top of page
Anchor 1

సంపుటి 3  సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

గమనమే గమ్యం: చారిత్రక సందర్భం

goparaju laxmi

గోపరాజు లక్ష్మి

భారత  స్వాతంత్రోద్యమం జరిగి ఎంతో కాలం కాలేదు కానీ, దాని గురించి మనకి తెలిసింది తక్కువేమో అనిపిస్తుంది. అమెరికాలో 240 ఏళ్ల క్రితం జరిగిన సివిల్ వార్ గురించి ఇక్కడ ఇప్పటికీ చెప్పుకున్నంత కానీ, సినిమాల్లోనో, టీవీ డాక్యూమెంటరీల్లోనో చూసినంత కానీ, భారత స్వాతంత్రోద్యమం గురించి ఇండియాలో మాట్లాడతారా, విన్నామా అనిపిస్తుంది. దాని గురించి స్కూళ్లలో  చెప్పేది చాలా తక్కువ. స్వాతంత్రోద్యమానికి dedicated గా ఉన్న మ్యూజియాలు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా ఉన్నట్లు లేవు; విజయవాడలో 2008లో ఒకటి తెరిచారని విన్నాము కానీ, దాని గురించి ఎక్కువ ప్రచారం ఏమీ జరిగినట్లు లేదు. వైజాగ్ లో  ఉద్యమకారులని బ్రిటిష్ వాళ్ళు ఉరి తీసిన చెట్టుని స్వతంత్రం వచ్చిన కొన్నేళ్ళకే కొట్టేశారని ఒక వైజాగ్ మిత్రుడు చెప్పారు. అలాంటి చెట్లని పది కాలాలపాటు కాపాడి, ముందొచ్చే తరాల వాళ్లకి చూపించి స్ఫూర్తినివ్వాలి.  వాళ్ళు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎలా వచ్చాయో గుర్తు చేయాలి. కానీ, అది మన  సామూహిక  consciousness లో అంతగా ఉన్నట్లు కనపడదు.  అందుకో మరెందుకో కానీ, పుంఖానుపుంఖాలుగా వచ్చే మన తెలుగు సినిమాలలో కూడా స్వాతంత్రోద్యమం గురించి వచ్చినవి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఇంక తెలుగు సాహిత్యం వంక చూస్తే, అక్కడా క్షామమే కనపడుతుంది; ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఉద్యమం గురించి.  స్వాతంత్రోద్యమం గురించి తెలుగులో మనకి చారిత్రిక నవలలు, కథలూ  చాలా తక్కువ వచ్చాయి.  నాకు తెలిసి నాలుగైదు నవలలు: మాలపల్లి, రధ చక్రాలు, కొల్లాయి గట్టితేనేమి, ఆమె - అతడు. ఇవన్నీ వచ్చి కొన్ని దశాబ్దాలయింది.

 

ఓల్గా రాసిన "గమనమే గమ్యం" 2016లో వచ్చింది. ఈ నవల పరిధి (కేన్వాస్) చాలా చాల పెద్దది. 1906లో పుట్టిన కొమర్రాజు అచ్చమాంబ జీవితం చుట్టూ అల్లిన కథ ఇది. స్వాతంత్రోద్యమం, దానిలో కాంగ్రెస్ పాత్ర, కమ్యూనిస్టు పార్టీ పాత్ర, వివిధ రాజకీయ నాయకుల, ముఖ్యంగా తెలుగు నాయకుల పాత్రలు, ఆ రోజుల్లో జరిగిన చర్చలు, కళ్ళకి కట్టినట్లు రాశారు ఓల్గా. స్వతంత్రం రాక ముందు, వచ్చాక జరిగిన ఎన్నికల గురించీ, అందులో వివిధ పార్టీల రాజకీయాల గురించీ, పోటీ చేసిన కొందరు వ్యక్తుల గురించీ ఈ నవల ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాము. అలాగే 1924లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత సమావేశం గురించి, గాంధీ, ఇతర జాతీయ నాయకులు దానికి రావడం గురించి, చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలతో వచ్చిన దుర్గాబాయి గురించీ ,చరిత్రలో వారికి ఉన్న ప్రాముఖ్యం గురించీ తెలుసుకుంటాము. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కమ్మూనిస్టు పార్టీ ఏర్పాటు, అది రాష్ట్రమంతటా వ్యాపించడం, రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, స్వతంత్రం వచ్చాక జరిగిన ఎన్నికలు, పార్లమెంటు ఏర్పాటు, దానిపై ప్రజల ఆశలు, అది చేసిన చర్చలు, చేసిన, మరియు చేయలేకపోయిన చట్టాలు---ఇలా ఎంతో రాజకీయ చరిత్ర ఉంది ఇందులో. ఎంతో పరిశోధన చేసి రాసిన పుస్తకం ఇది.

 

ఇవన్నీ ఒక ఎత్తయితే, నవలలో ముఖ్య పాత్ర శారద జీవిత చరిత్ర మరో ఎత్తు. డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ గురించి చాలామంది వినే ఉంటారు. అచ్చమాంబ చరిత్రనే ఓల్గా శారద చరిత్రగా రాశారు. కథ ఆమె బాల్యంతో   మొదలవుతుంది.  శారద బాల్య స్నేహితురాలు అతి చిన్న వయసులోనే కటికి గర్భదానం మూలంగా చచ్చిపోతుంది. కటికి గర్భాదానం జరిగిన ఆ రోజులనించీ---60 ఏళ్ల  కాలంలో--అంటే సుమారుగా స్వాతంత్రానికి ముందు 40 ఏళ్ళు, తరువాత 20 ఏళ్ళు--స్త్రీల జీవితాలలో వచ్చిన మార్పుల గురించి, రాని మార్పుల గురించి, వాటికోసం స్త్రీలు జరిపిన పోరాటాల గురించీ రాశారు. శారద స్నేహితురాలు అలా బాల్యంలోనే చనిపోతే, తల్లిదండ్రుల ప్రోత్సాహమూ, సహకారమూ దండిగా ఉన్న శారద డాక్టర్ అవుతుంది; రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొంటుంది. జైలుకి వెళుతుంది. ఇష్టమైనవాడిని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది.  ఎన్నికలలో పోటీ చేసి లోక్ సభ సభ్యురాలవుతుంది. ఓల్గా రాతలో గొప్పద నమని నాకనిపించేదేమిటంటే, ఈ మార్పులన్నీ ఎలాంటి చారిత్రిక సందర్భంలో జరిగాయో చూపించడం; అలాగే, ఆ మార్పులు అందరు ఆడవాళ్ళ జీవితాలకి వర్తించలేదని చూపించడం. కుల వివక్ష, వేశ్యా కుటుంబాలలో ఆ రోజులలో వచ్చిన మార్పులు, స్త్రీల ఉన్నత విద్య --ఇలా ఎన్నో విషయాలని ప్రధాన కథతో ముడిపెట్టి, అతి లాఘవంగా అల్లుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న దుర్గాబాయి దేశముఖ్ తో, అన్నపూర్ణతో శారద జరిపే రాజకీయ చర్చలు ఎంతో ఆసక్తికరంగా, వాళ్ళ స్నేహాలు ఎంతో అపురూపంగా అనిపిస్తాయి.

 

కొమర్రాజు అచ్చమాంబ (1906-1964) ప్రముఖ వైద్యురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు. స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి విశేష కృషి చేసింది. స్త్రీల ఆరోగ్య సమస్య రాజకీయ సమస్య అని గుర్తించి దాని గురించి రాజకీయ నాయకులతో వాదించింది. ఆవిడ చరిత్రకారుడు కొమర్రాజు లక్ష్మణరావు కూతురు. విద్యార్థి దశనుండే జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నది. 1924 లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశాలలో బాలికా సేవాదళానికి నాయకురాలిగా పనిచేసింది. 1928 లో మద్రాసు నగరంలో సైమన్ కమీషన్‌కు నిరసనగా నల్ల జెండాల ప్రదర్శనకు నాయకత్వం వహించింది. 1943 నుండి 1948 వరకు భారతీయ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా ఉన్న అచ్చమాంబ, 1948లో సైద్ధాంతిక విభేదాల వలన కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసింది.  1957 లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుండి రెండవ లోకసభకు ఎన్నికయ్యింది.

 

పునరుత్పత్తి గురించి, అచ్చమాంబ తెలుగులో మొట్టమొదటి పుస్తకం "ప్రసూతి - శిశు పోషణ" అన్న పేరుతో రాశారు. మా అమ్మ తరం ఆడ వాళ్ళు  అనేకమంది దగ్గర ఆ పుస్తకం ఉండేది. ఆ పుస్తకము ఎంతోమంది స్త్రీ పురుషులకి పునరుత్పత్తి గురించిన జ్ఞానమిచ్చింది.

 

అచ్చమాంబ చరిత్ర చదవడం భారత రాజకీయ చరిత్ర చదవడం. భారత స్త్రీల, తెలుగు స్త్రీల పురోగతి పోరాటాల గురించి చదవడం. స్త్రీ పురుష సంబంధాలలో గత వంద సంవత్సరాలలో వచ్చిన మార్పుల గురించి చదవడం. గమనమే గమ్యం నవలలో ఓల్గా వీటన్నిటినీ , దేని ప్రాముఖ్యమూ తగ్గకుండా ఒక చోట చేర్చి , అవన్నీ ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో కూడా చూపించారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఈ పుస్తకం ఒక మైలురాయి. వచ్చే సంవత్సరాలలో, సాహిత్య విద్యార్థులే కాక, చరిత్ర విద్యార్థులు కూడా దీనిపై PhD లు చేస్తారని నా నమ్మకం.

OOO

bottom of page