top of page

నా డైరీల్లో కొన్ని పేజీలు... ఓడలు బళ్ళు అయిన వేళ

ఆహ్వానిత మధురాలు

గొల్లపూడి మారుతీ రావు

1970 జనవరి 16: 'చెల్లెలి కాపురం' ఆఫీసులో డి. ఎస్. ప్రకాశరావునీ, జయరాంనీ తిట్టిన సందర్భం. జర్దా కిళ్ళీ.

ఇది 46 సంవత్సరాల కింద మాట. ఏ విధంగా చూసినా ఈ వాక్యాలు డైరీలో రాసుకోవలసినంత ప్రత్యేకమయినవీ కావు, ముఖ్యమైనవీ కావు. ఎందుకు రాశాను? నా జీవితం లో అతి ముఖ్యమయిన మలుపుల్లో ఈ రెండు వాక్యాల ప్రమేయం ఉంది, ఆశ్చర్యం.

 

'చెల్లెలి కాపురం' సినీ నటులు బాలయ్యగారి మొదటి చిత్రం. ఆ చిత్రానికి దర్శకులు కె.విశ్వనాథ్. ఆయనతో నేను కలిసి పనిచేసిన రెండో చిత్రం. ఆయన మొదటి చిత్రం నాకు రెండో చిత్రం. దాని పేరు "ఆత్మ గౌరవం'. నా మొదటి చిత్రం 'డాక్టర్ చక్రవర్తి '.

 

డి.ఎస్. ప్రకాశరావు ఈ చిత్రానికి అసిస్టెంటు డైరెక్టరు. చురుకైనవాడు. తను చేసే ఆలోచనలు మంచివని నమ్మేవాడు.(అది దర్శకునికి ఉండాల్సిన మొదటి లక్షణం. Conviction). అన్నిటికీ మించి మంచివాడు. అంతకుముందు ఎక్కడయినా పనిచేశాడేమో తెలియదు. ఇక జయరాం ది నెల్లూరు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజరు. ప్రొడక్షన్ మేనేజరుకి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏ పనినయినా దూసుకుపోయి చెయ్యగలిగాలి. Resourcefulness. తెలుగు సినీరంగ చరిత్రలో చాలా గొప్ప గొప్ప నిర్మాతలంతా ముందు దశలో మంచి ప్రొడక్షన్ మేనేజర్లు. అట్లూరి పూర్ణచంద్రరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, వై.వి. రావు, పి.ఏ.పి మేనేజరు సుబ్బారావు, ఎస్.పి.వెంకన్న బాబు- యిలాగ. వీరందరి సినిమాలకూ నేను పని చేశాను. ఇది నేపథ్యం.

 

విశ్వనాథ్ గారితో కథా చర్చ చాలా రసవత్తరంగా సాగేది. ఆయన ఒక కొత్త ఆలోచన విసిరితే దాన్ని అంది పుచ్చుకుని కొత్త ఆలోచన వేపు ప్రయాణం చెయ్యడం. ఇది క్రీడ మా యిద్దరికీ. అయన అప్పట్లో జర్దా కిళ్ళీ వేసేవారు. చర్చల్లో మా ఎదురుగా జర్దా డబ్బా, కిమామ్ సీసా, వక్కలు, తమలపాకులు, సున్నం సీసా విధిగా ఉండేవి. మంచి ఆలోచనని విసిరితే ఆయన వక్కపొడితోనో, తమలపాకు ముచికతోనో కొట్టేవాడు. అది సరదా. మరీ గొప్ప సీనుని పట్టుకున్నప్పుడు- నాకు బహుమతిగా తనే స్వయంగా ఒక జర్దాకిళ్ళీ కట్టి యిచ్చేవాడు. అప్పటికి నాకు జర్దా కిళ్ళీ అలవాటు లేదు. చిన్నతనం నుంచీ ఏదయినా విందు భోజనం తర్వాత మిఠాయి కిళ్ళీ యిస్తే తెచ్చి స్వయంగా మా అమ్మకి ఇచ్చేవాడిని. ఇప్పుడు- ఈ ముమ్మరంలో జర్దా కిళ్ళీ వేసి- తల తిరిగి, తూలి, గోడ పట్టుకుని నడిచి, నిలదొక్కుకుని క్రమంగా సరదా మరిగాను. ఆలోచనల ముమ్మరం పెరిగి, కిళ్ళీల సంఖ్య విరివిగా పెరిగి- సినిమా అయ్యేనాటికి నేనూ, నా దుకాణం పెట్టుకునే స్థితికి వచ్చాను. ఎన్నాళ్ళు? కనీసం 15-20 సంవత్సరాలు. రోజుకి 15 సార్లయినా కనీసం కిళ్ళీ వేసేవాడిని. ఒకసారి- రాత్రి- నాకూ, విశ్వనాథ్ గారికీ ,ఆయన ఇంటి దగ్గర చర్చల్లో జర్దా దొరకక- దుకాణాలు వెదికి-భంగపడి-పొగాకు నమిలిన సందర్భం గుర్తుంది. ఈ వరసలో నిష్కారణంగా ఈ దురలవాటు తలకెక్కిన మరో ఇంటలెక్చువల్ ఉన్నాడు.. ఆయన వేటూరి సుందరరామ మూర్తి. నేను 'ఓ సీత కథ ' రాస్తున్నప్పుడు ఆయన మద్రాసు వచ్చి- తన 'సిరికాకొలను చిన్నది’ గేయరూపకాన్ని మా ఇంటికి రికార్డరు తెచ్చి వినిపించాడు. నేనే ఆయన్ని విశ్వనాథ్ గారి దగ్గరికి తోలాను. ఆయన అక్కడికి వచ్చేటప్పటికి నేనక్కడ ఉన్నాను. "ఓ సీత కథ" చర్చకు. ఆ సినీమాలోనే హరికథతో వేటూరి సినీమా అరంగేట్రం.(ఆయనిప్పుడు లేడు కనుక నేను భుజాలు ఎగురవేస్తున్నానని చాలమందికి అనిపించవచ్చు, నా షష్టిపూర్తి సంచికకి రాసిన వ్యాసంలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ఉటంకించారు)

తంటాలు పడి, భంగపడి, ఏడ్చి, ఏడిపించి- 20 ఏళ్ళ తర్వాత- మా అమ్మగారినీ, నాన్నగారినీ కారులో శ్రీశైలం తీసుకువెళ్తూ-భోరున కురుస్తున్న వర్షంలో శ్రీశైల శిఖర దర్శనం చేసుకుని- సామాగ్రిని తీసి ఆఖరి కిళ్ళీ వేసుకుని-సామాగ్రిని కారులోంచి విసిరేశాను. అలా ఒక దుర్దశ ముగిసింది. నాకు కాస్త ముందే విశ్వనాథ్ గారు మానేసిన గుర్తు.

 

జర్దాకి ఇంత కథ. అదీ క్లుప్తంగా.

ఈ కథకి నీతి: ఏ దురలవాటునీ నీకు చాలా యిష్టమయిన వ్యావృత్తితో ముడివెయ్యకు. ఈ మాట కిళ్ళీకి మందుకి, మగువకి, డబ్బుకీ, కీర్తికీ- అన్నిటికీ వర్తిస్తుంది. ఇంతకంటే వివరించను.

మరి ఈ ప్రకాశరావు, జయరాం కథ?  ఆ రోజు తిట్టిన వృత్తాంతం?

 

కథా చర్చ ముమ్మరంగా జరుగుతుండగా జయరాం గుమ్మం దగ్గర నిలబడ్డాడు. చర్చలో బాలయ్య గారూ ఉన్న గుర్తు. ఏదో సందర్భంలో దూరి ఏదో కుంటి సూచన చేశాడు. నాది ప్రథమ కోపం. కస్సుమని లేచాను. 'చూడు జయరాం, నువ్వు తెలివైన వాడివి. ఇక్కడ నీ పని కార్లలో పెట్రోలు ఉందా? కాఫీలు అందాయా? వంటి పనులు చూడడం. అవి చెయ్యి. నువ్వు సినిమాలు తీసిననాడు సలహాలు చెప్తువుగాని. వెళ్ళు" అని కసిరాను. జయరాం నవ్వేశాడు. అందరూ నవ్వేశారు. ఇది బొత్తిగా పెడసరం. కాస్త అహంకారం. అక్కరలేని తొందరపాటు. ఆ విషయం మనసులో కదులుతూండాలి. అందుకనే డైరీ దాక మనస్సులో నిలిచింది. రాసుకున్నాను.

 

ఇప్పుడు అసలు కథ. జయరాం ఊరు నుంచీ సినీమాలకు వచ్చిన అమ్మాయి ఒకరున్నారు. ఆమె అసలు పేరు కుమారి అనుకుంటాను. సినీమా పేరు- వాణిశ్రీ. ముందు మద్రాసులో చిన్న చిన్న వేషాలు వేసే రోజుల్లో జయరాం ఆమెకు మాటసాయం, అప్పుడప్పుడు డబ్బుసాయం చేసేవాడేమో తెలీదు. ఇతనంటే మంచి అభిమానం ఉంది. ఇప్పుడు పరపతి గల హీరోయిన్. 'చెల్లెలి కాపురం' సినీమా అవుతూనే జయరాం, ప్రకాశరావు నా దగ్గరికి వచ్చారు- వాణిశ్రీ ముఖ్యపాత్రగా కథ కావాలని. కదిపితే కథలు పుక్కిళించే దశ అది. గుల్షన్ నందా కథ ఆధారంగా ఓ లైన్ చెప్పాను. ఇద్దరూ మూర్చపోయారు. జయరాం సమర్థత గల ప్రొడక్షన్ మేనేజరు. నన్ను వాణిశ్రీ ఇంటికి తీసుకెళ్ళి కథ చెప్పించాడు. ఆమె పొంగిపోయింది. అంతే. ప్రొడక్షన్ బరి మీదకి ఎక్కింది. ఎవరెవరు నటీ నటులు? కృష్ణ, వాణిశ్రీ, గుమ్మడి, అల్లు రామలింగయ్య, రమాప్రభ, కె. వి. చెలం, బాలయ్య(ముందు సినీమా నిర్మాతని తన సినిమాకి నటుడిగా తీసుకొచ్చాడు జయరాం) వగైరా వగైరా.

 

ఇప్పుడు నాకు రేడియో ఉద్యోగంలో ఒరిస్సాలో శంబల్పూరుకి బదిలీ అయింది. నా జీవితంలో అన్ని ప్రణాళికలనూ తిరగ రాసుకోవలసిన దశ. పాండే బజారులో రాత్రి 10 గంటలకి హమీదియా రెస్టారెంటు ముందు నిలబడి జయరాం, ప్రకాశరావులతో అన్నాను. “నేను వేల మైళ్ళ దూరం వెళ్తున్నాను. ఈ కథ తీసుకుని మరెవరి చేతనయినా రాయించుకోండి" అని. ఇద్దరూ అక్కడికక్కడే కాళ్ళమీద పడిపోయారు. "మీరే రాయాలి సార్. మీ కోసం శంబల్పూరు వస్తాం." అన్నారు. ఆశ్చర్యపోయాను. మాట నిలుపుకుని- శంబల్పూరు వచ్చారు. 15రోజులు పైగా అక్కడ ఉండి, స్క్రిప్టు రాయించుకుని వెళ్ళారు. అద్భుతమైన సినీమా తీశాడీ జయరాం. సినీమా పేరు-'మరపు రాని తల్లి '. సినీమా బాగా నడిచి శతదినోత్సవం చేసుకుంది.

ఇప్పుడు జయరాం లేడు, ప్రకాశరావు లేడు. కాని వారిద్దరూ తమ విధేయతతో నాకు ఒక కొత్త పాఠం నేర్పారు. ఏ దశలోనూ, ఎవరినీ-ముఖ్యంగా సినీ రంగంలో చిన్నచూపు చూడకు. నిద్రాణంగా ఎవరిలో ఏ శక్తి ఉందో, ఎవరికి ఏ పరిచయాలున్నాయో భగవంతుడికెరుక.

Nobody is inferior until the contrary is proved.

 

77 సంవత్సరాల జీవితంలో 56 సంవత్సరాల డైరీల్లో అనుకోకుండా దూరిన ఈ రెండు వాక్యాలూ నాకు నేర్పిన గుణపాఠమిది.

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Bio

గొల్లపూడి మారుతీ రావు

గొల్లపూడి మారుతీ రావు: గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి.  తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు.  రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.

***

Comments
bottom of page