MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
మధురవాణి ప్రత్యేకం
నా డైరీల్లో కొన్ని పేజీలు...
గొల్లపూడి మారుతీ రావు
1971 సెప్టెంబర్ 11 : రూర్‌కిలా కమ్యూనిటి సెంటర్లో సిబ్బందితో 'సాంస్కృతిక కార్యక్రమం ' రికార్డింగ్.
ఆ రోజుల్లో ఒరిస్సాలో సుదూర ప్రాంతాలకు వెళ్లి ఆయా సంస్థల సాంస్కృతిక కార్యక్రమాలు రికార్డ్ చేసే సంప్రదాయాన్ని ప్రారంభించాను - అప్పుడు శంబల్పూరులో పని చేస్తున్న ఆఫీసరుగా. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారి సాంస్కృతిక వికాసం పదిమందికి చేరాలన్నదే ఉద్దేశం. తప్పనిసరిగా నేనూ నా రేడియో బృందంతో వెళ్ళేవాడిని. ఆ విధంగా రాష్ట్రంలో ముఖ్యమయిన ఉక్కు కర్మాగారం , ఇతర ప్రాంతాలను చూసే అవకాశం కలిసి వచ్చింది.
ఈ రికార్డింగులో గుర్తున్న సన్నివేశం. ఉక్కు కర్మాగారం ప్రజా సంబంధాల ఆఫీసరు 'సతృతి త్రిపాఠి ' ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పి. కె. త్రిపాఠి అనే ఆఫీసర్ గారి భార్య ఒక తమిళ్ మహిళ. పేరు మిసెస్ పతి. వీణ వాయించడానికి ముందుకు వచ్చారు. నాకున్న అవగాహన ప్రకారం 'దర్భారీ కానడ' రాగంలో ఏదయినా వాయించమన్నాను. అసలు ఆ రాగం పేరు నాకు తెలిసినందుకే ఆవిడ ఆశ్చర్యపోయారు. ఏమయినా మా బృందంలో నేను ఆముదం చెట్టు. 10 నిమిషాలు వాయించారు. ఎందుకో ఏదో లోపం నాకు తెలుస్తోంది. ఏమిటిది? రికార్డింగ్ అయ్యే సమయానికి గుర్తు పట్టాను. కాని నా ఆలోచన సవ్యమైనదేనా? అయినా అడిగాను "మీ ఆలాపనలో గాంధారం ఎందుకు వాయించలేదు?" ఇది నాకు సంబంధించి సాహసం. కాని ఆమె ఒక్క క్షణం తెల్లబోయారు. ఆమె బలహీనంగా, నిస్సహాయంగా అన్నారు "వీణ చివరి తీగ సరిగ్గా లేదు. అందుకని..." ఆగిపోయింది. నా సందేహానికి ఒక సమర్ధన దొరకడం ఆనందాన్ని కలిగించింది.
కార్యక్రమం పేరు "ఆగామి”. "డోరేమి" అనే నృత్య బృందం అంశం, 'శూన్య సాధన' అనే నాటిక రికార్డు చేశాం.
***
16 జెమ్షడ్పూర్లో 'అనంతం ' ప్రదర్శన.
అక్టోబర్ 19 : వేమూరి రామయ్య గారి ఉత్తరం. నా ' ఒక చెట్టు - రెండే పువ్వులూ ' నాటకం గురించి.
నవంబర్ 19 : బిలాస్ పూర్ లో నా నాటికలు చదరంగం, పగ ప్రదర్శన
ఇవి కేవలం నమూనా ఉదాహరణలు. నా రచనలు, ఔత్సాహిక నాటకరంగానికి అది స్వర్ణయుగం. దేశమంతటా నా నాటికలు ముమ్మరంగా ప్రదర్శిస్తున్న రోజులు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా ఏ పరిషత్తులోనయినా డజన్ల కొద్ది బహుమతులు అందుకున్న రోజులు. కాగా, నేను ఒరిస్సా ప్రాంతాలలో ఉన్నానని తెలిసిన తెలుగు మిత్రులు - అతి విరివిగా నా రచనలను ప్రదర్శించి - నన్ను ఆహ్వానించేవారు. సత్కారాలు, సభలు బొత్తిగా వ్యసనమయిన రోజులు. 30 ఏళ్ళ రచయితకి అదొక పూనకం.
ఈ నాలుగైదు నెలలలో - ఒక దశలో ఉటంకించిన ప్రదర్శనల వివరాలివి. జెమ్షడ్పూర్లో 'అనంతం '. నిజానికి నా రచనలన్నీ జెమ్షడ్పూర్ ఆంధ్ర సంఘంలో ప్రదర్శితమయ్యాయి. జె.వి. రమణమూర్తి సోదరులు శ్రీరామమూర్తి ఆ ప్రాంతంలో నా "ఆశయాలకు సంకెళ్లు ' గుత్తకు తీసుకున్నారు. తెలుగు దేశంలో మరో మూల ఈ నాటికను ప్రదర్శించిన ఒక నటుడు వెంటనే గుర్తుకొస్తున్నాడు - అది నెల్లూరులో. ఆయన పేరు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం.
వేమూరి గగ్గయ్యగారి పుత్రులు రామయ్యగారు - కుటుంబ నియంత్రణ సమస్య మీద నేను రాసిన 'ఒక చెట్టు - రెండే పువ్వులూ' నాటకాన్ని విరివిగా వేయాలని నన్ను సంప్రదించారు. తరవాత సురభి సంస్థ పూర్ణిమ, ఆవేటి నాగేశ్వరరావు గారూ ఆ పని చేశారు. నాకు ప్రదర్శనకి 5 రూపాయిలు ఇస్తానన్నారు. నాకు కోపం వచ్చేసింది. ప్రదర్శనకి ఐదు రూపాయిలా! వద్దన్నాను. ఈ మాట విని మల్లాది వేంకట కృష్ణ శర్మ గుండె బాదుకున్నాడు. "ఎంత మంచి అవకాశం వదులుకున్నావయ్యా, రెండు రూపాయలిస్తే నా బ్రతుకు వెళ్లమారిపోతుంది. వాళ్ళు వందల ప్రదర్శనలిస్తారు. నీకు జీవితాంతం డబ్బు కురిసేది" అంటూ. అదీ సురభి సంస్థ వైభవం. ఆనాటి నా రచనల ముమ్మరం.
బిలాస్ పూర్ పరిషత్తులో 'చదరంగం' , 'పగ' ప్రదర్శన. ఖర్గపూర్ లో 'వాన వెలసింది' ప్రదర్శన. జె.వి. శ్రీరామూర్తి బృందంతో గడిపాను. టాటా ఉక్కు కర్మాగారం సమితి 'రెండు రెళ్ళు ఆరు' ప్రదర్శన.
మరేదో పరిషత్తులో సాలూరి పి. నారాయణరావు ( ఈ మధ్యనే కన్నుమూసిన నా అనుంగు మిత్రుడు) 'పాపం ' - ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ సహాయనటుడు , ద్వితీయ ఉత్తమ నటుడు, 'ఎల్లి' పాత్రకి ప్రత్యేక ప్రశంస. అంటే - ఆ నాటికలో పాల్గొన్న అందరికీ - రచయిత, దర్శకుడితో సహా బహుమతులు వచ్చాయి.
ఇంటి నిండా చిన్న చిన్న కప్పులు, షీల్డులు. ప్రతి కప్పు ఒకనాటి విజయానికి , ఒక సభలో ప్రశంసకీ గుర్తు. అవి తియ్యని జ్ఞపకాలు. ఇంట్లో అవి గుత్తగా కనిపించవచ్చు. అవి అప్పట్లో నా విజయాల సమాహారం. ఒక దశలో - నాకు చెప్పకుండా మా ఆవిడ ఒక బస్తాలో నా 'పరపతి' ని అమ్మేసింది. - ఇంటి నిండా ఈ కప్పులతో చచ్చిపోతున్నానంటూ. నేను తెల్లబోయాను. అయితే ఇప్పటి షీల్డులు, పొన్నాడైల కథ ఇదే. ఈ మధ్య ఒక కాలమ్ రాశాను - అయ్యా, సభల్లో ఎందుకూ ఉపయోగపడని ఈ షీల్డులు, పొన్నాడైల ఉధృతం తగ్గితే బాగుంటుంది. ఇన్నింటిని ఏం చేసుకోను? చక్కగా చేతి రుమాలు ఇవ్వండి. తుడుచుకునే తువ్వాలు ఇవ్వండి. గడ్డం చేసుకునే బ్లేడ్ ఇవ్వండి. సబ్బులివ్వండి. పెన్ను ఇవ్వండి". ఇలా.
ఈ మధ్య ఒకాయన ఒక సంచీతో మా ఇంటికి వచ్చాడు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. పేరు రంగనాథ రావు. సంచీ నా చేతిలో పెట్టాడు. "ఏమిటన్నాను? "నవ్వి" మీ కాలమ్ చదివాను సార్ . మీతో ఏకీభవిస్తున్నాను. ఇందులో కిలో కందిపప్పు, కిలో బిరియానికి బాస్మతి బియ్యం ఉన్నాయి: అని అన్నాడు. నమ్మండి, పొంగిపోయాను. ఇది ‘క్రియాత్మకమైన పరిణామం'. ఆయన పేరు "కందిపప్పు రంగనాథ రావు" అని నా మొబైల్ లో పెట్టుకున్నాను.
గొల్లపూడి మారుతీ రావు
గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.
***