ కదా ! ఆనంద్! ఇంతకూ తప్పిం చుకు నే మార్గమేం లేదంటావా?" ఆశగా అడిగింది కళ్యాణి.                                                                                                         

 

"ఈమారు చాలాస్ట్రిక్ట్ అట మేడం ! అంతా డ్యూటీస్ ఎగ్గొట్టను అనేక మార్గాలు వెతుక్కుంటున్నారని  డిప్యూటీ కలెక్టర్ గారు ఇక్కడే మకాం చేస్తారుట!" అంటుండగానే ఎలక్షన్ ఆర్డర్స్ తీసుకుని వచ్చాడు ఉద్యోగి.

 

అనుకున్నట్లే  కళ్యాణి కి పీ. ఓగా డ్యూటీ పడింది. అదీ మారుమూల ఎఱ్ఱబల్లి. అక్కడికి లారీ,టూ వీలర్ తప్ప మరేమీ పోవు. అడవిలోంచీ వెళ్ళాలి.అదీ  కాక ఆ ఊరు ఇబ్బంది సముదాయపు ఊర్లలో ఒకటిట. అది చూడగానే కళ్యాణి గుండె వేగంగా కొట్టుకుంది.            

                                         

"మేడం! భయమేం ఉండదు.పోలీస్ ప్రొటక్షన్ ఉంటుంది.కలెక్టర్ గారూ, ఆర్ డీవోగారూ తిరుగుతూనే  ఉంటారు. భయమేం ఉండదు."అని ధైర్యం చెప్పి ఆర్డర్స్ అంట గట్టి వెళ్ళాడు ఉద్యోగి. పాపం అతడు మాత్రమేం చేస్తాడు? అతడి విధినిర్వహణ అతడు చేయాల్సిందేగా!                                                                                                                               

కళ్యాణికి  భయంపట్టుకుంది.ఈ మారు తన భర్తకూ డ్యూటీ పడింది. ఇంట్లో ఆడ పిల్లలిద్దరూ ఎలా ఉంటారు? దొంగల భయమేకాక రౌడీ గుంపుకూడా తిరుగుతుం టుంది. అందునా ఎలక్షన్స్ కు వెళ్ళినవారి ఇళ్ళు గుర్తుపెట్టుకుని మరీ చూస్తారు. ఏం చేయాలి రా భగవంతుడా! అని భయపడుతూనే ఇంటికెళ్ళింది. ఆడపిల్లల్ని వంటరిగా వదలి వెళ్ళే రోజులు కావు కనుకే ఈ బెంగలు. ఊరు బాగాలేదు, పరిస్థితులు అంతకన్నా బాగాలేవు. ఆ రాత్రి భర్త తనకూ ఎలక్షన్ డ్యూటీ పక్క జిల్లాకు పడిందనీ మూడు చోట్ల ఎలక్షన్సూ కల్సి పది  రోజులు ఊర్లో ఉండననీ చెప్పాడు  ఇద్దరూ చర్చించుకుని ఎవర్ని సాయం పిలుద్దామా  అని ఆలోచించారు. హైదరాబాదులో ఉన్న తన తల్లిని తప్పక వారం కోసం రమ్మని ఫోన్ చేసింది కళ్యాణి. ఆమె వస్తానన్నాక కాస్త మనసు నిమ్మళించింది ఇద్దరికీనీ. 

 

మర్నాడు స్కూల్ కెళ్ళింది. "మేడం! ఆ ఊర్లో తిండీ తిప్పలూ దొరకవుట ! కాఫీ కూడా కరువేట! మీకసలే తలనొప్పి. రోజుకు 3,4 మార్లు కాఫీ కావాలి కదా ఎలా చేస్తారు మేడం?"అన్నాడు ఆనంద్.                                

                                                                                               

"దాందేముంది మేడం! వేడిపాలు తెప్పించుకుని ఇంటినుంచీ పంచదార, నెస్ కాఫీ తీసుకెళ్ళి ఫ్లాస్క్ లో పోసుకుంటే సరి. "అని సలహా ఇచ్చింది సరస్వతి అసిస్టేంట్ టీచర్.                                                                                                                                                               

 

"మేడం!ఆ ఊర్లో రెండు గట్టి పార్టీల మధ్యపోటీ ! ఎవ్వరి వద్దా ఏమీ తిండీ తిప్పలూ లాంటివికూడా తీసుకోకూడదు మేడం! భోజనాలూ అవీ!.... " ఆనంద్ నసుగు తుండ గా,                                                                                                                                                    

 

"ఏముంది  మేడం!మీరు ఇంటినుంచీ బ్రేక్ ఫాస్ట్ కు బ్రడ్, పులిహోర, పెరుగు తీసుకెళ్ళండి వడలు నంచుకు తింటే చాలు." అంటూ ఉపాయం చెప్పింది మరో టీచర్ రజని.                                                                                                                                                          

 

"మేడం! అక్కడ … అక్కడ ..."అంటూన్న ఆనంద్ తో- " చెప్పు ఆనంద్ ! నీవు చెప్పేవన్నీ అక్కడి ఇబ్బందుల గురించేగా! చెప్పు, ముందుగా తెలిస్తే ఏం చేయాలో ఆలోచించవచ్చు." అంది కళ్యాణి.                                                                                                                                      

 

" మేడం! మరీ మరీ! అక్కడ టాయ్ లెట్సూ, బాత్రూమ్సూ కూడా ఉండవుట  మేడం! ఊరి వారంతా ..."                                                        

 

బాబోయ్ ! “ అంటూ భయంగా గుండె మీద చెయ్యి వేసుకుంది కళ్యాణి.

                                                                              

"మన ప్రధాని స్వఛ్ఛభారత్ అంటూంటే..."                                                                                                                                    

 

"ఎవరికి పట్టింది మేడం! గెలిచిన వారు ఐదేళ్ళవరకూ తిరిగి చూడరు.ఇప్పుడేమో జనం ఎవరు డబ్బిస్తే వారికి గుద్దుతారాయె! పైగా ఊరేగింపులకు కూలి పనులు మానుకుని వెళ్ళి ఎవరు డబ్బిస్తే వారికి జెండాలు పట్టుకుని అరుస్తారాయె! ఇహ ఎవరు మేడం ‘మాకు సౌకర్యాలు కావాలని ‘ అడిగేవారు?" అన్నాడు ఆనంద్ బాధగా. 

 

"ఇప్పుడేమో  ‘ ఏపని చేసినా ఎన్నికల సమయంలో చేయకూడదని నిబంధనాయె! అందుకే చేయలేక పోతున్నా'మంటారు  "                                                

 

"ఐనా ఎప్పుడైనా ఎవరు చేస్తారు మేడం? ప్రజలంతా బిజీ! ఎక్కువ డబ్బిస్తే చాలు ఓట్లు పడిపోతాయాయె! సౌకర్యాలెవరికి కావాలి మేడం! తరాలుగా ఇబ్బందులకు అలవాటై పోయిన జన్మలు వారివి. ప్రాధమిక పాఠశాలతప్ప, హైస్కూల్ లేదు, వెళ్ళా లంటే ఐదు కిలో మీటర్లు వెళ్ళాలి. హాస్పెటల్ లేదు, వైద్యుడులేడు. వారికివేమీ అక్కర్లేదు.ఎన్నికల్లో కడుపు నిండా సారా, కాస్తంత తిండి, డబ్బు ఇస్తే చాలు. మనదేశంలో   పల్లెలు బాగుపడవు మేడం, ఇంతే ఎప్పటికైనా " అంటూ బాధపడ్డా డు ఆనంద్. 

 యువకుడు, కొత్తగా చేరిన ఉపాధ్యాయుడు, ఉడుకు రక్తం , దేశాన్నిగురించిన బాధ, బాధ్యత. ఏమీచేయలేని అసహాయత. 

 

ఏ.పీ. ఓ కూడా లేడీట.ఇంకా ముగ్గురి లో ఇద్దరు లేడీస్.ఒక్కరే పురుష ఉద్యోగి ఎలక్షన్ ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళినపుడు ఇంకాకొన్ని సత్యాలు తెల్సి భయపడింది  కళ్యాణి.. ఆ ఊర్లో ప్రతి ఎలక్షన్ కూ కొట్లాటలు, కఱ్ఱలతో ఎలక్షన్ సిబ్బంది మీద దాడీ , రక్తాలు కారాల్సిందేనుట. భయపడుతూనే ఉంది కళ్యాణి. రాత్రులు నిద్రపట్టడంలేదు. ఐనా రోజులు గడుస్తూనే ఉన్నాయి.                                                                                                              

 

అంతా భయపడుతూ ఎదురుచూడని ఎన్నికల ముందురోజు రానే వచ్చింది. ఒక బ్యాటరీలైట్, లైటర్, కొవ్వొత్తులు, పంచదార, ఇన్స్ టెంట్ కాఫీ పొడి, యూస్ అండ్ త్రో గ్లాసులు ,ఫ్లాస్క్, బిస్కెట్స్, పండ్లు, స్పూన్స్, బ్రడ్ ప్యాక్ చేసుకుంది, తెల్లారగట్లలేచి పులి హోర, మధ్యాహ్నానికి దద్దోజనం, వడలు ప్యాక్ చేసుకుంది. ఇంకా కావాల్సినవన్నీ కలిపి ఒక సంచిలో పెట్టుకుంది, అదే మోయడం కష్టంగా ఉంది. ఎలారా బాబూ అనుకుంటూ  కదిలింది కళ్యాణి , యుధ్ధ భూమికి తరలి వెళుతున్న సైనికునిలా.  

 

 ఎలక్షన్ మెటీరియల్ తీసుకుని సాయంకాలానికి తన బూత్ కు కేటాయించిన సిబ్బందితో కలిసి ఆ గ్రామం చేరింది కళ్యాణి లారీ టాప్ ఎక్కి. ఒక గుడ్డతో సీక్రెట్ బూత్ కట్టుకుని, కావాల్సిన టేబుల్ కుర్చీలు వగైరా సరిచూసుకుని, మెటీరియల్ రీ చెక్ చేసు కుని, బూత్ స్టాంప్ బ్యాలెట్ పత్రాల న్నింటిమీదా వేసుకుని, తన బూత్ లో పనిచేసేందుకు వచ్చిన అందర్నీ కూర్చోబెట్టుకుని పరిస్థితులెలా ఉంటే ఎలా  ప్రవర్తించాల్సిందీ మాట్లాడింది కళ్యాణి. వారందరి సలహాలు సంప్రతింపులూ తీసుకుంది.అందరి సహకారం అర్ధించింది. తనకు ఇచ్చిన ఊరి హెల్పర్ రామయ్య సహకారంతో రెండు గ్రూపులుగా ఏర్పడి ఊరు  నాలుగు మూలలూ చుట్టి వచ్చారు.

"బాబూ! మేమందరం మహిళలం , ఉదయాన్నే కాలకృత్యాలూ  అవీ..." అంటుం డగానే ఆ హెల్పర్ రామయ్య "అమ్మగారూ! ఈ ఊర్లో అంతా అలా బయటకే వెళతారమ్మా! మీకేమీ సాయం చేయలేనమ్మా! చీకటేలనే ఒక లాంత్రీ ఇచ్చి మా ఇంటి దాన్ని  పంపుతానమ్మా! మీరంతా ఐదుమంది ఆడోల్లు, అలా ఎల్లిరండమ్మా! మా ఊరోల్లకి యేటీ పట్టవమ్మా! సారా పోయిత్తే సరి, ఎదవనా--ల్లమ్మా! బైలెల్లిన ఆడోల్ల మీద సానా అన్నాయాలు జరిగినయమ్మా! ఐనా ఊరోల్లకు బుద్దీ గ్యానంలేదు.ఛ ఎదవ    నాకొడుకులమ్మా!..." అన్నాడు రామయ్య.  

ఏదో తెచ్చుకున్నవి తినేసి, రామయ్య తెచ్చిచ్చిన నులక మంచాలమీద గాలి రాకున్న కిటికీలు కూడా సరిగాలేని ఆ బడిలోపల పడుకున్నామనిపించి, తెల్లార గట్లనే లేచి రామయ్య భార్య లాంతరెత్తుకుని, భుజమ్మీద నీళ్ళబిందె చెంబు పెట్టు కుని వెంటరాగా బిడియంగా వెళ్ళి పని కాకపోయినా అయిందనిపించుకుని వచ్చారు కళ్యాణీ మిగిలిన నలుగురు మహిళా ఎన్నికల బూత్ ఉద్యోగులూనూ.

 వేడి వేడి కాఫీ త్రాగి స్నానంతోపాటు గుట్టు చప్పుడుగా కానిచ్చే నేచర్ కాల్స్ ఇలా బహిరంగంగా చేయాల్సి రావడం చాలా ఇబ్బందయింది వారికి. ఇహ స్నాన పర్వమెలా  చేయాలో అనుకుంటుండగా రామయ్య భార్య "అమ్మా! మా యింటెనకే తడికెల్తోకట్టిన సానాల గదుందమ్మా! ఇప్పుడొచ్చి చేసిన్రంటే మొగోల్లెవ్వరూ లెగవరు." అంది.

 అదే చాలనుకుని అంతా కలిసి వారి బట్టలు తీసుకుని గోదావరి, కృష్ణ  నదుల పుష్కరాల కెళ్ళినట్లు వెళ్ళారు. లేస్తే కనిపించే  తాటాకుల గదిలో బండమీద కూర్చుని ఒళ్ళుతడుపుకుని, క్రింద నుంచీ ఏమైనా పురుగులో తేళ్ళోపాములో పైకి పాకుతయేమోననే భయంతో గడగడ లాడుతూ ఆ కార్యక్రమం ఒకరి తర్వాత ఒకరు కానిచ్చారు.

             

" అమ్మా! మద్దెనేల కాల్ముడుచుకుందుకు ఈడకే రండమ్మా! నేనుంటాగా, మొగవాట పడొద్దు" అంది రామయ్య భార్య, వారిపాలిట కల్పవృక్షం.                        

వారింట్లో పుల్లలు పెట్టిపొయ్యి వెలిగించి రెండు లీటర్ల వారి గేదె చిక్కనిపాలు పొంగించి ఇవ్వగా కళ్యాణి దాన్లో తాను తెచ్చిన కాఫీ గుండ, పంచదార కలిపి అందరికీ తలో గ్లాసిచ్చింది. ఆ వేడి అలవాటైన పానీయం కడుపులో పడగానే అందరికీ ప్రాణం లేచొచ్చి నట్లైంది.  మిగిలిన కాఫీ తన ఫ్లాస్క్ లో పోసుకుంది  కళ్యాణి. అంతా తాము తెచ్చుకున్న బిస్కెట్స్, బ్రెడ్ ,పూరీలు, చపాతీలూ , వడలూ అన్నీ ఒక తల్లి బిడ్డల్లా, షిరిడీ సాయిప్రసాదంలా  షేర్ చేసుకుని కడుపు నిండా తిన్నారు.  

 

రామయ్య వచ్చి "అమ్మా! యనక ఎలచ్చన్లప్పుడు కరణం ఉండేటోడు, కరిణీకం లేకపోయినా ఆయన పొలం సూసుకుంటా ఉండేటోడు, ఎవురైనా మీలాంటోలొత్తే కూసింత వొన్నంవండి పంపేటోడు, ఇప్పుడాయనా పట్నమెల్లిపోయిండు, మీకేం అబ్యంతరం లే కుంటే మాయావిడ అన్నం పొంగించి కొత్త కుండలో నేమ్మా పెరు గేసి పెట్టుద్ది, ఎరగడ్డ బండ పచ్చడి చేసుద్ది, వంకాయ కుమ్ములోపెట్టికాలుచుద్ది, దానిచేతి పచ్చడి తింటే వదల్రు. బేమ్మలకైనా తానం సేసేసి సేతుద్ది. యావంటా రమ్మగోరూ ! "అన్నాడు రామయ్య. 

 అతడు ఎన్నికల అధికారులు ఏర్పరచిన  ఉద్యోగి కనుక ఇబ్బందేం ఉందను కుని అంతా కూడబలుక్కుని సరేనన్నారు. కళ్యాణిలా ఇతరు లెవరూ ఏమీ తెచ్చుకోలేదు. కాలే కడుపుకు మండే గంజని ఏదో ఇంత దొరికిందే చాలనుకున్నారంతా.                                                                                                        

 

ఎలక్షన్ మొదలైంది. బ్యాలెట్ బాక్స్ తయరుచేసుకుని రాత్రే నిర్ణయించుకున్న ప్రకారం అంతాకూర్చున్నారు. పోలింగ్ ఏజంట్స్ వచ్చారు, వారిని చూస్తేనే  కళ్యాణికి ముచ్చెమటలు పట్టాయి.అవేవో కత్తులూ బరిసేలూ తీసుకుని వచ్చి కొట్టే వారిలా బొఱ్ఱ మీసాలూ, గళ్ళలుంగీలూ గట్రాచూసి భయపడుతున్న కళ్యాణికి  సిబ్బంది అంతా సైగ చేశారు 'భయం వద్దని '. 

నిర్ణయించిన సమయం కాగానే పోలింగ్ మొదలైంది. పదిగంటల వరకూ రష్ లేదు. ఆతర్వాత రష్ పెరిగింది. ముసలీ ముతకలను చేతులమీద మోసుకొచ్చి, వారి బదులు తామే ఓటేస్తామని గొడవచేశారు. 

 

అది కుదరదన్న కళ్యాణిపై కొందరు మాటల దాడికి దిగగా, "బాబూ! మాకిచ్చిన రూల్స్ ప్రకారం మేము చేస్తాము.మీరు ఓటేయడం కుదర్దు. కావలిస్తే మధ్యాహ్నం ఎలక్షన్ రూట్ ఆఫీసర్ వస్తారు. ఆయన్నడిగి ఆయనెలా చెప్తే అలా చేయండి. గొడవలొద్దు."అంది.                                                                                                          

 

"ఈ పీ.ఓ అమ్మ ఆ రామయ్య ఇంట్లో తానమాడింది. ఆడేమన్న సెప్పిండేమో!'" అంటుండగా కళ్యాణి విని," బాబూ! ప్రభుత్వం అతడ్ని మాకు అవసరమైన పనులు చేసిపెట్టను నియమించింది. అందువల్ల మేము అతడి చేత పనులు చేయించుకోవచ్చు.ఊర్లో మరెవరి వద్దనైనా సాయం తీసుకుంటే  అడగండి. ఊరికే వాదనలు, మాటలూ వద్దు."అంది.

 

13ఏళ్ళైనా లేని వారిని తెచ్చి ఓటర్లనీ ఓటివ్వమనీ అడగ్గా ,కళ్యాణి " మీ ఫోటో ఉన్న స్లిప్ తీసుకురండి ఇస్తాను, మా దగ్గరున్న ఫోటోతో సరిపోతే, లేకపోతే ఇవ్వం "అంది. 

మీసమన్నామొలవని వారిని 20ఏళ్ళని చెప్పారు.  ఒక వర్గానికి ఓట్లు పడటం లేదని ఏజంట్ బయటికెళ్ళాడు. బయట గలాటా మొదలైంది. కఱ్ఱలతో కొట్టుకునేవరకూ వచ్చాయి. కళ్యాణికి భయంవల్ల మోషన్స్ పట్టుకున్నాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలీలేదు. రామయ్య వచ్చి ఆమెను బడికి చివరి ద్వారం నుంచీ తీసుకెళ్ళి వారి గుడిసె పక్కనున్న పాడుబడ్డ గుడిసె లో ఎవ్వరూ కాపురంలేనందున అక్కడ తన భార్య సాయంతో ఇసుక పోసి, కళ్యాణిని పంపాడు అవసరం తీర్చుకోను. భార్యను బయట కాపలా ఉంచాడు. అలాగా ఐదారు మార్లు విరోచనాలయ్యాయి. కళ్యాణి భయంతో సిగ్గుతో బిగుసుకు పోయింది, నీరసం ముంచుకొచ్చింది. రామయ్య మజ్జిగ తెచ్చిచ్చాడు.                                                                                                                                                                   

 

మిగిలిన సిబ్బంది ఇబ్బందిలేకుండా " మేడం! మీరు విశ్రాంతిగా ఉండండి. ఏం ఫరవాలేదు, మేము పని సక్రమంగా జరిపిస్తాము" అని సహకరించారు. 

ఇంతలో ఒక గుంపు లోపలికి చొచ్చుకొచ్చింది.ఒక ఉద్యోగిని వద్ద ఉన్న బ్యాలెట్ పత్రాలన్నీ తీసేసుకుని, ఓట్ల గుర్తు గుద్దేయసాగింది.ఇద్దరు కత్తులు పట్టు కుని నిల్చున్నారు "కదిలారంటే పొడుస్తాం జాగ్రత్త!" అని బెదిరించారు.

                                                                                         

 కళ్యాణికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది."బాబూ! మీరు నా సంతకం లేకుండా గుద్దుకుని ఓట్లేస్తే అవి చెల్లవని మీకు తెలీదనుకుంటాను. ఇలా ఇవ్వండి సంతకంపెట్టి ఇస్తాను. "అని చెప్పింది.

వారంతా "అట్నా మేడం! మీరు మంచోల్లలా ఉ న్రే ! మిమ్మల్నేం  సేయం , ఒరే పొండ్రా బయట్కి, మేడం మంచోల్లు." టూ భరోసా ఇచ్చారు.

 ఇలా జరిగితే ఏం చేయాలో  ముందే నిర్ణయించుకున్నందున మిగతా సిబ్బందంతా ఆమెకు సహకరించారు.

 

 "మేడం, కాపీ తెప్పించమా!" అన్నాడొక ఏజంట్. అక్కడున్నది ఆ ఒకడే. మరొక పార్టీ ఏజంట్ ను ముందే తరిమేశారు బయటికి.  

"ఏమీ వద్దు బాబూ! మీ పని కానిచ్చుకుని వెళ్లండి చాలు." అని చెప్పింది కళ్యాణి.  ఎలాగో ఎలక్షన్ పూర్తైంది. వర్క్ అంతా పూర్తి చేసుకుని, వారు రిగ్గ్ చేసిన ఓట్లు, చెల్లని ఓట్ల క్రింద చూపి, అంతా లెక్కలు సరిచేసుకుని, సామానంతా కట్టుకుని తయారుగా ఉండగా లారీ వచ్చింది.

                                        

 లారీ ఎక్కుతూ - "భగవాన్ ! ఇప్పటికిలా బయటపడ్డాం"అనుకున్నారంతా.

లారీ ముందుకెళుతుంటే, వెనక్కి పోతూ దూరమవుతున్న ఊరి వైపు చూస్తూ -"ఇలా మరుగుదొడ్లూ స్నానాల గదూలూ లేని గ్రామాలకు మహిళలం -ఎలక్షన్ డ్యూటీలకోసమని రెండ్రోజులు డ్యూటీకి రావటమే ఇంత కష్టమైపోయిందే? ఇక్కడే ఉండిపోయేవాళ్ళెలా మిన్నకుంటున్నారు?" అంటూ కాసింత విస్తుపోయింది కళ్యాణి. అంతలోనే నిట్టూర్చింది -"అంతే మరి, స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్ళైనా, పరిస్థితులు మార్చుకునే చైతన్యం రానంతకాలం,ఈ పల్లెల స్థితి మాత్రం మారదేమో, ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే!" అని.             

  

అప్పటికే కాదు ఆ గొంగళి ఈ భారతంలో ఎప్పటికీ కదలదు మరి.  

*****

bottom of page