MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
నా డైరీల్లో కొన్ని పేజీలు... మే - జూన్ 1971
గొల్లపూడి మారుతీ రావు
1971:
మే 7 : అక్కినేని పెద్ద కొడుకు వెంకట్ వివాహం. ఎమ్.జీ.ఆర్, ఎన్.టీ.ఆర్, శివాజీ హాజరయ్యారు.
ఆ రోజుల్లో హైదరాబాదులో అది పెద్ద ఉత్సవం. బహుశా స్థానికులూ అంత పెద్ద వివాహాన్ని చూసి ఉండరు. సెక్రటేరియేట్ ఎదుట ఉన్న షాపూర్వాడీ లో అతి ఘనంగా జరిగిన పండగ. సినిమా రంగంలో నాదయిన ప్రాచుర్యాన్ని అప్పుడప్పుడే సాధించుకుంటున్న రోజులు. దుక్కిపాటి మధుసూధనరావు గారు పూనుకుని, పనులన్నీ నిర్వహించారనుకుంటాను. అంతమంది సినీ ప్రముఖులని చూడడం కూడా అదే! ప్రముఖ నృత్య కళాకారులు గోపీనాథ్ నృత్య కార్యక్రమం గుర్తుంది. అయితే ఆ ముమ్మురంలో అదొక ఆకర్షణ. అంతవరకే. మరునాడు అక్కినేని వారింట్లో విందు. ఎవరిని ఎవరూ కలిసే అవకాశం లేదు. నేను రావడాన్ని దుక్కిపాటి వారు గుర్తించి పలకరించారు. అక్కినేనిని కలిసే ఆస్కారం కూడా లేదు. మూడో రోజున ఎయిర్పోర్టులో అక్కినేని కలిశారు. పలకరించాను. ఆ ముమ్మురంలో నూతన దంపతులకి శుభాకాంక్షలు చెప్పే అవకాశం దొరకలేదన్నాను. "ఇప్పుడు చెప్పండి" అంటూ నూతన దంపతులని పిలిచారు. 22 యేళ్ళ కుర్రాడికి అదెంత గౌరవం?
వ్యక్తిగత ప్రాముఖ్యానికి క్రమంగా రెక్కలొస్తున్న రోజులవి.
జూన్ 6 : నా పేరు ప్రమోషన్ లిస్టులో ఉందని సీనియర్ ఆఫీసరు రఘురాం గారు చెప్పారు. గుండె జల్లుమంది.
ఈ దశలో పెద్ద విపత్తు ఉద్యోగం. ప్రమోషన్, సినిమా పనుల్లో తలమునకలవుతున్న రోజులవి. 'రైతు కుటుంబం', ‘చెల్లెలి కాపురం’ - ఇలా ఊపిరి తిరగని పని. ఈ దశలో ప్రమోషన్ చాలా ప్రమాదకరం. తప్పక బదిలీ చేస్తారు కనుక. కానీ, చేయగలిగిందేమీ లేదు. అనుకున్నట్టుగానే మరో తొమ్మిది రోజులకి "ప్రమోషన్" అనే వేటు మీదన పడింది. 'చెల్లెలి కాపురం' చర్చలకు మద్రాసు వెళ్ళి-తిరిగి వస్తూనే స్టేషన్ డైరెక్టరు అష్వాక్ హుస్సేన్ గారి పార్టీకి ఆలిండియా రేడియో ఆఫీసుకి వచ్చాను. కొత్త స్టేషన్ డైరెక్టర్ బాలాంత్రపు రజినీకాంతరావు గారికి వీడ్కోలు విందు. నేను హుస్సేన్ గారి అభిమాన ఉద్యోగిని. నన్ను చూస్తూనే సభలోనే పిలిచి చావు కబురు చల్లగా చెప్పారు. నాకు ప్రమోషన్ వచ్చింది. దానితో పాటు ఒరిస్సాలో శంబల్పూరుకి బదిలీ వచ్చింది. అందరికీ న్యాయంగా ఇది శుభవార్త. కానీ, నాకు మెడ మీద కత్తి. పక్కనే ఉన్న రజినీకాంతరావు గారూ అభినందించారు. కానీ, నా బాధ వారికేం తెలుసు?
ముందునించీ మా ఆవిడ ఏడుపు లంకించుకుంది. నేను ఈ కారణానికి ఉద్యోగానికి రాజీనామా చేస్తానని గట్టి నమ్మకం. నిజానికి ఈ దశలో ఇది పెద్ద అవాంతరం. మా నాన్నగారికీ, బంధువులకీ - ఎవరికీ ఉద్యోగం వదలడం బొత్తిగా ఇష్టం లేదు. మిత్రులంతా ఏకమైపోయారు. ముఖ్యంగా నవభారత్ ప్రకాశరావు, తాతినేని రామారావులాంటి వారు."రాజీనామా చేసెయ్యండి - వెధవ ఉద్యోగం. ఉంటే ఎంత లేకపోతే ఎంత. సినిమాలున్నాయి కదా?" - ఇదీ వారి ఆలోచన. ఆ దశలో ప్రమోషన్ వచ్చిన గజిటెడ్ ఆఫీసరు ఉద్యోగాన్ని- ఒక నిశ్చితమైన దశ-దిశ లేని సినిమారంగాన్ని నమ్ముకుని వదిలిపెట్టడమా? ఇదీ మీమాంస. అది చాలా క్లిష్టతరమైన దశ. పైగా ప్రమోషన్. ఈ దిక్కుమాలిన శంబల్పూరు ఎక్కడుందో, ఎలా ఉంటుందో తెలీదు.
మర్నాడు నార్ల వెంకటేశ్వరరావుగారిని కలిశాను. ఒకరయినా నన్ను సమర్థిస్తారా? ఆశ. ఈ దశలో ఉద్యోగం వదలవద్దని సలహా ఇచ్చారు. అయితే పిక్చర్లు వస్తే - ఆలోచించవచ్చని వారి సూచన.
సి.నారాయణ రెడ్డి గారు 26న కలిశారు. "ఫరవాలేదు. శంబల్పూరు వెళ్ళండి. మేమంతా ఉన్నాం కదా! ఆరునెలల్లో వెనక్కు తీసుకువస్తాం." అన్నారు ధైర్యంగా. రావూరు సత్యనారాయణ రావు గారు బదిలీ మాట విన్నారు. "ఒక్కసారి రండి. ప్రేయసీ ప్రియుల్లాగ కబుర్లు చెప్పుకుందాం. చాలా రోజులయింది కలిసి" అన్నారు. మా పరిచయం చిత్తూరు నాటిది.
'చెల్లెలి కాపురం' రోజుల్లో ప్రొడక్షన్ చూస్తున్న కేశన జయరాంని కథలో కలుగజేసుకున్నందుకు తిట్టాను. ఎక్కువ మాట్లాడే, తక్కువ 'ఒరిజినల్’ ఆలోచనలు చేసే అసిస్టెంట్ డైరెక్టరు డి.ఎస్.ప్రకాశరావునీ తిట్టేవాడిని. అయినా వారిద్దరూ నా మీద గౌరవాన్నీ, నా ప్రతిభ మీద నమ్మకాన్నీ వదులుకోలేదు. తీరా, ఆ సినిమా పూర్తయ్యేసరికి యిద్దరూ ఏకమయి కొత్త సినిమాకి ఆయత్తమయ్యారు. ఇది సినీ రంగం నాకు నేర్పిన పెద్ద పాఠం. సినీరంగంలో ఎవరినీ చిన్నచూపు చూసే హక్కు లేదు. ఎవరు ఏం చెయ్యగలరో, చేసే అవకాశం వచ్చేవరకు బయట పడదు. "లేతమనసులు" రోజుల్లో రామ్మోహన్ పెద్ద హీరో అయిపోతాడని అందరూ అనుకునే వారు. కృష్ణ గారు గొప్ప హీరోగా నిలదొక్కుకోవటమే కాక - సినీ రంగంలో ఎవరూ చేయని సాహసాలు చేసి చరిత్రను సృష్టించారు.
జయరాంకీ, ప్రకాశరావుకీ- గుల్షన్ నందా 'కటీ పతంగ్' నవలా సూత్రం ఆధారంగా కథ చెప్పాను. ఇద్దరూ ఆనందంతో తలక్రిందులయ్యారు. వాణిశ్రీకి కథ చెప్పాను - అత్యంత భయంకరంగా. అయినా ఆమెకు వేషం నచ్చింది! ఈలోగా నా బదిలీ.
పాండీ బజారులో హమీదియా రెస్టారెంట్ ముంగిట నిలబడి ఓ రాత్రి పదిగంటలకి జయరాం, ప్రకాశరావులకి చెప్పాను. నాకు శంబల్పూరు బదిలీ అయ్యింది. మాటలు వేరే రచయితతో రాయించుకోమని. ఇద్దరూ రోడ్డు మీదే నా కాళ్ళ మీద పడిపోయారు. "మీ కోసం ఎక్కడికయినా వస్తాం. మీరే రాయాలి" అన్నారు. శంబల్పూరు ఎక్కడుందో నాకూ సరిగ్గా తెలీదు. 1800 మైళ్ళ దూరం. వీరు రావటం, నేను అక్కడ సినిమా రాయడం. నమ్మకం కుదరలేదు.
ఏమైనా ఇతమిత్థమని నిర్ణయించలేని సినీ భవిష్యత్తు కంటే - నిర్దుష్టమైన ఆఫీసు ఉద్యోగం - ఆ క్షణాన నిలుపుకోవడం మంచిదన్న ఆలోచన ఎంతో కొంత స్థిరపడగా - కాస్త నిస్సహాయంగానే - కష్టపడి ఏర్పరుచుకుంటున్న సినిమా పరిశ్రమకి 1800 మైళ్ళు దూరంగా వెళ్ళటానికి సిద్ధపడ్డాను. మా ఆవిడకి ఆనందంగా ఉంది. పిల్లలకి కొత్తగా ఉంది.
అర్ధరాత్రి - నా శంబల్పూరు ప్రయాణం. బొత్తిగా ఇష్టం లేని మిత్రులు - చాలా ప్రసిద్ధులు, ఆత్మీయులు - విజయవాడ రైల్వే స్టేషన్ కి వచ్చారు. నండూరు రామమోహనరావు, కొమ్మూరు వేణుగోపాలరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, నవభారత్ పి.ఎయ్.ప్రకాశరావు గారు, ఈడ్పుగంటి లక్ష్మణరావు గారు - యిలా. వాళ్ళందరికీ నేను అర్థం లేని ఉద్యోగం కోసం వెళ్ళిపోతున్నానని బాధ. నాకు స్పష్టంగా లేని భవిష్యత్తు వేపుకి ప్రయాణం. వేర్వేరు కారణాలకి అందరి కళ్ళలోనూ నీళ్ళున్నాయి. రైలు కదిలింది. ఇద్దరికే ఆ ప్రయాణానికి అర్థం తెలుసు. ఉద్యోగాన్ని వదలలేదన్న తృప్తితో ఉన్న నా భార్యకి. నాకింకా అర్థం కాని నా భవిష్యత్తుకి. రైలు చీకట్లోకి దూసుకుపోతుంది.
(పైన చెప్పిన అందర్లో ఈనాడు ముగ్గురం ఉన్నాం. రజినీకాంతరావు గారూ, నేనూ, నవభారత్ ప్రకాశరావు గారూ. రజినీకాంతరావు గారికి నూరు సంవత్సరాలు. ప్రకాశం గారిని ఇవాళే (జనవరి 2 న) విజయవాడలో చూసి వచ్చాను. గత అయిదేళ్ళుగా మంచం పట్టి ఉన్నారు. కొన్ని నెలలుగా మనుషుల్ని పోల్చలేని స్థితిలో ఉన్నారు. నన్ను చూసి విచిత్రంగా గుర్తుపట్టారు. కాని, మాటల్లో పొంతన పోయింది. 36 సంవత్సరాల తర్వాత జీవితాన్ని ఆ రోజుల్లో ఎవరయినా ముందుచూపుతో సూచించగలిగితే! కాలం పేజీలు తెరవని పుస్తకం. ఏ పేజీలో ఏముందో తెరిచేదాకా తెలీదు.)
***
గొల్లపూడి మారుతీ రావు
గొల్లపూడి మారుతీ రావు: గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.
***