MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
గారడీ
జయంతి ప్రకాశ శర్మ
మస్తాన్ వలీ అంటే ఆ ఊరులో ఎవరికీ తెలియదు, మస్తాను అంటే కూడా ఎవరికీ తెలియదేమో గాని గారడీగాడు అంటే మాత్రం ఆ ఊర్లో అందరికీ తెలుస్తుంది. ఆ ఊరి తురకల కోనేరుని ఆనుకుని ఓ పెద్దరావిచెట్టు, ఆ పక్కనే మట్టితో మూడు వైపులా నాలుగడుగుల ఎత్తున్న గోడలు, నాలుగో వైపు తలుపులుగా వాడుకునే కర్రల తడిక పైన నాలుగు తాటికమ్మలు, వాటిని కప్పుతూ, చిల్లులతో జీర్ణావస్థలో ఉన్న టార్పలిన్ మస్తాను ఇల్లు.
పీర్లపండగ ఓ నాలుగు రోజులుందనగానే ఆ ఇంటి పక్కనే ఓ నాలుగైదు అడుగుల నేలని చదును చేసి కళ్ళాపి జల్లి, కొబ్బరాకులతో పందిరి వేసి మూడు వైపుల పాత చీరలతో ముస్తాబు చేస్తాడు. లోపల మట్టితో చిన్న అరుగు కట్టి, దానిపై పీర్లని పెట్టి అలంకరిస్తాడు. ఎదురుగా ఉన్న అప్పలనరసింహంగారి ఇంట్లోంచి కరెంటు వైరు లాగి, దానికో పెద్ద బల్బు పెట్టి వెలుగు నింపుతాడు. పందిరి ఎదురుగా నిప్పుల గుండం రాజేసి పీరు పట్టుకుని గుండెం తొక్కేవాడు. మస్తాన్ తో పాటు వాడి మిత్రులు అప్పారావు, జాన్, సింహాచలం వాళ్ళ పిల్లలు కలసి పీరు పట్టుకుని గుండం తొక్కేవాళ్ళు. తొమ్మిది రోజులు చాల నిష్ఠగా చేయడమే కాకుండా పండగ ఖర్చుల కోసం రోజూ వచ్చే ఆదాయంలో ఓ రూపాయో, అర్థ రూపాయో దాచేవాడు. ఆ తొమ్మిది రోజులు ఆ చుట్టుపక్కల వాళ్ళందరు ఉదయం, సాయంత్రం అక్కడ చేరేవారు, ప్రార్థనలు చేసి కబుర్లు చెప్పుకునేవారు.
మస్తాను తాతలనాటి కాలం నుంచి రోడ్లపై గారడీ చేసుకుని బ్రతికేవారు. మస్తాన్ కి చదువు అబ్బలేదు, సరి కదా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే వాళ్ళ నాన్న ఇక లాభం లేదని వాడిని మస్తానుని అదే వృత్తి లోకి దింపాడు. తన బతుకులాగే, తన పిల్లలా బతుకులు ఉండకూడదని మస్తాన్ వాళ్ళకి చదువులు చెప్పిస్తూ, మిగతా సమయంలో వాళ్ళని తనతో తిప్పుతూ ఉంటాడు.
ఊర్లో రోజుకో చోట బిచాన పెట్టి తన పిల్లలచేత తాడుపై నడిపించడం, రింగుల్లోంచి దూరి రావటం, పిల్లిమొగ్గలు వేయటం, నేలమీద పడుకుని మొహం మీద గుడ్డ కప్పుకుని ప్రేక్షకుడి జేబులో ఏముందో వంటి విషయాలు చెప్పటం మొదలైన గారడీలు చేయిస్తాడు. మస్తాను భార్య డోలక్కు వాయిస్తూ చివర్లో పళ్ళెం పట్టుకుని అందరి దగ్గరకి పోయి డబ్బులు దండుతుంది. మస్తాను అక్కడ జరిగే కార్యక్రమానికి వ్యాఖ్యానం చెపుతూ తావిజులు, పాముమణిలను అమ్ముతుంటాడు. చివర్లో పాముని ఆడిస్తూ పాము ముంగిసల దెబ్బలాట చూపిస్తాని మొత్తం ఆటని రక్తి కట్టిస్తాడు. కాని పాము ముంగిసల దెబ్బలాట చూపించిన దాఖాలాలు లేవు. జనం మాత్రం మస్తాను మాటలకి మైమరచిపోయి అసలు విషయం పట్టించుకోకుండా చప్పట్లు కొట్టి చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోతారు. ఇది రోజూ జరిగే వ్యవహరం.
ఆ పేటలో ఎక్కడ ప్రదర్శన జరిగిన తప్పకుండా వచ్చే ప్రేక్షకురాలు మాత్రం సుబ్బాలు. సుబ్బాలుకి డెబ్భై ఏళ్ళుపైనే ఉంటాయి. అందులో అరవైఏళ్ళు వైధవ్యమే. నెలకోసారి తలనీలాలు అర్పించుకుని, నిండుగా తలనిండా కొంగు కప్పుకుని ఓ చిన్న రాగిచెంబుతో చాంద్రయాణనికి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది. రోజుకో వీధిలో అడుగుపెట్టి, అందర్ని పలకరించటమే సుబ్బాలు దినచర్య. అలాగనీ ఎవరికి ఎదురుపడేదికాదు. ఎదురుపడకుండా జాగ్రత్త పడేది. ప్రతీ ఇంటి ముందు ఆగి వాళ్ళని పలకరించి యెగక్షేమాలు అడిగి తెలుసుకుని వెళ్ళేది. ఒకవేళ ఇంటి ముందు ఎవరూ కనపడకపోతే ఎకాఎకీ వంటింట్లోకి వెళ్లి పలకరించేది. అయితే లోపలకి వెళ్ళే ముందు తెచ్చుకున్న చెంబు నీళ్ళతో కాళ్ళు కడుక్కుని లోపలకి అడుగుపెట్టేది.
"అదేమిటి బామ్మగారు, ఫర్వాలేదు. లోపలకి రావచ్చు" అని ఎవరైనా అన్నా సరే నవ్వుతూ తోసిపుచ్చేది.
"శుచిగా ఉండాలమ్మా. ఇంట్లో చంటిపిల్లలుంటారు, పెద్దవాళ్ళుంటారు. అలా శుచి శుభ్రం లేకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళకోడదమ్మా. మంచిదికాదు" అంటూ నూతి దగ్గరకి పోయి నీళ్ళు తోడి ఖాళీ చెంబు నింపుకునేది.
'ఏమిటో పిచ్చి సుబ్బాలు' అని చాల మంది వెనకా, ముందూ అనుకున్నా లెక్క చేసేది కాదు. ఎక్కడుండేదో, ఏం తినేదో ఎవరికీ తెలిసేది కాదు. ఆమాట, ఈమాట మాట్లాడిన తర్వాత ఎవరైనా రూపాయో అర్థో ఇస్తే, పుచ్చుకుని కొంగులో ముడివేసేది. వాటిని తిరిగి పేదవాళ్ళు కనబడితే ఇచ్చేసేది.
"నాకేం ఖర్చులుంటాయే... ఓపూట నాలుగు మెతుకుల భోజనం ఎక్కడో అక్కడ గడిచిపోతుంది. రెండోపూట ఉంటే ఏ పండో తిని గ్లాసుడు మంచినీళ్ళు తాగి పడుకుంటాను.పాత బట్టలు మీలాంటివాళ్ళు ఇస్తారు. ఇంకేం కావాలే ఈ బోడి శరీరానికి " అని చెప్పేది. నెలలో ఓ వారం, పది రోజులు మాత్రం మస్తాను ఆ పేటలో గారడీ చేస్తూ సుబ్బాలుకి ఎదురుపడేవాడు. ఓ అరగంట వాడి విన్యాసాలను చూసి నవ్వుకుంటూ "బావుందిరా అబ్బి, ఆ చంటిదాని చేత అన్నేసి విన్యాసాలని చేయించకు… చచ్చి ఊరుకుంటుంది” అని వాళ్ళూ, వీళ్ళు ఇచ్చే అర్థో, పావలానో మస్తానుకి ఇచ్చేది.
"నిజమే అమ్మగారు. కాని నేనీ వయసులో అవన్నీ చేస్తే డబ్బులెవరేస్తారూ. అయినా నేనుంటాగా... చూసుకుంటా..." అంటూ అసలు రహస్యం చెప్పేవాడు.
"అవున్రా మస్తాను నీకు ఉర్దూ రాదుట్రా?" అంటూ అప్పుడప్పుడు అదే ప్రశ్న అడుగుతూండేది.
"ఈ గట్టుమీద పుట్టి పెరిగాను!మా అయ్యకే రాదు. నాకెక్కడొస్తుంది" అని అదే సమాధానం చెప్పేవాడు.
"తప్పురా. అమ్మభాషే ముందు వస్తుంది! ఆ భాషని అశ్రద్ధ చేస్తే అమ్మని చేసినట్టేరా. ముందు నువ్వు నేర్చుకో ! తర్వాత మీ పిల్లలకి నేర్పు. అంతేకాని నాకెక్కడొస్తుందని తప్పించుకోకు" అంటూ వాడికి క్లాసు తీసుకునేది.
ఆ రోజు ఆదివారం. ఉదయం పదిగంటలకల్లా మస్తాను తూర్పు గట్టు చివర్న రిక్షా స్టాండు దగ్గరున్న రావిచెట్టు కింద గారడీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. సెలవు రోజు, రోజూ కంటే ఆదాయం కొంచెం ఎక్కువగానే వస్తూంది. పీర్ల పండగకి ఇంకా రెండునెలలు టైముంది. కాని అంతకంటే ముందే భార్య పిల్లలకి బట్టలు కొనాలి. పాపం!! వాళ్ళు గారడీ చేస్తుంటే బట్టల చిరుగులు బయట ప్రపంచానికి బాగా కనబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో పాత బట్టలు కూడా ఎవరూ ఇవ్వటంలేదు. స్టీలు సామానువాడికిచ్చి స్టీలుగిన్నో, ముంతో తీసుకుంటున్నారు! వాడు కూడా తీసుకోలేదంటే ఆ బట్టలు పూర్తిగా చిరిగి పోయాయన్నమాటే.
అందుచేతే రెండు రోజుల్నుంచి కష్టపడి పిల్లలకి రెండు కొత్త గారడీలు నేర్పాడు. ఇవాళ కొత్త గారడీలని చూపెట్టాలి, జనానికి నచ్చితే తప్పకుండా నాలుగు డబ్బులు పడతాయి. వచ్చే సంత రోజు ఓ చీర, పిల్లలకి బట్టలు కొనవచ్చు… మస్తాను ఆలోచనలు బట్టల చుట్టూ తిరుగుతున్నాయి.
ఎప్పటిలాగానే గారడీ మొదలవడానికి ముందు నుంచే వాడి భార్య డోలక్ వాయించటం ప్రారంభించింది. మస్తాను చేతిలో బుడబుడక్ వాయిస్తూ గట్టిగా చెప్పడం మొదలెట్టాడు.
"చూడండి బాబు. మస్తాను గారడీ. చిన్నపిల్లల గారడీ . కనీవినీ ఎరగని గారడీ . మీకు కనువిందు చేసే గారడీ . మీ కనులముందు చేసే గారడీ . మాయ మర్మం లేని గారడీ . టిక్కట్టు లేని గారడీ . మీరు మెచ్చుకొనే గారడీ . మీ కిష్ణమైన గారడీ . మీకు కష్టం కలగించని గారడీ." అన్న మస్తాను గొంతుక వినబడటంతో జనం ఒక్కొక్కరూ అక్కడ చేరారు.
వరుసగా విన్యాసాలు చేయించాడు. ఇక ఎప్పటిలాగే వాడి కూతుర్ని అక్కడ నేలమీద పడుకోపెట్టి మొత్తంగా గుడ్డ కప్పేడు.
" ఓ చిన్నదాన. నీకు కళ్ళు కనబడుతున్నాయా"
"లేదు"
"ఎందుకు కనబడటం లేదు"
"కనబడకుండా గుడ్డ కప్పేసావు కదా"
"మరైతే నేను అడిగినవాటికి జవాబులు చెప్తావా"
"ఓ భేషుగ్గా చెపుతాను"
"అయితే చెప్పు... ఈ అయ్యగారి తల మీద ఏం వుంది"
"టోపి ఉంది" చప్పట్లు మ్రోగాయి.
"ఈ పిల్లగాడి చేతిలో ఏం వుంది"
"పలకుంది" మళ్ళీ చప్పట్లు మ్రోగాయి. .
" ఈ అయ్యగారి జేబులో ఏంవుంది?”
"పెన్నుంది"
అలా చివర్లో సుబ్బాలు దగ్గరకొచ్చి అడిగాడు.
"ఈ మామ్మగారి చేతిలో ఏం వుంది"
"చెంబుంది"
ఈసారి చప్పట్లుతో పాటు నవ్వులు కూడా మారుమ్రోగాయి.
"సరే ఓ పిల్ల. ఇవన్నీ నీకెలా తెలిసాయి. ఒక్కసారి గట్టిగా అయ్యగార్లకి చెప్పు"
"తావీజు మహిమా"
"చూసారా తావీజు మహిమ. ఒక్కసారి ఇటు చూడండి. ఈ తావీజు మీరు కట్టుకుంటే మీ దగ్గరకు భూతపిశాచాలు రానే రావు. పీడ కలలు రానే రావు. పిల్లలకి కడితే చదువుల్లో ఫస్టుక్లాసులు వస్తాయి. పెద్దలు ధరిస్తే పెద్ద ఉద్యోగాలొస్తాయి. కన్నెపిల్లలు కట్టుకుంటే కళ్యాణం అవుతుంది. దీని ఖరీదు కేవలం పావలా మాత్రమే. చాల కొద్దిగానే ఉన్నాయి" అంటూ మస్తాను తావీజులు ఇస్తూ తాను అలా మాట్లాడుతూనే ఉన్నాడు.
"ఈ మస్తాను దగ్గర మాయ లేదు. మర్మం లేదు. అంతా మీ ముందే చూపిస్తాడు. చేయిస్తాడు. మోసం లేదు. డోకాలేదు. ఇప్పుడూ పాము ముంగిసల యుద్ధం చూపిస్తాడు. మీరెప్పుడూ చూడని ఆ యుద్దంలో ఏది గెలుస్తుందో చూడండి... ఇది మ్యాజిక్ కాదు. మర్మం కాదు. మీ కళ్ళముందు జరిగే విన్యాసమే. ఈ మూగజీవులను, ఈ చిన్నారులను చూసి ఓ బాబు ఓ రూపాయి, ఓ అమ్మ ఓ పావలా, ఓ బామ్మగారు ఓ అర్ధరూపాయి, ఓ కుర్రాడు ఓ రూపాయి దానం చేయండి బాబు. దానం చేసి పాము ముంగిసల యుద్ధం తప్పకుండా చూసి వెళ్ళండి. ఇది మస్తాను మాయమర్మం లేని గారడీ అండి" అంటూ భార్య చేతిలో డోలక్ తీసుకుని వాయించటం మొదలెట్టాడు. వాడి భార్య పళ్ళెం పట్టుకుని జనంలోకి వెళ్ళింది .
సాధారణంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు ఎవ్వరూ డబ్బులు వెయ్యలేదు, సరి కదా, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మస్తాను అలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదు. అయినా సరే డోలక్ వాయిస్తూ ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలో జనంలోంచి ఓ గొంతుక గట్టిగా వినబడింది.
"మస్తానూ! ఈ రోజు పాము ముంగిసల యుద్దం చూపెట్టవలసిందే. చాల కాలం నుంచి చూస్తున్నాం. నువ్వు చూపించుకుండా తప్పించుకుంటున్నావు. చూసిన తర్వాతే డబ్బులు వేస్తాం. ఇవాళ తప్పదు"
"అవును. నిజమే. వాటి ఫైటింగు చూడాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాము. ఈ రోజు చూపెట్టి తీరవలసిందే. లేకపోతే ఇక్కడ్నుంచి మేం కదిలేది లేదు. నిన్ను కదలనిచ్చేది లేదు" అన్నారు.
అంతే! జనం లో కలకలం రేగింది, అంతా మస్తాను చూట్టూ కూర్చుండిపోయారు. మస్తాను మొహం దిగులు నిండిపోయింది.
"చూపెడతాను బాబు! కానీ ఇయ్యాల పాము ఉషారుగా లేదు" అంటూ మస్తాను జనాల్ని ఏదో విధంగా సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాని ఎవ్వరూ వినే పరిస్థితిలో లేరు. మస్తానుకి ఏం చేయాలో పాలుపోవటంలేదు. వళ్ళంతా చెమటలు పట్టిసాయి.
ఇవాళతో తన పనయిపొయినట్టే!!
అంతలో ఒక్కసారి "అరే!! ఊరుకొండి" అంటూ కేక వినబడేసరికి అందరు ఒక్కసారి అటువైపు చూసారు. జనంలోంచి సుబ్బాలు నడుచుకుంటూ వచ్చి మస్తాను పక్కన నిలబడింది.
"నిజమే!! మస్తాను యుద్ధం చూపెట్టకుండా మనల్ని మోసం చేస్తూ ఉండొచ్చు. కాని ఆ నలుగురు మనుషులతో పాటు, ఓ రెండు నోరు లేని జీవరాసులకు కడుపు నింపడానికి మరో గత్యంతరం లేదు! ఆ మాటల గారడీతోనే వాళ్ళు తరతరాలుగా జీవిస్తున్నారు. నిజంగా పాము, ముంగిస పోట్లాట చూడాలంటే, పోయి ఆ పొలాల గట్ల దగ్గరికి వెళితే , అక్కడ మనం చూడొచ్చు. కాని ఇక్కడ వాటి పోట్లాట మనం చూడాలని మొండి పట్టుపడితే, ఏం జరుగుతుందో తెలుసా? మన కళ్ళ ఎదుట అవి పోట్లాడుకుని రెండూ చస్తాయి. అలా అవి ఒకదాన్నొకటి చంపుకుతింటుంటే మనకి ఆనందం వస్తుందా ? గారడీ ఆకలిని తీర్చాలేగాని, ప్రాణం తీయకూడదు." అంటూ ఒక్క క్షణం చుట్టూ చూసింది. .
"అయినా సరే, మీరందరూ ఆ పోట్లాటే కోరుకుంటున్నారంటే, రేపట్నుంచి వీళ్ళంతా ఎలా తింటారో కూడా ఒక్కసారి ఆలోచించండి"
రెండు నిమిషాలు గడిచేసరికి మస్తాను, సుబ్బాలే అక్కడున్నారు. మస్తాను భార్య పట్టుకున్న పళ్ళెం నిండిపోయింది. చెమర్చిన కళ్ళతో మస్తాను సుబ్బాలు కాళ్ళపై పడిపోయాడు.
oooo
మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
జయంతి ప్రకాశ శర్మ
(రచయిత మాటల్లో...)ఈ మధ్య షష్టిపూర్తి అవడంవల్ల స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఉద్యోగం విరమణ చేయమన్నారు. పదిహేను సంవత్సరాల క్రిందట మూసేసిన కలం మళ్ళీ తీసి, ఏభై సంవత్సరాల వెనక ఙ్ఞాపకాలను వెలికితీస్తున్నాను. మంచి అనుభావాలను ఇచ్చిన బాల్యం విజయనగరం జీవితాన్నిచ్చింది, ఇప్పుడు జీవనం కొనసాగిస్తున్నది విశాఖపట్నం. మొదటి పేరాను చదవగానే మిగతాది చదవాలనిపించే అన్ని రాతలను చదువుతాను. రెండువేల సంవత్సరం ముందు రాసిన కథల సంపుటి "ఎడారి పరుగు" ఈ మధ్యనే విడుదలయింది. నా రెండవ ఇన్నింగ్స్ కథల ప్రారంభం ఓ విధంగా "గారడీ" కథతోనే.
***