top of page
srinivyasavani.PNG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

గోదావరోడు... మా గోవిందరాజులు...

Prasad_Oruganti-Godarodu_edited.jpg

ప్రసాద్ ఓరుగంటి

అనగనగా ఒక చిన్న ఊరు. గోదారికి దగ్గర గా ఉండే ప్రాంతం. ఒకప్పుడు పాడి పంటలకు పెట్టింది పేరు. అప్పుడప్పుడు వచ్చే తుఫానులకు పంటలు బాగా పాడవడం, చాలా మంది ప్రాణాలు కూడా పోవడం తో, ఈ తుఫాన్ల మహమ్మారికి , కొంతమంది పక్క టౌన్ కో, హైదరాబాద్ కో మెల్లగా మకాం మార్చేశారు. ఎక్కడికీ వెళ్లలేని వాళ్ళు అక్కడే ఉండి కాల క్షేపం చేస్తున్నారు ఉంటె ఉంటాం లేదా గోదారమ్మ తీసికెళ్ళిపోతుంది అనుకుంటూ...

**

అతని పేరు గోవిందరాజులు. వయసు దగ్గర గా ఇరవైఐదు నుంచి ముప్పై మధ్యన ఉంటాయి. కానీ పరోపకారి. ఆ ఊళ్ళో ఇతనిని రారాజు అని పిలుస్తూ ఉంటారు. ఆ ఊరిని పాలించకపోయినా, పాలు పితకడం నుంచి,గోడ మీద పిడకలు, జనాలకు పచారు సామానులు తెచ్చేవరకు ఈయనదే పూచి. అందరికీ బంధువు లాంటోండు, ఎవరికి పనిచేస్తే, వాళ్ళు ఇతనికి భోజనం పెడుతూ, అప్పుడప్పుడు తిడుతూ ఉండే వారు. చూద్దాం! అసలీ రారాజు అనే గోవిందరాజు.. ఎవరూ... ఏమా కథ?

**

"ఒరే రారాజు! ఇలా రారా... నిన్న ఏం చెప్పాను నీకు. నా దూడలు ని కడగమన్నాను కదరా ! చూడు అవి ఎలా ఉన్నాయో మట్టి కొట్టుకుపోయి, నీ మొఖం లాగ. ఇప్పుడెళ్ళి ఆ చెరువులో కడుక్కురా ! వెళ్ళు" అని గట్టిగా అరిచాడు ఒక పెద్దాయన.

 

"నిన్నే కడిగేసానండి, మళ్ళీ అవి మట్టిలో తిరిగాయండి. ఇదిగో ఇప్పుడే మళ్ళీ తీసుకెళ్లి కడుకొచ్చేత్తనండి" అనేసి ఆ దూడలని చెరువు దగ్గర కి తీసికెళ్ళాడు రారాజు.

"ఒరే రారాజు, సుబ్బి శెట్టి కొట్టికెళ్ళి కొంచం బెల్లం, సెనగపిండి తీసుకురా!, ఇయ్యాల మా ఇంట్లో యేవో తీపి వంటకాలు చెత్తారట మా ఆడోల్లు. నువ్వు కొంచం గమ్మునెల్లి తెచ్చేతావా" అన్నాడు ఒక పెద్ద మనిషి ఈ దూడల్ని తోలుకెళ్తున్న రారాజు ని మధ్యలో ఆపి.

 

"చూత్తున్నారు కదా ఇక్కడ ఈ దూడల్ని తోమి, అవి తీసుకొస్తానండి " అని సమాధానమిచ్చాడు రారాజు. "అలాగే లే" అనేసి కొంచం విసుక్కుంటూ ఆ పెద్దాయన ఇంటి ముఖం పట్టాడు.

"ఏరా రారాజు గా! నీకు బాగా కొమ్ములొచ్చాయిరా, ఈ దూడల్లాగా. నిన్న మా కుర్రాడి తో ఆడనన్నావు ట, ఆడు ఏడుత్తు చెప్పాడు. ఇంకో సారి ఇలాగయ్యిందో ఊరుకునేది లేదురో " అనేసి ఇంకో పెద్దాయన ఈ దూడలు కడుగుతూన్న రారాజుని కడిగేసాడు. "అదేంటండి మీవాడే కొడుతున్నాడు ఆట మధ్యలో, అందుకే అలిగెల్లిపోయాను నిన్న" అని దూడని కడుగుతూ కొంచం నెమ్మదిగానే సమాధానం ఇచ్చాడు రారాజు.

**

పైన ఆకాశం లో నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నాయి. పక్షులు అరుస్తూ ,ఎగురుతూ ఉన్నాయ్.

 

ఏరా అప్పారావా! ఏదైనా గాలివాన అంటావా, నీకేదైనా తెలుసా రేడియో లో గాని ఏమైనా చెప్పాడా" అని గట్టి గా అరుస్తున్నాడు పక్క నున్న నాగేశ్వరరావు తో. ఆ గాలికి సగం మాత్రమే వినబడిన ఆ అప్పారావు మాటకి "మన రారాజు గాడు చెప్పాడు పెద్ద తూఫాన్ అంట, ఆడికేలాగ తెలిసిందో ,అందరింటికెళ్లి చెప్తున్నాడు. అలాగే ఇంకో నలుగురు కుర్రాళ్ళేసుకుని కావాల్సిన సరుకులు ఎయిత్తున్నాడు". నేను వత్తా అంటూ నాగేశ్వరరావు తడుసుకుంటూ పరిగెత్తాడు ఇంటికి.

రారాజు, కొంత మంది కుర్రాళ్లతో కలిసి ఇంటింటికెళ్లి చెపుతున్నాడు వచ్చే గాలి వాన గురుంచి. "ఒరే రారాజు నీకేమొత్తాది రా ఇలా అందరింటికెళ్లి చెప్తే, నువ్వు చేసే ఈ ఊరి చాకిరిలు వాళ్లేమిచ్చిన నీకు తీరదు రా" అంటూ ఒక పెద్దాయన చుట్ట వెలిగించు కుంటూ రారాజు ముఖం మీద పొగ ఊదుతూ అంటున్నాడు. "ఒరే రారాజు అసలు నువ్వు ఎవడివిరా...ఎక్కడనుంచి వచ్చావ్ ...నీ సంగతులు ఎప్పుడు చెప్పలేదు" అని అంటుండగానే "ఇదిగో ఇప్పుడే వత్తానండి, కొంచం ఏటిగట్టు దాకా వెళ్లి" అనేసి తుర్రున పరిగెత్తాడు. "మళ్ళీ పారిపోయాడు" అనుకుంటూ పడక కుర్చీలో లో చుట్ట తాగుతూ కూర్చున్నాడు ఆ పడుతున్న వానని చూస్తూ ఆ పెద్దాయన.

**

రాత్రి 10 గంటలయింది. గాలి జోరందుకుంది. చెట్లు దెయ్యాల్లాగా ఊగుతున్నాయి. చిమ్మ చీకటి. వర్షం కూడా ఊపందుకుంది. ఎవరింట్లో వాళ్ళు బిక్కు బిక్కుమని కూర్చున్నారు. రారాజు కూడా నాగేశ్వరరావు ఇంటికొచ్చి కూర్చున్నాడు. "ఒరే రారాజు ! రారాజు" అంటూ నాగేశ్వరరావు హరికేన్ లాంతర్ తెచ్చి "ఏరా ఈ రాత్రి గడుస్తుందంటావా, మనం ఉంటావా" అని గట్టి గా అరుస్తున్నాడు ఆ గాలికి అది మెల్లగా విన్పించింది రారాజు కి. "ఉంటాంలెండి అయ్యగారు, ఇదిగో మీరెట్టిన అన్నం తినేసిన తరువాత వెళ్ళాలి..బయట చాలా పనుంది" అని అన్నాడు. ఆ రాత్రి నాగేశ్వరరావు ఇంట్లో అన్నం తినేసి "ఇదిగో వత్తానంటూ" బయలుదేరాడు రారాజు . "ఈ వర్షం లో ఎక్కడికిరా ఇక్కడే ఉండు. పొద్ద్దున వెల్దువు గాని" అని వాన లో ముద్దవత్తూ వెళ్తున్న రారాజు ని అడుగుతున్నాడు నాగేశ్వరరావు.

సమయం తెల్లవారు జామున 2 గంటలు. హోరున వాన ఊరు ని ముంచెత్తుతోంది. భయంకరమైన గాలి ఆ ఊరినే విసిరేసిన్నట్టు గా ఆ ఊరు గాలిలో ఊగుతోంది. ఫెళ ఫెళ మని చెట్లు విరుగుతున్న శబ్దం.ఇంటి పై పెంకులు ఎగురుతున్న శబ్దం, ఈ రాత్రి గడుస్తుందా అని ప్రతీ ఇంట్లో ని వ్యక్తీ బిక్కు బిక్కు మని ఉండటం.

అప్పటికే చాలా మంది జనాలను పోగు చేసి, యేటిగట్టు దగ్గెర ఇసక బస్తాలను కప్పిన రారాజు సైన్యం, తాటాకు ఇంట్లో ఉండే జనాలను పక్కా బిల్డింగ్ లో కి పంపేశారు. మిగతా జనాలని కూడా తలుపులు కొట్టి వాళ్ళను కూడా జాగ్రత్త గా పక్కా బిల్డింగ్ లో కి దించుతున్నారు.మొత్తానికి చాలా మంది గ్రామ ప్రజలను సురక్షితం గా రారాజు, కొంతమంది యువకులు అక్కడ దించేసి, తరువాత కార్యక్రమం లో మునిగి పోయారు.

**

తెల్లారింది. ప్రకృతే ప్రకృతిని వికృతం గా శపించినట్టు , పచ్చని చెట్లన్నీ భూమిని తాకి ఉన్నాయి. చాలా గుడిసెలు అప్పటికే పూర్తిగా జల సమాధి అయ్యాయి. అప్పటికే మనుషులని, పశువులను సురక్షిత ప్రదేశాలకి పంపేయడం తో అందరూ ప్రాణాలతో ఉన్నారు.

అప్పటికే గవర్నమెంట్ యంత్రాగం చక్కగా పనిచేస్తోంది. ఆహార, దుస్తు ,సరఫరా జరుగుతోంది. యువత చక్కగా పనిచేస్తోంది. రాత్రి కొద్దీ గా గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది. అంతా సవ్యం గా జరుగుతోంది.

అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆపిల్ పండు తింటూ ఒక పెద్దయన ఇలా అనుకుంటున్నాడు "ఏ ఏడు కా ఏడు చాలా మంది ని ఈ మహమ్మారి పట్టికెళిపోయింది. ఈ ఏడు కూడా నన్ను, నాతొ పాటు చాలా మంది ని పొట్టన పెట్టుకుంటుంది అనుకున్న. మొత్తానికి ఆ దేవుడు మమ్మలిని, మాతో పాటు అమాయక పశువుల్ని కాపాడాడు అని.

**

తుఫాను వెళ్లి 2 రోజులయ్యింది . ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నారు. విద్యుత్ సరఫరా కూడా ప్రారంభమయ్యింది.రోడ్లను శుభ్ర పరుస్తున్నారు. ఇంటింటి కి బియ్యం, పప్పులు, ఉప్పు లు సరఫరా చేస్తున్నారు. ఏటిగట్లని కూడా కొంచం ఎత్తు చేసి వరద నీరు రాకుండా జాగ్రత తీసుకున్నారు.ఊరి ప్రజలు అందరూ ఆనంద అశ్చర్యాలతో ఉన్నారు, ఇప్పటికే ఊరు సగం ఖాళీ అయ్యింది ఈ తుఫానులకి, ఈ సారి తుఫానికి ప్రాణ నష్టం లేదు. అది కాకుండా అందర్నీ సురక్షిత ప్రదేశాలకి తీసికెళ్ళడం తో పాటు అన్ని సరుకులు ఇస్తూ బాగా చూసుకుంటున్నారు.

 

"ఓరే నాగేశవరావు , ఈ తూఫాను అయ్యినప్పట్నుంచి మన రారాజు కనపట్లేదురా! ఆ రోజు వాడి తో పాటు చాలామంది కుర్రాళ్ళు పనిచేసారు. ఈడికే దిక్కు లేదంటే ఎక్కడినించో ఆళ్లని కూడా తీసుకొచ్చి ఊరు ని పాడవకుండా చేసాడు. ఎడి రా రారాజు కనపట్లేదు" అని అప్పారావు అంటున్నాడు . "అవును రా వాడేనంట. అందర్నీ పోగుచేసి, జనాలని, పశువుల్ని ఆ బిల్డింగ్ లో పడేసారు. ఆడు చాలా మంచోడు రా. ఆడిని మనం మర్చిపోకూడదు రా...చూద్దాం వెతుకుదాం" అంటూ...ఒకల్నోకలు అనుకుని వెతకడం మొదలెట్టారు.

**

ట్రింగ్ ట్రింగ్ ఫోన్ మోగుతోంది. అటుపక్క నుంచి "హలో సార్ ! ఆ ఊరి చుట్టుపక్కలంతా అన్ని సరఫరా లు బాగానే జరుగుతున్నాయి. మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం , మన యంత్రంగాం అంతా పని చేస్తోంది. ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. అలాగే ఆ యేటి గట్టు మరమత్తులు కూడా బానే జరుగుతున్నాయి. ఇటుపక్క "ఒకే గుడ్ " అని ఫోన్ పెట్టేసాడు గోవింద రాజులు 

ట్రింగ్..ట్రింగ్ మని మళ్ళి ఫోను. సీఎం PA నుండి. "CM మాట్లాడుతారు ట మీతో". "హలో! గోవింద రాజులూ ! "మీరు పని చేసిన తీరు నచ్చింది. ఆక్కడ యంత్రంగా బాగా పని చేస్తోంది.ప్రాణ నష్టం జరగ కుండా ముందరే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడం లో మీరు బాగా కష్ట పడ్డారు. గుడ్ వర్క్" అని ఫోన్ పెట్టేసాడు అటుపక్క సీఎం.

**

ఊరు జనాలు అంతా వెతుకుతున్నారు రారాజు గురుంచి. వాళ్ళంతా, రారాజు తో పని చేసిన కుర్రాళ్లని అడుగుతున్నారు. అక్కడ సరఫరా చేస్తున్న ఉద్యోగులను అడుగుతున్నారు రారాజు గురుంచి.ఎవరుదగ్గెర ఏమి సమాధానం లేదు. చిన్న పిల్లలు దగ్గెరనుంచి, పెద్దవాళ్ళు దాకా అందర్లోనూ ఒకటే ఆశ.రారాజు కనిపిస్తే బావుంటుందని.కొంతమంది లో తెలియని బాధ "ఈ గోదారమ్మ రారాజు ని పట్టికెళిపోయిందేమో" అని . ఊరులోని గోదారి అందరి జనాల కళ్ళలో తిరుగుతోంది బాధతో. రారాజు వస్తాడని.

**

ఉదయం ఎనిమిది గంటలు.దూరం గా కార్లు వస్తున్నాయి. గ్రామ ప్రజలంతా చూస్తున్నారు. ఎవరో పెద్దవాళ్ళు మనల్ని పలకరించడానికి వస్తున్నారు అని అనుకున్నారు . "ఈసారి ఆ పెద్దమనుషులనే వెతకమని చెపుదాం గట్టి గా మన రారాజు గురుంచి" అని నిశ్చయించుకున్నారు.

వరుసగా మూడు కార్లు వచ్చి ఆగాయి. మధ్యలో కార్ నుంచి బంట్రోతు దిగి కార్ డోర్ తీసాడు. నెమ్మదిగా కాళ్ళు బయటపెట్టి సూట్ లో నున్న వ్యక్తి బయటికి దిగాడు. "ఎలా ఉన్నారు అందరూ" అని అందర్నీ పలకరించాడు.ఈ కార్ లో దిగిన వ్యక్తిని చూసిన వెంటనే అందరి కళ్ళలో ఆనందం, మళ్ళీ భయం. రారాజు ఏంటి ఈ వేషం లో...ఒక్కరికీ మాట లేదు. జనాల అందరిలో లోపల ఒకటే భావం, మన రారాజు వచ్చేశాడు... కానీ నోటి మాట లేదు.

ఒక చిన్న కుర్రాడు, రారాజు ని గట్టి గా పట్టేసుకుందామని అని అనుకుంటే, అక్కడున్న పోలీస్ లు ఆ కుర్రాన్ని అడ్డుకున్నారు. ఆయన కి కొంచం దగ్గరనున్న వ్యకి మొదలెట్టాడు. "ఈయన ఎవరనుకున్నారు. మన జిల్లా కి కలెక్టర్ గా కొత్త బాధ్యతలు తీసుకున్నారు. ఈయన పేరు గోవిందరాజులు . మీ దగ్గర, రారాజు గా ఉంటూ, అందరి కష్టాలు, సుఖాలు తెలుసుకున్న తరువాత కలెక్టర్ బాధ్యత తీసుకుంటాన మన CM కి చెప్పడం తో ఈయన మీ ఊరి తో పాటు ఈ గోదారి చుట్టుపక్కల ప్రదేశాలు తిరుగుతూ, అక్కడ యంత్రాంగం తో ఎప్పటికప్పుడు పనులు చేయిస్తూ, ప్రజలలో ఒకళ్లు గా ఉండి, మీ అందరి కి చాలా పనులు చేసిన మహానుభావుడు" అంటూ కొంచం ఏడుపు స్వరం తో చెప్పాడు.

ఆ మాటకి జనాల కళ్ళలో అంతకుముందర ఉన్న ఆనంద భాష్పాలు తో పాటు, ఈ తెలియని బాధతో ఆ కన్నీళ్లు గోదారి ప్రవాహం లాగా పొంగుతున్నాయి. అందరూ కొంచెం వెనకడుగు వేశారు. ఈ లోపు లో చుట్టుపక్కల నుంచి కూడా ఈ విషయం తెలిసి ఈయన్ని చూడ్డానికి తండోప తండాలు గా జనాలు వస్తున్నారు.

అందరిలో ఒకటే బాధ,"మేము యెంత కష్ట పెట్టాము ఈ మహానుభావుని?" అందరూ అతనికి దండాలు పెడుతున్నారు కళ్ళ వెంట నీరు కారుస్తూ. చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. "మీరు ఇంకా మా రారాజు కాదుట. మీరు చాలా పెద్దోరుట. మీరు మాతో ఆడరట" అని.

**

రారాజు అనే గోవిందరాజు అనే ఈ కలెక్టర్ గారు అందర్నీ ఉద్దేశించి మాట్లాడాడు. నేను మీ అందరితో ఉంటూ, ఇక్కడ పరిస్థితులు తెలుసుకుంటూ, ఈ ఊరిని తుఫాన్ నుంచి ఎలా కాపాడాలో అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. నేను ఈ ఊరి బిడ్డనే....మా వాళ్ళు నా చిన్నపుడు తుఫాన్ లో గల్లంతయ్యారు. నేను బాగా చదివి ఈ ఊరికి, చుట్టుపక్కల గ్రామాలకి ఏదో చేయాలనీ అనుకుని, ఇలాగ మీతో కలిసి ఇలాగ... అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

**

జై జై లు మారు మ్రోగి పోతున్నాయి. కారు బయలు దేరింది. పిల్లలు కార్ వెనుక పరిగెడుతున్నారు బాధతో...

*****

bottom of page