MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
ఈప్సితం
మస్తో వంశీ
ఆ పై నైరుతి మూలగదిలో కూర్చుని ఉన్న లంకేశ్, ఆమెను విప్పారిన నేత్రాలతో చూస్తూ ఉండిపోయాడు స్తబ్దంగా... కదలకుండా.
ఆమె కిర్రున బీరువా తెరిచింది. వజ్రాల హారమున్న పెట్టెను సుతారంగా బయటికి తీసింది. ఝిగేల్ మంటున్న అందులోని నెక్లెస్ ను కుడి చేతిలో పట్టుకొని, తల పంకించి అతడి వైపు మెరుస్తున్న కళ్లతో చూసింది. అందమైన చిరునవ్వు ఒకటి ప్రత్యక్షం అయింది లేత గులాబీ రంగులో మెరుస్తున్న ఆమె పెదాల పైన.
మిరుమిట్లు గొలుపుతున్న వజ్రాల హారం కన్నా అందంగా ఉన్న షాకియా మోనీ అనే ఆమెను కళ్ళు అప్పగించి చూస్తున్న లంకేశ్ మనసు, అతను కూర్చున్న కుర్చీ లోంచి అమాంతం గతంలోకి పయనం అయిపోయింది.
రావల్పూర్ లో లంకేశ్ ఓ పేద తండ్రికి జన్మించాడు. నానా అగచాట్లూ పడి డిగ్రీ వరకూ కొడుకును చదివించిన లంకేశ్ తండ్రి, ఇక కొడుకు ఏ కొలువో చేసి తనకు ఆసరాగా నిలుస్తాడని ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్న సమయంలోనే, అనుకోకుండా ఆయన ఊపిరి ఆగిపోయింది.
లంకేశ్ తల్లి, ఆమె ఒక్కగానొక్క సంతానమైన లంకేశ్, బాగా ఒంటరివారైన మాట వాస్తవమే అయినా, వారి జీవితాల మీద అదృష్టం ఢాం అని అఫ్ఘాన్లో ఎయిర్ స్ట్రైక్ లా వచ్చి పడింది. భర్త ఇన్స్యూరెన్స్ డబ్బుతో లంకేశ్ తండ్రి అంతవరకూ నడిపిన దుస్తుల షాపును పెద్దది చేసేసింది లంకేశ్ తల్లి.
అయితే, ఆ కాలంలో ఎవరూ ఊహించనట్టుగా వారి షాపు పక్కనే ఓ బహుళ తెరల సినిమా ప్రదర్శనా సౌధానికి అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం. దాని పుణ్యమా అని జిక్కీ దుస్తుల కొట్టు అమ్మకాలు తారాజువ్వలా ఎగసాయి. మూడే మూడు నెలల్లో అది ఓ అధునాతన సర్వదుస్తుల సామ్రాజ్యంగా, మరో మూడు మడిగెలలో విస్తరించేసింది. ఎప్పటికైనా ధనవంతురాలిని కావాలన్న లంకేశ్ తల్లి ఈప్సితం నెరవేరిపోయింది.
లంకేశ్ మాత్రం ఒక్కసారిగా స్వేచ్చా వాయువులు పీల్చేసాడు. ఉద్యోగం చేయనక్కర్లేదు కనుక, దేశాటనలు మొదలు పెట్టేసాడు. మెల్లిగా అతనిలో నిద్రాణమై ఉన్న కోరికలు అతనికే తెలియకుండా ఒళ్ళు విరుచుకొని కళ్ళు తెరవడం మొదలు పెట్టిన సమయం అది...
ఓ రోజు ఆరోమా పట్టణం నుండి రావల్పూర్ వెళ్ళే విమానంలో కూర్చుని ఉన్న లంకేశ్ కళ్ళు, ఓ వరస అవతల కూర్చున్న అందమైన అమ్మాయి పై పడ్డాయి. భుజాలు కనపడేలా కుట్టబడిన లేత పసుపు పచ్చ టాప్ లో, పలుచటి తెల్లటి స్కర్ట్ లో మంచి ముత్యాల్లా కాకపోయినా సుమారుగా అలాగే ఉన్న పలువరుస కనపడేలా నవ్వుతోంది ఆ పడుచు. చేతిలో ఉన్న పత్రికలో దేనినో చూసి బాగా నవ్వు వచ్చినట్లుంది ఆమెకు. అలా నవ్వుతున్న ఆమె అనుకోకుండా ఆ క్షణంలో లంకేశ్ ను చూసింది. ఆమె కళ్ళలోంచి ఆకళ్ళు రేపే విద్యుత్తు ఏదో ఛెళ్ళున కొట్టినట్లైంది లంకేశ్ ను.
ఆ రోజే కాక మరో తొమ్మిది రోజులు కూడా, లంకేశ్ ఆమెను మరువలేక పోయాడు. రకరకాల ఊహలు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె తనతో గడపడానికి వస్తే? ఓ పది రోజులు ఆమె తనకు సొంతమైపోతే? విరక్తి పుట్టేవరకూ ఆపలేదు లంకేశ్ తన ఊహలను.
పదో రోజు, గతంలో ఎప్పుడో లంకేశ్ రాసిన ఓ గవర్నమెంటు పోటీ పరీక్ష తాలూకు పిలుపు రావడంతో, రాజధాని పట్టణం రజోనేహాల్ కు ప్రయాణంకట్టాడు లంకేశ్. రజోనేహాల్ లో సరదాగా సిటీ బస్సు ఎక్కిన అతడికి ఎదురైంది మరో మలుపు తిప్పే సంఘటన. బస్సులోంచి బయటికి చూస్తుంటే, రోడ్ మీద ఏదో ప్రమాదంలో గాయపడి, తన రుధిరపు మడుగులోనే తడిసి పడి ఉన్న ఓ మహిళ పై పడింది అతడి దృష్టి. "ఎవరూ పట్టించుకోవట్లేదేంటి? ఛ! నేనైనా సహాయ పడలేక పోతున్నానే!" అనుకుని అవతల ఉద్యోగావకాశాన్ని వదులుకోలేని అసహాయతకి నిందించుకుంటూనే కదిలాడు లంకేశ్.
రజోనేహాల్లో ఇంటర్వ్యూ పూర్తి అయింది. చిత్రంగా ఉద్యోగం లంకేశ్ సొంతమైంది. ఇంటర్వ్యూ భవనం లోంచి బయటికి వచ్చి, దగ్గరలో ఉన్న ఓ హోటల్ లో భోజనం ఆరగిస్తుండగా, పక్క టేబుల్ పై ఎవరివో మాటలు చెవిన పడ్డాయి. అక్కడికి దగ్గరలోనే ఉన్న మన్మధామన్ గ్రామం లో ఓ మహానుభావుడు ఉన్నాడని, అతడిని కలుసుకుంటే చాలా మంచిదని మాట్లాడుకుంటున్నారు పక్క టేబుల్ వాళ్ళు.
లంకేశ్ మన్మధామన్ గ్రామంలో శ్రీ సిద్ధబాబా ఎదురుగా వచ్చి నిలబడిన మరుక్షణం, బాబా అతడిని క్షణకాలం చూసి, "మనసారా మనిషి కోరుకున్నది ఏదైనా జరిగి తీరవలిసిందే. అది మనిషికి ఇవ్వబడిన వరం. కోరుకున్న సమయానికి, కోరిక తీరే సమయానికి మధ్య దూరం ఉండవచ్చు తప్ప, తీరక మాత్రం మానదు అది. సమయం గడచి మరపు రావడం వలన, జరుగుతోంది తాను ఒకప్పుడు కోరుకున్నదే అనే మాట మనిషికి చాలా సార్లు గుర్తుండదు. అది వేరే విషయం. సరే. ఇక పో." స్థిరంగా అన్నారు శ్రీ సిద్ధబాబా.
నాలుగు ఏళ్ళు ఉద్యోగం చేసి, ఇక చాలని తల్లికి సాయంగా జిక్కీ క్లొథింగ్ మార్ట్ వ్యాపారాన్ని నడపడం మొదలు పెట్టాడు లంకేశ్. ఇంకా బోలెడు ధనం ఆర్జించాడు. ఆ తరవాత మరో రెండేళ్ళలో అతడికి పెళ్ళి చేసేసింది తల్లి.
కొంత కాలానికి, లంకేశ్ భార్య తారిణి గర్భవతై పుట్టింటికి వెళ్ళింది. అదే సమయంలో అతడి తల్లి పుణ్యక్షేత్రాల దర్శనార్ధం బయల్దేరిపోయింది. మరుసటి రాత్రి టక టక టక తలుపు చప్పుడైంది. అప్పుడు సమయం పదిన్నరైంది. బయట హోరు గాలి, దానికి అంతేసి చినుకుల దండు తోడైంది .
తలుపు తీసిన లంకేశ్, ఎదురుగా ఉన్న మనిషిని చూసి నిస్చేష్టుడయ్యాడు. అదే లేత పసుపు పచ్చ టాప్, తెల్లటి స్కర్ట్ లో అందంగా, బిడియంగా నవ్వుతున్న ఏరోప్లేన్ తాలూకు అమ్మాయి నుంచుని ఉంది ఎదురుగా. ఆమె ఒంపుసొంపుల శరీరానికి అతుక్కుపోయి ఉన్నాయి తడిసి ముద్దయి ఉన్న ఆమె దుస్తులు.
"వర్షం పడుతోంది, ఆగే దాకా నేను మీ ఇంట్లో కూర్చోవచ్చా, ప్లీజ్..." అంది ఆమె.
వేడి వేడి కాఫీ తాగుతూ, "నేను ఈ ఊరికి కొత్త, ఒంటరిగా హోటల్లో దిగడం ఇష్టం లేదు. ఓ పది రోజుల పాటూ ఇక్కడ బిజినెస్ పనులు ఉన్నాయి..." అంటూ అతడిని మొహమాటంగా చూసింది ఆమె.
లంకేశ్కి అది ఓ కలలా తోస్తోంది. ఆమె ఓ మత్తులా ఉంది. ఒళ్ళు తెలియడంలేదు. చుట్టూ యేవో పొగలు అలుముకుంటున్న ఫీలింగ్ ఉంది.
కాఫీ ఒలికింది. లేత పసుపు పచ్చ టాప్ పై మరక పడింది.
ఆమె "బాత్రూం ఎక్కడ?”, అనడిగింది.
లోపల తలుపు గడియ వేసుకోవడం మరిచింది.
లంకేశ్ తలుపు వద్దకు వచ్చి తొంగి చూస్తే, నవ్వి ఊరుకుంది.
షాప్ కి కూడా వెళ్ళకుండా లంకేశ్ జీవితంలో తదుపరి పది రోజుల సమయం, ఆమెతో ఓ రంగేళీ కలలా గిర్రున తిరిగేసింది .
పదవ రోజు రాత్రి అనగా ప్రస్తుతం... సుమయం ఎనిమిదిన్నర.
ఆ పై నైరుతి మూలగదిలో కూర్చుని ఉన్న లంకేశ్, ఆమెను విప్పారిన నేత్రాలతో చూస్తూ ఉండిపోయాడు, స్తబ్దంగా... కదలకుండా. దానికి కారణం, పది నిముషాల క్రితమే అతడు భోజనం చేస్తుండగా అతడి తల వెనుక పడిన బలమైన దెబ్బ! కొన్ని నిముషాల పాటూ స్పృహ తప్పినట్టుంది అతడికి. కళ్ళు తెరిచేసరికి బెడ్ రూమ్ లో ఉన్నాడు, కుర్చీలో.
ఆమె కిర్రున బీరువా తెరిచింది. వజ్రాల హారమున్న పెట్టెను సుతారంగా బయటికి తీసింది. ఝిగేల్ మంటున్న అందులోని నెక్లెస్ను కుడి చేతిలో పట్టుకొని, తల పంకించి అతడి వైపు మెరుస్తున్న కళ్లతో చూసింది. అందమైన చిరునవ్వు ఒకటి ప్రత్యక్షం అయింది లేత గులాబీ రంగులో మెరుస్తున్న ఆమె పెదాల పైన.
షాకియామోనీని కదలకుండా, కళ్ళప్పగించి చూస్తూండిపోయాడు లంకేశ్. కదలకుండా. మరి అతడు కుర్చీకి బంధింపబడి ఉన్నాడు.
అతడికి విషయం తెలిసొచ్చింది. ఆమె అతడిని దోచుకెళ్ళడానికే ప్లాన్ తో వచ్చింది. అందుకు తనను దోచుకోనిచ్చింది. అప్పటికే తను ఆమెకు రెండు మూడు బ్యాంకు పిన్ నంబర్లు తమకంలో చెప్పేయడం గుర్తొచ్చింది.
అతను కన్న పగటికలే అతడికి పీడకలైపోయింది. తల వెనుక నుంచి వెలికి వచ్చిన రుధిరధార ఇప్పుడిప్పుడే ఎండుతోంది. ఆమె ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ సంచీల్లో నింపుకోవడం పూర్తి అయినట్టుంది, అతడి వద్దకు వచ్చి ఎదురుగా నిలబడింది. చిద్విలాసంగా నవ్వింది. రెండు క్షణాలు అలాగే నిలబడి ఒక్కసారిగా పగలబడి నవ్వింది… షాకియామోనీ…. అది ఆమె అసలు పేరో కాదో కూడా తెలీదు.
ఆమె వెళ్ళిపోతున్న అడుగుల సవ్వడి... అంతలోనే కరెంటు పోయింది. లంకేశ్ ఎంత సేపు అలా కూర్చుండిపోయాడో తెలీదు.
కరెంట్ వచ్చింది. లంకేశ్ కు ఇప్పుడు ఇంట్లో ఎలాంటి సవ్వడి వినపడట్లేదు. ధైర్యాన్నీ, బలాన్నీ కూడగట్టుకొని కుర్చీ సమేతంగా లేచి నిలబడ్డాడు. లక్కీగా అది కొత్తతరం ఆసన్నాటు కుర్చీ. ఒక్క ఉదుటిలో కుర్చీని గోడకేసి కొట్టి, దాన్ని విరకొట్టి, బంధ విముక్తుడు అయ్యాడు.
హాల్లో... షాకియామోనీ నేల మీద బోర్లా పడి ఉంది. రక్తం మడుగులో. చేతిలోని సంచీలు నేల మీద పడి, లోపలి వస్తువులు బయటకు దొర్లి చిందర వందరగా ఉన్నాయి హాలంతా. చెప్పా పెట్టకుండా కరెంటు పోవడంతో, హడావిడిలో ఉన్న ఆమె దేనికో తట్టుకుని కింద పడిపోయినట్టుంది. ఆమె తలకాయకు టీవీ స్టాండు మొన గట్టిగా పొడుచుకుంది. స్టాండు పై ఆమె రక్తం మరక స్పష్టంగా తెలుస్తోంది.
ఆ వస్తువుల్లోంచి లంకేశ్ తన చరవాణిని చేతిలోకి తీసుకొని అంబులెన్సు కు ఫోన్ కలిపాడు. ఫోన్ రింగ్ టోన్ తో పాటూ అతడి చెవుల్లో... శ్రీ సిద్ధబాబా ఆ రోజు అతడు వెళ్ళిపోతూ తలుపు వద్ద ఉన్నప్పుడు అన్న మాటలు మారు మ్రోగాయి.
"మనిషి మనసారా కోరుకున్నది ఏదైనా జరగవలసిందే.
అందుకే, ఏం కోరుకుంటావో అది జాగర్తగా కోరుకోవాలి!"
*****