MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
నా డైరీల్లో కొన్ని పేజీలు... 10
గొల్లపూడి మారుతీ రావు
సినిమా మతలబులు
1972 అక్టోబరు 4
సుధారా హోటల్ లో కొత్త సినీ నిర్మాత - శివానీతో చర్చ
ఎక్కువ రోజులు ఒంటరిగా శంబల్పూరులో గడపలేక మా ఆవిడ ఆఖరి అబ్బాయి (వాసు)ని తీసుకుని మద్రాసు వచ్చింది. అప్పట్లో టి.నగర్ టెర్మినస్ దగ్గర ఉన్న హోటల్ సుధారాలో ప్రముఖంగా ఇద్దరమే ఉండేవాళ్లం. సి.నారాయణరెడ్డి, నేనూ. అప్పట్లో పుండరీకాక్షయ్యగారి చిత్రం చర్చలు సాగుతుండేవి. దర్శకుడు బి.వి.ప్రసాద్. రోజూ ఠంచన్‌గా 9 గంటలకి భాస్కరచిత్ర కారు వచ్చేది. నేను ఎక్కి వెళ్ళేవాడిని. మా గది పక్కనే ఒకాయన - బహుశా ఆయనది రాయదుర్గం అనుకుంటాను - ఉండేవాడు. నేను రోజూ కారెక్కడం, చర్చలకు వెళ్ళడం చూసేవాడు. గదిలో మా ఆవిడకి పనిలేదు. ఆయనకీ లేదు. మాటలు కలిశాయి. లోగడ ఒక చిత్రంలో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఇప్పుడు మళ్లీ తీయాలనే కోరికతో వచ్చాడు. నన్ను పరిచయం చేసి చిత్రాన్ని తీసేటట్టు చూడమంటాడు. కారు కోసం ఎదురు చూస్తున్నపుడు ఈ విషయం మా ఆవిడ నాతో చెప్పేది. అతనితో పెట్టుబడి పెట్టడానికి ఆ రాత్రే ధర్మవరం నుంచి భాగస్వాములు వస్తున్నారట.
నేను నవ్వాను. చిత్ర నిర్మాణం రచయితతో ప్రారంభం కాదు. నిజానికి ఆ రోజుల్లో పంపిణీదారులతో ప్రారంభమయ్యేది. కారణం వారు ఎక్కువ పెట్టుబడి పెడతారు కనుక.
నిర్ణయాలన్నింటిలో వారి ప్రమేయం, సహకారం, సూచన ఉంటుంది (కాని ఇప్పుడిప్పుడే సినీ నిర్మాణం హీరోలను నిర్ణయించే 'మోజు'మీదకి పోయింది) ఈ మాట చెప్పమని చెప్తూ మేం ఆ రోజు హంపీ బయలుదేరుతున్నాం. కారణం 'మనుషుల్లో దేవుడు' చిత్ర రచన తుంగభద్రలో ఉన్న గెస్టుహౌస్‌లో వ్రాయించుకోవడం పుండరీకాక్షయ్యగారికి అలవాటు. మాలో పంపిణీదారుడు - రాయలసీమలో పంపిణీ సంస్ఠని నిర్వహిస్తున్న బలరాం (పుండరీకాక్షయ్య)గారి తమ్ముడు ఒక్కరే. "మేం నాలుగయిదు రోజుల్లో తిరిగి వస్తాం. అప్పుడు బలరాంని పరిచయం చేస్తానని చెప్పు" అన్నాను.
ఆ రాత్రి మేం బయలుదేరాం గుంతకల్లుకి. అక్కడ బలరాం ఇల్లు. అక్కడ ఆగి తుంగభద్ర వెళ్లాలని యోచన. ఒక అర్ధరాత్రి మార్గమధ్యంలో ఏ అరణ్యప్రాంతంలోనో ఆపాం. ఉన్నట్టుండి ఓ కారు మా కారుని దాటి ముందుకు దూసుకుపోయింది. అంతలో దూరంగా ఆగింది. కారణం మా కారు మీద ఆంధ్రా నంబరు కనిపించింది. ఆ కారులో మనుషులు దిగారు. మాకు మాటలు వినిపిస్తున్నాయి. మా కారు చెడిపోయిందనుకున్నారు మొదట. లేదని తెలిశాక నిట్టూర్చారు. వీళ్లు ధర్మవరం నుంచి డబ్బు సంచులు పట్టుకు మద్రాసు వస్తున్నారు. ఒకసారి సినిమా తీసి చేతులు కాల్చుకున్న బాపతు. "మా మనిషి మద్రాసు హోటల్ సుధారాలో ఉన్నాడు సార్. సినిమా తీయాలి. ఎలా సార్?" రోడ్డు మధ్య అనుకోకుండా తటస్థపడి మమ్మల్ని యధాలాపంగా అడిగిన ప్రశ్న. వాళ్ల మాటలు , మా ఆవిడ చెప్పిన కథ కనెక్టయింది. కొత్త సినిమాకి చేరుతున్న 'గుంపు' ఇది. సినిమా తీసే మార్గాలను అనుకోకుండా కలిసిన మమ్మల్ని అడుగుతున్నారు. పుండరీకాక్షయ్య నవ్వారు. ఓ పది రోజుల తర్వాత మద్రాసులో కలవమని చెప్పారు. ఎవరి కారు వారెక్కాం.
వారం రోజుల్లో మా ఆవిడ పిల్లల్ని తీసుకుని తుంగభద్ర వచ్చేసింది. తీరా పదిరోజుల తరువాత మేం మద్రాసు చేరేసరికి మా గది పక్కన ఉన్న మనిషి అక్కడ లేడు. జేబులో డబ్బు సంచీ పట్టుకుని వచ్చేవారిని 'ఎర' వెయ్యడానికి రకరకాల జలగలు' (మధ్యవర్తులు) మద్రాసులో ఉంటారు. వారికి వీరి సమాచారం ముందుగా తెలుస్తుంది. అంతే. వీళ్ల ఆచూకీ మాయమయింది. వాళ్లని కలవడానికి ఫోన్ నంబరు (ఆ రోజుల్లో సెల్‌ఫోన్‌లు లేవు) అందనివ్వలేదు. వీళ్లని డబ్బులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టించారు. కొత్త ఆఫీసు తీయించారు. అందరి ఫోటోలు పేపర్లో పడ్డాయి. రాయదుర్గంలో, ధర్మవరంలో మనుషులు ఆనందించి ఉంటారు. అంతవరకే. కాఫీలు అందించే బాయ్. సరికొత్త వంటగది సామగ్రి. వీలయితే అందమయిన పనిమనిషి. రాత్రి సీసాల హడావిడి. ఒక టిపికల్ సినిమా వాతావరణాన్ని సిద్ధం చేశారు. కొత్తవారికి ఇవన్నీ ఉండాలి కాబోలని ఆలోచన. డబ్బులు కరుగుతున్నాయి.
ముఖ్యంగా తాము తీసే సినిమాకి పెట్టుబడి పెట్టే పంపిణీదారుడిని కలవనివ్వలేదు. ఎందుకని... పంపిణీదారుడు ముందు ఈ హంగామాకి అడ్డం పడతాడు. అప్పటికి ఖాళీగా ఉన్న ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావుగారిని బుక్ చేసి అడ్వాన్స్ యిచ్చారు. ఆయన పౌరాణిక, చారిత్రక సినిమాలు చేయడంలో దిట్ట. ఆయన్ని ఒక సాంఘీక చిత్రానికి ఆహ్వానించారు. దొరికిన మొదటి ఆర్టిస్టు.. ఎస్వీ రంగారావుగారికి అడ్వాన్స్ యిచ్చారు. అడిగేవాడెవడు. చెప్పేవాడెవడు? హీరో ఎవరు? కథ ఏమిటి? సినిమా పేరు 'జీవితాదర్శం'. పంపిణీదారుడు లేకుండా వీరనుకున్న బేనర్ మీద షూటింగ్ ప్రారంభమయింది. ఎన్ని రీళ్లు? దాదాపు 8, 9 రీళ్ళు.
అప్పుడు రెండు ముఖ్య సమస్యలు ఎదురయ్యాయి. వీరు తెచ్చిన డబ్బు అయిపోయింది. ఈ సినిమాని ఎవరు పంపిణీ చేస్తారో తెలీదు. మిగతా సొమ్ము పెట్టే పంపిణీదారుడు కుదరలేదు. ఈ సమయంలో ఓ ముఖ్యమయిన విషయం జరిగింది. వీరి చేత కొత్త ఆఫీసు తీయించి, సినిమా ప్రారంభించినవారంతా ఒక్కొక్కరే జారుకున్నారు.
అంతవరకూ తీసిన చిత్రం గుర్రమూ కాక, గాడిదా కాక, మధ్యలో నిలిచిపోయింది. తర్వాత ఏవో తంటాలు పడి ఎవరి కాళ్ళో పట్టుకుని చిత్రాన్ని పూర్తి చేసి రిలీజు చేశారేమో. ఇలాంటి కథలు మద్రాసులో కోకొల్లలు. ఇందులో డబ్బు, గ్లామరు... రకరకాల ఆకర్షణలుంటాయి. వాటిలో వేటికయినా, కొన్నిటికయినా లొంగిన వారి యాతన వర్ణనాతీతం.
****
గొల్లపూడి మారుతీ రావు
గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.
***